Nandamuri Taraka Ratna: నందమూరి తారకరత్న కన్నుమూత.. ఒకేసారి 9 సినిమాలతో రికార్డు
23 రోజులపాటు చావు బతుకుల మధ్య పోరాటం చేసిన తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని అదే రోజు రాత్రి హైదరాబాద్‌కు తరలించారు. తారకరత్న మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
విదేశీ వైద్యులను రప్పించినా..: లోకేశ్ పాదయాత్ర ప్రారంభమైన జనవరి 27న గుండెపోటుకు గురైన తారకరత్నకు సుమారు 45 నిమిషాల పాటు మెదడుకు రక్త ప్రసరణ ఆగి పోయింది. ఆ సమయంలో రక్తం గడ్డకట్టడంతో మెదడులో ఒకవైపు వాపు వచ్చినట్టు తెలిసింది. అప్పటి నుంచి బ్రెయిన్‌కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేస్తూ వచ్చారు. తొలుత బెంగళూరు నిమ్హాన్స్ ఆస్పత్రి నుంచి ప్రత్యేకంగా వైద్యులను పిలిపించి చికిత్స అందించగా, వారం నుంచి విదేశాల నుంచి ప్రత్యేకంగా న్యూరోసర్జన్లు, న్యూరాలజిస్టులను కూడా రప్పించి చికిత్స అందించారు. అయినప్పటికీ తారకరత్న ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. మధ్యలో పరిస్థితి కొంచెం మెరుగైందని, చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్నారనే వార్తలు వచ్చినా, రెండు రోజులుగా పరిస్థితి మరీ క్షీణించడంతో విషమంగా మారింది.
ఒకేసారి 9 సినిమాలతో రికార్డు
20 ఏళ్ళ వయసులోనే ఇండస్ట్రీకి వచ్చిన తారకరత్న ఒకేసారి 9 సినిమాలతో ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన ఏకైక హీరో. దేశంలోనే కాకుండా.. ప్రపంచంలోనే ఈ హీరోకి ఈ రికార్డ్‌కి సాధ్యం కాలేదు. 2001లో ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తారకరత్న. ఒకేరోజు 9 సినిమాలను మొదలుపెట్టి సంచలనం సృష్టించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కూడా ఏ హీరో ఈ రికార్డ్‌ని బ్రేక్ చేయలేకపోయారు. నందమూరి తారకరత్న ప్రారంభించిన ఆ తొమ్మది సినిమాలలో.. ఒకటో నెంబర్ కుర్రాడు, తారక్, భద్రాద్రి రాముడు, నో, యువరత్న లాంటి సినిమాలు విడుదల కాగా.. కొన్ని పూజా కార్యక్రమాలతోనే ఆగిపోయాయి. మొత్తం 23 సినిమాలు, ఒక వెబ్ సిరీస్‌లో తారకరత్న నటించారు. ఆయన చిత్రరంగ ప్రవేశమే ఒక రికార్డు. అమరావతి సినిమాతో ఆయనను నంది అవార్డు వరించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో కథానాయకుడు, ప్రతినాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించారు.
జీవిత విశేషాలు..
ఎన్టీఆర్ ఐదో కుమారుడైన నందమూరి మోహనకృష్ణ, శాంతిమోహన దంపతులకు 1983 ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లో జన్మించారు తారకరత్న. తల్లి శాంతి ప్రముఖ నిర్మాత లయన్ యు. విశ్వేశ్వరరావు కుమార్తె. ఈయన అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఛాయాగ్రాహకుడిగా మోహనకృష్ణకు మంచి పేరుంది. చెన్నైలో ఏడో తరగతి వరకు చదువుకున్నారు. ఆ తరువాత హైదరాబాద్‌కు మకాం మార్చిన తారకరత్న జూబ్లీహిల్స్ భారతీయ విద్యాభవన్‌లో ఉన్నత పాఠశాల చదువు పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని విజ్ఞాన్ భవన్‌లో బీటెక్ చదువుకున్నారు.
తారకరత్న అలేఖ్య రెడ్డిని 2012 ఆగష్టు 2న సంఘీ టెంపుల్‌లో కొంత మంది బంధు మిత్రలు సమక్షంలో ప్రేమ వివాహాం చేసుకున్నాడు.తండ్రి మోహన కృష్ణతో పాటు మిగతా నందమూరి కుటుంబ సభ్యుల అభీష్టానికి విరుద్ధంగా ఈ పెళ్లి జరిగింది. అలేఖ్య అంతకు ముందే ప్రముఖ రాజకీయ నాయకుడు టీడీపీ లీడర్, దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడైన సందీప్ రెడ్డిని వివాహాం చేసుకుంది. ఆ తర్వాత విభేదాలు రావడంతో అతనికి విడాకులు ఇచ్చేసింది.
తారకరత్న, అలేఖ్య రెడ్డి ఇద్దరు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. అది కాస్త ప్రేమగా మారి ఏడడుగుల బంధంతో ఒకటతయ్యారు. వీరికో కూతురు కూడా ఉంది. ఇక తారకరత్న భార్య అలేఖ్య ఈయన హీరోగా నటించిన ‘నందీశ్వరుడు’ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. అలేఖ్యరెడ్డి ప్రముఖ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత రాజ్యసభ సభ్యుడైన విజయసాయి రెడ్డి భార్య చెల్లెలి కూతురు. ఈయనకు కూతురు వరుస అవుతోంది. అంటే తారకరత్న విజయసాయి రెడ్డికి అల్లుడు వరస అవుతాడు.