Shinzo Abe జపాన్ మాజీ ప్రధానిషింజో అబే హత్య
జపాన్ మాజీ ప్రధానమంత్రి షింబో అబె (67) దుండగుడి కాల్పుల్లో బలయ్యారు. పశ్చిమ జపాన్‌లోని నరాలో జూలై 8న ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా దుండగుడు తుపాకీతో వెనుక నుంచి కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన షింజో అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న తెత్సుయా యమగామీ(41) అనే వ్యక్తిని పోలీసులు ఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. పరిపాలనాదక్షుడిగా, శక్తివంతమైన నాయకుడిగా పేరుగాంచిన షింజో అబే హత్య ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివిధ దేశాల అధినేతలు సంతాపం ప్రకటించారు. భూగోళంపై అత్యంత భద్రత కలిగిన దేశంగా గుర్తింపు పొందడంతోపాటు కఠినమైన తుపాకీ నియంత్రణ చట్టాలు అమల్లో ఉన్న జపాన్‌లో మాజీ ప్రధానమంత్రి హత్యకు గురికావడం ప్రపంచమంతటా చర్చనీయాంశంగా మారింది.
Also read: Hurun Richest Self Made Women
హేయమైన చర్య.. రాక్షసకాండ
షింజోను హత్య చేయడం హేయమైన చర్య, రాక్షసకాండ అని జపాన్ ప్రధాని పుమియో కిషిదా అభివర్ణించారు. ఈ దారుణాన్ని ఖండించడానికి పరుషమైన పదాలు వాడాల్సి వస్తోందన్నారు.
నిందితుడి ఇంట్లో ఆయుధాలు
జపాన్ పార్లమెంట్ ఎగువసభకు ఆదివారం (జూలై 10న) ఎన్నికలు జరుగనున్నాయి. లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం షింజో అబే కొన్ని రోజులుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. పార్టీలో సీవాకై అనే వర్గానికి ఆయనే నాయకత్వం వహిస్తున్నారు. షింజోపై కాల్పులు జరిపినట్లు భావిస్తున్న తెత్సుయా యమగామీ ఇంట్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అతడు జపాన్ నావికాదళంలో 2002 నుంచి 2005 దాకా పనిచేసినట్లు తేలింది.
Also read: the worlds 10 most powerful people
అంతర్జాతీయ రాజకీయాలపై చెరగని ముద్ర
షింజో అబె. జీవితమంతా రాజకీయాల్లోనే గడిపిన నేత. అత్యంత ఎక్కువ కాలం పాలించిన ప్రధానిగా జపాన్‌కు సైనికంగా, ఆర్థికంగా నూతన దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రపంచ రాజకీయాలపైనా చెరగని ముద్ర వేశారు. జపాన్‌లోని శక్తిమంతమైన రాజకీయ కుటుంబంలో పుట్టారాయన. అబె తాత నొబుసుకే కిషి జపాన్ ప్రధానిగా పని చేశారు. మరో తాత ఎయ్‌సాకు సాతో కూడా ఎనిమిదేళ్ల పాటు ప్రధానిగా ఉన్నారు. అనంతర కాలంలో జపాన్‌ను అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా ఆయన రికార్డునే అబె అధిగమించడం విశేషం.
Also read: wealthiest historical persons
అబెనామిక్స్‌తో ఆర్థిక చికిత్స
అబె 1954 సెప్టెంబర్ 21న టోక్యోలో జన్మించారు. తండ్రి షింటారో అబె విదేశాంగ మంత్రిగా పని చేశారు. టోక్యోలోని సెయ్‌కీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశాక అబె అమెరికా వెళ్లి సౌత్ కాలిఫోర్నియా వర్సిటీలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. కొంతకాలం కోబే స్టీల్‌లో పని చేసి 1982లో విదేశాంగ శాఖలో చేరారు. తర్వాత యమగూచి స్థానం నుంచి ఎల్డీపీ తరఫున పార్లమెంటుకు ఎన్నికై రాజకీయ అరంగేట్రం చేశారు. 2005లో జునిచిరో కొయిజుమి ప్రభుత్వంలో చీఫ్ కేబినెట్ సెక్రెటరీ అయ్యారు. 2006లో 52వ ఏట తొలిసారి ప్రధాని అయ్యారు. ఆ పదవి చేపట్టిన అతి పిన్న వయస్కునిగా రికార్డు సృష్టించారు. కానీ అనారోగ్యం వేధించడంతో ఏడాదికే తప్పుకోవాల్సి వచ్చింది. దేశంలో ఐదేళ్ల రాజకీయ అస్థిరత అనంతరం 2012లో రెండోసారి ప్రధాని అయ్యారు. 2020 ఆగస్టు దాకా కొనసాగారు. పాలనలో తనదైన మార్కు చూపించారు. ఏకంగా ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచారు. అబెనామిక్స్ పేరుతో పలు ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సమర్థ విధానాల ద్వారా ఆర్థిక కష్టాల నుంచి దేశాన్ని గట్టెక్కించారు. తిరుగులేని ఆర్థిక స్థిరత్వాన్ని సాధించిపెట్టారు. ఆగర్భ శత్రువైన చైనాతో సంబంధాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నించారు. ప్రపంచ దేశాధినేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. సైనికపరంగా కూడా జపాన్‌ను అత్యంత బలోపేతం చేయాలని చివరిదాకా తపించారు. జపాన్ జాతీయవాదానికి పోస్టర్ బోయ్‌గా నిలిచి యువతలో క్రేజ్ సంపాదించుకున్నారు. అత్యంత బలోపేతమైన సైన్యాన్ని కేవలం ఆత్మరక్షణకే పరిమితం చేస్తూ అంతర్జాతీయ సంఘర్షణల్లో జోక్యం చేసుకోవడాన్ని నిషేధిస్తున్న దేశ రాజ్యాంగాన్ని మార్చాలని ఎంతగానో ప్రయత్నించారు. దీన్ని చైనా, కొరియాలనే గాక స్వదేశంలోని సంప్రదాయవాదులు కూడా తీవ్రంగా వ్యతిరేకించినా పట్టించుకోలేదు. అంతర్జాతీయ వేదికపై మరింత కీలక పాత్ర పోషించేలా జపాన్‌ను తీర్చిదిద్దాలని తపించారు.
Also read: top quotes by swami vivekananda
భారత్‌కు ప్రియమిత్రుడు
భారత్‌తో అబెకు ప్రత్యేక అనుబంధముంది. ముఖ్యంగా ప్రధాని మోదీతో ఆయన గట్టి స్నేహ బంధం ఏర్పరచుకున్నారు. కుర్తా పైజా ధరించి, నుదుట తిలకం, చేతిలో హారతి పళ్లెంతో 2015లో కాశీలోని ప్రఖ్యాత దశాశ్వమేధ ఘాట్ వద్ద మోదీతో పాటు ఆయన గంగాహారతి కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. భారతీయ వస్త్రధారణతో మోదీతో కలిసి అహ్మదాబాద్లో సబర్మతి ఆశ్రమం దాకా రోడ్‌షోలో పాల్గొని అలరించారు. తద్వారా భారత్‌కు ఆత్మీయ మిత్రుడయ్యారు. అబె హయాంలో భారత్‌తో జపాన్ ఆర్థిక బంధం కూడా ఎంతో బలోపేతమైంది. 2021లో దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో అబెను కేంద్రం గౌరవించింది.