Skip to main content

సెప్టెంబర్ 2018 జాతీయం

ఆధార్ రాజ్యాంగబద్ధమే : సుప్రీంకోర్టు
ఆధార్ పూర్తిగా రాజ్యంగబద్ధమైనదే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆధార్ ను తప్పనిసరిగా అమలుచేయాల్సిందేనని 2018, సెప్టెంబర్ 26న తీర్పునిచ్చింది. ఆధార్ ద్వారా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందనేది పూర్తి అవాస్తవమని 1,448 పేజీల తీర్పులో కోర్టు పేర్కొంది.
బ్యాంకు అకౌంట్లు, మొబైల్ కనెక్షన్లు, స్కూల్ అడ్మిషన్లకు ఆధార్ తప్పనిసరి కాదని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం 4:1 తీర్పుతో స్పష్టం చేసింది. ఈ తీర్పులో జస్టిస్ చంద్రచూడ్ ఒక్కరే ఆధార్ చట్టంపై భిన్నమైన తీర్పు చెప్పారు. ఆధార్‌చట్టాన్ని పార్లమెంటులో ద్రవ్యబిల్లుగా ఆమోదించడాన్ని జసి్‌‌టస్ చంద్రచూడ్ తప్పుపట్టగా మిగిలిన సభ్యులు సమర్థించారు.
సెక్షన్ 57 అసంబద్ధం
టెలికాం కంపెనీలతోపాటు, కార్పొరేట్ సంస్థలకు బయోమెట్రిక్ ఆధార్ డేటాను పొందేందుకు అనుమతించిన ఆధార్ (ఆర్థిక, ఇతర సబ్సిడీలు, పథకాలు, సేవల లబ్ధి కల్పించే) చట్టం - 2016లోని సెక్షన్ 57ను సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఆధార్ డేటా ఆర్నెల్ల కంటే ఎక్కువరోజులు దాచుకోవడానికి వీల్లేదని ఆదేశించింది. అక్రమ వలసదారులకు ఆధార్ కార్డులు జారీ కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలంది.
భద్రతా కారణాలు చెల్లవు
ఆధార్ చట్టంలోని 33వ సెక్షన్‌ను కోర్టు కొట్టివేసింది. దేశ భద్రత దృష్ట్యా వ్యక్తుల ఆధార్ సమాచారాన్ని బలవంతంగా సేకరించడానికి ఈ సెక్షన్ ప్రభుత్వానికి అధికారం కల్పించింది.ఇప్పుడీ సెక్షన్‌ను కొట్టివేయడంతో భద్రతా కారణాలు చెప్పి ఆధార్ వివరాలు లాక్కోవడం కుదరదు.
ఆధార్ తప్పనిసరైన సేవలు
  • పాన్ కార్డుకు అనుసంధానం తప్పనిసరి
  • ఐటీ రిటర్న్స్ దాఖలుకు ఆధార్ నెంబరును విధిగా పేర్కొనాలి.
  • ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సబ్సిడీలు పొందడానికి ఆధార్ కార్డు తప్పనిసరి.
ఆధార్ అవసరం లేని సేవలు
  • బ్యాంకు ఖాతా తెరవడానికి..
  • సుప్రీం కోర్టు ఆధార్ చట్టంలోని 57వ సెక్షన్‌ను రద్దు చేసినందున టెలికాం, ఆన్‌లైన్ వాణిజ్య సంస్థలకు ఆధార్ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.
  • ప్రైవేటు కంపెనీలు ఆధార్ కోసం ఒత్తిడి చేయడానికి వీల్లేదు. అంటే ఇక నుంచి సిమ్ కార్డుకు, ఆన్‌లైన్ షాపింగ్‌కు ఆధార్ నెంబరు చెప్పనవసరం లేదు.
  • విద్యా సంస్థల్లో ప్రవేశానికి కూడా ఇక నుంచి ఆధార్ అవసరం లేదు. ఆధార్ కార్డు తీసుకురాలేదన్న కారణంగా ఏ బాలుడు/బాలికకు ఎలాంటి ప్రయోజనాలను (పథకాలకు సంబంధించి) నిరాకరించరాదు.
  • సీబీఎస్‌ఈ, యూజీసీ, నీట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఇక ఆధార్ సంఖ్యను తప్పనిసరిగా వెల్లడించాల్సిన అవసరం లేదు.
ఆధార్ కేసు కొనసాగిన క్రమము
ఆధార్ రాజ్యాంబద్ధతపై న్యాయస్థానంలో దాఖలైన కేసు తొమ్మిదేళ్లు నడిచింది. ఆధార్‌ను వ్యతిరేకిస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
  • 2009, జనవరి: యుఐడీఏఐ ఏర్పాటు.
  • 2010, సెప్టెంబర్: తొలి ఆధార్ నెంబరు కేటాయింపు.
    డిసెంబర్: పార్లమెంటులో ఆధార్ బిల్లు.
  • 2011 సెప్టెంబర్: 10కోట్లకు చేరిన ఆధార్ పొందిన వారి సంఖ్య.
    డిసెంబర్: ఆధార్ బిల్లుపై స్టాండింగ్ కమిటీ రిపోర్టు.
  • 2012, నవంబర్: ఆధార్ చట్టబద్ధతను సవాలు చేస్తూ రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కేఎస్ పుట్టుస్వామి, మరికొందరు సుప్రీం కోర్టులో పిల్ దాఖలు.
  • 2013, నవంబర్: ఈ కేసులో ప్రతివాదులుగా చేరాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీం ఆదేశం.
  • 2015, అక్టోబర్: ఆధార్ స్వచ్ఛందమేనంటూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
  • 2016, మార్చి 3: మళ్లీ లోక్‌సభకు ఆధార్ బిల్లు-2016. ఆర్థిక బిల్లుగా దీనికి ఆమోదం. ఆధార్ పొందిన వారి సంఖ్య 98 కోట్లు.
    సెప్టెంబర్: అమల్లోకి వచ్చిన ఆధార్ చట్టం.
  • 2017,మే: ఆధార్ బిల్లును ఆర్థిక బిల్లుగా పరిగణించడంపై సుప్రీంలో కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ పిటిషన్.
  • 2017, ఆగస్టు 24: వ్యక్తిగత గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు ధర్మాసనం రూలింగ్.
  • 2018, జనవరి 17: ఆధార్ కేసు విచారణను ప్రారంభించిన సుప్రీం కోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం.
    సెప్టెంబర్ 26: ఆధార్ చట్టం రాజ్యాంగబద్ధతను సమర్థించిన సుప్రీంకోర్టు. చట్టంలోని కొన్ని నిబంధనలను కొట్టివేత.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆధార్ రాజ్యాంగ బద్ధమే
ఎప్పుడు : 2019, సెప్టెంబర్ 26
ఎవరు : సుప్రీంకోర్టు


‘కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్’ కి శంకుస్థాపన
Current Affairs ఢిల్లీలో నిర్మించనున్న ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్(ఐఐసీసీ)కు ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 20న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఐఐసీసీ భవిష్యత్‌లో పరిశ్రమలు, స్టార్టప్‌లకు కేంద్రంగా నిలుస్తుందని, 5 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించేందుకు దోహదపడుతుందని అన్నారు. 2022 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం రెట్టింపై 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ కు శంకుస్థాపన
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఢిల్లీ

లైంగిక నేరస్తుల జాతీయ రిజిస్టర్ ప్రారంభం
మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాలను అరికట్టేందుకు లైంగిక నేరస్తుల జాతీయ రిజిస్టర్ (ఎన్‌ఆర్‌ఎస్‌ఓ)ను కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 21న ప్రారంభించింది. ఈ రిజిస్టర్‌లో 4.40 లక్షల మంది నేరస్తుల పేర్లు, చిరునామా, వేలిముద్రలు, ఆధార్, పాన్ నంబర్లు, డీఎన్‌ఏ నమూనాలు వంటి ఇతర అంశాలను పొందుపరిచారు. దేశంలోని లైంగిక నేరస్తుల వివరాలన్నీ ఇలా ఒకేచోట పొందుపరచడం ఇదే ప్రథమం. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) ఈ రిజిస్టర్‌ను నిర్వహిస్తుంది.
2005 నుంచి నేరాలకు పాల్పడిన వ్యక్తుల వివరాలను ఈ ఎన్‌ఆర్‌ఎస్‌ఓలో చేర్చగా త్వరలో బాల నేరస్తుల వివరాలను కూడా నమోదు చేయనున్నారు. ఈ రిజిస్టర్‌లోని సమచారాన్ని నేరాల తీవ్రత తక్కువగా ఉన్న కేసుల్లో 15 ఏళ్లు, తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో 25 ఏళ్లు భద్రపరుస్తారు. గ్యాంగ్‌రేప్‌తో పాటు రేప్ చేసేటప్పుడు బాధితురాలిని హింసించడం వంటి క్రూరమైన చర్యలకు పాల్పడిన నేరస్తుల డేటాను జీవితాంతం ఉంచుతారు.
ఇప్పటికే అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ట్రినిడాడ్, టొబాగో దేశాలు ఎన్‌ఆర్‌ఎస్‌ఓ తరహా డేటాబేస్‌లను నిర్వహిస్తున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లైంగిక నేరస్తుల జాతీయ రిజిస్టర్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : మహిళలు, చిన్నారులపై జరిగే లైంగిక నేరాలను అరికట్టేందుకు

భారత్‌లో 27.5 శాతానికి తగ్గిన పేదరికం
భారత్‌లో 2005-06 నుంచి 2015-16 మధ్య కాలంలో 54.7 శాతంగా ఉన్న బహుముఖ పేదరికం 27.5 శాతానికి తగ్గింది. ఈ మేరకు ప్రపంచ బహుముఖ పేదరిక సూచీ (ఎంపీఐ)-2018ని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ), ఆక్స్‌ఫర్డ్ పేదరిక, మానవవనరుల అభివృద్ధి నివేదిక (ఓపీహెచ్‌ఐ) లు సెప్టెంబర్ 20న సంయుక్తంగా విడుదల చేశాయి.
ఎంపీఐ-2018 ప్రకారం బహుముఖ పేదరికం ప్రముఖంగా బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో ఉంది. ఈ నాలుగు రాష్ట్రాల్లో దాదాపు 19.6 కోట్ల మంది పేదలు ఉన్నారు. బహుముఖ పేదరికాన్ని తగ్గించడంలో జార్ఖండ్ ముందంజలో ఉండగా ఢిల్లీ, కేరళ, గోవాల్లో బహుముఖ పేదరికం తక్కువగా ఉంది. బహుముఖ పేదరికానికి ప్రధాన కారణం పోషకాహార లోపం.
భారత్‌లో ప్రస్తుతం 36.4 కోట్ల మందికి ఆరోగ్యం, పోషకాహారం, పాఠశాల విద్య, పారిశుధ్యం వంటి సౌకర్యాలు అందడం లేదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 130 కోట్ల మంది ప్రజలు బహూరూపక పేదరికంలో ఉండగా వీరిలో 46 శాతం మంది తీవ్రమైన పేదరికంలో ఉన్నారు. ఆసియా దేశాలైన నేపాల్ (35.3 శాతం), బంగ్లాదేశ్ (43.9 శాతం), పాకిస్తాన్ (43.9 శాతం)లలో కూడా ఎక్కువ బహుముఖ పేదరికం ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లో 27.5 శాతానికి తగ్గిన పేదరికం
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : బహుముఖ పేదరిక సూచీ (ఎంపీఐ)-2018

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భారత్ భేష్
బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడంలో భారత్ గతేడాది గణనీయమైన పురోగతి సాధించిందని అమెరికా అధికార నివేదిక ఒకటి వెల్లడించింది. 2017లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో పురోగతి సాధించిన 14 దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. అమెరికా కార్మిక శాఖ సెప్టెంబర్ 22న విడుదల చేసిన ‘చైల్డ్ లేబర్ అండ్ ఫోర్స్‌డ్ లేబర్’వార్షిక నివేదికలో ఈ వివరాలున్నాయి. బాల కార్మికవ్యవస్థ నిర్మూలనకు ప్రపంచంలోని 132 దేశాలు తీసుకుంటున్న చర్యలను కచ్చితంగా అధ్యయనం చేసేందుకు ఈ ఏడాది మరింత కఠిన ప్రమాణాలను వాడినట్లు నివేదిక పేర్కొంది. దీని ప్రకారం కొలంబియా, పరాగ్వే, భారత్‌సహా 14 దేశాలే ఈ ప్రమాణాలను అందుకున్నట్లు తెలిపింది. భారత ప్రభుత్వం బాల కార్మిక చట్టంలో చేసిన సవరణలతోపాటు చట్టాన్ని సరిగ్గా అమలు చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటీ : భారత్ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో పురోగతి
ఎవరు : చైల్డ్ లేబర్ అండ్ ఫోర్స్‌డ్ లేబర్
ఎక్కడ : భారతదేశం

ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభం
దేశంలోని పేదలకు రూ.5లక్షల ఆరోగ్య బీమాను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆయుష్మాన్ భారత్ (ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 23న ప్రారంభించారు. జార్ఖండ్‌లోని రాంచీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్‌ను ప్రారంభించిన ప్రధాని.. పేదల సేవకు ఉద్దేశించిన పథకాల్లో ఇది అత్యంత ప్రభావవంతమైందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 23 నుంచే ఈ పథకం దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ‘పీఎంజేఏవై - ఆయుష్మాన్ భారత్ పథకం.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం. ఈ పథకం ద్వారా భారత్‌లో లబ్ధిపొందేవారి జనాభా.. అమెరికా, కెనడా, మెక్సికోల జనాభా మొత్తంతో సమానం’ అని మోదీ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా రెండో, మూడో తరగతి నగరాల్లో 2,500 ఆసుపత్రులు ఏర్పాటుకానున్నాయన్నారు. ‘ఇప్పటికే 13వేల ఆసుపత్రులు ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగమయ్యాయి.
పథకం ప్రత్యేకతలివి..
  • సమాజంలో పదికోట్ల వెనుకబడిన కుటుంబాల్లోని దాదాపు 50 కోట్ల మంది ఈ పథకం పరిధిలోకి వస్తారు.
  • ఆధార్ కార్డు తప్పనిసరి కాదు. అయితే లబ్ధిదారుడిగా నమోదు చేయించుకునేందుకు ఎన్నికల గుర్తింపు కార్డు లేదా రేషన్ కార్డును చూపించాలి.
  • గ్రామాలు, పట్టణాల్లో జరిపిన తాజా సామాజిక ఆర్థిక కుల గణన (ఎస్‌ఈసీసీ) ఆధారంగా డీ1, డీ2, డీ3, డీ4, డీ5, డీ7 కేటగిరీల్లో ఉన్నవారు లబ్ధిదారులవుతారు. ఎస్‌ఈసీసీ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 8.03 కోట్ల కుటుంబాలు, పట్టణాల్లో 2.33 కోట్ల కుటుంబాలు ఈ పథకాన్ని పొందవచ్చు.
  • ఇప్పటికే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనలో భాగంగా ఉన్నవారినీ ఆయుష్మాన్‌తో జోడిస్తారు. దేశవ్యాప్తంగా 445 జిల్లాల్లో ఈ పథకం ప్రారంభమైంది.
  • ఈ పథకంలో గుండెకు బైపాస్ శస్త్రచికిత్స, మూత్రపిండాలు, కాలేయ సమస్యలు, మోకాలిచిప్ప మార్పిడులు, మధుమేహం సహా 1,300కు పైగా వ్యాధులు వర్తిస్తాయి.
  • ఒక కుటుంబంలో ఇంతమందికే అన్న నిబంధనేమీ లేదు. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు క్యాష్‌లెస్, పేపర్‌లెస్ వైద్యాన్ని అందజేస్తారు.
  • ఈ పథకంలో లబ్ధిదారులు ఆసుపత్రి పాలైతే.. చికిత్స కోసం ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. అయితే ప్రభుత్వం సూచించిన లేదా.. పథకం జాబితాలో ఉన్న ఆసుపత్రుల్లోనే చికిత్స చేయించుకోవాలి.
  • ఇలాంటి ఆసుపత్రుల్లో ఆయుష్మాన్ మిత్ర హెల్ప్ డెస్క్‌ల్లో సరైన గుర్తింపుకార్డులు చూపించాలి.
  • పథకం అమలును పర్యవేక్షించే నేషనల్ హెల్త్ ఏజెన్సీ (ఎన్‌హెచ్‌ఏ) mera.pmjay.gov.in సైట్‌ను, 14555 హెల్ప్‌లైన్ నెంబర్‌ను ప్రారంభించింది.
  • లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్ ఉన్న లేఖలు ఇస్తారు. వీటిని చూపించి వైద్యం చేయించుకోవాలి.
  • ఇప్పటికే 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. తెలంగాణ, ఒడిశా, ఢిల్లీ, కేరళ, పంజాబ్ ప్రభుత్వాలు మాత్రం ఒప్పందంపై సంతకాలు చేయలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటీ : ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన
ఎవరు : నరేంద్ర మోదీ
ఎప్పుడు : సెప్టెంబర్ 23 నుంచి
ఎక్కడ : రాంచీ
ఎందుకు : పేదల ఉచిత వైద్యం

రాజస్తాన్‌లో తొలి జికా కేసు
రాజస్తాన్‌లో సెప్టెంబర్ 23న తొలి జికా కేసు నమోదైంది. జైపూర్‌లోని శాస్త్రి నగర్‌కు చెందిన ఓ మహిళ కళ్లు ఎర్రబారడం, కీళ్లనొప్పులు, బలహీనత వంటి లక్షణాలతో సెప్టెంబర్ 11న స్థానిక స్వామి మాన్ సింగ్ (ఎస్‌ఎమ్‌ఎస్) ఆస్పత్రిలో చేరింది. తొలుత వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ లేవని నిర్ధారణ అయింది. దీంతో జికా సోకిందనే అనుమానంతో ఆమె రక్త నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ)కి పంపించారు. పరీక్షల్లో జికా వైరస్ సోకినట్లు తేలిందని ఎస్‌ఎమ్‌ఎస్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, వైద్యుడు యూఎస్ అగర్వాల్ ప్రకటించారు. రాష్ట్రంలో ఇదే మొదటి జికా కేసు అని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటీ : రాజస్తాన్‌లో తొలి జికా కేసు నమోదు
ఎప్పుడు : సెప్టెంబర్ 23న
ఎక్కడ : రాజస్తాన్‌లో

పది లక్షల మందికి 19 మంది జడ్జీలు
దేశంలో ప్రతి పది లక్షల మందికి సరాసరిన 19 మంది చొప్పున జడ్జీలున్నారని కేంద్ర న్యాయ శాఖ వెల్లడించింది. ఈ మేరకు 2018 మార్చిలో తయారు చేసిన నివేదికలోని వివరాలను సెప్టెంబర్ 24న తెలియజేసింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో జడ్జీలు- ప్రజల నిష్పత్తి 10,00,000:19.49గా ఉంది. దిగువ కోర్టుల్లో 5,748, హైకోర్టుల్లో 406 జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దిగువ కోర్టుల్లో ఆమోదిత సిబ్బంది సంఖ్య 22,474 కాగా ప్రస్తుతం 16,726 మందే పనిచేస్తున్నారు. అలాగే, హైకోర్టుల్లో 1079 గాను ప్రస్తుతం 673 మంది సిబ్బందే ఉన్నారు. సుప్రీంకోర్టులో 31 మంది న్యాయమూర్తులకు గాను 25 మంది ఉన్నారు.
జడ్జీల పోస్టుల్లో ఖాళీల కారణంగా దేశ వ్యాప్తంగా జిల్లా, దిగువ స్థాయి కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య 2.76 కోట్లకు చేరింది. ప్రతి పది లక్షల మంది ప్రజలకు 50 మంది జడ్జీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని 1987లోనే న్యాయ కమిషన్ ప్రతిపాదించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పది లక్షల మందికి 19 మంది జడ్జీలు
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : కేంద్ర న్యాయశాఖ
ఎక్కడ : దేశంలో

సిక్కింలో తొలి విమానాశ్రయం ప్రారంభం
సిక్కింలో నిర్మించిన తొలి విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 24న ప్రారంభించారు. దీంతో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 100కు చేరింది. సిక్కింలోని పాక్‌యాంగ్ పట్టణంలో సముద్రమట్టానికి 4,500 అడుగుల ఎత్తులో కొండలపై 201 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించారు. భారత్-చైనా సరిహద్దుకు 60 కి.మీ దూరంలో తొమ్మిదేళ్ల క్రితం ఈ విమానాశ్రయ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది.
కొత్తగా ఓ ప్రాంతంలో పూర్తిస్థాయిలో నిర్మించే ఎయిర్‌పోర్టును గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయంగా పిలుస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సిక్కింలో తొలి విమానాశ్రయం ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : పాక్‌యాంగ్ పట్టణం, సిక్కిం

కోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం
రాజ్యాంగ, జాతీయ ప్రయోజనాలున్న కేసుల విచారణనను కోర్టుల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. రాజ్యాంగ ధర్మాసనాలు విచారిస్తున్నప్పుడు ప్రత్యక్ష ప్రసారానికి అనుమతిస్తున్నామని సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సెప్టెంబర్ 26న వెల్లడించింది. కోర్టుల్లో పెట్టే కెమెరాలను సూర్యకాంతితో పోల్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. సూర్యుడి వెలుగు అత్యుత్తమ క్రిమిసహారిణి, ఈ కెమరాలు పారదర్శకత తెచ్చేందుకు సాయపడతాయని పేర్కొంది.
ప్రత్యక్ష ప్రసారాల కోసం ముందుగా విచారణ జరుపుతున్న కోర్టు అనుమతిని లిఖితపూర్వకంగా తీసుకోవాలి. పరిస్థితులకు తగ్గట్లుగా లేదా ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భంలో విచారణ మధ్యలోనైనా ప్రత్యక్ష ప్రసారాలను నిలుపుదల చేసేందుకు కోర్టుకు అధికారం ఉంది. కోర్టులో జరుగుతున్న విచారణను నిర్దిష్ట సమయం (దాదాపు పది నిమిషాలు) ఆలస్యంగా ప్రసారం చేయాలని సూచించింది. బయటకు వెళ్లకూడని సమాచారం ఏదైనా ఉంటే దానిని ఎడిటింగ్‌లో కోర్టు తీసేయవచ్చు. వివాహ వివాదాలు, లైంగిక దాడుల వంటి సున్నితమైన కేసులను ఎప్పటికీ ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఇంగ్లండ్, జర్మనీ, ఐర్లాండ్, ఇజ్రాయెల్ తదితర దేశాల్లో కోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారం ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : సుప్రీంకోర్టు

పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు
ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించవచ్చని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ మేరకు కోటా అమలుకు ముందు రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీల వెనకబాటుతనంపై సమాచారం సేకరించాల్సిన అవసరం లేదని సెప్టెంబర్ 26న తీర్పునిచ్చింది. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీల పదోన్నతులకు ఈ నిబంధనే అడ్డుగా ఉందని కేంద్ర ప్రభుత్వం చేబుతోంది. దళిత వర్గాల పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలు కోసం పలు షరతులు విధించిన 2006 నాటి ఎం.నాగరాజ్ కేసు తీర్పును సమీక్షించేందుకు కోర్టు నిరాకరించింది. ఈ అంశాన్ని ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించాల్సిన అవసరం లేదని స్పష్టతనిచ్చింది.
ఎస్సీ, ఎస్టీల వెనకబాటుతనాన్ని ప్రతిబింబించే సమాచారాన్ని సేకరించాలని నాగరాజ్ కేసులో కోర్టు తుది నిర్ణయానికి రావడం 1992 నాటి ఇందిరా సహనీ కేసు(మండల్ కమిషన్ కేసు)లోని తీర్పుకు విరుద్ధంగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో, కోటా అమలు వ్యవహారంలో అలాంటి సమాచార సేకరణ చెల్లుబాటు కాదని తేల్చిచెప్పింది. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్ వర్తింపజేయాలన్న నాగరాజ్ తీర్పులోని భాగాన్ని బెంచ్ సమర్థించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించవచ్చు
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : సుప్రీకోర్టు

ప్రభుత్వ సంస్థగా జీఎస్‌టీఎన్
జీఎస్‌టీకి ఐటీ వ్యవస్థను అందించే జీఎస్‌టీ నెట్‌వర్క్ (జీఎస్‌టీఎన్) ప్రభుత్వ సంస్థగా మార్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 26న ఆమోదించింది. దీంతో జీఎస్‌టీఎన్ ప్రభుత్వ సంస్థగా మారింది. ప్రస్తుతం జీఎస్‌టీఎన్‌లో కేంద్రం, రాష్ట్రాలకు కలిపి 49 శాతం వాటా ఉంది. మిగిలిన 51 శాతం వాటా హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్‌ఎస్‌ఈ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ఉంది. జీఎస్‌టీఎన్‌ను పునర్‌వ్యవస్థీకరించిన అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యాజమాన్యాన్ని సమంగా వేరు విభజించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రభుత్వ సంస్థగా జీఎస్‌టీఎన్ ఏర్పాటు
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : కేంద్ర కేబినెట్

నూతన టెలికం విధానానికి ఆమోదం
నూతన టెలికం విధానం ‘నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ (ఎన్‌డీసీపీ) 2018’కి కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 26న ఆమోదం తెలిపింది. 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాబట్టడంతోపాటు 2022 నాటికి 40 లక్షల ఉద్యోగాల కల్పన ఈ విధానం లక్ష్యాలుగా ఉన్నాయి. సమాచార సదుపాయాలను మరింత బలోపేతం చేయడం, 5జీ టెక్నాలజీ, ఆప్టికల్ ఫైబర్ ద్వారా అందరికీ అధిక వేగంతో కూడిన బ్రాడ్ బ్యాండ్ సేవలను అందుబాటులో ఉంచడం, 40 లక్షల ఉద్యోగాల కల్పన, ఐసీటీ సూచీలో భారత ర్యాంకును 50కు తీసుకురావడం నూతన విధానం ప్రధాన ఉద్దేశాలుగా ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ (ఎన్‌డీసీపీ) 2018 కి ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : కేంద్ర కేబినెట్

జీఎస్టీ కమిషనర్ కార్యాలయం ఏర్పాటు
Current Affairs జీఎస్టీ ఎగవేతలను నిరోధించేందుకు సోదాలు, స్వాధీనాలతో పాటు అరెస్ట్‌లు వంటి అంశాలను పర్యవే క్షించేందుకు న్యూఢిల్లీలో జీఎస్టీ కమిషనర్ (ఇన్వెస్టిగేషన్) కార్యాలయాన్ని కేంద్ర రెవెన్యూ శాఖ సెప్టెంబర్ 12న ఏర్పాటు చేసింది. ఈ మేరకు జీఎస్టీ తొలి కమిషనర్‌గా నీరజ్ ప్రసాద్‌ను నియమించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీఎస్టీ కమిషనర్ కార్యాలయం ఏర్పాటు
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : నీరజ్ ప్రసాద్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : జీఎస్టీ ఎగవేతలను నిరోధించేందుకు

పీఎం ఆశ’ పథకానికి కేబినెట్ ఆమోదం
నూనె గింజల రైతులకు లబ్ధి చేకూర్చేందుకు రూపొందించిన ‘ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్’ (పీఎం ఆశ) పథకానికి కేంద్ర కేబినేట్ సెప్టెంబర్ 12న ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కంటే నూనె గింజల ధరలు తక్కువగా ఉంటే వాటిని దానికి తగ్గ పరిహారం ఇవ్వడం, అవసరమైతే రాష్ట్రాలే ప్రైవేటు సంస్థల ద్వారా సేకరణ జరిపేలా చర్యలు తీసుకుంటారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన ‘లోటు ధర చెల్లింపు’ (పీడీపీ) తరహాలో ఉండే పీఎం ఆశ పథకం ద్వారా కనీస మద్దతు ధరకు, టోకు మార్కెట్లో నెలవారీ సగటు నూనె గింజల ధరకు మధ్యనున్న వ్యత్యాసాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఒక రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే నూనె గింజల్లో 25 శాతానికి పీఎం ఆశ పథకాన్ని వర్తింపచేస్తారు. ధరల మద్దతు పథకం (పీఎస్‌ఎస్), లోటు ధర చెల్లింపు పథకం (పీడీపీఎస్), ప్రైవేటు సేకరణ- నిల్వ పథకం (పీపీఎస్‌ఎస్)లలో దేనినైనా ఎంచుకునేందుకు రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉంటుంది.
పీఎం ఆశ పథకం అమలు కోసం రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.15,053 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. మొదటి ఏడాది రూ.6250 కోట్లను ఖర్చు చే యనుండగా సేకరణ సంస్థలకు ప్రభుత్వ గ్యారంటీ కింద అదనంగా రూ.16,550 కోట్లను కేటాయించనున్నారు.
కేబినెట్ ఇతర నిర్ణయాలు....
2022 వరకు అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేసే కార్యక్రమంలో భాగంగా పీఎం ఆశ పథకం అమలుకు నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినెట్ మరికొన్ని ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
  • పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించే యత్నాల్లో భాగంగా ఇథనాల్ ధరను 25 శాతం పెంచింది. దీంతో లీటర్ రూ.47.13గా ఉన్న ఇథనాల్ ధర రూ.59.13కి చేరనుంది.
  • దేశవ్యాప్తంగా ఇంకా విద్యుదీకరణ జరగని 13,675 కి.మీ. రైలు మార్గాన్ని 2021-22 నాటికి పూర్తి చేసేందుకు రూ.12,134 కోట్ల నిధుల కేటాయింపు. రైలు మార్గాల విద్యుదీకరణ ద్వారా ఏటా 283 కోట్ల లీటర్ల డీజిల్‌ను (రూ.13,510 కోట్లు) ఆదా అవడంతోపాటు గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలు తగ్గుతాయి. అలాగే 20 కోట్ల పని దినాలు కల్పించేందుకు వీలవుతుంది.
  • దేశవ్యాప్తంగా మరో 4 నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ) కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు ఎన్‌ఐడీ చట్టం- 2014కు సవరణలను పార్లమెంటులో ప్రవేశపెట్టడం. దీని ద్వారా అమరావతి (ఏపీ), భోపాల్ (మధ్య ప్రదేశ్), జోర్హాట్ (అస్సాం), కురుక్షేత్ర (హరియాణా)ల్లో ఏర్పాటుచేయనున్న ఎన్‌ఐడీలకు జాతీయ ప్రాముఖ్య సంస్థల హోదా కల్పిస్తారు.
  • పర్యాటకాభివృద్థి కోసం భారత్-మాల్టా దేశాల మధ్య ఎంవోయూకి ఆమోదం.
  • ‘బ్లాక్ చెయిన్’ సాంకేతికతపై ఎంవోయూకి అంగీకారం.
  • కాలం చెల్లిపోతున్న చమురు, సహజవాయు క్షేత్రాల నుంచి దిగుబడులు పెంచే సాంకేతికతకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడం. దీనిద్వారా రాబోయే 20 ఏళ్లలో రూ.50 లక్షల కోట్ల హైడ్రోకార్బన్లను వెలికి తీయవచ్చని అంచనా.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ పథకానికి ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : నూనె గింజల రైతులకు లబ్ధి చేకుర్చేందుకు

మానవాభివృద్ధి సూచీలో భారత్‌కు 130వ ర్యాంకు
మానవాభివృద్ధి సూచీలో భారత్‌కు 130వ ర్యాంకు లభించింది. ఈ మేరకు 189 దేశాలతో కూడిన జాబితాను ఐరాస అభివృద్ధి కార్యక్రమం(యూఎన్‌డీపీ) సెప్టెంబర్ 14న విడుదల చేసింది. ఈ జాబితాలో నార్వే అగ్రస్థానం పొందగా స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, ఐర్లాడ్, జర్మనీ లు వరుసగా తర్వాతి స్థానంలో నిలిచాయి. అలాగే బంగ్లాదేశ్ 136 స్థానంలో నిలవగా పాకిస్థాన్ 150వ స్థానంలో ఉంది.
యూఎన్‌డీపీ విడుదల చేసిన మానవాభివృద్ధి సూచీలో 59 దేశాలు అధిక మానవాభివృద్ధి గ్రూప్‌లో, 38 దేశాలు అల్ప మానవాభివృద్ధి గ్రూప్‌లో ఉన్నాయి. 0.640 హెచ్‌డీఐ స్కోర్‌తో భారత్ మాధ్యమిక మానవాభివృద్ధి కేటగిరీలో చోటు దక్కించుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మానవాభివృద్ధి సూచీలో భారత్‌కు 130వ ర్యాంకు
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : ఐరాస అభివృద్ధి కార్యక్రమం(యూఎన్‌డీపీ)
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

స్వచ్ఛతా హీ సేవ’ ప్రచార ఉద్యమం ప్రారంభం
‘స్వచ్ఛతా హీ సేవ’(స్వచ్ఛతే సేవ) ప్రచార ఉద్యమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీలోని పహర్‌గంజ్ ప్రాంతంలోని బీఆర్ అంబేడ్కర్ పాఠశాలలో సెప్టెంబర్ 15న ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలతో పాటు మత, ఆధ్యాత్మిక గురువులు, పలువురు ప్రముఖులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అక్టోబర్ 2 వరకు జరిగే ఉద్యమం ద్వారా జాతిపిత మహాత్మగాంధీ కలలుగన్న స్వచ్ఛ భారత్‌ను నిజం చేసేలా ప్రజలు పునరంకితం కావాలని పిలుపినిచ్చారు.
పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా దేశ ప్రజల్ని ప్రోత్సహించేందుకు అక్టోబర్ 2, 2015న స్వచ్ఛతా సేవను ప్రధాని మోదీప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రచార ఉద్యమం ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బీఆర్ అంబేడ్కర్ పాఠశాల, పహర్‌గంజ్, ఢిల్లీ
ఎందుకు : పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా దేశ ప్రజల్ని ప్రోత్సహించేందుకు

కట్నం వేధింపులపై సుప్రీంకోర్టు తీర్పు సవరణ
వరకట్నం వేధింపుల కేసులో భర్త, అతని కుటుంబ సభ్యులను వెంటనే అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సెప్టెంబర్ 14న సవరించింది. ఈ మేరకు గతంలో ఇచ్చి తీర్పు చట్టాలకు లోబడి లేదని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. క్రిమినల్ కేసుల్లో ఇరుపక్షాలు రాజీకి వచ్చినా కేసును కొట్టేసే అధికారం కేవలం హైకోర్టులకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కట్నం వేధింపులపై సుప్రీంకోర్టు తీర్పు సవరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : గతంలో ఇచ్చి తీర్పు చట్టాలకు లోబడిలేనందున

అటల్ ఇంక్యుబేషన్ కేంద్రం ప్రారంభం
వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ(బీహెచ్‌యూ)లో అటల్ ఇంక్యుబేషన్ కేంద్రంను ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 18న ప్రారంభించారు. అలాగే పాత కాశీ అభివృద్ధి కోసం ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్‌మెంట్ పథకం(ఐపీడీఎస్)తోసహా వారణాసిలో దాదాపు రూ. 550 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... వారణాసిని తూర్పు భారత గేట్‌వేగా తీర్చిదిద్దుతామని చెప్పారు. 2019 జనవరిలో ప్రపంచ ప్రవాస భారతీయ దివస్ ను వారణాసిలో నిర్వహించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అటల్ ఇంక్యుబేషన్ కేంద్రం ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి, ఉత్తరప్రదే శ్

భారత్‌లోనే అత్యధిక శిశుమరణాలు
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శిశు మరణాలు భారత్‌లోనే సంభవిస్తున్నాయని యునెటైడ్ నేషన్స్ ఇంటర్-ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్(యునిగ్మె) వెల్లడించింది. ఈ మేరకు సెప్టెంబర్ 18న ఒక నివేదికను విడుదల చేసింది. శుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం, పోషకాహారం, కనీస ఆరోగ్య సౌకర్యాలు లోపించిన కారణంగా దేశంలో సగటున ప్రతి రెండు నిమిషాలకు ముగ్గురు శిశువులు మరణిస్తున్నారని నివేదిక పేర్కొంది.
నివేదిక ప్రకారం 2017లో దేశవ్యాప్తంగా 8,02,000 మంది శిశువులు మరణించారు. అయితే గత ఐదేళ్లలో పోలిస్తే 2017లో శిశుమరణాల సంఖ్య తక్కువగా ఉంది. శిశు మరణాలకు కారణమవుతున్న వ్యాధులు, పరిస్థితులను ఎదుర్కోవడంలో భారత్ పురోగతి సాధిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ చీఫ్ గగన్ గుప్తా తెలిపారు. దేశంలో ఏడాదికి రెండున్నర కోట్ల మంది జన్మిస్తున్నారని అన్నారు. అలాగే ఒక ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్న ఐదేళ్లలోపు చిన్నారుల్లో భారత్ నుంచి ఎంత మంది ఉంటున్నారో.. అంతేమంది భారత్‌లో జన్మిస్తున్నారని చెప్పారు. ఈ రెండు సంఖ్యలు సమానం కావడం ఇదే ప్రథమం.
నివేదికలోని ముఖ్యాంశాలు..
  • ప్రపంచవ్యాప్తంగా పుడుతున్న పిల్లల్లో 18 శాతం మంది భారత్‌లోనే జన్మిస్తున్నారు.
  • ప్రపంచవ్యాప్తంగా చూస్తే శిశు మరణాలు భారత్‌లోనే అత్యధికం. ఆ తర్వాతి స్థానాల్లో నైజీరియా (4.66 లక్షలు), పాకిస్తాన్ (3.3 లక్షలు), కాంగో (2.33 లక్షలు) ఉన్నాయి.
  • భారత్‌లో 2017లో 6.05 లక్షల మంది నవజాత శిశువులు మరణించారు. 5 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 1.52 లక్షల మంది చిన్నారులు చనిపోయారు.
  • 2016లో దేశంలో మృత్యువాతపడిన శిశువులు 8.67 లక్షల మంది కాగా, 2017లో ఆ సంఖ్య 8.02 లక్షలకు తగ్గింది.
  • 2016లో భారత్‌లో పుట్టిన ప్రతి వెయ్యిమంది శిశువుల్లో 44 మంది మరణించగా, 2017లో ఆ సంఖ్య దాదాపు 40కి తగ్గింది.
  • ఐదేళ్లలోపు చిన్నారుల వరకు చూస్తే 2017లో మొత్తంగా 9.89 లక్షల మంది మరణించారు. ఐదేళ్లలోపు వయసున్న పిల్లలకు సంబంధించి పది లక్షల కంటే తక్కువ సంఖ్యలో చిన్నారులు మరణించడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి.
  • ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2017లో 15 ఏళ్లలోపు పిల్లల్లో 63 లక్షల మంది మరణించారు. అంటే ప్రతి ఐదు సెకన్లకు ఒకరు చనిపోయారు. వీరిలో 54 లక్షల మంది ఐదేళ్లలోపే చనిపోయారు. వారిలోనూ సగం మంది నవజాత శిశువులుగానే కన్నుమూశారు. ఈ మరణాలకు నివారించదగిన వ్యాధులే కారణం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లోనే అత్యధిక శిశుమరణాలు
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : యునెటైడ్ నేషన్స్ ఇంటర్-ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఎందుకు : శుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం, పోషకాహారం, కనీస ఆరోగ్య సౌకర్యాలు లోపించిన కారణంగా

ట్రిపుల్ తలాక్’ నిషేదానికి ఆర్డినెన్స్
ముస్లింలు తక్షణం విడాకులు ఇచ్చేందుకు వీలు కల్పించే ట్రిపుల్ తలాక్ పద్ధతిని నిషేదించే ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 19న ఆమోదం తెలిపింది. దీంతో ట్రిపుల్ తలాక్ చెప్పడం నిషిద్ధం, చట్ట విరుద్ధం, శిక్షార్హం అవుతుంది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం ట్రిపుల్ తలాక్ చెప్పే భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్షను విధించవచ్చు. ట్రిపుల్ తలాక్‌ను సుప్రీంకోర్టు కొట్టేసిన తరువాత కూడా ఆ కేసులు నమోదవుతుండటంతో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
2017 ఆగస్టు 22న త్రిపుల్ తలాక్ రాజ్యంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అనంతరం కేంద్రం ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది.
ఆర్డినెన్స్ లోని అంశాలు...
  • తక్షణ ట్రిపుల్ తలాక్‌కే ఇది వర్తిస్తుంది.
  • తనకు, తన మైనర్ పిల్లలకు జీవన భృతి కోరుతూ బాధిత మహిళ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించొచ్చు.
  • పిల్లల సంరక్షణ తనకే అప్పగించాలని భార్య కోరచ్చు. మెజిస్ట్రేట్‌దే తుది నిర్ణయం.
  • బాధితురాలు, ఆమె రక్త సంబంధీకులు ఫిర్యాదు చేస్తేనే పోలీసులు కేసు నమోదుచేయాలి.
  • ట్రిపుల్ తలాక్‌ను నాన్‌బెయిలబుల్ నేరంగా పేర్కొంటున్నా, నిందితుడు విచారణకు ముందే బెయిల్ కోరుతూ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించొచ్చు.
  • భార్య వాదనలు విన్న తరువాత మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేయొచ్చు.
  • బిల్లు నిబంధనల ప్రకారం భార్యకు పరిహారం చెల్లించేందుకు అంగీకరించిన తరువాతే భర్తకు మెజిస్ట్రేట్ బెయిల్ ఇస్తారు.
  • చెల్లించాల్సిన పరిహారం ఎంతో మెజిస్ట్రేట్ నిర్ణయిస్తారు.
  • మెజిస్ట్రేట్ తన అధికారాలు ఉపయోగించి భార్యాభర్తల మధ్య వివాదాన్ని పరిష్కరించొచ్చు.
  • ట్రిపుల్ తలాక్ కాంపౌండబుల్ నేరం..అంటే, కేసును ఉపసంహరించుకునే స్వేచ్ఛ ఇరు వర్గాలకు ఉంటుంది.
ఇతర దేశాలు...
తక్షణ ట్రిపుల్ తలాక్‌ను ప్రపంచవ్యాప్తంగా 21 దేశాలు నిషేధించాయి. ఈ జాబితాలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్టు, సైప్రస్, ట్యూనీషియా, అల్జీరియా, మలేసియా, జోర్డాన్ వంటి దేశాలున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘ట్రిపుల్ తలాక్’ నిషేదానికి ఆర్డినెన్స్
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

ప్రధాని స్థిరచరాస్థుల వివరాలు వెల్లడి
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్థిరచరాస్థుల వివరాలను ప్రధాని కార్యాలయం(పీఎంవో) సెప్టెంబర్ 19న వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం ప్రస్తుతం ప్రధాని మొత్తం స్థిరచరాస్థుల విలువ రూ.2.28 కోట్లుగా ఉంది. ఇందులో చరాస్తుల విలువ రూ.1,28,50,498. అలాగే స్థిరాస్తి అయిన గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న మోదీ సొంతింటి మార్కెట్ విలువ దాదాపు రూ.కోటి. 16ఏళ్ల క్రితం ఆ ఇంటిని మోదీ కేవలం రూ.లక్షకు కొనుగోలు చేశారు.
2018 మార్చి 31నాటికి మోదీ వద్ద రూ.48,944 నగదు మాత్రమే ఉంది. 2017లో మోదీ వద్ద రూ.1,50,000 నగదు ఉండగా ఈ ఏడాది 67శాతం తగ్గింది. గాంధీనగర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో మోదీకి రూ.11,29,690 డిపాజిట్లు ఉండగా అదే బ్రాంచీలో మోదీ రూ.1,07,96,288 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. మోదీకి తన పేరు మీద కారుగానీ, మరే వాహనమూ లేదు. ప్రధానికాక ముందునాటి 45 గ్రాముల బరువైన రూ.1,38,060 విలువైన నాలుగు బంగారు ఉంగరాలు మాత్రం ఆయన వద్ద ఉన్నాయి. ఏ బ్యాంకులో ఎలాంటి రుణాలు మోదీ తీసుకోలేదని పీఎంవో తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధాని నరేంద్ర మోదీ స్థిరచరాస్థుల వివరాలు వెల్లడి
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : ప్రధానమంత్రి కార్యలయం

స్వలింగ సంపర్కం నేరం కాదు : సుప్రీంకోర్టు
Current Affairs పరస్పర అంగీకారంతో ఇద్దరు వయోజనుల(మేజర్లు) మధ్య జరిగే స్వలింగ సంపర్కం లేదా స్త్రీ-పురుషుల మధ్య ప్రైవేటుగా జరిగే లైంగిక చర్య నేరం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 377లోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం సప్టెంబర్ 6న తీర్పు వెలువరించింది. అయితే జంతువులు, చిన్న పిల్లలు, మైనర్లతో, అలాగే మేజర్లతోనూ పరస్పర అంగీకారం లేకుండా జరిగే లైంగిక కేసుల విషయంలో 377 సెక్షన్‌లోని నిబంధనలు కొనసాగుతాయని కోర్టు పేర్కొంది.
సమాజంలో ఎల్‌జీబీటీక్యూ (లెస్పియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వీర్)లు దేశంలోని మిగిలిన పౌరుల్లాగే అన్ని రాజ్యాంగబద్ధమైన హక్కులను పొందవచ్చని కోర్టు స్పష్టం చేసింది. సెక్షన్ 377 కారణంగానే ఎల్‌జీబీటీక్యూలు ఇన్నాళ్లుగా దేశంలో ద్వితీయశ్రేణి పౌరుల్లా బతకాల్సి వచ్చిందని జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలు సభ్యులుగా ఉన్న ధర్మాసనం అభిప్రాయపడింది.
నవ్‌తేజ్ జౌహార్, జర్నలిస్ట్ సునీల్ మెహ్రా, చెఫ్ రితూ దాల్మియా, హోటల్ యజమానులు అమన్‌నాథ్, కేశవ్ సూరీ, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అయేషా కపూర్ సహా 20 మంది ఐఐటీ విద్యార్థులు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ చారిత్రక తీర్పునిచ్చింది. తాజా తీర్పు ద్వారా ప్రపంచంలో స్వలింగ సంపర్కాన్నీ చట్టబద్ధం చేసిన 26వ దేశంగా భారత్ నిలిచింది.
సెక్షన్ 377 నేపథ్యం....
భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) లోని 16వ అధ్యాయంలో 377వ సెక్షన్ ఉంది. ఈ సెక్షన్ ముసాయిదాను బ్రిటిష్ పాలనలో 1838లో థామస్ మెకాలే రూపొందించగా 1861లో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం బ్రిటిష్ సొడొమీ చట్టం(బగ్గరీయాక్ట్ 1533) ఆధారంగా రూపొందింది. సహజ విరుద్ధంగా జరిగే ఎలాంటి శృంగారమైనా నేరమేనని ఈ చట్టం చెబుతోంది. నేరస్తులకు గరిష్టంగా జీవిత ఖైదు, కనీసం పదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించేందుకు సెక్షన్ 377 వీలు కల్పించింది.
చట్టంలో ఏముంది?
భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని 377వ సెక్షన్ అసహజ నేరాలను నిర్వచించింది. 158 ఏళ్ల క్రితం చేసిన ఈ చట్టం ప్రకారం మైనారిటీ తీరిన హోమోసెక్సువల్స్ (ఇద్దరు పురుషులు), హెటిరో సెక్సువల్స్ (ఓ ఆడ, ఓ మగ), లెస్బియన్స్ (ఇద్దరు ఆడవాళ్లు) మధ్య పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధాన్ని ఏర్పర్చుకోవడం నేరం, రాజ్యాంగ వ్యతిరేకం. అలాగే మగవారైనా, ఆడవారైనా జంతువుతో శృంగారంలో పాల్గొనటాన్ని ఈ చట్టం తప్పుగా పరిగణిస్తోంది. పరస్పర అంగీకారం లేకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య బలవంతంగా లైంగిక చర్య జరగటాన్నీ కూడా నేరంగా పరిగణిస్తోంది.
చట్టబద్ధం చేసిన ఢిల్లీ హైకోర్టు
పరస్పర సమ్మతితో కూడిన స్వలింగ సంపర్కం నేరం కాదని ఢిల్లీ హైకోర్టు 2009లో తీర్పు ఇచ్చింది. సెక్షన్ 377 స్వలింగ సంపర్కుల ‘పరిపూర్ణ వ్యక్తిత్వ హక్కు’ను నిరాకరిస్తోందని, అందువల్ల ఈ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమంది.
హైకోర్టు తీర్పును తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
ఢిల్లీ హైకోర్టు తీర్పును 2013, డిసెంబర్‌లో సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.సెక్షన్ 377 రాజ్యాంగబద్ధమేనని జస్టిస్ జీఎస్ సంఘ్వి నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై పార్లమెంటులో చర్చ జరగాలంది.
ట్రాన్స్ జెండర్లపై తీర్పు
ట్రాన్స్ జెండర్లను(లింగ మార్పిడి చేసుకున్న వారు) థర్డ్ జెండర్‌గా ప్రకటించాలని, ఓబీసీ కోటాలో వారిని కూడా చేర్చాలని సుప్రీం కోర్టు 2014లో కేంద్రాన్ని ఆదేశించింది. వారికి కూడా అందరిలా వివాహం, దత్తత, విడాకులు, వారసత్వం తదితర హక్కుల్ని కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది.
71 దేశాల్లో నేరమే..
ప్రపంచవ్యాప్తంగా 71 దేశాలు ఇప్పటికీ స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్నాయి. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, యూఏఈ. ఖతార్, మౌరిటానియాలో స్వలింగ సంపర్కులకు మరణశిక్ష విధించేలా చట్టాలున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదు
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : సుప్రీంకోర్టు

ఓబీసీ జనాభా లెక్కల సేకరణ
Current Affairs స్వాతంత్య్రం తర్వాత దేశంలో జన గణనలో భాగంగా తొలిసారి ఇతర వెనుకబడిన వర్గాల(ఓబీసీ) జనాభా లెక్కలను సేకరించనున్నారు. ఈ మేరకు 2021లో చేపట్టే జనగణనలో ఓబీసీల లెక్కలను సేకరించాలని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 31న నిర్ణయించింది. అలాగే జనగణన తుది నివేదిక వెల్లడించే సమయాన్ని ఏడేళ్ల నుంచి మూడేళ్లకి తగ్గించింది. 2006లో జాతీయ నమూనా సర్వే సంస్థ నివేదిక ప్రకారం దేశ జనాభాలో ఓబీసీలు సుమారు 41 శాతం వరకు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. జనగణన కోసం సుమారు 25 లక్షల మంది ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తొలిసారి ఇతర వెనుకబడిన వర్గాల(ఓబీసీ) జనాభా లెక్కల సేకరణ
ఎప్పుడు : 2021
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : దేశంలో

ఐపీపీబీ ని ప్రారంభించిన ప్రధాని మోదీ
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ)ని ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో సెప్టెంబర్ 1న ప్రారంభించారు. బ్యాంకింగ్ సేవలను ప్రతి ఇంటికీ, ఆర్థిక సమ్మిళిత వృద్ధికి తోడ్పడటానికి సుమారు 1.55 లక్షల తపాలా శాఖలు, 3 లక్షల మంది పోస్ట్‌మెన్, గ్రామీణ్ డాక్ సేవక్‌లతో ఐపీపీబీ ని ప్రారంభించారు. ఈ బ్యాంకు సేవలు ఇతర సాధారణ బ్యాంకుల మాదిరిగానే ఉన్నా కార్యకలాపాలు తక్కువ స్థాయిలో ఉంటాయి. ఐపీపీబీలో ముందస్తు రుణాలు(అడ్వాన్స్ డ్ లోన్స్), క్రెడిట్ కార్డుల వంటి సేవలు ఉండకపోగా రూ.1 లక్ష వరకున్న డిపాజిట్లను మాత్రమే అంగీకరిస్తారు.
ఐపీపీబీ విశేషాలు...
  • ఐపీపీబీ సేవలు తొలుత 650 తపాలా శాఖలు, 3,250 యాక్సెస్ పాయింట్లలో ప్రారంభమయ్యాయి. ఈ ఏడాదిచివరికల్లా దేశంలోని అన్ని శాఖలకు విస్తరిస్తారు.
  • ఇతర బ్యాంకుల మాదిరిగానే విదేశాల నుంచి నగదు బదిలీ, మొబైల్ చెల్లింపులు, ట్రాన్‌‌సఫర్స్, ఏటీఎం, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, థర్డ్‌పార్టీ ఫండ్ ట్రాన్‌‌సఫర్స్ వంటి సేవలు అందిస్తాయి.
  • డిపాజిట్లపై 4 శాతం వడ్డీ చెల్లిస్తారు.
  • వినియోగదారుడి ఇంటి వద్దకే వచ్చి పోస్ట్‌మన్ సేవింగ్‌‌స, కరెంట్ ఖాతాలను తెరుస్తాడు.
  • రుణాలు, బీమా వంటి థర్డ్‌పార్టీ సేవలందించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, బజాజ్ అలియాన్‌‌జ జీవిత బీమా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.
  • రూ.1 లక్ష మించే డిపాజిట్లను ఆటోమేటిక్‌గా పొదుపు ఖాతాలుగా మార్చుతారు.
  • కౌంటర్ సేవలు, మైక్రో ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్ యాప్, మెసేజింగ్, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్‌‌స సేవలు అందుబాటులో ఉంటాయి.
  • ఆధార్ సాయంతోనే ఖాతాలు తెరుస్తారు. ఖాతాదారుడి గుర్తింపు ధ్రువీకరణ, చెల్లింపులు, లావాదేవీలకు క్యూఆర్ కోడ్, బయోమెట్రిక్స్‌ను ఉపయోగిస్తారు.
  • లావాదేవీలు నిర్వహించేందుకు గ్రామీణ్ డాక్ సేవక్‌లకు స్మార్ట్‌ఫోన్‌లు, బయోమెట్రిక్ పరికరాలను సమకూరుస్తారు.
  • ఈ బ్యాంకులో వంద శాతం వాటా ప్రభుత్వానిదే. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లతో పోటీపడేలా ఐపీపీబీ మూలధన వ్యయాన్ని కేంద్రం ఇటీవలే 80 శాతం పెంచింది.
  • గ్రామీణ ప్రాంతాల్లో 1.30 లక్షల యాక్సెస్ పాయింట్లు నెలకొల్పనున్నారు.
  • 17 కోట్ల పోస్టల్ సేవింగ్‌‌స ఖాతాలను ఐపీపీబీ ఖాతాలతో అనుసంధానం చేయడానికి అనుమతి ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ) ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 1
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు

అక్టోబర్ 2 నుంచి నల్సా పరిహార పథకం అమలు
అత్యాచారాలు, దాడులకు గురైన మహిళలకు న్యాయం చేయడానికి జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా) రూపొందించిన ‘పరిహార పథకం’ అక్టోబర్ 2 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ నూతన చట్ట నిబంధనలు కార్యరూపం దాల్చే వరకు పరిహార పథకంలోని అంశాలను ప్రత్యేక న్యాయస్థానాలు పరిగణనలో తీసుకోవాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5న ఆదేశించింది.
కోర్టు ఉత్తర్వుల మేరకు లైంగిక దాడికి గురైన మైనర్ బాధితులకు రూ. 4 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు పరిహారం అందుతుంది. లైంగిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితులు, సామూహిక లైంగిక దాడికి గురైన బాధితుల కుటుంబాలు రూ. 5 లక్షల నుంచి రూ 10 లక్షల వరకు పరిహారం పొందుతాయి. యాసిడ్ దాడికి గురైన మహిళలకు రూ.3 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు పరిహారంగా అందుతాయి. ప్రభుత్వం పోక్సో చట్టంను సవరించే వరకు మైనర్ బాధితులు ఈ పరిహారం పొందేందుకు అర్హులని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
బాధితులకు తక్షణమే పరిహారం అందాలంటూ నిర్భయ ఘటనానంతరం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీంతో నల్సా సూచించిన దానికంటే ఎక్కువ పరిహారం ఇవ్వొచ్చు కానీ తక్కువ ఇవ్వకూడదని జస్టిస్ మదన్ బి. లోకుర్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అక్టోబర్ 2 నుంచి నల్సా ‘పరిహార పథకం’ అమలు
ఎప్పుడు : సెప్టెంబర్ 5
ఎవరు : సుప్రీంకోర్టు
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : అత్యాచారాలు, దాడులకు గురైన మహిళలకు న్యాయం చేసేందుకు
Published date : 20 Sep 2018 03:56PM

Photo Stories