Skip to main content

Global Food Security: ఆహార మిగులు దేశంగా మారిన భారత్!

భారత్‌ ఆహార మిగులు దేశంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
India part of global solution on food security, says Prime Minister Narendra Modi

ఆగ‌స్టు 3వ తేదీ 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రపంచ ఆహార, పౌష్టికాహార భద్రతకు పరిష్కారాలను అందించేందుకు కృషి చేస్తోందన్నారు. భారత ఆర్థిక విధానాలకు వ్యవసాయమే కేంద్ర బిందువని, ఆహార భద్రతకు చిన్న రైతులే అతి పెద్ద బలమని స్పష్టం చేశారు. 

65 ఏళ్ల క్రితం వ్యవసాయ రంగంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్న భారత్‌ నేడు ఆహార మిగులు దేశంగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. పాలు, పప్పులు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉందని, ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పత్తి, చక్కెర, టీ, చేపల ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉందని తెలిపారు. ప్రపంచ సంక్షేమానికి భారత్‌ను 'విశ్వ బంధు'గా అభివర్ణించారు.

ప్రకృతి సాగుతో సానుకూల ఫలితాలు
ప్రకృతి వ్యవసాయాన్ని భారీగా ప్రోత్సహించడంతో దేశంలో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని మోదీ తెలిపారు. సుస్థిరమైన, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోగల సాగు విధానాలపై ఈ బడ్జెట్‌లో ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు. పంటల పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు.

గడిచిన పదేళ్లలో భిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే దాదాపు 1,900 కొత్త వంగడాలను రైతులకు అందజేసినట్లు చెప్పారు. సాంప్రదాయ రకాల కంటే 25 శాతం తక్కువ నీరు అవసరమయ్యే వరి రకాలను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. భారత తృణధాన్యాల బుట్టను ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

Menstrual Leave Policy: గుడ్‌న్యూస్.. నెలసరి సెలవు విధానం అమలు.. ఏ రాష్ట్రంలో అంటే..

సాంకేతికత పరిజ్ఞానంతో అనుసంధానం  
వ్యవసాయాన్ని ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో అనుసంధానిస్తున్నామని మోదీ వెల్లడించారు. సోలార్‌ ఫార్మింగ్‌ మొదలుకుని ఈ–నామ్‌ తదితరాలను ఉదాహరించారు. సంప్రదాయ రైతుల నుంచి అగ్రికల్చర్‌ స్టార్టప్‌ల వరకు, సహజ వ్యవసాయం నుండి ఫార్మ్‌ వ్యవసాయం వరకు వివిధ వ్యవసాయ, అనుబంధ రంగాల ఆధునీకరణ గురించి వివరించారు. పదేళ్లలో 90 లక్షల హెక్టార్లను మైక్రో ఇరిగేషన్‌ కిందకు తీసుకొచ్చామన్నారు. 

రైతుల బ్యాంకు ఖాతాలకు డబ్బు..
పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద ఒక్క క్లిక్‌తో 10 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ చేస్తున్నామన్నారు. పంటల సర్వే కోసం డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తెచ్చామని చెప్పారు. తమ ప్రభుత్వం చేపట్టిన ఆధునిక చర్యలు భారతదేశంలోని రైతులకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా ప్రపంచ ఆహార భద్రతను బలోపేతం చేస్తాయన్నారు. అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సుకు 70 దేశాల నుంచి వెయ్యి మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఆగ‌స్టు 7వ తేదీ వరకు ఈ సదస్సు జరుగుతుంది.

Supreme Court: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై చరిత్రాత్మకమైన తీర్పు.. కేసు ఏమిటంటే..

Published date : 06 Aug 2024 09:54AM

Photo Stories