Skip to main content

ఆగస్టు 2018 రాష్ట్రీయం

ఏపీలో క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు ఆమోదం
Current Affairs ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా దివిసీమలోని గుల్లలమోదలో క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు పర్యావరణశాఖ ఆగస్టు 24న ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనల సడలింపు నిర్ణయానికి అంగీకరించింది.
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తొలిదశగా రూ. 800 కోట్లు, రెండో దశలో రూ. 1,000 కోట్లను డీఆర్‌డీవో(రక్షణ పరిశోధన సంస్థ) ఖర్చుచేయనుంది. దేశంలో రెండో అతి పెద్ద క్షిపణి పరీక్ష కేంద్రంను దివిసీమలో ఏర్పాటు చేసేందుకు నాలుగు సంవత్సరాల క్రితం క్షిపణి పరీక్ష కేంద్రం(మిస్సైల్ లాంచింగ్ స్టేషన్) కు డీఆర్‌డీవో శంకుస్థాపన చేసింది. ఈ ప్రాజెక్టు కోసం 381.61 ఎకరాలు అటవీ భూములను కేటాయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 24
ఎవరు : పర్యావరణశాఖ
ఎక్కడ : గుల్లలమోద, దివిసీమ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్‌లో ది ఫ్యూచర్ ఆఫ్ ప్రొటీన్ సదస్సు
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)లో ‘ది ఫ్యూచర్ ఆఫ్ ప్రొటీన్’పేరుతో అంతర్జాతీయ సదస్సును ఆగస్టు 24న నిర్వహించారు. ఈ సదస్సులో కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ మాట్లాడుతూ... కృత్రిమ మాంసం తయారీ తక్షణ అవసరం అని అన్నారు. కృత్రిమ మాంసం ఉత్పత్తి వల్ల కోళ్లు, గొర్రెలు, మేకల వంటి పశువుల పెంపకం ఆపేస్తే మీథేన్ ఉద్గారాలు తగ్గి భూతాపం తగ్గుతుందని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘ది ఫ్యూచర్ ఆఫ్ ప్రొటీన్’ సదస్సు
ఎప్పుడు : ఆగస్టు 24
ఎక్కడ : సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్

కేరళలో వర్షాల కారణంగా 324 మంది మృత్యువాత
Current Affairs కేరళలో వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి వర్ష సంబంధ ఘటనల్లో మే 29 నుంచి 324 మంది మృత్యువాత పడినట్లు కేరళ ప్రభుత్వం ఆగస్టు 17న వెల్లడించింది. గత 9 రోజులుగా నిర్విరామంగా కురుస్తున్న వర్షాలకు వరదలు పోటేత్తడంతో 24 గంటల్లోనే (ఆగస్టు 17) 106 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం 14 జిల్లాలు ఉండగా అన్ని జిల్లాల్లోనూ మౌలిక వసతులు, పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిరాశ్రయులైన సుమారు 3 లక్షల మంది 2 వేల సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. త్రివిధ దళాలు, 51 జాతీయ విపత్తు ఉపశమన బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
ప్రస్తుతం...
ఇంతటి భారీస్థాయి వర్షాలు పడిన సంవత్సరం : 1924
వరద ముప్పులో ఉన్న జిల్లాలు : 13
రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలు : 9
గేట్లు ఎత్తేసిన డ్యాంలు: 27
కొండచరియలు విరిగిపడుతున్న ప్రాంతాలు: 211
ధ్వంసమైన రోడ్లు : 10,000 కి.మీ
దెబ్బతిన్న ఇళ్లు: సుమారు 20,000
ఆస్తినష్టం అంచనా : రూ.8316 కోట్లు
ఇడుక్కి డ్యాం నుంచి సెకన్‌కు విడుదలవుతోన్న నీరు : 15 లక్షల లీటర్లు
వరద సాయానికి కేటాయించిన ఓనం నిధులు: రూ. 30 కోట్లు
క్విక్ రివ్యూ:
ఏమిటి : వర్ష సంబంధ ఘటనల్లో 324 మంది మృత్యువాత
ఎప్పుడు : మే 29 నుంచి ఆగస్టు 17
ఎవరు : కేరళ ప్రభుత్వం
ఎక్కడ : కేరళ

పోలీస్ శిక్షణ మాన్యువల్‌ను ప్రారంభించిన ఏపీ డీజీపీ
‘బాధితులకు న్యాయం చేసే దిశగా పోలీస్ దర్యాప్తు శిక్షణ మాన్యువల్’ (ట్రైనింగ్ మాన్యువల్ ఫర్ పోలీస్ ఆన్ విక్టిమ్ సెంటర్డ్ ఇన్వెస్టిగేషన్) బుక్, మొబైల్ యాప్, పోలీస్ ట్రైనింగ్ వెబ్‌సైట్‌ను ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అమరావతిలో ఆగస్టు 21న ప్రారంభించారు. మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ పోలీస్, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ఈ మాన్యువల్‌ను రూపొందించాయి. మానవ అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రజ్వల సంస్థతో ఏపీ పోలీస్ శాఖ ఒప్పందం కుదుర్చుకుందని ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీతక్రిష్ణన్ ఈ సందర్భంగా చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బాధితులకు న్యాయం చేసే దిశగా పోలీస్ దర్యాప్తు శిక్షణ మాన్యువల్ ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు

తెలంగాణలో హైజీన్ కిట్లు పంపిణీ
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లోని 5,90,980 మంది బాలికలకు ఆగస్టు 24 నుంచి ‘హెల్త్ అండ్ హైజీన్ కిట్లు’ పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 21న వెల్లడించింది. ఆగస్టు 31 వరకు జిల్లా పరిషత్, ప్రభుత్వ, మోడల్ స్కూళ్లు, గురుకుల, కేజీబీవీ, పాఠశాలల్లోని బాలికలందరికీ ఈ కిట్లను అందించనున్నారు. హైజీన్ కిట్లలో బాలికలకు కావాల్సిన 14 రకాల వస్తువులు ఉంటాయి. ఏడాదికి సరిపడా వస్తువులను ఒకేసారి ఇచ్చేందుకు ఒక్కో విద్యార్థినిపై ఏటా రూ.1,600 ను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. మొత్తంగా రూ.100 కోట్ల వరకు వెచ్చించనుంది.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఆగస్టు 25 నుంచి ‘హరిత పాఠశాల-హరిత తెలంగాణ’ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బాలికలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్లు పంపిణీ
ఎప్పుడు : ఆగస్టు 24 నుంచి
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో

హైదరాబాద్ చుట్టూ ఆర్‌ఆర్‌ఆర్
Current Affairs హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)ను నిర్మించాలని ప్రభుత్వం ఆగస్టు 9న నిర్ణయించింది. ఈ మేరకు ఆర్‌ఆర్‌ఆర్‌ను ప్రపంచ స్థాయి ఎక్స్‌ప్రెస్ వేగా నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి-గజ్వేల్-చౌటుప్పల్-మాల్-కడ్తాల్-షాద్‌నగర్-చేవెళ్ల-కంది పట్టణాలను కలుపుతూ 500 అడుగుల వెడల్పు, 338 కిలో మీటర్ల పొడవుతో ఆర్‌ఆర్‌ఆర్‌ను నిర్మించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణం
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : హైదరాబాద్ ఆర్‌ఆర్ చుట్టూ

గిరిజనుల మాతృభాషలోనే పుస్తకాలు
తెలంగాణలో గిరిజనులు, ఆదివాసీ తెగల విద్యార్థులకు వారి మాతృ భాషలోనే బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాలను గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ హైదరాబాద్‌లో ఆగస్టు 9న ఆవిష్కరించారు. గిరిజన సంక్షేమశాఖ పరిధిలో ఉన్న 400కు పైగా ప్రాథమిక పాఠశాలల్లో ఈ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. పూర్వ ప్రాథమిక విద్యార్థుల కోసం రూపొందించిన ఈ పుస్తకాల్లో గిరిజనుల మాతృభాషను తెలుగు లిపిలో ముద్రించారు. గిరిజన విద్యార్థులకు వారి మాతృ భాషలోనే బోధిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గిరిజనుల మాతృభాషలోనే పుస్తకాలు
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణ
ఎందుకు : గిరిజనులు, ఆదివాసీ తెగల విద్యార్థులకు బోధించేందుకు

గుంటూరు జీజీహెచ్‌కి ఐఎస్‌వో’ గుర్తింపు
గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్) న్యూరాలజీ వైద్య విభాగానికి ఆగస్టు 10న ‘ఐఎస్‌ఓ 9001-2015’ గుర్తింపు లభించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఐఎస్‌ఓ గుర్తింపు పొందిన ఏకైక వైద్య విభాగంగా న్యూరాలజీ విభాగం నిలిచింది. జీజీహెచ్‌లో 2015లో ఏర్పాటు చేసి పక్షవాత రోగులకు కార్పోరేట్ వైద్యసేవలను ఉచితంగా అందజేస్తున్న ో్టక్ ్రయూనిట్‌కు 2017 జూలైలో జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. దేశ వ్యాప్తంగా ఇండియన్ ో్టక్ ్రక్లినికల్ ట్రయల్ నెట్‌వర్క్ (ఇన్‌స్ట్రక్ట్)లో 23 ఆస్పత్రులు ఉండగా అందులో ఒకటిగా గుంటూరు జీజీహెచ్ ో్టక్ ్రయూనిట్ చేరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగానికి ‘ఐఎస్‌వో’ గుర్తింపు
ఎప్పుడు : ఆగస్టు 10
ఎక్కడ : గుంటురు, ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తిలో జాతీయ న్యాయ సదస్సు
అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో రెండురోజులపాటు జాతీయ న్యాయ సదస్సును నిర్వహించారు. ఆగస్టు 12న ముగిసిన ఈ సదస్సులో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ తోపాటు సుప్రీం కోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏపీ మిశ్రా, రైల్వే క్లెయిమ్ ట్రిబ్యునల్ చైర్మన్ కె.కన్నన్, సత్యసాయి సేవా సంస్థల ఆలిండియా అధ్యక్షుడు నిమీష్‌పాండేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో విలువలే ప్రధానమని, వాటిని కాపాడాల్సిన బాధ్యత న్యాయవాదులు, న్యాయమూర్తులందరిపై ఉందని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ న్యాయ సదస్సు
ఎప్పుడు : ఆగస్టు 11-12
ఎక్కడ : పుట్టపర్తి, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్

కంటి వెలుగు పథకం ప్రారంభం
తెలంగాణలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు రూపొందించిన ‘కంటి వెలుగు పథకం’ ప్రారంభమైంది. ఈ మేరకు మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఆగస్టు 15న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. మొదటిరోజు దాదాపు లక్ష మందికి కంటి పరీక్షలను చేశారు.
ఈ పథకం ద్వారా 3.70 కోట్ల మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలను పంపిణీ చేయడంతోపాటు కాటరాక్ట్ ఆపరేషన్లు చేస్తారు. నిరంతరం కంటి సమస్యతో బాధపడే వారి కోసం భవిష్యత్‌లో 150 విజన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. పథకంలో భాగంగా అవసరమైన వారికి పంపిణీ చేసే కళ్లద్దాలను ఫ్రాన్స్ కు చెందిన ‘ఎస్సల్లార్’కంపెనీ సరఫరా చేయనుంది. 36 లక్షల కళ్లద్దాలు, రీడింగ్ గ్లాసులను ఎస్సల్లార్ అందిస్తుంది. కంటి వెలుగు కోసం రూ. 106 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ పథకం ప్రపంచంలో అతిపెద్ద సామూహిక కంటి పరీక్షల కార్యక్రమంగా నిలిచింది.
గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధి యూనిట్‌గా కంటి పరీక్షలు నిర్వహిస్తారు. 6 నెలలపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో మొత్తం 799 బృందాలు, 940 మంది మెడికల్ ఆఫీసర్లు, 1,000 మంది కంటి వైద్య నిపుణులు, 33 వేల మంది సిబ్బంది పాల్గొంటారు.
నేత్రదానం సర్టిఫికెట్లు ఆందజేత
మల్కాపూర్ గ్రామానికి చెందిన 756 మంది నేత్రదానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు నేత్రదానం చేస్తున్నట్లు అంగీకార పత్రాలను సీఎం కేసీఆర్‌కు అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కంటి వెలుగు పథకం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 15
ఎవరు : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు
ఎక్కడ : మల్కాపూర్ గ్రామం, తూప్రాన్ మండలం, మెదక్ జిల్లా, తెలంగాణ
ఎందుకు : కంటిసమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యసేవలు అందించేందుకు

రైతు బీమా పథకం ప్రారంభం
తెలంగాణలో రైతులకి రూ. 5 లక్షల జీవిత బీమా కల్పించే ఉద్దేశంతో రూపొందించిన ‘రైతు బీమా పథకం’ ప్రారంభమైంది. ఈ మేరకు గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆగస్టు 15న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వయసు గల రైతులు ఎటువంటి పరిస్థితుల్లోనైనా చనిపోతే ఆ వ్యక్తి కుటుంబానికి బీమా పరిహారాన్ని అందజేస్తారు. పథకం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి రైతుకు ఏటా రూ. 2,271 చొప్పున ప్రీమియంను ప్రభుత్వం చెల్లిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రైతు బీమా పథ కం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 15
ఎవరు : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు
ఎక్కడ : గోల్కొండ కోట, హైదరాబాద్
ఎందుకు : రైతులకు జీవిత బీమా అందించేందుకు

తెలంగాణలో బ్లాక్‌చైన్ డిస్ట్రిక్ట్
Current Affairs దేశంలోనే తొలిసారిగా బ్లాక్‌చైన్ డిస్ట్రిక్ట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఆగస్టు 3న జరిగిన ఇంటర్నేషనల్ బ్లాక్‌చైన్ కాంగ్రెస్‌లో టెక్నాలజీ కంపెనీ టెక్ మహీంద్రా, తెలంగాణ ఐటీ శాఖ ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలాగే నూక్లియస్ విజన్, ఎలెవన్01 ఫౌండేషన్ ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోనున్నాయి.
కాంగ్రెస్‌లో ప్రసంగించిన ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు విద్యార్హత పత్రాల జారీలో బ్లాక్‌చైన్ టెక్నాలజీని వినియోగించనున్నట్టు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేస్తామని చెప్పారు. విద్యార్హతల ధ్రువీకరణ పత్రాల సమాచారంతోపాటు పలు అంశాలకు సంబంధించిన సమాచారాన్ని బ్లాక్‌చైన్ ఆధారంగా భద్రపరుస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్లాక్‌చైన్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 3
ఎవరు : మహీంద్రా కంపెనీ, తెలంగాణ ఐటీ శాఖ
ఎక్కడ : హైదరాబాద్, తెలంగాణ

జయశంకర్ వర్శిటీకి ఆరోస్థానం
భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) ప్రకటించిన జాతీయ ర్యాంకుల్లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆరో స్థానంలో నిలిచింది. దీంతో వర్శిటీకి దక్షిణ భారతదేశంలో మొదటి స్థానం దక్కినట్టు వర్సిటీ వైస్ చాన్స్ లర్ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు ఆగస్టు 3న వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జయశంకర్ వర్శిటీకి ఆరోస్థానం
ఎప్పుడు : ఆగస్టు 3
ఎవరు : భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్)
ఎక్కడ : దేశవ్యాప్తంగా

తుమ్మలూరులో ప్లాస్టిక్ పార్కు

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో 110 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్కును ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ మంత్రి కె తారక రామారావు ఆగస్టు 3న తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నాలుగు రోజుల పాటు జరగనున్న ఐప్లెక్స్ (ఇంటర్నేషనల్ ప్లాస్టిక్స్ ఎక్స్‌పొజిషన్ )-2018ను ప్రారంభించిన కేటీఆర్ ఈ మేరకు వెల్లడించారు. ఈ ప్లాస్టిక్ పార్కును టాప్మా (తెలంగాణ అండ్ ఏపీ ప్లాస్టిక్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్) తో కలిసి ఏర్పాటు చేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 110 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్కును ఏర్పాటు
ఎప్పుడు : త్వరలో
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : తుమ్మలూరు, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ

మిషన్ కాకతీయ ఫలితాలపై ఇక్రిశాట్ అధ్యయనం
తెలంగాణలో చేపట్టిన ఐదు దశల ‘మిషన్ కాకతీయ’ ఫలితాలు, ప్రభావాలపై అంతర్జాతీయ సంస్థ ఇక్రిశాట్ అధ్యయనం చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇక్రిశాట్‌తో ఆగస్టు 3న ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో రెండేళ్ల పాటు మిషన్ కాకతీయ ఫలితాలు- వాటి ప్రభావంపై ఇక్రిశాట్ అధ్యయనం చేసి, ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది.
ప్రస్తుతం తెలంగాణ నీటిపారుదల శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఖమ్మంకు చెందిన నీహాల్‌ను నియమించిన విషయం తెలిసిందే. గతంలో ఇరిగేషన్ సమాచార వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిషన్ కాకతీయ ఫలితాలపై అధ్యయనం
ఎప్పుడు : ఆగస్టు 3
ఎవరు : ఇక్రిశాట్
ఎక్కడ : తెలంగాణ
ఎందుకు : ఐదు దశల ‘మిషన్ కాకతీయ’ ఫలితాలు, ప్రభావాలను తెలుసుకునేందుకు

ఉజ్వలకు తెలుగుతేజం అవార్డు
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ప్రముఖ కూచిపూడి నృత్యకళాకారిణి గుమ్మడి ఉజ్వల ‘తెలుగు తేజం’అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు శిఖరం సంస్థ వ్యవస్థాపకుడు జి.కృష్ణ ఆగస్టు 3న తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలుగుతేజం అవార్డు
ఎప్పుడు : ఆగస్టు 3
ఎవరు : గుమ్మడి ఉజ్వల (కూచిపూడి నృత్యకళాకారిణి)

119 బీసీ గురుకులాల ఏర్పాటు
తెలంగాణలో 2017-18 విద్యా సంవత్సరానికి కొత్తగా 119 బీసీ గురుకుల పాఠశాలల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నియోజకవర్గానికి ఒక గురుకులం చొప్పున ఏర్పాటు చేసేందుకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి.వెంకటేశం ఆగస్టు 4న ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో సగం బాలికల గురుకులాలు కాగా సగం బాలుర గురుకులాలున్నాయి. ఈ గురుకులాల్లోని ఉద్యోగాలను తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు ద్వారా చేపట్టనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 119 బీసీ గురుకులాల ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణ

జీహెచ్‌ఎంసీలో డీఆర్‌ఎఫ్
అనుకోని విపత్తులు, ఆకస్మిక ప్రమాదాలు జరిగినప్పుడు నష్టనివారణ చర్యలు చేపట్టేందుకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డీఆర్‌ఎఫ్)ను ఏర్పాటు చేశారు. డీఆర్‌ఎఫ్ విభాగాన్ని పరిశ్రమలు, ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఆగస్టు 4న ప్రారంభించారు. దీంతో డీఆర్‌ఎఫ్ ఏర్పాటైన తొలి నగరంగా హైదరాబాద్ నిలవగా ముంబై తరువాత ఈవీడీఎం ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ గుర్తింపు పొందింది.
అగ్ని ప్రమాదాలు, భవనాలు కూలినప్పుడు, వరదలు ఇతరత్రా ప్రమాద సమయాల్లో అన్ని శాఖలు సమన్వయంతో ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా డీఆర్‌ఎఫ్ పనిచేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డీఆర్‌ఎఫ్) ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : హైదరాబాద్ మహానగర పాలక సంస్థ
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : విపత్తులు సంభించినప్పుడు ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూసేందుకు

అనంతపురంలో సెంట్రల్ వర్శిటీ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ‘సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ ప్రారంభమైంది. జేఎన్‌టీయూ-అనంతపురంలోని ఇంక్యుబేషన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన వర్శిటీ తాత్కాలిక క్యాంపస్‌ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆగస్టు 5న ప్రారంభించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం జంతలూరు వద్ద 460 ఎకరాల్లో రూ.1,000 కోట్లతో శాశ్వత క్యాంపస్‌ను నిర్మించేందుకు కృషి చేస్తామని జవదేకర్ చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : ప్రకాశ్ జవదేకర్
ఎక్కడ : అనంతపురం, ఆంధ్రప్రదేశ్

హై ఎనర్జీ డెన్సిటి స్టోరేజ్ డివైజ్ ఆవిష్కరణ
ప్రపంచంలోనే తొలిసారిగా హై ఎనర్జీ డెన్సిటి స్టోరేజ్ డివైజ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఆగస్టు 7న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో వంద ఎకరాల్లో ఎనర్జీ స్టోరేజ్ పార్క్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఈ ఎనర్జీ స్టోరేజ్ డివైస్‌ను భారత్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ(బీఈఎస్‌టీ) ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసింది. వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా, టెలికం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఎనర్జీ స్టోరేజ్‌కి అత్యధిక ప్రాధాన్యత ఉంది.

తిరుపతిలో హోలీటెక్ కంపెనీ
తిరుపతిలో షియోమీ మొబైల్ విడిభాగాల తయారీ కంపెనీని నెలకొల్పనున్నారు. ఈ మేరకు హోలీటెక్ కంపెనీ సీఈఓ ఫ్లేమ్ చంద్, షియోమీ వైస్ ప్రెసిడెంట్ మనోజైన్‌లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఆగస్టు 6న ఒప్పందం కుదుర్చుకున్నారు.

లక్షా 20 వేల మంది అవయవదానం
ఆంధ్రప్రదే శ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా రాష్ట్రంలోని లక్షా 20 వేల మంది అవయవదానానికి ముందుకు వచ్చారు. ఈ మేరకు ఉండవల్లిలో అవయవదాతలు ఇచ్చిన అంగీకార పత్రాలను పట్టణ పేదరిక నిర్ములన సంస్థ (మెప్మా), ముఖ్యమంత్రి సమక్షంలో జీవన్ దాన్ సంస్థకు అందించింది. దీంతో ఈ సంఘటనను ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్‌లో నమోదు చేస్తున్నట్టు ఢిల్లీకి చెందిన ఆ సంస్థ ప్రతినిధి రాకేష్ వర్మ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హై ఎనర్జీ డెన్సిటి స్టోరేజ్ డివైజ్ ఆవిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : చంద్రబాబునాయుడు
ఎక్కడ : గ్రీవెన్స్ హాలు, ఉండవల్లి, గుంటూరు జిల్లా

హైదరాబాద్‌లో బెనెల్లి యూనిట్
ఇటాలియన్ సూపర్ బైక్స్ తయారీ సంస్థ బెనెల్లి హైదరాబాద్‌లో యూనిట్‌ను నెలకొల్పనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఆగస్టు 6న ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. బెనెల్లి భారత భాగస్వామి అయిన మహావీర్ గ్రూప్ కంపెనీ ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా హైదరాబాద్ సమీపంలోని పోచంపల్లి వద్ద 3 ఎకరాల్లో అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుంది. 7,000 యూనిట్ల వార్షిక సామర్థ్యంతో ఈ ప్లాంటును నిర్మించనున్నారు.
ఈ అసెంబ్లింగ్ ప్లాంటు నుంచి బెనెల్లి తొలి బైక్ 2018 అక్టోబరులో మార్కెట్‌లోకి రానుందని ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ఎండీ వికాస్ జబక్ వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బైక్స్ తయారీ సంస్థ బెనెల్లి నూతన యూనిట్ ఏర్పాటుకు ఒప్పందం
ఎప్పుడు : ఆగస్టు 6న
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం, బెనెల్లి
ఎక్కడ : హైదరాబాద్, తెలంగాణ

దూబగుంటలో కలాం ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పామూరు మండలం దూబగుంట వద్ద అబ్దుల్ కలాం ట్రిపుల్ ఐటీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగస్టు 7న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు లక్ష్యాన్ని ఛేదించి ఉన్నతస్థాయికి చేరుకుని రాష్ట్రాన్ని వినూత్న ఆవిష్కరణల కేంద్రంగా ఆవిష్కరింపజేయాలని చంద్రబాబు అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అబ్దుల్ కలాం ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఎక్కడ : దూబగుంట, పామూరు మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్‌లో ఐకియా స్టోర్ ప్రారంభం
స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ ఫర్నిచర్ సంస్థ ఐకియా భారత్‌లో తన మొదటి స్టోర్‌ను హైదరాబాద్‌లో ఆగస్టు 9న ప్రారంభించింది. ఈ స్టోర్‌ను హైదరాబాద్‌లోని హైటెక్ సిటీకి సమీపంలో రూ.1,000 కోట్ల వ్యయంతో 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఈ స్టోర్‌లో 7,500 రకాల ఫర్నిచర్, ఫర్నిషింగ్, వంటింటి సామగ్రిని విక్రయిస్తారు. అలాగే దేశంలో అతిపెద్దదైన ఒకేసారి వెయి్య మంది కూర్చునే సామర్థ్యం ఉన్న రెస్టారెంట్‌ను ఐకియా స్టోర్‌లో ఏర్పాటు చేశారు.
దేశంలో మొత్తం 40 నగరాల్లో ఐకియా ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలని ఆ సంస్థ నిర్ధేశించుకుంది. ఇందులో భాగంగా 2019లో ముంబై స్టోర్‌ను అందుబాటులోకి తేనున్నారు. అలాగే బెంగళూరు, గురుగ్రామ్, అహ్మదాబాద్, పుణే, చెన్నై, కోల్‌కతా, సూరత్‌లలో ఐకియా స్టోర్‌లను ఏర్పాటు చేస్తామని ఐకియా గ్రూప్ సీఈవో జాస్పర్ బ్రాడిన్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో తొలి ఐకియా స్టోర్ ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : ఐకియా
ఎక్కడ : హైటెక్ సిటీ, హైదరాబాద్
Published date : 18 Aug 2018 05:12PM

Photo Stories