Skip to main content

ఉగ్రవాదంతో ట్రిలియన్ డాలర్ల నష్టం: మోదీ

బ్రసీలియా: ఉగ్రవాదం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు లక్ష కోట్ల డాలర్ల వరకు నష్టం వాటిల్లిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఉగ్రవాదం కారణంగా నెలకొన్న పరిస్థితులు వాణిజ్య, వ్యాపార రంగాలను పరోక్షంగానైనా, లోతుగా దెబ్బతీశాయన్నారు. 11వ బ్రిక్స్ సదస్సులో భాగంగా జరిగిన ప్లీనరీ సమావేశంలో నవంబర్ 14న మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరులో బ్రిక్స్ దేశాల సహకారాన్ని మోదీ ప్రశంసించారు. బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలోని ప్రఖ్యాత తమారటి ప్యాలెస్‌లో జరిగిన సమావేశంలో ఇతర సభ్యదేశాలైన బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల అధినేతల సమక్షంలో మోదీ మాట్లాడుతూ.. అభివృద్ధికి, శాంతి, సౌభాగ్యాలకు ఉగ్రవాదం పెను ముప్పుగా పరిణమించిందన్నారు. ‘ఒక అంచనా ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికాభివృద్ధి ఉగ్రవాదం కారణంగా 1.5% తగ్గింది. గత పదేళ్లలో ఉగ్రవాదం కారణంగా 2.25 లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు’ అని వివరించారు. పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, జల నిర్వహణ సవాలుగా మారాయని, బ్రిక్స్ దేశాల తొలి జలవనరుల మంత్రుల సమావేశాన్ని భారత్‌లో నిర్వహించాలని అనుకుంటున్నామని మోదీ తెలిపారు. ‘ఇటీవలే భారత్‌లో ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించాం. ఫిట్‌నెస్, ఆరోగ్యం విషయాల్లో సభ్య దేశాల సంప్రదింపులు మరింత పెరగాలని కోరుకుంటున్నా’ అన్నారు. ‘ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ దేశాల మధ్య జరిగే వాణిజ్యం వాటా కేవలం 15 శాతమే. కానీ ఈ ఐదు దేశాల మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో 40% పైగా ఉంది. అందువల్ల వాణిజ్యం, పెట్టుబడుల్లో ద్వైపాక్షిక సహకారంపై బ్రిక్స్ దేశాలు దృష్టి పెట్టాల్సి ఉంది. వచ్చే 10 సంవత్సరాల్లో బ్రిక్స్ దిశ ఎలా ఉండాలో చర్చించాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. ఈ సదస్సుకు ‘సృజనాత్మక భవితకు ఆర్థికాభివృద్ధి’ అనే థీమ్ సరైనదని మోదీ అభిప్రాయపడ్డారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి:
ఉగ్రవాదం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు లక్ష కోట్ల డాలర్ల వరకు నష్టం
ఎప్పుడు: నవంబర్ 14, 2019
ఎవరు: భారత్ ప్రధాని మోదీ
ఎక్కడ: బ్రెజిల్ (బ్రసీలియా)
Published date : 15 Nov 2019 05:11PM

Photo Stories