Skip to main content

Zombie Drug: అమెరికాను వణికిస్తున్న జాంబీ డ్రగ్‌.. మనుషులను పిశాచులుగా మార్చేస్తుంది!

ప్రస్తుతం అమెరికాను వణికిస్తున్న ‘జాంబీ’ డ్రగ్ జైలజీన్‌. తక్కువ ధరలో దొరికే ఈ డ్రగ్‌ మనుషులను పిశాచులుగా చేస్తోంది.
Zombie Drug

గుర్రాలు, ఆవులు తదితర జంతువుల్లో నరాలకు విశ్రాంతి ఇచ్చే నిమిత్తం అనుమతించిన ఈ ట్రాంక్విలైజర్‌ ఇప్పుడక్కడ పెను విలయానికి దారి తీస్తోంది. దీన్ని ఫెంటానిల్‌ అనే డ్రగ్‌తో కలిపితే అత్యంత హెచ్చు పొటెన్సీతో కూడిన ప్రాణాంతకమైన మత్తుమందుగా మారుతోంది. కారుచౌకగా తయారవుతుండటంతో డ్రగ్‌ డీలర్లు కొన్నేళ్లుగా దీన్నే విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారు. ట్రాంక్, ట్రాంక్‌ డోప్, జాంబీ డ్రగ్‌గా పిలిచే ఈ డ్రగ్‌ ప్రస్తుతం యూఎస్‌ వీధుల్లో పొంగి పొర్లుతోంది. ఎక్కడ చూసినా డ్రగ్‌ బానిసలు ట్రాంక్‌ మత్తులో జోగుతూ కనిపిస్తున్నారు. శరీరంపై దీని దుష్ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. ఒంటిపై పుండ్లు పడటం, చర్మం ఊడిపోవడంతో మొదలై చూస్తుండగానే ఒంట్లో శక్తులన్నీ ఉడిగిపోయే పరిస్థితి తలెత్తుతోంది. అడుగు తీసి అడుగేయడమూ కష్టమై బాధితులు నడిచే శవాల్లా మారి అచ్చం జాంబీలను తలపిస్తున్నారు! ఈ ధోరణి కొంతకాలంగా మరీ ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోంది. 

Earthquake: భూకంపాన్ని ముందే పసిగట్టే పక్షులు, జంతువులు!

కేంద్ర స్థానం ఫిలడెల్ఫియా 
ఈ జాంబీ డ్రగ్‌ ఉత్పాతానికి ఫిలడెల్ఫియా కేంద్ర స్థానంగా తేలింది. మామూలుగానే ఈ నగరం డ్రగ్స్‌ డీలర్లకు, బానిసలకు అడ్డా. దాంతో సహజంగానే జాంబీ డ్రగ్‌ వాడకం కూడా ఇక్కడ విచ్చలవిడిగా పెరిగింది. ఏ వీధిలో చూసినా దీని ప్రభావంతో ఎటూ కదల్లేక ఎక్కడపడితే అక్కడ పడిపోయిన డ్రగ్‌ బానిసలే కనిపిస్తున్నారు. జాంబీ డ్రగ్‌ బెడద చూస్తుండగానే అమెరికా అంతటికీ పాకుతోంది. తూర్పున న్యూయార్క్, మసాచుసెట్స్, మైన్, పశ్చిమ తీరంలో కాలిఫోర్నియా, ఓరెగాన్, వాషింగ్టన్, దక్షిణాన టెక్సాస్, లూసియానా, అలబామా.. ఇలా 36కు పైగా రాష్ట్రాల్లో వేలాది జాంబీ కేసులు వెలుగు చూడటం అధికారులను ఆందోళన పరుస్తోంది. సమస్య తీవ్రత బయటికి కన్పిస్తున్న దానికంటే చాలా ఎక్కువగా ఉందని అధికారులే అంగీకరిస్తున్నారు. ఫిలడెల్ఫియాలోనే ఏకంగా 90 శాతానికి పైగా డోప్‌ టెస్ట్‌ శాంపిళ్లలో జైలజీన్‌ జాడలు కన్పించాయి. న్యూయార్క్‌ నగరంలో 25 శాతానికి పైగా శాంపిళ్లలో జైలజీన్‌ బయటపడింది. 

IIT Madras: ఐఐటీ మద్రాస్‌లో సింథటిక్‌ వజ్రాల ల్యాబ్‌..

సులువుగా దొరికేస్తోంది 
జైలజీన్‌ అమెరికాలో అతి సులువుగా దొరుకుతోంది. కేవలం పశువుల డాక్టర్‌ చీటీ చాలు. పైగా కారుచౌక కూడా. దీంతోపాటు దీని సరఫరాపై పెద్దగా నియంత్రణ కూడా లేదు. ఇది డ్రగ్‌ మాఫియాకు మరింతగా కలిసొచ్చింది. కరోనా సమయంలో ఫెంటానిల్‌ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఆ క్రమంలోనే ట్రాంక్‌ వాడకం పెచ్చరిల్లింది! మితిమీరిన డ్రగ్స్‌ వాడకం వల్ల మరణిస్తున్న వారి సంఖ్య అమెరికాలో బాగా పెరుగుతోంది. 2021లో లక్ష మందికి పైగా డ్రగ్స్‌కు బలయ్యారు! వీటిలో 70 వేలకు పైగా కేసుల్లో ఫెంటానిల్‌ వాడినట్టు తేలింది. వాటిలో చాలావరకు ట్రాంక్‌ కేసులేనని అనుమానిస్తున్నారు. 

Zombie Drug


చికిత్స లేదు 
ఫిలడెల్ఫియా తదితర చోట్ల స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రులు, క్లినిక్‌లకు జాంబీ డ్రగ్‌ బాధితులు బారులు తీరుతున్నారు. చాలామందికి కాళ్లు, చేతులు తీసేయాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. తమ వద్దకు వస్తున్న వారికంటే రకరకాల కారణాలతో ముఖం చాటేస్తున్న వారే చాలా ఎక్కువగా ఉంటారని వారంటున్నారు. అయితే జైలజీన్‌ ఓవర్‌ డోస్‌ తాలూకు దు్రష్పభావాలను తగ్గించేందుకు చికిత్స ఏదీ ఇప్పటిదాకా అందుబాటులో లేకపోవడం మరింత ఆందోళనకు కారణమవుతోంది.
ఫెంటానిల్‌తో పాటు ఇతర డ్రగ్స్‌ తాలూకు లక్షణాలను నెమ్మదింపజేయడానికి వాడే నాలోగ్జోన్‌ వంటివాటినే ప్రస్తుతానికి వీరికీ వాడుతున్నారు. కాకపోతే జైలజీన్‌ వాడకంతో తలెత్తున్న శ్వాస, బీపీ సమస్యలకు ఇది పని చేయడం లేదు. జైలజీన్‌ వాడకం తాలూకు సైడ్‌ ఎఫెక్టుల గురించి హెచ్చరిస్తూ అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) గత నవంబర్లోనే చాలా రాష్ట్రాల్లోని ఆస్పత్రులు, క్లినిక్‌లకు అలర్ట్‌ పంపింది. చూడటానికి ఇతర డ్రగ్‌ ఓవర్‌ డోస్‌ కేసుల్లాగే కనిపించడం వల్ల దీన్ని ఆరంభ దశలోనే కనిపెట్టడం కూడా కష్టమే. 

Digital Payments: భార‌త్‌, సింగ‌పూర్ మ‌ధ్య ఈజీ డిజిటల్ పేమెంట్స్

జాంబీ డ్రగ్‌ వాడితే.. 
∙ జైలజీన్‌ చర్మాన్ని, మాంసాన్ని తినేస్తుంది. 
∙ కేంద్ర నాడీ వ్యవస్థపై నేరుగా తీవ్ర ప్రభావం చూపుతుంది. 
∙ రక్తనాళాలు పాడవుతాయి. రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. 
∙ దాంతో చర్మం ఊడటంతో పాటు ఒళ్లంతా పుండ్లు పుడతాయి. 
∙ పుండ్లు ముదిరి సంబంధిత అవయవాలు కుళ్లిపోతున్నాయి. వాటిని తీసేయాల్సి వస్తోంది. 
∙ మతిమరుపు వంటి మరెన్నో భయానక సైడ్‌ ఎఫెక్టులూ తలెత్తుతాయి. 
∙ గుండె, ఊపిరితిత్తుల పనితీరు, కంటిచూపు మందగిస్తాయి. 
∙శ్వాస అందదు. బీపీ పడిపోయి ప్రాణాంతకంగా మారుతుంది. 
జైలజీన్‌ కథా కమామిషు 
☛ గుర్రాలు, ఆవులు, గొర్రెలపై వాడేందుకు దీన్ని 1962లో తయారు చేశారు. 
☛ అప్పట్లోనే మనుషులపైనా ప్రయోగాలు చేసినా శ్వాస, హృదయ స్పందన, బీపీ తగ్గిపోవడంతో నిలిపేశారు. 
☛ 2000 నుంచీ డ్రగ్‌ బానిసలు దీన్ని హెరాయిన్‌తో కలిపి తీసుకోవడం మొదలైంది. 
☛ కొకైన్, ఓపియం వంటివాటితో కలిపినా ఇది ప్రాణాంతకమే. కానీ ఫెంటానిల్‌ చౌక కావడంతో ఎక్కువగా దాన్నే వాడుతున్నారు. 
☛ ఇలా ట్రాంక్‌గా పిలిచే జైలజీన్‌–ఫెంటానిల్‌ మిశ్రమ డ్రగ్‌ వాడకం 2011లో ప్యూర్టోరికోలో మొదలైంది. 
☛ ప్యూర్టోరికో వాసులు ఎక్కువగా ఉండే ఫిలడెల్ఫియాలోని కెన్సింగ్టన్‌ తదితర చోట్లకూ పాకింది. 
☛ కారుచౌకగా దొరుకుతుండటంతో కరోనా వేళ దీని వాడకం విచ్చలవిడిగా పెరిగింది. 
☛ ఇప్పుడు అమెరికాలో కనీసం 30కి పైగా రాష్ట్రాల్లో విస్తరించి వణుకు పుట్టిస్తోంది. 
☛ జైలజీన్‌ కారుచౌక. పైగా కేవలం పశువుల డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ ఉంటే ఎంత పరిమాణంలో అయినా దొరుకుతుంది. 
☛ ఇంజక్షన్‌తో పాటు పొడి రూపంలో కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండటంతో డ్రగ్‌ డీలర్ల పని మరింత తేలికైంది. 
☛ హెరాయిన్‌ డోసు కనీసం 10 డాలర్లు పెట్టనిదే దొరకదు. కానీ ట్రాంక్‌ మాత్రం మూడు నాలుగు డాలర్లకే దొరికేస్తోంది. 
☛ ఇల్లూ వాకిలీ లేక రోడ్లపై కాలం గడుపుతూ ఏళ్ల తరబడి డ్రగ్స్‌కు బానిసలైన అమెరికన్లంతా ట్రాంక్‌ బాట పడుతున్నారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

Published date : 27 Feb 2023 05:36PM

Photo Stories