Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 14 కరెంట్‌ అఫైర్స్‌

PM Gati Shakti

PM Modi: గతి శక్తి–నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ లక్ష్యం?

దేశాన్ని రోడ్డు, రైలు, విమానం, విద్యుత్తు, ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ వ్యవస్థలతో అనుసంధానించేందుకు రూ.100 లక్షల కోట్లతో అమలు చేసే ‘‘పీఎం గతిశక్తి – నేషనల్‌ మాస్టర్‌ప్లాన్‌’’ కార్యక్రమం ప్రారంభమైంది. అక్టోబర్‌ 13న ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ... దేశంలో బహుముఖ అనుసంధానమే లక్ష్యంగా చేపట్టిన గతిశక్తితో రాబోయే 25 ఏళ్ల భారతావనికి పునాది పడిందని చెప్పారు. ఇది 21వ శతాబ్దిలో భారతదేశానికి నూతన ఉత్తేజాన్ని అందిస్తుందని వివరించారు. ప్రగతి మైదాన్‌లో నూతన అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌ కాంప్లెక్స్‌ను కూడా మోదీ ప్రారంభించారు.

ఏమిటీ ‘గతిశక్తి’? 
5 ట్రిలియన్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకొనే క్రమంలో గతిశక్తి మాస్టర్‌ ప్లాన్‌ ఎంతో ఉపకరిస్తుందని కేంద్రం విశ్వసిస్తోంది. గతకాలపు బహుళ సమస్యలను పరిష్కరించడంతోపాటు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుల భాగస్వాముల కోసం ‘గతిశక్తి’ని తీసుకొచ్చారు.

ఆరు స్తంభాల పునాదితో.. 

 • ప్రాధాన్యీకరణ: దీనిద్వారా వివిధ శాఖలు, విభాగాలు ఇతర రంగాలతో సంప్రదింపుల ద్వారా తమ ప్రాజెక్టుల ప్రాధాన్యాన్ని నిర్ణయించుకోగల అవకాశం లభిస్తుంది.
 • గరిష్టీకరణ: వివిధ మంత్రిత్వ శాఖలు తమ ప్రాజెక్టు ప్రణాళికలను రూపొందించుకోవడంలో జాతీయ బృహత్‌ ప్రణాళిక తోడ్పాటునిస్తుంది. 
 • కాల సమన్వయం: ప్రాజెక్టుల ప్రణాళిక, అమలులో వివిధ శాఖలు, విభాగాల మధ్య సమన్వయం లోపించి, పనులు జాప్యమవుతాయి. ‘పీఎం గతిశక్తి’ వీటికి స్వస్తి పలుకుతుంది. 
 • విశ్లేషణాత్మకత: 200కిపైగా అంచెలు గల విశ్లేషణాత్మక అంతరిక్ష ఉపకరణాల ఆధారిత గణాంకాలన్నిటినీ ఈ ప్రణాళిక అందుబాటులోకి తెస్తుంది. 
 • గతిశీలత: ‘జీఐఎస్‌’ సాయంతో అన్ని శాఖలు, విభాగాలు ఇతర శాఖలకు చెందిన ప్రాజెక్టులను సమీక్షించే సౌలభ్యం ఉంటుంది. ఆ మేరకు ప్రాజెక్టుల ప్రగతి వివరాలను(ఉపగ్రహ చిత్రాలు కూడా) క్రమబద్ధంగా పోర్టల్‌లో నమోదు చేస్తారు.
 • సమగ్రత: పలు శాఖలు, విభాగాలకు సంబంధించిన ప్రస్తుత, ప్రణాళికల రూపంలో గల అన్ని ప్రాజెక్టులనూ కేంద్రీకృత పోర్టల్‌తో అనుసంధానిస్తారు. దీంతో అన్ని శాఖలు, విభాగాలకు అన్ని ప్రాజెక్టులపై అవగాహన పెరుగుతుంది. తద్వారా ఆయా ప్రాజెక్టులను సకాలంలో, సమగ్రంగా పూర్తి చేసేందుకు వీలుంటుంది.

ముఖ్యాంశాలు...

 • 16 మంత్రిత్వ శాఖల సమన్వయంతో చేపట్టే గతిశక్తి కార్యక్రమం ద్వారా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల ముఖచిత్రం సమూలంగా మారనుంది.
 • పరిశ్రమల్లో ఉత్పాదకత పెరిగేందుకు, స్థానిక తయారీదారులకు తోడ్పాటు అందించేందుకు, పరిశ్రమలో పోటీతత్వం పెంచేందుకు అలాగే భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక మండళ్లను తీర్చిదిద్దేందుకు ఇది ఉపయోగపడనుంది.
 • ఇన్‌ఫ్రా కనెక్టివిటీ ప్రాజెక్టుల సమన్వయం కోసం 16 శాఖలు 2024–25 నాటికి పూర్తయ్యే ప్రాజెక్టుల వివరాలను గతిశక్తి డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో అందుబాటులో ఉంచుతాయి.
 • పీఎం గతిశక్తి లక్ష్యాల్లో కొన్ని (2024–25 కల్లా సాధించేందుకు..)
 • రైల్వే కార్గో హ్యాండ్లింగ్‌ సామర్థ్యాన్ని 1,210 మిలియన్‌ టన్నుల నుంచి 1,600 మిలియన్‌ టన్నులకు పెంచడం.
 • ఓడరేవుల్లో కార్గో సామర్థ్యం 1,282 మిలియన్‌ టన్నుల నుంచి 1,759 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు చేర్చడం. 
 • జాతీయ జల రవాణా మార్గం నుంచి సరకు రవాణాను 74 మిలియన్‌ టన్నుల నుంచి 95 మిలియన్‌ టన్నులకు పెంచడం.
 • 2027 కల్లా అన్ని రాష్ట్రాలను ట్రంక్‌ న్యాచురల్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానించడం.
 • 202 ఫిషింగ్‌ క్లస్టర్లు/హార్బర్లు/ల్యాండింగ్‌ సెంటర్ల అభివృద్ధి.
 • 220 విమానాశ్రయాలు, హెలిప్యాడ్లు, వాటర్‌ ఏరోడ్రోమ్స్‌ అందుబాటులోకి తీసుకురావడం.
 • 197 మెగా ఫుడ్‌పార్కులు, ఆగ్రోప్రాసెసింగ్‌ సెంటర్ల ఏర్పాటు. ఆహారశుద్ధి సామర్థ్యం 222 లక్షల టన్నుల నుంచి 847 లక్షల టన్నులకు పెంపు.
 • 90 మెగా టెక్స్‌టైల్‌ పార్కుల నిర్మాణం.
 • 38 ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటుచేసి, అక్కడి ఉత్పత్తి సామర్థ్యాన్ని రూ.15 లక్షల కోట్లకు చేర్చడం.
 • ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో 23 క్లస్టర్ల ఏర్పాటు.
 • 109 ఫార్మా, మెడికల్‌ డివైజ్‌ క్లస్టర్ల ఏర్పాటు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : పీఎం గతిశక్తి – నేషనల్‌ మాస్టర్‌ప్లాన్‌ ఆవిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్‌ 13
ఎవరు    : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ    : ప్రగతి మైదాన్, న్యూఢిల్లీ
ఎందుకు : దేశాన్ని రోడ్డు, రైలు, విమానం, విద్యుత్తు, ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ వ్యవస్థలతో అనుసంధానించేందుకు...


Venkaiah Naidu: అరుణాచల్‌లో ఉపరాష్ట్రపతి పర్యటనపై అభ్యంతరం తెలిపిన దేశం?

Venkaiah Naidu

భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఇటీవల సాగించిన అరుణాచల్‌ ప్రదేశ్‌ పర్యటన పట్ల డ్రాగన్‌ దేశం చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారతదేశ నాయకులు అరుణాచల్‌లో పర్యటించడాన్ని తాము కచ్చితంగా, గట్టిగా వ్యతిరేకిస్తామని చెప్పింది. అరుణాచల్‌ రాష్ట్రాన్ని తాము ఇండియాలో భాగంగా గుర్తించడం లేదని తెలిపింది. అది దక్షిణ టిబెట్‌లో ఒక భాగమని పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జవో లిజియాన్‌ అక్టోబర్‌ 13న మీడియాతో మాట్లాడారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య అక్టోబర్‌ 9న అరుణాచల్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా సమావేశమైన రాష్ట్ర అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు.

మా దేశంలో అంతర్భాగం: భారత్‌   
చైనా అభ్యంతరాలపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. అరుణాచల్‌ తమ దేశంలో విడదీయలేని అంతర్భాగమని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ తేల్చిచెప్పారు. ఇతర రాష్ట్రాల్లో పర్యటించినట్లుగానే అరుణాచల్‌లోనూ పర్యటిస్తారని, ఇందులో మార్పేమీ ఉండదని స్పష్టం చేశారు.

కొన్ని అంతర్జాతీయ సరిహద్దులు

 • రాడ్‌క్లిఫ్‌: ఇండియా–పాకిస్తాన్‌
 • డ్యూరాండ్‌లైన్‌: ఇండియా– పాకిస్తాన్‌– ఆఫ్గనిస్తాన్‌
 • మెక్‌మోహన్‌: ఇండియా– చైనా
 • హెడెన్‌ బర్గ్‌లైన్‌: తూర్పు– పశ్చిమ జర్మనీ
 • సిన్‌స్టన్‌: టర్కీ– గ్రీస్‌
 • సియాచిన్‌ గ్లేసియర్‌: ఇండియా– పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త ప్రాంతం
 • కారకోరం : చైనా– పాకిస్థాన్‌ మధ్య రవాణా రహదారి
 • 24 డిగ్రీల అక్షాంశం: ఇండియా– పాకిస్తాన్‌
 • మెకాంగ్‌ నది: కాంబోడియా– థాయ్‌లాండ్‌
 • సాల్విన్‌ నది: మయన్మార్‌– థాయ్‌లాండ్‌
 • డాన్యూబ్‌ నది : రుమేనియా, బల్గేరియా– యుగేస్లేవియా
 • ఉరుగ్వే నది: ఉరుగ్వే– బ్రెజిల్‌
 • పరాన నది: పెరుగ్వే– అర్జెంటీనా– బ్రెజిల్‌


Abortion limit: గర్భ విచ్ఛిత్తి చేసుకోవడానికి గరిష్ట పరిమితి ఎన్ని వారాలు?

Pregnancy

గర్భ విచ్ఛిత్తిపై కేంద్ర ప్రభుత్వం నూతన నిబంధనలను తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రత్యేక కేటగిరీల మహిళలకు గర్భ విచ్ఛిత్తి(అబార్షన్‌) గరిష్ట పరిమితిని 20 వారాల నుంచి 24 వారాలకు పెంచేందుకు ఉద్దేశించిన మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ(సవరణ) చట్టం–2021ను అక్టోబర్‌ 13న నోటిఫై చేసింది. 2021, మార్చి నెలలో పార్లమెంట్‌ ఆమోదం పొందిన ఈ చట్టం ప్రకారం... లైంగిక వేధింపులు, అత్యాచారాలు, మైనర్లు, గర్భధారణ సమయంలో వైధవ్యం పొందడం, విడాకులు తీసుకోవడం, మానసిక అనారోగ్యం ఉన్నవారు, పిండం పూర్తిగా రూపం దాల్చని పరిస్థితుల్లో ఉన్నవారు, ప్రభుత్వం ఆత్యయిక స్థితిని ప్రకటించినపుడు, విపత్తు సమయాల్లో గర్భం దాల్చిన వారు 24 వారాల్లోగా గర్భ విచ్ఛిత్తి చేసుకోవచ్చు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ(సవరణ) చట్టం–2021 అమలు 
ఎప్పుడు : అక్టోబర్‌ 13
ఎవరు    : భారత ప్రభుత్వం
ఎక్కడ    : దేశవ్యాప్తంగా...
ఎందుకు : ప్రత్యేక కేటగిరీల మహిళలకు గర్భ విచ్ఛిత్తి(అబార్షన్‌) గరిష్ట పరిమితిని 20 వారాల నుంచి 24 వారాలకు పెంచేందుకు...


RECAI: ఆర్‌ఈ రంగం పెట్టుబడుల్లో భారత్‌ స్థానం?

Renewble Energy

పునరుత్పాదక విద్యుత్‌ (ఆర్‌ఈ) రంగంలో పెట్టుబడులకు ఆకర్షణీయమైన దేశాల సూచీలో (రెన్యువ‌బుల్ ఎన‌ర్జీ కంట్రీ అట్రాక్టివ్‌నెస్ ఇండెక్స్ - ఆర్‌ఈసీఏఐ) తొలి 3 దేశాలు ఈసారి కూడా తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి. అమెరికా అగ్రస్థానంలో ఉండగా, చైనా రెండో స్థానంలోనూ, భారత్‌ యథాప్రకారం 3వ స్థానంలోనూ కొనసాగుతున్నాయి. ఆర్‌ఈసీఏఐకి సంబంధించి కన్సల్టెన్సీ సంస్థ ఈవై అక్టోబర్‌ 13న విడుదల చేసిన 58వ ఎడిషన్‌ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆర్‌ఈ విభాగంలో పెట్టుబడి అవకాశాలకు ఆకర్షణీయంగా ఉన్న టాప్‌ 40 దేశాలతో ఈవై ఈ జాబితా రూపొందించింది.

పీపీఏ సూచీలో 30 స్థానం...
పునరుత్పాదక విద్యుత్‌ కొనుగోళ్లలో ఆకర్షణీయతకు కొలమానంగా కొత్తగా పీపీఏ సూచీని కూడా ప్రవేశపెట్టినట్లు కన్సల్టెన్సీ సంస్థ ఈవై వివరించింది. దీనికి సంబంధించి టాప్‌ 30 పీపీఏ మార్కెట్లలో భారత్‌కు ఆరో ర్యాంక్‌ దక్కినట్లు పేర్కొంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : పునరుత్పాదక విద్యుత్‌ (ఆర్‌ఈ) రంగంలో పెట్టుబడులకు ఆకర్షణీయమైన దేశాల సూచీలో (ఆర్‌ఈసీఏఐ) భారత్‌కు 3వ స్థానం
ఎప్పుడు : అక్టోబర్‌ 13
ఎవరు : కన్సల్టెన్సీ సంస్థ ఈవై
ఎక్కడ : ఆర్‌ఈ విభాగంలో పెట్టుబడి అవకాశాలకు ఆకర్షణీయంగా ఉన్న టాప్‌ 40 దేశాల్లో...
 

Hurun india Rich List: 40 ఏళ్లలోపు సంపన్నుల్లో అగ్రస్థానంలో నిలిచిన వ్యక్తి?

Rupees

40 ఏళ్లలోపే రూ.1,000 కోట్లకు పైగా సంపదను సమకూర్చుకున్న వ్యాపార విజేతలతో రూపొందించిన ‘ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురూన్‌ ఇండియా 40, అండర్‌ సెల్ఫ్‌మేడ్‌ రిచ్‌లిస్ట్‌ 2021’ను హురూన్‌ ఇండియా అక్టోబర్‌ 13న విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రముఖ వ్యాపారవేత్త, మీడియా డాట్‌ నెట్‌ వ్యవస్థాపకుడు, 39 ఏళ్ల దివ్యాంక్‌ తురాఖియా రూ.12,500 కోట్లతో అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత బ్రౌజర్‌స్టాక్‌ సహ వ్యవస్థాపకులు నకుల్‌అగర్వాల్‌(38), రితేష్‌ అరోరా(37)... చెరో రూ.12,400 కోట్ల విలువతో రెండో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు.

ముఖ్యాంశాలు...

 • జాబితాలో మొత్తం 45 వ్యాపారవేత్తలకు స్థానం లభించింది. ఇందులో 42 మంది భారత్‌లో నివసిస్తున్నారు. జాబితాలో 31 మంది కొత్తవారే ఉన్నారు. ఇందులోనూ 30 మంది స్టార్టప్‌లతో సంపద సృష్టించుకున్నారు.
 • బెంగళూరు ఎక్కువ మందికి ఆశ్రయమిచ్చింది. జాబితాలో 15 మంది ఈ నగరంలోనే నివసిస్తున్నారు. ఆ తర్వాత ఢిల్లీ 8 మంది, ముంబై 5, గురుగ్రామ్‌ 3, థానె ఇద్దరికి చొప్పున నివాస కేంద్రంగా ఉంది.
 • సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సేవలు (12 మంది), రవాణా అండ్‌ లాజిస్టిక్స్‌ (5 మంది), రిటైల్‌ (5 మంది), ఎంటర్‌టైన్‌మెంట్‌ (5 మంది), ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రంగం నుంచి 5 మంది చొప్పున ఇందులో ఉన్నారు.
 • 2021 సెప్టెంబర్‌ 15 నాటి గణాంకాలను ఈ జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకున్నారు.

40 ఏళ్లలోపు టాప్‌–10 సంపన్న వ్యాపారులు

ర్యాంకు పేరు  సంపద విలువ (రూ.కోట్లలో) కంపెనీ
1 దివ్యాంక్‌ తురాఖియా 12,500 మీడియాడాట్‌నెట్‌ 
2 నకుల్‌ అగర్వాల్‌ 12,400   బ్రౌజర్‌స్టాక్‌    
3 రితేష్‌ అరోరా 12,400 బ్రౌజర్‌స్టాక్‌
4 నేహ నర్కెడే, కుటుంబం 12,200 కన్‌ఫ్లూయంట్‌ 
5 నిఖిల్‌ కామత్‌  11,100 జెరోదా
6 రిజు రవీంద్రన్‌ 8,100 థింక్‌అండ్‌లెర్న్‌
7 బిన్నీ బన్సల్‌ 8,000      -
8 సచిన్‌ బన్సల్‌  7,800     -
9 భవీష్‌ అగర్వాల్‌   7,500 ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌ 
10 రితేష్‌ అగర్వాల్‌ 6,300  ఓర్వెల్‌స్టేస్‌

క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    : ఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురూన్‌ ఇండియా 40, అండర్‌ సెల్ఫ్‌మేడ్‌ రిచ్‌లిస్ట్‌ 2021లో అగ్రస్థానంలో నిలిచిన వ్యాపారవేత్త?
ఎప్పుడు : అక్టోబర్‌ 13
ఎవరు    : మీడియా డాట్‌ నెట్‌ వ్యవస్థాపకుడు, 39 ఏళ్ల దివ్యాంక్‌ తురాఖియా
ఎందుకు : 40 ఏళ్లలోపు వారిలో అత్యధికంగా రూ.12,500 కోట్లతో సంపదను సమకూర్చుకున్నందున...


France: యాంబిషన్‌ ఇండియా సదస్సులో పాల్గొననున్న మంత్రి?

KTR

ఐరాపా దేశం ఫ్రాన్స్‌ సెనేట్‌లో అక్టోబర్‌ 29న జరిగే ‘యాంబిషన్‌ ఇండియా బిజినెస్‌ ఫోరం 2021’ సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు పాల్గొననున్నారు. ఈ మేరకు సదస్సులో ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించాల్సిందిగా ఫ్రాన్స్‌ ప్రభుత్వం కేటీఆర్‌ను ఆహ్వానించింది. తమ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ సారథ్యంలో జరిగే ఈ సదస్సుతో రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు బలోపేతం అవుతాయని కేటీఆర్‌కు పంపిన లేఖలో ఫ్రాన్స్‌ ప్రభుత్వం పేర్కొంది. కోవిడ్‌ తదనంతరం భారత్, ఫ్రాన్స్‌ సంబంధాల్లో అభివృద్ధి, భవిష్యత్తు నిర్మాణం అనే అంశంపై ప్రసంగించాలని కోరింది. ముఖ్యంగా ఈ సదస్సులో ఆరోగ్య రక్షణ, వాతావరణ మార్పులు, వ్యవసాయ వాణిజ్యం వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతుందని వివరించింది.
క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    : యాంబిషన్‌ ఇండియా బిజినెస్‌ ఫోరం 2021 సదస్సులో పాల్గొననున్న రాష్ట్ర మంత్రి?
ఎప్పుడు  : అక్టోబర్‌ 13
ఎవరు    : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు 
ఎక్కడ : ఫ్రాన్స్‌ సెనేట్, పారిస్, ఫ్రాన్స్‌
ఎందుకు  : ఫ్రాన్స్‌ ప్రభుత్వ ఆహ్వానం మేరకు...


Andhra Pradesh: రాష్ట్ర హైకోర్టు సీజేగా ప్రమాణం చేసిన న్యాయమూర్తి?

Justice Prashant Kumar Mishra

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ప్రమాణం చేశారు. అక్టోబర్‌ 13న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్‌ మిశ్రా చేత గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తుల నియామకంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ అక్టోబర్‌ 13న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం సీజే కాకుండా పది మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఈ ఏడుగురి నియామకంతో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 17కు చేరనుంది. కొత్తగా నియమితులైన నలుగురు మహిళా న్యాయమూర్తులతో మొత్తం మహిళా జడ్జిల సంఖ్య 5కు చేరింది. హైకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 5కు చేరడం ఇదే తొలిసారి.

కొత్త న్యాయమూర్తులు వీరే.. 

 • పి.శ్రీసుధ: 1967, జూన్‌ 6న జన్మించారు. తొలుత నిజామాబాద్‌ అదనపు జిల్లా జడ్జిగా 2002లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. వివిధ స్థాయిలో పనిచేసిన ఆమె ప్రస్తుతం కో–ఆపరేటివ్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా ఉన్నారు. 
 • డాక్టర్‌ సి.సుమలత: 1972, ఫిబ్రవరి 5న నెల్లూరు జిల్లాలో జన్మించారు. 2006లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా ఉన్నారు. 
 • డాక్టర్‌ జి.రాధారాణి: 1963, జూన్‌ 29న జన్మించారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా చీఫ్‌ జడ్జిగా ఉన్నారు. 
 • ఎం.లక్ష్మణ్‌: వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఈయన 1965, డిసెంబర్‌ 24న జన్మించారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తు తం లేబర్‌ కోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. 
 • ఎన్‌.తుకారాంజీ: 1973, ఫిబ్రవరి 24న జన్మిం చారు. 2007లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌ క్రిమినల్‌ కోర్టుల మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జిగా ఉన్నారు. 
 • ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి: 1961, ఏప్రిల్‌ 1న జన్మించారు. 1994లో జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం సిటీ సివిల్‌ ఆవరణలోని స్మాల్‌ కాజెస్‌ చీఫ్‌ జడ్జిగా పనిచేస్తున్నారు. 
 • పి.మాధవిదేవి: ఆదాయ పన్నుశాఖ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఐటీఏటీ) జ్యుడిషియల్‌ సభ్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు.

క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : అక్టోబర్‌ 13
ఎవరు    : జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా
ఎక్కడ    : విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : భారత ప్రభుత్వం నిర్ణయం మేరకు...


Malabar Exercise 2021: మలబార్‌ రెండో దశ విన్యాసాలు ఎక్కడ జరుగుతున్నాయి?

Malabar Exercise

అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి భారత నౌకాదళం బంగాళాఖాతంలో నిర్వహిస్తున్న మలబార్‌ రెండో దశ విన్యాసాలు–2021 కొనసాగుతున్నాయి. రెండో రోజు అక్టోబర్‌ అక్టోబర్‌ 13న జరిగిన ప్రదర్శనలో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ రన్‌విజయ్‌(డీ55), ఐఎన్‌ఎస్‌ సత్పుర (ఎఫ్‌ 48) నౌకలు పాల్గొన్నాయి. వీటితో పాటు యూఎస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కారియర్‌ యూఎస్‌ఎస్‌ కారల్‌ విన్సన్, జపనీస్‌ హెలికాఫ్టర్‌ కారియర్‌ జేఎస్‌.. ఇలా తొమ్మిది యుద్ధనౌకలు ఈ విన్యాసాల్లో భాగస్వామ్యమయ్యాయి. ఇండోపసిఫిక్‌ తీర ప్రాంత భద్రతలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంతో మలబార్‌ విన్యాసాలను నిర్వహిస్తున్నారు.

తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
యూఎస్‌ నేవీ ఆపరేషన్స్‌ చీఫ్‌ అడ్మిరల్‌ మైఖిల్‌ గిల్డే సతీసమేతంగా అక్టోబర్‌ 13న విశాఖపట్నంలోని తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా విశాఖకు వచ్చిన ఆయన తూర్పునావికాదళపతి వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌తో సమావేశమై పలు విషయాలపై చర్చించారు.

రెండంకెల వృద్ధికి చేరువలో భారత్‌
అమెరికాలోని కేంబ్రిడ్జ్‌లో ఉన్న హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్లో అక్టోబర్‌ 13న జరిగిన కార్యక్రమంలో భారత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రసంగించారు. భారత్‌ 2021 ఏడాది రెండంకెల వృద్ధికి చేరువలో ఉందని ఆమె పేర్కొన్నారు.
క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    : మలబార్‌ రెండో దశ విన్యాసాలు–2021
ఎప్పుడు : అక్టోబర్‌ 13
ఎవరు    : భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా నావికాదళాలు
ఎక్కడ    : బంగాళాఖాతం
ఎందుకు : ఇండోపసిఫిక్‌ తీర ప్రాంత భద్రతలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంతో..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 13 కరెంట్‌ అఫైర్స్‌

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 14 Oct 2021 06:58PM

Photo Stories