Skip to main content

ఉన్నావ్ అత్యాచారం కేసులో సెంగార్‌కు జీవిత ఖైదు

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఉన్నావ్ అత్యాచారం కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
Current Affairsసెంగార్ తన తుది శ్వాస విడిచేవరకు జైలు జీవితం గడపాలని స్పష్టం చేసింది. ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు జిల్లా న్యాయమూర్తి జస్టిస్ ధర్మేశ్ శర్మ డిసెంబర్ 20న తుది తీర్పు వెలువరించారు. నెల రోజుల్లోగా రూ.25 లక్షలు జరిమానా కూడా చెల్లించాలని సెంగార్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. జరిమానా చెల్లించకపోతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం యూపీ ప్రభుత్వమే ఆ మొత్తాన్ని కట్టాలని చెప్పారు. నష్ట పరిహారం కింద అదనంగా రూ.10 లక్షలు ఉన్నావ్ బాధితురాలి తల్లికి అందజేయాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో సహ నిందితురాలు శశి సింగ్‌ను నిర్దోషిగా ప్రకటించారు.

అందుకే జీవిత ఖైదు...
మైనర్‌లపై అత్యాచార నేరానికి గాను పోక్సో చట్టం కింద మరణ శిక్ష విధించాలి కానీ, ఈ నేరం జరిగిన 2017లో ఆ చట్టానికి సవరణలు జరగలేదు. అందుకే సెంగార్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది.

కిడ్నాప్, గ్యాంగ్‌రేప్, కస్టడీ డెత్..
ఉద్యోగం కోసం వెళ్లిన బాధితురాలిపై బీజేపీకి చెందిన ఎమ్మెల్యే సెంగార్ 2017 జూన్ 4వ తేదీన అత్యాచారానికి పాల్పడ్డాడు. సెంగార్ అనుచరులు ఆమెను కిడ్నాప్ చేసి గ్యాంగ్‌రేప్ చేశారు. ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదు. 2018 ఏప్రిల్‌లో బాధితురాలి తండ్రిపై దాడి జరిగింది. దీంతో బాధితురాలు ముఖ్యమంత్రి నివాసం ఎదుటే ఆత్మాహుతికి యత్నించింది. అనంతరం బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలోనే చనిపోయాడు. ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సెంగార్‌ను సీబీఐ అరెస్ట్ చేిసినా బెదిరింపులు వస్తున్నాయంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బాధితురాలు లేఖ రాసింది. ఆ తర్వాత ఆమె ప్రయాణిస్తున్న కారుని ఒక లారీ ఢీకొంది. దీంతో సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించిన కేసులన్నిటి ఢిల్లీ కోర్టుకు మార్చాలని ఆదేశించింది.
Published date : 21 Dec 2019 05:59PM

Photo Stories