Skip to main content

జూన్ 2018 వ్యక్తులు

మిస్ ఇండియా’గా అనుకృతి
Current Affairs ఫెమినా ‘మిస్ ఇండియా-2018’ గా తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల అనుకృతి వాస్ ఎంపికైంది. ఈ మేరకు జూన్ 19న ముంబైలో జరిగిన అందాల పోటీల్లో క్రికెటర్లు కేఎల్ రాహుల్, ఇర్ఫాన్ పఠాన్, నటులు బాబీ డియోల్, మలైకా అరోరా, కునాల్ కపూర్, 2017 విజేత మానుషి చిల్లార్‌లతో కూడిన న్యాయ నిర్ణేతల బృందం ఆమెను ఎంపిక చేసింది. చెన్నైలోని లయోలా కళాశాలలో బీఏ (ఫ్రెంచి) చదువుతున్న అనుకృతి అనువాదకురాలు కావాలనుకుంటుంది. అనుకృతి త ర్వాత వరుసగా మొదటి, రెండు స్థానాల్లో మీనాక్షి, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన శ్రేయారావు నిలిచారు. ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో జరగబోయే అందాల పోటీ (మిస్ వరల్డ్)ల్లో భారత్‌కు అనుకృతి ప్రాతినిధ్యం వహించనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిస్ ఇండియా-2018 ఎంపిక
ఎప్పుడు : జూన్ 19
ఎవరు : అనుకృతి వాస్
ఎక్కడ : ముంబై

అన్‌ఫినిష్డ్’ పేరుతో ప్రియాంక చోప్రా ఆత్మకథ
మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ‘అన్‌ఫినిష్డ్’ పేరుతో తన ఆత్మకథ ను రాయనుంది. 2019లో మార్కెట్‌లోకి రాబోతున్న ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ఇండియా పబ్లికేషన్స్ ప్రచురిస్తోంది. ఇందులో తన జీవితంలో సేకరించిన వ్యాసాలు, కథలు, ఎదుర్కొన్న సమస్యలు, పరిశీలించిన సంఘటనల గురించి ప్రియాంక వివరించనుంది. ఇప్పటికే బాలీవుడ్‌లో రిషి కపూర్, ట్వింకిల్ ఖన్నా, నసీరుద్దీన్ షా తమ జీవిత విశేషాలతో ఆత్మకథలు రాసుకున్నారు.

ఇండియా ఐఎన్‌సీ టాప్-100లో భారత సంతతి వ్యక్తి
‘ఇండియా ఐఎన్‌సీ టాప్ 100’ జాబితాలో ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ చాన్స్ లర్ లార్డ్ కరణ్ బిలిమోరియాకు చోటు దక్కింది. ఈ మేరకు యూకే-ఇండియా వీక్ 2018లో భాగంగా ఇండియా ఐఎన్‌సీ. టాప్ 100’ పేరుతో భారత్-బ్రిటన్ బంధాలను ప్రభావితం చేసిన వారి జాబితా జూన్ 21న విడుదలైంది. హైదరాబాద్‌లో జన్మించిన కరణ్ ప్రస్తుతం అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల మండలి అధ్యక్షుడిగా, యూకే-ఇండియా వాణిజ్య మండలి వ్యవస్థాపక చైర్మన్‌గా పనిచేస్తున్నారు. బ్రిటన్‌లోని ప్రఖ్యాత కోబ్రా బీర్ కంపెనీని కరణ్ స్థాపించారు. ఈ జాబితాలో కరణ్‌తోపాటు యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ వర్సిటీ సహాయ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ రాబిన్ మాసన్ కూడా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘ఇండియా ఐఎన్‌సీ టాప్-100’ జాబితా
ఎప్పుడు : జూన్ 21
ఎవరు : కరణ్ బిలిమోరియా (భారత సంతతి వ్యక్తి)
ఎక్కడ : యూకే-ఇండియా వీక్ 2018లో భాగంగా
ఎందుకు : భారత్-బ్రిటన్ బంధాలను ప్రభావితం చేస్తున్నందుకు

మెట్రోలో ప్రమాణాలకు కమిటీ
దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న మెట్రోరైల్ వ్యవస్థలకు ప్రమాణాలను నిర్దేశించేందుకు కమిటీని ఏర్పాటుచేసే ప్రతిపాదనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు. ఈ కమిటీకి ‘మెట్రోమ్యాన్’ శ్రీధరన్ నేతృత్వం వహిస్తారు. ఢిల్లీ మెట్రో విస్తరణలో భాగంగా బహదూర్‌గఢ్-ముండ్కా మార్గాన్ని మోదీ జూన్ 24న ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మెట్రోరైల్ వ్యవస్థలో ప్రమాణాలకు కమిటీ
ఎప్పుడు : త్వరలో
ఎవరు : చైర్మన్‌గా శ్రీధరన్

టుస్సాడ్స్లో బాబా రామ్‌దేవ్ విగ్రహం
ప్రముఖ యోగా గురు, పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడైన బాబా రామ్‌దేవ్ విగ్రహంను లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహాన్ని ‘వృక్షాసన’ యోగా భంగిమలో నిర్మిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మేడమ్ టుస్సాడ్స్‌లో బాబా రామ్‌దేవ్ విగ్రహం
ఎప్పుడు : త్వరలో
ఎవరు : ప్రముఖ యోగా గురు, పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు
ఎక్కడ : లండన్, ఇంగ్లండ్

తొలి ట్రైబల్ క్వీన్‌గా పల్లవి దరువా
దేశంలో తొలి ట్రైబల్ క్వీన్‌గా ఒడిశాలోని కోరాపుట్ జిల్లాకు చెందిన పల్లవి దరువా నిలిచింది. ఈ మేరకు భువనేశ్వర్‌లో జూన్ 26న జరిగిన ఆది రాణి కళింగ ట్రైబల్ క్వీన్ పోటీలో పాల్గొన్న పల్లవి కీరిటాన్ని సొంతం చేసుకుంది. ఈ పోటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన 22 మందిని పల్లవి ఓడించింది. గిరిజన వేషధారణ, ఆభరణాల ప్రదర్శన, అద్భుత ప్రతిభ, సంస్కృతిని ప్రదర్శించడంలో నైపుణ్యం, ఫొటోజెనిక్ ఫేస్, బెస్ట్ స్కిన్, బెస్ట్ పర్సనాలిటీ వంటి ఏడు విభిన్న విభాగాల్లో పల్లవి విజేతగా నిలిచింది. ఈ పోటీలో టిట్లాఘడ్‌కు చెందిన పంచమీ మజీ మొదటి రన్నరప్‌గా, మయూర్‌భంజ్‌కు చెందిన రష్మీరేఖా హన్స్ దా రెండో రన్నరప్‌గా నిలిచారు.
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్, ఒడిశా ఎస్సీ, ఎస్టీ డిపార్ట్‌మెంట్, టూరిజం శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తొలి ట్రైబల్ క్వీన్
ఎప్పుడు : జూన్ 26
ఎవరు : పల్లవి దరువా
ఎక్కడ : భువనేశ్వర్, ఒడిశా

రైజింగ్ కశ్మీర్ దినపత్రిక ఎడిటర్ హత్య
Current Affairs జమ్మూకశ్మీర్‌కి చెందిన సీనియర్ జర్నలిస్ట్, రైజింగ్ కశ్మీర్ ఆంగ్ల దినపత్రిక ఎడిటర్ సయ్యద్ షుజాత్ బుఖారి(53) జూన్ 14న హత్యకు గురయ్యారు. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో ఉన్న పత్రిక కార్యాలయం వద్ద ఉగ్రవాదులు ఆయనపై కాల్పులు జరిపారు. 2000లో మొదటిసారి బుఖారిపై దాడి జరగగా.. 2006లో కిడ్నాప్‌కు గురై ప్రాణాలతో బయటపడ్డాడు.
శ్రీనగర్‌కు చెందిన షుజాత్ బుఖారి రైజింగ్ కశ్మీర్ అనే ఇంగ్లిష్ దినపత్రికతో పాటు బులంద్ కశ్మీర్ అనే ఉర్దూ పత్రికను స్థాపించి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. మనీలాలోని అటెనియో డీ మనీలా యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో మాస్టర్స్ చేసిన బుఖారి 1997 నుంచి 2012 వరకు కశ్మీర్‌లో హిందూ పత్రిక స్పెషల్ కరస్పాండెంట్‌గా విధులు నిర్వర్తించాడు. కశ్మీర్ లోయలో శాంతి నెలకొనేందుకు గతంలో పలు సమావేశాలను నిర్వహించడంతోపాటు కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం భారత్-పాక్‌ల మధ్య సాగిన అనధికార ట్రాక్-2 చర్చల్లో బుఖారి భాగస్వామిగా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రైజింగ్ కశ్మీర్ ఆంగ్ల దినపత్రిక ఎడిటర్ హత్య
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : సయ్యద్ షుజాత్ బుఖారి(53)
ఎక్కడ : లాల్‌చౌక్, శ్రీనగర్

హిందూ కాంగ్రెస్ చైర్మన్‌గా శ్రీప్రకాశ్
ప్రతి నాలుగేళ్లకు ఓసారి జరిగే ప్రపంచ హిందూ కాంగ్రెస్ (డబ్ల్యూహెచ్‌సీ) సదస్సుకు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)కి చెందిన ప్రొఫెసర్ డా. శ్రీప్రకాశ్ కొఠారి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. అమెరికాలోని చికాగోలో సెప్టెంబర్ 7 నుంచి మూడ్రోజులపాటు ఈ సదుస్సును నిర్వహిస్తారు.
స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11న చికాగోలో చేసిన చారిత్రక ప్రసంగానికి 125 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా చికాగోలో ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ సహా 80 దేశాల నుంచి 2,000 మంది ప్రతినిధులు పాల్గొంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ హిందూ కాంగ్రెస్ (డబ్ల్యూహెచ్‌సీ) చైర్మన్
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : ఎంఐటీ ప్రొఫెసర్ డా. శ్రీ ప్రకాశ్ కొఠారి
ఎక్కడ : చికాగో, అమెరికా

జీఎం సీఎఫ్‌ఓగా భారత సంతతి మహిళ
అమెరికాలో అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ జనరల్ మోటార్స్ (జీఎం) సంస్థకు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ)గా ఎన్‌ఆర్‌ఐ దివ్య సూర్యదేవర నియమితులయ్యారు. దీంతో ఆటో ఇండస్ట్రీ చరిత్రలోనే తొలిసారిగా ఈ పదవి చేపట్టనున్న మహిళగా రికార్డు సృష్టించారు. చెన్నైకి చెందిన 39 ఏళ్ల దివ్య ప్రస్తుతం జీఎం కార్పొరేట్ ఫైనాన్స్ విభాగానికి వైస్‌ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. 2013-17 మధ్య కాలంలో జీఎం అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థలో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జీఎం సీఎఫ్‌ఓగా భారత సంతతి మహిళ
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : దివ్య సూర్యదేవర
ఎక్కడ : అమెరికా

సీనియర్ పాత్రికేయుడు ఆదిరాజు కన్నుమూత
సీనియర్ పాత్రికేయుడు, తెలంగాణ పోరాట యోధుడు ఆదిరాజు వెంకటేశ్వర్‌రావు (78) అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లో జూన్ 14న కన్నుమూశారు. 60 ఏళ్ల పాటు పాత్రికేయ వృత్తిలో కొనసాగిన ఆదిరాజు జనతా, రాజధాని పత్రికలను నడిపారు. అలాగే ఆంధ్రభూమి, గోలకొండ, ఆంధ్రజ్యోతి, ఉదయం, దక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి పత్రికల్లో హైదరాబాద్, ఢిల్లీల్లో వివిధ హోదాల్లో పని చేశారు. తెలంగాణ 4వ రాష్ట్ర అవతరణ వేడుకలో ఉత్తమ పాత్రికేయుని అవార్డును ఆయన అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీనియర్ పాత్రికేయుడు కన్నుమూత
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : ఆదిరాజు వెంకటేశ్వర్‌రావు(78)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా

సదాశివశాస్త్రికి ఛాంపియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
అన్నమయ్య భక్త ప్రచార బృందం వ్యవస్థాపకుడు పప్పు సదాశివశాస్త్రికి ఛాంపియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. జూన్ 15న విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో 320 అన్నమయ్య కీర్తనలను 24 గంటల పాటు నిర్విరామంగా గానం చేసినందుకుగాను ఆయనకు ఈ గౌరవం దక్కింది. ఈ మేరకు ఛాంపియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ తుర్లపాటి పట్టాభిరాం ఆయనకు ధృవపత్రాన్ని అందించారు. సెప్టెంబర్‌లో మలేషియాలో జరిగే కార్యక్రమంలో సదాశివశాస్త్రికి అమేజింగ్ ఏషియన్ అవార్డును ప్రదానం చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఛాంపియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
ఎప్పుడు : జూన్ 15
ఎవరు : అన్నమయ్య భక్త ప్రచార బృందం వ్యవస్థాపకుడు పప్పు సదాశివశాస్త్రి
ఎక్కడ : విజయవాడ
ఎందుకు : అన్నమయ్య కీర్తనలను 24 గంటల పాటు నిర్విరామంగా పాడినందుకు

రిటైర్డు జడ్జి కోదండ రామయ్య కన్నుమూత
రిటైర్డ్ జడ్జి జస్టిస్ పమిడిఘంటం కోదండ రామయ్య (92) అనారోగ్యం కారణంగా జూన్ 15న ఢిల్లీలో కన్నుమూశారు. 1926లో జన్మించిన కోదండ రామయ్య మొదటిసారిగా 1952లో మద్రాసు హైకోర్టులో అడ్వకేటుగా చేరారు. 1982లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 1988 వరకు ఈ బాధ్యతల్లో ఉన్నారు. మరోవైపు ‘అర్ష విజ్ఞాన ట్రస్ట్’ అనే పబ్లిషింగ్ సంస్థకు వ్యవస్థాపక చైర్మన్‌గా ఆయన బాధ్యతలు నిర్వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రిటైర్డ్ జడ్జి కన్నుమూత
ఎప్పుడు : జూన్ 15
ఎవరు : పమిడిఘంటం కోదండ రామయ్య (92)
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : అనారోగ్యం కారణంగా

ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ కన్నుమూత
తెలంగాణ ఉద్యమ తొలితరం నేత, సోషలిస్టు పార్టీ నాయకుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ (85) జూన్ 16న హైదరాబాద్‌లో కన్నుమూశారు. 1933 జనవరి 27న జన్మించిన కేశవరావు జాదవ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్‌‌ట్స కళాశాలలో ఎంఏ పూర్తి చేశాడు. సిద్దిపేట, వరంగల్ ఆర్‌‌ట్స అండ్ సైన్స్ కళాశాలల్లో, హైదరాబాద్ సిటీ కాలేజీ, నిజాం కాలేజీ, సికింద్రాబాద్ పీజీ కాలేజీలలో ఇంగ్లిష్ అధ్యాపకుడిగా పనిచేశారు. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని పోలీసు కేసులు, అరెస్టులు, జైలు జీవితాన్ని ఎదుర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ ఉద్యమ తొలితరం నేత కన్నుమూత
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ (85)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా

గౌరీలంకేశ్ హత్య కుట్రకు ఆపరేషన్ అమ్మ’
కర్ణాటకకు చెందిన సీనియర్ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్య కుట్రకు ‘ఆపరేషన్ అమ్మ’ అని పేరు పెట్టినట్లు సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) విచారణలో జూన్ 16న వెల్లడైంది. ఆమెను హత్య చేయడానికి రహస్య సంకేతం ద్వారా కన్నడ, మరాఠీ, హిందీ, తెలుగు భాషల్లో నిందితులు మాట్లాడినట్లు తెలిసింది. బీజాపుర జిల్లా సిందగి తాలూకాకు చెందిన పరశురామ్ వాగ్మారేని ఈ హత్య కేసులో కీలక నిందితుడిగా తేల్చారు. 2017 సెప్టెంబర్ 5న బెంగళూరులో గౌరీలంకేశ్‌ను కాల్చి చంపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆపరేషన్ అమ్మ
ఎప్పుడు : జూన్ 17
ఎక్కడ : ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణలో
ఎందుకు : గౌరీ లంకేశ్‌ను హత్య చేసేందుకు

ఐసీఐసీఐ బ్యాంకు సీవోవోగా సందీప్ భక్షి
ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో)గా సందీప్ భక్షి జూన్ 19న బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవోగా పనిచేస్తున్న సందీప్ భక్షిని ఐసీఐసీఐ బ్యాంకు సీవోవోగా ఎంపిక చేస్తూ ఆ బ్యాంకు డెరైక్టర్ల బోర్డు నిర్ణయం జూన్ 18న నిర్ణయం తీసుకుంది.
వీడియోకాన్ గ్రూపునకు రుణాల మంజూరు వెనుక ఆర్థిక ప్రయోజనాలు పొందారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, ఎండీ చందా కొచర్‌పై బ్యాంకు స్వతంత్రంగా విచారణ చేపట్టింది. ఈ విచారణ పూర్తయ్యే వరకు సెలవుపైనే కొనసాగాలని చందాకోచర్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకు డెరైక్టర్ల బోర్డు కొత్త సీవోవోని ఎంపిక చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బాధ్యతలు చేపట్టిన ఐసీఐసీఐ బ్యాంకు కొత్త సీవోవో
ఎప్పుడు : జూన్ 19
ఎవరు : సందీప్ భక్షి

నీతి ఆయోగ్ సబ్ గ్రూప్‌లో చంద్రబాబు
వ్యవసాయం, ఉపాధి హామీ పథకం మధ్య సమన్వయ విధానం రూపొందించేందుకు ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ సబ్ గ్రూప్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చోటు దక్కింది. ఈ గ్రూప్‌కి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వం వహిస్తుండగా బిహార్, యూపీ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గుజరాత్ రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్నారు. వ్యవసాయం, ఉపాధి పథకానికి సబంధించి 3 నెలల్లో ఈ గ్రూప్ నివేదిక ను సమర్పిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నీతి ఆయోగ్ సబ్ గ్రూప్‌లో సభ్యత్వం
ఎప్పుడు : జూన్ 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఎందుకు : వ్యవసాయం, ఉపాధి హామీ పథకం మధ్య సమన్వయ విధానం రూపొందించేందుకు

నేరేళ్ల వేణుమాధవ్ కన్నుమూత
ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత నేరెళ్ల వేణుమాధవ్ (85) జూన్ 19న వరంగల్‌లో కన్నుమూశారు. పార్కిన్‌సన్స్, శ్వాసకోశ సంబంధ వ్యాధి కారణంగా ఆయన మరణించారు.
1932 డిసెంబర్ 28న వరంగల్‌లో శ్రీహరి, శ్రీలక్ష్మీ(అంబమ్మ) దంపతులకు జన్మించిన వేణు మాధవ్ బీఎ, బీకాం, బీఈడీ పూర్తి చేశాడు. దాదాపు 17 సంవత్సరాలపాటు టీచర్ ఉద్యోగం చేస్తూనే సెలవుల్లో మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చాడు. వేణుమాధవ్ మొదటిసారిగా నటుడు చిత్తూరు నాగయ్య గొంతును అనుకరించాడు. బైబిల్ నేపథ్యం ఆధారంగా తీసిన ‘టెన్ కమాండ్‌మెంట్స్’ సినిమాలోని సంభాషణల అనుకరణ ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మంచి పేరు తెచ్చింది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శించిన ఏకైక కళ మిమిక్రీ కాగా దానిని అమెరికా అధ్యక్షుడు జాన్‌ఎఫ్ కెనడీ గొంతుతో ఐరాసలో వేణుమాధవ్ మిమిక్రీ చేశాడు.
మిమిక్రీ కి గుర్తింపు రావడానికి, యూనివర్సిటీలో మిమిక్రీని ఓ కోర్సుగా అందుబాటులోకి తేవడానికి వేణుమాధవ్ కృషి చేశారు. 12 చిత్రాల్లో నటించడంతోపాటు అనేక అవార్డులను అందుకున్న ఆయన ఆత్మకథ ‘మిమిక్రీ కళ’ను శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీలో పాఠ్యాంశంగా బోధిస్తున్నారు.
అవార్డులు-హోదాలు
2001 లో పద్మశ్రీ పురస్కారం
1978 లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి కళాప్రపూర్ణ బిరుదు. ఏయూ, కేయూ, ఇగ్నో నుంచి గౌరవ డాక్టరేట్లు
1972-1978 వరకు ఎమ్మెల్సీగా సేవలు
1976-1977 ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డెరైక్టర్
1975 లో వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివెల్‌కు తెలుగు కాన్ఫరెన్స్ సెక్రటరీగా..
1974-1978 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యులు
1976-1978 కాకతీయ యూనివర్సిటీ సెనెట్ సభ్యులు, సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ (తంజావూర్) మెంబర్
1995-1996 దూరదర్శన్ ప్రోగ్రామ్ అడ్వయిజరీ కమిటీ మెంబర్
1993-1996: ఆంధ్రప్రదేశ్ టెలికం అడ్వయిజరీ కమిటీ మెంబర్
1993-1996 జోనల్ రైల్వే యూజర్ కమిటీ మెంబర్
1972-1975: ఏపీ లెజిస్లేటివ్ లైబ్రరీ కమిటీ మెంబర్
1974-1978: రవీంద్రభారతి కమిటీ మెంబర్
1975: ఏపీ అకాడమీస్ రివ్యూ కమిటీ మెంబర్
1973-1975 రోటరీయన్, రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ గౌరవ సభ్యులు
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ కన్నుమూత
ఎప్పుడు : జూన్ 19
ఎవరు : నేరెళ్ల వేణుమాధవ్ (85)
ఎక్కడ : వరంగల్
ఎందుకు : పార్కిన్‌సన్స్, శ్వాసకోశ సంబంధ వ్యాధి కారణంగా

హయ్యస్ట్ పెయిడ్ అథ్లెట్స్ జాబితాలో కోహ్లీ
Current Affairs ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న క్రీడాకారుల జాబితాలో ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి 2.4 కోట్ల డాలర్ల(రూ.161 కోట్లు)తో 83వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో అమెరికాకు చెందిన బాక్సింగ్ చాంపియన్ ఫ్లాయిడ్ మేవెదర్ 28.5 కోట్ల డాలర్ల(రూ.1,881 కోట్లు)తో అగ్రస్థానంలో ఉండగా అర్జెంటీనా ఫుట్ బాలర్ లియోనెల్ మెస్సీ రెండో స్థానం, సాకర్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో మూడో స్థానంలో ఉన్నారు. ఈ మేరకు ఫోర్బ్స్ పత్రిక ‘వరల్డ్స్ హయ్యస్ట్ పెయిడ్ అథ్లెట్స్ 2018’ పేరిట రూపొందించిన జాబితాను జూన్ 6న విడుదల చేసింది.
అగ్రస్థానంలో ఉన్న వంద మంది ఆటగాళ్ల ఉమ్మడి సంపాదన 3.8 బిలియన్ డాలర్లు(రూ. 2,580 కోట్లు). గతేడాదితో పోలిస్తే ఇది 23 శాతం పెరిగింది. 2013లో ‘ఫోర్బ్స్’ క్రీడాకారుల జాబితాలో ధోని 13, సచిన్ 51వ స్థానంలో నిలిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫోర్బ్స్ వరల్డ్స్ హయ్యస్ట్ పెయిడ్ అథ్లెట్స్ 2018లో చోటు
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ
ఎక్కడ : 83వ స్థానం

తొలి పార్లమెంటేరియన్ తిలక్ కన్నుమూత
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మొదటి పార్లమెంటేరియన్ కందాళ సుబ్రహ్మణ్య తిలక్ (98) జూన్ 8న విశాఖపట్నంలో కన్నుమూశారు. తొలి పార్లమెంట్ ఏర్పడిన 1952 నుంచి 1957 వరకు విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు. తిలక్ మొదట కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన అనంతరం సోషలిస్టు పార్టీలో చేరి లోక్‌సభకు ఎన్నికయ్యారు. న్యాయవిద్యలో పట్టభద్రుడైన తిలక్ మహారాజా కాలేజీ, బెనారస్ కళాశాల, బెల్గాంలలో విద్యాభ్యాసం చేశాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తొలి పార్లమెంటేరియన్ కన్నుమూత
ఎప్పుడు : జూన్ 8
ఎవరు : కందాళ సుబ్రహ్మణ్య తిలక్ (98)
ఎక్కడ : అక్కయ్యపాలెం, విశాఖపట్నం

యూపీఎస్సీ చైర్మన్‌గా అరవింద్ సక్సేనా
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తాత్కాలిక చైర్మన్‌గా అరవింద్ సక్సేనా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జూన్ 10న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత యూపీఎస్సీ చైర్మన్ వినయ్ మిట్టల్ పదవీకాలం జూన్ 19న ముగియనుండటంతో ఆయన స్థానంలో సక్సేనా జూన్ 20న బాధ్యతలు స్వీకరించనున్నారు. సక్సేనా ప్రస్తుతం యూపీఎస్సీ సభ్యుడిగా ఉన్నారు. 1978 బ్యాచ్ ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారి అయిన సక్సేనా భారత నిఘాసంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)తో పాటు ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్‌లో పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూపీఎస్సీ కొత్త చైర్మన్ నియామక
ఎప్పుడు : జూన్ 10
ఎవరు : అరవింద్ సక్సేనా

బంగ్లా రచయిత షాజహాన్ హత్య
బంగ్లాదేశ్‌లోని ప్రముఖ రచయిత, ప్రచురణ కర్త షాజహాన్ బచ్చు(60) జూన్ 12న హత్యకు గురయ్యారు. ఆయన స్వగ్రామమైన మున్షీగంజ్ జిల్లా కకాల్డీలో గుర్తుతెలియని వ్యక్తులు షాజహాన్‌పై కాల్పులు జరపడంతో కన్నుమూశారు. షాజహాన్ రాసిన ‘రోంగ్ ధాంగ్ తమాషా’ కవితా సంపుటి బాగా ప్రాచుర్యం పొందింది. ఈ క్రమంలో ఇస్లాం తీవ్రవాద సంస్థల నుంచి గతంలో ఆయనకు బెదిరింపులు వచ్చాయి. షాజహాన్ ఢాకా కేంద్రంగా బిషాకా ప్రోక్షణ్ అనే ప్రచురణ సంస్థ ద్వారా లౌకిక వాద భావనలతో ఉన్న కవిత్వ పుస్తకాల్ని ప్రచురిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బంగ్లాదేశ్‌కి చెందిన రచయిత హత్య
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : షాజహాన్ బచ్చు(60)
ఎక్కడ : కకాల్డీ, మున్షీగంజ్ జిల్లా, బంగ్లాదేశ్
ఎందుకు : లౌకిక వాద కవిత్వాన్ని ప్రచురిస్తున్నందుకు

విజిలెన్స్ కమిషనర్‌గా శరద్ కుమార్
కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి, ఎన్‌ఐఏ మాజీ సారథి శరద్ కుమార్ (62) నియమితులయ్యారు. 1979 బ్యాచ్ హరియాణా కేడర్ ఐపీఎస్ అధికారి అయిన శరద్ 2022 వరకూ ఈ పదవిలో కొనసాగనున్నారు.

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఎం.కె. జైన్
Current Affairs రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగవ డిప్యూటీ గవర్నర్‌గా మహేశ్ కుమార్ జైన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జూన్ 4న ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లపాటు ఆయన ఈ పదవీలో ఉంటారు. 2017 మార్చి నుంచి ఐడీబీఐ మేనేజింగ్ డెరైక్టర్‌గా జైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2017 జూలైలో ఎస్.ఎస్.ముంద్రా పదవీకాలం ముగియడంతో జైన్‌ను ఆయన స్థానంలో నియమించారు. ఆర్‌బీఐలో ప్రస్తుతం విరాల్ వి ఆచార్య, ఎన్.ఎస్.విశ్వనాథన్, బి.పి.కనుంగో లు డిప్యూటీ గవర్నర్‌లుగా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ నియామకం
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : మహేశ్ కుమార్ జైన్

యంగెస్ట్ ఆథర్‌గా అసోం బాలుడు
అసోంలోని ఉత్తర లఖింపూర్ జిల్లాకు చెందిన నాలుగేళ్ల అయాన్ గగోయ్ గోహెయిన్ అనే బాలుడు యంగెస్ట్ ఆథర్‌గా గుర్తింపు పొందాడు. దీంతోపాటు ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లోనూ అయాన్ చోటు సంపాదించుకున్నాడు. ‘హనీకాంబ్’ పేరుతో అయాన్ రాసిన పుస్తకం ఈ ఏడాది జనవరిలో ప్రచురితమైంది. ఈ పుస్తకంలో 30 కథలతోపాటు కొన్ని బొమ్మలు ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యంగెస్ట్ ఆథర్‌గా నాలుగేళ్ల బాలుడు
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : అయాన్ గగోయ్ గోహెయిన్
ఎక్కడ : లఖింపూర్, అసోం
ఎందుకు : హనీకాంబ్ అనే పుస్తకాన్ని రచించినందుకు

కోహ్లీ మైనపు బొమ్మ ఆవిష్కరణ
దేశ రాజధాని న్యూఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ తన మైనపు బొమ్మను జూన్ 6న ఆవిష్కరించాడు. ఇప్పటికే ప్రముఖ క్రీడాకారులైన కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, లయోనల్ మెస్సీ, ఉసేన్ బోల్ట్‌ల మైనపు బొమ్మలు టుస్సాడ్స్ మ్యూజియలో ఉన్నాయి. కోహ్లీ 2008లో మలేషియాలో జరిగిన అండర్-19 ప్రపంచకప్ ను భారత్‌కు అందించడంలో కీలక పాత్ర వహించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ క్రికెటర్ మైనపు బొమ్మ ఆవిష్కరణ
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : విరాట్ కోహ్లీ
ఎక్కడ : మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం

టెస్సీ థామస్‌కు కీలక పదవి
క్షిపణుల తయారీ పథకాలకు సారథ్యం వహించిన తొలి మహిళ శాస్త్రవేత్తగా పేరుగాంచిన ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త డాక్టర్ టెస్సీ థామస్ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ వైమానిక విభాగం డెరైక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. డాక్టర్ సీపీ రామనారాయణన్ స్థానంలో జూన్ 1న ఆమె ఈ బాధ్యతల్ని చేపట్టారు. రెండేళ్ల వ్యవధిలో వైమానిక విభాగం డెరైక్టర్ జనరల్‌గా బాధ్యతల్ని చేపట్టిన మూడో వ్యక్తి టెస్సీ థామస్.

Published date : 03 Jul 2018 05:42PM

Photo Stories