Skip to main content

జూన్ 2018 ఎకానమీ

టెక్ పయనీర్స్‌లో రెండు భారత స్టార్టప్‌లు
Current Affairs వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) రూపొందించిన ‘టెక్నాలజీ పయనీర్స్-2018’ జాబితాలో అహ్మదాబాద్‌కు చెందిన మై క్రాప్ టెక్నాలజీస్, న్యూఢిల్లీకి చెందిన సోషల్‌కాప్స్ స్టార్టప్‌లకు స్థానం దక్కింది. ఈ మేరకు 61 సంస్థలతో గుర్తించిన ‘టెక్నాలజీ పయనీర్స్-2018’ను జూన్ 21 విడుదల చేసింది. ఇందులో 25 శాతానికి పైగా మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లు అని టెక్నాలజీ పయనీర్స్ హెడ్ ఫుల్వియా మోన్‌ట్రెస్సర్ పేర్కొన్నారు. పయనీర్స్ జాబితాలో చోటు సాధించిన స్టార్టప్ నిర్వాహకులతో 2018 సెప్టెంబర్‌లో చైనాలోని తియాన్‌జిన్‌లో సదస్సుని నిర్వహించన్నట్లు తెలిపారు. నవకల్పనలకు ప్రాధాన్యత ఇచ్చే ఆరంభ స్థాయి కంపెనీలతో డబ్ల్యూఈఎఫ్ ప్రతి ఏడాది ఈ జాబితాను రూపొందిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘టెక్నాలజీ పయనీర్స్-2018’ జాబితా
ఎప్పుడు : జూన్ 21
ఎవరు : మై క్రాప్ టెక్నాలజీస్, సోషల్‌కాప్స్ అనే స్టార్టప్‌లకు
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా
ఎందుకు : నవకల్పనలకు ప్రాధాన్యత ఇచ్చే ఆరంభ స్థాయి కంపెనీలతో డబ్ల్యూఈఎఫ్ ఈ జాబితా రూపొందిస్తుంది.

ఢిల్లీలో మినరల్స్ అండ్ మెటల్స్ ఫోరమ్ సమావేశం
ఇండియా మినరల్స్ అండ్ మెటల్స్ ఫోరమ్ సమావేశాన్ని జూన్ 21న న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సమావేశంలో భారత ఉక్కు రంగంపై ఐబీసీ ప్రభావం, సంబంధిత అంశాలపై ఎర్నస్ట్ అండ్ యంగ్(ఈవై) రూపొందించిన నివేదిక వివరాలను ఈవై పార్ట్‌నర్, ఉక్కు రంగానికి చెందిన అంజనీ అగర్వాల్ వెల్లడించారు. ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్ప్ట్రసీ కోడ్(ఐబీసీ) భారత ఉక్కు రంగంలో ఏకీకరణను వేగవంతం చేస్తోందని, విదేశీ కంపెనీలు భారత ఉక్కు రంగంలోకి ప్రవేశించడానికి మార్గం సుగమం అవుతోందని ఈ నివేదిక పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియా మినరల్స్ అండ్ మెటల్స్ ఫోరమ్ సమావేశం
ఎప్పుడు : జూన్ 21
ఎక్కడ : న్యూఢి ల్లీ

గ్లోబల్ బ్రాండ్స్ లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
గ్లోబల్ బ్రాండ్‌‌స-2018 జాబితాలో ‘హెచ్‌డీఎఫ్‌సీ’ బ్యాంక్ 60వ స్థానం దక్కించుకుంది. దీంతో ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక దేశీ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. అత్యంత విలువైన టాప్-100 బ్రాండ్స్‌తో ‘బ్రాండ్‌జెడ్’ రూపొందించిన ఈ జాబితా జూన్ 22న విడుదలైంది. జాబితాలో గూగుల్ మొదటి స్థానంలో నిలవగా యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, టెన్‌సెంట్, ఫేస్‌బుక్, వీసా, మెక్‌డొనాల్డ్స్, అలీబాబా, ఏటీ అండ్ టీ సంస్థలు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్లోబల్ బ్రాండ్‌‌స-2018 జాబితా
ఎప్పుడు : జూన్ 22
ఎవరు : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

52 బిలియన్ డాలర్లకు ఈ-కామర్స్ వ్యాపారం
భారత్‌లో ఈ-కామర్స్ వ్యాపార ఆదాయం 2022 నాటికి 52 బిలియన్ డాలర్ల (రూ.3.53 లక్షల కోట్లు)కు చేరుతుందని మార్కెటింగ్ కంపెనీ ‘అడ్మిటాడ్’ నివేదిక వెల్లడించింది. 2017 నాటికి ఇది 25 బిలియన్ డాలర్లు(రూ.1.7లక్షల కోట్లు)గా ఉందని పేర్కొంది. ప్రస్తుతం 37 శాతం జనాభా ఇంటర్నెట్ వినియోగిస్తుండగా, వీరిలో 14 శాతం ఆన్‌లైన్ కొనుగోళ్లు చేస్తున్నారని తెలిపింది. ఇంటర్నెట్ యూజర్లు 2022 నాటికి 45 శాతం పెరగడంతో పాటు ఆన్‌లైన్ కొనుగోలుదారులు 90 శాతం పెరుగుతారని నివేదిక తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 52 బిలియన్ డాలర్లకు ఈ-కామర్స్ వ్యాపారం
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : మార్కెటింగ్ కంపెనీ ‘అడ్మిటాడ్’
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : ఇంటర్నెట్ వినియోగదారులు, ఆన్‌లైన్ కొనుగోళ్లు పెరగడం వల్ల

రత్నగిరిలో అబుదాబి ఆయిల్’ కు 50 శాతం వాటా
మహారాష్ట్రలోని రత్నగిరిలో 44 బిలియన్ డాలర్లతో (రూ.3 లక్షల కోట్లు) ఏర్పాటు చేయనున్న రిఫైనరీలో అబుదాబీ ఆయిల్‌కు 50 శాతం వాటా దక్కనుంది. ఈ మేరకు సౌదీ అరామ్‌కోతో అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్‌వోసీ) ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఈ ప్రాజెక్టులో సౌదీ అరామ్‌కో, ఏడీఎన్‌వోసీ 50 శాతం, ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ లు మిగిలిన 50 శాతం వాటా కలిగి ఉంటాయి.
ప్రాజెక్టులో భాగంగా 60 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో కూడిన రిఫైనరీ, 18 మిలియన్ టన్నుల పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను 2025 నాటికి పూర్తి చేస్తారు. భారత ఇంధన మార్కెట్, రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు ఇది ఒక అవకాశంగా ఏడీఎన్‌వోసీ భావిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రత్నగిరి ప్రాజెక్టులో 50 శాతం వాటా
ఎప్పుడు : జూన్ 25
ఎవరు : సౌదీ ఆరామ్‌కో, అబుదాబి ఆయిల్
ఎక్కడ : రత్నగిరి, మహారాష్ట్ర

ఆదాయ వృద్ధిలో తెలంగాణ నంబర్ వన్
ఆదాయాభివృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2014 నుంచి 2018 మే వరకు స్వీయ ఆదాయం (స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ)లో 17.2 శాతం సగటు వృద్ధి రేటుతో ముందంజలో ఉంది. ఈ మేరకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెబ్‌సైట్‌లో జూన్ 25న ఈ గణాంకాలను వెల్లడించింది. వృద్ధి రేటు 2015-16లో 13.7 శాతం, 2016-17లో 21.1 శాతం, 2017-18లో 16.8 శాతంగా ఉంది.
జాబితాలో 14.2 శాతంతో హరియాణా, 13.9 శాతంతో మహారాష్ట్ర, 12.4 శాతంతో ఒడిశా, 10.3 శాతంతో పశ్చిమ బెంగాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మిగతా రాష్ట్రాలన్నీ 10 శాతంలోపు వృద్ధిరేటు సాధించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆదాయాభివృద్ధి రేటులో నంబర్ 1 తెలంగాణ రాష్ట్రం
ఎప్పుడు : జూన్ 25
ఎవరు : కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ - కాగ్
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : సగటున 17.2 శాతం వృద్ధి రేటుతో

ఏఐఐబీ వార్షిక సదస్సును ప్రారంభించిన మోదీ
ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) మూడో వార్షిక సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 26న ముంబైలో ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని, 7.4 శాతం జీడీపీ వృద్ధితో ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్ చోదకంగా నిలుస్తోందని మోదీ తెలిపారు. ప్రస్తుతం దాదాపు 2.6 లక్షల కోట్ల డాలర్ల స్థూల దేశీయోత్పత్తితో భారత్ ప్రపంచంలోనే ఏడో స్థానంలో ఉండగా, కొనుగోలు శక్తిపరంగా చూస్తే మూడో పెద్ద దేశంగా ఉందని అన్నారు. స్వల్ప వ్యవధిలోనే 4 బిలియన్ డాలర్ల రుణపరిమాణం ఉండే 25 ప్రాజెక్టులను 12పైగా దేశాల్లో ఏఐఐబీ ఆమోదించిందని తెలిపారు. ప్రస్తుతం ఏఐఐబి ప్రెసిడెంట్‌గా జిన్ లికున్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏఐఐబీ వార్షిక సదస్సు ప్రారంభం
ఎప్పుడు : జూన్ 26
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ముంబై

భారత్‌లోకి అత్యధిక ఐపీఓ’లు
2018 మొదటి ఆరు నెలల్లో భారత్ లోకి సంఖ్యాపరంగా ప్రపంచంలో అత్యధిక ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లు వచ్చాయని ఈవై ఇండియా ఐపీఓ రెడీనెస్ సర్వే నివేదిక జూన్ 26న తెలిపింది. మొత్తం 90 ఐపీఓలు రాగా ఇవి 390 కోట్ల డాలర్లు సమీకరించాయని సర్వే వెల్లడించింది. ఇన్వెస్టర్ల విశ్వాసం నిలకడగా ఉండటం, ఈక్విటీ మార్కెట్లో దేశీయ పెట్టుబడులు పెరగడం, ఒడిదుడుకులు తక్కువగా ఉండటం, స్థూల ఆర్థికాంశాలు నిలకడగా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణం అని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా సంఖ్యాపరంగా భారత ఐపీఓల వాటా 16 శాతంగా, సమీకరించిన నిధుల పరంగా చూస్తే భారత వాటా 5 శాతంగా ఉంది. 2017లో ఆరు నెలల కాలంలో వచ్చిన ఐపీఓలతో పోల్చితే ఈ ఏడాది 27 శాతం అధిక ం కాగా నిధుల పరంగా చూస్తే 28 శాతం వృద్ధి నమోదైంది. ఐపీఓ ప్రైస్‌బ్యాండ్ అధికంగా ఉండటం, నిర్వహణ తీరు సరిగ్గా లేకపోవడం వంటివి ఐపీఓలకు సంబంధించి అతి పెద్ద సమస్యలని సర్వేలో తేలింది.

క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యధిక ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లు వచ్చిన దేశం
ఎప్పుడు : 2018 మొదటి ఆరు నెలల్లో
ఎవరు : ఈవై ఇండియా ఐపీఓ రెడీనెస్ సర్వే
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

భారత్ వృద్ధి రేటు 7.4 శాతం: ఫిచ్
Current Affairs 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదవుతుందని అంత ర్జాతీయ రేటింగ్ ఏజేన్సీ ఫిచ్ జూన్ 13న అంచనా వేసింది. 2018-19లో భారత్ వృద్ధి 7.3 శాతం, 2019-20లో 7.5 శాతంగా ఉండొచ్చని మే 11న వేసిన అంచనాలను ఈ మేరకు ఫిచ్ సవరించింది.
2017-18లో మొత్తంగా భారత్ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదు కాగా చివరి త్రైమాసికమైన జనవరి-మార్చిలో వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదైంది. మరోవైపు అమెరికాకు చెందిన రేటింగ్ సంస్థ మూడిస్ 2018-19లో భారత్ వృద్ధి రేటును 7.5 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ వృద్ధి రేటు 7.4 శాతం
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : అంతర్జాతీయ రేటింగ్ ఏజేన్సీ ఫిచ్
ఎక్కడ : 2018-19 ఆర్థిక సంవత్సరంలో

అభివృద్ధి చెందడానికి భారత్‌కు పదేళ్ల సమయం
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందడానికి కేవలం పదేళ్ల కాలమే ఉందని ఎస్‌బీఐ జూన్ 13న ఓ నివేదికలో అభిప్రాయపడింది. ఇందుకోసం దేశం విద్యపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పదేళ్ల కాలంలో దీన్ని సాధించలేకపోతే భారత్ ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహంలో ఉండే అవకాశం ఉందని, దేశాభివృద్ధి కోసం విధాన నిర్ణేతలు మేల్కోవాలని స్పష్టం చేసింది. ఎస్‌బీఐ సూచనలు
  • దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలి.
  • యువ జనాభాపై ప్రభుత్వం, విధాన నిర్ణేతలు దృష్టి పెట్టాలి. అధిక జనాభా నుంచి లబ్ధి పొందేందుకు విద్యపై ఇన్వెస్ట్ చేయాలి.
  • అధిక జనాభా అనుకూలత కాస్తా 2030 నాటికి ప్రతికూలంగా మారుతుంది.
  • అధిక జనాభా వృద్ధి గత రెండు దశాబ్దాలుగా ఒకే విధంగా 18 కోట్లుగా ఉంది.
  • సంతానోత్పత్తి రేటు రాష్ట్రాల మధ్య చాలా భిన్నంగా ఉంది. కర్ణాటకలో గత కొన్ని దశాబ్దాల్లో జననాల రేటు తగ్గింది. దీంతో ఆ రాష్ట్ర వాటా 1971లో 6.1 శాతంగా ఉంటే, 2011 నాటికి 9.5 శాతానికి చేరింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ కు అభివృద్ధి చెందడానికి పదేళ్లు సమయం
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక

భారత్‌లో మిలియనీర్ల పెరుగుదల 20 శాతం
2017లో భారత్‌లో మిలియనీర్ల సంఖ్య, వారి సంపద 20 శాతం పెరిగిందని ఫ్రాన్స్ టెక్నాలజీ సంస్థ, క్యాప్‌జెమినీ జూన్ 19న తెలిపింది. 10 లక్షల డాలర్లు (దాదాపు రూ.6.8 కోట్లు ) ఇన్వెస్ట్ చేయగల సంపద ఉన్న వారిని ఈ సంస్థ హెచ్‌ఎన్‌ఐగా పరిగణించింది.
నివేదిక ముఖ్యాంశాలు

 

  • 2017లో భారత్‌లో హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్‌ఎన్‌ఐ) సంఖ్య 20.4 శాతం పెరిగి 2.63 లక్షలకు చేరింది.
  • ఈ హెచ్‌ఎన్‌ఐల సంపద మొత్తం 21 శాతం పెరిగి లక్ష కోట్ల డాలర్లకు పెరిగింది.
  • అంతర్జాతీయంగా చూస్తే, హెచ్‌ఎన్‌ఐల సంఖ్య 11 శాతం, వారి సంపద 12 శాతం చొప్పున పెరిగాయి.
  • ప్రపంచంలో అతి పెద్ద హెచ్‌ఎన్‌ఐ మార్కెట్లుగా అమెరికా, జపాన్, జర్మనీ, చైనాలు నిలిచాయి. ఈ జాబితాలో మన దేశం 11వ స్థానంలో ఉంది.
  • భారత్‌లో హెచ్‌ఎన్‌ఐల సంఖ్య, వారి సంపద బాగా పెరగడానికి ప్రధాన కారణం స్టాక్ మార్కెట్ బాగా పెరగడమే. గత ఏడాది స్టాక్ మార్కెట్ 50 శాతానికి పైగా వృద్ధి సాధించింది.

2017లో సృష్టించబడిన మొత్తం సంపదలో 73 శాతాన్ని దేశ జనాభాలో కేవలం 1 శాతం జనాభా మాత్రమే చేజిక్కించుకున్నారని అంతర్జాతీయ హక్కుల సంస్థ, ఆక్స్‌ఫామ్ 2018 జనవరిలో పేర్కొంది. మరోవైపు 67 కోట్ల మంది భారతీయుల సంపద కేవలం 1 శాతం మాత్రమే పెరిగిందని తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లో మిలియనీర్ల పెరుగుదల 20 శాతం
ఎప్పుడు : 2017
ఎవరు : ఫ్రాన్స్ టెక్నాలజీ సంస్థ, క్యాప్‌జెమినీ

4.87 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం
ఆహార ఉత్పత్తులు, ఇంధన ధరలకు అనుగుణంగా ఏప్రిల్ నెలలో 4.58% గా ఉన్న ద్రవ్యోల్బణం మే నెలలో 4.87% గా నమోదైంది. ఇంత స్థాయిలో రిటైల్ ధరలు పెరగడం గత నాలుగు నెలల్లో ఇదే తొలిసారి. గతేడాది ఇదే నెలలో ఈ ద్రవ్యోల్బణం 2.18% గా ఉండటం గమనార్హం. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తారు.

4.43 శాతంగా టోకు ధరల ద్రవ్యోల్బణం
ఏప్రిల్ నెలలో 3.18 శాతంగా ఉన్న టోకు ధరల (హోల్‌సేల్ ధరల ఆధారిత) ద్రవ్యోల్బణం మే నెలలో 4.43 శాతానికి పెరిగింది. ఇది 14 నెలల్లో గరిష్ట స్థాయి. గతేడాది మే నెలలో ఇది 2.26 శాతం. ఇక ఆహారోత్పత్తుల విభాగంలో ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 0.87 శాతం కాగా, మే నెలలో 1.60 శాతానికి చేరింది. చమురు ధరల పెరుగుదల ప్రభావంతో ఇంధనం, విద్యుత్ విభాగంలో 11.22 శాతంగా నమోదైంది. ఇది ఏప్రిల్‌లో 7.85 శాతంగా ఉంది. ఈ గణాంకాలను ఈనెల 14న కేంద్రం విడుదల చేసింది.

రెపో రేటును పెంచిన ఆర్‌బీఐ
Current Affairs కీలక పాలసీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 6న ప్రకటించింది. దీంతో రెపో రేటు 6.25 శాతానికి, రివర్స్ రెపో రేటు 6 శాతానికి చేరాయి. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ చివరగా 2014 జనవరిలో రెపో రేటును పెంచింది.
మరోవైపు 2018-19 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.8-4.9 శాతం, అక్టోబర్- మార్చిలో 4.7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని ఆర్‌బీఐ అంచనా వేసింది. 2017-18లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదైంది.
రెపో రేటు: బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు.
రివర్స్ రెపో: ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై లభించే వడ్డీరేటు.
సీఆర్‌ఆర్: బ్యాంకులు డిపాజిట్ నిధుల్లో ఆర్‌బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన నిధుల పరిమాణం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కీలక వడ్డీ రేట్ల పెంపు
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : ఆర్‌బీఐ

సెజ్ పాలసీ అధ్యయనానికి కమిటీ
స్పెషల్ ఎకనమిక్ జోన్స్ (సెజ్) పాలసీ అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. భారత్ ఫోర్జ్ చైర్మన్ బాబా కల్యాణి ఈ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తారని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కమిటీ ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా సెజ్ పాలసీ ఉండేలా సిఫార్సులు చేయనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సెజ్ పాలసీ అధ్యయనానికి బాబా కల్యాణి నేతృత్వంలో కమిటీ
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : డబ్ల్యూటీవో నిబంధనలకు అనుగుణంగా సెజ్ పాలసీ ఉండేలా సిఫార్సులు చేయడానికి

వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్
వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఈ మేరకు ప్రపంచ ఆర్థిక వృద్ధికి సంబంధించి జూన్ 6న ఓ నివేదికను విడుదల చేసింది. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.3 శాతం, 2019-20, 2020-21లో 7.5 శాతంగా ఉంటుందని తెలిపింది.
2018లో దక్షిణాసియా వృద్ధి రేటు 6.9 శాతం, 2017లో 7.1 శాతంగా నమోదవుతుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. 2017లో చైనా వృద్ధిరేటు 6.9 శాతం, 2018లో 6.5 శాతం, 2019లో 6.3 శాతం, 2020లో 6.2 శాతంగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌కు అగ్రస్థానం
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : ప్రపంచ బ్యాంకు
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా

భారత్ వృద్ధిరేటు 7.3 శాతం
Current Affairs 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ అంచనా వేసింది. అలాగే 2019లో 7.5 శాతంగా ఉంటుందని తెలిపింది. ఈ మేరకు అంతర్జాతీయ స్థూల ఆర్థిక పరిస్థితులపై రూపొందించిన నివేదిక ను మే 30న విడుదల చేసింది.
2018లో జీ-20 దేశాల కూటమి వృద్ధి 3.3 శాతం, 2019లో 3.2 శాతంగా నమోదు కావచ్చొని పేర్కొంది. అలాగే సంపన్న దేశాలు 2018లో 2.3 శాతం, 2019లో 2 శాతం వృద్ధిని సాధిస్తే జీ-20లోని వర్ధమాన మార్కెట్లు 2018, 2019లో 5.2 శాతం వృద్ధిని సాధించవచ్చని తెలిపింది. 2017లో ఇది 5.3 శాతంగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ వృద్ధి రేటు 7.3 శాతం
ఎప్పుడు : మే 30
ఎవరు : మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్

7.7 శాతంగా నమోదైన భారత్ వృద్ధి
2017-18 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదయి్యంది. ఈ మేరకు కేంద్ర గణాంకాల శాఖ (సీఎస్‌ఓ) మే 31న ఈ వివరాలను వెల్లడించింది. దేశ జీడీపీలో తయారీ రంగం 15 శాతం వాటా కలిగి ఉండగా సేవల రంగం 55 శాతంపైగా వాటాను కలిగి ఉంది.
జీడీపీ ముఖ్యాంశాలు

  • 2017-18లో తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 5.6 శాతం, తర్వాతి నెలల్లో వరుసగా 6.3 శాతం, 7 శాతం, చివరి త్రైమాసికంలో 7.7 శాతం వృద్ధి నమోదయ్యింది.
  • వ్యవసాయ వృద్ధి 4.5 శాతం, తయారీ రంగ వృద్ధి 9.1 శాతం నమోదుకాగా నిర్మాణ రంగ వృద్ధి 11.6 శాతంగా నమోదయ్యింది. 2016 - 17లో ఈ విలువ రూ.43.52 లక్షల కోట్లుగా ఉంది.
  • పెట్టుబడికి సూచికగా ఉన్న గ్రాస్ ఫిక్స్‌డ్ క్యాపిటల్ ఫార్మేషన్ (జీఎఫ్‌సీఎఫ్) 2017-18లో రూ.47.79 లక్షల కోట్లుగా అంచనా. 2016 - 17లో ఈ విలువ రూ.43.52 లక్షల కోట్లు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 7.7 శాతంగా నమోదైన భారత్ వృద్ధిరేటు
ఎప్పుడు : మే 31
ఎవరు : కేంద్ర గణాంకాల శాఖ (సీఎస్‌ఓ)

అత్యంత లాభదాయక పీఎస్‌యూగా ఐవోసీ
ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలో (పీఎస్‌యూ) అత్యంత లాభదాయక కంపెనీగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) వరుసగా రెండో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచింది. టర్నోవర్ పరంగా దేశంలోనే అతి పెద్ద కంపెనీ అయిన ఐవోసీ 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ. 21,346 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
దేశంలోని అన్ని కంపెనీలను పరిగణలోనికి తీసుకుంటే అత్యంత లాభదాయక కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుసగా మూడో ఏడాదీ అగ్రస్థానం దక్కించుకుంది. 2017-18లో రూ.36,075 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఈ జాబితాలో రూ. 25,880 కోట్ల లాభంతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రెండో స్థానంలో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యంత లాభదాయక పీఎస్‌యూ
ఎప్పుడు : మే 31
ఎవరు : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ)

నల్లధనం సమాచారమిస్తే ఐదు కోట్ల నజరానా
నల్లధనం, బినామీ లావాదేవీల గురించి నిర్దిష్ట సమాచారమిచ్చే వారికి రూ.కోటి నుంచి రూ.5 కోట్ల దాకా పారితోషికం ఇవ్వనున్నట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది. ఈ మేరకు ‘బినామీ లావాదేవీల సమాచారమిచ్చే వారికి పారితోషిక పథకం 2018’ ని జూన్ 1న ఆవిష్కరించింది. భారతీయులతో పాటు విదేశీయులకు కూడా ఇది వర్తిస్తుంది.
బినామీ లావాదేవీలు, ఆస్తులతో పాటు వాటిపై వచ్చే ఆదాయాలు అందుకుంటున్న వారి వివరాలను నిర్దిష్ట పార్మాట్‌లో ఆదాయ పన్ను విభాగం ఇన్వెస్టిగేషన్ డెరైక్టరేట్స్‌లోని బినామీ నిరోధక యూనిట్లలో జాయింట్ లేదా అడిషనల్ కమిషనర్స్‌కి అందించాలి. ఈ వివరాలను ఇచ్చిన ఇన్ఫార్మర్ వివరాలను గోప్యంగా ఉంచుతామని సీబీడీటీ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నల్లధనం సమాచారమిచ్చే వారికి ఐదు కోట్ల నజరానా
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : కేంద్ర ప్రత్యక్ష పన్నులబోర్డు

సేవా భోజ్ యోజనను ప్రవేశపెట్టిన కేంద్రం
అన్నదానం చేస్తున్న ఆధ్యాత్మిక, దాతృత్వ సంస్థలపై ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సేవా భోజ్ యోజన’ అనే పథకాన్ని జూన్ 2న ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఆ సంస్థలకు కేంద్ర జీఎస్టీ(సీజీఎస్టీ), సమీకృత జీఎస్టీ(ఐజీఎస్టీ) మొత్తాలను తిరిగి చెల్లిస్తారు.
ఈ పథకాన్ని రానున్న రెండేళ్ల పాటు రూ.325 కోట్ల వ్యయంతో కేంద్ర సాంస్కృతిక శాఖ అమలు చేయనుంది. కనీసం ఐదేళ్లుగా నెలకు కనీసం 5 వేల మందికి అన్నదానం చేస్తున్న ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, ధార్మిక ఆశ్రమాలు, దర్గాలు, మఠాలు వంటి సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. ఇందుకోసం దర్పన్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సేవా భోజ్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్రం
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : అన్నదానం చేస్తున్న ఆధ్యాత్మిక, దాతృత్వ సంస్థలు
ఎక్కడ : దేశ వ్యాప్తంగా
ఎందుకు : ఆర్థిక భారం తగ్గించేందుకు
Published date : 03 Jul 2018 05:39PM

Photo Stories