Skip to main content

జనవరి 2020 రాష్ట్రీయం

ఏపీ విద్యా చట్టం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Current Affairs
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనకు ఉద్దేశించిన ‘ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం 1/1982(సవరణ) బిల్లులను రాష్ట్ర అసెంబ్లీ జనవరి 23న రెండోసారి ఆమోదించింది. గత సమావేశాల్లో తెచ్చిన ఈ బిల్లుపై చర్చించాక అసెంబ్లీ ఆమోదించి శాసనమండలికి పంపింది. అయితే మండలి దీన్ని ఆమోదించకుండా పలు సవరణలు సూచించింది. మండలి సవరణలను తిరస్కరించినట్టు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం-1982 సవరణ
ఉద్దేశం: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యార్థులకు భోదన.. ధనిక, మధ్యతరగతి, పేద అనే తేడా లేకుండా అందరికీ నాణ్యమైన విద్యను అందించడం.. ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి దోహదం చేయడం.. అన్ని తరగతుల్లోనూ తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయడం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం-1982 సవరణకు ఆమోదం
ఎప్పుడు : జనవరి 23
ఎవరు : ఆంధ్రప్రదేశ్ శాసనసభ
ఎందుకు : ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనకు

కేస్లాపూర్‌లో నాగోబా జాతర ప్రారంభం
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర జనవరి 24న ప్రారంభమైంది. ఏటా పుష్యమాసం అమావాస్య రోజున ప్రారంభమయ్యే నాగోబా జాతర ఆరురోజుల పాటు కొనసాగుతుంది. మెస్రం వంశీయులు వారు బస చేసిన మర్రిచెట్టు (వడమర) నుంచి పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకుని పూజలు చేయడంతో ఈ గిరిజన జాతర మొదలవుతుంది. ఈ జాతరలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన గిరిజనులు పాల్గొంటారు. నాగోబా జాతరను రాష్ట్ర పండుగగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నాగోబా జాతర ప్రారంభం
ఎప్పుడు : జనవరి 24
ఎక్కడ : కేస్లాపూర్, ఇంద్రవెల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ

ఏపీ శాసనమండలి రద్దు తీర్మానానికి ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలిని రద్దు చేయాలని శాసనసభ తీర్మానించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ‘శాసనమండలి రద్దు’ చట్టబద్ధ తీర్మానాన్ని శాసనసభ జనవరి 27న ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను సత్వరమే అమలు చేసేందుకు వీలుగా శాసనమండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
శాసనమండలి రద్దు ప్రక్రియ ఇలా..
  • రాజ్యాంగంలోని 169(1) అధికరణ కింద శాసన మండలిని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది.
  • మండలిని రద్దు చేయాలంటే.. రాజ్యాంగంలోని 169(1) అధికరణ కింద రద్దు ప్రతిపాదనను తొలుత రాష్ట్ర కేబినెట్ ఆమోదించాలి. అనంతరం మండలిని రద్దు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి తీర్మానం ప్రవేశపెట్టాలి. ఆ తర్వాత సభలో చర్చ అనంతరం 2/3వ వంతు మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందాలి. అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలి.
  • రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్ర హోంశాఖ పరిశీలించి స్వల్ప రాజ్యాంగ సవరణకు లోక్‌సభ, రాజ్యసభ ముందుకు తీసుకువెళ్లాలి. ప్రస్తుతం రాష్ట్రంలో శాసనసభ, శాసనమండలి ఉన్నాయి. ఇప్పుడు శాసనసభ మాత్రమే ఉంటుందని సాధారణమైన రాజ్యాంగ సవరణలకు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదించాల్సి ఉంది.
  • లోక్‌సభ, రాజ్యసభ ఆమోదించాక రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయగానే మండలిని రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వమే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి తీర్మానానికి ఆమోదం
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : ఆంధ్రప్రదేశ్ శాసనసభ
ఎందుకు : ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను సత్వరమే అమలు చేసేందుకు

ఏపీలో బాల సాహితీ సూచీ ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ ‘బాల సాహితీ సూచీ’ పేరిట రూపొందించిన పిల్లల పుస్తకాల సమాచార దర్శినిని ఆంద్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ రాజ్‌భవన్‌లో జనవరి 27న ఆవిష్కరించారు. 1963 నుంచి 2019 వరకు తెలుగులో విడుదలైన 6,150 పిల్లల పుస్తకాల ప్రాథమిక సమాచారాన్ని బాల సాహితీ సూచీలో పొందుపరిచారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. పుస్తక పఠనం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని, చిన్నారుల విద్యార్జనకు పరోక్షంగా సహాయపడుతుందని చెప్పారు. 1929లో శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ప్రచురించిన మొట్టమొదటి గ్రంథ పట్టికతో తెలుగులో గ్రంథ పట్టికల ప్రచురణ ప్రారంభమైందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బాల సాహితీ సూచీ ఆవిష్కరణ
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : ఆంద్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
ఎక్కడ : రాజ్‌భవన్, విజయవాడ
ఎందుకు : 1963 నుంచి 2019 వరకు తెలుగులో విడుదలైన 6,150 పిల్లల పుస్తకాల ప్రాథమిక సమాచారం కోసం

ఫిబ్రవరి 28న రాజన్న పశువైద్యం ప్రారంభం
ప్ర
తి గ్రామానికి మెరుగైన పశువైద్యం అందించేందుకు ఉద్దేశించిన ‘రాజన్న పశువైద్యం’ కార్యక్రమాన్ని 2020, ఫిబ్రవరి 28న ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత ప్రారంభం కానున్న 3,300 రైతు భరోసా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు జనవరి 28న ‘రైతు భరోసా కేంద్రం-రాజన్న పశువైద్యం’ పోస్టర్‌ను రాష్ట్ర పశుసంవర్థక శాఖ విడుదల చేసింది. అలాగే కార్యక్రమ నిర్వహణకు తొలి విడతగా రూ.50 కోట్లను విడుదల చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020, ఫిబ్రవరి 28న రాజన్న పశువైద్యం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ప్రతి గ్రామానికి మెరుగైన పశువైద్యం అందించేందుకు

ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానమందిరం ప్రారంభం
ప్రపంచంలోనే అతిపెద్దదైన ధ్యానమందిరం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా గ్రామంలో ప్రారంభమైంది. శ్రీరామ చంద్ర మిషన్ గురువు కమలేశ్ డీ పటేల్ (దాజీ) జనవరి 28న ఈ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఈ ధ్యాన కేంద్రాన్ని హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ గ్లోబల్ హెచ్ క్వార్డర్‌గా ప్రకటించారు. ఈ సందర్భంగా దాజీ మాట్లాడుతూ... సమాజంలో ప్రస్తుతం నెలకొన్న అశాంతి, విద్వేషపూరిత వాతావరణం నేపథ్యంలో మానవజాతి మేలు కోసం దేశంలోని యోగా, ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ ఒకే ఛత్రం కిందకు రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. మందిర ప్రారంభోత్సవంలో పతంజలి యోగా పీఠం అధ్యక్షుడు యోగా గురు రాందేవ్ బాబా పాల్గొన్నారు.
శ్రీరామ చంద్ర మిషన్ 75వ వార్షికోత్సవం, సంస్థ ప్రథమ గురువైన శ్రీ రామచంద్ర 147వ జన్మదినోత్సవాల నేపథ్యంలో ఈ ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రంలో ఏకకాలంలో లక్ష మంది వరకు ధ్యానం చేసుకునేందుకు సౌకర్యాలున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానమందిరం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : శ్రీరామ చంద్ర మిషన్ గురువు కమలేశ్ డీ పటేల్ (దాజీ)
ఎక్కడ : కాన్హా గ్రామం, నందిగామ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ

మాతృ వందన సప్త్‌లో ఏపీకి మొదటి ర్యాంకు
ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై) అమలులో భాగంగా 2019 డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 8 వరకు నిర్వహించిన ‘మాతృ వందన సప్త్’లో ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ర్యాంకు లభించింది. అలాగే పీఎంఎంవీవై ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2వ ర్యాంకును ఏపీ సాధించింది. వీటితో పాటు దేశవ్యాప్తంగా జిల్లాల వారీ ప్రతిభలో కర్నూలుకు 2వ ర్యాంకు దక్కింది. కేంద్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ జనవరి 28న ప్రకటించిన ‘పీఎంఎంవీవై’ ర్యాంకుల్లో ఈ విషయం వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లో కూలి పనులకు వెళుతూ సక్రమంగా వైద్య పరీక్షలకు రాని గర్భిణులను ఆస్పత్రులకు వచ్చేలా ప్రోత్సహించడంలో భాగంగా పీఎంఎంవీవైను ప్రవేశపెట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌కు మాతృ వందన సప్త్‌లో మొదటి ర్యాంకు
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : కేంద్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ
ఎక్కడ : దేశంలో
ఎందుకు : మాతృ వందన సప్త్ అమలులో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు

అంతర్జాతీయ సౌకర్యాలతో క్లీన్ వార్డ్’ కేంద్రం
ఏ వైరస్ సోకినా ఒకేచోట వైద్య చికిత్స అందించే ‘క్లీన్‌వార్డు’ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలు, సౌకర్యాలతో దీన్ని ఏర్పాటు చేయనుంది. ముందుగా హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రిలో ఏర్పాటు చేయాలని అనుకున్నా, తర్వాత దాన్ని ఛాతీ ఆస్పత్రిలో ఐదెకరాల విశాలమైన స్థలంలో నెలకొల్పాలని నిర్ణయించింది. రూ.132 కోట్లు ఖర్చు పెట్టి వచ్చే ఏడాదికి దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలో భూమి పూజ చేసి నిర్మాణం చేపట్టనుంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది.
డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల మేరకు..
క్లీన్‌వార్డు కేంద్రంలో స్వైన్‌ప్లూ, కరోనా, నిఫా, ఎబోలా వంటి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లకు చికిత్స అందిస్తారు. ఈ కేంద్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా నెలకొల్పుతారు. ప్రస్తుతం ఏదైనా వైరస్ సోకితే గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రుల్లో అప్పటికప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కోసారి కనీస వసతులు కూడా ఉండకపోవడంతో బాధితులు ఆయా ఆస్పత్రులకు రావడానికి వెనుకంజ వేస్తున్నారు. పైగా ఆయా ఆస్పత్రుల్లో సాధారణ రోగులకు వైద్యం అందించే వార్డులనే వైరస్‌లు సోకిన వారికి ప్రత్యేకంగా కేటాయించి చికిత్స చేస్తున్నారు. దీనివల్ల సాధారణ రోగులకు, వైరస్ సోకిన రోగులకు పక్కపక్కనే చికిత్స అందించే పరిస్థితి ఉంటుంది. అందుకే ఈ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి ప్రత్యేక చికిత్సా కేంద్రం ప్రస్తుతం ఢిల్లీ, పుణేల్లో మాత్రం ఉండగా, త్వరలో హైదరాబాద్‌లో అందుబాటులోకి రానుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అంతర్జాతీయ సౌకర్యాలతో తెలంగాణలో ‘క్లీన్ వార్డ్’ కేంద్రం ఏర్పాటు
ఎక్కడ: తెలంగాణ
ఎందుకు: స్వైన్‌ప్లూ, కరోనా, నిఫా, ఎబోలా వంటి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లకు చికిత్సకు..

రబ్బర్‌వుడ్ పరిశ్రమలో థాయ్‌లాండ్ పెట్టుబడులు
Current Affairs
తెలంగాణలో రబ్బర్‌వుడ్ పరిశ్రమ రంగంలో థాయ్‌లాండ్ భారీ పెట్టుబడులు పెట్టనుందని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జనవరి 18న జరిగిన జరిగిన ఇండియా-థాయ్‌లాండ్ బిజినెస్ మ్యాచింగ్ అండ్ నెట్‌వర్కింగ్ సెమినార్‌లో థాయ్‌లాండ్ ఉప ప్రధాని జురిన్ లక్సనావిసిత్‌తో కలసి తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక మంత్రి కె.తారక రామారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ... రబ్బర్‌వుడ్ పరిశ్రమలో థాయ్ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణతో పరస్పర అవగాహన ఒప్పందం చేసుకుందన్నారు. రబ్బర్ వుడ్, టింబర్ వుడ్ ఉత్పత్తుల రవాణా కోసం 400 కి.మీ దూరంలో కృష్ణపట్నం పోర్టు ఉందని, రవాణా సబ్సిడీలు కూడా థాయ్ కంపెనీలకు అందిస్తామన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రబ్బర్‌వుడ్ పరిశ్రమలో పెట్టుబడులు
ఎప్పుడు : జనవరి 18
ఎవరు : థాయ్‌లాండ్ ప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణ

126వ రాజ్యాంగ సవరణకు శాసనమండలి ఆమోదం
పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన 126వ రాజ్యాంగ సవరణకు జనవరి 21న ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ సవరణను ప్రవేశపెట్టగా, మూజువాణి ఓటుతో దానిని ఆమోదిస్తున్నట్లు మండలి చైర్మన్ షరీఫ్ మొహమ్మద్ అహ్మద్ ప్రకటించారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ సభ్యుల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు(ఎస్సీ, ఎస్టీ) రిజర్వేషన్లను పొడిగించేందుకు ఉద్దేశించిన 126వ రాజ్యాంగ సవరణ బిల్లును 2019, డిసెంబర్‌లో పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు జనవరి 25, 2020తో ముగియనుండగా, వాటిని జనవరి 25, 2030 వరకు పొడిగిస్తారు.
ఎస్సీ కమిషన్ బిల్లుకు శాసనసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ జనవరి 21న ఆమోదించింది. గతంలో అసెంబ్లీలో ఆమోదించి పంపిన ఈ బిల్లును శాసన మండలి సవరణలు సిఫార్సు చేసి వెనక్కి పంపిన నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా శాసనసభలో మళ్లీ ఈ బిల్లును ప్రవేశపెట్టింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 126వ రాజ్యాంగ సవరణకు ఆమోదం
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి

జగనన్న గోరుముద్ద పేరుతో మధ్యాహ్న భోజనం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం పేరు మారింది. ఈ పథకాన్ని ఇకపై ‘జగనన్న గోరుముద్ద’ పేరుతో అమలు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. విద్యార్థులకు 6 రోజులు విభిన్న రకాల ఆహార పదార్థాలను అందించేలా తీర్చిదిద్దిన ఈ పథకం జనవరి 21 నుంచే ప్రారంభమైందని వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ఏటా అదనంగా రూ.344 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఆయాలకు ఇస్తున్న రూ.వెయి్యని రూ.3 వేలకు పెంచామని పేర్కొన్నారు. మరోవైపు అమ్మఒడి పథకానికి ఏటా రూ.6500 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జగనన్న గోరుముద్ద పేరుతో మధ్యాహ్న భోజనం
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో

తెలంగాణలో ఎస్‌ఈసీసీ పేరుతో కేంద్రం సర్వే
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణుల జీవన ప్రమాణాలపై కేంద్ర ప్రభుత్వం సర్వే చేయనుంది. పదేళ్లలో మారిన ప్రజల స్థితిగతుల గురించి క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టనుంది. సామాజిక, ఆర్థిక, కుల గణన (ఎస్‌ఈసీసీ) పేరిట ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ జనవరి 21న వెల్లడించింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ సహకారంతో 2020, ఏప్రిల్ 14 కల్లా ఈ వివరాలను సేకరించాలని నిర్ణయించింది. ఎస్‌ఈసీసీ ద్వారా ప్రజలకు అందుతున్న కనీస సేవలు, ప్రభుత్వ పథకాల అమలు, ఇతరత్రా సామాజిక అంశాలపై సమగ్ర సమాచారం సేకరించనున్నారు.
వివరాల సేకరణకు ప్రత్యేక యాప్..
ప్రజల వివరాలను నమోదు చేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. గ్రామీణ ప్రజల సమాచారాన్ని నమోదు చేసేందుకు వెళ్లే ఎన్యూమరేటర్లకు యాప్‌తో కూడిన మొబైల్‌ను అందించనుంది.
పథకాల అమలు తీరుపై సమీక్ష..
పదేళ్లకోసారి జనగణన నిర్వహించే కేంద్రం.. అదే సమయంలో దశాబ్ద కాలంలో ప్రజల జీవన ప్రమాణాలు ఏ మేరకు మెరుగయ్యాయి? ప్రభుత్వ పథకాలు లబ్ధిదారుల దరికి చేరుతున్నాయా? అనేది అంచనా వేసేందుకు సామాజిక, ఆర్థిక, కుల గణన నిర్వహిస్తోంది. ఈ డేటా ప్రాతిపదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. పథకాల అమలు తీరును సమీక్షించి కొత్త వాటికి రూపకల్పన చేస్తాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సామాజిక, ఆర్థిక, కుల గణన (ఎస్‌ఈసీసీ) పేరిట ఇంటింటి సర్వే
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణ
ఎందుకు : పదేళ్లలో మారిన ప్రజల స్థితిగతుల గురించి క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు

పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు అసెంబ్లీ ఆమోదం
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి, పరిపాలన వికేంద్రీకరణకు ఉద్దేశించిన ‘ఏపీ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లు-2020’కు ఆంధ్రప్రదేశ్ శాసనసభ జనవరి 20న ఆమోదం తెలిపింది. అలాగే సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ ఆ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏఎంఆర్‌డీఏ) ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును కూడా శాసనసభ ఆమోదించింది.
ఏపీ వికేంద్రీకరణ బిల్లు ప్రకారం.. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) పరిధిలో కార్యనిర్వాహక రాజధానిని, అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏఎంఆర్‌డీఏ) పరిధిలో శాసన రాజధానిని, కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కేంద్రంగా జ్యుడిషియల్ రాజధానిని ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రాంతీయ ప్రణాళిక అభివృద్ధి బోర్డులు ఏర్పాటు చేస్తారు.
శాసన రాజధానిలో..
ఏఎంఆర్‌డీఏ పరిధిలోని శాసనపరమైన రాజధాని అమరావతిలో శాసనసభ, శాసనమండలి ఉంటాయి.
పరిపాలనా రాజధానిలో..
పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో రాజ్‌భవన్, సచివాలయం, ప్రభుత్వ
శాఖల శాఖాధిపతుల కార్యాలయాలు ఉంటాయి.
జ్యుడిషియల్ రాజధానిలో..
హైకోర్టు ప్రధాన కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర న్యాయ సంబంధమైన సంస్థలన్నీ సాధ్యమైనంత వరకూ కర్నూలులోనే ఉంటాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లు-2020కు ఆమోదం
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : ఆంధ్రప్రదేశ్ శాసనసభ
ఎందుకు : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి, పరిపాలన వికేంద్రీకరణకు

తెలంగాణలో పిరమాల్ ఔషధ పరిశ్రమ విస్తరణ
ప్రముఖ పారిశ్రామిక గ్రూప్ పిరమాల్ తెలంగాణ రాష్ట్రంలో తనకున్న ఔషధ పరిశ్రమ విస్తరణకు వచ్చే మూడేళ్లలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు వెళ్లిన రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు జనవరి 22న అక్కడ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. కేటీఆర్‌తో పిరమాల్ గ్రూప్ చైర్మన్ అజయ్ సమావేశమైన అనంతరం ఆ సంస్థ ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పటికే తమ కంపెనీలో 1,400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, రూ.500 కోట్ల పెట్టుబడి ద్వారా మరో 500 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఔషధ పరిశ్రమ విస్తరణకు రూ.500 కోట్ల పెట్టుబడి
ఎప్పుడు : జనవరి 22
ఎవరు : పిరమాల్ గ్రూప్
ఎక్కడ : తెలంగాణ

ఏపీలో 11,158 రైతు భరోసా కేంద్రాలు
రైతులకు అన్ని విధాలా అండగా ఉండేందుకు వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి 11,158 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. విత్తనం దగ్గర నుంచి పంట అమ్ముకునే వరకు రైతుకు అవసరమైన సాయాన్ని ఈ కేంద్రాల ద్వారా తమ ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతి గ్రామ సచివాలయం పక్కనే రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 22న అసెంబ్లీలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై జరిగిన చర్చలో సీఎం ఈ మేరకు వివరించారు. ఈ కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయంతో పాటు వ్యవసాయ సూచనలు, పండిన పంట కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణ
రాజధాని అమరావతి భూముల కొనుగోళ్లలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణ జరిపించాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జనవరి 22న ఆమోదం తెలిపింది. హోంమంత్రి మేకతోటి సుచరిత ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ భూ కుంభకోణంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ప్రాథమికంగా 4,070 ఎకరాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు నిర్ధారించి దీనిపై మరింత సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరముందని సూచించిందని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 11,158 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 22
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా
ఎందుకు : రైతులకు అన్ని విధాలా సాయం అందించేందుకు

జగనన్న అమ్మఒడి పథకం ప్రారంభం
Current Affairs
ఆంధ్రప్రదేశ్‌లో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘జగనన్న అమ్మఒడి’ పథకం ప్రారంభమైంది. చిత్తూరులో జనవరి 9న నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేటు జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఈ పథకం వర్తిస్తుంది.
అమ్మఒడి ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ... రాష్ట్రంలో అమ్మఒడి పథకం ద్వారా చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టామని అన్నారు. పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని చెప్పారు. 14 ఏళ్ల లోపు పిల్లలకు విద్య ప్రాథమిక హక్కు అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏ పేర్కొన్నప్పటికీ, పేదరికం కారణంగా చాలా మందికి పిల్లలను చదివించే పరిస్థితి లేదన్నారు. ఇలాంటి పేదింటి తల్లులు, పిల్లలకు అండగా ఉండేందుకే అమ్మఒడిని తీసుకొచ్చామన్నారు.
ముఖ్యమంత్రి ప్రసంగం-ముఖ్యాంశాలు
  • అమ్మఒడి పథకం కింద దాదాపు 42,12,186 లక్షల మంది తల్లులు, 81,72,224 లక్షల మంది పిల్లలకు మేలు చేకూరుతుంది.
  • ఈ పథకానికి రూ.6,456 కోట్లు కేటాయించాం.
  • ఈ పథకంలో విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి. ఈ ఏడాది మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి 75 శాతం హాజరు తప్పనిసరి.
  • రాబోయే జూన్‌లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి చేశాం.
  • విద్యార్థులకు మంచి చదువుతోపాటు పౌష్టికాహారం కూడా ముఖ్యమే. అందుకే మధ్యాహ్న భోజనం మెనూలో మార్పు తేవాలని సంకల్పించాం. సంక్రాంతి సెలవుల తర్వాత నుంచి కొత్త మెనూ అమలు చేస్తాం.
  • మెనూ మార్పు ద్వారా దాదాపు రూ.200 కోట్లు అదనపు భారం పడుతుంది.
  • రాష్ట్రంలో చదువుల విప్లవం కోసం 45 వేల పాఠశాలు, 471 జూనియర్ కళాశాలలు, 3,287 హాస్టళ్లు, 148 డిగ్రీ కళాశాలల్లో నాడు-నేడు ద్వారా మార్పు తెస్తాం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జగనన్న అమ్మఒడి పథకం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : చిత్తూరు, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌లో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు

ఇంగ్లాండ్ సంస్థలతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందం
ఇంగ్లాండ్‌కు చెందిన నేషనల్ హెల్త్ సిస్టమ్స్, హెల్త్ ఎడ్యుకేషన్ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం...రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థులకు ఇంగ్లాండ్ సంస్థలు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఇవ్వనున్నాయి.
ఈ మేరకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదనరెడ్డి, ఎండీ ఆర్జా శ్రీకాంత్ గ్లోబల్ లెర్నర్స్ ప్రోగ్రామ్ శిక్షణకు సంబంధించిన మెటీరియల్, పోస్టర్లను తాజాగా విడుదల చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంగ్లాండ్‌కు చెందిన నేషనల్ హెల్త్ సిస్టమ్స్, హెల్త్ ఎడ్యుకేషన్ సంస్థలతో ఒప్పందం
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్‌ఎస్‌డీసీ)
ఎందుకు : రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఇప్పించేందుకు

హునర్ హాట్ ప్రదర్శన ప్రారంభం
హైదరాబాద్‌లో కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ‘హునర్ హాట్’ప్రదర్శన ప్రారంభమైంది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ జనవరి 12న ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా నక్వీ మాట్లాడుతూ... పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) దేశమంతటా వర్తిస్తుందని, భారత్‌లో అంతర్భాగమైన రాష్ట్రాలన్నీ ఈ చట్టాన్ని అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. దేశంలోని ముస్లింలకు ఈ చట్టం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవని, అన్ని మతాల ప్రజలకు భద్రత ఉంటుందని స్పష్టం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హునర్ హాట్ ప్రదర్శన ప్రారంభం
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ
ఎక్కడ : హైదరాబాద్

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో జనవరి 13న జరిగిన ఈ భేటీలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు, దేశ, స్థానిక రాజకీయ పరిస్థితులపైనా చర్చించారు. ఈ భేటీ వివరాలను ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల కార్యాలయాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. సమావేశంలో ప్రధానంగా గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు సాగాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించారు. రాష్ట్ర విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూళ్లలో పేర్కొన్న సంస్థల ఆస్తుల విభజనను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని నిర్ణయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖరరావు
ఎక్కడ : ప్రగతి భవన్, హైదరాబాద్
ఎందుకు : రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు, దేశ, స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు

ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ రద్దు
ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను రద్దు చేస్తూ కేంద్ర సిబ్బంది, ప్రజానివేదనలు, పెన్షన్ల శాఖ జనవరి 14న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థన మేరకు ఈ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తూ 26 అక్టోబరు 1989న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు సమ్మతి పొందిన తరువాత చేసిన అభ్యర్థన మేరకు నాటి గెజిట్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను రద్దు
ఎప్పుడు: జనవరి 14, 2020
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్

అనంతపురంలో ఇండోస్పేస్ లాజిస్టిక్ పార్క్
Current Affairs
ముంబైకి చెందిన గ్రేడ్-ఏ ఇండస్ట్రియల్, లాజిస్టిక్ పార్క్స్ డెవలపర్ ఇండోస్పేస్ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో భారీ లాజిస్టిక్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. 30 ఎకరాల్లో ఈ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు జనవరి 2న కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అనంతపురంతో పాటూ గుజరాత్‌లోని బెచరాజీ మండల్ స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్‌లో 40 ఎకరాల్లో, హరియాణాలోని సోహ్న టౌరూలో 50 ఎకరాల్లో లాజిస్టిక్ పార్క్‌లను నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు.
ఇండోస్పేస్‌ను సింగపూర్ ప్రధాన కేంద్రంగా ఉన్న రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ఎవర్‌స్టోన్ గ్రూప్ ప్రమోట్ చేస్తుంది. ప్రస్తుతం ఇండోస్పేస్‌కు పంజాబ్, హరియాణా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి 9 రాష్ట్రాల్లో 3.45 కోట్ల చ.అ. విస్తీర్ణంలో 34 ఇండస్ట్రియల్, లాజిస్టిక్ పార్క్‌లున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండోస్పేస్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 2
ఎక్కడ : అనంతపురం, ఆంధ్రప్రదేశ్

మాజీ డీజీపీ హెచ్‌జే దొర ఆటోబయోగ్రఫీ ఆవిష్కరణ
మాజీ డీజీపీ హెచ్.జె. దొర ఆటోబయోగ్రఫీ ‘జర్నీ థ్రూ టర్బులెంట్ టైమ్స్’ పుస్తకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. దొర తన సర్వీసు కాలంలో ఎదుర్కొన్న క్లిష్టమైన సందర్భాలను వివరిస్తూ ఇతర పోలీసు అధికారులకు స్ఫూర్తినిచ్చేలా ఈ పుస్తకం రాశారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో జనవరి 2న జరిగిన పుస్తకావిష్కరణలో కేసీఆర్ మాట్లాడుతూ... సమాజంలో నేర ప్రవృత్తి పెరగకుండా నైతిక విలువలు పెంపొందించే విధంగా విద్యావిధానం ఉండాలని అభిలషించారు. మంచి సమాజాన్ని నిర్మించే క్రమంలో జీయర్ స్వామి లాంటి ధార్మికవేత్తలు, మాజీ డీజీపీల సలహాలతో పాఠ్యాంశాలను రూపొందిస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే విద్యాసంస్థల్లో నైతిక విలువలు పెంపొందించే బోధనలు ప్రారంభిస్తామని ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మాజీ డీజీపీ హెచ్‌జే దొర ఆటోబయోగ్రఫీ ఆవిష్కరణ
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు
ఎక్కడ : ప్రగతి భవన్, హైదరాబాద్

ఇయర్ ఆఫ్ ఏఐగా 2020 : మంత్రి కేటీఆర్
ఐటీ రంగంలో కృత్రిమ మేధస్సు వాటా భవిష్యత్‌లో రూ.1,284.2 లక్షల కోట్లకు చేరే అవకాశమున్న నేపథ్యంలో, అవకాశాలను అంది పుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో జనవరి 2న హైదరాబాద్‌లో జరిగిన ఏఐ-2020 లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ.. 2020ని ‘ఇయర్ ఆఫ్ ఏఐ’గా ప్రకటించారు. రాష్ట్రంలో ఏఐ సాంకేతికత వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.
కేటీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
నాస్కామ్ నివేదిక ప్రకారం దేశంలో ప్రస్తుతం 2 బిలియన్ డాలర్లుగా ఉన్న ఏఐ రంగం వాటా 2025 నాటికి 16 బిలియన్ డాలర్లకు చేరడంతో పాటు, 2021 నాటికి 8 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ తరఫున 2020ని ‘ఇయర్ ఆఫ్ ది ఏఐ’గా ప్రకటిస్తున్నాం.
  • ఐఐటీ హైదరాబాద్ తరహాలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు, ఇతర విద్యా సంస్థల్లోనూ ఏఐని బోధిస్తాం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇయర్ ఆఫ్ ఏఐగా 2020
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : తెలంగాణ రాష్ట్రంలో ఏఐ సాంకేతికత వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు

ఫ్లెమింగో ఫెస్టివల్-2020 ప్రారంభం
విదేశీ విహంగాల విడిది కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని నేలపట్టులో ‘ఫ్లెమింగో ఫెస్టివల్-2020’ జనవరి 3న ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల ప్రారంభకార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హాజరయ్యారు. సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ మండల కేంద్రాల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
విజయవాడ పుస్తక మహోత్సవం ప్రారంభం
31వ విజయవాడ పుస్తక మహోత్సవం ప్రారంభమైంది. విజయవాడ స్వరాజ్ మైదానంలో పది రోజులపాటు జరిగే ఈ ఉత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభించారు. పుస్తకాలు భావితరాలకు విజ్ఞాన నిక్షేపాలు వంటివని ఈ సందర్భంగా గవర్నర్ పేర్కొన్నారు. అంతకుముందు తెలుగువారి చరిత్ర పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫ్లెమింగో ఫెస్టివల్-2020 ప్రారంభం
ఎప్పుడు : జనవరి 3
ఎక్కడ : సూళ్లూరుపేట, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్

మహిళా రక్షణ-రోడ్డు భద్రత ఏడాదిగా 2020
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు, పిల్లల రక్షణతో పాటు రోడ్డు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. జనవరి 3న డీజీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... 2020 సంవత్సరాన్ని మహిళా రక్షణ-రోడ్డు భద్రత సంవత్సరంగా ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఈచ్ వన్-టీచ్ వన్’కార్యక్రమంలో పోలీసు శాఖ పాల్గొంటుందన్నారు. ఒక్కొక్క పోలీసు యూనిట్ కనీసం తమ పరిధిలోని 20 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహిళా రక్షణ-రోడ్డు భద్రత ఏడాదిగా 2020
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి
ఎక్కడ : తెలంగాణ
ఎందుకు : మహిళలు, పిల్లల రక్షణతో పాటు రోడ్డు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు

ఏపీ సమగ్రాభివృద్ధిపై బీసీజీ సిఫార్సులు
ఆంధ్రప్రదేశ్ రాజధానితోపాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) జనవరి 3న తన నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సమర్పించింది. రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రాధాన్యత, సహజ వనరులు, అభివృద్ధి అవకాశాలను విశ్లేషిస్తూ సమగ్రాభివృద్ధికి కీలక సూచనలు చేసింది. న్యాయ, శాసన, పరిపాలన వ్యవస్థలను వికేంద్రీకరిస్తూ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. అందుకు ప్రభుత్వానికి రెండు ఆప్షన్లను సూచించింది. అమరావతి నిర్మాణం ఆర్థికంగా లాభదాయకం కాదని, పైగా రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టేస్తుందని.. అందువల్ల ఆశించిన ప్రయోజనాలు చేకూరవని పేర్కొంది.
బీసీజీ ఆప్షన్లు ఇవీ..
Current Affairs
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ రాజధాని, సమగ్రాభివృద్ధిపై నివేదిక అందజేత
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ)

వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
2,059 వ్యాధులకు చికిత్స అందించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు’ ప్రారంభమైంది. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు ఇండోర్ స్టేడియంలో జనవరి 3న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ... వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అనేది దేశ ఆరోగ్య చరిత్రలోనే ఒక విప్లవం అని, ఈ దిశగా దేశంలోని 28 రాష్ట్రాలకన్నా మిన్నగా మరో అడుగు ముందుకు వేస్తూ.. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఈ పథకాన్ని వర్తింప చేస్తామని ప్రకటించారు.
సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
  • ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ 1,059 రోగాలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు 2,059కి పెంచుతూ పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నాం.
  • మూడు నెలలపాటు ఈ పైలట్ ప్రాజెక్టు కొనసాగుతుంది. ఎక్కడైనా సమస్యలు ఉంటే వాటిని అధిగమించి ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా ఒక్కో జిల్లాకు విస్తరిస్తూ వెళతాం.
  • ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లో అదనంగా 200 రోగాలకు చికిత్సను విస్తరిస్తూ 1,259 వ్యాధులకు ఈ పథకం కింద చికిత్స అందిస్తాం.
  • ఏటా రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తున్నాం. ఈ మేరకు కోటి 42 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నాం.
  • రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 వేల నుండి 50 వేల మంది ఆశావర్కర్లను గ్రామ సెక్రటేరియట్ పరిధిలోకి తీసుకువచ్చి వారికి 300 - 350 ఇళ్లను కేటాయిస్తాం. ఈ ఇళ్లకు సంబంధించిన ఆరోగ్య బాధ్యతలు వారి చేతిలో పెడతాం.
  • ఇకపై ఆరోగ్యశ్రీలోకి క్యాన్సర్ చికిత్సను కూడా చేరుస్తున్నాం.
  • ఆరోగ్యశ్రీ కార్డులపై క్యూ ఆర్ బార్ కోడ్ ఇస్తున్నాం. కార్డు దారునికి సంబంధించిన మొత్తం మెడికల్ రిపోర్టులన్నీ ఆ కార్డులో నమోదయ్యేలా చర్యలు తీసుకున్నాం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : 2,059 వ్యాధులకు చికిత్స అందించేందుకు

ఏపీలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు రెండు రోజుల పాటు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు. జనవరి 4, 5 తేదీల్లో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా 3,636 మందికి పైగా బాలబాలికలను రక్షించారు. రాష్ట్రంలో తప్పిపోయిన పిల్లలను గుర్తించి.. వారిని తల్లిదండ్రుల దగ్గరకు చేర్చేందుకు, అనాథలకు పునరావాసం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో పోలీసులతోపాటు మహిళా శిశు సంక్షేమ, కార్మిక, విద్యా, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, క్రీడా శాఖలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, శిశు సంరక్షణ కమిటీలు కూడా భాగస్వాములయ్యాయి.
ఆపరేషన్ ముస్కాన్ అంటే..
తల్లిదండ్రులు లేక కొందరు, ఇంటి నుంచి పారిపోయి వచ్చినవారు మరికొందరు అనాథల్లా జీవితం గడుపుతుంటారు. ఇలాంటివారిని రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో బహిరంగ ప్రదేశాల్లో గుర్తించడానికి పోలీసు బృందాలు, బాలల స్వచ్ఛంద సంస్థలు చేపట్టే కార్యక్రమాన్నే ఆపరేషన్ ముస్కాన్ అంటారు.
తెలంగాణలో ఆపరేషన్ స్మైల్
తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర పోలీస్ శాఖ ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. తప్పిపోయిన చిన్నారులను, బాల కార్మికులను గుర్తించి వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు చేపట్టిన కార్యక్రమమే ఆపరేషన్ స్మైల్.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆపరేషన్ ముస్కాన్ నిర్వహణ
ఎప్పుడు : జనవరి 4, 5
ఎవరు : ఆంధ్రప్రదేశ్ పోలీసులు
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా
ఎందుకు : తప్పిపోయిన పిల్లలను గుర్తించి.. వారిని తల్లిదండ్రుల దగ్గరకు చేర్చేందుకు, అనాథలకు పునరావాసం కల్పించేందుకు

2020 ఏడాదిలోనే టీ హబ్ 2 : మంత్రి కేటీఆర్
2020 సంవత్సరంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్ 2, దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్ టీ-వర్క్స్‌ని ప్రారంభించనున్నామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. హైదరాబాద్‌లో జనవరి 6న జరిగిన టీ హబ్ నాలుగో వార్షికోత్సవ సంబరాల్లో మంత్రి ఈ మేరకు తెలిపారు. టెక్నాలజీ రంగంలో 2020 తెలంగాణకు అత్యంత ప్రాధాన్యం కలిగిన సంవత్సరమని ఆయన పేర్కొన్నారు. ఇన్నోవేషన్ ద్వారా అనేక సవాళ్లకు సమాధానాలు లభిస్తాయని, తెలంగాణ స్టార్టప్ కంపెనీలు ఈ దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

వరంగల్‌లో మహీంద్రా, సైయంట్ సెంటర్లు ప్రారంభం
వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలోని ఐటీ సెజ్‌లో ఏర్పాటు చేసిన టెక్ మహీంద్రా, సైయంట్ ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్లను తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు జనవరి 7న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈటల రాజేందర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, సైయంట్ వ్యవస్థాపకుడు బీవీఆర్ మోహన్‌రెడ్డి, టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్ నాని పాల్గొన్నారు.
ప్రారంభోత్సవంలో కేటీఆర్ మాట్లాడుతూ... ‘వరంగల్‌కు తొలుత ఒక్క సైయంట్ కంపెనీ వచ్చింది. ఆ తర్వాత టెక్ మహీంద్రా వచ్చింది. ఒక దాని తర్వాత మరో కంపెనీ వస్తుంది. హైదరాబాద్, వరంగల్ కాదు.. కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మంతో పాటు దశల వారీగా అన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరిస్తాం’ అని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టామని, ఇప్పటికీ 12 వేల పరిశ్రమలకు అనుమతులిచ్చామని, తద్వారా రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 13 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కల్పించామని వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టెక్ మహీంద్రా, సైయంట్ ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్లు ప్రారంభం
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ : మడికొండలోని ఐటీ సెజ్, వరంగల్ అర్బన్ జిల్లా

న్యూజిలాండ్ పార్లమెంటరీ కార్యదర్శితో కేటీఆర్ భేటీ
న్యూజిలాండ్ ఎత్నిక్ ఎఫైర్స్ శాఖ పార్లమెంటరీ కార్యదర్శి ప్రియాంక రాధాక్రిష్ణన్‌తో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో జనవరి 8న జరిగిన ఈ సమావేశంలో న్యూజిలాండ్, తెలంగాణలో రాజకీయ వ్యవస్థల పనితీరుపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... న్యూజిలాండ్ ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో కలసి పనిచేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్ రెండో దశను ఏర్పాటు చేస్తున్నామని, విదేశీ స్టార్టప్ వ్యవస్థలతో కలసి పనిచేసేందుకు ఉద్దేశించిన ‘టీ బ్రిడ్‌‌జ’ను బలోపేతం చేస్తామన్నారు.
మా దేశానికి రండి..: తెలంగాణ వ్యవసాయ వర్సిటీతో కలసి పనిచేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ప్రియాంక వెల్లడించారు. తమ దేశంలో తెలంగాణ ఎన్నారైలతో కలసి పనిచేస్తున్నామని, బతుకమ్మ సంబురాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా కేటీఆర్‌ను ఆహ్వానించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : న్యూజిలాండ్ పార్లమెంటరీ కార్యదర్శి ప్రియాంక రాధాక్రిష్ణన్‌తో భేటీ
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ : ప్రగతిభవన్, హైదరాబాద్
Published date : 27 Jan 2020 04:07PM

Photo Stories