వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం ప్రారంభం
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో సర్వే రాయి వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్ 21న ఈ పథకాన్ని ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టు కింద రీ సర్వే పూర్తయిన తక్కెళ్లపాడులో రైతులు, స్థిరాస్తి యజమానులకు ముఖ్యమంత్రి హక్కు పత్రాలను అందజేశారు. ఆధునిక విధానంలో రూపొందించిన సర్వే మ్యాపు (గ్రామపటాన్ని) పరిశీలించారు. పథకం ప్రారంభం సందర్భంగా జగ్గయ్య పేటలో నిర్వహించిన సభలో సీఎం ప్రసంగించారు.
భూ రక్ష పథకం గురించి...
- దీర్ఘకాలంగా నెలకొన్న భూ వివాదాలను పరిష్కరించి యజమానులకు స్థిరాస్తులపై శాశ్వత హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది.
- పథకంలో డిసెంబర్ 22న ప్రతి జిల్లాలో ఒక గ్రామంలో రీసర్వే పనులు ప్రారంభమయ్యాయి.
- తదుపరి వారం రోజుల్లో ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఒక గ్రామంలోనూ, ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో ప్రతి మండలంలో ఒకటి చొప్పున 670 గ్రామాల్లో రీసర్వే ప్రారంభమవుతుంది.
- తదుపరి మొదటి విడత నిర్ణయించిన 5,122 గ్రామాల్లో ఈ ప్రక్రియ ఆరంభమవుతుంది.
- రెండో దశలో 6000, మూడో దశలో మిగిలిన గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి 2023 ఆగస్టు నాటికి రాష్ట్రమంతా రీసర్వే పూర్తి చేస్తారు.
- రాష్ట్రవ్యాప్తంగా అటవీ ప్రాంతం మినహా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులు (ఇళ్లు, స్థలాలు) ప్రతి అంగుళం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొలుస్తారు.
- 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల (1.26 కోట్ల హెక్టార్ల ) పరిధిలో ప్రతి సెంటు భూమి/ స్థలం కొలిచి సరిహద్దులు నిర్ణయిస్తారు. మ్యాపులు తయారు చేస్తారు.
- భూసర్వే కోసం సర్వే ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
- ప్రజలపై పైసా కూడా భారం మోపకుండా మొత్తం సర్వే ఖర్చు రూ.1,000 కోట్లను ప్రభుత్వమే భరిస్తుంది.
ముఖ్యమంత్రి ప్రసంగం-ముఖ్యాంశాలు
- మీ ఆస్తులకు మనందరి ప్రభుత్వం హామీగా ఉంటుందని భూ రక్ష పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఇందుకోసమే అసెంబ్లీలో ల్యాండ్ టైట్లింగ్ చట్టం - 2020ను ఆమోదించాం.
- 1920లో బ్రిటీష్ హయాం తరువాత ఇప్పటి వరకూ భూముల రీసర్వే జరగలేదు.
- 4,500 సర్వే బృందాలతో సర్వే చేసి ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత ఆస్తి హక్కు పత్రం యజమానులకు ఇస్తాం. మిల్లీమీటర్లతో సహా కొలిచి మ్యాపు కూడా ఇస్తాం.
- ప్రతి రెవెన్యూ విలేజ్ పరిధిలో విలేజ్ మ్యాప్ ఉంటుంది.
- ప్రతి ఒక్కరి భూమికి ఆధార్ నెంబర్ మాదిరిగా యూనిక్ ఐడీ నెంబర్ కేటాయిస్తాం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : తక్కెళ్లపాడు, జగ్గయ్యపేట మండలం, కృష్ణా జిల్లా
ఎందుకు : పొలం గట్ల తగాదాలు, భూ వివాదాల పరిష్కారం, ప్రజల ఆస్తులకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో