Skip to main content

మార్చి 2021 రాష్ట్రీయం

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం ప్రారంభం
Current Affairs
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్చి 25న లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... ఈ విమానాశ్రయానికి ప్రథమ స్వాతంత్య్ర సమరయోధుడు ‘‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’’ పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. తపాలా శాఖ రూపొందించిన విమానాశ్రయ పోస్టల్‌ స్టాంప్‌ను సీఎం విడుదల చేశారు.
విశేషాలు...
  • రూ.110 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఈ విమానాశ్రయాన్ని నిర్మించింది.
  • 2021, ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు మొదలవుతాయి.
  • ఒకేసారి నాలుగు విమానాలు పార్కింగ్‌ చేసే సౌకర్యం ఇక్కడ ఉంది.
  • కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలోని ఓర్వకల్లు వద్ద 1,008 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగింది.
  • కర్నూలు ఎయిర్‌పోర్టు జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించనుంది.
  • జాతీయ రహదారి 40 (కర్నూలు–నంద్యాల–రాణిపేట్‌(తమిళనాడు))కి సమీపంలో ఈ ఎయిర్‌పోర్ట్‌ ఉంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం ప్రారంభం
ఎప్పుడు : మార్చి 25
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఓర్వకల్లు, కర్నూలు జిల్లా

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?
అనకాపల్లి బెల్లం పౌడర్‌కు ఇండియన్‌ పేటెంట్‌ లభించింది. ఈ విషయాన్ని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎ.విష్ణువర్దన్‌రెడ్డి ప్రకటించారు. ఉత్తర కోస్తా మండలి వ్యవసాయ పరిశోధన స్థానం (అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌)లో 62వ కిసాన్‌మేళా మార్చి 25న ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విష్ణువర్దన్‌ మాట్లాడుతూ... అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పంటకోత అనంతర సాంకేతిక పరిజ్ఞాన విభాగ శాస్త్రవేత్తలు రూపొందించిన బెల్లం పౌడర్‌ తయారీకి జాతీయస్థాయిలో పేటెంట్‌ లభించిందన్నారు. గుంటూరులో ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది.

గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం?
రాష్ట్రంలోని గ్రామాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచాలని, వాటిని ‘స్వచ్ఛ’ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో మాదిరి గ్రామాల్లోనూ ప్రతిరోజూ ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం, ప్రతిరోజూ రోడ్లను ఊడ్చే కార్యక్రమాలను చేపట్టనుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8వ తేదీ నుంచి ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో 100 రోజులపాటు ఈ బృహత్తర కార్యక్రమం కొనసాగనుంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : జూలై 8వ తేదీ నుంచి ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమానికి శ్రీకారం
ఎప్పుడు : మార్చి 26
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ : రాష్ట్ర వ్యాప్తంగా
ఎందుకు : రాష్ట్రంలోని గ్రామాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచాలని, వాటిని ‘స్వచ్ఛ’ గ్రామాలుగా తీర్చిదిద్దాలని

నదుల పునరుజ్జీవం కార్యక్రమానికి ఎంపికైన నదులు?
ఎండిన నదులకు పునరుజ్జీవం తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ‘‘నదుల పునరుజ్జీవం’’ పేరుతో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఈ కార్యక్రమం కింద శ్రీకాకుళం జిల్లాలోని చంపావతి, ప్రకాశంలో గుండ్లకమ్మ, అనంతపురంలో పెన్నా, కర్నూలులో హంద్రీ, వైఎస్సార్‌ జిల్లాలో పాపాగ్ని, చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదులను ఎంపిక చేశారు. తమిళనాడులోని నాగా నది విషయంలో వచ్చిన సత్ఫలితాల స్ఫూర్తితో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి ఉపాధి హామీ పథకం నిధులను ఉపయోగించనున్నారు. కార్యక్రమంలో భాగంగా ఒక్కో నది పునరుజ్జీవానికి మూడేళ్లలో రూ.50–70 కోట్లు ఖర్చుపెట్టనున్నారు.
నాగా నది అనుభవంతో..
తమిళనాడులో ఎండిపోయిన నాగా నది పునరుజ్జీవనానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌ (ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌)కు చెందిన ‘వ్యక్తి వికాస కేంద్ర ఇండియా’ సంస్థ చేసిన కృషి సత్ఫలితాలను ఇచ్చింది. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మరిన్ని మెరుగైన ఫలితాల సాధనకు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ పథకానికి రూపకల్పన చేశారు. కర్ణాటకలో కూడా మరో నదికి పనిచేసిన అనుభవం ఈ సంస్థకు ఉండడంతో ఏపీ ప్రభుత్వం ఈ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది. దీంతో నదుల పునరుజ్జీవం కార్యక్రమానికి వ్యక్తి వికాస కేంద్ర సహకారం అందించనుంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : నదుల పునరుజ్జీవం కార్యక్రమానికి చంపావతి, గుండ్లకమ్మ, పెన్నా, హంద్రీ, పాపాగ్ని, స్వర్ణముఖి నదుల ఎంపిక
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : ఎండిన నదులకు పునరుజ్జీవం తీసుకొచ్చేందుకు

ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు గవర్నర్‌ విశ్వభూషణ్‌ ఆమోదం
రానున్న ఆర్థిక సంవత్సరం 2021 – 22లో తొలి మూడు నెలల (ఏప్రిల్‌ – జూన్‌) కాలానికి వివిధ శాఖలు, రంగాల వారీగా వ్యయానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం... ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రూ.70,983.11 కోట్లను కేటాయించింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను మార్చిలో ప్రభుత్వం నిర్వహించలేదు. అలాగే కోవిడ్‌ – 19 వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో 2021 – 22 తొలి మూడు నెలల ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఆర్డినెన్స్‌ జారీకి కేబినెట్‌ ఆమోదం తెలిపి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు పంపగా మార్చి 29న ఆయన ఆమోదముద్ర వేశారు.
ఓర్వకల్లులో ఇండస్ట్రియల్‌ పార్క్‌...
కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద 10 వేల ఎకరాలతో భారీ ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. ఇప్పటికే దాదాపు రూ.800 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

సాగరిక మ్యాగజైన్‌ను ఆవిష్కరించిన గవర్నర్‌ విశ్వభూషణ్‌
విశాఖపట్నంలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం రూపొందించిన మొదటి మ్యాగజైన్‌ ‘సాగరిక’ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆవిష్కరించారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో మార్చి 30న ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
క్రెడాయ్‌ కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికైన వ్యక్తి?
రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్ల అత్యున్నత మండలి కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) నూతన జాతీయ ప్రెసిడెంట్‌గా హర్షవర్ధన్‌ పటోడియా ఎంపికయ్యారు. కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న యూనిమార్క్‌ గ్రూపు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పటోడియా పనిచేస్తున్నారు. 2021 ఏప్రిల్‌ 1 నుంచి రెండేళ్ల కాలానికి క్రెడాయ్‌ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని సంస్థ మార్చి 30న ప్రకటించింది. ప్రస్తుతం క్రెడాయ్‌ అధ్యక్షుడిగా ఉన్న సతీష్‌ మగర్‌ పదవీ కాలం మార్చి 31తో ముగియనుంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : సాగరిక మ్యాగజైన్‌ ఆవిష్కరణ
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌
ఎక్కడ : రాజ్‌భవన్, విజయవాడ
ఎందుకు : విశాఖపట్నంలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం రూపొందించిన మొదటి మ్యాగజైన్‌ ఇది.

కృష్ణా నది సముద్రంలో కలిసే ప్రదేశం ఏది?
విజయవాడ కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో రూ.122.90 కోట్ల వ్యయంతో నిర్మించే వరద రక్షణ గోడ (రిటైనింగ్‌ వాల్‌) పనులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. మార్చి 31న కనకదుర్గమ్మ వారధి వద్ద ఈ పనులకు సంబంధించిన ఫైలాన్‌ను ఆవిష్కరించారు. 1.5 కిలోమీటర్ల పొడవున కనకదుర్గ వారధి నుంచి కోటినగర్‌ వరకు వరద రక్షణ గోడ నిర్మిస్తున్నారు.
హంసలదీవి వద్ద...
సహ్యాద్రి కొండల్లోని మహాబలేశ్వర్‌’(మహారాష్ట్ర) వద్ద కృష్ణానది ఆవిర్భవించింది. ఇది కర్ణాటక ద్వారా ప్రవహిస్తూ మహబూబ్‌నగర్‌ జిల్లాలో మక్తల్‌ వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఘటప్రభ, మల్లప్రభ, భీమా, తుంగభద్ర, దిండి, మూసీ నదులు కృష్ణా నదికి ముఖ్య ఉపనదులు. తుంగభద్ర కర్ణాటకలోని వరాహ పర్వతాల్లో ఆవిర్భవించి.. కర్నూలులోని సంగమేశ్వర్‌ వద్ద కృష్ణలో కలుస్తోంది. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డకు దిగువన కృష్ణానది పాయలుగా చీలి హంసలదీవి వద్ద బంగాళాఖాతాన్ని చేరుతుంది. కృష్ణానది మొత్తం పొడవు 1400 కి.మీ..
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : వరద రక్షణ గోడ (రిటైనింగ్‌ వాల్‌) పనులకు శంకుస్థాపన
ఎప్పుడు : మార్చి 31
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : విజయవాడ కృష్ణా నది పరీవాహక ప్రాంతం
ఎందుకు : వరదల నుంచి కృష్ణా నది పరీవాహక ప్రాంతాన్ని రక్షించేందుకు

ఓడీఓపీ పథకంలో భాగంగా కర్నూలు జిల్లా నుంచి ఎంపికైన ఉత్పత్తి?
Current Affairs
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్‌ కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆయా జిల్లాల్లో ప్రాముఖ్యత ఉన్న ఉత్పత్తులను ఎంపిక చేశారు. జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 13 జిల్లాలకు 13 ఉత్పత్తులను ఎంపిక చేసి.. వాటిని మేడిన్‌ ఆంధ్రా పేరుతో బ్రాండింగ్‌ కల్పించనున్నారు.
ఓడీఓపీ సెల్‌ ఏర్పాటు...
ప్రధాని నరేంద్ర మోదీ వోకల్‌ ఫర్‌ లోకల్‌లో భాగంగా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే విధంగా వన్‌ డిస్ట్రిక్ట్‌ – వన్‌ ప్రొడక్ట్‌ (ఓడీఓపీ) పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో 13 జిల్లాల్లో సర్వే నిర్వహించి, విశేష ప్రాచుర్యం ఉన్న ఉత్పత్తులను ఎంపిక చేశారు. నాణ్యమైన స్థానిక ఉత్పత్తుల తయారీ, విక్రయం వంటి అంశాల్లో ఉత్పత్తిదారులకు సహకరించేలా ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఓడీఓపీ సెల్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు.
13 జిల్లాల నుంచి ఎంపికైన ఉత్పత్తులు

జిల్లా పేరు

ఎంపిక చేసిన ఉత్పత్తి

శ్రీకాకుళం

పొందూరు కాటన్‌

విజయనగరం

మామిడి తాండ్ర

విశాఖపట్నం

ఏటికొప్పాక బొమ్మలు

తూర్పూ గోదావరి

కొబ్బరి నార ఉత్పత్తులు

పశ్చిమ గోదావరి

నర్సాపురం లేస్‌ అల్లికలు

కృష్ణా

కొండపల్లి బొమ్మలు

గుంటూరు

ఎండు మిర్చి

ప్రకాశం

గ్రానైట్‌ పాలిషింగ్‌

నెల్లూరు

ఉదయగిరి చెక్క నగిషీలు

చిత్తూరు

పెన్‌ కలంకారీ

వైఎస్సార్‌

బేరియం, బెరైటీస్‌

కర్నూలు

రాతి శిల్పాలు

అనంతపురం

రెడిమేడ్‌ గార్మెంట్స్‌


ఏపీలో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమైన రోజు?
సాగులో మెళకువలు, సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలకు ‘స్కోచ్‌ గోల్డ్‌’ అవార్డు లభించింది. ఆర్‌బీకేలు అందిస్తున్న సేవలకు గాను ఈ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని మార్చి 20న స్కోచ్‌ సంస్థ వర్చువల్‌గా నిర్వహించిన కార్యక్రమంలో వెల్లడించింది. త్వరలో ఈ అవార్డును రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ అందుకోనున్నారు.
2020, మే 30న...
ౖరైతు భరోసా కేంద్రాలను 2020, మే 30న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన 10,725 ఆర్‌బీకేలు, 154 ఆర్‌బీకే హబ్‌ల ద్వారా గడచిన 11 నెలలుగా వ్యవసాయ అనుబంధ రంగాల రైతులకు సేవలందుతున్నాయి.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ‘స్కోచ్‌ గోల్డ్‌ అవార్డు విజేత
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు
ఎందుకు : రైతులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నందుకు గాను

ఇక్రిశాట్‌తో ఎంవోయూ చేసుకున్న యూనివర్సిటీ?
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ), హైదరాబాద్‌కు చెందిన ఇక్రిశాట్‌ (ఇంటర్నేషనల్‌ క్రాప్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ద సెమీ–అరిడ్‌ ట్రోపిక్స్‌) సంస్థకు మధ్య అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. మార్చి 19న ఏఎన్‌యూలో జరిగిన కార్యక్రమంలో ఏఎన్‌యూ, ఇక్రిశాట్‌ అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం... వ్యవసాయ రంగానికి చెందిన విద్య, పరిశోధనాంశాలపై రెండు సంస్థలు సంయుక్తంగా పనిచేస్తాయి.
విజేత శ్రీవల్లి రష్మిక
ప్రతిష్టాత్మక జాతీయ సీనియర్‌ హార్డ్‌ కోర్ట్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక విజేతగా అవతరించింది. హరియాణలోని గురుగ్రామ్‌లో మార్చి 21న జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ రష్మిక 6–2, 7–6 (7/2)తో టాప్‌ సీడ్‌ వైదేహి చౌదరీ (గుజరాత్‌)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో అర్జున్‌ ఖడే (మహారాష్ట్ర) 6–3, 6–4తో పృథ్వీ శేఖర్‌ (తమిళనాడు)పై గెలిచి టైటిల్‌ దక్కించుకున్నాడు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఇక్రిశాట్‌తో ఎంవోయూ చేసుకున్న యూనివర్సిటీ?
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ)
ఎక్కడ : ఏఎన్‌యూ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : వ్యవసాయ రంగానికి చెందిన విద్య, పరిశోధనాంశాలపై సంయుక్తంగా పనిచేసేందుకు

ఏ జిల్లాలో వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటు కానుంది?
ఈఎంసీ–2 పథకం కింద వైఎస్సార్‌ కడప జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ (వైఎస్సార్‌ ఈఎంసీ) ఏర్పాటు కానుంది. ఈ క్లస్టర్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు ఇస్తూ మార్చి 22న ఉత్తర్వులు జారీచేసింది. 540 ఎకరాల్లో మొత్తం రూ.748.76 కోట్లతో అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం గ్రాంట్‌ రూపంలో రూ.350 కోట్లు ఇవ్వనుంది. ఈ క్లస్టర్‌ ద్వారా రూ.పదివేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
యాంకర్‌ కంపెనీగా డిక్సన్‌...
వైఎస్సార్‌ ఈఎంసీలో యాంకర్‌ కంపెనీగా డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఇండియా లిమిటెడ్‌ రూ.300 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. 70 ఎకరాలు డిక్సన్‌ టెక్నాలజీస్‌కు కేటాయిస్తారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ (వైఎస్సార్‌ ఈఎంసీ) ఏర్పాటుకు అనుమతి
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : కొప్పర్తి, వైఎస్సార్‌ కడప జిల్లా
ఎందుకు : రూ.పదివేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని

దక్షిణ భారతదేశంలో మొదటి అమెరికా కార్నర్‌ ఎక్కడ ప్రారంభమైంది?
ప్రతిష్టాత్మకమైన అమెరికా కార్నర్‌ (అమెరికా స్పేస్‌) దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. దేశంలో అహ్మదాబాద్‌ తరువాత అమెరికా ప్రభుత్వం ఏర్పాటుచేసిన రెండో కార్నర్‌ ఇది. మార్చి 23న జరిగిన వర్చువల్‌ కార్యక్రమంలో ఈ కార్నర్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ సమక్షంలో అమెరికా కాన్సులేట్‌ అధికారులు, ఆంధ్రా వర్సిటీ అధికారుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అనంతరం ఈ కార్నర్‌ ఆరంభమైనట్లు అమెరికా అధికారులు ప్రకటించారు. అమెరికా–భారత్‌ల మధ్య విద్యా, సాంస్కృతిక, ఆర్థిక సహకారం, బంధాల బలోపేతానికి ఈ కేంద్రం దోహదపడుతుంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : అమెరికా కార్నర్‌ (అమెరికా స్పేస్‌) ప్రారంభం
ఎప్పుడు : మార్చి 23
ఎవరు : అమెరికా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు
ఎక్కడ : ఆంధ్రా విశ్వవిద్యాలయం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : అమెరికా–భారత్‌ల మధ్య విద్యా, సాంస్కృతిక, ఆర్థిక సహకారం, బంధాల బలోపేతానికి

మూగజీవాల కోసం అంబులెన్స్‌లను ప్రారంభించనున్న రాష్ట్రం?
గ్రామాల్లో 104 అంబులెన్స్‌ల ద్వారా పేదలకు వైద్య సేవలందిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మూగజీవాలకూ అదే తరహాలో వైద్య సదుపాయాలు కల్పించనుంది. ఇందుకోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున సంచార పశు వైద్యశాలలను తీసుకురావాలని నిర్ణయించింది. వీటి నిమిత్తం ఏటా రూ.56.70 కోట్లు ఖర్చు చేయనుంది. 2019 లైవ్‌స్టాక్‌ (పశు సంపద) సెన్సెస్‌ ప్రకారం రాష్ట్రంలో 46 లక్షల ఆవులు, 62.19 లక్షల గేదెలు, 1.76 కోట్ల గొర్రెలు, 55.22 లక్షల మేకలు, 92 వేల పందులతో పాటు 10.79 లక్షల పౌల్ట్రీ సంపద ఉంది.
టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా...
గ్రామీణ ప్రాంతాల్లో ఆవులు, గేదెలు, దున్నపోతులు, మేకలు, గొర్రెలు, పెంపుడు కోళ్లకు.. అర్బన్‌ ప్రాంతాల్లో సామాన్య ప్రజలు పెంచుకునే కుక్కలు, పిల్లులు, ఇతర పెంపుడు జంతువులు, పక్షులకు వాటి యజమానుల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యసేవలు అందించాలన్న లక్ష్యంతోనే సంచార పశు వైద్యశాలలను తీసుకురానున్నారు. ఈ సంచార వైద్యశాల సేవలు 24 గంటలూ పొందేందుకు ‘1962’తో టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటుచేశారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : మూగజీవాల కోసం అంబులెన్స్‌లను ప్రారంభించనున్న రాష్ట్రం?
ఎప్పుడు : మార్చి 23
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా
ఎందుకు : మూగజీవాలకు వాటి యజమానుల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యసేవలు అందించాలని...

ఏపీలోని ఏ జిల్లాలో గంగవరం పోర్టు నెలకొని ఉంది?
గంగవరం పోర్టు లిమిటెడ్‌(జీపీఎల్‌)లో డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబానికి చెందిన 58.1 శాతం వాటాను అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఏపీఎస్‌ఈజెడ్‌) లిమిటెడ్‌ కొనుగొలు చేయనుంది. ఈ మేరకు రూ.3,604 కోట్లతో ఒప్పందం చేసుకున్నట్లు ఏపీఎస్‌ఈజెడ్‌ తెలిపింది. ఈ ఒప్పందాన్ని నియంత్రణ సంస్థ ఆమోదించాల్సి ఉంది. జీపీఎల్‌లో వార్‌బర్గ్‌ పింకస్‌ సంస్థకు చెందిన 31.5 శాతం వాటాను మార్చి 3న ఏపీఎస్‌ఈజెడ్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో గంగవరం పోర్టు ఉంది.

రైతుల కోసం ప్రత్యేకంగా రేడియో స్టేషన్‌ను ప్రారంభించనున్న వర్సిటీ?
Current Affairs
అన్నదాతల కోసం దేశంలోనే ప్రయోగాత్మకంగా డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం... ఓ ఎఫ్‌ఎం రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేస్తోంది. ‘ఉద్యాన వాణి’ పేరిట 2 నెలలుగా ప్రయోగాత్మకంగా రైతు కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఈ రేడియో స్టేషన్‌ త్వరలోనే అధికారికంగా ప్రారంభం కానుంది. రైతుల కోసం ప్రత్యేకంగా రేడియో స్టేషన్‌ నిర్వహించడం దేశంలో ఇదే ప్రథమం. ఈ రేడియో స్టేషన్‌ ద్వారా వర్సిటీ ఆధ్వర్యంలో చేసిన పరిశోధనల ఫలితాలు, అభివృద్ధి చేసిన సాంకేతిక విధానాలతోపాటు ఆ«ధునిక సేద్య సమాచారాన్ని నేరుగా రైతులకు అందించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో వెఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ప్రత్యేకంగా రేడియో స్టేషన్‌ను ప్రారంభించనున్న వర్సిటీ?
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : వర్సిటీ ఆధ్వర్యంలో చేసిన పరిశోధనల ఫలితాలు, అభివృద్ధి చేసిన సాంకేతిక విధానాలతోపాటు ఆ«ధునిక సేద్య సమాచారాన్ని నేరుగా రైతులకు అందించేందుకు

‘ఎన్‌సీడీసీ’ ఏర్పాటుకు కేంద్రం తుది నిర్ణయం
తెలంగాణలో జాతీయ అంటు వ్యాధుల నియంత్రణ కేంద్రాన్ని (ఎన్‌సీడీసీ) నెలకొల్పడంపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ విషయమై తాజాగా రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసినట్లు వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఎన్‌సీడీసీ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంపై ఇప్పటికే కేంద్ర అధికారులు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించారు.
‘ఎన్‌సీడీసీ’ ఏమి చేస్తుందంటే..?
హైదరాబాద్‌లో అంటు వ్యాధుల నియంత్రణ కేంద్రం ఏర్పాటైతే ప్రమాదకరమైన వైరస్‌లపై ఇక్కడే పరిశోధనలు చేయడానికి వీలుంటుంది. కరోనా, స్వైన్‌ఫ్లూ, బర్డ్‌ ఫ్లూ, జికా, గనేరియా, యాస్, వైరల్‌ హెపటైటిస్, రేబిస్, లెప్టోస్పైరోసిస్‌ వంటి వ్యాధుల నియంత్రణ, నిర్మూలనలో ఎన్‌సీడీసీ కీలకంగా వ్యవహరిస్తుంది. వ్యాధుల తీవ్రత అధికంగా ఉన్నప్పుడు తక్షణమే నిర్ధారణ పరీక్షలు, పరిశోధనలు, సత్వర చర్యలు, అవగాహన, శిక్షణ తదితర కార్యక్రమాల నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎన్‌సీడీసీ ఏర్పాటైతే శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇతర మానవ వనరుల నియామకాలకయ్యే పూర్తి ఖర్చును కేంద్రమే భరిస్తుంది. దాదాపు రూ.25 కోట్ల వ్యయంతో అత్యాధునిక లేబొరేటరీని నిర్ణయించ‌నున్నారు. దానితో రాష్ట్రంలో అంటువ్యాధులపై నిరంతర పరిశోధనలు కొనసాగే అవకాశం ఉంటుందని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి :
‘ఎన్‌సీడీసీ’ ఏర్పాటు
ఎవరు : కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : హైదరాబాద్‌ (తెలంగాణ)
ఎందుకు : ప్రమాదకరమైన వైరస్‌లపై పరిశోధనలు చేయడానికి...

జాతీయ పోషకాహార సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
Current Affairs
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని దాదాపు 54 శాతం మందిలో కోవిడ్‌ నిరోధక యాంటీబాడీలు ఉన్నాయని తేలింది. సెంటర్‌ ఫర్‌ సెల్యు లార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ), జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌), భారత్‌ బయోటెక్‌లు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. హైదరాబాద్‌లో ఒకట్రెండు వార్డులు మినహాయించి మిగిలిన చోట్ల యాంటీబాడీల మోతాదు దాదాపు ఒకేలా ఉందని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా మార్చి 4న తెలిపారు.
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కోవిడ్‌ వ్యాప్తి, తీవ్రత తదితర అంశాలను అంచనా వేసేందుకు ఈ అధ్యయనం నిర్వహించారు. అధ్యయనం కోసం... 2021, జనవరి మూడో వారం నుంచి మొదలుపెట్టి 3 వారాల పాటు 9 వేల మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. 10 ఏళ్ల వయసు మొదలుకొని 70 ఏళ్లపైబడిన వారి వరకు నమూనాలు తీసుకున్నారు.
  • సీసీఎంబీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది.
  • ప్రస్తుతం సీసీఎంబీ డైరెక్టర్‌గా డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా ఉన్నారు.
  • ఎన్‌ఐఎన్‌ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది.
  • ప్రస్తుతం ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ ఆర్‌.హేమలత ఉన్నారు.
  • భారత్‌ బయోటెక్‌(ప్రైవేటు కంపెనీ) ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది.
  • ప్రస్తుతం భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌–ఎండీగా డాక్టర్‌ కృష్ణా ఎల్లా ఉన్నారు.
  • భారత్‌ బయోటెక్‌ స్థాపకులు : డాక్టర్‌ కృష్ణా ఎల్లా

ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం?

2021 ఏడాదిలో ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో రాజస్తాన్‌ మొదటి స్థానంలో ఉండనుంది. రాజస్తాన్‌ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉండనుంది. వీబాక్స్, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) కలసి దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించి రూపొందించిన ‘‘ఇండియా స్కిల్‌ రిపోర్టు–2021’’లో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వేలోని వివరాల ప్రకారం... పట్టణాల పరంగా ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళలు అత్యధికంగా ఉన్న వాటిల్లో హైదరాబాద్‌ మొదటి స్థానంలో.. బెంగళూరు రెండో స్థానంలో ఉండనుంది. బెంగళూరు తర్వాత వరుసగా... కోయంబత్తూరు, ఈరోడ్, లక్నో నగరాలు ఉన్నాయి.
నివేదికలోని ముఖ్యాంశాలు
  • దేశవ్యాప్తంగా 2020లో ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళలు 41.25 శాతం ఉంటే 2021లో 46.8 శాతానికి పెరగనున్నారు.
  • 2021లో ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన పురుషులు 45.91 శాతం మాత్రమే ఉంటారు.
  • వివిధ రంగాల్లో పనిచేస్తున్న పురుషులు 2020లో 77 శాతం మంది ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 64 శాతానికి తగ్గనుంది.
  • 2020లో ఉద్యోగం చేసే మహిళలు 23 శాతం మంది ఉంటే 2021 ఏడాది వారి సంఖ్య 36 శాతానికి పెరగనుంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం రాజస్తాన్‌
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : ఇండియా స్కిల్‌ రిపోర్టు–2021
ఎక్కడ : దేశంలో

దేశంలో తొలిసారిగా ‘జెండర్‌’ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న రాష్ట్రం?
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న మహిళలకు, బాలికలకు అండగా నిలిచే పలు కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించి ప్రసంగించారు. అన్ని పోలీస్‌ స్టేషన్లలో మహిళా హెల్ప్‌డెస్క్‌లను వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. సైబర్‌ కియోస్క్‌లను ఆవిష్కరించడంతో పాటు 18 దిశ క్రైం సీన్‌ మేనేజ్‌మెంట్‌ వెహికల్స్, 900 దిశ పెట్రోలింగ్‌ వెహికల్స్‌ను సీఎం ప్రారంభించారు. బాలికలకు ఉచిత న్యాప్‌కిన్స్‌ అందించే స్వేచ్ఛ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
తొలిసారిగా జెండర్‌ బడ్జెట్‌...
కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగిస్తూ... మహిళల కోసం 2021 ఏడాది బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయింపులు చేయనున్నట్లు ప్రకటించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మహిళా బడ్జెట్‌ కాన్సెప్ట్‌ తెస్తున్నామని, అక్కచెల్లెమ్మలకు ఎంత ఖర్చు చేయబోతున్నామో అందులో తెలియచేస్తామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ‘జెండర్‌’ బడ్జెట్‌ను ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడుతున్నామన్నారు.

ఏపీలోని ఏ జిల్లాలో డిక్సన్‌ ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ ఏర్పాటు కానుంది?
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో డిక్సన్‌ ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ ఏర్పాటు కానుంది. డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఇండియా లిమిటెడ్‌ చైర్మన్‌ సునీల్‌ వాచని, సీఈవో పంకజ్‌ శర్మ మార్చి 9న క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా రెండు నుంచి మూడు వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు వివరించారు. కొప్పర్తి యూనిట్‌లో మొబైల్స్, వేరియబుల్స్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్, సెక్యూరిటీ ఎక్విప్‌మెంట్స్, కెమెరాలు తయారు చేయనున్నట్లు వెల్లడించారు. తిరుపతిలోని తమ యూనిట్‌ను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని సీఎం జగన్‌కు తెలిపారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : త్వరలో డిక్సన్‌ ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 9
ఎవరు : డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఇండియా లిమిటెడ్‌
ఎక్కడ : కొప్పర్తి, వైఎస్సార్‌ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌

ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ వెబ్‌సైట్, ట్విటర్‌ అకౌంట్‌ ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలపై వ్యవస్థలను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా మీడియాలో, సోషల్‌ మీడియాలో కొందరు ప్రచారాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వాస్తవం ఏమిటి.. వాస్తవం కానిది ఏమిటనేది ప్రజల్లోకి స్పష్టంగా తీసుకువెళ్లాలని తెలిపారు. ఇందుకోసం మార్చి 5న ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ వెబ్‌సైట్, ట్విటర్‌ అకౌంట్‌ను ప్రారంభించారు.
హర్‌ సర్కిల్‌ ఆవిష్కరణ
మహిళా సాధికారతకు మరింత తోడ్పాటునిచ్చే దిశగా రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ మార్చి 7న ’హర్‌ సర్కిల్‌’ పేరిట సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఆవిష్కరించారు. భిన్న సంస్కృతులు, వర్గాలు, దేశాలకు చెందిన మహిళ లు తమ ఆలోచనలను పంచుకునేందుకు ఇది వేదికగా ఉండగలదని ఆమె తెలిపారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ వెబ్‌సైట్, ట్విటర్‌ అకౌంట్‌ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు : ప్రభుత్వ కార్యక్రమాలపై వాస్తవం ఏమిటి.. వాస్తవం కానిది ఏమిటనేది ప్రజల్లోకి స్పష్టంగా తీసుకువెళ్లాలని

ఏపీలోని ఏ జిల్లాలో ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ ప్రారంభమైంది?
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ) టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటైంది. 20 ఎకరాల్లో రూ.133 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను కేంద్ర ఉపరితల రవాణా, ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మార్చి 10న ఢిల్లీ నుంచి వర్చువల్‌ విధానం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి ఎంఎస్‌ఎంఈ కేంద్ర సహాయమంత్రి ప్రతాప్‌చంద్ర సారంగి, విజయవాడ నుంచి ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు.
కార్యక్రమంలో మంత్రి మేకపాటి మాట్లాడుతూ... నౌకా నిర్మాణం, వెల్డింగ్, ఫాబ్రికేషన్, ఉక్కు ఉత్పత్తి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలున్న నేపథ్యంలో విశాఖలో టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంజనీరింగ్‌ పరిశ్రమలకు అవసరమైన నిపుణులైన మానవ వనరుల(స్కిల్డ్‌ మ్యాన్‌పవర్‌)ను ఏటా 8,500 మంది చొప్పున రాబోయే ఐదేళ్లపాటు తీర్చిదిద్దడమే ఈ సెంటర్‌ ఏర్పాటు లక్ష్యమని వివరించారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 10
ఎవరు : కేంద్ర ఉపరితల రవాణా, ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : ఇంజనీరింగ్‌ పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను తయారు చేసేందుకు

ఏ దేశ ప్రభుత్వంతో వీహబ్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది?
ఆస్ట్రేలియా ప్రభుత్వ భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్ర మహిళా పారిశ్రామికవేత్తల కేంద్రం (వీహబ్‌)... పురోగతి (అప్‌సర్జ్‌) పేరిట చేపట్టిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల శిక్షణ (ప్రిఇంక్యుబేషన్‌) కార్యక్రమం మార్చి 10న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె. తారక రామారావుతో పాటు భారత్‌లోని ఆస్ట్రేలియా హైకమిషనర్‌ బారీ ఒఫారెల్‌ తదితరలు కార్యక్రమంలో పాల్గొన్నారు. భాగస్వామ్యం కార్యక్రమంలో భాగంగా 240 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇస్తారు.

కెనరా బ్యాంకు ఈడీగా సత్యనారాయణ రాజు
కెనరా బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కె.సత్యనారాయణ రాజు నియమితులయ్యారు. అప్పటి విజయ బ్యాంక్‌లో 1988లో చేరిన ఆయన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో (బీవోబీ) చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ స్థాయికి ఎదిగారు. బ్యాంకింగ్‌ రంగంలో 33 ఏళ్ల అనుభవం ఉంది. బీవోబీ ఫైనాన్షియల్‌ సొల్యూషన్స్‌ డైరెక్టర్‌గా, బీవోబీ–ఐఐటీ బాంబే ఇన్నోవేషన్‌ సెంటర్‌ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.

  • కెనరా బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది.
  • కెనరా బ్యాంక్‌ ప్రస్తుత చైర్మన్‌గా టీఎన్‌ మనోహరన్‌ ఉన్నారు.


సిడ్బీతో ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం?
Current Affairs ఆంధ్రప్రదేశ్‌లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధికి సహకరించే విధంగా స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (సిడ్బీ)తో ఫిబ్రవరి 25న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం... రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి పథకాల రూపకల్పన, మూలధనం సమకూర్చడం, వడ్డీ రాయితీలు, ఆర్థిక ఒత్తిడిలో ఉన్న సంస్థలను ఆదుకోవడానికి ప్రణాళికలు వంటి సేవలను సిడ్బీ అందిస్తుంది. అలాగే దేశ, విదేశాల్లో అమ్మకాల అవకాశాలను కల్పిస్తుంది. మూడేళ్లపాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : సిడ్బీతో ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం?
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధి కోసం

69వ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానర్స్‌ కాన్ఫరెన్స్‌ ఎక్కడ ప్రారంభమైంది?
69వ జాతీయ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానర్స్‌ కాన్ఫరెన్స్‌ ఫిబ్రవరి 26న ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ కాన్ఫరెన్స్‌ను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టౌన్‌ ప్లానర్స్‌ ఇండియా (ఐటీపీఐ) ఆధ్వర్యంలో విశాఖపట్నం నగరంలో నిర్వహిస్తున్నారు. కాన్ఫరెన్స్‌ను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణ, పట్టణ పేదలకు మౌలిక సదుపాయాలు, నీటి నిర్వహణ వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నారు.
వలంటీర్ల సేవకు పురస్కారాలు...
పక్షపాతం, అవినీతికి దూరంగా సేవా దృక్పథాన్ని పెంపొందించే ఉద్దేశంతో... గ్రామ, వార్డు వలంటీర్లకు మూడు కేటగిరీల్లో అవార్డులు, నగదు పురస్కారాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. వారు అందించే సేవలను బట్టి మూడు కేటగిరీలుగా ఎంపిక చేసి, 2021, ఉగాది నుంచి వలంటీర్ల పురస్కారాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : 69వ జాతీయ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానర్స్‌ కాన్ఫరెన్స్‌ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎక్కడ : ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టౌన్‌ ప్లానర్స్‌ ఇండియా (ఐటీపీఐ)
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : పర్యావరణ పరిరక్షణ, పట్టణ పేదలకు మౌలిక సదుపాయాలు, నీటి నిర్వహణ వంటి అంశాలపై చర్చించేందుకు

అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా కార్యాలయం ఎక్కడ ఉంది?
తెలంగాణలో ఉద్యాన పంటల సాగు, ఉత్పత్తి, అవసరాలపై ఏం చేయాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా (ఆస్కీ)ని అధ్యయనం చేయమని కోరింది. ఈ నేపథ్యంలో ఆస్కీ పలు సిఫారసులతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వమే ఒక బ్రాండ్‌ను నెలకొల్పి ఉద్యాన ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేస్తే, ఒకవైపు వినియోగదారులకు ప్రయోజనం కలగడంతో పాటు రైతులకూ లాభాలు వస్తాయని తన నివేదికలో సిఫారసు చేసింది. ఆస్కీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. ప్రస్తుతం ఆస్కీ చైర్మన్‌గా కె.పద్మనాభయ్య ఉన్నారు.
సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ ఏర్పాటు...
తెలంగాణలో హొర్టి కల్చర్‌ అభివృద్ధి దిశగా, ఆధునిక పద్ధతుల్లో ఉద్యాన పంటల సాగుకోసం సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఇందుకోసం ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో 300 ఎకరాలను కేటాయిస్తున్నట్టు ఫిబ్రవరి 26న ప్రకటించారు.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఎరువులను ఏ బ్రాండ్‌ పేరుతో మార్కెట్‌లోకి తీసుకురానున్నారు?
దేశంలో ఎరువుల కొరత తీర్చేందుకు... రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ కర్మాగారం (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) యూరియా ఉత్పత్తికి సిద్ధమైంది. ట్రయల్‌రన్‌లో భాగంగా ఫిబ్రవరి 28న యూరియా ట్యాంక్, బ్యాగింగ్‌ యూనిట్‌ను రన్‌ చేశారు. ఈ ప్రక్రియ సందర్భంగా టెక్నికల్‌ గ్రేడ్‌ యూరియాను ఉత్పత్తి చేశారు. కిసాన్‌ బ్రాండ్‌ పేరుతో ఎరువులను అందుబాటులోకి తీసుకువస్తామని ఆర్‌ఎఫ్‌సీఎల్‌ సీఈవో నిర్లిప్‌సింగ్‌ రాయ్‌ తెలిపారు.
ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పేరుతో...
రామగుండంలో ఫర్టిలైజర్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) పేరిట గతంలో నడిచిన ఈ కర్మాగారం నష్టాల కారణంగా మూతపడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిని ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పేరుతో పూర్తి గ్యాస్‌ ఆధారంగా రూ.5,920.55 కోట్ల అంచనాతో పునరుద్ధరణ చేపట్టింది. ఈ ప్రాజెక్టులో నేషనల్‌ ఫర్టిలైజర్స్, ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎఫ్‌సీఐ భాగస్వాములుగా ఉన్నాయి. ప్రాజెక్టులో నిత్యం 2,200 టన్నుల అమ్మోనియా, 3,850 టన్నుల యూరియాను ఉత్పత్తి చేయనున్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : కిసాన్‌ బ్రాండ్‌ పేరుతో మార్కెట్‌లోకి ఎరువులు
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ కర్మాగారం (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)

తెలుగు రాష్ట్రాల్లో ఐఎస్‌వో గుర్తింపు దక్కిన తొలి టెక్నికల్‌ వర్సిటీ?
అనంతపురం జేఎన్‌టీయూకు ఐఎస్‌వో (ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ స్టాండరై్డజేషన్‌) గుర్తింపు దక్కింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐఎస్‌వో గుర్తింపు దక్కిన తొలి టెక్నికల్‌ వర్సిటీగా జేఎన్‌టీయూ (ఏ) రికార్డుకెక్కింది. మార్చి 3న వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ‘హైమ్‌’ ఇంటర్నేషనల్‌ సర్టిఫికేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధి శివయ్య ఐఎస్‌వో సర్టిఫికెట్లను వర్సిటీ అధికారులకు అందజేశారు.

ఏపీలోని ఏ జిల్లాలో సీఆర్‌ఆర్‌సీ యూనిట్‌ ఏర్పాటవుతోంది?
చైనాకు చెందిన మెట్రో రైల్‌ కోచ్‌ల తయారీ సంస్థ సీఆర్‌ఆర్‌సీ... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో భారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. చిత్తూరు జిల్లా శ్రీసిటీలో 45.3 ఎకరాల్లో రూ.350 కోట్ల పెట్టుబడి అంచనాతో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్‌కు ఏపీఐఐసీ ఎండీ కె.రవీన్‌కుమార్‌రెడ్డి మార్చి 3న భూమి పూజ నిర్వహించారు. శ్రీసిటీలో ఇప్పటికే ఆల్‌స్టోమ్‌ ఇండియా మెట్రో కోచ్‌ల యూనిట్‌ ఏర్పాటైంది.
రూ.44,800 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఒప్పందం
పోర్టు సెక్టార్‌లో రూ.44,800 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. మారిటైమ్‌ ఇండియా సమ్మిట్‌–2021 సందర్భంగా ఈ ఒప్పందాలు కుదిరాయని విశాఖ పోర్టు ట్రస్ట్‌ చైర్మన్‌ కె.రామ్మోహన్‌రావు తెలిపారు. ప్రస్తుతం విశాఖ పోర్టు ట్రస్ట్‌ డిప్యూటీ చైర్మన్‌గా దుర్గేష్‌ కుమార్‌ దూబె ఉన్నారు.

వీహబ్‌తో ఒప్పందం చేసుకున్న ఈ–కామర్స్‌ సంస్థ?
తెలంగాణలోని ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ఆన్‌లైన్‌ వ్యాపారం, ఉత్పత్తుల మార్కెటింగ్‌ కోసం... ప్రముఖ ఇ–కామర్స్‌ సంస్థ మీషో, తెలంగాణ రాష్ట్ర మహిళా పారిశ్రామికవేత్తల కేంద్రం (వీహబ్‌) మధ్య ఒప్పందం కుదిరింది. హైదరాబాద్‌లో మార్చి 3న జరిగిన కార్యక్రమంలో తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ సమక్షంలో వీ–హబ్‌ సీఈవో దీప్తి రావుల, మీషో సీఈవో విదిత్‌లు ఒప్పందంపై సంతకాలు చేశారు.
అగ్రిహబ్‌ ఏర్పాటు...
హైదరబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ వర్శిటీలో ఏర్పాటుచేస్తున్న ‘అగ్రిహబ్‌’లో గ్రామీణ వాణిజ్య ఇంక్యుబేషన్‌ కేంద్రం నిర్మాణానికి రూ.9 కోట్ల రుణాన్ని నాబార్డు మంజూరు చేసింది.
 
Published date : 27 Mar 2021 05:39PM

Photo Stories