Skip to main content

యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్‌లో టైటిల్ విజేత?

యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్, నాలుగో సీడ్, జపాన్ యువతార నయోమి ఒసాకా చాంపియన్‌గా నిలిచింది.
Current Affairs

భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 13న న్యూయార్క్‌లో జరిగిన ఫెనల్లో 22 ఏళ్ల ఒసాకా గంటా 53 నిమిషాల్లో 1-6, 6-3, 6-3తో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ప్రస్తుత 27వ ర్యాంకర్ విక్టోరియా అజరెంకా (బెలారస్)పై విజయం సాధించింది. ఒసాకా కెరీర్‌లో ఇది రెండో యూఎస్ ఓపెన్ టైటిల్, మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఆమె 2018లోనూ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచింది. విజేతగా నిలిచిన ఒసాకాకు 30 లక్షల డాలర్లు (రూ. 22 కోట్లు), రన్నరప్ అజరెంకాకు 15 లక్షల డాలర్లు (రూ. 11 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి.

జాతి వివక్షపై...
అమెరికాలో నల్ల జాతీయులపై జరుగుతున్న వివక్ష పట్ల ఓ క్రీడాకారిణిగా నయోమి యూఎస్ ఓపెన్‌లో అద్భుత రీతిలో స్పందించింది. కొన్నేళ్లుగా పోలీసుల చేతుల్లో బలైన నల్ల జాతీయుల్లో ఏడుగురిని ఎంచుకొని వారి పేర్లను తన మాస్క్‌పై రాసుకొని మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ తర్వాత వాటిని ధరించి సంఘీభావం తెలిపింది.

తొలి క్రీడాకారిణి ఒసాకానే...

  • మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) 1975లో ర్యాంకింగ్‌‌స ప్రవేశపెట్టాక టాప్-20 క్రీడాకారిణులను ఎదుర్కోకుండా యూఎస్ ఓపెన్ గెలిచిన తొలి క్రీడాకారిణి ఒసాకానే.
  • ఆసియా నుంచి మూడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన తొలి ప్లేయర్ (పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి) నయోమి ఒసాకా. నా లీ (చైనా) రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గింది.
  • యూఎస్ ఓపెన్ ఫైనల్లో అత్యధికంగా మూడుసార్లు ఓడిపోయిన రెండో క్రీడాకారిణి అజరెంకా. ఇవాన్ గూలాగాంగ్ (ఆస్ట్రేలియా) అత్యధికంగా నాలుగు యూఎస్ ఓపెన్ టోర్నీ ఫైనల్స్‌లో ఓడిపోయింది.
  • తమ కెరీర్‌లో ఫైనల్ చేరుకున్న తొలి మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లోనూ గెలిచిన ఐదో క్రీడాకారిణి ఒసాకా. మోనికా సెలెస్ అయితే వరుసగా ఆరు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్‌లో టైటిల్ విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : జపాన్ యువతార నయోమి ఒసాకా
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
Published date : 14 Sep 2020 06:10PM

Photo Stories