Skip to main content

Emergency Landing Strip: ఎయిర్‌క్రాఫ్ట్‌ల ల్యాండింగ్‌ కోసం అభివృద్ధి చేసిన తొలి రహదారి?

భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్‌) చెందిన యుద్ధ విమానం జాతీయ రహదారిపై అత్యవసర ల్యాండింగ్‌ అయ్యింది.
Emergency Landing Strip

యుద్ధ విమానాల అత్యవసర ల్యాండింగ్‌ కోసం రాజస్తాన్‌లోని బర్మేర్‌ జిల్లాలో జాతీయ రహదారి–925ఏపై సిద్ధం చేసిన సట్టా–గాంధవ్‌ స్ట్రెచ్‌ను కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, నితిన్‌ గడ్కరీ సెప్టెంబర్‌ 9న లాంఛనంగా ప్రారంభించారు. ఐఏఎఫ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కోసం అభివృద్ధి చేసిన మొట్టమొదటి రహదారి ఇదే. సట్టా–గాంధవ్‌ స్ట్రెచ్‌ను నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) 19 నెలల్లో అభివృద్ధి చేసింది.

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌ఎస్‌ బదౌరియాలతో కూడిన సి–130జే యుద్ధ విమానం సట్టా–గాంధవ్‌ స్ట్రెచ్‌పై విజయవంతంగా ల్యాండ్‌ అయ్యింది. భారత వాయుసేన ఈ డ్రిల్‌ను చేపట్టింది. అనంతరం సుఖోయ్‌–30ఎంకేఐ ఫైటర్‌ జెట్, ఏఎన్‌–32 మిలటరీ రవాణా విమానం, ఎంఐ–17వీ5 హెలికాఫ్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌ అయ్యాయి.

రూ.765.52 కోట్లతో...

అత్యవసర ల్యాండింగ్‌ కోసం సట్టా–గాంధవ్‌ మార్గంతోపాటు గగారియా–బఖాసర్‌ మార్గాన్ని రూ.765.52 కోట్లతో అభివృద్ధి చేశారు. అత్యవసర సమయాల్లోనే విమానాల ల్యాండింగ్‌ కోసం ఉపయోగిస్తారు. దీంతోపాటు కుందన్‌పురా, సింఘానియా, బఖాసర్‌లో మూడు హెలిప్యాడ్‌లను నిర్మించారు. తొలిసారిగా 2017 అక్టోబర్‌లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఫైటర్‌ జెట్లు, రవాణా విమానాలను ప్రయోగాత్మకంగా లక్నో–ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ మార్గంపై అత్యవసర ల్యాండింగ్‌ చేసిన సంగతి తెలిసిందే.

 

ఆంధ్రప్రదేశ్‌లో రెండు మార్గాల్లో...

యుద్ధ విమానాలను అత్యవసర పరిస్థితుల్లో క్షేమంగా నేలపైకి దించడానికి వీలుగా కొన్ని జాతీయ రహదారుల్లో మార్పులు చేస్తున్నట్లు మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల్లో 19 చోట్ల అత్యవసర ల్యాండింగ్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు–ఒంగోలు, ఒంగోలు–చిలకలూరిపేట మార్గాలను ఈ దిశగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. రోడ్లపై అత్యవసర ల్యాండింగ్‌ సౌకర్యం యుద్ధ సమయాల్లోనే కాకుండా విపత్తుల సమయంలోనూ ఉపకరిస్తుందని మంత్రి రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఎయిర్‌క్రాఫ్ట్‌ల ల్యాండింగ్‌ కోసం అభివృద్ధి చేసిన తొలి రహదారి ప్రారంభం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 9
ఎవరు    : కేంద్ర మంత్రులు రాజ్‌నా«థ్‌సింగ్, నితిన్‌ గడ్కరీ, గజేంద్రసింగ్‌ షెకావత్, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌ఎస్‌ బదౌరియా
ఎక్కడ    : సట్టా–గాంధవ్‌ స్ట్రెచ్, జాతీయ రహదారి–925ఏ, బర్మేర్‌ జిల్లా, రాజస్తాన్‌
ఎందుకు  : యుద్ధ విమానాలను అత్యవసర పరిస్థితుల్లో క్షేమంగా నేలపైకి దించడానికి వీలుగా...

Published date : 11 Sep 2021 06:16PM

Photo Stories