Minimum marriage age : 21 ఏళ్లు వచ్చాకే అమ్మాయి పెళ్లి... కారణం ఇదే
దీంతో మహిళల కనీస వివాహ వయసు పురుషులతో సమానమవనుంది. స్త్రీ, పురుషుల కనీస వివాహ వయసును సమానం చేసి 21 ఏళ్లుగా నిర్ణయించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ డిసెంబర్ 15వ తేదీన అంగీకారం తెలిపిందని, ఈ శీతాకాల సమావేశాల్లో సంబంధిత సవరణ బిల్లు తేవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అమ్మాయిల పెళ్లి వయసు పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, స్త్రీల ఆరోగ్య పరిరక్షణకు, శిశువులను పౌష్టికాహార లేమి నుంచి కాపాడేందుకు అమ్మాయిల పెళ్లి వయసును పెంచడం అవసరమని గత ఏడాది స్వాతంత్య్రదిన ప్రసంగంలో ప్రధాని మోదీ చెప్పారు. ఈ విషయంపై అధ్యయనానికి సమతా పార్టీ మాజీ చీఫ్ జయా జైట్లీ అధ్యక్షతన గత ఏడాదే నలుగురు సభ్యుల కమిటీని ప్రభుత్వం నియమించింది. డిసెంబర్‌లో ఈ కమిటీ సిఫార్సులను కేంద్రానికి సమర్పించగా, వీటి పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
ఇక పురుషులకు...
ప్రతి రంగంలో లింగ సమానత్వం, సాధికారత పెంచాలని భావించేటప్పుడు స్త్రీ కనీస వివాహ వయసును 18 ఏళ్లకు పరిమితం చేయడం సబబు కాదని జయా జైట్లీ అభిప్రాయపడ్డారు. 18 ఏళ్ల పరిమితి వల్ల పలువురు మహిళలు కాలేజీలకు వెళ్లే అవకాశం కోల్పోతున్నారని, పురుషులకు 21 ఏళ్ల వరకు స్వీయ సంసిద్ధత సాధించేందుకు అవకాశం ఉందన్నారు. పురుషుడితో సమానంగా స్త్రీలకు అవకాశాలు కలి్పంచాలంటే అమ్మాయిల కనీస వివాహ వయసును 21కి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై పలువురి అభిప్రాయాలు స్వీకరించామని, వివాహ వయసు పెంపు ప్రతిపాదనకు మతాలకతీతంగా స్త్రీ సమాజం నుంచి అధిక సానుకూలత వచ్చిందన్నారు. యూనివర్శిటీలు, కాలేజీలు, గ్రామీణ ప్రాంతాల్లోని అమ్మాయిలతో మాట్లాడామని వివరించారు. ఈ సంఘంలో నీతీ ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, విద్యావేత్తలు నజ్మా అఖ్తర్, వసుధా కామత్, దీప్తీ షా తదితరులున్నారు.
దీనిపై నిపుణుల ఆందోళన..
వివాహ వయసు పెంచాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు అంటున్నారు. వయసు పెంపు ప్రతిపాదనను చట్టబద్ధం చేయడంతో 21 ఏళ్లకు లోపు చేసే వివాహాలు శిక్షార్హమవుతాయని, దీంతో కలిగే దుష్పరిణామాలు, 18 ఏళ్లకు పెళ్లి చేయడం వల్ల కలిగే నష్టాల కన్నా అధికమని ఆక్స్‌ఫామ్ ఇండియాకు చెందిన అమితా పిత్రే అన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ప్రకారం సమాజంలో చిన్న వయసులో చేసే వివాహాల శాతం 23 శాతానికి (27 నుంచి) తగ్గిందన్నారు. ఇటీవల కాలంలో పలు అగ్ర, మధ్యతరగతి కుటుంబాల్లో చాలామంది ఆడపిల్లలు 21 ఏళ్లు దాటిన చాన్నాళ్లకు పెళ్లాడుతున్నారన్నారు. అనేక సమాజాల్లో సగానికిపైగా వివాహాలు 21 ఏళ్లకు ముందే అవుతున్నాయని, దీన్ని ఒక్కమారుగా శిక్షార్హం చేయడం సమాజంలో అలజడకి కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. చట్ట సవరణ చేయడం.. మూలకారణాలను వదిలి లక్షణాలకు చికిత్స చేసినట్లని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. శతాబ్దాలుగా ఉన్న అలవాటు ఒక్కమారుగా పోదంది. అసమానత్వం, పేదరికం, విద్యా వైద్య లేమి, ఉపాధి అవకాశాల కొరత లాంటి పలు అంశాలు బాల్య, చిన్నవయసు వివాహాలకు కారణమని తెలిపింది.
ఈ చట్టాలకు సవరణ !
మహిళల కనీస వివాహ వయసును మార్చేందుకు ప్రభుత్వం బాల్య వివాహాల నిరోధ చట్టం (పీసీఎంఏ)– 2006కు సవరణలు తీసుకువస్తుంది. పీసీఎంఏలో స్త్రీ, పురుషుల కనీస వివాహ హక్కు వరుసగా 18, 21 ఏళ్లుగా నిర్ణయించారు. తాజా నిర్ణయంతో పీసీఎంఏతో పాటు స్పెషల్ మ్యారేజ్ (సివిల్) యాక్ట్–1954, హిందూ మ్యారేజ్ యాక్ట్–1955కు సైతం మార్పులు చేయాల్సి ఉంటుందని న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో హిందువులు, బౌద్దులు, జైనులు, సిక్కుల వివాహల రిజిస్టేషన్‌కు సంబంధించిన నిబంధనలుంటాయి. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ మతంతో సంబంధం లేకుండా భారతీయులందరికీ వర్తించే నిబంధనలుంటాయి.