మార్చి 2020 జాతీయం
కరోనా వైరస్ ముప్పు దేశంలో విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 19న దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కరోనాపై పోరులో భాగంగా.. మార్చి 22న(ఆదివారం) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశ ప్రజలంతా ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రజల కోసం, ప్రజలే స్వచ్ఛందంగా విధించుకునే ఈ జనతా కర్ఫ్యూ సందర్భంగా.. ఆ రోజు ప్రజలు పూర్తి సమయం తమ ఇంట్లోనే ఉండాలని, ఇంట్లో నుంచి అడుగు కూడా బయటపెట్టకూడదని సూచించారు. ఈ జనతా కర్ఫ్యూ కరోనాపై పోరులో దేశ ప్రజల నిబద్ధతకు తార్కాణంగా నిలుస్తుందన్నారు.
కనీవినీ ఎరుగని ఉత్పాతం
‘‘ఇది మామూలు ఉత్పాతం కాదు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు కూడా ఈ స్థాయిలో ప్రపంచ దేశాలపై ప్రభావం చూపలేదు. ప్రపంచం ఇప్పుడు కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కోవిడ్-19కి కచ్చితమైన చికిత్స కానీ టీకా కానీ లేదు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు దేశ ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించాలి’’ అని మోదీ పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020, మార్చి 22న జనతా కర్ఫ్యూ
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : కరోనాపై పోరులో భాగంగా
కోవిడ్-19 ఎకనమిక్ రెస్పాన్స్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
కోవిడ్-19 ఆర్థికంగా దేశదేశాలను దెబ్బతీస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్‌లో ఈ వైరస్ వల్ల దెబ్బతిన్న వివిధ రంగాలకు ఉపశమనం కల్పించే చర్యలను చేపట్టేందుకు ‘కోవిడ్-19 ఎకనమిక్ రెస్పాన్స్ టాస్క్‌ఫోర్స్’ను ఏర్పాటు చేస్తున్నట్లు మార్చి 19న ప్రకటించారు. ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ నేతృత్వంలో ఈ టాస్క్‌ఫోర్స్ పనిచేస్తుందని, వివిధ రంగాలకు ప్రకటించే రిలీఫ్ ప్యాకేజ్‌లను ఇది నిర్ణయిస్తుందని వెల్లడించారు. ఆర్థిక రంగ పునరుత్తేజానికి తీసుకోవాల్సిన చర్యలను కూడా ఈ టాస్క్‌ఫోర్స్ నిర్ణయిస్తుందన్నారు.
భారత్‌లో నాలుగో మరణం
భారత్‌లో కరోనా మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. పంజాబ్‌కు చెందిన ఒక వ్యక్తి మార్చి 19న కోవిడ్‌తో మృతి చెందాడు. ఆ వ్యక్తి వృద్ధుడని, అతడికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా వైరస్ సోకినవారి సంఖ్య భారత్‌లో గురువారానికి 173కి చేరింది. మార్చి 22 నుంచి వారం రోజుల పాటు అన్ని అంతర్జాతీయ విమానాలు భారత్‌లో దిగవద్దని కేంద్రప్రభుత్వం నిషేధం విధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కోవిడ్-19 ఎకనమిక్ రెస్పాన్స్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : కోవిడ్-19 వల్ల దెబ్బతిన్న వివిధ రంగాలకు ఉపశమనం కల్పించే చర్యలను చేపట్టేందుకు
నమస్తే ట్రంప్‌ను ప్రభుత్వం నిర్వహించలేదు
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతెరాలో 2020, ఫిబ్రవరి 24న నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహించలేదని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ మార్చి 19న రాజ్యసభకు తెలిపారు. ఆ కార్యక్రమాన్ని ‘డొనాల్డ్ ట్రంప్ నాగరిక్ అభివందన్ సమితి’ నిర్వహించినట్లు వెల్లడించారు. అహ్మదాబాద్ నగర మేయర్ బిజల్‌బెన్ పటేల్ అధ్యక్షతన ఈ సమితి ఏర్పాటైందన్నారు. ఈ కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక బాధ్యత లేదని, ఈ కార్యక్రమంతో నేరుగా సంబంధం ఉన్న అంశాలపై ఎలాంటి ఖర్చు చేయలేదని మంత్రి పేర్కొన్నారు.
ఐఐఐటీ చట్టం సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
మరో ఐదు ఐఐఐటీలను పీపీపీ (పబ్లిక్ ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్) చట్టం-2017 కిందకు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) చట్టం (సవరణ) బిల్లు-2020’కు మార్చి 20న లోక్‌సభ ఆమోదం తెలిపింది. సూరత్, భోపాల్, భాగల్‌పూర్, అగర్తలా, రాయ్‌చూర్‌లతో ఉన్న ఐఐఐటీలకు జాతీయ ప్రాధాన్య సంస్థ (ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్) హోదాను కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఐఐఐటీ చట్టం జాబితాలో ఇప్పటికే 15 ఐఐఐటీలు ఉన్నాయి.
ప్రాధాన్య హోదా...
జాతీయ ప్రాధాన్య హోదా పొందిన ఐఐఐటీల్లో బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ డిగ్రీలను అందించే వెసులుబాటు కలుగుతుంది. ఐటీ రంగంలో నూతన పరిశోధనలు చేసేందుకు అవసరమైన విద్యార్థులు చేరే అవకాశం ఉంటుంది. ఇలాంటి విద్యాసంస్థల్లో 100 శాతం ప్లేస్‌మెంట్లు కల్పించిన రికార్డు ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్ పోక్రియాల్ లోక్‌సభలో పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఐఐటీ చట్టం (సవరణ) బిల్లు-2020కు ఆమోదం
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : సూరత్, భోపాల్, భాగల్‌పూర్, అగర్తలా, రాయ్‌చూర్‌లతో ఉన్న ఐఐఐటీలకు జాతీయ హోదా కల్పించేందుకు
పీఎల్‌ఐ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
దేశీయంగా వైద్య పరికరాల తయారీని ప్రోత్సహించడానికి రూ.3,420 కోట్ల రూపాయలతో ప్రొడక్షన్ లింక్‌డ్ ఇన్‌సెంటివ్ (పీఎల్‌ఐ) పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో మార్చి 21న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పీఐఎల్ పథకం ద్వారా వచ్చే అయిదేళ్లలో రూ.68,437 కోట్ల రూపాయల విలువైన వైద్య పరికరాలను ఉత్పత్తి చేయవచ్చునని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఎలక్ట్రానిక్ కంపెనీలకు 41వేల కోట్లు
ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కంపెనీలకు రూ.40,995 కోట్ల ప్రొడక్షన్ లింక్‌డ్ ఇన్‌సెంటివ్‌సను ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలిసింది. మేకిన్ ఇండియా హబ్‌ను రూపుదిద్దడం కోసం ఎలక్ట్రానిక్, మెడికల్ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీకి వచ్చే అయిదేళ్లలో రూ.41వేల కోట్లు కేటాయించనున్నారు. దీంతో ఆయా రంగాలకు ఆర్థికంగా ఊతం వచ్చి 2025 నాటికి రూ.10 లక్షల కోట్లు ఆదాయం వస్తుందని కేంద్రం భావిస్తోంది.
కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు
- రూ.400 కోట్లతో మెడికల్ డివైజ్ పార్క్స్ స్కీమ్‌కు ఆమోదం.
- జాతీయ ఆరోగ్య మిషన్ ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా ఆయుష్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం. వీటి ఏర్పాటుకు రూ.3,399.35 కోట్లు అవుతాయని అంచనా.
- పత్తి రైతులకు జరిగిన నష్టాన్ని పూరించడానికి రూ. 1,061 కోట్లు కేటాయింపు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీఎల్‌ఐ పథకానికి ఆమోదం
ఎప్పుడు : మార్చి 21
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : దేశీయంగా వైద్య పరికరాల తయారీని ప్రోత్సహించడానికి
దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లో లాక్‌డౌన్‌కు ఆదేశాలు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఉన్నట్లు గుర్తించిన 17 రాష్ట్రాల్లోని 80 జిల్లాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మార్చి 31న వరకు లాక్‌డౌన్‌ను విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలో నిత్యావసరాలు, అత్యవసర సేవల కోసం మాత్రమే బయటకు అనుమతిస్తారని కేంద్ర హోంశాఖ మార్చి 22న తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీ మార్చి 31 వరకు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది.
రైళ్లు, అంతర్రాష్ట్ర బస్సులు బంద్
కరోనా మహమ్మారి విస్తరించకుండా మార్చి 31 వరకు అన్ని రైళ్లు, మెట్రో రైళ్లు, సబర్బన్ రైళ్లు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. మార్చి 22వ తేదీ అర్ధరాత్రి నుంచే ప్రయాణికుల రైళ్లన్నీ రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కేవలం సరుకు రవాణా చేసే గూడ్‌స రైళ్లను మాత్రమే అనుమతిస్తారు.
జనతా కర్ఫ్యూ విజయవంతం
ప్రమాదకర కోవిడ్‌ను కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛందంగా ‘జనతా కర్ఫ్యూ’ పాటించిన ప్రజలు రోజంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజలంతా మార్చి 22న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్లకే పరిమితమై కర్ఫ్యూను విజయవంతం చేశారు.
ఉపాధి కూలీల వేతనం పెంపు
ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు ఇచ్చే రోజు వారీ వేతనాన్ని ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం రూ.211గా ఉన్న గరిష్ట వేతనం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రూ. 237కు పెరగనుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఆ ఏడాది వివిధ రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు చెల్లించే వేతన రేట్లకు సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త కూలీ రేట్లతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ రోహిత్‌కుమార్ మార్చి 24న నోటిఫికేషన్ జారీ చేశారు. తాజా నోటిఫికేషన్ వివరాలు మార్చి 25న రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖకు చేరాయి. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో పనిచేసే కూలీలకు ఏప్రిల్ ఒకటో తేదీ తరువాత నుంచి రోజుకు రూ.237 చొప్పున వేతనం చెల్లిస్తారు. కాగా, ఉపాధి హామీ పథకం అమలుకయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 90:10 నిష్పత్తిలో భరిస్తాయన్న విషయం తెలిసిందే.
గత నాలుగేళ్లగా రాష్ట్రంలో ఉపాధి కూలీలకు చెల్లిస్తున్న రోజు వారీ వేతన రేట్లు:
ఏడాది | రోజు వారీ వేతనం రూ.లలో |
2017-18 | 197 |
2018-19 | 205 |
2019-20 | 211 |
2020-21 | 237 |
భారత్‌లో తొలి కోవిడ్ 19 మరణం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(కోవిడ్-19) భారత్‌లో తొలి మరణాన్ని తన ఖాతాలో వేసుకుంది. కర్నాటకలోని కలబుర్గికి చెందిన మహ్మద్ హుస్సేన్ సిద్ధఖీ(76) కోవిడ్ లక్షణాలతో బాధ పడుతూ మార్చి 11న మరణించారు. ఈ విషయాన్ని కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి బీ శ్రీరాములు మార్చి 12న వెల్లడించారు. 2020, జనవరి చివరి వారంలో సౌదీ అరేబియాకు వెళ్లిన సిద్ధఖీ ఫిబ్రవరి 29న తిరిగి వచ్చారు.
కేసుల సంఖ్య 74
కొత్తగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైంది. మరో 13 తాజా కేసులు వెలుగులోకి రావడంతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 74కి చేరుకుంది. ఈ పరిణామాలతో భారత్ తనంతట తానుగా నిర్బంధంలోకి వెళ్లిపోయే దిశగా అడుగులు వేస్తోంది. సరిహద్దులన్నీ మూసి వేసి రాకపోకలపై నిషేధం విధించింది.
టీకా కనుగొనేందుకు రెండేళ్లు
కోవిడ్‌కి టీకా కనుగొనేందుకు భారత్‌కు కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ఎంత యుద్ధ ప్రాతిపదికన కృషి చేసినా.. 18 నెలల్లోపు వ్యాక్సిన్‌ను కనుగొనడం అసాధ్యమన్నారు.
కోల్‌కతాలో ఫ్రీ డిజిటల్ లాకర్ సేవలు
భారతీయ తపాలా శాఖ దేశంలోనే తొలిసారిగా కోల్‌కతాలో ఫ్రీ డిజిటల్ పార్శిల్ లాకర్ సేవలను ప్రారంభించింది. దీంతో వినియోగదారులు కొన్ని ప్రత్యేక పోస్టాఫీసుల నుంచి తనకు వీలున్న సమయంలో వచ్చి పార్శిల్‌ను పొందే వెసులుబాటు ఉంటుంది. కోల్‌కతా నగరంలోని నబడిగంట ఐటీ పోస్టాఫీసు, న్యూటౌన్ పోస్టాఫీసుల్లో ప్రస్తుతానికి ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
ఎన్నార్సీకు వ్యతిరేకంగా ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్), జాతీయ పౌరపట్టిక (ఎన్నార్సీ)లను వ్యతిరేకిస్తూ ఢిల్లీ అసెంబ్లీ మార్చి 13న తీర్మానం చేసింది. దేశ ప్రయోజనం దృష్ట్యా, ప్రత్యేకించి దేశంలో ఆర్థిక మందగమనం, నిరుద్యోగం పెరిగిపోతున్న వేళ వీటిని వెనక్కు తీసుకోవాలని కోరుతూ తీర్మానం చేసింది. ఒక వేళ ముందుకు వెళ్లాలనుకుంటే 2010లో పాటించిన పద్ధతులతోనే ఎన్పీఆర్‌ను ముందుకు తీసుకెళ్లాలంటూ స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫ్రీ డిజిటల్ లాకర్ సేవలు
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : భారతీయ తపాలా శాఖ
ఎక్కడ : కోల్‌కతా
యస్ బ్యాంక్ పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం
సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు ఆర్‌బీఐ ప్రతిపాదించిన ‘పునరుద్ధరణ ప్రణాళిక’కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రణాళికను నోటిఫై చేసిన 3 రోజుల్లోగా బ్యాంకుపై మారటోరియంపరమైన ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు, 7 రోజుల్లోగా కొత్త బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్చి 13న తెలిపారు. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ.. 49 శాతం వాటాలు కొనుగోలు చేస్తోందని, యస్ బ్యాంకు కొత్త బోర్డులో ఎస్‌బీఐ డెరైక్టర్లు ఇద్దరు ఉంటారని చెప్పారు. ఇక పెరుగుతున్న మూలధన అవసరాలకు అనుగుణంగా యస్ బ్యాంక్ అధీకృత మూలధనాన్ని రూ. 6,200 కోట్లకు పెంచినట్లు పేర్కొన్నారు. ఆర్‌బీఐ ముసాయిదా పునరుద్ధరణ ప్రణాళిక ప్రకారం.. అధీకృత మూలధనం రూ. 5,000 కోట్లు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళికకు ఆమోదం
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు
వివాద్ సే విశ్వాస్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
పన్ను చెల్లింపుదారులు తమ వివాదాలను సరళతరమైన రీతిలో పరిష్కరించుకోడానికి వీలుకల్పిస్తున్న ‘వివాద్ సే విశ్వాస్ బిల్లు’కు రాజ్యసభ మూజువాణీ ఓటుతో ఆమోదముద్ర వేసింది. మార్చి 4వ తేదీనే బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. మార్చి 13న రాజ్యసభ కూడా దీనికి ఆమోద ముద్ర వేయడంతో బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. 2020, జూన్ 30వ తేదీలోపు వడ్డీ, జరిమానాలు లేకుండా కేవలం పన్ను చెల్లింపుల ద్వారా సంబంధిత వివాదాల పరిష్కారానికి ఈ బిల్లు వీలుకల్పిస్తోంది.
కరువు భత్యం 4 శాతం పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ)ను 4శాతం పెంచే నిర్ణయానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మార్చి 13న జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం లభించింది. దీనివల్ల 1.13 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దార్లకు లబ్ధి చేకూరనుంది. పెరిగిన డీఏ 2020 జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డీఏ 17 నుంచి 21శాతానికి చేరుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వివాద్ సే విశ్వాస్ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : పార్టమెంటు
ఎందుకు : 2020, జూన్ 30వ తేదీలోపు వడ్డీ, జరిమానాలు లేకుండా కేవలం పన్ను చెల్లింపుల ద్వారా సంబంధిత వివాదాల పరిష్కారానికి
జాతీయ రహదారుల నవీకరణకు కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 780 కిలోమీటర్ల పొడవైన హరిత జాతీయ రహదారుల నవీకరణకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) మార్చి 13న ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రహదారుల విస్తరణ, నవీకరణ, తదితర పనుల కోసం కేంద్రం రూ.7,662.7 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నిధుల్లో రూ.3,500 కోట్ల మేర ప్రపంచ బ్యాంకు రుణంగా అందజేస్తుంది.
కొబ్బరికి మద్దతు ధర పెంపు
2020 సీజన్‌కు గాను కొబ్బరికి మద్దతు ధర పెంపు ప్రతిపాదనను సీసీఈఏ ఆమోదం తెలిపింది. 2020 సీజన్‌కు గాను ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ కలిగిన మిల్లింగ్ కొబ్బరికి క్వింటాలుకు రూ.9,521 నుంచి రూ.9,960కి, అదేవిధంగా బాల్ కొబ్బరికి రూ.9,920 నుంచి రూ.10,300కు పెంచుతూ సీసీఈఏ నిర్ణయం తీసుకుంది. మిల్లింగ్ కొప్రాలో క్వింటాల్‌కు రూ. 439, బాల్ కోప్రాలో రూ.380 పెరిగింది. అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయం కంటే మిల్లింగ్ కొబ్బరికి 50 శాతం, బాల్ కొబ్బరికి 55 శాతం రాబడి వచ్చేలా ఈ మద్దతు ధర నిర్ణయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హరిత జాతీయ రహదారుల నవీకరణకు ఆమోదం
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ)
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్
కోవిడ్ 19 జాతీయ విపత్తు: కేంద్ర ప్రభుత్వం
కోవిడ్ 19(కరోనా వైరస్)ను జాతీయ విపత్తుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రపంచ వ్యాప్త మహమ్మారిగా ప్రకటించిన నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు కేంద్ర హోంశాఖ మార్చి 13న తెలిపింది. కోవిడ్ చికిత్సకు ఆసుపత్రుల్లో చేరేవారి కోసం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద రాష్ట్రాలకు సాయం అందించనున్నట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ బాధితులకు తాత్కాలిక వసతి ఇచ్చేందుకు, ఆహారం, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిధులను వాడుకోవచ్చు.
పద్మ ప్రదానోత్సవాలు వాయిదా
2020, మార్చి 26, ఏప్రిల్ 3వ తేదీల్లో ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో జరగాల్సిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలను కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రప్రభుత్వం వాయిదావేసింది. వేర్వేరు రంగాల్లో విశేష కృషిచేసిన 141 మందికి కేంద్రప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించడం తెల్సిందే. ఏడుగురికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మభూషణ్, 118 మందికి పద్మశ్రీ అవార్డులను జనవరి 25న ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కోవిడ్ 19 జాతీయ విపత్తు
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : కోవిడ్‌ను ప్రపంచబ్యాంకు మహమ్మారిగా ప్రకటించిన నేపథ్యంలో
చెన్నైలో లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు
తమిళనాడు రాజధాని చెన్నైలో నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ బెంచ్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు 2020, మార్చి 18 నుంచి అమల్లోకి రానున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ ) బెంచ్‌ల ఉత్తర్వులను సవాలు చేస్తూ ఇక్కడ అప్పీలు చేసుకోవచ్చు. ఢిల్లీలోని ప్రిన్సిపల్ బెంచ్ మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన అప్పీళ్లు విచారిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ బెంచ్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 15
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ల ఉత్తర్వులను సవాలు చేసేందుకు
సంస్కృత వర్సిటీల బిల్లుకు రాజ్యసభ ఆమోదం
కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల బిల్లు(సెంట్రల్ సాంస్కిృట్ యూనివర్సిటీస్ బిల్-2019)కు మార్చి 16న రాజ్యసభ పలు సవరణలతో ఆమోదం తెలిపింది. డీమ్డ్ యూనివర్సిటీలైన రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్(న్యూఢిల్లీ), శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్(న్యూఢిల్లీ), రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్ (తిరుపతి)లను సెంట్రల్ వర్సిటీలుగా మార్చేందుకు ఈ బిల్లును రూపొందించారు. తాజా బిల్లు ప్రకారం తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం.. జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయంగా మారనుంది.
చారిత్రక కట్టడాల్లో చోరీలు
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీ ఆనందవల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న నంది విగ్రహం, కర్ణాటకలోని సదాశివస్వామి గుడిలో రాగి కలశం చోరీకి గురయ్యాయని సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ లోక్‌సభకు తెలిపారు. రక్షిత చారిత్రక కట్టడాల వద్ద 280 మౌలిక సౌకర్యాల కల్పన ప్రాజెక్టులకు అనుమతులిచ్చినట్లు చెప్పారు.
2 వేల నోట్ల ముద్రణ ఆగలేదు: కేంద్ర ప్రభుత్వం
రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేతపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మార్చి 16న లోక్‌సభకు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల బిల్లు-2019కు ఆమోదం
ఎప్పుడు : మార్చి 16
ఎవరు : రాజ్యసభ
ఎందుకు : పలు డీమ్డ్ యూనివర్సిటీలను సెంట్రల్ వర్సిటీలుగా మార్చేందుకు
నేవీలో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు
భారత నావికా దళంలోని మహిళా ఉద్యోగుల కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నేవీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం మార్చి 17న ఈ మేరకు తీర్పు వెలువరించింది. ‘పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించాలి. వివక్షను అధిగమించేందుకు మహిళలకు అవకాశం కల్పించిన సందర్భాలు చరిత్రలో అనేకం ఉన్నాయి’అని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అజయ్ రస్తోగిలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ)లోని విద్య, న్యాయం, రవాణా విభాగాల్లో ప్రస్తుతం విధులు నిర్వర్తించే వారందరికీ శాశ్వత కమిషన్ వర్తిస్తుందని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహిళా ఉద్యోగుల కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : సుప్రీంకోర్టు
ఎక్కడ : భారత నావికా దళం
ఎందుకు : పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించాలని
ఎయిర్‌క్రాఫ్ట్ సవరణ బిల్లుకి పార్లమెంటు ఆమోదం
పౌర విమానయాన రంగ నియంత్రణ సంస్థలైన డీజీసీఏ, బీసీఏఎస్, ఏఏఐబీ మొదలైన వాటికి మరిన్ని అధికారాలు, చట్టబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన ఎయిర్‌క్రాఫ్ట్ (సవరణ) బిల్లు 2020ని మార్చి 17న పార్లమెంటు ఆమోదించింది. విమానయాన రంగ సంస్థలు .. నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో విధించే జరిమానాను రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటికి పెంచడం తదితర ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. కరోనా వైరస్ పరమైన సవాళ్ల నుంచి విమానయాన రంగం సత్వరం బైటికి రాగలదని పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ పురి ధీమా వ్యక్తం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎయిర్‌క్రాఫ్ట్ (సవరణ) బిల్లు 2020కి ఆమోదం
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : పార్లమెంటు
ఎందుకు : డీజీసీఏ, బీసీఏఎస్, ఏఏఐబీ వంటి పౌర విమానయాన రంగ నియంత్రణ సంస్థలకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు
గర్భవిచ్ఛిత్తి సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
గర్భవిచ్ఛిత్తి సవరణ బిల్లు-2020కు లోక్‌సభ మార్చి 17న ఆమోదం తెలిపింది. అత్యాచార బాధితులు, మైనర్లు, దివ్యాంగుల వంటి ప్రత్యేక కేటగిరీలోకి వచ్చే మహిళలు ఇకపై 24 వారాల గర్భంతో ఉన్నప్పుడు కూడా గర్భస్రావం చేయించుకునేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.
భారత్‌లో మూడో మరణం
భారత్‌లో మార్చి 17న మూడో కరోనా మరణం నమోదైంది. ముంబైలో 63 ఏళ్ల వ్యక్తి ఈ వైరస్ బారిన పడి మరణించారు. ఇటీవల దుబాయ్ వెళ్లి వచ్చిన ఆ వ్యక్తికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 39 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో కేరళ(26 కేసులు) ఉంది. హరియాణా, యూపీలో చెరో 15, ఢిల్లీలో 8, లద్దాఖ్‌లో 6, కశ్మీర్‌లో 3 కేసులు కరోనా పాజిటివ్‌గా తేలాయి. దేశవ్యాప్తంగా మార్చి 17 నాటికి కోవిడ్ బాధితుల సంఖ్య 137కి పెరిగింది.
ఎవరూ రాకూడదు...
అఫ్గానిస్తాన్, ఫిలిప్పైన్స్, మలేసియాల నుంచి మార్చి 31 వరకు భారత్‌కు ఎవరూ రాకూడదని ప్రభుత్వం నిషేధం విధించింది. యూరోపియన్ యూనియన్ దేశాలు, టర్కీ, బ్రిటన్‌ల నుంచి ప్రయాణికులను భారత్ ఇప్పటికే నిషేధించిన విషయం తెలిసిందే. మరోవైపు కరోనా కట్టడికి రూ. 200 కోట్లతో ఒక అత్యవసర నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు పశ్చిమబెంగాల్ సీఎం మమత ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గర్భవిచ్ఛిత్తి సవరణ బిల్లు-2020కు ఆమోదం
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : ప్రత్యేక కేటగిరీలోకి వచ్చే మహిళలు ఇకపై 24 వారాల గర్భంతో ఉన్నప్పుడు కూడా గర్భస్రావం చేయించుకునేందుకు వీలుగా
కశ్మీర్‌లో జేకేఏపీ పేరుతో నూతన పార్టీ
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో కొత్త పార్టీ ఏర్పాటైంది. పీడీపీ మాజీ నేత అల్తాఫ్ బుఖారీ ‘జమ్మూ కశ్మీర్ అప్నీ పార్టీ (జేకేఏపీ)’ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. పలువురు మాజీ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో పాటు, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన మాజీలు ఇందులో చేరారు. ఈ పార్టీకి అధ్యక్షుడుగా అల్తాఫ్ మార్చి 8న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అల్తాఫ్ మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్రహోదా తెచ్చే దిశగా తమ పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు.
యస్ బ్యాంక్ రాణా కపూర్ అరెస్ట్
సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. మనీ లాండరింగ్ ఆరోపణలపై బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను (62) ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) మార్చి 8న అరెస్ట్ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జమ్మూ కశ్మీర్ అప్నీ పార్టీ (జేకేఏపీ) పేరుతో కొత్త పార్టీ స్థాపన
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : పీడీపీ మాజీ నేత అల్తాఫ్ బుఖారీ
ఎక్కడ : జమ్మూ కశ్మీర్
మలయాళం న్యూస్ చానెళ్లపై నిషేధం ఎత్తివేత
ఢిల్లీలో చెలరేగిన హింసపై ఏకపక్ష వార్తలు ప్రసారం చేశారన్న ఆరోపణలపై రెండు మలయాళం వార్తా చానళ్లు ఏసియానెట్ న్యూస్, మీడియా వన్‌లపై మార్చి 6న విధించిన 48 గంటల నిషేధాన్ని కేంద్రప్రభుత్వం ఎత్తివేసింది. ఫిబ్రవరి 25న ప్రసారం చేసిన వార్తలకు అదే నెల 28న కేంద్రం షోకాజ్ నోటీసులు జారీచేసింది. చానళ్లు ఇచ్చిన సమాధానంతో సంతృప్తిపడని కేంద్రం మార్చి 6న నుంచి 8 వరకు నిషేధాన్ని విధించింది.
ఢిల్లీలో లేపాక్షి హస్తకళల కేంద్రం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో హస్తకళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో మార్చి 7న ‘లేపాక్షి హస్తకళల విక్రయ కేంద్రం’ను ఆయన ప్రారంభించారు.
ఎయిర్ పవర్ సదస్సులో ఐఏఎఫ్ చీఫ్ బదౌరియా
సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ దేశ రాజధాని న్యూఢిల్లీలో ఫిబ్రవరి 28న నిర్వహించిన ‘ఎయిర్ పవర్ ఇన్ నో వార్ నో పీస్ సినారియో’ సదస్సులో ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బదౌరియా ప్రసంగించారు. ‘36 రఫేల్ యుద్ధ విమానాలు మన అవసరాలకు సరిపోవు. మనం దేశీయంగా తయారు చేసిన అస్త్ర క్షిపణిని ఎస్‌యూ 30, మిగ్ 29 వంటి ఇతర ఫైటర్ జెట్‌పై ఉపయోగించగలగాలి. అప్పుడే మన వైమానిక శక్తి మరింత పెరుగుతుంది’ అని ఆయన అన్నారు. అయితే, ఇతర క్షిపణులను ప్రయోగించగల యుద్ధ విమానాలను దేశీయంగా ఉత్పత్తి చేసుకోవాల్సి ఉందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎయిర్ పవర్ ఇన్ నో వార్ నో పీస్ సినారియో సదస్సు
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బదౌరియా
ఎక్కడ : న్యూఢిల్లీ
సామాజిక న్యాయ శిబిరంలో ప్రధాని మోదీ
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(అలహాబాద్)లో సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు సహాయపడే ఉపకరణాల పంపిణీ కార్యక్రమం సామాజిక న్యాయ శిబిరంలో ఫిబ్రవరి 29న ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సుగమ్య భారత్ తఅభియాన్ పథకంలో భాగంగా విమానాశ్రయాల్లో, 700కి పైగా రైల్వే స్టేషన్లలో దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ప్రస్తుతం దేశంలో 2.50 కోట్ల మందికి పైగా దివ్యాంగులుంటే, 10 కోట్ల మందికి పైగా సీనియర్ సిటిజన్లు ఉన్నారు.
బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన
ఉత్తరప్రదేశ్‌లో 296కి.మీ.ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. చిత్రకూట్, బాందా, హమీర్‌పూర్, జలాన్ జిల్లాల మీదుగా మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ని కలుపుతూ ఈ ఎక్స్‌ప్రెస్‌వే సాగుతుంది.
గిన్నిస్ రికార్డుల్లోకి...
అలహాబాద్‌లో త్రివేణి సంగమం వద్ద పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సామాజిక న్యాయ కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డులకెక్కింది. ఈ మెగా క్యాంప్‌లో 56 వేలకు పైగా వివిధ రకాల ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేశారు. 26 వేల మంది లబ్ధిదారులు వాటిని అందుకున్నారు. హియరింగ్ ఎయిడ్‌లు, కృత్రిమ పాదాలు, బ్యాటరీతో నడిచే త్రిచక్ర వాహనాలు ఉన్నాయి. ఈ పరికరాలకే రూ.19 కోట్లకు పైగా ఖర్చు అయింది. మొత్తం మూడు రికార్డులను సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 28న 1.8 కి.మీ. పొడవునా 300 మంది దివ్యాంగులు కూర్చున్న త్రిచక్ర వాహనాల పెరేడ్ గిన్నిస్ రికార్డుని సొంతం చేసుకుంది. ఒకే వేదికపై నుంచి భారీ స్థాయిలో పరికరాల పంపిణీ, ఆ తర్వాత వీల్ చైర్ల పెరేడ్ కూడా గిన్నిస్ రికార్డులకెక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సామాజిక న్యాయ శిబిరం
ఎప్పుడు : ఫిబ్రవరి 29
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్
ఎందుకు : సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు సహాయపడే ఉపకరణాల పంపిణీ కోసం
రాజర్‌హాట్‌లో ఎన్‌ఎస్‌జీ కాంప్లెక్స్ ప్రారంభం
కోల్‌కతా సమీపంలోని రాజర్‌హాట్‌లో జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) 29వ స్పెషల్ కంపోసిట్ గ్రూప్ (ఎస్‌సీజీ) కాంప్లెక్స్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మార్చి 1న ప్రారంభించారు. అలాగే మానేసర్, హైదరాబాద్, చెన్నై, ముంబైలోని ఎన్‌ఎస్‌జీ భవనాల్ని కూడా కోల్‌కతా నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎన్‌ఎస్‌జీ అంటే ఉగ్ర వ్యతిరేక దళంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని అన్నారు. 10 వేల ఏళ్ల చరిత్రలో భారత్ ఎలాంటి దాడులూ జరపలేదని.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయన్నారు. ఎవరైనా తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించినా.. జవాన్లు, ప్రజల మీద దాడులకు యత్నించినా.. భారత్ గట్టిగా బదులిస్తుందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌ఎస్‌జీ 29వ ఎస్‌సీజీ కాంప్లెక్స్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : కేంద్ర హోం మంత్రి అమిత్‌షా
ఎక్కడ : రాజర్‌హాట్, కోల్‌కతా సమీపం, పశ్చిమ బెంగాల్
ఐడియాస్ ఫర్ ఇండియా కాంక్లేవ్ ప్రారంభం
ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం భారతదేశం వైపు చూస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో ‘ఐడియాస్ ఫర్ ఇండియా-2020’పాలసీ కాంక్లేవ్ కార్యక్రమాన్ని ఆయన మార్చి 1న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకుపోతోందన్నారు.
శ్రీసిటీ సీఎఫ్‌ఓ నాగరాజన్‌కు అవార్డు
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగిన వార్షిక సీఎఫ్‌ఓ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో శ్రీసిటీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) ఆర్.నాగరాజన్ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు. ‘టాప్ 100 సీనియర్ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ ఇన్ ఇండియా’ అవార్డును రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారు అరవింద్ మాయారామ్ చేతుల మీదుగా ఆయన స్వీకరించారు. దేశంలో అత్యంత ప్రభావశీల కంపెనీలలో సీనియర్ ఫైనాన్స్ లీడర్లను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం సీఎఫ్‌ఓ ఇండియా కాంక్లేవ్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఇది 10వ కాంక్లేవ్.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐడియాస్ ఫర్ ఇండియా-2020 పాలసీ కాంక్లేవ్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి
ఎక్కడ : ఐఎస్‌బీ, హైదరాబాద్
మిలాన్ -2020 విన్యాసాలు వాయిదా
ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) తర్వాత నౌకాదళ విన్యాసాల్లో కీలకమైన మిలాన్ -2020ని వాయిదా వేస్తున్నట్లు భారత నౌకాదళం మార్చి 3న ప్రకటించింది. మిలాన్ -2020లో భాగంగా వివిధ దేశాల సైనిక బృందాలు రాకపోకలు సాగించనున్న కారణంగా కోవిడ్ 19 వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.
మిలాన్-2020 విన్యాసాల్ని విశాఖపట్నంలో 2020, మార్చి 18 నుంచి 28 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు ఇప్పటికే భారత నౌకాదళం దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, యూరప్ దేశాలకు ఆహ్వానాలు పంపించింది. ఇందులో ఇప్పటికే 30 దేశాలు తాము పాల్గొంటున్నట్లు అంగీకారం తెలిపాయి. మిగిలిన దేశాలూ వచ్చే అవకాశముంది. అయితే కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో మిలాన్‌ని వాయిదా వేస్తే మంచిదని రక్షణ శాఖ నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిలాన్ -2020 విన్యాసాలు వాయిదా
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : భారత నౌకాదళం
ఎందుకు : కోవిడ్19 వ్యాప్తి నేపథ్యంలో
పౌరసత్వ సవరణ చట్టంపై సుప్రీంకోర్టుకు ఐరాస
పౌరసత్వ సవరణ చట్టం 2019 (సీఏఏ) రాజ్యాంగబద్ధతపై జరుపుతున్న విచారణలో అమికస్ క్యూరీగా తాము చేరతామని భారత సుప్రీంకోర్టును ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం సంప్రదించింది. సీఏఏపై విచారణలో అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలు, నియమాలు, ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందని ఐక్యరాజ్య సమతి మానవ హక్కుల హై కమిషనర్ మైకేల్ బాచెలెట్ జెరియా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సీఏఏపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు జెరియా మార్చి 2న జెనీవాలోని భారత దౌత్యకార్యాలయానికి సమాచారం అందించారని, భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్ మార్చి 3న తెలిపారు.
ఐరాస మానవ హక్కుల విభాగం నిర్ణయంపై స్పందించిన భారత్.. ఆ చట్టం తమ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేసింది. ఈ విషయంలో విదేశీ సంస్థల జోక్యానికి తావులేదని తెలిపింది.
కోపరేటివ్ బ్యాంకుల పటిష్టతకు బిల్లు
డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు వీలుగా కోపరేటివ్ బ్యాంకులను ఆర్‌బీఐ నియంత్రణల పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో మార్చి 3న ‘బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లును ప్రవేశపెట్టింది. ఉభయసభల ఆమోదం అనంతరం ఇది చట్టంగా అమల్లోకి రానుంది. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) తరహా సంక్షోభాలు భవిష్యత్తులో జరగకుండా చూసేందుకు ఈ బిల్లు తక్షణావసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభకు తెలిపారు.
ఈ బిల్లుతో కోపరేటివ్ బ్యాంకులు ఆర్‌బీఐ నియంత్రణ పరిధిలోకి వచ్చినప్పటికీ.. పాలనాపరమైన అంశాల పర్యవేక్షణ రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్‌స పరిధిలోనే ఉండనుంది. సరైన నియంత్రణ, మెరుగైన నిర్వహణ ద్వారా కోపరేటివ్ బ్యాంకులను వాణిజ్య బ్యాంకుల మాదిరిగా పటిష్టం చేయడం బిల్లు లక్ష్యం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లోక్‌సభలో బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లు
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎందుకు : కోపరేటివ్ బ్యాంకులను ఆర్‌బీఐ నియంత్రణల పరిధిలోకి తీసుకొచ్చేందుకు
ఔషధాల ఎగుమతులపై ఆంక్షలు
చైనాలో కోవిడ్ 19 (కరోనా వైరస్) ప్రబలిన నేపథ్యంలో దేశీయంగా ఔషధాల లభ్యతకు సమస్యలు లేకుండా చూడటంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా 26 యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ), ఔషధాల ఎగుమతులపై మార్చి 3న ఆంక్షలు విధించింది. పారాసెటమల్, విటమిన్ బీ1, బీ12 మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. తాజా ఆంక్షలతో ఇకపై వీటి ఎగుమతుల కోసం డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. తదుపరి ఆదేశాలిచ్చే వరకూ ఆంక్షలు కొనసాగుతాయని డీజీఎఫ్‌టీ వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఔషధాల ఎగుమతులపై ఆంక్షలు
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : భారత ప్రభుత్వం
ఎందుకు : కోవిడ్19 వ్యాప్తి నేపథ్యంలో
పూసా కృషి విజ్ఞాన్ మేళా 2020 ముగింపు
దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో మార్చి 1న మొదలైన ‘పూసా కృషి విజ్ఞాన్ మేళా 2020’ మార్చి 3న ముగిసింది. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కైలాష్‌చౌదరి వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసిన వారికి అవార్డులను ప్రదానం చేశారు. వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం హస్తవరానికి చెందిన ఆదర్శరైతు ఆకేపాటి వరప్రసాద్‌రెడ్డి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్‌ఐ) ‘సృజనాత్మక రైతు’ అవార్డును మంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. వినూత్న పద్దతుల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగుచేసి అధిక దిగుబడులు సాధిస్తున్నందుకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఆకేపాటికి ఈ జాతీయ పురస్కారం లభించడం ఇది రెండవసారి. దేశవ్యాప్తంగా మొత్తం 47 మంది రైతులు ఐఏఆర్‌ఐ జాతీయస్థాయి అవార్డులకు ఎంపికయ్యారు.
రెండో దశ స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభం
రెండో దశ స్వచ్ఛ భారత్ మిషన్(గ్రామీణం) ప్రారంభమైంది. న్యూఢిల్లీలో మార్చి 4న జరిగిన కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ మిషన్‌ను ప్రారంభించారు. రూ.1,40,881 కోట్లతో చేపట్టిన రెండో దశ మిషన్‌ను 2020-21 నుంచి 2024-25 మధ్య అమలు చేస్తారు. రెండో దశ మిషన్ ద్వారా దేశంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను చేపడతారు. ‘గత ఐదేళ్లలో మొదటి దశ స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా టాయిలెట్ల నిర్వహణ, వాడకంలో సాధించిన లక్ష్యాలపై రెండో దశ స్వచ్ఛ భారత్ మిషన్ దృష్టి సారిస్తుంది’అని మంత్రి షెకావత్ తెలిపారు.
ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రూ. 446 కోట్లు
గత ఐదేళ్ల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు రూ. 446.52 కోట్లు ఖర్చు చేసినట్లు విదేశాంగ శాఖ మార్చి 4న తెలిపింది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు 2015-16లో రూ. 121.85 కోట్లు, 2016-17లో రూ. 78.52 కోట్లు, 2017-18లో రూ. 99.90 కోట్లు ఖర్చయింది. అలాగే 2018-19లో 100.02 కోట్లు, 2019-20లో 46.23 కోట్లు ఖర్చు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెండో దశ స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : దేశంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను చేపట్టేందుకు
కంపెనీల చట్టం సవరణకు కేబినెట్ ఆమోదం
దేశీ కంపెనీలు విదేశీ ఎక్స్చేంజీల్లో నేరుగా లిస్టయ్యే ప్రతిపాదనకు కేంద్రప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇందుకు అనుగుణంగా కంపెనీల చట్టం, 2013కి సవరణలు చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మార్చి 4న జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మొత్తంగా కంపెనీల చట్టంలో 72 సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కొన్ని భారతీయ సంస్థల షేర్లు విదేశీ ఎక్స్చేంజీల్లో ట్రేడవుతున్నప్పటికీ.. అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్), గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) రూపంలో లిస్టయి ఉంటున్నాయి.
పెట్టుబడులకు ఆస్కారం...
నేరుగా విదేశాల్లో లిస్టింగ్ అవకాశం లభించిన పక్షంలో ఆయా సంస్థలు విసృ్తత స్థాయిలో నిధులు సమీకరించుకునేందుకు మరిన్ని మార్గాలు లభించడంతో పాటు.. దేశంలోకి మరింతగా పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉండగలదని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కంపెనీల చట్టం, 2013కి సవరణలు
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : దేశీ కంపెనీలు విదేశీ ఎక్స్చేంజీల్లో నేరుగా లిస్టయ్యేందుకు వీలు కల్పించేందుకు
వివాద్ సే విశ్వాస్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన ‘వివాద్ సే విశ్వాస్ బిల్లు 2020’కు మార్చి 4న లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు ప్రకారం... 2020 జనవరి 31 నాటికి పలు అప్పిలేట్ ఫోరమ్‌ల వద్ద నమోదై, అపరిష్కృతంగా ఉన్న కేసులు, రుణ రికవరీ ట్రిబ్యునల్స్‌లో (డీఆర్‌టీ) ఉన్న పెండింగ్ కేసులు వివాద్ సే విశ్వాస్ పథకం పథకం పరిధిలోకి వస్తాయి. పన్ను చెల్లింపులు రూ.5 కోట్లలోపు ఉన్న సోదా కేసులకే ఇది వర్తిస్తుంది.
పథకాన్ని ఎంచుకున్న వారు.. 2020, మార్చి 31లోగా వివాదాస్పద పన్ను మొత్తం కడితే వడ్డీ నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. గడువు నాటికి చెల్లించలేకపోతే, మార్చి తర్వాత జూన్ 30 వరకు మరో విడత గడువు లభిస్తుంది. కానీ, మార్చి 31లోపు చెల్లించాల్సిన దానితో పోలిస్తే ఆ తర్వాత 10 శాతం అదనంగా చెల్లించాలి. 2019 నవంబర్ దాకా గణాంకాల ప్రకారం.. వివాదాల్లో చిక్కుబడిన ప్రత్యక్ష పన్ను బకాయీలు సుమారు రూ. 9.32 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2020-21 బడ్జెట్‌లో వివాద్ సే విశ్వాస్ పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వివాద్ సే విశ్వాస్ బిల్లు 2020కు ఆమోదం
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కారానికి
ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా గెర్సాయిన్
ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా చమోలీ జిల్లాలోని గెర్సాయిన్ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ మార్చి 4న రాష్ట్ర శాసనసభలో ప్రకటించారు. చమోలి జిల్లాను వేసవి రాజధానిగా ప్రకటించాలని స్థానికులు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే గెర్సాయిన్ (భరాదిసైన్)ను వేసవి రాజధానిగా ప్రకటించాలంటూ బీజేపీ ఎన్నికల తీర్మానం కూడా చేసింది. మరోవైపు గెర్సాయిన్‌ను రాష్ట్ర వేసవి రాజధానిగా ప్రకటించాలని కర్ణప్రయాగ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ నేగి ఇటీవల ముఖ్యమంత్రితో సమావేశం సందర్భంగా డిమాండ్ చేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా గెర్సాయిన్
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్
క్రిప్టోకరెన్సీపై ఆర్‌బీఐ నిషేధం సరికాదు: సుప్రీం
వివాదాస్పద క్రిప్టోకరెన్సీ అంశంపై భారత సుప్రీంకోర్టు మార్చి 4న కీలక తీర్పునిచ్చింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు.. ఈ కరెన్సీలకు సంబంధించిన సేవలను అందించవచ్చని పేర్కొంది. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ 2018లో జారీ చేసిన సర్క్యులర్‌ను కోర్టు కొట్టివేసింది. క్రిప్టోకరెన్సీలపై ఆర్‌బీఐ ’నిషేధా’న్ని సవాల్ చేస్తూ.. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎంఏఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.
క్రిప్టోకరెన్సీపై కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ఈ నేపథ్యంలో క్రిప్టోకరెన్సీలపై రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్ సరికాదని జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్ సారథ్యంలోని త్రిసభ్య బెంచ్ ఉత్తర్వులిచ్చింది.