డిసెంబర్ 2020 జాతీయం
పరిశుభ్రంగా లేని మరుగుదొడ్లు, మాన్యువల్ స్కావెంజర్ల సమాచారం గుర్తించడానికి, జియో ట్యాగ్ చేయడానికి ‘‘స్వచ్ఛత అభియాన్’’ అనే మొబైల్ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఈ యాప్‌ను డిసెంబర్ 24న న్యూఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రి థావర్ చంద్ గహ్లోత్ ప్రారంభించారు.
రెండో దశ స్వచ్ఛ భారత్ ప్రారంభం...
రెండో దశ స్వచ్ఛ భారత్ మిషన్(గ్రామీణం) ప్రారంభమైంది. న్యూఢిల్లీలో 2020, మార్చి 4న జరిగిన కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ మిషన్‌ను ప్రారంభించారు. రూ.1,40,881 కోట్లతో చేపట్టిన రెండో దశ మిషన్‌ను 2020-21 నుంచి 2024-25 మధ్య అమలు చేస్తారు. రెండో దశ మిషన్ ద్వారా దేశంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను చేపడతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వచ్ఛత అభియాన్ అనే మొబైల్ యాప్ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రి థావర్ చంద్ గహ్లోత్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : పరిశుభ్రంగా లేని మరుగుదొడ్లు, మాన్యువల్ స్కావెంజర్ల సమాచారం గుర్తించడానికి, జియో ట్యాగ్ చేయడానికి
విశ్వభారతి విశ్వవిద్యాలయ స్థాపకులు ఎవరు?
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాంతినికేతన్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ 1921, డిసెంబర్ 23న స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయం వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటైన ఉత్సవాలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 24న వర్చువల్ విధానం ద్వారా ప్రసంగించారు. భారత్‌తోపాటు ప్రపంచం సాధికారత సాధించాలని గురుదేవుడు రవీం ద్రనాథ్ ఠాగూర్ ఆకాంక్షించారనీ, అదే లక్ష్యంగా తమ ప్రభుత్వం‘ఆత్మనిర్భర్ భారత్’ను ప్రకటించిందని మోదీ తెలిపారు.
రూ.59 వేల కోట్ల స్కాలర్‌షిప్...
షెడ్యూల్డ్ కుల(ఎస్‌సీ) విద్యార్థుల విద్యాభ్యాసం కోసం కేంద్ర కేబినెట్ డిసెంబర్ 23న కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లలో 4 కోట్లకు పైగా విద్యార్థుల కోసం రూ. 59,000 కోట్ల పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటా (35,534 కోట్లు) భరించనుండగా, మిగిలిన 40 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి.
అటల్ బిహారీ వాజ్‌పేయి: ఏ కమ్మెమోరేటివ్ వాల్యూం పుస్తకావిష్కరణ
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 96వ జయంతి(డిసెంబర్ 25) సందర్భంగా దేశప్రజలు ఆయన్ను ఘనంగా స్మరించుకున్నారు. న్యూఢిల్లీలోని సదైవ్ అటల్ మెమోరియల్ వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వాజ్‌పేయికు అంజలి అర్పించారు. పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌లో డిసెంబర్ 25న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. సమావేశంలో ‘‘అటల్ బిహారీ వాజ్‌పేయి: ఏ కమ్మెమోరేటివ్ వాల్యూం’’ అనే పుస్తకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. లోక్‌సభ సెక్రటరియేట్ రూపొందించిన ఈ పుస్తకంలో వాజ్‌పేయి లోక్‌సభలో చేసిన ప్రసంగాలు, వాజ్‌పేయి అరుదైన ఫొటోలను పొందుపరిచారు. వాజ్‌పేయి పుట్టినరోజైన డిసెంబర్ 25న జాతీయ సుపరిపాలనా దినోత్సవంగా పాటిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అటల్ బిహారీ వాజ్‌పేయి: ఏ కమ్మెమోరేటివ్ వాల్యూం పుస్తకావిష్కరణ
ఎప్పుడు : డిసెంబర్ 25
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : పార్లమెంట్ సెంట్రల్‌హాల్
ఎందుకు : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 96వ జయంతి(డిసెంబర్ 25) సందర్భంగా
మత మార్పిడిని నిరోధించే బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రం?
వివాహం ద్వారా గానీ లేదా ఇతర తప్పుడు పద్ధతుల్లో మత మార్పిడికి పాల్పడడాన్ని అడ్డుకునేందుకు ఉద్దేశించిన ‘‘మత స్వేచ్ఛ(ఫ్రీడం ఆఫ్ రిలిజియన్) బిల్లు-2020’’కు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదించింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా డిసెంబర్ 26న వెల్లడించారు. ఇది అమల్లోకి వచ్చి చట్టరూపం దాలిస్తే, చట్ట ఉల్లంఘనకు అత్యధికంగా పదేళ్ళ జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చు.
మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదించిన బిల్లు ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ప్రొహిబిషన్ ఆఫ్ అన్‌లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలిజియన్ ఆర్డినెన్స్, 2020ని పోలి ఉంది.
మధ్యప్రదేశ్ రాజధాని: భోపాల్
మధ్యప్రదేశ్ ప్రస్తుత గవర్నర్: ఆనందీబెన్ పటేల్
మధ్యప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి: శివరాజ్ సింగ్ చౌహాన్
ఉత్తరప్రదేశ్ రాజధాని: లక్నో
ఉత్తరప్రదేశ్ ప్రస్తుత గవర్నర్: ఆనందీబెన్ పటేల్
ఉత్తరప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి: యోగి ఆదిత్యానాథ్
క్విక్ రివ్యూ:
ఏమిటి : మత స్వేచ్ఛ(ఫ్రీడం ఆఫ్ రిలిజియన్) బిల్లు-2020కు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : మధ్యప్రదేశ్ కేబినెట్
ఎందుకు : వివాహం ద్వారా గానీ లేదా ఇతర తప్పుడు పద్ధతుల్లో మత మార్పిడికి పాల్పడడాన్ని అడ్డుకునేందుకు
ఇటీవల ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభమైంది?
పేదలకు రూ.5లక్షల ఆరోగ్య బీమాను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన(AB-PMJAY)’’ కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లోని ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఏబీ-పీఎంజేఏవై సెహత్(AB-PMJAY SEHAT) పేరుతో డిసెంబర్ 26న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానం ద్వారా ఈ పథకాన్ని కశ్మీర్‌లో ప్రారంభించారు. ఈ పథకం కింద కశ్మీర్‌లోని 12 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుంది. పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కశ్మీరీ సంప్రదాయ ఫెరాన్ వస్త్రాలు ధరించారు. ఈ వస్త్రాలను 2019 ఏడాది కశ్మీర్ వ్యవసాయ కూలీ ఒకరు మోదీకి బహూకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జమ్మూకశ్మీర్‌లో ఆయుష్మాన్ భారత్ పథకం(AB-PMJAY SEHAT) ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : వర్చువల్ విధానం ద్వారా
ఎందుకు : కశ్మీర్‌లోని పేదలకు రూ.5లక్షల ఆరోగ్య బీమాను కల్పించేందుకు
దేశంలో తొలి డ్రైవర్ రహిత రైలు ఎక్కడ ప్రారంభమైంది?
దేశంలోనే తొలి డ్రైవర్ రహిత, ఫుల్లీ ఆటోమేటెడ్ రైలు దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 28న ఢిల్లీ మెట్రోలో ఈ రైలును వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ప్రస్తుతం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్‌సీ)లో భాగమైన 37 కి.మీల మెజెంటా లైన్ మార్గంలో(జానక్ పురి వెస్ట్ నుంచి బొటానికల్ గార్డెన్ వరకు) ఈ డ్రైవర్‌లెస్ ట్రైన్ నడుస్తుంది. మరో ఆరు నెలల్లో పింక్ లైన్(మజ్లిస్ పార్క్ - శివ్ విహార్)లోనూ ఈ రైలును నడపనున్నారు.
మరోవైపు అన్ని ప్రజా రవాణా సేవలను పొందేందుకు వీలు కల్పించే ‘నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్’ను కూడా ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్డు వల్ల ప్రయాణికులు తమకు నచ్చిన ప్రాంతాలకు.. నచ్చిన ప్రజారవాణా వ్యవస్థను ఎంచుకుని ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లోనే ఇది పనిచేస్తుంది. డ్రైవర్‌లెస్ ట్రైన్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు
- ప్రస్తుతం 18 నగరాలకు పరిమితమైన మెట్రో రైలు సేవలను... 2025 నాటికి 25 నగరాలకు విస్తరిస్తాం.
- 2014లో 5 నగరాల్లో, 248 కిలోమీటర్లకు మాత్రమే పరిమితమైన మెట్రో సేవలు ప్రస్తుతం 700కు పైగా కిలోమీటర్లలో అందుబాటులోకి వచ్చాయి.
- 2025 నాటికి సుమారు 1,700 కి.మీ. పరిధిలో మెట్రో సేవలను విస్తరింపజేస్తాం.
- ప్రయాణీకుల సంఖ్య తక్కువగా ఉంటే పట్టణాలో ‘మెట్రోలైట్’ విధానంలో తక్కువ ఖర్చుతో మెట్రో సేవలందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
- జల మార్గాలకు అవకాశమున్న నగరాల్లో ‘వాటర్ మెట్రో’ విధానం ఒక వినూత్న ఆలోచన అవుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలోనే తొలి డ్రైవర్ రహిత, ఫుల్లీ ఆటోమేటెడ్ రైలు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : మెజెంటా లైన్ మార్గం(జానక్ పురి వెస్ట్ నుంచి బొటానికల్ గార్డెన్ వరకు), న్యూఢిల్లీ
దేశంలో 100వ కిసాన్ రైలు ఏ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభమైంది?
దేశంలో 100వ కిసాన్ రైలు సర్వీసు ప్రారంభమైంది. డిసెంబర్ 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఈ రైలు సర్వీసును ప్రారంభించారు. మహారాష్ట్రలోని సాంగోలా నుంచి పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్ వరకు ఈ రైలు నడవనుంది. రైతుల కోసం తెచ్చిన కిసాన్ రైల్‌లో రిఫ్రిజిరేటర్ కోచ్‌లు ఉంటాయి. త్వరగా పాడైపోయే పండ్లు, కూరగాయలు వంటి వాటిని తరలించడానికి రైలు ఉపయుక్తంగా ఉంటుంది. తక్కువ ధరలకే రైతుల పంటలను రవాణా చేసేందుకు ఇది ఉపకరిస్తుంది. రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి వీలుగా రైల్వే స్టేషన్లకు దగ్గరలో రైల్ కార్గో సెంటర్లను నిర్మిస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో 100వ కిసాన్ రైలు సర్వీసు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : మహారాష్ట్రలోని సాంగోలా నుంచి పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్ వరకు
ఎందుకు : రైతులు త్వరగా పాడైపోయే పండ్లు, కూరగాయలు వంటి వాటిని తరలించడానికి
దేశంలోని ఏ నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్ ప్రక్రియ ప్రారంభమైంది?
దేశవ్యాప్త కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం త్వరలో ప్రారంభం కానుండగా సన్నాహకాల్లో భాగంగా డిసెంబర్ 28న డమ్మీ వ్యాక్సినేషన్ (డ్రై రన్) ప్రారంభమైంది. టీకా సరఫరా, పంపిణీ, వ్యాక్సినేషన్ మొదలుకొని ప్రతి అంశంపై పరిశీలన జరిపి, వాస్తవ వ్యాక్సినేషన్‌ను ఎలాంటి అవాంతరాలు లేకుండా అమలు చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం.
నాలుగు రాష్ట్రాల్లో...
ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, అస్సాం రాష్ట్రాలలో డిసెంబర్ 28న డ్రైరన్ కార్యక్రమం ప్రారంభమైంది. డిసెంబర్ 29వ తేదీన కూడా ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా విజయవాడ, గుజరాత్‌లోని గాంధీనగర్, రాజ్‌కోట్, పంజాబ్‌లోని లూధియానా, షహీద్ భగత్ సింగ్ నగర్ (నవాన్‌షహర్), అస్సాంలోని సోనిత్‌పూర్, నల్బరీ జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలైంది.
డ్రై రన్ అంటే?
నామమాత్ర పు(డమ్మీ) కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను డ్రై రన్‌గా వ్యవహరిస్తారు. ఇదొక మాక్ డ్రిల్ లాంటిదే. టీకా పంపిణీకి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం, లోపాలను గుర్తించే ప్రయత్నంలో భాగంగానే ఈ డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఇందులో డమ్మీ వ్యాక్సిన్ ఇస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డమ్మీ వ్యాక్సినేషన్ (డ్రై రన్) కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, అస్సాం
ఎందుకు : కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం సన్నాహకాల్లో భాగంగా
దేశంలోని ఏ ఐఐటీలో టెక్నాలజీ హబ్(టైహాన్) ఏర్పాటు కానుంది?
మానవ రహిత విమానాలు, రిమోట్ కంట్రోల్‌తో నడిచే వాహనాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం పరీక్షించేందుకు ఉద్దేశించిన ‘టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఫర్ అటానమస్ నేవిగేషన్ సిస్టమ్స్(టైహాన్)’ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ-హైదరాబాద్)లో ఏర్పాటు కానుంది. ఐఐటీ-హైదరాబాద్‌లో టైహాన్ ఏర్పాటుకు కోసం డిసెంబర్ 29న కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ పునాది వేశారు. వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమం జరిగింది.
రూ.135 కోట్లు...
టైహాన్ ఏర్పాటు కోసం ఐఐటీ-హెచ్‌కు రూ.135 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అత్యాధునిక సిమ్యులేషన్ టెక్నాలజీలు, రహదారి వ్యవస్థలు, వీ2ఎక్స్ కమ్యూనికేషన్, డ్రోన్లు ఎగిరేందుకు, దిగేందుకు అవసరమైన రన్‌వేలు, ల్యాండింగ్ ఏరియాలను టైహాన్‌లో ఏర్పాటుచేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఫర్ అటానమస్ నేవిగేషన్ సిస్టమ్స్(టైహాన్) ఏర్పాటుకు శంకుస్థాపన
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్
ఎక్కడ : ఐఐటీ-హైదరాబాద్
ఎందుకు : మానవ రహిత విమానాలు, రిమోట్ కంట్రోల్‌తో నడిచే వాహనాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం పరీక్షించేందుకు
న్యూ భావ్‌పూర్ - న్యూ ఖుర్జా మార్గం ప్రారంభం
సరుకు రవాణా కోసం ఉద్దేశించిన ప్రత్యేక రైల్వే కారిడార్... ఈస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్(ఈడీఎఫ్‌సీ)లో పరిధిలోని 351 కి.మీ.ల ‘న్యూ భావ్‌పూర్ - న్యూ ఖుర్జా’ మార్గం ప్రారంభమైంది. డిసెంబర్ 29న ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ మార్గాన్ని ప్రారంభించారు. అలాగే ప్రయాగ్‌రాజ్(అలహాబాద్)లోని ఈడీఎఫ్‌సీ ఆపరేషన్ కేంద్రాన్ని, న్యూ భావ్‌పూర్ - న్యూ ఖుర్జా మార్గంలో 1.5 కి.మీ.ల పొడవైన తొలి గూడ్సు రైళ్లను కూడా ప్రధాని ప్రారంభించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు.
ఈడీఎఫ్‌సీ ప్రాజెక్టు...
- ఈడీఎఫ్‌సీ ప్రాజెక్టులో మొత్తం 1,840 కి.మీ. మేర ప్రత్యేక ఫ్రీట్ కారిడార్‌ను నిర్మిస్తారు. ఇది పంజాబ్‌లోని లూథియానా నుంచి పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా వరకు ఉంటుంది.
- తాజాగా ప్రారంభించిన 351 కి.మీ.ల న్యూ భావ్‌పూర్ - న్యూ ఖుర్జా సెక్షన్‌ను రూ. 5,750 కోట్లతో నిర్మించారు. టాటా ప్రాజెక్ట్స్ ఇండియా-అల్దెశా గ్రూప్ సంస్థలు ఈ మార్గాన్ని నిర్మించాయి. 351 కి.మీ.ల ఈ మార్గం మొత్తం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు
- న్యూ భావ్‌పూర్ - న్యూ ఖుర్జా మార్గంలో తొలి రవాణా రైలు ప్రారంభమైన సందర్భంగా ‘స్వావలంబ భారత్’ గర్జన స్పష్టంగా వినిపిస్తోంది.
- తాజా సదుపాయంతో రైతులు సరైన సమయంలో తమ ఉత్పత్తులను మార్కెట్‌కు చేర్చగలరు.
- సరకు రవాణా ఖర్చు తగ్గుతుందని, ఫలితంగా వస్తువుల ధరలు కూడా తగ్గడానికి వీలవుతుంది.
- ఈడీఎఫ్‌సీకు 2006లోనే అనుమతి లభించింది. అయితే 2014 వరకు ఒక్క కి.మీ. కూడా ట్రాక్ వేయలేదు. నిధులను వినియోగించలేదు.
- 2014లో మేం ప్రారంభించేనాటికి ఈడీఎఫ్‌సీ ప్రాజెక్టు ఖర్చు 11 రెట్లు పెరిగింది. మేం అధికారంలోకి వచ్చిన తరువాత 1,100 కి.మీ.ల పనులు పూర్తయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : న్యూ భావ్‌పూర్ - న్యూ ఖుర్జా రైలు మార్గం
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఉత్తరప్రదేశ్
ఎందుకు : సరుకు రవాణా కోసం ఉద్దేశించిన ప్రత్యేక రైల్వే కారిడార్... ఈస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్(ఈడీఎఫ్‌సీ)లో భాగంగా
ఏ మిస్సైల్‌ను విదేశాలకు ఎగుమతి చేయాలని భారత్ నిర్ణయించింది?
దేశీయంగా తయారు చేసిన ఆకాశ్ మిస్సైల్ వ్యవస్థను విదేశాలకు ఎగుమతి చేసేందుకు భారత ప్రభుత్వం డిసెంబర్ 30న అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆకాశ్ మిస్సైల్స్‌ను కొనేందుకు తయారుగా ఉన్న దేశాల ప్రతిపాదనలు పరిశీలించి వేగంగా అమ్మకాల అనుమతులిచ్చేందుకు వీలుగా ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఆకాశ్ మిస్సైల్ 25 కిలోమీటర్ల రేంజ్‌లో టార్గెట్‌ను విజయవంతంగా ధ్వంసం చేయగలదు.
కాస్త భిన్నంగా...
ఆకాశ్ మిస్సైల్స్‌ను విదేశాలకు విక్రయించేందుకు కేంద్ర కేబినెట్ డిసెంబర్ 30న ఆమోదం తెలిపిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. అయితే విదేశాలకు ఎగుమతి చేసే ‘ఆకాశ్’ వ్యవస్థ... ప్రస్తుతం భారత దళాలు ఉపయోగిస్తున్న దానితో పోలిస్తే భిన్నంగా ఉంటుందని తెలిపారు. ఈ నిర్ణయంతో ఆయుధాల విక్రయాల్లో భారత్ విదేశాలతో పోటీ పడే అవకాశం కలుగుతుందన్నారు. 2024నాటికి 101 రకాల ఆయుధాలను, మిలటరీ ప్లాట్‌ఫామ్స్‌ను దిగుమతి చేసుకోవడం నిలిపివేసి స్వదేశీవి తయారు చేసుకోవాలని భారత్ భావిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆకాశ్ మిస్సైల్ వ్యవస్థను విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతి
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : ఆయుధాల విక్రయాల్లో భారత్ విదేశాలతో పోటీ పడేందుకు
ఎన్ని వేల కోట్లతో ఆయుధాల కొనుగోలుకు డీఏసీ ఆమోదం తెలిపింది?
రూ.28 వేల కోట్లతో సైన్యానికి అవసరమైన ఆయుధాలు, ఇతర పరికరాల కొనుగోలుకు భారత రక్షణ శాఖకు చెందిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) డిసెంబర్ 17న ఆమోదం తెలియజేసింది. ఇందులో వాయుసేన కోసం 6 గగనతల హెచ్చరిక, నియంత్రణ విమానాలు, నావికాదళం కోసం 11 అత్యాధునిక నిఘా నౌకలు కూడా ఉన్నాయి. 38 బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్రూయిజ్ మిస్సైళ్ల కొనుగోలు ప్రతిపాదనను కూడా డీఏసీ ఆమోదించింది.
మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ దేశీయంగా తయారైన ఆయుధాల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ.28 వేల కోట్లతో సైన్యానికి అవసరమైన ఆయుధాలు, ఇతర పరికరాల కొనుగోలుకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : భారత రక్షణ శాఖకు చెందిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ)
వంటగ్యాస్ వినియోగంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం?
దేశవ్యాప్తంగా అత్యధికంగా వంట గ్యాస్ (ఎల్పీజీ, బయో గ్యాస్) వినియోగిస్తున్న కుటుంబాలు ఉన్న రాష్ట్రాల్లో గోవా మొదటి స్థానంలో నిలిచింది. గోవాలో 83.6 శాతం కుటుంబాలు వంటగ్యాస్‌ను వినియోగిస్తూ కాలుష్య రహిత వాతావరణంలో జీవిస్తున్నాయి. కేంద్రం విడుదల చేసిన ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-20’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మొదటి దశలో 17 రాష్ట్రాలు, ఐదు కేంద్ర పాలిత ప్రాంతాల్లో వంట గ్యాస్ సర్వే నిర్వహించారు. రెండో దశ సర్వే నివేదికను 2021 ఏడాది విడుదల చేయనున్నారు.
తొలిదశ సర్వేలోని అంశాలు...
- గోవా తర్వాత 91.8 శాతం కుటుంబాలకు వంటగ్యాస్‌తో తెలంగాణా రెండో స్థానంలో నిలిచింది.
- 83.6 శాతం కుటుంబాలకు వంటగ్యాస్‌తో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం దక్కించుకుంది.
- - 83.8 శాతం కుటుంబాలకు వంటగ్యాస్ ఉన్న మిజోరాం నాలుగో స్థానంలో ఉంది.
- ఐదు రాష్ట్రాల్లో ఇప్పటికీ 45 శాతం కంటే తక్కువ కుటుంబాలు వంటగ్యాస్ వినియోగిస్తున్నాయి.
- నాగాలాండ్‌లో 43 శాతం, అస్సోంలో 42.1 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 40.2 శాతం, బిహార్‌లో 37.8శాతం, మేఘాలయలో 33.7 శాతం కుటుంబాలే వంటగ్యాస్ వినియోగిస్తున్నాయి.
పారిశుధ్యంలో లక్షద్వీప్‌కు తొలిస్థానం...
కుటుంబ పారిశుధ్య పరిస్థితుల సూచీలో లక్షద్వీప్ మొదటిస్థానం సాధించింది. అక్కడ 99.8 శాతం కుటుంబాలు మెరుగైన పారిశుధ్యం పాటిస్తున్నాయి. రెండో స్థానంలో ఉన్న కేరళలో 98.7 శాతం కుటుంబాలు మెరుగైన పారిశుధ్య పరిస్థితుల్లో జీవిస్తున్నాయి. పారిశుధ్యంలో బిహార్, లద్దాఖ్ చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వంటగ్యాస్ వినియోగంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : గోవా
ఎందుకు : 83.6 శాతం కుటుంబాలు వంటగ్యాస్‌ను వినియోగిస్తున్నందున
భారత రైతులు సొంతంగా ప్రారంభించిన పత్రిక పేరు?
వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు వద్ద నిరసన తెలుపుతున్న రైతులు ‘ట్రాలీ టైమ్స్’ పేరుతో సొంతంగా ఒక పత్రికను ప్రచురించడం ప్రారంభించారు. రైతు ఉద్యమ వివరాలతో వారానికి రెండు సార్లు వచ్చే ఈ ట్రాలీ టైమ్స్ పత్రిక తొలి ప్రతిని డిసెంబర్ 19న ప్రచురించారు. ఆందోళనలో పాల్గొంటున్న రైతులకు ఉద్యమానికి సంబంధించి తప్పుడు సమాచారం అందకూడదనే అందకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని హోషియార్ సింగ్ అనే రైతు తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘ట్రాలీ టైమ్స్’ పేరుతో కొత్త పత్రిక ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు వద్ద నిరసన తెలుపుతున్న రైతులు
హిమనీనదాల లోతును కొలిచే ప్రాజెక్టును చేపట్టనున్న శాఖ?
హిమాలయాల ప్రాంతంలోని హిమనీనదాల(గ్లేసియర్స్) లోతును తేల్చాలని కేంద్ర ఎర్త్‌సెన్సైస్ శాఖ నిర్ణయించింది. 2021, జూన్-జూలైలో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు ఎర్త్‌సెన్సైస్ శాఖ కార్యదర్శి రాజీవన్ డిసెంబర్ 20న తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా హిమనీనదాల్లో మంచి నీటి లభ్యత ఎంతనేది తేటతెల్లం కానుంది. ప్రాజెక్టులో భాగంగా... మొదట చంద్రా రివర్ బేసిన్లోని ఏడు హిమనీనదాల్లో అధ్యయనం నిర్వహిస్తారు. చీనాబ్ నదికి ప్రధాన ఆధారం చంద్రా రివర్ బేసినే.
భవిష్యత్తులో...
హిమాలయాల్లో పుట్టే అన్ని నదులకు జల వనరులు అక్కడి హిమనీనదాలే. అవి కరిగి నదుల్లోకి ప్రవహిస్తున్నాయి. భూతాపం వల్ల హిమనీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. ఫలితంగా నదులు చిక్కిపోతున్నాయి. గ్లేసియర్లలో ఉన్న నీటి పరిమాణం ఎంతో తెలిస్తే భవిష్యత్తులో జల ప్రణాళికలు రూపొందించుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుంది.
మంచు-ప్రపంచ రికార్డు
2 గంటల 35 నిమిషాల 43 సెకండ్లపాటు మంచు ముక్కల మధ్య గడిపిన వ్యక్తిగా ఫ్రాన్సులోని వట్రెలోస్‌కు చెందిన రొమయిన్ వాండెన్‌డోర్ప్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హిమనీనదాల లోతును కొలిచే ప్రాజెక్టును చేపట్టనున్న శాఖ
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : కేంద్ర ఎర్త్‌సెన్సైస్ శాఖ
ఎక్కడ : హిమాలయాల ప్రాంతం
ఎందుకు : గ్లేసియర్లలో ఉన్న నీటి పరిమాణం ఎంతో తెలిస్తే భవిష్యత్తులో జల ప్రణాళికలు రూపొందించుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుందని
అయోధ్యలో కొత్తగా నిర్మించబోయే మసీదు ఆకృతిని రూపొందించిన వ్యక్తి?
అయోధ్యలో కొత్తగా నిర్మించబోయే మసీదు నిర్మాణానికి సంబంధించిన భవన ఆకృతిని అయోధ్య మసీదు ట్రస్టు ‘‘ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) ట్రస్్ట’’ డిసెంబర్ 19న విడుదల చేసింది. ఈ మసీదుకి ఇంకా పేరు నిర్ణయించలేదని, చక్రవర్తిగానీ, రాజు పేరుమీదగానీ మసీదు ఉండబోదని ట్రస్ట్ పేర్కొంది. ప్రపంచంలోని అనేక మసీదుల డిజైన్లను పరిగణనలోనికి తీసుకొని మసీదు, దానిపక్కనే ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన డిజైన్‌ని విడుదల చేసింది. ఈ మసీదు ప్రాజెక్టు ఆకృతి(డిజైన్)ని జామియా మిలియా ఇస్లామియాకు చెందిన ప్రొఫెసర్ ఎస్‌ఎమ్ అక్తర్ రూపొందించారు.
అయోధ్యలో రామాలయం, మసీదులను విడివిడిగా నిర్మించుకోవచ్చని 2019 ఏడాదిలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో మసీదు ప్రాజెక్టు తొలిదశలో భాగంగా 2021 ఏడాది ప్రారంభంలో పునాది రాయి వేయవచ్చునని భావిస్తున్నారు. మసీదుతో పాటు ఆసుపత్రి నిర్మాణం కూడా చేపట్టి, రెండో దశలో ఆ ఆసుపత్రిని మరింత విస్తరించాలని ట్రస్టు భావిస్తోంది.
ధనిపూర్ గ్రామంలో...
బాబ్రీమసీదు స్థానంలో కొత్త మసీదు నిర్మాణానికి అయోధ్యలోని ధనిపూర్ గ్రామంలో ఐదుఎకరాల భూమిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం కేటాయించింది. మసీదు నిర్మాణం కోసం ఐఐసీఎఫ్ ట్రస్్టను ఉత్తర్‌ప్రదేశ్ సున్ని సెంట్రల్ వక్ఫ్‌బోర్డ్ ఏర్పర్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అయోధ్యలో కొత్తగా నిర్మించబోయే మసీదు ప్రాజెక్టు డిజైనర్
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : ప్రొఫెసర్ ఎస్‌ఎమ్ అక్తర్
ఎక్కడ : ధనిపూర్, అయోధ్య, ఉత్తరప్రదేశ్
దేశంలో తొలి బుల్లెట్ రైలు ఏ రెండు నగరాల మధ్య నడవనుంది?
ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు(ఎంఏహెచ్‌ఎస్‌ఆర్)లో భాగంగా నడిపే బుల్లెట్ రైలు చిత్రాన్ని జపాన్ రాయబార కార్యాలయం మొదటిసారిగా డిసెంబర్ 19న విడుదల చేసింది. ముంబై-అహ్మదాబాద్ మధ్య నడవనున్న ‘‘ఈ5 సిరీస్ షింకాన్‌సెన్ రైలింజన్’’కు కొన్ని మార్పులు చేయనున్నట్లు వెల్లడించింది. ముంబై, అహ్మదాబాద్‌ల మధ్య 508 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టు 2023 కల్లా పూర్తి చేయాల్సి ఉంది. సుమారు రూ.1,08,000 కోట్ల ఈ ప్రాజెక్టుకు జపాన్ ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సాయం(రుణం) అందిస్తుంది.
కశ్మీర్ డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలు
జమ్మూ కశ్మీర్ డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఎన్నికల కమిషన్ డిసెంబర్ 23న వెల్లడించిన వివరాల ప్రకారం... మొత్తం 20 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు 14 చొప్పున 280 సీట్లకు 8 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో పీఏజీడీ(గుప్కార్ కూటమి) 110 స్థానాల్లో గెలుపొంది అగ్రస్థానంలో నిలిచింది. 75 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచిన సింగిల్ పార్టీగా అవతరించింది. మరో రెండు స్థానాల ఫలితాలు ఇంకా వెలువడాల్సిఉంది. ఈరెండు చోట్ల పోటీ చేసిన అభ్యర్థ్ధుల్లో పీఓకేకు చెందిన వారుండడంతో ఫలితాల ప్రకటన నిలిపారు. ఆర్టికల్ 370 అధికరణ రద్దు తర్వాత కశ్మీర్‌లో జరిగిన తొలి డీడీసీ ఎన్నికలు ఇవే.
తెలుగు భాషకు అధికార భాష హోదా కల్పించిన రాష్ట్రం?
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తెలుగును అధికార భాషగా గుర్తించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో డిసెంబర్ 23న సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి తెలుగు భాషకు అధికార భాష హోదా కల్పించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అలాగే తెలుగు ప్రజలను భాషాపరమైన మైనారిటీలుగా గుర్తించే ప్రతిపాదనను కూడా కేబినెట్ ఆమోదించింది.
10కి పైగా అధికార భాషలు...
తెలుగును అధికార భాషగా ప్రకటించాలని బెంగాల్‌లోని తెలుగు ప్రజలు కొన్నేళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మమత ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బెంగాల్‌లో 10కి పైగా అధికార భాషలు ఉన్నాయి. బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ ప్రాంతంలో తెలుగు ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. అందుకే ఖరగ్‌పూర్‌ను మినీ ఆంధ్రాగా పిలుస్తారు.
ప్రశ్న: ‘‘దేశ భాషలందు తెలుగు లెస్స’’ అని అన్నది ఎవరు?
అత్యంత సుప్రసిద్ధమైన ‘‘విజయనగర సామ్రాజ్య’’ చక్రవర్తి శ్రీ కృష్ణదేవ రాయలు తాను రచించిన ‘‘ఆముక్త మాల్యద’’ కావ్యంలో దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికారు. అలాగే కాకతీయుల కాలపు కవి అయిన వినుకొండ వల్లభరాయుడు.. తాను రచించిన నాటకం ‘‘క్రీడాభిరామం’’లో దేశ భాషలందు తెలుగు లెస్స వాక్యాన్ని ఉటంకించారు.
తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ, తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెరుగవే బాసాడి,
దేశభాషలందు తెలుగు లెస్స
- శ్రీ కృష్ణదేవ రాయలు
జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశ భాషలందు తెలుగు లెస్స
జగతి దల్లికంటె సౌభాగ్య సంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?
- వినుకొండ వల్లభరాయుడు
నూతన పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు. శృంగేరి పీఠం నుంచి శంఖం, నవరత్న పీఠాలను శృంగేరి శారద పీఠం జగద్గురు భారతీ తీర్థ పంపారు. కార్యక్రమంలో సర్వమత ప్రార్థనలు చేశారు. శృంగేరి పీఠం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. శంకుస్థాపన సందర్భంగా మోదీ ప్రసంగించారు.
ప్రధాని మోదీ ప్రసంగం...
- నూతన భవనం ఆత్మ నిర్భర్ భారత్ దార్శనికతలో అంతర్భాగమని, స్వాతంత్య్ర అనంతర కాలంలో మొదటిసారిగా ఓ ప్రజా పార్లమెంటు నిర్మించేందుకు చరిత్రాత్మక అవకాశం వచ్చింది.
- పాత పార్లమెంటు భవనం స్వాతంత్య్రం అనంతర కాలంలో దేశానికి ఒక దిశను అందిస్తే కొత్త భవనం ఆత్మ నిర్భర్ భారత్ ఆవిష్కారానికి సాక్షిగా మారనుంది. 21వ శతాబ్దపు ఆకాంక్షలను నెరవేరుస్తుంది.
సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కింద...
ప్రస్తుత పార్లమెంట్‌కు దగ్గరోనే సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కింద కొత్త పార్లమెంట్ భవనాలను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక కొత్త పార్లమెంట్ భవనం, సెంట్రల్ సెక్రటేరియట్ భవనం నిర్మించడమే కాకుండా రాజ్‌పథ్ రోడ్‌ను మెరుగుపరుస్తారు.
సెంట్రల్ విస్టా విశేషాలు..
- సెంట్రల్ విస్టా ప్రాజెక్టు చేపట్టే ప్రాంతం ల్యూటెన్ ఢిల్లీలో ఉంది.
- గుజరాత్‌కు చెందిన హెచ్‌సీపీ సంస్థ ప్రాజెక్టు నిర్మాణాల ఆర్కిటెక్చర్‌ను సమకూరుస్తోంది.
- నూతన భవన నిర్మాణ కాంట్రాక్టును టాటా ప్రాజెక్ట్స్ గెలుచుకుంది.
- 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు.
- ప్రాజెక్టు అంచనా దాదాపు రూ.971 కోట్లు. 2022 ఏడాదికి పూర్తి చేయాలని లక్ష్యం.
- ఎలాంటి భూకంపాలకు చెక్కుచెదరని రీతిలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.
- నూతన భవనం రూపు ప్రస్తుత భవనాన్ని పోలి ఉంటుంది.
- నిర్మాణం పూర్తయితే లోక్‌సభ సీటింగ్ సామర్థ్యం 888 మంది సభ్యులకు పెరుగుతుంది.
- సంయుక్త సమావేశాలప్పుడు 1224 మందివరకు సామర్ధ్యం పెంచుకునే వీలుంది.
- రాజ్యసభ సీటింగ్ సామర్ధ్యం 384 సీట్లు.
- ప్రాజెక్టులో భాగంగా నిర్మించే {శమ్‌శక్తి భవన్‌లో ఒక్కో ఎంపీకి 40 చదరపు మీటర్ల ఆఫీసు ఇస్తారు. ఈ భవనం నిర్మాణం 2024లో పూర్తవుతుంది.
- పార్లమెంటు, ఎంపీల కార్యాలయ భవనానికి మధ్య భూగర్భమార్గం ఏర్పాటు చేస్తారు.
- భవన నిర్మాణంలో 2 వేల మంది ప్రత్యక్షంగాను, 9 వేల మంది పరోక్షంగాను పాలుపంచుకుంటారు.
ప్రస్తుత పార్లమెంటు భవనం గురించి...
- బ్రిటిష్ కాలంలో ఈ భవనాన్ని నిర్మించారు.
- శంకుస్థాపన: 1921 ఫిబ్రవరి 12
- నిర్మాణానికి పట్టిన కాలం: 6 సం.లు
- నిర్మాణ వ్యయం: రూ. 83 లక్షలు
- ప్రారంభోత్సవం: 1927 జనవరి 18
- ప్రారంభించింది: అప్పటి గవర్నర్ జనరల్ ఇర్విన్
- రూపం: 560 అడుగుల వ్యాసంతో కూడిన వృత్తాకార కట్టడం
- ఆకృతి, ప్లానింగ్, నిర్మాణ బాద్యతలు చేపట్టింది: ఎడ్విన్ లుటెన్స్, హెర్బెర్ట్ బేకర్
పీఎం స్వనిధి పైలట్ ప్రాజెక్టుకు ఎంపికైన నగరాల సంఖ్య?
ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి(PM SVANIDHI -పీఎం స్వనిధి) పథకం ద్వారా రుణ సహాయం పొందుతున్న వీధి వ్యాపారులు, వారి కుటుంబ సభ్యులతో కూడిన సమగ్ర వివరాలను క్రోడీకరించేందుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా డిసెంబర్ 11న ఈ పెలైట్ ప్రాజెక్టును ప్రారంభించారు. లబ్ధిదారుల ప్రొఫైల్డ్ డేటా ఆధారంగా, వారి సమగ్ర సామాజిక-ఆర్థిక అభ్యున్నతి కోసం వివిధ కేంద్ర పథకాల ప్రయోజనాలు వారికి విస్తరించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది.
ఈ పెలైట్ ప్రాజెక్టు మొదటి దశలో 125 నగరాలను ఎంపిక చేశారు. ముందుగా గయా, ఇండోర్, నిజామాబాద్, రాజ్‌కోట్,వారణాసి తదితర నగరాల్లో పైలట్ ప్రోగ్రాం అమలు చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీఎం స్వనిధి పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ
ఎక్కడ : మొదటి దశలో భాగంగా దేశవ్యాప్తంగా 125 నగరాల్లో
ఎందుకు : పీఎం స్వనిధి పథకం ద్వారా రుణ సహాయం పొందుతున్న వీధి వ్యాపారులు, వారి కుటుంబ సభ్యులతో కూడిన సమగ్ర వివరాలను క్రోడీకరించేందుకు
కేంద్ర మంత్రి రవిశంకర్ ఆవిష్కరించిన డాక్ పే యాప్ ఉద్దేశం?
తపాలా శాఖ (ఇండియా పోస్ట్), ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఖాతాదారుల సౌలభ్యం కోసం సరికొత్త యాప్ ‘డాక్ పే’ రూపకల్పన జరిగింది. డిసెంబర్ 15న న్యూఢిల్లీలో కేంద్ర న్యాయ, సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ డాక్ పే యాప్‌ను ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా తపాలా శాఖ, ఐపీపీబీ అందించే సేవలను ఇంటి వద్దే నుంచే పొందవచ్చు. నగదు పంపడం, క్యూఆర్ కోడ్ స్కానింగ్, సేవలు, వ్యాపారులకు చేసే చెల్లింపులు వంటి సేవలను ఖాతాదారులు డిజిటల్‌గా పూర్తిచేయొచ్చు.
ఐపీపీబీ గురించి...
- ఐపీపీబీని ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో 2018, సెప్టెంబర్ 1న ప్రారంభించారు.
- ఐపీపీబీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
- బ్యాంకింగ్ సేవలను ప్రతి ఇంటికీ, ఆర్థిక సమ్మిళిత వృద్ధికి తోడ్పడటానికి తొలుత సుమారు 1.55 లక్షల తపాలా శాఖలు, 3 లక్షల మంది పోస్ట్‌మెన్, గ్రామీణ్ డాక్ సేవక్‌లతో ఐపీపీబీని ప్రారంభించారు.
- ఈ బ్యాంకు సేవలు ఇతర సాధారణ బ్యాంకుల మాదిరిగానే ఉన్నా కార్యకలాపాలు తక్కువ స్థాయిలో ఉంటాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డాక్ పే యాప్ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : కేంద్ర న్యాయ, సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : తపాలా శాఖ (ఇండియా పోస్ట్), ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఖాతాదారుల కోసం
విజయ్ దివస్
బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసిన 1971 యుద్ధంలో పాకిస్తాన్‌లో భారత్ విజయానికి గుర్తుగా ప్రతిఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విజయానికి 49 ఏళ్ల పూర్తయిన సందర్భంగా 2020 ఏడాది ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద స్వర్ణ విజయ్ జ్యోతిని ప్రధాని నరేంద్ర మోదీ వెలిగించారు. అనంతరం దేశవ్యాప్తంగా ఏడాది పాటు జరగనున్న స్వర్ణ విజయోత్సవాల (50వ వార్షికోత్సవాలు)ను మోదీ ప్రారంభించారు.
విజయ్ దివస్ వేడుకల సందర్భంగా నాలుగు విజయ జ్యోతులను(కాగడాలు) దేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లనున్నట్లు భారత రక్షణ శాఖ తెలియజేసింది. 1971 యుద్ధంలో పరమ వీరచక్ర, మహా వీరచక్ర పురస్కారాలు పొందిన విజేతల సొంత గ్రామాలకు ఈ జ్యోతులు వెళ్తాయని తెలిపింది.
భారత నావికాదళ దినోత్సవం
భారత నావికాదళ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 4న త్రివిధ దళాధిపతులు ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర జవాన్లకు నివాళులర్పించారు. దేశ రక్షణలో నేవీ సిబ్బంది నిబద్ధత అద్భుతమైనది అని నౌకాదళాధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోవిడ్-19 నేపథ్యంలో నేవీ డే విన్యాసాలు ఈ ఏడాది నిరాడంబరంగా జరిగాయి. వేడుకలు, నేవీ విన్యాసాలు రద్దయ్యాయి. నేవీ డే సందర్భంగా విశాఖ సాగరతీరంలో తూర్పు నౌకాదళం పలు సాహస విన్యాసాలను నిర్వహిస్తుంది. ప్రస్తుతం తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్‌గా అతుల్‌కుమార్ జైన్ ఉన్నారు.
నేవీ డే-2020 థీమ్: ‘ఇండియన్ నేవీ కంబాట్ రెడీ, క్రెడిబుల్ & కొహెసివ్’
నేవీ డే కథ...
బంగ్లాదేశ్ విమోచన అంశం ప్రధాన కారణంగా భారత్-పాక్ మధ్య 1971 డిసెంబర్ 3న మొదలైన యుద్ధం డిసెంబర్ 16న పాకిస్తాన్ ఓటమితో ముగిసింది. ఈ యుద్ధంలో డిసెంబర్ 4న పాకిస్తాన్ దక్షిణ తీర ప్రాంతంలోని ముఖ్యమైన కరాచీ నౌకా స్థావరాన్ని భారత పశ్చిమ నౌకాదళం ‘ఆపరేషన్ ట్రైడెంట్’ పేరుతో నాశనం చేసింది. ఈ అద్భుత విజయానికి చిహ్నంగా ఏటా డిసెంబర్ 4న ‘భారత నౌకాదళ దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. 17వ శతాబ్దపు మరాఠా చక్రవర్తి, ఛత్రపతి శివాజీ భోంస్లేను ‘భారత నావికా పితామహుడి‘గా భావిస్తారు.
ప్రధాని మోదీ ఇటీవల ఏ నగర మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు?
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో ఆగ్రా మెట్రో ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణ పనులకు డిసెంబర్ 7న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. రూ.8,379.62 కోట్లతో చేపడుతున్న ఈ మెట్రోరైలు ప్రాజెక్టును వచ్చే ఐదేళ్లలో పూర్తి చేయనున్నారు. తాజ్ మహల్, ఆగ్రా ఫోర్టు వంటి పలు పర్యాటక కేంద్రాలను... రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్‌లతో కలుపుతూ రెండు కారిడార్లతో ఈ మెట్రోరైలు మార్గాన్ని నిర్మించనున్నారు.
సైనిక దళాల ఫ్లాగ్ డే...
మన సైనికుల నిస్వార్థమైన సేవ, సాహసాలు, త్యాగం పట్ల దేశం గర్విస్తోందని... సైనిక దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 1949 నుంచి ఏటా డిసెంబర్ 7వ తేదీని ఫ్లాగ్ డేగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆగ్రా మెట్రో ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణ పనులకు శంకుస్థాపన
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఆగ్రా, ఉత్తరప్రదేశ్
ఎందుకు : ఆగ్రా ప్రజలకు మెట్రో సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు
ఐసీఐడీ 25వ కాంగ్రెస్‌ను ఏ భారతీయ నగరంలో నిర్వహించనున్నారు?
ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసీఐడీ) 25వ కాంగ్రెస్‌ను 2023 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఐసీఐడీ అంతర్జాతీయ అధ్యక్షుడు ఫెలిక్స్ బ్రిట్జ్ రియండర్స్ డిసెంబర్ 8న ప్రకటించారు. ఐసీఐడీ కార్యవర్గ సమావేశాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఐసీఐడీ ఆరో కాంగ్రెస్ (మహాసభ) 1966లో ఢిల్లీలో జరిగింది. మళ్లీ 57 ఏళ్ల తర్వాత విశాఖపట్నంలో నిర్వహించాలని నిర్ణయించారు.
1951లో ఆవిర్భావం...
ప్రపంచంలో సాగు నీటి వనరుల పరిరక్షణ, అభివృద్ధి, యాజమాన్య పద్ధతుల ద్వారా తక్కువ నీటితో అధిక ఆయకట్టులో పంటలు పండించడమే లక్ష్యంగా జూన్ 24,1951లో ఢిల్లీ వేదికగా ఐసీఐడీ ఆవిర్భవించింది. 90 శాతానికి పైగా సాగుకు యోగ్యమైన భూమి గల 78 దేశాలకు ఈ సంస్థలో సభ్యత్వం ఉంది.
వర్చువల్ విధానంలో 24వ కాంగ్రెస్...
కరోనా నేపథ్యంలో ఐసీఐడీ 24వ కాంగ్రెస్‌ను డిసెంబర్ 8న ‘వర్చువల్ విధానం’లో నిర్వహించారు. భారత్ నుంచి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ ఆర్కే జైన్, ఐసీఐడీ ఉపాధ్యక్షుడు, ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ కె.యల్లారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఉత్తమ రైతు పురస్కారం...
సూక్ష్మ నీటి పారుదల విధానం ద్వారా తక్కువ నీటితో.. అధిక విస్తీర్ణంలో గరిష్టంగా దిగుబడులు సాధించిన అనంతపురం జిల్లా రైతు ఎం.శివశంకర్‌రెడ్డికి ఉత్తమ రైతు పురస్కారాన్ని ఐసీఐడీ చైర్మన్ రియండర్స్ ప్రదానం చేశారు. 2 వేల డాలర్ల నగదు పురస్కారాన్ని కూడా అందజేశారు. ప్రపంచ సాగునీటి వారసత్వ కట్టడాలుగా గుర్తించిన పోరుమామిళ్ల చెరువు (వైఎస్సార్ జిల్లా), కంభం చెరువు (ప్రకాశం జిల్లా), కేసీ కెనాల్ (కర్నూల్ జిల్లా)కు గుర్తింపు పత్రాలను అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐసీఐడీ 25వ కాంగ్రెస్
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : ఐసీఐడీ అంతర్జాతీయ అధ్యక్షుడు ఫెలిక్స్ బ్రిట్జ్ రియండర్స్
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : సాగు నీటి వనరుల పరిరక్షణ, అభివృద్ధి, యాజమాన్య పద్ధతులపై చర్చించేందుకు
ఇండియా మొబైల్ కాంగ్రెస్-2020 ప్రారంభం
ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ) వర్చువల్ సమావేశం డిసెంబర్ 8న ప్రారంభమైంది. డిసెంబర్ 10 వరకు జరగనున్న ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కాంగ్రెస్‌లో 30కి పైగా దేశాల నుంచి దాదాపు 210 మంది వక్తలు పాల్గొన్నారు. కేంద్ర టెలికం మంత్రిత్వ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, సమాచార శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే పాల్గొన్నారు.
సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగం
- భారీ స్థాయిలో చేపట్టనున్న కోవిడ్-19 టీకాల కార్యక్రమంలో మొబైల్ టెక్నాలజీని వినియోగించనున్నాం.
- అనేక రెట్లు వేగవంతమైన డేటా సర్వీసులను అందించగలిగే 5జీ మొబైల్ నెట్‌వర్క్‌ను సత్వరం అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది.
- అసంఖ్యాకంగా నగదు రహిత లావాదేవీల నిర్వహణకు మొబైల్ టెక్నాలజీ ఉపయోగపడుతోంది.
- టెలికం పరికరాలు, డిజైన్, అభివృద్ధి, తయారీకి భారత్‌ను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అంతా కలిసి పనిచేయాలి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియా మొబైల్ కాంగ్రెస్-2020 సమావేశం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : వర్చువల్ విధానంలో
ఎందుకు : దేశాభివృద్ధిలో కీలకం అవుతున్న కమ్యూనికేషన్ల రంగంపై చర్చలు జరిపేందుకు
కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన పీఎం-వాణి కార్యక్రమం ఉద్దేశం?
దేశంలో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ‘‘పీఎం-వాణి(PM-WANI)’’ కార్యక్రమానికి కేంద్ర కేబినెట్ డిసెంబర్ 9న ఆమోదం తెలిపింది. పీఎం వాణి(పబ్లిక్ వైఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేజ్ ) కార్యక్రమంలో భాగంగా... పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీఓ), పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్లు(పీడీఓఏ), యాప్ డెవలపర్లు ఇలా వివిధ వర్గాల భాగస్వామ్యంతో ‘పబ్లిక్ వైఫై నెట్‌వర్క్’లను నెలకొల్పుతారు. ఎలాంటి అనుమతులు, రుసుం, నమోదు అవసరం లేకుండానే పీడీఓల ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తారు. దీంతో దేశంలో భారీ వైఫై విప్లవానికి తెరలెవనుంది.
మరిన్ని అంశాలు...
- వైఫై యాక్సెస్ పాయింట్ల ఏర్పాటు, నిర్వహణ, అలాగే సబ్‌స్క్రయిబర్లకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడం వంటివన్నీ పీడీఓ నిర్వర్తిస్తుంది.
- పీడీఓలకు అగ్రిగేటర్‌గా వ్యవహరించే పీడీఓఏ... పీడీఓలకు అవసరమైన అనుమతులు, అకౌంటింగ్ సంబంధిత అంశాలను చూస్తుంది.
- యూజర్లు రిజిస్టర్ చేసుకోవడం, దగ్గర్లో ఉన్న ‘వాణి’ సదుపాయం కలిగిన వైఫై హాట్‌స్పాట్‌లను గుర్తించి, డిస్‌ప్లే చేయడం వంటివన్నీ ఉండే విధంగా అప్లికేషన్‌ను యాప్ ప్రొవైడర్లు అభివృద్ధి చేస్తారు.
- యాప్ ప్రొవైడర్లు, పీడీఓఏలు, పీడీఓల వివరాలను పొందుపరిచేందుకు ఒక కేంద్రీయ రిజిస్ట్రీ ఉంటుంది.
- ప్రారంభంలో ఈ కేంద్రీయ రిజిస్ట్రీని సీ-డాట్ నిర్వహిస్తుంది.
- వైఫై సేవల విస్తరణలో భాగంగా కోటి డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీఎం-వాణి(PM-WANI) కార్యక్రమానికి ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : దేశంలో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు
ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజనకు కేబినెట్ ఆమోదం
కరోనా మహమ్మారి కల్లోలం నేపథ్యంలో వ్యాపార సంస్థలను ఉద్యోగ కల్పనకు ప్రోత్సహించడమే లక్ష్యంగా రూపొందించిన ‘ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన (ఏబీఆర్‌వై)’ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో డిసెంబర్ 9న సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
పథకంలో భాగంగా...
- ఏబీఆర్‌వై పథకంలో భాగంగా ప్రస్తుత 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1,584 కోట్ల వ్యయ కేటాయింపునకు, అదేవిధంగా మొత్తం స్కీమ్ కాల వ్యవధికి (2020-23)గాను రూ.22,810 కోట్ల వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
- ఏబీఆర్‌వై స్కీమ్‌లో భాగంగా 2020 అక్టోబర్ 1 తర్వాత, 2021 జూన్ వరకు కొత్తగా ఉద్యోగాలను కల్పించిన సంస్థలకు రెండేళ్ల పాటు సబ్సిడీ ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుంది. అయితే ఈ విషయంలో పలు షరతులను ప్రభుత్వం విధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన (ఏబీఆర్‌వై)కు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : కరోనా మహమ్మారి కల్లోలం నేపథ్యంలో వ్యాపార సంస్థలను ఉద్యోగ కల్పనకు ప్రోత్సహించడమే లక్ష్యంగా
కోచి, లక్షద్వీప్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టుకు ఆమోదం
కేరళ రాష్ట్రం, ఎర్నాకులం జిల్లాలోని కోచి నగరం, కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ మధ్య సబ్‌మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్(ఓఎఫ్‌సీ) కనెక్టివిటీని కల్పించే ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో డిసెంబర్ 9న సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ కేబుల్ ప్రాజెక్టుకు రూ.1,072 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.
మరోవైపు భారత్, సురినామ్ మధ్య ఆరోగ్యం, వైద్య రంగాల్లో సహకారం కోసం ఉద్దేశించిన అవగాహన ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, లగ్జెంబర్గ్ క్యాపిటల్ మార్కెట్స్ నియంత్రణ సంస్థ సీఎస్‌ఎస్‌ఎఫ్ మధ్య ఒప్పందానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
సురినామ్ రాజధాని: పారామరిబో; కరెన్సీ: సురినేమీ డాలర్
లక్సెంబర్గ్ రాజధాని: లక్సెంబర్గ్ సిటీ; కరెన్సీ: యూరో
80వ అఖిల భారత ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది?
గుజరాత్‌లోని నర్మదా జిల్లా కేవాడియా పట్టణంలో నవంబర్ 25, 26వ తేదీలలో 80వ ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సదస్సులో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు. సదస్సులో రాష్ట్రపతి మాట్లాడుతూ... ప్రజల విశ్వాసం పొంది, ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు చట్టసభల్లో హుందాగా వ్యవహరించాలని సూచించారు.
వన్ నేషన్, వన్ ఎలక్షన్...
సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రసంగిస్తూ... ప్రజాస్వామ్యం వెలుగులు విరజిమ్మాలంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య పరస్పర సహకారం అవసరమని అన్నారు. కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 26న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. జమిలి ఎన్నికలు (‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’) ఆలోచన అనేది కేవలం మాటలకు మాత్రమే పరిమితం చేయలేమని, ఈ ఆలోచన ప్రస్తుతం దేశ అవసరమని మోదీ అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 80వ ఆలిండియా ప్రిసైడింగ్ అధికారుల సదస్సు
ఎప్పుడు : నవంబర్ 25, 26
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : కేవాడియా పట్టణం, నర్మదా జిల్లా, గుజరాత్
నిరంకారీ మైదానం ఏ భారత నగరంలో ఉంది?
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని న్యూ ఢిల్లీలో రైతు సంఘాలు, రైతులు తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని తొలిరోజు అడ్డుకున్న ప్రభుత్వం రెండోరోజు నవంబర్ 27న దిగి వచ్చింది. రైతులు శాంతియుతంగా ధర్నా చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల రైతులు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి చేరుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో అతి పెద్దదైన నిరంకారీ మైదానంలో ధర్నా నిర్వహించారు. సాగును కార్పొరేట్లకు అప్పగిస్తూ రైతులను దగా చేసే కొత్త వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రైతులతో చర్చించేందుకు సిద్ధం
రైతులతో అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. రైతన్నలు ఆందోళన విరమించుకోవాలని కోరారు. డిసెంబర్ 3న జరిగే భేటీకి రైతు నేతలను ఆహ్వానించామన్నారు.
ప్రధాని మోదీ నియోజకవర్గంలో ఆరు మార్గాల రహదారి ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలో ఆరు మార్గాల రహదారి ప్రారంభమైంది. రూ. 2,447 కోట్లతో వారణాసి నుంచి అలహాబాద్ వరకు 73 కి.మీ.ల మేర నిర్మించిన ఈ ఆరు మార్గాల రహదారిని ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 30న జాతికి అంకితం చేశారు. అనంతరం కాశీ టెంపుల్ కారిడార్ పనులను సమీక్షించారు. గంగా నదీతీరంలో దీపాలు వెలిగించే ప్రఖ్యాత ‘దేవ్ దీపావళి’ కార్యక్రమాన్ని మోదీ వీక్షించారు.
మనోరమ బుక్‌లో వ్యాసం...
మనోరమ ఇయర్‌బుక్-2021లో ‘అత్మనిర్భర్ భారత్-ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా’ శీర్షికతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక వ్యాసం రాశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా 2020 ఏడాదిని మిగతా ప్రపంచం అంతా బాహ్య అంతరాయాల మయంగా భావిస్తోందని, భారత్‌కు మాత్రం అంతర్గత ఆవిష్కరణల సంవత్సరం అని మోదీ తన వ్యాసంలో అభివర్ణించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆరు మార్గాల రహదారి ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : వారణాసి, ఉత్తరప్రదేశ్
ఎందుకు : వారణాసి, అలహాబాద్ మధ్య అనుసంధానం కోసం
బ్రహ్మపుత్ర నదిపై నూతన జల విద్యుత్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు?
అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నదిపై 10 గిగా వాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది. ైచెనాలో యర్లుంగ్ త్సంగ్ పో(బ్రహ్మపుత్ర) నదిపై నిర్మించనున్న ప్రాజెక్టుల కారణంగా భారత్‌లో అకస్మాత్తుగా వరదలు రావడం, నీటి కొరత ఏర్పడటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయనే ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం తాజా ప్రకటన చేసింది. ఇది కార్యరూపం దాల్చితే చైనా డ్యామ్‌ల ప్రభావాన్ని తగ్గించడంతోపాటు భారీగా నీటి నిల్వకు వీలుంటుందని నిపుణుల అంచనా. యర్లుంగ్ త్సంగ్ బో నదిపై 60 గిగావాట్ల భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు చైనా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ
- టిబెట్‌లోని మానస సరోవరం వద్ద గల ‘షమ్‌యంగ్ డమ్’ అనే హిమానీ నదం వద్ద బ్రహ్మపుత్ర నది జన్మించింది.
- చైనాలోని టిబెట్, భారత్, బంగ్లాదేశ్‌లో ఈ నది ప్రయాణిస్తుంది.
- బంగ్లాదేశ్‌లో గంగానదితో కలిసి చివరగా బంగాళాఖాతంలో కలుస్తుంది.
- భారత్‌లో అరుణాచల్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది.
- ప్రపంచంలోని అతి పెద్ద సుందర్‌బన్స్ డెల్టా... బ్రహ్మపుత్ర, గంగా నదుల కలయిక వల్ల ఏర్పడింది.
- భారతదేశంలో గల ఏకై క నదీ ఆధారిత దీవి మాజులీ (అసోం) ఈ నది వల్లే ఏర్పడింది.
- బహ్మప్రుత్ర నదిని అసోం దు:ఖదాయని అని పిలుస్తారు.
- బ్రహ్మపుత్ర నదికి వచ్చే వరదలతో అధికంగా నష్టపోతున్న రాష్ట్రం అసోం.
- ఈ నది ప్రయాణించే మార్గంలో దీన్ని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. టిబెట్‌లో త్సాంగ్ పో అని, అరుణాచల్‌ప్రదేశ్‌లో దిహాంగ్, సియాంగ్ అని, అసోంలో సైడాంగ్, ఉత్తర బంగ్లాదేశ్‌లో పద్మా నది (గంగానది)ని కలవక ముందు జమున అని, దక్షిణ బంగ్లాదేశ్‌లో (పద్మా నదిని కలిసిన తర్వాత) మేఘన అనే పేర్లతో పిలుస్తారు.
- అసోంలోని ఎర్ర నేలల మీదుగా ప్రవహించడం వల్ల దీన్ని ఎర్ర నది అని కూడా పిలుస్తారు.
బ్రహ్మపుత్ర ఉప నదులు:
- దన్‌సిరి, సబన్‌సిరి, సంకోష్, రైడాక్, అమొచు, మనస్, భరేలి, లోహిత్, సుర్మ, తీస్తా, గంగాధర్, బేల్‌సిరి, దిబ్రు, డిక్కు, దిబాంగ్, లోహిత్ మొదలైనవి.
- తీస్తా నది టిబెట్‌లోని చితము సరస్సు వద్ద జన్మిస్తుంది. తీస్తా 1887 వరకు గంగా నది ఉపనదిగా ఉండేది. కానీ 1887లో వచ్చిన భూకంపం వల్ల దీని ప్రవాహ దిశ మారి బ్రహ్మపుత్రకు ఉపనదిగా మారింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రహ్మపుత్ర నదిపై 10 గిగా వాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రం
ఎందుకు : చైనాలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించనున్న ప్రాజెక్టుల కారణంగా భారత్‌లో అకస్మాత్తుగా వరదలు రావడం, నీటి కొరత ఏర్పడటం వంటి ఇబ్బందులు తలెత్తకుండా...