Daily Current Affairs in Telugu: 2021, అక్టోబర్ 13 కరెంట్ అఫైర్స్
Bharat Biotech: చిన్నారుల కోసం అందుబాటులోకి రానున్న రెండో వ్యాక్సిన్?
చిన్నారులు, యుక్తవయస్కుల వారికి భారత బయోటెక్ టీకా కోవాగ్జిన్‌కు అత్యవసర అనుమతి మంజూరు చేయాలని అక్టోబర్ 12న సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) సిఫారసు చేసింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి కూడా పొందితే చిన్నారులు, యుక్త వయస్కులకు రెండో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినట్లే. 18 ఏళ్లలోపు వారికి జైడస్ క్యాడిలా సూది రహిత ‘జైకోవ్–డి’కి అత్యవసర అనుమతులు ఇప్పటికే అనుమతులు వచ్చిన విషయం తెలిసిందే.
2–18 ఏళ్ల బాలలకు...
హైదరాబాద్‌కు చెందిన భారత బయోటెక్ 2–18 ఏళ్ల బాలలకు ఫేజ్2/3 ట్రయల్స్ పూర్తి చేసి 2021, అక్టోబర్ మొదట్లో అత్యవసర అనుమతి నిమిత్తం సీడీఎస్‌సీఓకు దరఖాస్తు చేసింది. దీన్ని పరీశిలించిన సీడీఎస్‌సీవో విషయ నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) అత్యవసర పరిస్థితుల్లో పరిమిత వినియోగం నిమిత్తం టీకా మార్కెట్ అధికారాన్ని మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. ఈ సిఫారసులను తుది అనుమతి నిమిత్తం డీసీజీఐకు పంపుతారు. డీసీజీఐ కూడా అంగీకరిస్తే చిన్నారులకు అందుబాటులోకి వచ్చే రెండో కరోనా టీకా కోవాగ్జిన్ అవుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2–18 ఏళ్ల బాలలకు కోవాగ్జిన్ టీకా ఇచ్చేందుకు అత్యవసర అనుమతి మంజూరు చేయాలని సిఫారసు
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో)
ఎందుకు : కోవిడ్–19ను నివారించేందుకు...
G20 Countries: జీ–20 శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షత వహించిన దేశం?
అఫ్గానిస్తాన్‌లో మానవ హక్కులు, భద్రత, ప్రజల అగచాట్లు, ఉగ్రవాదంపై పోరాటం వంటి అంశాలపై చర్చించేందుకు గ్రూప్ ఆఫ్ 20(జీ–20) దేశాల అధినేతలు(G20 Extraordinary Leaders’ Summit on Afghanistan) అక్టోబర్ 12న వర్చువల్ విధానం ద్వారా సమావేశమయ్యారు. జీ–20 అధ్యక్ష హోదాలో ఇటలీ ప్రధాని మారియో ద్రాగి నేతృత్వంలో జరిగిన ఈ భేటీనుద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఏకీకృత ప్రతిస్పందన అవసరమని అంతర్జాతీయ సమాజానికి పిలుపు నిచ్చారు. ఆకలి, పోషకాహార సమస్యతో అల్లాడుతున్న అఫ్గాన్ పౌరులకు తక్షణమే బేషరతుగా మానవతా సాయం అందించాలని కోరారు. 20 ఏళ్లుగా అఫ్గాన్ సమాజం సాధించిన అభివృద్ధిని కొనసాగించేం దుకు తాలిబన్ల పాలనలో మహిళలు, మైనారిటీలకు తగు చోటు కల్పించాలని అన్నారు.
జీ–20 సభ్యదేశాలు...
జీ–20(గ్రూప్ ఆఫ్ 20) అనేది ప్రపంచంలోని 20 అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల కూటమి. ఇందులో 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ (ఈయూ)కు సభ్యత్వం ఉంది. సభ్యదేశాలు ఇవే..
- అర్జెంటీనా
- ఆస్ట్రేలియా
- బ్రెజిల్
- కెనడా
- చైనా
- ఫ్రాన్స్
- జర్మనీ
- భారత్
- ఇండోనేషియా
- ఇటలీ
- జపాన్
- మెక్సికో
- రష్యా
- సౌదీ అరేబియా
- దక్షిణ కొరియా
- దక్షిణాఫ్రికా
- టర్కీ
- యునెటైడ్ కింగ్‌డమ్
- యునెటైడ్ స్టేట్స్
- యూరోపియన్ యూనియన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్రూప్ ఆఫ్ 20(జీ–20) దేశాల అధినేతల వర్చువల్ సమావేశం (G20 Extraordinary Leaders’ Summit on Afghanistan)
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : గ్రూప్ ఆఫ్ 20(జీ–20) దేశాల అధినేతలు
ఎందుకు : అఫ్గానిస్తాన్‌లో మానవ హక్కులు, భద్రత, ప్రజల అగచాట్లు, ఉగ్రవాదంపై పోరాటం వంటి అంశాలపై చర్చించేందుకు...
Sainik Schools: దేశవ్యాప్తంగా కొత్తగా ఎన్ని సైనిక పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి?
దేశవ్యాప్తంగా 100 సైనిక పాఠశాలలను కొత్తగా ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. అక్టోబర్ 12న ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2022–23 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న కొత్త సైనిక పాఠశాలల్లో 6వ తరగతిలో 5వేల మంది విద్యార్థులను చేర్చుకుంటారు. వీటి ఏర్పాటులో రాష్ట్రాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 33 సైనిక పాఠశాలల్లో 6వ తరగతి విద్యార్థులు 3వేల మంది ఉన్నారు.
మరోవైపు స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) అటల్ మిషన్ 2025–26 వరకు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. పట్టణ పరివర్తన, పునరుజ్జీవనకు అటల్ మిషన్ ఫర్ రెజునవేషన్, అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) 2.0ను 2025–26 వరకు సాగించేందుకు ఆమోదం తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 100 సైనిక పాఠశాలలను కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయం
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎక్కడ : దేశవ్యాప్తంగా...
Commonwealth Games Federation: కామన్వెల్త్ గేమ్స్‌లో తప్పనిసరి క్రీడాంశాలు ఏవి?
భవిష్యత్‌లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ)లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మేరకు 2026–2030కు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను అక్టోబర్ 12న కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్) జనరల్ అసెంబ్లీ అమోదించింది. ఈ రోడ్‌మ్యాప్ ప్రకారం...
- 2026 నుంచి జరిగే సీడబ్ల్యూజీలో క్రీడాంశాల సంఖ్య తగ్గనుంది. వచ్చే ఏడాది బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో 20 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. 2026 నుంచి క్రీడాంశాల సంఖ్య 15కు తగ్గనుంది.
- 2026 నుంచి ఉండే 15 క్రీడాంశాల్లో అథ్లెటిక్స్, అక్వాటిక్స్ (స్విమ్మింగ్) మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. ఇక మిగిలిన క్రీడాంశాలను కొనసాగించే నిర్ణయాన్ని ఆతిథ్య దేశానికి తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
- ఇక ఆప్షనల్ గ్రూప్‌లో ఉన్న క్రికెట్, 3్ఠ3 బాస్కెట్‌బాల్, బీచ్ వాలీబాల్‌లను కోర్ గ్రూప్‌లోకి మార్చారు.
అందుకే ఈ నిర్ణయం...
కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు తాజా నిర్ణయాలు తీసుకున్నట్లు సీజీఎఫ్ అధ్యక్షురాలు డెమె లూసీ మార్టిన్ తెలిపారు. తాజా మార్పులతో గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చే దేశాలకు లబ్ధి జరగనుంది. తాము ఏ క్రీడాంశాల్లో పతకాలను ఎక్కువగా గెలవగలమో వాటికి ఆ దేశాలు పెద్ద పీట వేస్తాయి. 2026 కామన్వెల్త్ గేమ్స్ వేదిక ఇంకా ఖరారు కాలేదు. సీజీఎఫ్ ప్రధాన కార్యాలయం ఇంగ్లండ్‌లోని లండన్‌లో ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కామన్వెల్త్ గేమ్స్‌కు సంబంధించిన రోడ్‌మ్యాప్: 2026–2030కు ఆమోదం
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్) జనరల్ అసెంబ్లీ
ఎక్కడ : లండన్, ఇంగ్లండ్
ఎందుకు : కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు...
2022 FIFA World Cup: 2022 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు అర్హత సాధించిన తొలి జట్టు?
2022 ఏడాది ఖతర్‌లో జరిగే ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా జర్మనీ ఫుట్‌బాల్ జట్టు గుర్తింపు పొందింది. యూరోపియన్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా నార్త్ మెసిడోనియా రాజధాని స్కోప్జే నగరంలో అక్టోబర్ 12న జరిగిన గ్రూప్ ‘జె’ లీగ్ మ్యాచ్‌లో జర్మనీ 4–0తో నార్త్ మెసిడోనియా జట్టుపై నెగ్గింది. దీంతో ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. యూరోపియన్ జోన్ నుంచి మొత్తం 13 బెర్త్‌లు ఉండగా గతంలో నాలుగుసార్లు (1954, 1974, 1990, 2014) విశ్వవిజేతగా నిలిచిన జర్మనీ మొదటి బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఆరు జట్లున్న గ్రూప్ ‘జె’లో ఎనిమిది లీగ్ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న జర్మనీ ఏడు విజయాలు సాధించి 21 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది.
మొత్తం 32 జట్లు...
2022 ఫిఫా(ఊఐఊఅ ప్రపంచకప్‌లో మొత్తం 32 జట్లు బరిలోకి దిగుతాయి. ఇప్పటికే ఖతర్, జర్మనీ అర్హత పొందగా... వచ్చే ఏడాది జూన్‌లో ముగిసే క్వాలిఫయింగ్ టోర్నీల ద్వారా మరో 30 జట్లు అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశం హోదాలో ఖతర్ జట్టుకు నేరుగా అర్హత కల్పించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2022 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు అర్హత సాధించిన తొలి జట్టు?
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : జర్మనీ ఫుట్‌బాల్ జట్టు
ఎక్కడ : స్కోప్జే, నార్త్ మెసిడోనియా
ఎందుకు : గ్రూప్ ‘జె’ లీగ్ మ్యాచ్‌లో జర్మనీ 4–0తో నార్త్ మెసిడోనియా జట్టుపై నెగ్గినందున...
Maharatna Company Status: ఇటీవల మహారత్న హోదా పొందిన సంస్థ?
విద్యుత్ రంగ ఆర్థిక సేవల దిగ్గజం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్‌సీ)కు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా మహారత్న హోదాను ప్రకటించింది. దీంతో ఆర్థిక, నిర్వహణాపరమైన అంశాలలో మరింత స్వేచ్చ లభించనున్నట్లు పీఎస్‌యూ కంపెనీ పీఎఫ్‌సీ పేర్కొంది. 1986లో ఏర్పాటైన పీఎఫ్‌సీ విద్యుత్ రంగంలో అతిపెద్ద మౌలిక సదుపాయాల ఫైనాన్స్ కంపెనీగా సేవలందిస్తోంది. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీ బోర్డుకు తాజా హోదాతో ఆర్థిక నిర్ణయాలలో మరిన్ని అధికారాలు లభించనున్నాయి. టెక్నాలజీ భాగస్వామ్య సంస్థల ఏర్పాటు, ఇతర వ్యూహాత్మక ఒప్పందాలను సైతం కుదుర్చుకునేందుకు వీలు చిక్కనుంది.
అమెరికా పర్యటనలో మంత్రి నిర్మల...
భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికానిలోని బోస్టస్‌లో అక్టోబర్ 12న ఫిక్కీ, భారత్– అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్) నిర్వహించిన ఇన్వెస్టర్ల రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
యూనికార్న్‌గా మొబిక్విక్...
ఫిన్‌టెక్ కంపెనీ మొబిక్విక్ తాజాగా బిలియన్ డాలర్ల(రూ. 7,550 కోట్లు) విలువైన స్టార్టప్‌గా ఆవిర్భవించింది. కంపెనీ ఉద్యోగులు తమకు కేటాయించిన స్టాక్ ఆప్షన్ల(ఇసాప్‌లు)ను విక్రయించిన నేపథ్యంలో కంపెనీ యూనికార్న్(బిలియన్ డాలర్ కంపెనీ) హోదాను సాధించినట్లు తెలుస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : విద్యుత్ రంగ ఆర్థిక సేవల దిగ్గజం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్‌సీ)కు మహారత్న హోదా ప్రకటన
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : భారత ఆర్థిక శాఖ
ఎందుకు : ఆర్థిక నిర్ణయాలలో సంస్థకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు...
OCTOPUS: అగ్ని పరీక్ష–7లో మొదటి స్థానంలో నిలిచిన జట్టు?
జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) ఇటీవల హరియాణలో నిర్వహించిన ‘అగ్ని పరీక్ష–7’లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్) విభాగం మొదటి స్థానాన్ని దక్కించుకోవడంతో పాటు ఉత్తమ జట్టుగా నిలిచింది. అక్టోబర్ 12న గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ విషయాలను తెలిపారు. ఎన్‌ఎస్‌జీతో పాటు ఎనిమిది రాష్ట్రాలకు చెందిన పోలీస్ బృందాలు ఇందులో పాల్గొనగా ఏపీ ఆక్టోపస్ హెడ్ కానిస్టేబుల్ పాపారావు ఉత్తమ ప్రతిభ కనబరచి ఆల్ రౌండర్‌గా ఎంపికైనట్లు చెప్పారు. ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌లు, వివిధ రకాల ఆయుధాలతో ఫైరింగ్, మారథాన్ రన్నింగ్, శారీరక ధారుడ్య పరీక్షల్లో ఏపీ ఆక్టోపస్ ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు వివరించారు.
కన్నడ, హిందీలోనూ ఎస్వీబీసీ చానళ్లు
దేశ విదేశాల్లో ఉన్న భక్తుల కోసం ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానళ్లను అక్టోబర్ 12న తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల గొల్ల మండపం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే తెలుగు, తమిళంలో ఉన్న చానళ్ల ద్వారా టీటీడీ శ్రీ వేంకటేశ్వర వైభవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెబుతోంది. మరోవైపు సహజ వ్యవసాయ పద్ధతులపై సీఎం జగన్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి ఎంఓయూ పత్రాలను మార్చుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) నిర్వహించిన అగ్ని పరీక్ష–7లో మొదటి స్థానంలో నిలిచిన జట్టు?
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్) విభాగం
ఎక్కడ : హరియాణ
Vishnukundina dynasty: చిక్కుళ్ల శాసనాన్ని వేయించిన విష్ణుకుండినుల పాలకుడు?
విష్ణుకుండినుల హయాంలో నాలుగో శతాబ్దంలో రూపొందిన మహిషాసురమర్ధిని రాతి శిల్పం నల్లగొండ జిల్లాలో వెలుగు చూసింది. జిల్లా కేంద్రంలోని కట్టంగూరు రోడ్డులో పానగల్లుకు 3 కిలోమీటర్ల దూరంలో గల దండంపల్లి శివారులో ఓ చెట్టుకింద దీన్ని కనుగొన్నారు. గతంలో పొలానికి కాలువ తవ్వుతుండగా ఇది బయటపడింది. అక్కడి చెట్టుకింద ఉన్న పురాతన వినాయకుడి విగ్రహం ముందు దీన్ని ఉంచారు. దీన్ని తాజాగా పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి పరిశీలించారు. ఈ విగ్రహాన్ని విష్ణుకుండినుల కాలంనాటిదిగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. రాతి శిల్పం 10 సెం.మీ. పొడవు, 5 సెం.మీ. వెడల్పు, 2 సెం.మీ. మందంతో ఉందని పేర్కొన్నారు.
విష్ణుకుండినులు
విష్ణుకుండిన వంశ స్థాపకుడు– మాధవ వర్మ. పాలమూరు శాసనం విష్ణుకుండినుల వంశ వృక్షం, కాలాన్ని నిర్ణయించడానికి ప్రధాన ఆధారంగా ఉంది. దీన్ని మాధవ వర్మ వేయించారు. వీరి స్వస్థలం ‘వినుకొండ’ అని ‘కేల్ హారన్’ అనే భాషా శాస్త్రవేత్త నిర్ణయించాడు. వీరి కులదైవం ‘శ్రీపర్వత స్వామి’ (శ్రీశైల మల్లికార్జునుడు). విష్ణుకుండినుల్లో మొదటి పాలకుడు ‘ఇంద్రవర్మ’. ఈయన ‘ఇంద్రపాల నగరం’ నిర్మించారు. ఇదే నేటి నల్గొండ జిల్లాలోని ‘తుమ్మల గూడెం’ అని చరిత్రకారుల అభిప్రాయం. చిక్కుళ్ల శాసనం తుమ్మల గూడెం ఉంది.
విష్ణుకుండినుల కాలం నాటిముఖ్యమైన శాసనాలు:
1) చిక్కుళ్ల శాసనం – విక్రమేంద్రవర్మ
2) రామతీర్థం – ఇంద్రవర్మ
3) పాలమూరు – మాధవవర్మ
4) వేల్పూరు – రెండో మాధవవర్మ
క్విక్ రివ్యూ :
ఏమిటి : విష్ణుకుండినుల హయాంలో నాలుగో శతాబ్దంలో రూపొందిన మహిషాసురమర్ధిని రాతి శిల్పం గుర్తింపు
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి
ఎక్కడ : దండంపల్లి, నల్లగొండ సమీపం, నల్లగొండ జిల్లా
చదవండి: Daily Current Affairs in Telugu: 2021, అక్టోబర్ 12 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్