డిసెంబర్ 2020 అంతర్జాతీయం
యూరోపియన్ యూనియన్(ఈయూ), యునెటైడ్ కింగ్‌డమ్(యూకే) మధ్య భారీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ‘‘పోస్ట్-బ్రెగ్జిట్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)’’ కుదిరింది. బెల్జియం రాజధాని నగరం బ్రస్సెల్స్లో డిసెంబర్ 24న ఈ ఒప్పందం కుదిరింది. ఈయూ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కూటమితో యూకే కుదుర్చుకున్న అతిపెద్ద ద్వైపాక్షిక ఒప్పందం ఇదే. ఈ ఒప్పందానికి ఇందుకు తుది గడువు 2020, డిసెంబర్ 31 కాగా, వారం రోజుల ముందే ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో బహిర్గతం కానున్నాయి.
తాజా ఒప్పందం వల్ల... 2021 జనవరి 1వ తేదీన తాము పూర్తిగా రాజకీయ, ఆర్థిక స్వేచ్ఛ పొందుతామని యూకే అధికార వర్గాలు తెలిపాయి. ఒక స్వతంత్ర వాణిజ్య దేశంగా ఇకపై తమకు ఎన్నో కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఇతర భాగస్వామ్య దేశాలతో మరిన్ని వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి మార్గం సుగమమైందని పేర్కొన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈయూతో పోస్ట్-బ్రెగ్జిట్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) చేసుకున్న దేశం
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : యునెటైడ్ కింగ్‌డమ్(యూకే)
ఎక్కడ : బ్రస్సెల్స్, బెల్జియం
2050 నాటికి కర్బన ఉద్గారాల రహితంగా జపాన్
కాలుష్య భూతాన్ని తరిమికొట్టేందుకు జపాన్ భారీ ప్రణాళికలు రచించింది. దేశాన్ని 2050 నాటికి కర్బన ఉద్గారాల రహితంగా మార్చడమే లక్ష్యంగా... వచ్చే 15 ఏళ్లలోపు చమురు ఆధారిత వాహనాలను తొలగించాలని నిర్ణయించినట్లు డిసెంబర్ 25న తెలిపింది. 2020, అక్టోబర్‌లో పర్యావరణ కాలుష్యంపై జపాన్ ప్రధాని యోషిహిడే సుగా మాట్లాడుతూ... వచ్చే 30 ఏళ్లలో కర్బన ఉద్గారాలను సున్నాకు తీసుకొస్తామని ప్రతిజ్ఞ చేశారు.
కాలుష్యాన్ని తగ్గించేందుకు జపాన్ రచించిన ప్రణాళికలు...
- ‘గ్రీన్ గ్రోత్ ట్రాటజీ’లో భాగంగా పునరుత్పాదక, హైడ్రోజన్ ఇంధన వాడకాన్ని పెంచాలి.
- 2030 నాటికి ఆటో పరిశ్రమ కర్బన రహితంగా మారాలి.
- పర్యావరణహిత వాణిజ్యం, పెట్టుబడుల్లో 2 ట్రిలియన్ డాలర్ల వృద్ధి సాధించాలి.
- 2040 నాటికి 45 గిగావాట్ల తీరప్రాంత పవన విద్యుత్తు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
- పర్యావరణహిత వ్యూహంలో భాగంగా 14 కీలక పరిశ్రమలను ప్రభుత్వం గుర్తించింది.
జపాన్ రాజధాని: టోక్యో; కరెన్సీ: జపనీస్ యెన్
జపాన్ ప్రస్తుత ఎంపరర్: నరుహితో
జపాన్ ప్రస్తుత ప్రధాని: యోషిహిడే సుగా
క్విక్ రివ్యూ:
ఏమిటి : పర్యావరణహిత వ్యూహం రూపకల్పన
ఎప్పుడు : డిసెంబర్ 25
ఎవరు : జపాన్
ఎందుకు : 2050 నాటికి కర్బన ఉద్గారాల రహిత దేశంగా అవతరించేందుకు
ఈయూలో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య? మాల్టా దేశ రాజధాని?
ఐరోపా దేశాల సమాఖ్య(ఈయూ)లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ డిసెంబర్ 27న ప్రారంభమైంది. డాక్టర్లు, నర్సులు, వృద్ధులకు ఫైజర్/బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ ‘‘బీఎన్‌టీ162బీ2(BNT162b2)’’ మొదటి డోసు ఇచ్చారు. వీరికి మూడు వారాల్లో మరో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. జర్మనీ, హంగేరి, స్లోవేకియా తదితర దేశాలు డిసెంబర్ 26వ తేదీనే వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టాయి. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగిన తర్వాత.... ఈయూలో 27 దేశాలు సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. ఈయూ దేశాల ఉమ్మడి కరెన్సీ: యూరో
ఈయూలోని 27 సభ్య దేశాలు...
సంఖ్య | దేశం | రాజధాని |
1 | ఆస్ట్రియా | వియన్నా |
2 | బెల్జియం | బ్రస్సెల్స్ |
3 | బల్గేరియా | సోఫియా |
4 | క్రొయేషియా | జాగ్రెబ్ |
5 | సైప్రస్ | నికోసియా |
6 | చెక్ రిపబ్లిక్ | ప్రాగ్ |
7 | డెన్మార్క్ | కోపెన్‌హాగన్ |
8 | ఎస్టోనియా | తల్లిన్‌న |
9 | ఫిన్లాండ్ | హెల్సింకీ |
10 | ఫ్రాన్స్ | పారిస్ |
11 | జర్మనీ | బెర్లిన్ |
12 | గ్రీస్ | ఏథెన్స్ |
13 | హంగేరి | బుడాపెస్ట్ |
14 | ఐర్లాండ్ | డబ్లిన్ |
15 | ఇటలీ | రోమ్ |
16 | లాట్వియా | రీగా |
17 | లిథువేనియా | విల్నియస్ |
18 | లక్సెంబర్గ్ | లక్సెంబర్గ్ సిటీ |
19 | మాల్టా | వలెట్టా |
20 | నెదర్లాండ్స్ | ఆమ్‌స్టర్‌డ్యామ్ |
21 | పోలాండ్ | వార్సా |
22 | పోర్చుగల్ | లిస్బన్ |
23 | రొమానియా | బుకారెస్ట్ |
24 | స్లొవేకియా | బ్రాటిస్లావా |
25 | స్లొవేనియా | ల్యుబ్‌ల్యానా |
26 | స్పెయిన్ | మాడ్రిడ్ |
27 | స్వీడన్ | స్టాక్‌హోమ్ |
ప్రపంచ మానవాభివృద్ధి సూచీ-2020లో భారత్ స్థానం?
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) డిసెంబర్ 15న విడుదల చేసిన... ‘‘ప్రపంచ మానవాభివృద్ధి సూచీ-2020’’లో భారత్‌కు 131వ స్థానం లభించింది. 189 దేశాలతో రూపొందించిన ఈ సూచీలో నార్వే అగ్రస్థానంలో నిలిచింది. నార్వే తర్వాతి స్థానాల్లో వరుసగా ఐర్లాండ్, స్విట్జర్లాండ్, హాంకాంగ్, ఐస్‌లాండ్ ఉన్నాయి. అట్టడుగున 189 స్థానంలో నైగర్ ఉంది.
గత మూడు దశాబ్దాలుగా ఐక్యరాజ్యసమితి ఈ మానవాభివృద్ధి సూచీ నివేదికలను ఏటా విడుదల చేస్తోంది. ప్రతి దేశమూ తమ పనితీరు సమీక్షించుకుని సవరించుకుంటాయని దాని ఆశ. ఆయా దేశాల్లో ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలను విశ్లేషించడం ద్వారా ఈ సూచీని రూపొందిస్తారు. భారత్ 2018 మానవాభివృద్ధి సూచీలో 130వ స్థానంలో, 2019 సూచీలో 129వ స్థానంలో ఉంది.
2020 ప్రపంచ మానవాభివృద్ధి సూచీ-ముఖ్యాంశాలు
- సూచీలో భారత్ కంటే కాస్త మెరుగ్గా భూటాన్ 129వ స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ (133), నేపాల్ (142), పాకిస్తాన్ (154) మన దేశం కంటే వెనకంజలో ఉన్నాయి.
- 2019లో భారత్‌లో సగటు ఆయుర్దాయం 69.7 ఏళ్లుగా ఉంది. ఈ విలువ బంగ్లాదేశ్‌లో 72.6 ఏళ్లు, పాకిస్తాన్‌లో 67.3 ఏళ్లు, నేపాల్‌లో 70.8 ఏళ్లు, భూటాన్‌లో 71.8 ఏళ్లుగా ఉంది.
- పదివేల జనాభాకు సగటున మయన్మార్‌లో పది బెడ్లు వుంటే, భారత్‌లో అయిదు మాత్రమే వున్నాయి. బంగ్లాదేశ్‌లో అవి 8 అయితే, పాకిస్తాన్‌లో 6.
- పదివేల జనాభాకు మన దేశంలో సగటున 8.6 వైద్యులుంటే పాకిస్తాన్‌లో ఆ సంఖ్య 9.8.
ర్యాంకు | దేశం | హెచ్‌డీఐ విలువ(2019 సం॥) |
1 | నార్వే | 0.957 |
2 | ఐర్లాండ్ | 0.955 |
2 | స్విట్జర్లాండ్ | 0.955 |
4 | హాంకాంగ్ | 0.949 |
4 | ఐస్‌లాండ్ | 0.949 |
6 | జర్మనీ | 0.947 |
7 | స్వీడన్ | 0.945 |
8 | నెదర్లాండ్స్ | 0.944 |
8 | ఆస్ట్రేలియా | 0.944 |
10 | డెన్మార్క్ | 0.940 |
17 | అమెరికా | 0.926 |
72 | శ్రీలంక | 0.782 |
114 | దక్షిణాఫ్రికా | 0.709 |
129 | భూటాన్ | 0.654 |
131 | భారత్ | 0.645 |
133 | బంగ్లాదేశ్ | 0.632 |
142 | నేపాల్ | 0.602 |
154 | పాకిస్తాన్ | 0.557 |
185 | బురుండి | 0.433 |
185 | సౌత్ సుడాన్ | 0.433 |
187 | చాద్ | 0.398 |
188 | సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ | 0.397 |
189 | నైగర్ | 0.394 |
ఆక్స్‌ఫర్డ్ టీకాకు ఆమోదం తెలిపిన తొలి దేశం?
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఫార్మా కంపెనీ ఆట్రాజెనెకాలు సంయుక్తంగా అభివృద్ధిపరిచిన కోవిడ్ వ్యాక్సిన్ టీకా ‘కోవిషీల్డ్’ అత్యవసర వినియోగానికి డిసెంబర్ 30న బ్రిటన్ అనుమతిచ్చింది. దీంతో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వినియోగానికి ఆమోదం తెలిపిన తొలి దేశంగా బ్రిటన్ నిలిచింది. 2021, జనవరి 4 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం ఫైజర్, బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘బీఎన్‌టీ162బీ2(BNT162b2)’ వ్యాక్సిన్‌ను ప్రజలకు ఇవ్వడం ప్రారంభించింది.
కొత్త తరహా కోవిడ్...
యూకేలో వెలుగులోకి వచ్చిన కొత్త తరహా కోవిడ్ వైరస్ ‘వీయూఐ 20212/01’ను భారత్‌లో మొత్తం 20 మందిలో గుర్తించారు. మొత్తం 107 శాంపిల్స్ పరీక్షించగా 20 మందిలో కొత్త తరహా వైరస్ బయటపడింది.
మొత్తం కేసులు...
భారత్‌లో డిసెంబర్ 30నాటికి మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,44,852కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం... మొత్తం మరణాల సంఖ్య 1,48,439కు చేరుకుంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 98,34,141కు చేరుకుంది. మొత్తం రికవరీ రేటు 95.99 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 2,62,272గా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆక్స్‌ఫర్డ్, ఆ్ట్రాజెనెకా టీకా కోవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపిన తొలి దేశం
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : బ్రిటన్
ఎందుకు : కోవిడ్-19ను నిరోధించడానికి
యెమెన్ ఎయిర్‌పోర్టులో భారీ పేలుడు
యెమెన్‌లోని ఏడెన్ నగర విమానాశ్రయంలో డిసెంబర్ 30న భారీ పేలుడు జరిగింది. ప్రధానమంత్రి మయీన్ అబ్దుల్ మాలిక్ సయీద్ సహా పలువురు మంత్రులతో కూడిన విమానాన్ని లక్ష్యంగా చేసుకొని బాంబు దాడి జరిగింది. పేలుడుకు కారకుల వివరాలు తెలియరాలేదు. పేలుడులో 22మంది పౌరులు మరణించగా, 50మంది గాయపడ్డారు. పేలుడు సమాచారం తెలియగానే ప్రధానితో సహా మంత్రులందరు ఏడెన్‌లోని ప్యాలెస్‌కు తరలిపోయారు. అయితే ప్యాలెస్‌కు సమీపంలోకూడా మరో పేలుడు సంభవించింది. అయితే దీని వల్ల ఎలాంటి నష్టం వాటిల్లినట్లు తెలియరాలేదు.
2014 నుంచి...
- 2014 నుంచి యెమెన్‌లో పౌరయుద్ధం, అశాంతి కొనసాగుతున్నాయి.
- సౌదీ అరెబియా బలపరిచే ప్రభుత్వాధినేత మన్సూర్ హది, దక్షిణాన యూఏఈ బలపరిచే సెపరేటిస్టులు, ఇతర ప్రాంతంలో ఇరాన్ బలపరిచే హౌతి రెబెల్స్ మధ్య పట్టుకోసం పోరాటం కొనసాగుతోంది.
- తాజాగా హది, సదరన్‌సెపరేటిస్టుల సంతృప్తి కోసం వారిని కూడా కలుపుకొని కొత్త కేబినెట్‌ను ఏర్పాటు చేశారు.
- యెమెన్ అంతర్యుద్ధంలో ఇప్పటికి దాదాపు 1.12 లక్షల మంది మరణించారు.
యెమెన్ రాజధాని నగరం: సనా; కరెన్సీ: యెమెని రియాల్
యెమెన్ ప్రస్తుత అధ్యక్షుడు: అబ్‌ద్రాబ్దు మన్సూర్ హది
యెమెన్ ప్రస్తుత ప్రధాని: మయీన్ అబ్దుల్ మాలిక్ సయీద్
ఫ్రాన్స్ అధ్యక్ష భవనం పేరు?
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ అధ్యక్ష భవనం ‘‘ఎలీసీ ప్యాలెస్’’ డిసెంబర్ 17న ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల ఫ్రాన్స్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది. ఆరువారాల పాటు లాక్‌డౌన్ కూడా విధించారు. డిసెంబర్ 27 నుంచి ఫ్రాన్స్ లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగనుంది. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బ్రిటన్ ప్రధాని జాన్సన్, బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారో, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో కరోనా బారిన పడి కోలుకున్నారు.
ఈజ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల సవరణ
గణాంకాల్లో అవకతవకలను పునఃసమీక్షించిన నేపథ్యంలో 2018 సంవత్సరానికి గాను గతంలో ప్రకటించిన డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లను ప్రపంచ బ్యాంకు సవరించింది. 2016 నుంచి 2020 దాకా డేటా సేకరణ, ర్యాంకుల ప్రచురణలకు మధ్య కాలంలో చోటు చేసుకున్న మార్పులను పరిశీలించిన మీదట తాజా సవరణలు చేసినట్లు ప్రపంచ బ్యాంకు డిసెంబర్ 19న వివరించింది.
సవరణల ప్రకారం... చైనా, సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, అజర్‌బైజాన్ ర్యాంకులు మారాయి. 2018లో చైనాకు 78వ ర్యాంక్ ఇచ్చినప్పటికీ.. తాజాగా డేటాను పునఃసమీక్షించిన మీదట ఇది అంతకన్నా ఏడు స్థానాలు తగ్గి 85వ స్థానానికి పరిమితం కావాల్సిందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.
ఇటీవల ఏ దక్షిణాసియా దేశ పార్లమెంటు రద్దయింది?
దక్షిణాసియా దేశం నేపాల్ పార్లమెంటు(ఫెడరల్ పార్లమెంట్ ఆఫ్ నేపాల్) రద్దయింది. పార్లమెంటును రద్దు చేయాలని నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీకి నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి డిసెంబర్ 20న సిఫారసు చేశారు. వెంటనే అధ్యక్షురాలు పార్లమెంటును రద్దు చేయడంతో పాటు మధ్యంతర సాధారణ ఎన్నికలు 2021 ఏప్రిల్- మే నెలల్లో జరుగుతాయని ప్రకటించారు.
అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(ఎన్‌సీపీ)లో ప్రధాని కేపీ శర్మ ఓలి, మాజీ ప్రధాని పుష్పకుమార్ దహల్(ప్రచండ)ల మధ్య కొన్నాళ్లుగా తీవ్ర స్థాయిలో విబేధాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేపీ శర్మ తాజా నిర్ణయం తీసుకున్నారు. 2018లో ఓలి నాయకత్వంలోని సీపీఎన్ -యూఎంఎల్, ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్(మావోయిస్ట్ సెంటర్) విలీనమై ఎన్‌సీపీగా ఏర్పడ్డాయి.
ప్రతినిధుల సభగా...
275 మంది సభ్యులున్న నేపాల్ ప్రతినిధుల సభకు తొలి దశ మధ్యంతర ఎన్నికలు 2021, ఏప్రిల్ 30న, తుది దశ ఎన్నికలు మే 10న జరుగుతాయని నేపాల్ అధ్యక్ష భవనం వెల్లడించింది. నేపాల్ పార్లమెంట్లో దిగువ సభను ప్రతినిధుల సభగా వ్యవహరిస్తారు. ఎగువ సభను నేషనల్ అసెంబ్లీగా పిలుస్తారు. ప్రతినిధుల సభకు 2017లో ఎన్నికలు జరిగాయి.
నేపాల్ రాజధాని: ఖాట్మండు; కరెన్సీ: నేపాలిస్ రుపీ
నేపాల్ ప్రస్తుత అధ్యక్షురాలు: విద్యాదేవి భండారీ
నేపాల్ ప్రస్తుత ఉపాధ్యక్షుడు: నంద కిశోర్ పున్
క్విక్ రివ్యూ:
ఏమిటి : దక్షిణాసియా దేశం నేపాల్ పార్లమెంటు(ఫెడరల్ పార్లమెంట్ ఆఫ్ నేపాల్) రద్దు
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ
ఎందుకు : నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి సిఫారసుల మేరకు
బడ్జెట్‌ను ఆమోదించకపోవడంతో ఏ దేశ పార్లమెంట్ రద్దయింది?
ఇజ్రాయెల్‌లో బెంజమిన్ నెతన్యాహూ ప్రభుత్వం కుప్పకూలింది. డిసెంబర్ 23వ తేదీ అర్థరాత్రికల్లా దేశ బడ్జెట్‌కి ఆమోదముద్ర వేయాల్సి ఉండగా ఆ పనిచేయలేకపోవడంతో పార్లమెంటు దానంతటదే రద్దయి్యంది. దీంతో దేశంలో మళ్లీ ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండేళ్ల వ్యవధిలో ఇజ్రాయెల్‌లో ఎన్నికలు జరుగుతుండటం ఇది నాలుగో సారి.
ఇదీ కథ...
2020, ఏప్రిల్‌లో బెన్నీ గాంట్జ్ నేతృత్వంలోని బ్లూ అండ్ వైట్ పార్టీ, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సారథ్యంలోని లికుడ్ పార్టీ కలిసి సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రధాని పదవిని పంచుకోవాలని ఇరు పార్టీలు నిర్ణయించుకున్నాయి. 18 నెలలు నెతన్యాహు ప్రధానిగా పనిచేసిన తర్వాత గాంట్జ్‌కు పగ్గాలు అప్పగించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే, ఈ మధ్యలోనే ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. దేశ బడ్జెట్‌పై రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. గడువులోగా బడ్జెట్‌ను ఆమోదించకపోవడంతో పార్లమెంట్ రద్దయింది.
నెతన్యాహు.. ఐదుసార్లు...
నెతన్యాహూ... 1996-99 మధ్య తొలిసారి ఇజ్రాయెల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2009లో రెండోసారి ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు (2009, 2013, 2015, 2020) ఈ పదవిలో కొనసాగుతున్నారు.
ఇజ్రాయెల్ రాజధాని: జెరూసలెం; కరెన్సీ: ఇజ్రాయెలి షెకెల్
ఇజ్రాయెల్ ప్రస్తుత అధ్యక్షుడు: రెయూవేన్ రివీలిన్
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇజ్రాయెల్ పార్లమెంట్ రద్దు
ఎప్పుడు : డిసెంబర్ 23
ఎందుకు : తుది గడువులోగా దేశ బడ్జెట్‌కి ఆమోదముద్ర వేయడంలో విఫలమైనందున
సార్క్ 36వ వ్యవస్థాపక దినోత్సవం
ఉగ్రవాదం, హింసకు తావులేని వాతావరణంలోనే సార్క్ దేశాలు పూర్తి సామర్థ్యాలను వినియోగించుకొని అభివృద్ధి సాధించగలవని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 36వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 8న వెలువరించిన సందేశంలో మోదీ ఈ మేరకు పేర్కొన్నారు.
సార్క్ - దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సమాఖ్య
- సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్-సార్క్, 1985 డిసెంబర్ 8న ఏర్పాటైంది.
- మొత్తం 8 దేశాలు (భారత్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, మాల్దీవులు, ఆఫ్ఘనిస్థాన్) దీనిలో సభ్యులుగా ఉన్నాయి. త్వరలో మయన్మార్ తొమ్మిదో సభ్యదేశంగా చేరనుంది.
- దీని ప్రధాన కార్యాలయం నేపాల్ రాజధాని ఖాట్మాండ్‌లో ఉంది.
- దక్షిణాసియా దేశాల మధ్య ప్రాంతీయ సహకారానికి, సామాజిక ప్రగతి, సాంస్కృతికాభివృద్ధి, ఆర్థిక వృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ కూటమి పనిచేస్తోంది.
- ప్రస్తుతం శ్రీలంకకు చెందిన ఎస్ల రువాన్ వీరాకూన్ సార్క్ జనరల్ సెక్రెటరీగా వ్యవహరిస్తున్నారు.
- రెండేళ్లకోసారి జరగాల్సిన సార్క్ శిఖరాగ్ర సదస్సులు 2014 తర్వాత నుంచి నిలిచిపోయాయి.
ఐరాస నివేదిక ప్రకారం 2030 నాటికి మొత్తం నిరుపేదల సంఖ్య?
కరోనా వైరస్ దీర్ఘకాలంగా కొనసాగుతూ ఆర్థిక రంగంపై తీవ్రంగా చూపిస్తున్న ప్రభావం వల్ల... 2030 నాటికి అదనంగా మరో 20.7 కోట్ల మంది దుర్భర దారిద్య్రంలోకి పడిపోనున్నారు. వీరిలో మహిళల సంఖ్య 10.2 కోట్లు ఉంటుంది. దీంతో 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం నిరుపేదల సంఖ్య 100 కోట్లు దాటిపోనుంది. డిసెంబర్ 6న ఐక్యరాజ్యసమితి డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌డీపీ) విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
పెట్టుబడుల్ని పెంచితే...
ప్రపంచ దేశాలన్ని కలసికట్టుగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు డిజిటలైజేషన్, సంక్షేమ పథకాలు, సామాజిక భద్రత రంగాల్లో పెట్టుబడుల్ని పెంచితే 14.6 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకి తీసుకురావచ్చునని యూఎన్‌డీపీ నివేదిక తెలిపింది. వచ్చే పదేళ్లలో 4.4 కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువకు వెళతారని గతంలో ఐఎంఎఫ్ అంచనా వేసిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2030 నాటికి మొత్తం నిరుపేదల సంఖ్య 100 కోట్లు దాటిపోనుంది
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : ఐక్యరాజ్యసమితి డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌డీపీ)
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఎందుకు : కరోనా వైరస్ దీర్ఘకాలంగా కొనసాగుతూ ఆర్థిక రంగంపై తీవ్రంగా చూపిస్తున్న ప్రభావం వల్ల...
స్పుత్నిక్ వీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన దేశం?
కరోనా మహమ్మారితో విలవిలలాడుతున్న రష్యా తాను సొంతంగా తయారు చేసిన ‘స్పుత్నిక్ వీ’ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డిసెంబర్ 5న ప్రారంభించింది. ఫ్రంట్‌లైన్ వర్కర్లకే టీకాలు ముందుగా ఇవ్వాలని రష్యా ప్రభుత్వం నిర్ణయించింది. వేలాదిగా ఆరోగ్య సిబ్బంది, మున్సిపల్ వర్కర్లు, టీచర్లు, వైరస్ ముప్పు అధికంగా ఉండే ఇతరులు భారీ సంఖ్యలో వ్యాక్సిన్‌లు తీసుకోవడానికి ముందుకు వచ్చారు. ఈ వ్యాక్సిన్ 95 శాతం పని చేస్తుందని తేలింది. అయితే ఇంకా ఈ వ్యాక్సిన్‌పై మూడో దశ ప్రయోగాలు జరుగుతున్నాయి.
గమలేయా ఇన్స్‌స్టిట్యూట్...
రష్యాలోని గమలేయా ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ అండ్ మైక్రోబయాలజీ కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి డోసు ఇచ్చిన 21 రోజుల తర్వాత రెండో డోసు ఇస్తారు.
రష్యా రాజధాని: మాస్కో; కరెన్సీ: రష్యన్ రూబుల్;
రష్యా ప్రస్తుత అధ్యక్షుడు: వ్లాదిమిర్ పుతిన్
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్పుత్నిక్ వీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 5
ఎవరు : రష్యా
ఎక్కడ : రష్యా
ఎందుకు : కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు
ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్టు ఎత్తు ఎంత?
ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8848.86 మీటర్లని డిసెంబర్ 8న నేపాల్, చైనా దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి. 1954లో ప్రకటించిన ఎత్తు 8,848 మీటర్ల కన్నా ఇది 86 సెంటీమీటర్లు అధికం. నేపాల్‌లో 2015లో సంభవించిన భారీ భూకంపం కారణంగా శిఖరం ఎత్తు మారిఉంటుందన్న అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో 2017లో ఈ శిఖరం ఎత్తును కొలిచే పనిని నేపాల్ మొదలుపెట్టింది. ఇందుకోసం చైనా సాయం తీసుకుంది.
2019లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నేపాల్ పర్యటన సందర్భంగా.. ఎవరెస్ట్ కొత్త ఎత్తును సంయుక్తంగా ప్రకటించేందుకు చైనా, నేపాల్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలా ఏడాది పాటు సర్వే జరిపిన అనంతరం సవరించిన ఎత్తును డిసెంబర్ 8న రెండు దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి. శిఖరం ఎత్తును తెలుసుకోవడం వల్ల హిమాలయాల్లో, టిబెట్ పీఠభూమిలో ఎలివేషన్ మార్పుల అధ్యయనానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఎవరెస్ట్ గురించి...
- 1954లో సర్వే ఆఫ్ ఇండియా మౌంట్ ఎవరెస్ట్ ఎత్తును కొలిచి 8,848 మీటర్లుగా నిర్ధారించింది. ఈ కొలతలనే ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఆమోదించారు.
- గతంలో పలుమార్లు ఎవరెస్ట్ ఎత్తుపై చైనా సర్వేలు చేపట్టింది. చివరగా 2005లో చేసిన ప్రకటనలో ఈ శిఖరం ఎత్తు 8,844.43 మీటర్లే అని చెప్పింది.
- ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్‌లో సాగర్‌మాత అని, టిబెట్‌లో చోమోలుంగ్‌మ అని పిలుస్తారు.
- ఎవరెస్ట్ శిఖరం ఇరు దేశాలలోనూ విస్తరించి ఉంది. కానీ, దీని శిఖరాగ్రం మాత్రం నేపాల్‌లో ఉంది.
టెథీస్ సముద్రం నుంచి...
భారత ఉపఖండ ఫలకం, యూరోసియన్ ఫలకం మధ్యలో మౌంట్ ఎవరెస్ట్ ఉంది. ఈ ప్రాంతంలో కదలికలు ఎక్కువగా ఉండటం వల్ల యూరోసియన్ ఫలకం లోనికి భారత ఫలకం చొచ్చుకుపోతూ ఉంటుంది. దీంతో కొన్ని లక్షల సంవత్సరాల కింద ఉన్న టెథీస్ అనే సముద్రం నుంచి హిమాలయాలు ఆవిర్భవించాయి. ఈ ఫలకాల నిత్య సంఘర్షణతో హిమాలయాలు పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ మార్పుకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8848.86 మీటర్లు
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : నేపాల్, చైనా
ఎందుకు : ఎవరెస్ట్ ఎత్తు 86 సెంటీమీటర్లు పెరగడం వల్ల
గ్రహాంతర జీవులున్నారు: ఇజ్రాయెల్ స్పేస్ సెక్యూరిటీ మాజీ చీఫ్
విశ్వంలోని ఇతర గ్రహాల్లో జీవులున్నారని(ఏలియన్స్) ఇజ్రాయెల్ స్పేస్ సెక్యూరిటీ మాజీ చీఫ్ హైమ్ యేషెడ్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఏలియన్స్ ఉన్నారన్న సంగతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సైతం తెలుసని 87 ఏళ్ల యేషెడ్ ఒక ఇంటర్వ్యూలో వివరించారు.
యేషెడ్ తెలిపిన అంశాలు...
- ఏలియన్స్ తమ ఉనికిని రహస్యంగా ఉంచుతున్నారు. మానవాళి గ్రహాంతర జీవులను నమ్మేందుకు ఇంకా తయారుగా లేనందునే వారు రహస్యంగా ఉంటున్నారు.
- విశ్వ నిర్మాణాన్ని అధ్యయనం చేయాలని ఏలియన్స్ భావిస్తున్నారు. ఆ మేరకు యూఎస్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నారు.
- దీంతో పాటు మార్స్ గ్రహంపై ఒక రహస్య అండర్‌గ్రౌండ్ బేస్ నిర్మాణానికి సైతం అమెరికా, ఏలియన్స్ మధ్య ఒప్పందం ఉంది.
- మానవాళి విశ్వం, విశ్వ నౌకల గురించి అవగాహన పెంచుకోవాలని గ్రహాంతర జీవుల కోరిక.
- ఏలియన్స్ ఏర్పాటు చేసిన గెలాక్టిక్ ఫౌండేషన్ సూచన మేరకు ఏలియన్స్ ఉన్నారన్న నిజం తెలిసినా ట్రంప్ బయటకు చెప్పట్లేదు.
ఇజ్రాయెల్ రాజధాని: జెరూసలెం; కరెన్సీ: ఇజ్రాయెలి షెకెల్
ఇజ్రాయెల్ ప్రస్తుత అధ్యక్షుడు: రెయూవేన్ రివీలిన్
ఇజ్రాయెల్ ప్రస్తుత ప్రధాని: బెంజమిన్ నెతన్యాహూ
పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏ కమిషన్ ఆధ్వర్యంలో పని చేస్తుంది?
చైనాకి చెందిన సెంట్రల్ మిలటరీ కమిషన్(సీఎంసీ) తాజా సమావేశం చైనా రాజధాని బీజింగ్‌లో జరిగింది. చైనా అధ్యక్షుడు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా అధినేత షి జిన్‌పింగ్ నవంబర్ 25న సమావేశంలో ప్రసంగించారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ)ని ప్రపంచంలోనే అత్యున్నత సైనిక శక్తిగా తీర్చిదిద్దనున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇందుకోసం నిజమైన పోరాట పరిస్థితుల్లో సైన్యానికి శిక్షణ ఇవ్వాలని తెలిపారు. 20 లక్షల మంది సైన్యం ఉన్న పీఎల్‌ఏ... సెంట్రల్ మిలటరీ కమిషన్ ఆధ్వర్యంలోనే పని చేస్తుంది. సీఎంసీ చైర్మన్‌గా జిన్‌పింగ్ ఉన్నారు.
రెండో అతిపెద్ద సైనిక బడ్జెట్...
2027 నాటికి పీఎల్‌ఏని ప్రపంచంలోనే అత్యున్నత సైనిక శక్తిగా తీర్చిదిద్దాలని చైనా కమ్యూనిస్టు పార్టీ ఇటీవల ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసింది. 2020లో సైన్యంపై 179 బిలియన్ డాలర్లు వెచ్చించేందుకు పార్టీ ఆమోదం తెలిపింది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సైనిక బడ్జెట్. 732 బిలియన్ డాలర్లతో అమెరికా తొలిస్థానంలో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సెంట్రల్ మిలటరీ కమిషన్(సీఎంసీ) సమావేశం
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : చైనా అధ్యక్షుడు, సీఎంసీ చైర్మన్ షి జిన్‌పింగ్
ఎక్కడ : బీజింగ్, చైనా
రేపిస్టులకు కెమికల్ కాస్ట్రేషన్ చేసేందుకు ఆర్డినెన్స్ తెచ్చిన దేశం?
రేపిస్టులకు కెమికల్ కాస్ట్రేషన్ చేయడం, రేప్‌ల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం కోసం పాకిస్తాన్ ప్రభుత్వం నవంబర్ 27న రెండు కొత్త ఆర్డినెన్సులు తీసుకువచ్చింది. ఈ చట్టాలను కేబినెట్ మరోమారు పరిశీలించి ఆమోదం తెలిపిన అనంతరం అధ్యక్షుడు ఆమోదించాల్సి ఉంటుంది. రసాయనాల ద్వారా పుంసత్వాన్ని దెబ్బతీయడాన్ని కెమికల్ కాస్ట్రేషన్ అంటారు.
కొత్త చట్టాల ప్రకారం...
కొత్త చట్టాల ప్రకారం అన్ని వయసుల స్త్రీలను మహిళగా నిర్వచిస్తారు. ప్రస్తుత చట్టం ప్రకారం 15ఏళ్లలోపు స్త్రీలతో సంభోగాన్ని మాత్రమే రేప్‌గా పరిగణిస్తారు. అలాగే రేప్‌కు విధించే కెమికల్ కాస్ట్రేషన్ ప్రభావం... కేసు స్వభావాన్ని అంటే తొలిసారి నేరం చేశారా లేక పదేపదే ఇలాంటి నేరాలు చేస్తున్నారా అనే విషయాన్ని బట్టి తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఉంటుంది.
యాంటీ రేప్ సెల్స్‌ను కూడా...
కొత్త చట్టం ప్రకారం రేప్‌కేసులకు ప్రత్యేక కోర్టులతో పాటు యాంటీ రేప్ సెల్స్‌ను కూడా ఏర్పరుస్తారు. అలాగే మహిళల కన్యత్వాన్ని పరీక్షించేందుకు చేసే టూ ఫింగర్ టెస్ట్‌ను నిషేధిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రేపిస్టులకు కెమికల్ కాస్ట్రేషన్ చేసేందుకు ఆర్డినెన్స్
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : పాకిస్తాన్ ప్రభుత్వం
ఎందుకు : రేప్ కేసులను అరికట్టేందుకు
పాండెమిక్‌ను వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తించిన సంస్థలు?
2020 ఏడాది పదంగా (వర్డ్ ఆఫ్ ది ఇయర్) ‘పాండెమిక్’ (మహమ్మారి) అనే పదాన్ని డిక్షనరీ డాట్ కామ్ అనే సంస్థ, మెరియం-వెబ్‌స్టర్ అనే సంస్థ గుర్తించాయి. పాండెమిక్ అనే పదం లాటిన్, గ్రీకు భాషల నుంచి పుట్టుకొచ్చిందని నిపుణులు పేర్కొన్నారు. ‘పాండెమిక్’ అంటే మొత్తం దేశం, ఖండం, యావత్ ప్రపంచం విస్తరించి ఉన్న వ్యాధి అని డిక్షనరీ డాట్ కామ్ నిర్వచించింది. 2020 ఏడాది కేవలం ఒకే పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించలేమని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ప్రకటించిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా పాండెమిక్
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : డిక్షనరీ డాట్ కామ్, మెరియం-వెబ్‌స్టర్
ఎందుకు : ప్రజలు అత్యధికసార్లు పాండెమిక్ పదాన్ని ఉపయోగించినందుకు
షాంఘై కో ఆపరేటివ్ ఆర్గనైజేషన్ 19వ సదస్సు
షాంఘై కో ఆపరేటివ్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) మండలి సభ్య దేశాల 19వ సదస్సు నవంబర్ 30న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ సమావేశానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఎస్‌సీవోలో పూర్తిస్థాయి సభ్యత్వం పొందిన తర్వాత భారత్ నిర్వహించిన తొలి సమావేశం ఇదే. సదస్సులో వెంకయ్య ప్రసంగిస్తూ... ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఏరివేసేలా అంతర్జాతీయ చట్టాలు రావాలని ఆకాంక్షించారు. అభివృద్ధి జరగాలంటే శాంతి నెలకొనాల్సిన అవసరం ఉందని, ఉగ్రవాదమే అభివృద్ధికి అడ్డుగోడ అన్నారు.
ఎస్‌సీవో సభ్యదేశాలు
1. భారత్
2. చైనా
3. పాకిస్తాన్
4. రష్యా
5. కజకిస్తాన్
6. కిర్గిజిస్తాన్
7. తజికిస్తాన్
8. ఉజ్బెకిస్తాన్
క్విక్ రివ్యూ:
ఏమిటి : షాంఘై కో ఆపరేటివ్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) మండలి సభ్య దేశాల 19వ సదస్సు
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఎక్కడ : వీడియో కాన్ఫరెన్స్
ఎందుకు : అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై చర్చించేందుకు
డ్రగ్స్ వినియోగంలో తొలి స్థానంలో ఉన్న నగరం?
జర్మనీకి చెందిన మార్కెట్ పరిశోధన సంస్థ ఏబీసీడీ ప్రపంచంలోని 120 దేశాల్లో 2018 డ్రగ్‌స వినియోగంపై డేటా ఆధారంగా జాబితాను రూపొందించింది.
ఏబీసీడీ జాబితా ప్రకారం..
- ప్రపంచంలో అత్యధికంగా డ్రగ్స్ వినియోగం న్యూయార్క్ నగరంలో జరుగుతోంది. ఇక్కడి ప్రజలు ప్రతి సంవత్సరం 70 వేల 252 కిలోల మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారు.
- పాకిస్తాన్‌లోని కరాచీ నగరం రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ ఏటా 38 వేల 56 కిలోల డ్రగ్‌సను వినియోగిస్తారు.
మూడో స్థానంలో ఢిల్లీ...
- డ్రగ్స్ వినియోగంలో భారత రాజధాని న్యూఢిల్లీ మూడో స్థానంలో, ఆర్థిక రాజధాని ముంబై ఆరో స్థానంలో ఉంది.
- ఢిల్లీవాసులు ప్రతీ సంవత్సరం 34 వేల 708 కిలోల డ్రగ్‌స వినియోగించగా, ముంబై వాసులు ప్రతీ ఏటా 29 వేల 374 కిలోల మాదక ద్రవ్యాలను వాడుతున్నారు.
- భారత్‌లో మాదకద్రవ్యాల వినియోగం కారణంగా ప్రతిరోజూ 23 మంది మరణిస్తున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీబీ) గణాంకాలు తెలుపుతున్నాయి.
డ్రగ్స్ వినియోగం- ఏబీసీడీ జాబితా
ర్యాంకు | నగరం | దేశం | ఏడాదికి డ్రగ్స్ వినియోగం |
1 | న్యూయార్క్ | అమెరికా | 70, 252 కిలోలు |
2 | కరాచీ | పాకిస్తాన్ | 38,056 కిలోలు |
3 | న్యూఢిల్లీ | భారత్ | 34,708 కిలోలు |
4 | లాస్ ఏంజిల్స్ | అమెరికా | 32,713 కిలోలు |
5 | కైరో | ఈజిప్ట్ | 29,565 కిలోలు |
6 | ముంబై | భారత్ | 29, 374 కిలోలు |
7 | లండన్ | ఇంగ్లండ్ | 28,485 కిలోలు |
8 | షికాగో | అమెరికా | 22,262 కిలోలు |
9 | మాస్కో | రష్యా | 20,747 కిలోలు |
10 | టొరంటొ | కెనడా | 20,638 కిలోలు |
ఏమిటి : డ్రగ్స్ వినియోగంలో న్యూయార్క్‌కు తొలి స్థానం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : జర్మనీకి చెందిన మార్కెట్ పరిశోధన సంస్థ ఏబీసీడీ
ఎక్కడ : ప్రపంచంలో