Skip to main content

Quadrilateral Security Dialogue: నాలుగో క్వాడ్‌ విదేశాంగ మంత్రుల సదస్సు ఎక్కడ జరిగింది?

Quad Foreign Ministers

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో నాలుగో క్వాడ్‌ విదేశాంగ మంత్రుల సదస్సు జరిగింది. ఫిబ్రవరి 11న జరిగిన ఈ సదస్సులో సభ్య దేశాల విదేశాంగ మంత్రులు జై శంకర్‌ (భారత్‌), ఆంటోనీ బ్లింకెన్‌ (అమెరికా), మారిస్‌ పైన్‌ (ఆస్ట్రేలియా), యొషిమాసా హయాషీ (జపాన్‌)తో పలు అంశాలపై లోతుగా చర్చించారు. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంను బెదిరింపులు, నిర్బంధ ఆర్థిక విధానాల బారినుంచి విముక్తం చేయాలని సదస్సు తీర్మానించింది. సీమాంతర ఉగ్రవాద వ్యాప్తికి పరోక్ష మద్దతిస్తున్న కొన్ని దేశాల తీరును తీవ్రంగా ఖండించింది. అఫ్గాన్‌ భూ భాగాన్ని ఇతర దేశాలను బెదిరించేందుకు, వాటిపై దాడులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోరాదని అభిప్రాయపడింది. తూర్పు, దక్షిణ చైనా సముద్ర తీర దేశాల హక్కులకు తలెత్తుతున్న సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కొంటామని చైనాను ఉద్దేశించి మంత్రులు పేర్కొన్నారు. సదస్సు అనంతరం తర్వాత మంత్రులంతా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌తో భేటీ అయ్యారు.

క్వాడ్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తోన్న దేశం?

క్వాడ్‌పై చైనా అక్కసు వెల్లగక్కింది. తమను నిలువరించే లక్ష్యంతో ఏర్పాటైన ఈ గ్రూపు విఫల ప్రయోగంగా మిగిలిపోతుందని శాపనార్థాలు పెట్టింది. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో పలు దేశాలతో సరిహద్దు వివాదాలున్న చైనా క్వాడ్‌ ఏర్పాటును తొలి నుంచీ వ్యతిరేకిస్తోంది.

క్వాడ్‌ లక్ష్యాలేంటి?

క్వాడ్‌(Quadrilateral Security Dialogue-Quad).. అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాలు ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో తమ ప్రయోజనాలు కాపాడుకుంటూ భద్రతలో ఒకరికొకరు సహకరించుకోవడం దీని లక్ష్యం. 2004లో సునామీ అల్లకల్లోలం తర్వాత విపత్తుల సమయంలో సహకరించుకోవడానికి ఏర్పడిన ఈ కూటమి.. 2007లో అప్పటి జపాన్‌ ప్రధాని షింజో అబె చొరవతో ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి భద్రతల స్థాపనే లక్ష్యంగా రూపాంతరం చెందింది. 

చ‌ద‌వండి: ఐసిస్‌ అకృత్యాలపై ఐరాస విడుదల చేసిన నివేదిక పేరు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
నాలుగో క్వాడ్‌ విదేశాంగ మంత్రుల సదస్సు నిర్వహణ
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు    : క్వాడ్‌ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు జై శంకర్‌ (భారత్‌), ఆంటోనీ బ్లింకెన్‌ (అమెరికా), మారిస్‌ పైన్‌ (ఆస్ట్రేలియా), యొషిమాసా హయాషీ (జపాన్‌)
ఎక్కడ    : మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
ఎందుకు : ఇండో–పసిఫిక్‌ ప్రాంతం, ఉగ్రవాదం వంటి అంశాలపై చర్చించేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 12 Feb 2022 12:34PM

Photo Stories