Indian Navy: ఐఎన్‌ఎస్ రణ్‌వీర్ యుద్ధనౌక ఎక్కడ సేవలందిస్తోంది?
ముంబై నావల్ డాక్ యార్డ్‌లో నిలిచి ఉన్న ఐఎన్‌ఎస్ రణ్‌వీర్ యుద్ధనౌకలో జనవరి 18న భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు నేవీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు భారత నౌకాదళాధికారులు ధ్రువీకరించారు. మరో 11 మంది వరకూ గాయపడినట్లు సమాచారం. ఐఎన్‌ఎస్ రణ్‌వీర్‌లోని ఇంటర్నల్ కంపార్ట్‌మెంట్‌లో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ పేలుడు ప్రమాదవశాత్తూ సంభవించిందేనని ప్రాథమికంగా నిర్ధారించిన నేవీ అధికారులు.. ప్రమాదానికి కారణాలను సమగ్రంగా అన్వేషించేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
విశాఖ కేంద్రంగా రణ్‌వీర్ సేవలు..
ఐఎన్‌ఎస్ రణ్‌వీర్ విశాఖపట్నం కేంద్రంగా తూర్పు నౌకాదళంలో సేవలందిస్తోంది. 1986, అక్టోబర్‌లో భారత నౌకాదళంలో చేరిన రణ్‌వీర్ యుద్ధనౌక సోవియట్ యూనియన్‌లో నిర్మితమైంది. రాజ్‌పుత్ క్లాస్ డిస్ట్రాయర్‌గా విధుల్లో చేరిన ఈ యుద్ధనౌక గంటకు 35 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకెళ్తుంది. దీనిపై పలు రకాల మిసైల్స్‌ను అమర్చారు. సముద్ర జలాల్లో గస్తీ కాయడం, సముద్ర దొంగలను, ఉగ్రవాదులను అడ్డుకోవడం, నావికా దౌత్యం, జలమార్గ కమ్యూనికేషన్స్ పర్యవేక్షణ తదితర కార్యక్రమాలను ఈ నౌక నిర్వహిస్తోంది. 2008లో శ్రీలంకలో జరిగిన 15వ సార్క్ దేశాల సదస్సులో పాల్గొన్న ప్రధాని భద్రత వ్యవహారాల్లోనూ, సింగపూర్, ఇండోనేషియా దేశాల ద్వైపాక్షిక విన్యాసాల్లో పాల్గొని ఇరుదేశాల నౌకాదళాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో రణ్‌వీర్ ముఖ్య భూమిక పోషించింది. క్రాస్ కోస్ట్ ఆపరేషన్స్ కోసం ఈస్ట్రన్ నేవల్ కమాండ్ నేతృత్వంలో రణ్‌వీర్ పని చేస్తోంది. వివిధ ఆపరేషన్లలో భాగంగా 2021 నవంబర్‌లో విశాఖ నుంచి బయలుదేరింది. ఈస్ట్రన్ నేవల్ కమాండ్ బేస్ అయిన విశాఖపట్నానికి ఈ నౌక మరికొద్ది రోజుల్లో తిరిగి వెళ్లాల్సి ఉండగా ఈ సమయంలో ప్రమాదం సంభవించిందని నేవీ అధికారులు తెలిపారు.
చదవండి: ఐఏసీ విక్రాంత్‌ను నిర్మిస్తోన్న సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఎన్‌ఎస్ రణ్‌వీర్ యుద్ధనౌకలో భారీ పేలుడు
ఎప్పుడు : జనవరి 18
ఎక్కడ : ముంబై నావల్ డాక్ యార్డ్
ఎందుకు : ప్రమాదవశాత్తూ..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్