అక్టోబర్ 2020 రాష్ట్రీయం
స్కిల్ కాలేజీల్లో శిక్షణ ఇచ్చేందుకు మూడు ప్రముఖ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. అక్టోబర్ 22న స్కిల్ డెవలప్‌మెంట్ కార్యాలయం నుంచి ఆన్‌లైన్ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా డెల్ టెక్నాలజీస్, జేబీఎం ఆటో లిమిటెడ్, సీఐఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్ ప్రతినిధులతో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా చల్లా మధుసూదనరెడ్డి ఉన్నారు. ఒప్పందంలో భాగంగా...
- డెల్ టెక్నాలజీస్ సంస్థ విశాఖ జిల్లా ఐటీ సెక్టార్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ను ఏర్పాటు చేయనుంది. డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్, క్లౌడ్ ఆర్కిటెక్చర్, ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్ల కోసం వర్చువల్ కోర్సులను అందించనుంది.
- ఆటోమోటివ్ రంగానికి సంబంధించిన కోర్సుల్లో జేబీఎం శిక్షణ ఇవ్వనుంది. శ్రీసిటీలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
- సీఐఐ ఇన్‌స్టిట్యూట్ లాజిస్టిక్స్ రంగంలో నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డెల్ టెక్నాలజీస్, జేబీఎం ఆటో లిమిటెడ్, సీఐఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్ కంపెనీలతో ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
ఎందుకు : స్కిల్ కాలేజీల్లో శిక్షణ ఇచ్చేందుకు
ఏపీ లో ‘లంబోర్గిని’వాహనాల తయారీ యూనిట్
ప్రఖ్యాత స్పోర్‌ట్స వెహికల్ బ్రాండ్ లంబోర్గిని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. గోల్ఫ్, ఆతిథ్య రంగాల్లో వినియోగించే ప్రీమియం బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాల (బ్యాటరీతో నడిచే కార్లు) తయారీ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి పుణెకు చెందిన కై నటిక్ గ్రీన్ సంస్థ ప్రతిపాదనలు పంపింది. దేశంలో లంబోర్గిని బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసి విక్రయించేందుకు గాను కై నటిక్ గ్రీన్ సంస్థతో 2018లో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో సుమారు రూ.1,750 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్, బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లు, చార్జింగ్ స్వాపింగ్, ఆర్ అండ్ డీ యూనిట్లు ఏర్పాటు చేయడానికి కై నటిక్ గ్రీన్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కై నటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఫౌండర్ సీఈవో సులజ్జా ఫిరోడియా మొత్వాని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి లేఖ రాశారు. ఆ సంస్థ పోర్టు ఆధారిత సెజ్ ప్రాంతంలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. లంబోర్గిని వాహనాలతో పాటు కై నటిక్ గ్రీన్ బ్రాండ్ పేరుతో ద్వి, త్రిచక్ర వాహనాలను స్థానిక అవసరాలకు తోడు ఎగుమతి చేసే విధంగా యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే పదేళ్లలో కేవలం రాష్ట్రంలోనే 5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయిస్తామని, దీనివల్ల 2,30,00,000 మెట్రిక్ టన్నుల కాలుష్య ఉద్గారాలు తగ్గుతాయన్నారు. ఇది 147.34 కోట్ల చెట్లను పెంచడానికి సమానమని ఆ ప్రతిపాదనల్లో పేర్కొంది. భారీ మెగా ప్రాజెక్టుగా దీన్ని పరిగణించి దానికి అనుగుణంగా రాయితీలు ఇవ్వాల్సిందిగా కోరింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఆర్ అండ్ డీలో అభివృద్ధి చేసిన టెక్నాలజీ వాణిజ్యపరంగా వినియోగిస్తే దానిపై ఒక శాతం రాయల్టీ చెల్లించడానికి కంపెనీ ప్రతిపాదించింది.
క్విక్ రివ్వూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌లో ‘లంబోర్గిని’వాహనాల తయారీ యూనిట్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : లంబోర్గిని వాహనాలతో పాటు కై నటిక్ గ్రీన్ బ్రాండ్ పేరుతో ద్వి, త్రిచక్ర వాహనాలను స్థానిక అవసరాలకు తోడు ఎగుమతి చేసే విధంగా
ఏపీలో నాలుగు శాస్త్రీయ పరిశోధన కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు శాస్త్రీయ పరిశోధన కేంద్రాల (రీసెర్చ్ సెంటర్లు) ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో కొనసాగుతున్న కేంద్ర పరిశోధన కేంద్రాలు అక్కడికే పరిమితం కావడంతో రాష్ట్రంలో వీటి ఆవశ్యకత ఏర్పడింది. ఇక్కడి అవసరాలు తీర్చడానికి ఒక్క పరిశోధన కేంద్రం లేకపోవడంతో ఇతర రాష్ట్రాలపై ప్రభుత్వం ఆధారపడుతోంది. ఆ కేంద్రాల నుంచి నివేదికలు ఆలస్యం జరుగుతుండటంతో వీటి ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. పరిశోధన కేంద్రాలకు సంబంధించిన ప్రతిపాదనల రూపకల్పన బాధ్యతను సైన్స్ సిటీకి అప్పగించింది. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి వీటి ఆవశ్యకతను గుర్తించి సైన్స్ అండ్ టెక్నాలజీ కేంద్ర మంత్రిత్వ శాఖకు సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, సెంట్రల్ ఫుడ్ టెక్నాలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు.
ఆరేళ్లు పూర్తి చేసుకున్న ‘షీ టీమ్’
మహిళల భద్రత కోసం వినూత్న అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఇప్పటికే దేశంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నట్లు విమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా తెలిపారు. ఆడపిల్లల భద్రతకు ప్రాముఖ్యమిస్తూ ముందుకు సాగుతామని పేర్కొన్నారు. షీ టీమ్స్ ఆరేళ్లు పూర్తి చేసుకొని దిగ్విజయంగా ఏడో సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా అక్టోబర్ 24వ తేదీన మీడియాతో మాట్లాడారు. ఈ ఆరేళ్లలో రాష్ట్రంలో నమోదైన ఎన్నో కీలక కేసులను పరిష్కరిస్తూ షీ టీమ్స్ అద్భుతమైన ఫలితాలు సాధించిందని గుర్తుచేశారు. 2014 అక్టోబర్ నుంచి 2020 అక్టోబర్ వరకు మహిళలకు సంబంధించి మొత్తం 30,187 కేసులు షీ టీమ్స్ వద్దకు రాగా వీటిలో 3,144 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసిందని వివరించారు.
‘జగనన్న-వైఎస్సార్ బడుగు వికాసం’ పథకం ప్రారంభం
ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోవాలని, ఎవ్వరికీ తీసిపోని విధంగా పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పూర్తి ప్రోత్సాహం ఇచ్చేందుకు 2020-23 ప్రత్యేక పారిశ్రామిక విధానం రూపొందించామని చెప్పారు. ఇందులో భాగంగా అక్టోబర్ 26వ తేదీన ఆయన ‘జగనన్న-వైఎస్సార్ బడుగు వికాసం’ పథకాన్ని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలు ఎవరైనా పరిశ్రమ పెట్టాలనుకుంటే.. ఏం చేయాలి? ఎవరిని కలవాలి? వంటి వాటిపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎప్పుడూ, ఎక్కడా జరగని విధంగా కోటి రూపాయల వరకు ప్రోత్సాహక మొత్తం (ఇన్సెంటివ్) ఇస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసేందుకు కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకు వస్తున్నామన్నారు. ప్రత్యేకంగా ఫెసిలిటేషన్ సెల్స్ (సదుపాయాల కల్పన) కూడా ఏర్పాటు చేశామని, వారిలో నైపుణ్యం పెంచేలా స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు రూపొందించామని వివరించారు. ఏపీఐఐసీ భూ కేటాయింపుల్లో 16.2 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు కచ్చితంగా ఇవ్వాలని నిర్ణయించామని, ఇది ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ఊతం ఇస్తుందన్నారు. ఈ చొరవ వల్ల ఎస్సీ, ఎస్టీల నుంచి కొత్త పారిశ్రామిక వేత్తలు తయారు కావాలని పిలుపునిచ్చారు.
ఈ పథకంలోని కీలక అంశాలు...
- 2020లో రీస్టార్ట్ ఒన్ కింద ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రూ.278 కోట్లను ఇన్సెంటివ్ రూపంలో ప్రభుత్వం చెల్లించింది. గతంలో ఏటా సగటున ఎస్సీలకు రూ.53 కోట్లు, ఎస్టీలకు రూ.15 కోట్లు మాత్రమే ఇచ్చేవారు.
- ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కుల్లో 16.2 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు భూములు కేటాయిస్తారు. 25 శాతం చెల్లిస్తే భూములను అప్పగిస్తారు. మిగిలిన 75 శాతాన్ని 8 శాతం నామమాత్రపు వడ్డీతో 8 ఏళ్లలో చెల్లించవచ్చు.
- 100 శాతం స్టాంపు డ్యూటీని, ట్రాన్స్ ఫర్ డ్యూటీని రీయింబర్స్ చేస్తారు. భూముల లీజు, షెడ్డు, భవనాలు, తనఖా తదితరాలపై 100 శాతం స్టాంపు డ్యూటీని రీయింబర్స్ చేస్తారు.
- ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్ పార్కుల్లో ఎంఎస్‌ఈల కోసం భూములను 50 శాతం రిబేటుపై (రూ.20 లక్షల వరకు) ఇస్తారు.
- ల్యాండ్ కన్వెర్షన్ చార్జీల్లో 25 శాతం వరకు, గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఎంఎస్‌ఈలకు రిబేటు ఇస్తారు.
- ఉత్పత్తి ప్రారంభమైన నాటి నుంచి తదుపరి 5 ఏళ్ల వరకు వాడుకున్న కరెంట్‌లో యూనిట్‌కు రూ.1.50 రీయింబర్స్ చేస్తారు.
- ఫిక్స్‌డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌లో 45 శాతం వరకు, గరిష్టంగా కోటి రూపాయల వరకు ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీ లభిస్తుంది.
- సర్వీసులు, రవాణా రంగాల్లో క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌లో 45 శాతం వరకు, గరిష్టంగా రూ.75 లక్షల వరకు ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీ లభిస్తుంది.
- ఉత్పత్తి ప్రారంభించిన ఎంఎస్‌ఈలకు ఐదేళ్లపాటు 3 శాతం నుంచి 9 శాతం వరకు వడ్డీ రాయితీ లభిస్తుంది. నెట్ ఎస్‌జీఎస్‌టీలో 100 శాతం రీయింబర్స్ లభిస్తుంది. మధ్యతరహా పరిశ్రమలకు 75 శాతం, భారీ పరిశ్రమలకు 50 శాతం రీయింబర్స్‌మెంట్ అందుతుంది.
- క్వాలిటీ సర్టిఫికేషన్, పేటెంట్ రిజిస్ట్రేషన్‌లకు అయ్యే ఖర్చులో ఎంఎస్‌ఈలకు రూ.3 లక్షల వరకు ప్రభుత్వం భరిస్తుంది. కొత్తగా మైక్రో యూనిట్లు ఏర్పాటు చేయదలచుకునే వారికి సీడ్ కేపిటల్ అసిస్టెన్స్ కింద మెషినరీ ఖర్చులో 25 శాతంఅందుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీలో జగనన్న-వైఎస్సార్ బడుగు వికాసం’ పథకం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 26, 2020
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పూర్తి ప్రోత్సాహం ఇచ్చేందుకు
రెండోవిడత వైఎస్సార్ రైతు భరోసా ప్రారంభం
రైతు ఆనందమే రాష్ట్ర సంతోషంగా భావించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్‌ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్టోబర్ 27వ తేదీన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి రైతు ఖాతాలకు రూ. 1,114.87 కోట్ల నగదును బదిలీ చేశారు. రబీ సీజన్‌కు గాను భూ యజమానులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న (ఆర్‌ఓఎఫ్‌ఆర్) రైతులకూ రైతు భరోసా అందుతుంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది నుంచే ఈ పథకం అమల్లోకి వచ్చింది. 2019 అక్టోబర్ 15న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500లను అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి అందించనుంది.
ఈసారి 50,47,383 మందికి భరోసా..
వాస్తవ సాగుదార్లందరికీ రైతు భరోసా అందించాలన్న లక్ష్యంతో ఎప్పటికప్పుడు వచ్చిన వినతులను పరిష్కరిస్తుండడంతో ఈసారి లబ్ధిదారుల సంఖ్య 50,47,383కి చేరింది. 2019 అక్టోబర్‌లో లబ్ధిదారుల సంఖ్య 46,69,375 మంది మాత్రమే కాగా 2020 మే నెలలో ఖరీఫ్ సమయంలో ఈ సంఖ్య 49,45,470కి చేరింది. ఇప్పుడు రబీలో ఏకంగా 50,47,383కి చేరింది. అంటే ఖరీఫ్‌తో పోల్చుకుంటే మరో 1,01,913 మంది కొత్తగా సాయం పొందినారు. 50,47,383 మంది లబ్ధిదారులకు గాను రూ.1,114.87 కోట్ల సాయం అందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ రెండోవిడత వైఎస్సార్ రైతు భరోసా ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 27, 2020
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : రబీలో రైతులకు పంట సాయంగా
ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1,750 కోట్ల కైనెటిక్ గ్రీన్ పెట్టుబడులు
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. ఎలక్ట్రిక్ గోల్ఫ్ కార్టులతో పాటు బ్యాటరీ స్వాపింగ్ యూనిట్ ఏర్పాటు కోసం రూ. 1,750 కోట్లు పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. ఎలక్ట్రిక్ కార్గో 3 వీలర్ సఫర్ జంబో వాహనాన్ని అక్టోబర్ 27న ఆవిష్కరించిన సందర్భంగా సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈవో సులజ్జా ఫిరోదియా మోత్వానీ ఈ విషయాలు వెల్లడించారు. భారత్‌లో ప్రీమియం సెగ్మెంట్ గోల్ఫ్‌కార్టులు, ఇతరత్రా ఎలక్ట్రిక్ ఆఫ్–రోడ్ వాహనాల డిజైన్, తయారీకి సంబంధించి టొనినో లంబోర్గినితో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు కైనెటిక్ గ్రూప్ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది.
హైదరాబాద్‌లో రూ. 700 కోట్ల ఫార్మా పెట్టుబడులు
ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో పేరొం దిన రెండు ప్రముఖ కంపెనీలు హైదరాబాద్‌లో రూ. 700 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు అక్టోబర్ 27న ప్రకటించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్ ఫార్మాస్యూటి కల్ ఫార్ములేషన్ కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా రాష్ట్రంలో మరో రూ. 400 కోట్లతో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపులారస్ ల్యాబ్స్ కూడా జీనోమ్ వ్యాలీలో రూ. 300 కోట్లతో దశల వారీగా ఫార్ములేషన్ ఫెసిలిటీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే లారస్ ల్యాబ్ జీనోమ్ వ్యాలీలోనిఐకేపీ నాలెడ్జ్ పార్కులో పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పింది.
క్విక్ రివ్వూ :
ఏమిటి : రూ. 1,750 కోట్లు పెట్టుబడులు
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : కైనెటిక్ గ్రీన్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు :ఎలక్ట్రిక్ గోల్ఫ్ కార్టులతో పాటు బ్యాటరీ స్వాపింగ్ యూనిట్ ఏర్పాటు కోసం
2019 నాటికి భారతీయుల సగటు ఆయుర్దాయం ఎన్ని సంవత్సరాలు?
భారతీయుల ఆయుర్దాయం పదేళ్లకుపైగా పెరిగిందని లాన్సెట్ అధ్యయనంలో వెల్లడైంది. 1990లో 59.6 సంవత్సరాలుగా ఉన్న ఆయుర్దాయం 2019 నాటికి 70.8 ఏళ్లకు పెరిగినట్టుగా లాన్సెట్ జర్నల్ ప్రచురించిన అధ్యయనం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో మనుషుల ప్రాణాలు తీసే 286 వ్యాధులు ఎలా ప్రబలుతున్నాయో, మరో 369 వ్యాధుల తీవ్రత ఎలా ఉందో అంచనా వేసి సగటు ఆయుః ప్రమాణాలను అధ్యయనకారులు లెక్కించారు. ఈ అధ్యయనంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, గాంధీనగర్‌కి చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ గోలి పాల్గొన్నారు.
లాన్సెట్ అధ్యయనం-ప్రధానాంశాలు
- 1990లో 59.6 సంవత్సరాలుగా ఉన్న భారతీయుల సగటు ఆయుర్దాయం 2019 నాటికి 70.8 ఏళ్లకి పెరిగింది.
- 1990 నుంచి 2019 మధ్య భారతీయుల ఆయుఃప్రమాణాలు పెరిగినప్పటికీ రాష్ట్రానికీ, రాష్ట్రానికీ మధ్య తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయి.
- కేరళలో సగటు ఆయుర్దాయం అత్యధికంగా 77.3 సంవత్సరాలు కాగా, ఉత్తరప్రదేశ్‌లో అత్యల్పంగా 66.9 ఏళ్లుగా ఉంది.
- భారత్‌లోని వ్యాధుల్లో 58 శాతం ఒకరి నుంచి మరొకరికి సంక్రమించని వ్యాధులే (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) ప్రబలుతున్నాయి.
- గత 30 ఏళ్లలో గుండె, ఊపిరితిత్తులు, మధుమేహం, కండరాలకు సంబంధించిన వ్యాధులు అధికమయ్యాయి.
- 2019లో వాయుకాలుష్యం (16.7 లక్షల మృతులు), అధిక రక్తపోటు (14.7 లక్షలు), పొగాకు వినియోగం (12.3 లక్షలు), పౌష్టికాహార లోపం (11.8 లక్షలు) మధుమేహం (11.8 లక్షలు) కారణంగా మరణాలు ఎక్కువగా సంభవించాయి.
- దక్షిణాది రాష్ట్రాల్లో అధిక రక్త పోటు కారణంగా 10-20 శాతం మంది అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు.
ఏపీలో 61 రహదారి ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.15,592 కోట్ల విలువైన 1,411 కి.మీ.కు సంబంధించి మొత్తం 61 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అక్టోబర్ 16న ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి గడ్కరీ, ఢిల్లీ నుంచి కేంద్ర జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి, రిటైర్డ్ జనరల్ వీకే సింగ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు.
రూ.502 కోట్ల వ్యయంతో కనకదుర్గ ఫ్లైఓవర్...
విజయవాడలో కొత్తగా నిర్మించిన బెంజి సర్కిల్ ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్‌లు అందుబాటులోకి వచ్చాయి. 46 ఒంటి స్తంభాలపై 2.6 కిలోమీటర్ల మేర ఆరు వరుసలు, ఆరు మలుపులతో రూ.502 కోట్ల వ్యయంతో కనకదుర్గ ఫ్లైఓవర్‌ను నిర్మించారు.
ప్రారంభమైన ప్రాజెక్టుల వివరాలు
శంకుస్థాపన జరిగిన ప్రాజెక్టుల వివరాలు
ప్రాజెక్టుల ప్రయోజనాలు
హస్తకళల మార్కెటింగ్ కోసం ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన వెబ్ పోర్టల్?
చేనేత, హస్త కళల ఉత్పత్తులకు మరింతగా మార్కెటింగ్ కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన ‘ఆప్కో ఆన్‌లైన్ స్టోర్, లేపాక్షి వెబ్ స్టోర్’లు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 20న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వీటిని ప్రారంభించారు. అనంతరం సీఎం ప్రసంగిస్తూ... హస్తకళల ద్వారా జీవనోపాధి పొందుతున్న వారికి కూడా ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు.
ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్...
- రాష్ట్రంలో ప్రాచుర్యం పొందిన కళలు, వృత్తులకు ఆప్కో ఆన్‌లైన్ స్టోర్, లేపాక్షి వెబ్ స్టోర్ ద్వారా జాతీయ, అంతర్జాతీయంగా మరింతగా మార్కెటింగ్ సదుపాయం లభిస్తుంది. ఇది ఆయా వృత్తుల కళాకారులకే కాకుండా, వారి ఉత్పత్తులకు కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించేలా చేస్తుంది.
- అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్ర, అజియో, పేటీఎం, గో కోప్, మిర్రా వంటి ఈ-ప్లాట్‌ఫామ్‌లలో కూడా చేనేత, హస్త కళల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. ఆ మేరకు ఆయా సంస్థలతో లేపాక్షి, ఆప్కో ఒప్పందాలు చేసుకున్నాయి.
ఆప్కో స్టోర్ ద్వారా...
ఆప్కో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఆర్డర్ చేసి మంగళగిరి, వెంకటగిరి, మాధవరం, బందరు, రాజమండ్రి, ఉప్పాడ, వెంకటగిరి, ధర్మవరం, చీరాల తదితర చేనేత, పట్టు, కాటన్ చీరలు, వస్త్రాలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్‌షీట్లు పొందవచ్చు.
లేపాక్షి స్టోర్ ద్వారా...
లేపాక్షి వెబ్ స్టోర్ ద్వారా కొండపల్లి, ఏటికొప్పాక, పెడన, చిత్తూరు కలంకారీ ఉత్పత్తులు, దుర్గి రాతి శిల్పాలు, బుడితిలో తయారయ్యే ఇత్తడి వస్తువులు, శ్రీకాకుళం ఆదివాసీ పెయింటింగ్‌లు, ఉదయగిరిలో చెక్కతో తయారయ్యే కళాఖండాలు, బొబ్బిలి వీణ, ధర్మవరం తోలు బొమ్మలు పొందవచ్చు.
సీఎం ప్రసంగం...
- ఒక వైపు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌కు అవకాశం, మరోవైపు ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయం వల్ల హస్త కళాకారులకు మంచి జరగాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష. ఇప్పుడు ప్రకటించిన రూ.10 వేల సాయాన్ని 2021, ఫిబ్రవరి తర్వాత ఇస్తాం.
- జిల్లాల్లో ప్రసిద్ధి పొందిన హస్త కళల ఉత్పత్తులు ఉంటే, వాటిని కూడా ఈ వెబ్ స్టోర్స్‌లోకి తీసుకురావాలి.
- జీవితంలో ఎన్నో రకాలుగా సేవలందిస్తున్న వివిధ వృత్తుల వారికి గౌరవం ఇస్తూ.. దేశ చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, పదవులు ఇచ్చాం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆప్కో ఆన్‌లైన్ స్టోర్, లేపాక్షి వెబ్ స్టోర్‌లు ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 20
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు : చేనేత, హస్త కళల ఉత్పత్తులకు మరింతగా మార్కెటింగ్ కల్పించేందుకు
వైఎస్సార్ బీమా ద్వారా ఎన్ని కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది?
నిరుపేద కుటుంబాలకు జీవన భద్రత కల్పిస్తూ కష్టకాలంలో ఆదుకునేలా మరో పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బియ్యం కార్డులున్న 1.41 కోట్ల కుటుంబాలను ఆపత్కాలంలో ఆదుకునేందుకు ‘వైఎస్సార్ బీమా’ పథకాన్ని తెచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్ 21న తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్ నొక్కి ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం బ్యాంకర్లు, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి వేర్వేరుగా మొత్తం రూ.510 కోట్ల చెక్కులు అందజేశారు. పలువురు లబ్ధిదారులకు బీమా కార్డులు అందజేశారు. సంపాదించే వ్యక్తిని కోల్పోతే ఏ ఒక్క నిరుపేద కుటుంబం ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ పథకం అమలు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
బీమా ప్రయోజనాలు
- బియ్యం కార్డులు కలిగిన కుటుంబాలు వైఎస్సార్ బీమా పథకానికి అర్హులు. 18 నుంచి 70 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండి కుటుంబాన్ని పోషించే వారికి ఈ పథకం వర్తిస్తుంది.
- ఈ పథకంతో 18-50 ఏళ్ల మధ్య ఉన్న లబ్ధిదారులు సహజంగా మరణిస్తే, వారి కుటుంబానికి రూ.2 లక్షల సహాయం అందుతుంది.
- 18-50 ఏళ్ల మధ్య ఉన్న వారు ప్రమాదవశాత్తు మరణించినా, లేక శాశ్వత అంగ వైకల్యానికి గురైనా రూ.5 లక్షల పరిహారం ఇస్తారు.
- 51-70 ఏళ్ల మధ్య ఉన్న వారు ప్రమాదవశాత్తు చనిపోయినా, లేక శాశ్వత అంగ వైకల్యానికి గురైనా రూ.3 లక్షల సహాయం చేస్తారు.
- 18-70 ఏళ్ల మధ్య ఉన్న వారికి పాక్షిక శాశ్వత అంగ వైకల్యం సంభవిస్తే రూ.1.5 లక్షల పరిహారం ఇస్తారు.
ప్రీమియాన్ని భరించనున్న ప్రభుత్వం..
వైఎస్సార్ బీమా పథకం పూర్తి ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ మేరకు రూ.510 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. ఈ పథకం ద్వారా 1.41 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైఎస్సార్ బీమా పథకం ప్రారంభం
ఎప్పుడు : 21
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : సీఎం క్యాంపు కార్యాలయం, గుంటూరు జిల్లా
ఎందుకు : నిరుపేద కుటుంబాలకు జీవన భద్రత కల్పిస్తూ కష్టకాలంలో ఆదుకునేందుకు
ఆంధ్రప్రదేశ్‌లో తొలి పెలైట్ శిక్షణా కేంద్రం ఎక్కడ ఏర్పాటు కానుంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి పెలైట్ శిక్షణా కేంద్రం కర్నూలులో ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ఏవియేషన్ సలహాదారు, ఏపీ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) ఎండీ వి.ఎన్.భరత్‌రెడ్డి అక్టోబర్ 8న తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్టులకు దగ్గరగా ఉండటం, కర్నూలు ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రానుండటంతో ఇక్కడ పెలైట్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.
రూ.160 కోట్లతో...
సుమారు 970 ఎకరాల్లో రూ.160 కోట్లతో ఏపీఏడీసీఎల్ కర్నూలు ఎయిర్‌పోర్టును నిర్మించింది. 2 వేల మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో రన్‌వేను అభివృద్ధి చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌లో తొలి పెలైట్ శిక్షణా కేంద్రం ఏర్పాటు
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : ఏపీ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్)
ఎక్కడ : కర్నూలు, కర్నూలు జిల్లా
శ్రీ సిటీలో జ్ఞాన్ సర్కిల్ వెంచర్స్ ప్రారంభించిన కేంద్ర మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా శ్రీ సిటీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ట్రిపుల్ ఐటీ)కి చెందిన బిజినెస్ ఇంక్యుబేటర్ జ్ఞాన్ సర్కిల్ వెంచర్స్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్టోబర్ 8న ప్రారంభించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఆర్థిక సహాయంతో ఇది ఏర్పాటైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఆవిష్కరణలతోనే దేశం పురోగతి వైపు పయనిస్తుందని పేర్కొన్నారు. జ్ఞాన్ సర్కిల్ వెంచర్స్.. పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, మార్గదర్శకత్వం ద్వారా ఆవిష్కరణ, స్టార్టప్‌లకు ఊతమిస్తుందని వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : శ్రీ సిటీలోని ట్రిపుల్ ఐటీ బిజినెస్ ఇంక్యుబేటర్ జ్ఞాన్ సర్కిల్ వెంచర్స్ ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్
ఎక్కడ : శ్రీ సిటీ, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ఏ జిల్లా నుంచి సీఎం ప్రారంభించారు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమం ప్రారంభమైంది. అక్టోబర్ 8న కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని పునాదిపాడు జడ్పీ హైస్కూలులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యా కానుక కిట్‌లను విద్యార్థులకు సీఎం అందజేశారు. తరగతి గదిలో కాసేపు విద్యార్థులతో గడిపారు. విద్యా కానుక ద్వారా ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ బడుల్లో ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక స్కూల్ కిట్‌లు అందజేయనున్నారు.
విద్యా కానుక-ప్రధానాంశాలు
- పాఠశాలల్లో పిల్లల నమోదును గణనీయంగా పెంచడంతో పాటు, మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
- విద్యా కానుక ద్వారా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 42,34,322 మంది విద్యార్థిని, విద్యార్థులకు దాదాపు రూ.650 కోట్ల ఖర్చుతో స్కూల్ కిట్లు పంపిణీ చేస్తారు.
- విద్యార్థులకు వారి విద్యాభ్యాసానికి అవసరమైన ఏడు రకాల వస్తువులను ఈ కిట్ల రూపంలో అందించనున్నారు.
- 3 జతల యూనిఫారం వస్త్రం, కుట్టు కూలి సొమ్ము, బ్యాగు, టెక్ట్స్ పుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్కుబుక్‌లు, బెల్టు, సాక్సులు, బూట్లు కిట్‌గా అందిస్తారు.
- స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలు యూనిఫామ్‌లు కుట్టించుకునే విధంగా వారికి ముందుగానే ఈ కిట్లు అందజేస్తున్నారు.
- యూనిఫామ్ కుట్టు కూలీ మూడు జతలకి రూ.120 చొప్పున తల్లుల అకౌంట్‌కే నేరుగా జమ చేస్తారు.
- ప్రతి బడిలో ఈ కార్యక్రమం అక్టోబర్ 8వ తేదీ నుంచి 3 రోజుల పాటు కొనసాగుతుంది.
ముఖ్యమంత్రి ప్రసంగం...
విద్యా కానుక ప్రారంభం సందర్భంగా జరిగిన సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు.
ఆ వివరాలు..
- రాష్ట్రంలోని పేద పిల్లల చదువుల బాధ్యతంతా మేనమామగా తనదే, తల్లిదండ్రులపై నయా పైసా భారం పడకుండా వారికి మంచి చదువులు అందించేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.
- ప్రతి పిల్లాడు గొప్పగా చదివితేనే వారి తలరాతలు మారి పేదరికం నుంచి బయట పడతారు. ఇందుకోసం అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, సంపూర్ణ పోషణ, మనబడి నాడు-నేడు, గోరుముద్ద, ఇంగ్లిష్ మీడియం, విద్యాదీవెన, వసతి దీవెన, విద్యాకానుక, కంటి వెలుగు తదితర పథకాలు, కార్యక్రమాలతో చదువుల చరిత్రను పూర్తిగా మారుస్తున్నాం.
- అంగన్‌వాడీ కేంద్రాలను వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నాం.
- పేద పిల్లలు పెద్దవారి పిల్లలతో పోటీపడేలా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం పెడుతున్నాం.
- మార్కెట్లో ఇంగ్లిష్ చదువులు కాస్ట్‌లీ సరుకుగా మారిన పరిస్థితుల్లో తల్లిదండ్రుల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులు పిల్లల చదువులను నిర్ణయిస్తున్నాయి. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని అంగన్‌వాడీ నుంచి ప్రారంభించి ఉన్నత విద్య వరకు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం.
- ‘నోబెల్ బహుమతి పొందిన మలాలా యూసఫ్ జాయ్.. వన్ చైల్డ్, వన్ టీచర్, వన్ పెన్, వన్ బుక్ కెన్ ఛేంజ్ ద వరల్డ్’ అని అన్నారు.
- ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూజ్ టూ ఛేంజ్ ద వరల్డ్’ అని నెల్సన్ మండేలా చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జగనన్న విద్యా కానుక కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : పునాదిపాడు జడ్పీ హైస్కూలు, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా
ఎందుకు : ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదును గణనీయంగా పెంచడంతో పాటు, మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా
రాజస్థాన్ నియామ్‌తో ఏపీ మార్కెటింగ్ శాఖ ఎంవోయూ
రైతులకు మరింత మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో తమ సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా రాజస్థాన్‌కు చెందిన నియామ్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్)తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం... ఏపీ మార్కెటింగ్ శాఖలోని 600 మంది అధికారులు, సిబ్బందికి నియామ్ శిక్షణ ఇవ్వనుంది. మార్కెటింగ్, సహకార శాఖల్లోని సిబ్బంది, అధికారులకు, వ్యవసాయ అనుబంధ రంగాల్లోని వ్యాపారవేత్తలకు శిక్షణ ఇవ్వడంలో నియామ్ సంస్థ ముఖ్య భూమిక పోషిస్తోంది. ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గుర్తించిన రెండు సంవత్సరాల పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులనూ అందిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాజస్థాన్‌కు చెందిన నియామ్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్)తో ఎంవోయూ
ఎప్పుడు : అక్టోబర్ 10
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ
ఎందుకు : రైతులకు మరింత మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో తమ సిబ్బందికి శిక్షణ ఇప్పించేందుకు
తెలంగాణ ప్రభుత్వంతో ఇంటెల్ సంస్థ ఒప్పందం
టెక్నాలజీ సంస్థ ఇంటెల్ తాజాగా ఐఎన్‌ఏఐ పేరుతో హైదరాబాద్‌లో అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిసర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఐఐఐటీ-హైదరాబాద్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2020 వర్చువల్ సమ్మిట్, ఏఐ ఫర్ యూత్ సింపోజియం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కేంద్రాన్ని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అక్టోబర్ 12న ఆవిష్కరించారు.
ఐఎన్‌ఏఐ కేంద్రం...
ఆరోగ్యం, స్మార్ట్ మొబిలిటీ వంటి కీలక రంగాల్లో సవాళ్లను పరిష్కరించడంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను మెరుగుపరిచేందుకు ఈ కేంద్రం దృష్టిసారిస్తుంది. స్మార్ట్ మొబిలిటీకి సంబంధించి రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించడం కోసం రోడ్డు భద్రత విషయంలో ఏఐని వినియోగించి పరిశోధన కొనసాగిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఎన్‌ఏఐ పేరుతో అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిసర్చ్ సెంటర్‌ను ఏర్పాటు
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : టెక్నాలజీ సంస్థ ఇంటెల్
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : ఆరోగ్యం, స్మార్ట్ మొబిలిటీ వంటి రంగాల్లో ఏఐ సాంకేతికత వినియోగంపై పరిశోధనలు చేసేందుకు
నాలుగు చట్ట సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం
నాలుగు చట్ట సవరణ బిల్లులకు తెలంగాణ శాసనసభ అక్టోబర్ 13న ఆమోదం తెలిపింది. సభ ఆమోదం పొందిన వాటిలో భారతీయ స్టాంప్ (తెలంగాణ సవరణ) బిల్లు- 2020, తెలంగాణ వ్యవసాయ భూమి (వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్పు) (సవరణ) బిల్లు- 2020లు ఉన్నాయి. అలాగే హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (సవరణ) బిల్లు- 2020, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (తెలంగాణ) సవరణ బిల్లు- 2020లను కూడా సభ ఆమోదించింది. నాలుగు బిల్లులను సభ ఆమోదించినట్లు ప్రకటించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు.
ఏపీ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూసర్వేకు రూపొందించిన ప్రత్యేక యాప్ పేరు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూసర్వేకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక మొబైల్ యాప్.. ‘ఐటీడీఏ ల్యాండ్ సర్వే’ను రూపొందించింది. ఇప్పటివరకు రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖలు, అటవీ విభాగం కలిసి ఆఫ్‌లైన్‌లో మాత్రమే భూసర్వే చేసేవి. ఇకపై ఆన్‌లైన్‌లోనూ అన్ని వివరాలు నమోదు చేసే విధంగా ఈ యాప్‌ను తీర్చిదిద్దారు.
ఇటీవల ప్రభుత్వం లక్షన్నర మంది గిరిజన రైతులకు 3.50 లక్షల ఎకరాలకు సంబంధించి రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ (ఆర్‌వోఎఫ్‌ఆర్) పట్టాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అవకాశం కల్పిస్తూ గిరిజన సంక్షేమ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈ యాప్‌కు రూపకల్పన చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐటీడీఏ ల్యాండ్ సర్వే పేరుతో ప్రత్యేక యాప్ రూపకల్పన
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ
ఎందుకు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూసర్వే కోసం
ఇటీవల పునఃప్రారంభమైన బాపు మ్యూజియం ఏ జిల్లాలో ఉంది?
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా విజయవాడలో 10 ఏళ్లుగా మూతపడి ఉన్న బాపు మ్యూజియం పునఃప్రారంభమైంది. రూ.8 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ మ్యూజియాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్ 1న ప్రారంభించారు. మ్యూజియం వద్ద భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహాన్ని సీఎం పునః ప్రతిష్టించారు. అనంతరం మ్యూజియంను పరిశీలించిన ఆయన సందర్శకుల పుస్తకంలో 'Impressive Collection of Artifacts' (కళాఖండాల అద్భుతమైన సేకరణ) అని రాశారు.
దేశంలోనే మొదటిసారిగా...
మ్యూజియం ప్రారంభం సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ‘దేశంలోనే మొదటిసారిగా మ్యూజియాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రదర్శిత వస్తువులు ఒక యాప్ ద్వారా తమ చరిత్రను తామే చెప్పుకునే విధంగా మ్యూజియాన్ని రూపుదిద్దడం భావితరాలకు ఎంతో విజ్ఞానాన్ని అందిస్తుంది’ అని అన్నారు. ఆదిమ మానవ యుగం నుండి నేటి ఆధునిక యుగం వరకు 10 లక్షల ఏళ్ల చరిత్రకు సాక్షిగా నిలిచే అరుదైన 1,500 పురాతన వస్తువులకు సాంకేతికతను మేళవించి ప్రదర్శించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఒక్కో గ్యాలరీలో ఒక్కో ప్రత్యేకత..
తొలి చారిత్రక యుగ గ్యాలరీ: ఇందులో 10 లక్షల సంవత్సరాల నుంచి క్రీ.శ 2వ శతాబ్ధం వరకు ఉన్న పురాతన వస్తువులను ప్రదర్శనకు పెట్టారు. వీటిలో ఆదిమ మానవుడు ఉపయోగించిన రాతి పని ముట్లు, 12 కాళ్ల మట్టి శవ పేటిక, మట్టి బొమ్మలు కుండ పెంకులు సున్నపు ప్రతిమలు, పూసలు, ఫలకాలు అత్యంత అరుదైనవి.
బుద్ధ జైన గ్యాలరీ: ఇందులో బౌద్ధ, జైన రాతి, కాంస్య ప్రతిమలను ప్రదర్శనకు పెట్టారు.
హిందూ శిల్ప కళా గ్యాలరీ: దీనిలో వివిధ హిందూ దేవతల రాతి, కాంస్య ప్రతిమలు ఉంచారు.
నాణెములు-శాసనముల గ్యాలరీ: క్రీ.శ 6వ శతాబ్ధం నుంచి క్రీ.శ 20వ శతాబ్ధం వరకు ఉన్న వివిధ రాజ వంశముల సీసపు, రాగి, ఇత్తడి, వెండి, బంగారు నాణెములను ప్రదర్శనకు పెట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బాపు మ్యూజియం పునఃప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : విజయవాడ, కృష్ణా, ఆంధ్రప్రదేశ్
గిరిజనులకు అటవీ భూములపై హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంను ప్రారంభించిన రాష్ట్రం?
ఏళ్ల నాటి గిరిపుత్రుల కలలను నెరవేరుస్తూ ‘గిరిజనులకు అటవీ భూములపై హక్కు పత్రాల పంపిణీ’ కార్యక్రమంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. అక్టోబర్ 2న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కంప్యూటర్‌లో బటన్ నొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు గిరిజన మహిళలకు స్వయంగా క్యాంపు కార్యాలయంలో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలను అందజేశారు. మొత్తం 1.53 లక్షల గిరిజన కుటుంబాలకు 3.12 లక్షల ఎకరాలపై హక్కు పత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగించారు.
కురుపాంలో గిరిజన కళాశాల...
విశాఖ జిల్లా పాడేరులో వైద్య కళాశాల, ఐటీడీఏ పరిధిలో వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు, విజయనగరం జిల్లా కురుపాంలో ఏర్పాటు చేయనున్న గిరిజన ఇంజనీరింగ్ కళాశాలకు ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిలాఫలకాలనును ఆవిష్కరించారు.
సీఎం ప్రసంగం-ప్రధానాంశాలు
- రాష్ట్రంలో దాదాపు 6 శాతం ఉన్న గిరిజనుల ఆదాయం పెంచేందుకు, వారిని రైతులుగా చేసి మంచి జరిగేలా కార్యక్రమాలను చేపడుతున్నాం.
- దాదాపు 1.53 లక్షల గిరిజన కుటుంబాలకు 3.12 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తున్నాం.
- ఈ కార్యక్రమం నెల రోజులు కొనసాగుతుంది. హక్కుల పత్రాల పంపిణీ, దాంతో పాటు రైతు భరోసా సొమ్ము ఇస్తాం. గిరిజనులను రైతులుగా చేసి, వారికి మంచి జరిగేలా చేయాలన్నదే మా లక్ష్యం.
- గిరిజనులందరికీ కనీసం 2 ఎకరాల భూమి ఇవ్వాలన్న తాపత్రయంతో, ఆ అక్క చెల్లెమ్మలకు ఇవాళ్టి నుంచి పత్రాలు ఇస్తున్నాం.
- పట్టాలు పొందిన అక్క చెల్లెమ్మలకు భూమి అభివృద్ధి మాత్రమే కాకుండా, నీటి సదుపాయం, తోటల పెంపకానికి సహాయం చేస్తున్నాం.
- గిరిజనుల ఆదాయం పెంచడంతో పాటు, అడవుల్లో మరింత పచ్చదనం పెరిగేలా చర్యలు చేపడుతున్నాం.
- పాడేరులో దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో వైద్య కళాశాల నిర్మాణ పనులు మొదలు పెడుతున్నాం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గిరిజనులకు అటవీ భూములపై హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎందుకు : గిరిజనుల ఆదాయం పెంచేందుకు, వారిని రైతులుగా చేసేందుకు
ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన మనం-మన పరిశుభ్రత కార్యక్రమం ఉద్దేశం?
పట్టణాల్లో మాదిరిగానే గ్రామాల్లోనూ రోజూ ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణతోపాటు పూర్తి స్థాయి పారిశుధ్య నిర్వహణకు ఉద్దేశించిన ‘మనం- మన పరిశుభ్రత’ రెండో దశ కార్యక్రమాన్ని అక్టోబర్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రెండో దశలో భాగంగా 4,740 గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటికే మొదటి దశలో మండలానికి రెండేసి గ్రామాల చొప్పున 1,320 గ్రామాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఉమ్మడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
ప్రధాన లక్ష్యాలు...
కేంద్రం నిర్దేశించిన ప్రమాణాల మేరకు ‘మనం-మన పరిశుభ్రత’ను అమలు చేసే గ్రామాల్లో రోడ్లపై మురుగునీరు పారకుండా పూర్తి స్థాయిలో డ్రైనేజీని మెరుగుపరచడం, గ్రామంలో అందరూ మరుగుదొడ్లను వినియోగించేలా చేయడం, కనీసం 80 శాతం గ్రామాన్ని పూర్తి పరిశుభ్రంగా కనిపించేలా చూడటం ప్రధాన లక్ష్యాలు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మనం- మన పరిశుభ్రత రెండో దశ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్
ఎక్కడ : రాష్ట్ర వ్యాప్తంగా 4,740 గ్రామాల్లో
2,543 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న ఫార్మా దిగ్గజం?
గ్రిన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లా మంబాపూర్-నల్లవెల్లిలో విస్తరించిన 2,543 ఎకరాల అటవీ ప్రాంతాన్ని ఫార్మా దిగ్గజం హెటిరో డ్రగ్‌స సంస్థ అక్టోబర్ 5న దత్తత తీసుకుంది. ఇందులో భాగంగా రూ.5 కోట్ల చెక్కును హెటిరో చైర్మన్ డాక్టర్ పార్థసారథిరెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి అందించారు. ఈ సందర్భంగా మంబాపూర్ అటవీ ప్రాంతంలో తెలంగాణ అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పార్థసారథిరెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్ అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరించి, మొక్కలు నాటారు. మంబాపూర్ అడవిలో కొద్ది ఎకరాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కు అభివృద్ధి చేయనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2,543 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న ఫార్మా దిగ్గజం
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : హెటిరో డ్రగ్‌స సంస్థ
ఎక్కడ : మంబాపూర్-నల్లవెల్లి అటవీ ప్రాంతం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
వైఎస్సార్ జలకళ పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు
వైఎస్సార్ జలకళ పథకం అమలు తీరు తెన్నులను పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో ఐదుగురు అధికారుల కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ చైర్మన్‌గా, వాటర్‌షెడ్‌స డెరైక్టర్ కమిటీ మెంబర్ కన్వీనర్‌గా, ఏపీడీసీఎల్ డెరైక్టర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ, భూగర్భ జలశాఖ డెరైక్టర్లను కమిటీలో సభ్యులుగా నియమించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అక్టోబర్ 5న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకంలో భాగంగా రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు తవ్వించడంతో పాటు మోటార్లు, పంపుసెట్లు కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేయనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాష్ట్ర స్థాయిలో ఐదుగురు అధికారుల కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : వైఎస్సార్ జలకళ పథకం అమలు తీరు తెన్నులను పర్యవేక్షించేందుకు