Skip to main content

జనవరి 2020 ఎకానమీ

ఉజ్వల యోజనపై కొలంబియా వర్సిటీ అధ్యయనం
Current Affairs
గ్రామీణ ప్రాంత పేద ప్రజలను ఎల్పీజీ సిలిండర్ల వాడకం వైపు మొగ్గేలా చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎమ్‌యూవై)పై కెనడాలోని బ్రిటిష్ కొలంబియా వర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. పీఎమ్‌యూవై కార్యక్రమ ఫలాలు పూర్తి స్థాయిలో అందడం లేదని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఉజ్వల పథకం కింద ప్రజలను సిలిండర్లను కొనేలా చేయగలిగినా.. వాటిని పూర్తిగా వినియోగించేలా చేయడంలో యంత్రాంగం విఫలమైనట్లు తేలింది.
40 నెలల్లో 8 కోట్ల మంది..
పీఎమ్‌యూవై ద్వారా కేంద్రప్రభుత్వం పేద మహిళలకు సబ్సిడీతో ఎల్పీజీ సిలిండర్లిస్త్తోంది. పథకం ప్రారంభమైన తొలి 40 నెలల్లో 8 కోట్ల మందికి పైగా ఎల్పీజీ సిలిండర్లను తీసుకున్నట్లు తాజా అధ్యయనం పేర్కొంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో కట్టె పొయ్యిలనే వాడుతున్నారనీ, వంటకు ఎల్పీజీని మాత్రమే వాడితేనే సత్ఫలితాలు అందుతాయని వర్సిటీ పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎమ్‌యూవై)పై అధ్యయనం
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : బ్రిటిష్ కొలంబియా వర్సిటీ పరిశోధకులు
ఎందుకు : పీఎమ్‌యూవై కార్యక్రమం ఫలితాల విశ్లేషణకు

ఎయిరిండియా విక్రయానికి కేంద్రం సిద్ధం
తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయిన ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియాను పూర్తిగా విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సంస్థలోని మొత్తం 100 శాతం వాటాను వ్యూహాత్మక విక్రయం ద్వారా అమ్మేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బిడ్డింగ్ ప్రక్రియలో భాగంగా ప్రాథమిక విధివిధానాలను జనవరి 27న విడుదల చేసింది. బిడ్డింగ్ పత్రంలోని వివరాల ప్రకారం... ఎయిరిండియాతో పాటు, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం, సింగపూర్ ఎయిర్‌లైన్స్ తో కలిసి నిర్వహిస్తున్న గ్రౌండ్‌హ్యాండ్లింగ్ సేవల సంయుక్త సంస్థ ఏఐఎస్‌ఏటీఎస్‌లో ఉన్న 50 శాతం వాటాలను విక్రయిస్తారు. అలాగే యాజమాన్య హక్కులను బదలాయిస్తారు.
వాటికి మాత్రం మినహాయింపు...
ఎయిరిండియాకు ఇతర అనుబంధ సంస్థల్లో కూడా వాటాలు ఉన్నాయి. ప్రధానంగా ఎయిరిండియా ఇంజనీరింగ్ సర్వీసెస్, ఎయిరిండియా ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్, ఎయిర్‌లైన్ అలైడ్ సర్వీసెస్, హాటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాల్లో కీలక వాటాలున్నాయి. ఈ వాటాలను మాత్రం తాజాగా ప్రతిపాదించిన వాటా అమ్మకం నుంచి మినహాయించారు. వీటిని ప్రత్యేక సంస్థ ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్ లిమిటెడ్(ఏఐఏహెచ్‌ఎల్)కు బదలాయిస్తారు.
రూ.60,074 కోట్లు : ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లకు 2019 మార్చి 31 నాటికి ఉన్న మొత్తం రుణ భారం
రూ.4,800 కోట్లు : 2018-19లో ఎయిరిండియా నిర్వహణ నష్టాలు
17,984 : 2019 నవంబర్ 1 నాటికి ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లలో మొత్తం ఉద్యోగులు
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియా విక్రయం
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయినందున

అయిదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు: అమెజాన్
Current Affairs
వచ్చే అయిదేళ్లలో భారత్‌లో 10 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు అమెరికాకు చెందిన ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ వెల్లడించారు. ఐటీ, నైపుణ్యాల అభివృద్ధి, కంటెంట్ క్రియేషన్, రిటైల్, లాజిస్టిక్స్, తయారీ తదితర రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ కొత్త కొలువులు రానున్నట్లు వివరించారు. మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన బెజోస్ జనవరి 17న ఈ మేరకు తమ ప్రణాళికలను ప్రకటించారు. ఇప్పటికే కల్పించిన ఏడు లక్షల ఉద్యోగాలకు ఇవి అదనమన్నారు.
భారత్‌లో చిన్న, మధ్య తరహా సంస్థ(ఎస్‌ఎంఈ) లు ఆన్‌లైన్ బాట పట్టేలా తోడ్పాటు అందించేందుకు సుమారు రూ. 7,000 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు, 2025 నాటికి 10 బిలియన్ డాలర్ల విలువ చేసే మేడిన్ ఇండియా ఉత్పత్తులను ఎగుమతి చేయనున్నట్లు బెజోస్ ఇప్పటికే ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అయిదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు సృష్టి
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్
ఎక్కడ : భారత్

ఐరాస 2020 ఆర్థిక నివేదిక విడుదల
ఐక్యరాజ్యసమితి ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు 2020’ పేరుతో రూపొందించిన నివేదిక జనవరి 17న విడుదలైంది. భారత్ భారీ ఆర్థిక వృద్ధి సాధనకు వ్యవస్థాగత సంస్కరణల కొనసాగింపు అవసరమని ఈ నివేదిక పేర్కొంది. ఒకవైపు సంస్థాగత, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లకు సంబంధించి వ్యవస్థాగత సంస్కరణలు మరోవైపు ప్రభుత్వ వ్యయాల ద్వారా మందగమనంలో ఉన్న ఆర్థిక వృద్ధిని మెరుగుపరచవచ్చని సూచించింది.
ఐరాస 2020 ఆర్థిక నివేదిక - ముఖ్యాంశాలు
  • 2018లో భారత్ వృద్ధి 6.8 శాతం. 2019లో ఇది 5.7 శాతానికి తగ్గింది. 2020లో వృద్ధి 6.6 శాతానికి రికవరీ కావచ్చు. అయితే భారీ వృద్ధికి మాత్రం రెగ్యులేటరీ, సంస్థాగత సంస్కరణలు కీలకం.
  • చైనా వృద్ధి 2019లో 6.1 శాతం, 2020లో 6 శాతంగా ఉండొచ్చు.
  • భారత్‌లో 2019-20 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 5 శాతం, 2020-21 ఆర్థిక సంవత్సరం లో 5.8-5.9 శాతం శ్రేణిలో నమోదయ్యే అవకాశం ఉంది.
  • ప్రతి ఐదు దేశాల్లో ఒకదేశం తలసరి ఆదాయం 2020 ఏడాది స్థిరంగా ఉండడమో లేక తగ్గుతుండడమో జరిగే అవకాశం ఉంది. అయితే తలసరి ఆదాయం 4 శాతం పైగా పెరిగే అవకాశం ఉన్న దేశాల్లో భారత్ ఒకటి.
  • ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక బలహీనత సుస్థిరాభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగించే అవకాశం ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు 2020 నివేదిక విడుదల
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : ఐక్యరాజ్యసమితి

2020-21 బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రారంభం
సాంప్రదాయక హల్వా రుచుల ఆస్వాదనతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-2021) బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రక్రియ జనవరి 20న ప్రారంభమైంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్, ఫైనాన్స్ కార్యదర్శి రాజీవ్ కుమార్, రెవెన్యూ సెక్రటరీ అజయ్ భూషణ్ పాండే, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతను చక్రవర్తి ‘బడ్జెట్ హల్వా ఉత్సవం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2020, ఫిబ్రవరి 1వ తేదీన సీతారామన్ 2020-21 ఫైనాన్స్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. నరేంద్ర మోదీ రెండవసారి ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత సమర్పిస్తున్న రెండవ బడ్జెట్ ఇది.
బడ్జెట్ హల్వా ఉత్సవం భాగంగా పెద్ద కడాయిలో హల్వాను తయారు చేసి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు, బడ్జెట్ తయారీకి సంబంధించిన సిబ్బందికి వడ్డించారు. ఈ సిబ్బంది... బడ్జెట్ తయారీ నుంచి లోక్‌సభలో ప్రవేశపెట్టేవరకూ ఆర్థిక మంత్రిత్వ శాఖ భవనంలోనే ఉంటారు. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధాలు ఉండవు. పలువురు ఉన్నతాధికారులకు మాత్రమే ఇంటికి వెళ్లడానికి అనుమతి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020-21 బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : న్యూఢిల్లీ

ఆర్థిక అసమానతలపై ఆక్స్‌ఫామ్ నివేదిక విడుదల
ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్యుల పక్షం వహించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ మానవ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్ ఒక నివేదికను రూపొందించింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా ’టైమ్ టు కేర్’ పేరిట ఆక్స్‌ఫామ్ జనవరి 20న ఈ నివేదికను విడుదల చేసింది.
టైమ్ టు కేర్‌లోని ప్రధానాంశాలు..
  • ప్రపంచ జనాభాలో సుమారు 60 శాతం (460 కోట్లు) ప్రజలకు మించిన సంపద 2,153 మంది బిలియనీర్ల దగ్గర ఉంది.
  • మొత్తం ఆఫ్రికాలో మహిళల దగ్గరున్న సంపద కన్నా ప్రపంచంలో టాప్ 22 మంది బిలియనీర్ల వద్ద ఉన్న సంపదే ఎక్కువ.
  • భారతదేశ జనాభాలో 70 శాతం (సుమారు 95.3 కోట్ల మంది) జనాభాతో పోలిస్తే 1 శాతం కుబేరుల సంపద ఏకంగా నాలుగు రెట్లు పైగా ఉంది. దేశీయంగా 63 మంది బిలియనీర్ల మొత్తం సంపద విలువ.. పూర్తి ఆర్థిక సంవత్సర బడ్జెట్ పరిమాణాన్ని (2018-19లో రూ. 24.42 లక్షల కోట్లు) మించింది.
  • మహిళలు, బాలికలు రోజుకు 326 కోట్ల గంటల పనిని ఎలాంటి భత్యాలు లేకుండా చేస్తున్నారు. దీనికి లెక్కగడితే ఏటా రూ. 19 లక్షల కోట్లవుతుంది. ఇది 2019లో దేశీ విద్యారంగానికి కేటాయించిన మొత్తం బడ్జెట్ (రూ. 93,000 కోట్లు)కు 20 రెట్లు ఎక్కువ.
  • సంక్షేమ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచడంద్వారా 1.1 కోట్ల మేర కొత్త ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. తద్వారా 2018లో కోల్పోయిన 1.1 కోట్ల ఉద్యోగాలను తిరిగి సృష్టించవచ్చు.
  • వచ్చే 10 ఏళ్ల పాటు ఒక్క శాతం కుబేరులు తమ సంపదపై అదనంగా కేవలం 0.5 శాతం పన్ను చెల్లించిన పక్షంలో.. వృద్ధులు, బాలల సంక్షేమం, విద్యా, వైద్యం వంటి రంగాల్లో 11.7 కోట్ల పైచిలుకు ఉద్యోగాల కల్పనకు అవసరమైన పెట్టుబడులకు సరిసమానంగా ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టైమ్ టు కేర్ పేరుతో నివేదిక విడుదల
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : మానవ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్
ఎందుకు : ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్న నేపథ్యంలో

భారత్ వృద్ధి 4.8 శాతమే : ఐఎంఎఫ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019-2020లో భారత్ ఆర్థికవృద్ధి రేటు 4.8 శాతమే నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. ఇంతక్రితం ఈ వృద్ధి అంచనా 6.1 శాతం. వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈఓ) తాజా అంచనాలను ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ జనవరి 20న స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వెల్లడించారు. భారత్‌లో గ్రామీణ డిమాండ్ వృద్ధి పడిపోయిందని, బ్యాంకింగ్ రుణ వృద్ధి మందగించిందనీ గీతా పేర్కొన్నారు. ఆయా కారణాలు భారత్ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయన్నారు.
2020-21లో 5.8 శాతం..
2020-21లో భారత్ వృద్ధి 5.8 శాతానికి, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని కూడా ఐఎంఎఫ్ అంచనావేసింది. ఇక 2019లో అంతర్జాతీయ వృద్ధి 2.9 శాతంగా ఉంటుందన్నది ఐఎంఎఫ్ అంచనా. ఇంతక్రితం ఈ అంచనా 3 శాతం. అటుపై రెండు సంవత్సరాల్లో ఈ వృద్ధిరేటు వరుసగా 3.3 శాతం, 3.4 శాతానికి పెరుగుతుందని ఐఎంఎఫ్ తన తాజా అంచనాల్లో పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019-2020లో భారత్ ఆర్థికవృద్ధి రేటు 4.8 శాతమే
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈఓ)
ఎందుకు : గ్రామీణ డిమాండ్ వృద్ధి పడిపోవడం, బ్యాంకింగ్ రుణ వృద్ధి మందగించడం వంటి కారణాల వల్ల

ఇళ్ల ధరల వృద్ధిలో బుడాపెస్ట్‌కు తొలి స్థానం
ప్రపంచవ్యాప్తంగా ఇళ్ల ధరల వృద్ధిలో హంగేరీలోని బుడాపెస్ట్ తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడ ఇళ్ల ధరల వృద్ధి 24 శాతంగా ఉంది. బుడాపెస్ట్ తర్వాత చైనాలోని జియాన్, యూహాన్ నగరాలున్నాయి. ఈ ప్రాంతాల్లో వరుసగా 15.9 శాతం, 14.9 శాతం ధరల వృద్ధి ఉంది. గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్‌ఫ్రాంక్ జనవరి 21న విడుదల చేసిన ‘ఇళ్ల ధరల వృద్ధి నివేదిక’లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2019, జూలై -సెప్టెంబర్ (క్యూ3) మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లో సర్వే నిర్వహించి ఈ నివేదికను రూపొందించారు.
హైదరాబాద్‌కు 14వ స్థానం..
ప్రపంచవ్యాప్తంగా ఇళ్ల ధరల వృద్ధిలో హైదరాబాద్ 14వ స్థానంలో నిలిచింది. మన దేశం నుంచి టాప్-20లో చోటు దక్కించుకున్న ఏకైక నగరం భాగ్యనగరమే. హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 9 శాతం వృద్ధి చెందాయి. హైదరాబాద్ తర్వాత 73వ స్థానంలో ఢిల్లీ(3.2 శాతం ధరల వృద్ధి), 94వ స్థానంలో బెంగళూరు (2 శాతం), 108వ స్థానంలో అహ్మదాబాద్(1.1 శాతం) ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇళ్ల ధరల వృద్ధిలో బుడాపెస్ట్‌కు తొలి స్థానం
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్‌ఫ్రాంక్
ఎక్కడ : ప్రపంచంలో

భారత్‌లో ఎన్‌టీటీ 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి
జపాన్‌కి చెందిన టెక్ దిగ్గజం ఎన్‌టీటీ గ్రూప్ భారత్‌లో వచ్చే నాలుగేళ్లలో గణనీయంగా పెట్టుబడులు పెట్టనుంది. అంతర్జాతీయంగా నాలుగు ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుపై దాదాపు 7 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ సీఈవో (గ్లోబల్ డేటా సెంటర్స్ భారత విభాగం) శరద్ సంఘి జనవరి 22న తెలిపారు. ఇందులో 1.5 బిలియన్ డాలర్లు (రూ. 11,000 కోట్లు) భారత్‌లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు సూచనప్రాయంగా పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో ఎస్‌అండ్‌పీ గ్లోబల్ కొత్త ఆఫీస్
రేటింగ్‌‌స, అనలిటిక్స్, డేటా సేవల్లో ఉన్న ఎస్‌అండ్‌పీ గ్లోబల్ హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. స్కైవ్యూ భవనంలో 2.41 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది ఏర్పాటైంది. ఈ భవంతికి యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గోల్డ్ రేటెడ్ లీడ్ ధ్రువీకరణ ఉందని కంపెనీ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి
ఎప్పుడు : జనవరి 22
ఎవరు : ఎన్‌టీటీ గ్రూప్
ఎక్కడ : భారత్
ఎందుకు : డేటా సెంటర్ల ఏర్పాటుకు

ప్రముఖ ఆర్థికవేత్తలతో ప్రధాని మోదీ భేటీ
Current Affairs
దాదాపు 40 మంది పైగా ఆర్థికవేత్తలు, ప్రైవేట్ ఈక్విటీ.. వెంచర్ క్యాపిటలిస్ట్‌లు, వ్యాపార దిగ్గజాలు, వ్యవసాయ రంగ నిపుణులు మొదలైన వారితో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని నీతి ఆయోగ్ కార్యాలయంలో జనవరి 9న జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక వృద్ధి, స్టార్టప్స్, నవకల్పనలు తదితర అంశాలపై విసృ్తత చర్చలు జరిపారు. సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ పాల్గొన్నారు.
తాజా భేటీలో మోదీ మాట్లాడుతూ... దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితుల నుంచి తిరిగి పుంజుకునే సత్తా ఎకానమీకి పుష్కలంగా ఉందని తెలిపారు. 2024 నాటికి దేశ ఎకానమీ 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరగలదని ధీమా వ్యక్తం చేశారు. ట్రిలియన్ (లక్ష కోట్లు) డాలర్ల ఎకానమీగా ఎదగాలనే లక్ష్యం అకస్మాత్తుగా పుట్టుకొచ్చినది కాదని.. దేశ సామర్థ్యంపై అవగాహనతోనే దీన్ని నిర్దేశించుకున్నామని పేర్కొన్నారు. అన్ని వర్గాలు సమష్టిగా పనిచేస్తే ఇది సాధ్యమేనన్నారు.
మోదీతో నోబెల్ బహుమతి గ్రహీత టాలర్ భేటీ
ప్రధాని మోదీతో ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రిచర్డ్ టాలర్ జనవరి 9న భేటీ అయ్యారు. వ్యక్తుల నడవడిక, నిర్ణయాలపై ప్రభావం చూపే ఆర్థిక ప్రవర్తన సిద్ధాంతం (నడ్‌‌జ థియరీ)పై ఆయనతో చర్చించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్థికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు, వ్యవసాయ రంగ నిపుణులతో భేటీ
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : నీతి ఆయోగ్, ఢిల్లీ
ఎందుకు : దేశంలో ఆర్థిక మందగమనం కొనసాగుతున్న నేపథ్యంలో

ప్రపంచబ్యాంక్ గ్లోబల్ ఎకనమిక్ నివేదిక విడుదల
ప్రపంచబ్యాంక్ జనవరి 9న ‘‘గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్’’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, భారత జీడీపీ వృద్ధిరేటుకి సంబంధించిన అంశాలను ఈ నివేదికలో ప్రస్తావించింది.
గ్లోబల్ ఎకనమిక్ నివేదికలోని అంశాలు
  • 2019-2020 ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 5 శాతానికి పడిపోయే అవకాశం ఉంది. అయితే 2020-2021లో వృద్ధిరేటు 5.8 శాతానికి రికవరీ అయ్యే అవకాశం ఉంది.
  • 2020లో ప్రపంచ ఆర్థికవృద్ధి 2.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది.
  • అమెరికా వృద్ధిరేటు 2020లో 1.8 శాతంగా నమోదుకావచ్చు.
  • యూరో ప్రాంతంలో 2020లో వృద్ధి ఒకశాతానికి తగ్గిస్తున్నాం. ఈ ప్రాంతంలో బలహీన పారిశ్రామిక క్రియాశీలత దీనికి ఒక కారణం.
  • 2022లో దక్షిణాసియా వృద్ధిరేటు 6 శాతంగా ఉండవచ్చు.
  • బంగ్లాదేశ్‌లో వృద్ధిరేటు 7 శాతంగా ఉండే వీలుంది. అయితే పాక్‌లో ఈ రేటు 3 శాతం లేదా అంతకన్నా తక్కువగా ఉండే వీలుంది.
  • వాణిజ్య యుద్ధం, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి సవాళ్లతో ప్రపంచ ఆర్థిక వృద్ధితీరుకు కొంత ఇబ్బందులూ ఉన్నాయి.
  • భారత్‌ను ప్రత్యేకంగా చూస్తే, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల కఠిన రుణ పరిస్థితులు దేశీయ డిమాండ్‌ను బలహీనతకు కారణాల్లో ఒకటి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్ పేరుతో నివేదిక విడుదల
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : ప్రపంచబ్యాంక్

ఆస్తుల వేలానికి ఈ-బిక్రయ్ పోర్టల్ ప్రారంభం
Current Affairs
ప్రభుత్వరంగ బ్యాంకులు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విక్రయానికి వీలుగా అభివృద్ధి చేసిన ఏకీకృత పోర్టల్ ‘ఈ-బిక్రయ్’ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జనవరి 2న ప్రారంభించారు. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో పీఎస్‌బీలు రూ.2.3 లక్షల కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. వీటిని మరింత పారదర్శకంగా వేలం వేసి, అదనపు విలువను పొందేందుకు వీలుగా ఈ-బిక్రయ్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల ఈ-ఆక్షన్ పోర్టళ్లకు ఇది అనుసంధానంగా వ్యవహరిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈ-బిక్రయ్ పోర్టల్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎందుకు : ప్రభుత్వరంగ బ్యాంకులు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విక్రయానికి వీలుగా

జీడీపీ వృద్ధి 5 శాతం లోపే : ఎన్‌ఎస్‌ఓ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019-20లో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5 శాతం దిగువనే నమోదవుతుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) అంచనా వేసింది. ఈ మేరకు జనవరి 7న జాతీయ ఆదాయ తొలి ముందస్తు అంచనాలను వెలువరించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధిరేటు 6.8 శాతంగా నమోదైంది. జీడీపీ వృద్ధిరేటు 5 శాతం దిగువకు పడిపోతే అది 11 సంవత్సరాల కనిష్టస్థాయి అవుతుంది.
తలసరి ఆదాయ వృద్ధి 6.8 శాతం
భారత్ నెలవారీ తలసరి ఆదాయం 2019-20లో 6.8 శాతం పెరిగి రూ.11,254కు చేరుతున్నట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ అంచనావేసింది. 2018-19లో తలసరి ఆదాయం రూ.10,534గా ఉంది. వార్షికంగా చూస్తే, తలసరి ఆదాయం 6.8 శాతం వృద్ధితో రూ. 1,26,406 నుంచి రూ.1,35,050కి పెరుగుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019-20లో భారత జీడీపీ వృద్ధి 5 శాతం లోపే
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ)
Published date : 27 Jan 2020 04:10PM

Photo Stories