నవంబర్ 2018 వ్యక్తులు
ప్రముఖ శాస్త్రీయ సంగీతకారుడు ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ (83) నవంబర్ 23న కన్నుముశారు. గుండెపోటు కారణంగా అమెరికాలో నవంబర్ 23న తుదిశ్వాస విడిచారు. సితార్, సుర్‌బహర్‌లను వాయించడంలో ఇమ్రత్ ఖాన్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. ఇమ్రత్ ఖాన్‌కు 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ఇవ్వగా.. తన ప్రతిభను కేంద్రం ఆలస్యంగా గుర్తించిందంటూ అవార్డును తిరస్కరించారు. 400 ఏళ్ల సంగీత చరిత్ర ఉన్న ఇమ్రత్ ఖాన్ కుటుంబమే బాస్ సితార్‌గా పిలిచే సుర్‌బహర్ వాయిద్య పరికరాన్ని తయారు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ శాస్త్రీయ సంగీతకారుడు కన్నమూత
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ (83)
ఎక్కడ : అమెరికా
ఎందుకు : గుండెపోటు కారణంగా
కన్నడ నటుడు అంబరీశ్ కన్నుమూత
ప్రముఖ కన్నడ నటుడు, కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి అంబరీశ్ (66) కన్నమూశారు. గుండెపోటు కారణంగా బెంగళూరులో నవంబర్ 24న ఆయన తుదిశ్వాస విడిచారు. 200కు పైగా చిత్రాల్లో నటించిన అంబరీశ్ పలుమార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా, ఎంపీగానూ ఎన్నికై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవులు చేపట్టారు.
1952 మే 29న మండ్య జిల్లా మద్దూరు తాలుకా దొడ్డరాసినకెరెలో జన్మించిన అంబరీశ్ అసలు పేరు మలవల్లి హుచ్చేగౌడ అమర్‌నాథ్. 1994లో రాజకీయాల్లో ప్రవేశించిన అంబరీశ్ 1998, 1999, 2004లో మండ్య నుంచి ఎంపీగా గెలిచారు. 2012లో కేపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. కన్నడలో 205 చిత్రాల్లో నటించిన అంబరీశ్ తెలుగు, కన్నడ, తమిళ, మలయాళంలో కలిపి మొత్తం 230 సినిమాల్లో నటించారు. 1992లో ప్రముఖ తెలుగు నటి సుమలతను వివాహం చేసుకున్నారు. 1972లో విడుదలైన తన తొలి చిత్రం నాగరహావు సినిమాకే అంబరీశ్ జాతీయ అవార్డును అందుకున్నారు. అలాగే 2005లో ఎన్టీఆర్ ఫిల్మ్ ఫేర్ అవార్డు, 2009లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును స్వీకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ కన్నడ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : అంబరీశ్ (66)
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : గుండెపోటు కారణంగా
నవ్యాంధ్రతో నా నడక పుస్తకావిష్కరణ
ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఐవైఆర్ కృష్ణారావు రచించిన ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకంను అమరావతిలో నవంబర్ 25న ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఎదురైన సమస్యలు, వాటిని పరిష్కరించడానికి అవలంభించిన విధానాలతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిని ఈ పుస్తకంలో ఐవైఆర్ వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : ఐవైఆర్ కృష్ణారావు
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
కేంద్ర మాజీ మంత్రి జాఫర్ షరీఫ్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీకే జాఫర్ షరీఫ్ (85) బెంగళూరులో గుండెపోటు కారణంగా నవంబర్ 25న కన్నుమూశారు. కర్ణాటకలోని చిత్రదుర్గలోని చిల్లకూరు పట్టణంలో 1933 నవంబర్ 3న షరీఫ్ జన్మించారు. కర్ణాటక మాజీ సీఎం నిజలింగప్ప అనుచరుడిగా షరీఫ్ కాంగ్రెస్‌లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇందిరాగాంధీకి అత్యంత విధేయుడిగా పేరుగాంచిన ‘జాఫర్ భాయి’ బెంగళూరు నార్త్ నుంచి ఏడుసార్లు ఎంపీగా గెలుపొందారు. పీవీ నరసింహారావు హయాంలో రైల్వే మంత్రిగా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : సీకే జాఫర్ షరీఫ్ (85)
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : గుండెపోటు కారణంగా
తదుపరి సీఈసీగా సునీల్ అరోరా
తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా సునీల్ అరోరా నియమితులయ్యారు. ఈ మేరకు అరోరా నియామకానికి నవంబర్ 26న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. దీంతో ప్రస్తుత సీఈసీ ఓపీ రావత్ స్థానంలో డిసెంబర్ 2న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 1980 బ్యాచ్ రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన సునీల్ అరోరా ఎన్నికల కమిషనర్‌గా 2017, ఆగస్ట్ 31న నియమితులయ్యారు. అంతకుముందు సమాచార, నైపుణ్యాభివృద్ధి శాఖల్లో కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. అలాగే ప్లానింగ్ కమిషన్‌లో, ఆర్థిక, టెక్స్‌టైల్ శాఖల్లో, ఇండియన్ ఎయిర్ లైన్స్ సీఎండీగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
సాధారణంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆరేళ్లు, లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆ పదవిలో కొనసాగుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) నియామకం
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : సునీల్ అరోరా
ఏఈఆర్‌బీ చైర్మన్‌గా గుంటూరు నాగేశ్వరరావు
అణుశక్తి నియంత్రణ మండలి (ఏఈఆర్‌బీ) చైర్మన్‌గా సీనియర్ శాస్త్రవేత్త గుంటూరు నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ నవంబర్ 26న తెలిపింది. దీంతో ఏఈఆర్‌బీ చైర్మన్‌గా నాగేశ్వరరావు మూడేళ్లపాటు కొనసాగనున్నారు. ప్రసుతం అణుశక్తి నియంత్రణ మండలిలో ప్రాజెక్టు డిజైన్ సేఫ్టీ కమిటీ చైర్మన్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే ప్రొటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ప్రాజెక్టుకు కూడా నాయకత్వం వహిస్తున్నారు.
గుంటూరు జిల్లా చిలువూరు గ్రామంలో జన్మించిన నాగేశ్వరరావు అనంతపురం ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్టిక్రల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. 1975లో భారత అణు ఇంధన విభాగంలో చేరారు. ‘వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూక్లియర్ ఆపరేషన్స్’ (వానో) నుంచి ‘న్యూక్లియర్ ఎక్స్‌లెన్స్’ పురస్కారం అందుకున్నారు. సురక్షిత, సమర్థ, విశ్వసనీయ అణు విద్యుత్తు కేంద్రాల నిర్వహణకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, అనుభవానికి గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అణుశక్తి నియంత్రణ మండలి (ఏఈఆర్‌బీ) చైర్మన్ నియామకం
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : గుంటూరు నాగేశ్వరరావు
సీనియర్ ఐసీఎస్ అధికారి వీకేరావు కన్నుమూత
సీనియర్ ఐసీఎస్ అధికారి వల్లూరి కామేశ్వరరావు (వీకే రావు) (104) హైదరాబాద్‌లో నవంబర్ 27న కన్నుమూశారు. పశ్చిమగోదావరి జిల్లా వల్లూరులో 1914 జూలై 15న జన్మించిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చీఫ్ సెక్రెటరీగా, అంతకు ముందు మద్రాస్ నుంచి విడివడిన ఆంధ్ర రాష్ట్రంలో డిఫ్యూటీ సెక్రెటరీగా పనిచేశారు. అలాగే విశాఖ జిల్లా కలెక్టర్, హైదరాబాద్‌లో పీడబ్ల్యూడీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్లానింగ్ కమిషన్ సెక్రెటరీగా పని చేసిన ఆయన ఏపీ చీఫ్ సెక్రెటరీగా 1971 నుంచి 1973 వరకు విధులు నిర్వర్తించారు. పదవీ విరమణ అనంతరం విజిలెన్స్ కమిషనర్‌గా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీనియర్ ఐసీఎస్ అధికారి కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : వల్లూరి కామేశ్వరరావు (104)
ఎక్కడ : హైదరాబాద్
మేకింగ్ ఆఫ్ న్యూ ఇండియా పుస్తకావిష్కరణ
‘మేకింగ్ ఆఫ్ న్యూ ఇండియా, ట్రాన్స్ ఫార్మేషన్ అండర్ మోదీ గవర్నమెంట్’ పుస్తకంను న్యూఢిల్లీలో నవంబర్ 27న జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ పుస్తకం తొలి ప్రతిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేశారు. విద్య, ప్రజా వైద్యం, తదితర అంశాలపై మొత్తం 51 వ్యాసాలు ఉన్న ఈ పుస్తకాన్ని ఆర్థిక వేత్త బిబేక్ దేబ్రాయ్, కిశోర్ దేశాయ్, అనిర్బన్ గంగూలీ రచించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మేకింగ్ ఆఫ్ న్యూ ఇండియా, ట్రాన్స్ ఫార్మేషన్ అండర్ మోదీ గవర్నమెంట్ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : బిబేక్ దేబ్రాయ్, కిశోర్ దేశాయ్, అనిర్బన్ గంగూలీ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఆధ్యాత్మిక గురువు బాలసాయిబాబా కన్నుమూత
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బాలసాయిబాబా (59) గుండెపోటు కారణంగా హైదరాబాద్‌లో నవంబర్ 27న కన్నుమూశారు. కర్నూలులో రామనాథ శాస్త్రి, జయలక్ష్మమ్మ దంపతులకు 1960 జనవరి 14న జన్మించిన బాలసాయిబాబా అసలు పేరు బాలరాజు. పదో తరగతి వరకు చదువుకున్న ఆయన 18 ఏళ్ల వయసులోనే కర్నూలులో ఆశ్రమం ఏర్పాటు చేసి.. దైవ ప్రవచనాలు చేయడం ప్రారంభించాడు. తర్వాతి కాలంలో కర్నూలు, హైదరాబాద్‌లో ఆశ్రమాలు నెలకొల్పి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : బాలసాయిబాబా (59)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : గుండెపోటు కారణంగా
ఇన్ఫోసిస్ తాత్కాలిక సీఎఫ్‌వోగా జయేష్ సంగ్రజ
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తాత్కాలిక చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా(సీఎఫ్‌ఓ) జయేష్ సంగ్రజ నియమితులయ్యారు. ఈ మేరకు నవంబర్ 17 నుంచి సంగ్రజ నియామకం అమల్లోకి వస్తుందని నవంబర్ 15న కంపెనీ తెలిపింది. ప్రస్తుత సీఎఫ్‌వోగా ఉన్న రంగనాథ్ నవంబర్ 16న తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఇన్ఫోసిస్‌లో 2 దశాబ్దాల పాటు పనిచేసిన రంగనాథ్ 2015లో సీఎఫ్‌వోగా బాధ్యతలు చేపట్టారు. 2018 ఆగస్ట్‌లో కంపెనీ సీఎఫ్‌వోగా రాజీనామా చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్ఫోసిస్ తాత్కాలిక చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నియామకం
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : జయేష్ సంగ్రజ
ఈవీఎం : ద ట్రూ స్టోరీ పుస్తకావిష్కరణ
కేంద్ర మాజీ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ అలోక్ శుక్లా రచించిన ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్: ద ట్రూ స్టోరీ’ పుస్తకాన్ని హైదరాబాద్‌లో నవంబర్ 16న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అలోక్ శుక్లా మాట్లాడుతూ... ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)ల్లో లోపాలు ఉన్నాయని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తే పార్లమెంట్‌లో చట్టం చేసి వాటి వినియోగానికి ఫుల్‌స్టాప్ పెట్టవచ్చని అన్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం, ఫలితాలను మార్చడం అసాధ్యమని స్పష్టం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్: ద ట్రూ స్టోరీ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : కేంద్ర మాజీ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ అలోక్ శుక్లా
ఎక్కడ : హైదరాబాద్
ఫార్చ్యూన్ జాబితాలో శంతను నారాయణ్
2018 ఏడాదికి గాను ఫార్చ్యూన్ మేగజైన్ ప్రకటించిన ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ జాబితాలో భారతీయ అమెరికన్ శంతను నారాయణ్ 12వ స్థానంలో నిలిచారు. ఈ మేరకు అడోబ్ వృద్ధిలో నారాయణ్ కీలక పాత్ర పోషించినట్టు ఫార్చ్యూన్ నవంబర్ 16న పేర్కొంది. హైదరాబాద్‌లో జన్మించిన నారాయణ్ ప్రస్తుతం అమెరికాకు చెందిన కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ అడోబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2007 నవంబరు నుంచి అడోబ్ సీఈఓగా నారాయణ్ పనిచేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ జాబితాలో 12వ స్థానం
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : భారతీయ అమెరికన్ శంతను నారాయణ్
బ్రిగేడియర్ కుల్దీప్ సింగ్ కన్నూమూత
1971 భారత్-పాక్ యుద్ధం సందర్భంగా కేవలం 120 మందితో పాకిస్థాన్ సైనిక పటాలాన్ని నిలువరించిన బ్రిగేడియర్ కుల్దీప్ సింగ్ చంద్‌పురి(78) కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన పంజాబ్‌లోని మొహాలీలో నవంబర్ 17న తుదిశ్వాస విడిచారు. 1971 భారత్-పాక్ యుద్ధం సందర్భంగా మేజర్ కుల్దీప్ నేతృత్వంలో భారత సైన్యం రాజస్థాన్‌లోని లాంగేవాలా ఆర్మీ పోస్ట్ వద్ద అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించి పాకిస్థాన్ సేనలను నిలువరించింది. ‘బ్యాటిల్ ఆఫ్ లాంగేవాలా’గా పేరుగాంచిన ఈ ఘటన 1971, డిసెంబర్ 4న చోటుచేసుకుంది. లాంగేవాలా ఘటన స్ఫూర్తితో 1997లో ‘బోర్డర్’ సినిమాను నిర్మించారు. ఈ యుద్ధంలో కుల్దీప్ చూపిన ధైర్యసాహసాలకుగాను రెండో అత్యున్నత సైనిక పురస్కారమైన మహావీర్ చక్ర ఆయనకు లభించింది.
అవిభక్త భారత్‌లోని పంజాబ్ రాష్ట్రంలో 1940, నవంబర్ 22న కుల్దీప్‌సింగ్ చంద్‌పురి జన్మించారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి 1963లో ఉత్తీర్ణులైన కుల్దీప్ పంజాబ్ రెజిమెంట్లోని 23వ బెటాలియన్‌లో చేరారు. 1965 భారత్-పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. తర్వాత ఐక్యరాజ్యసమితి అత్యవసర దళం (యూఎన్‌ఈఎఫ్)లో ఏడాదిపాటు పనిచేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇన్‌ఫాంట్రీ స్కూల్‌లో శిక్షకుడిగా రెండుసార్లు పనిచేశారు. ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాక 2006-11 మధ్యకాలంలో చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుడిగా కూడా కుల్దీప్ పనిచేశాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిగేడియర్, లాంగేవాలా ఆర్మీ పోస్ట్ మేజర్ కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : కుల్దీప్ సింగ్ చంద్‌పురి(78)
ఎక్కడ : మొహాలీ, పంజాబ్
ఎందుకు : కేన్సర్ కారణంగా
ఈడీ పూర్తిస్థాయి డెరైక్టర్‌గా ఎస్కే మిశ్రా
ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) పూర్తిస్థాయి డెరైక్టర్‌గా సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారి ఎస్కే మిశ్రా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 17న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మిశ్రా బాధ్యతలు చేపట్టినప్పటి రెండేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా (రెంటింట్లో ఏది ముందైతే అది) పదవిలో కొనసాగనున్నారు. ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ స్పెషల్ డెరైక్టర్‌గా అక్టోబర్ 27న నియమితులైన మిశ్రాకు మూడు నెలల కాలానికి ఈడీ డెరైక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కర్నాల్ సింగ్ స్థానంలో ఆయన ఈడీ బాధ్యతలు చేపట్టారు. మిశ్రా 1984 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈడీ పూర్తిస్థాయి డెరైక్టర్‌గా ఎస్కే మిశ్రా నియామకం
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : కేంద్రప్రభుత్వం
మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా మహ్మద్ సోలి
మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా ఇబ్రహీం మహ్మద్ సోలి నవంబర్ 17న ప్రమాణస్వీకారం చేశారు. సోలి ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సోలితో సమావేశమైన మోదీ పలు అంశాలపై చర్చలు జరిపారు. అభివృద్ధి, శాంతి కోసం మాల్దీవులు చేస్తున్న ప్రతి ప్రయత్నానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రధాని హోదాలో మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి.
ఇప్పటివరకు మాల్దీవుల అధ్యక్షుడిగా ఉన్న అబ్దుల్లా యామీన్ హయాంలో భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. చైనాకు అనుకూల వ్యక్తిగా పేరొందిన యామీన్.. ఆ దేశంలో అత్యవసర పరిస్థితి విధించడాన్ని భారత్ వ్యతిరేకించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : ఇబ్రహీం మహ్మద్ సోలి
ఎక్కడ : మాల్దీవులు
యాడ్ గురు అలెక్ పదమ్‌సీ కన్నూమూత
ప్రముఖ యాడ్ గురు, నటుడు, దర్శకుడు అలెక్ పదమ్‌సీ(90) ముంబైలో నవంబర్ 17న కన్నుమూశారు. గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి చెందిన ఖోజా ముస్లిం ధనిక కుటుంబంలో 1928లో పదమ్‌సీ జన్మించారు. ముంబైలోని సెయింట్ జేవియర్ కళాశాలలో చదువుకున్న పదమ్‌సీ 100కు పైగా బ్రాండ్‌లకు రూపకల్పన చేసి భారత ప్రకటనల రంగంలో బ్రాండ్ ఫాదర్‌గా పేరొందారు. ‘లలితాజీ’ సర్ఫ్, ‘హమారా బజాజ్’, చెర్రీ బ్లోసమ్ షూ పాలిష్ కోసం ‘చెర్రీ చార్లీ’, ఎమ్మార్‌ఎఫ్ టైర్ ‘మజిల్ మ్యాన్’, లిరిల్ సబ్బులకు సంబంధించిన ప్రకటనలను ఆయన చేశారు.
మొదటి సారిగా ఏడేళ్ల వయస్సులో నటించిన పదమ్‌సీ రిచర్డ్ అటెన్‌బరో దర్శకత్వం వహించిన ‘గాంధీ’ సినిమాలో మొహమ్మద్ అలీ జిన్నాగా నటించి అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. అలాగే తుగ్లక్, జీసస్ క్రైస్ట్, ఎవిటా వంటి 70కి పైగా నాటకాలకు దర్శకత్వం వహించారు. ప్రముఖ ప్రకటనల సంస్థ లింటాస్‌కు భారత్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా, సంస్థ దక్షిణాసియా సమన్వయకర్తగా పదమ్‌సీ బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే లండన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ ట్రయినింగ్ సంస్థకు చైర్మన్‌గా వ్యవహరించారు.
పదమ్‌సీ రచించిన ‘ఎ డబుల్ లైఫ్’ బిజినెస్ స్కూళ్లలో బోధనాంశంగా ఉంది. 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డును పదమ్‌సీ అందుకున్నారు. అలాగే ముంబైలోని అడ్వర్టయిజింగ్ క్లబ్ ఆఫ్ ఇండియా నుంచి ‘అడ్వర్టయిజింగ్ మ్యాన్ ఆఫ్ ద సెంచరీ’ అవార్డును స్వీకరించారు. ప్రకటనల రంగంలో ఆస్కార్‌గా పరిగణించే ఇంటర్నేషనల్ క్లియో హాల్ ఆఫ్ ఫేమ్‌కు ప్రతిపాదించిన ఏకై క భారతీయుడు పదమ్‌సీనే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ యాడ్ గురు, నటుడు, దర్శకుడు కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : అలెక్ పదమ్‌సీ(90)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఇంటర్‌పోల్ కొత్త అధ్యక్షుడిగా కిమ్ యాంగ్
అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్‌పోల్ కొత్త అధ్యక్షుడిగా దక్షిణకొరియాకు చెందిన కిమ్ జాంగ్ యాంగ్ నియమితులయ్యారు. ఈ మేరకు యూఏఈలోని దుబాయ్‌లో నవంబర్ 21న జరిగిన వార్షిక సమావేశంలో కిమ్ యాంగ్‌ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ఇంటర్‌పోల్ తెలిపింది. దీంతో కిమ్ యాంగ్ 2020 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇప్పటివరకు ఇంటర్‌పోల్ అధ్యక్షుడిగా ఉన్న చైనా మాజీ మంత్రి మెంగ్ హాంగ్వే 2018 సెప్టెంబర్ లో అదృశ్యం అయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంటర్‌పోల్ కొత్త అధ్యక్షుడి నియామకం
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : కిమ్ జాంగ్ యాంగ్
దేశంలో అత్యంత ధనిక రియల్టర్ గా లోధా
దేశంలో అత్యంత ధనిక రియల్టర్‌గా లోధా గ్రూప్‌నకు చెందిన మంగల్ ప్రభాత్ లోధా నిలిచారు. ఈ మేరకు ‘గ్రోహె- హురున్ ఇండియా రియల్ ఎస్టేట్’ 2018 సంవత్సరానికి సంబంధించిన జాబితాను నవంబర్ 21న విడుదల చేసింది. ఈ జాబితాలో రూ.27,150 కోట్ల సంపదతో ప్రభాత్ లోధా అగ్రాస్థానంలో ఉండగా రూ.23,160 కోట్లతో ఎంబసీ అధినేత జితేంద్ర విర్వాణీ రెండో స్థానంలో ఉన్నారు.
హురున్ రియల్ ఎస్టేట్ జాబితాలో తెలంగాణ నుంచి ‘మై హోమ్ కన్‌స్ట్రక్షన్స్’ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు తొలిసారిగా స్థానం దక్కించుకున్నారు. హైదరాబాద్ నుంచి తొలి స్థానంలో నిలిచిన రామేశ్వర్ దేశవ్యాప్తంగా చూస్తే 14వ స్థానంలో ఉన్నారు. రామేశ్వర్ సంపద రూ.3,300 కోట్లుగా ఉంది.
ముంబైలో 35 మంది...
టాప్-100 రియల్టీ శ్రీమంతుల్లో 78 మంది ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరులోనే ఉన్నారు. కేవలం ముంబైలోనే 35 మంది ఉండగా.. ఢిల్లీలో 22 మంది, బెంగళూరులో 21, పుణెలో 5, నోయిడా, చెన్నై, గుర్గావ్, కొచ్చిల్లో 2, కోల్‌కతా, థానే, అహ్మదాబాద్‌లో ఒక్కరు చొప్పున ఉన్నారు. జర్మనీకి చెందిన ప్రీమియం శానీటరీ ఉత్పత్తుల తయారీ సంస్థ గ్రోహే మన దేశంలో పుట్టి, ఇక్కడే పెరిగిన రియల్టీ వ్యాపారస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం దేశంలోని 100 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల మొత్తం సంపద విలువ రూ.2,36,610 కోట్లు. 2017తో పోలిస్తే ఇది 27 శాతం పెరిగింది.
గ్రోహె- హురున్ ఇండియా రియల్ ఎస్టేట్ జాబితా-2018
ర్యాంకు | పేరు | సంపద (రూ. కోట్లలో) | కంపెనీ | నగరం |
1 | మంగళ్ ప్రభాత్ లోధా | 27,150 | లోధా | ముంబై |
2 | జితేంద్ర విర్వాణీ | 23,160 | ఎంబసీ | బెంగళూరు |
3 | రాజీవ్ సింగ్ | 17,690 | డీఎల్‌ఎఫ్ | న్యూ ఢిల్లీ |
4 | చంద్రు రహేజా | 14,420 | కే రహేజా | ముంబై |
5 | వికాస్ ఒబెరాయ్ | 10,980 | ఒబెరాయ్ రియాల్టీ | ముంబై |
6 | నిరంజన్ హిరనందానీ | 7,880 | హిరనందానీ | ముంబై |
7 | సురేంద్ర హిరనందానీ | 7,880 | హిరనందానీ | సింగపూర్ |
8 | అజయ్ పిరమల్ | 6,380 | పిరమిల్ రియాల్టీ | ముంబై |
9 | మనోజ్ మెండా | 5,900 | ఆర్‌ఎంజెడ్ | బెంగళూరు |
10 | రాజ్ మెండా | 5,900 | ఆర్‌ఎంజెడ్ | బెంగళూరు |
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో అత్యంత ధనిక రియల్టర్ గా మంగళ్ ప్రభాత్ లోధా
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : గ్రోహె- హురున్ ఇండియా రియల్ ఎస్టేట్
కెనడా హాల్ ఆఫ్ ఫేమ్‌లో భారతీయ రైతు
కెనడాకి చెందిన కెనడియన్ అగ్రికల్చరల్ హాల్ ఆఫ్ ఫేమ్ (సీఏహెచ్‌ఎఫ్‌ఏ)లో భారతీయ రైతు పీటర్ పావిటర్ ధిల్లాన్‌కు చోటు లభించింది. కెనడాలో వ్యవసాయ రంగంలో చేసిన విశేష కృషికిగాను ఆయనకు ఈ గౌరవం దక్కింది. వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు చేసిన వారి పేరును సీఏహెచ్‌ఎఫ్‌ఏలో చేర్చి వారి విజయాలను ఆ సంస్థ ప్రచారం చేస్తుంది. కెనడాలో అత్యధిక క్రాన్‌బెర్రీ పంటను పండించినందుకుగాను ధిల్లాన్‌ను సంస్థ ఇలా గౌరవించింది.
పంజాబ్, హోషియార్‌పూర్‌లోని పాండోరి గ్రామం నుంచి 1950లో ధిల్లాన్ తండ్రి రాచ్‌పాల్ సింగ్ ధిల్లాన్ కెనడాకి వెళ్లారు. 19 ఏళ్ళ వయస్సులోనే రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్‌లో చేరిన తొలి ఇండో కెనడియన్‌గా పీటర్ ధిల్లాన్ గుర్తింపు పొందాడు. తర్వాత కాలంలో డిప్యూటీ షరిఫ్‌గా ఎదిగిన ధిల్లాన్ 1993లో వ్యాపారంలోకి ప్రవేశించారు. ప్రస్తుతం 2000 ఎకరాల్లో క్రాన్‌బెర్రీ పండిస్తున్న ధిల్లాన్ ప్రపంచంలో అత్యధిక క్రాన్‌బెర్రీ సాగుచేస్తున్నవారిలో రెండో స్థానంలో ఉన్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కెనడా హాల్ ఆఫ్ ఫేమ్‌లో భారతీయ రైతు
ఎప్పుడు : నవంబర్ 12
ఎవరు : పీటర్ పావిటర్ ధిల్లాన్
ఎక్కడ : కెనడా
ఎందుకు : వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు చేసినందుకు
కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ కన్నుమూత
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పెట్రోలియం, రసాయనాల శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రి అనంత్ కుమార్(59) కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులో నవంబర్ 12న తుదిశ్వాస విడిచారు. 1959లో హెచ్.ఎన్.నారాయణ్ శాస్త్రి, గిరిజ దంపతులకు బెంగళూరులో అనంత్ కుమార్ జన్మించారు. విద్యార్థి దశలోనే ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడిగా చేరిన ఆయన దేశంలో ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థి నేతగా అరెస్టై జైలుకు వెళ్లారు.
1987లో బీజేపీలో చేరిన అనంత్ కూమార్ 1996లో మొదటిసారిగా దక్షిణ బెంగళూరు నియోజకవర్గం నుంచి ఎంపీ అయ్యారు. దక్షిణ బెంగళూరు నుంచి వరుసగా ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన 1998లో వాజపేయి కేబినెట్‌లో 38 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కన్నడలో ప్రసంగించిన మొదటి నేతగా అనంత్‌కూమార్ గుర్తింపు పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర పెట్రోలియం, రసాయనాల శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రి కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 12
ఎవరు : అనంత్ కుమార్
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : ఊపిరితిత్తుల కేన్సర్ కారణంగా
ఫ్లిప్‌కార్ట్ సీఈవో బిన్నీ బన్సల్ రాజీనామా
దేశీ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈఓ బిన్నీ బన్సల్ నవంబర్ 13న పదవికి రాజీనామా చేశారు. తీవ్రమైన వ్యక్తిగత దుష్ప్రవర్తన’ ఆరోపణల కారణంగా బిన్నీ రాజీనామా చేసినట్లు వాల్‌మార్ట్ ప్రకటించింది. ఒక మహిళ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల వల్లే ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు పేర్కొంది. అయితే సంస్థలో వాటాదారుగా, బోర్డులో సభ్యుడిగా బిన్నీ కొనసాగనున్నాడు.
మరో ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మాజీ ఉద్యోగులైన సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ కలిసి 2007లో ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించారు. 2018 మేలో ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్ 16 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసింది. ఈ డీల్‌లో భాగంగా సచిన్ బన్సల్ తన మొత్తం 5.5% వాటాను విక్రయించేసి తప్పుకోగా, బిన్నీ బన్సల్ మాత్రం కంపెనీలోనే కొనసాగుతున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈఓ రాజీనామా
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : బిన్నీ బన్సల్
కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌కు భారతీయ-అమెరికన్
అమెరికాలో సుప్రీంకోర్టు తర్వాత రెండో ఉన్నత న్యాయస్థానం డీసీ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ జడ్జిగా భారతీయ-అమెరికన్ న్యాయవాది నియోమి రావు నామినేట్ అయ్యారు. ఈ మేరకు వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో నవంబర్ 14న దీపావళి వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. దీంతో అమెరికా సెనెట్ ఆమోదిస్తే డీసీ సర్క్యూట్‌లో కోర్టులో నియోమి రావు రెండో భారతీయ అమెరికన్ జడ్జి అవుతారు. జస్టిస్ బ్రెట్ కెవెనా స్థానంలో ఆమె నామినేట్ అయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డీసీ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ జడ్జిగా భారతీయ-అమెరికన్
ఎప్పుడు : నవంబర్ 14
ఎవరు : నియోమి రావు
ఎక్కడ : అమెరికా
యస్ బ్యాంక్ చైర్మన్ అశోక్ చావ్లా రాజీనామా
ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ యస్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్‌టైమ్ చైర్మన్ అశోక్ చావ్లా తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు వ్యక్తిగత కారణాలతో స్వతంత్ర డెరైక్టర్ వసంత్ గుజరాతితో పాటు అశోక్ చావ్లా కూడా తన పదవికి రాజీనామా చేసినట్లు యస్ బ్యాంక్ నవంబర్ 14న వెల్లడించింది. మరోవైపు యస్ బ్యాంక్ అదనపు డెరైక్టర్ (స్వతంత్ర)గా ఉత్తమ్ ప్రకాశ్ అగర్వాల్‌ని అయిదేళ్లకాలానికి యస్ బ్యాంక్ నియమించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యస్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్‌టైమ్ చైర్మన్ రాజీనామా
ఎప్పుడు : నవంబర్ 14
ఎవరు : అశోక్ చావ్లా
యుకో బ్యాంక్ సీఈఓగా అతుల్ గోయెల్
యుకో బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈఓగా అతుల్ కుమార్ గోయెల్ నవంబర్ 2న బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఆయన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా పనిచేశారు. 2018 నవంబర్ 1న యుకో బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈఓగా పదవీ విరమణ చేసిన ఆర్‌కే ఠాకూర్ నుంచి గోయెల్ బాధ్యతలు స్వీకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యుకో బ్యాంక్ సీఈఓ బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : అతుల్ కుమార్ గోయెల్
శ్రీకాళహస్తి దేవస్థాన స్థలపతి సదాశివ కన్నుమూత
చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి న దీ ఒడ్డున ఉన్న శ్రీకాళహస్తి దేవస్థానం స్థలపతి స్థానం ముత్తకుమార సదాశివ గురుకుల్ (84) అనారోగ్యం కారణంగా నవంబర 2న కన్నుమూశారు. భరద్వాజ వంశీయులుగా ఆలయ మిరాశీదారులుగా సదాశివ వ్యవహరిస్తున్నారు. అలాగే దేవాదాయ, ధర్మాదాయశాఖ శైవాగమ సలహాదారులుగా కూడా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : శ్రీకాళహ స్తి దేవస్థాన స్థలపతి కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : స్థానం ముత్తకుమార సదాశివ గురుకుల్ (84)
తాలిబన్ల ‘గాడ్‌ఫాదర్’ హత్య
తాలిబన్ల గాడ్‌ఫాదర్‌గా పేరుకెక్కిన ప్రముఖ పాకిస్థానీ ఇస్లాం మత బోధకుడు మౌలానా సమీ ఉల్ హఖ్ (82) హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్‌లో రావల్పిండిలోని హఖ్ నివాసంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కత్తులతో దాడి చేసి హత్యచేశారు. హఖ్ నడిపిన దారుల్ ఉలూమ్ హఖ్ఖానియా అనే మదర్సా ‘జీహాద్ విశ్వవిద్యాలయం’గా పేరొందింది. గతంలో పాక్ పార్లమెంటుకు హఖ్ రెండు సార్లు ఎన్నికయ్యాడు. దిఫా-ఎ-పాకిస్థానీ పేరుతో ఏర్పాటైన ఓ కూటమికి ఛైర్మన్‌గా పనిచేశాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తాలిబన్ల ‘గాడ్‌ఫాదర్’ హత్య
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : మౌలానా సమీ ఉల్ హఖ్ (82)
ఎక్కడ : రావల్పిండి, పాకిస్థాన్
ప్రముఖ రచయిత్రి ప్రమీలాదేవి కన్నుమూత
ప్రముఖ రచయిత్రి, పద సాహిత్య పరిశోధనలో విశేష కృషి చేసిన మంగళగిరి ప్రమీలాదేవి (75) కన్నుమూశారు. హైదరాబాద్‌లో నవంబర్ 1న ఆమె గుండెపోటుతో తుదిశ్వాసవిడిచారు. తెలుగు, సంస్కృత, హిందీ భాషల్లో ప్రావీణ్యమున్న ప్రమీలాదేవి 40 పుస్తకాలు రచించారు. ఆమె రాసిన ‘‘తెలుగు పద్య గేయ నాటికలు’’ గ్రంథానికి 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ‘‘పద సాహిత్య పరిషత్’’ను నెలకొల్పిన ఆమె ఏపీ ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ రచయిత్రి కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : మంగళగిరి ప్రమీలాదేవి (75)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : గుండెపోటు కారణంగా
బయోగ్రఫీ ఆఫ్ ఏఆర్ రెహమాన్ పుస్తకావిష్కరణ
రచయిత కృష్ణ త్రిలోక్ రాసిన ‘నోట్స్ ఆఫ్ ఏ డ్రీమ్: ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ ఏఆర్ రెహమాన్’ పుస్తకంను ముంబైలో నవంబర్ 4న జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ... నాకు పాతికేళ్లు ఉన్నప్పుడు మణిరత్నం తెరకెక్కించిన ‘రోజా’ సినిమాకు కొన్నిరోజుల ముందు నా పేరును, మతాన్ని మార్చుకున్నానని చెప్పాడు. ఎందుకో నా గతాన్ని, దిలీప్ కుమార్ అనే నా పేరును విపరీతంగా ద్వేషించేవాడినని, అదెందుకో నాకు ఇప్పటికీ తెలియదని అన్నాడు. బయోగ్రఫీ ఆఫ్ ఏఆర్ రెహమాన్ పుస్తకాన్ని ల్యాండ్‌మార్క్ అండ్ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ప్రచురించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నోట్స్ ఆఫ్ ఏ డ్రీమ్: ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ ఏఆర్ రెహమాన్ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 4
ఎవరు : ఏఆర్ రెహమాన్
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
భారత్‌లో మహిళల క్రికెట్‌పై పుస్తకం
భారత్‌లో మహిళల క్రికెట్ ప్రస్థానంపై ‘ది ఫైర్ బర్న్స్ బ్లూ; ఎ హిస్టరీ ఆఫ్ ఉమెన్స్ క్రికెట్ ఇన్ ఇండియా’ శీర్షికన ఓ పుస్తకం రానుంది. స్పోర్‌ట్స జర్నలిస్టులు కారుణ్య కేశవ్, సిద్ధాంత పట్నాయక్ రచించిన ఈ పుస్తకం నవంబర్ 30న మార్కెట్‌లో విడుదల కానుంది. వెస్ట్‌లాండ్ పబ్లికేషన్స్ ఈ పుస్తకాన్ని ముద్రిస్తోంది. 1970ల నుంచి నేటి వరకు మహిళల క్రికెట్ ప్రస్థానాన్ని ఇందులో వివరించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహిళల క్రికెట్‌పై ది ఫైర్ బర్న్స్ బ్లూ; ఎ హిస్టరీ ఆఫ్ ఉమెన్స్ క్రికెట్ ఇన్ ఇండియా పుస్తకం
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : కారుణ్య కేశవ్, సిద్ధాంత పట్నాయక్
ఎక్కడ : భారత్
సాహితీ భీష్ముడు కపిలవాయి లింగమూర్తి కన్నుమూత
ప్రముఖ కవి, రచయిత, సాహితీ పరిశోధకులు, సాహితీ భీష్ముడు కపిలవాయి లింగమూర్తి (92) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లో నవంబర్ 6న తుదిశ్వాస విడిచారు. 14వ ఏటనే కావ్య రచనకు శ్రీకారం చుట్టిన లింగమూర్తి తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలంలోని జీనుకుంటలో స్వర్ణకారులు వెంకటాచలం, మాణిక్యమ్మ దంపతులకు 1928, జనవరి 31న జన్మించారు.
పాఠశాల విద్యను ఉర్దూ మాధ్యమంలో పూర్తిచేసిన ఆయన ఆంధ్ర సారస్వత పరిషత్ పరీక్షలు రాసి తెలుగులో విశారద ప్రమాణ పత్రాన్ని పొందారు. ఉస్మానియా నుంచి సాహిత్యంలో మాస్టర్స్ పట్టాను, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీని పూర్తిచేశారు. 1970లో నాగర్‌కర్నూల్ జాతీయ ఉన్నత పాఠశాలలో తెలుగు అధ్యాపకుడిగా చేరారు. 1972లో పాలెం, శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ఉపన్యాసకుడిగా బాధ్యతలు చేపట్టారు. పాలెం ఓరియంటల్ కళాశాలలో బోధన చేసి 1983లో ఉద్యోగ విరమణ చేశారు.
కథ, సాహిత్య విమర్శ, స్థల పురాణాలు, గ్రామాల చరిత్ర, దేవాలయాల చరిత్ర, పద్యకావ్యాలు, వ్యాఖ్యానాలు, శతకాలు, కీర్తనలు తదితర ప్రక్రియలతో లింగమూర్తి సాహితీ సృజన చేశారు. దాదాపు 70 పుస్తకాలు రచించారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఉస్మానియా తదితర విశ్వవిద్యాలయాల నుంచి కపిలవాయి సాహిత్యంపై 6 సిద్ధాంత గ్రంథాలు వెలువడ్డాయి.
పుస్తకాల్లో కొన్ని..
పండరినాథ విఠల శతకం, తిరుమలేశ శతకం, ఆర్య శతకం, ఛత్రపతి, దుర్గ, భర్గ శతకాలు, జినుకుంట రామబంటు శతకం, పరమహంస శతకం, పాలమూరు జిల్లా దేవాలయాల చరిత్ర, మామిళ్లపల్లి స్థల చరిత్ర, భైరవకోన క్షేత్ర మహత్యం, సోమేశ్వర మహత్యం, గద్వాల హనుమద్వచనాలు, సౌధశిఖరం, చక్రతీర్థ మహత్యం.
పురస్కారాలు.. బిరుదులు..
- 2014లో తెలంగాణ రాష్ట్ర ఉగాది విశిష్ట పురస్కారం
- తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ (అందుకున్న తొలి వ్యక్తి)
- తెలుగు యూనివర్సిటీ ప్రతిభా పురస్కారం
- బ్రౌన్ సాహిత్య పురస్కారం, బూర్గుల ప్రతిభా పురస్కారం, నోరి నరసింహశాస్తి్ర పురస్కారం
- బిరుదులు: కవితా కళానిధి, కవి కేసరి.
ఏమిటి : ప్రముఖ కవి, రచయిత కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : కపిలవాయి లింగమూర్తి (92)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా
ప్రముఖ రచయిత జాతశ్రీ కన్నుమూత
ప్రముఖ రచయిత, కవి జాతశ్రీ(75) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో అనారోగ్యం కారణంగా నవంబర్ 4న కన్నుమూశారు. జాతీశ్రీ అసలు పేరు చార్లెస్. 4 కథా సంపుటాలు, 3 నవలలు, నాటికలు రచించిన జాతశ్రీ సింగరేణిలో పనిచేశారు. సింగరేణి ఇతివృత్తంగా నవలలు, కథలు రాశారు. ఆయన రచించిన కుట్ర అనే కథకు ‘వట్టికోట ఆళ్వార్‌స్వామి’ అవార్డు లభించింది. అలాగే ‘వెదురుపొదలు నినదించాయి’ నవలకు రాష్ట్ర స్థాయి అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ రచయిత జాతశ్రీ కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 4
ఎవరు : కవి జాతశ్రీ(75)
ఎక్కడ : కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ
ఎందుకు : అనారోగ్యం కారణంగా