Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, న‌వంబ‌ర్ 13 కరెంట్‌ అఫైర్స్‌

Global Warming

Climate Change: ఐఎస్‌ఏ, యూఎన్‌ఎఫ్‌సీసీసీ మధ్య కుదిరిన ఒప్పంద ఉద్దేశం?

భారత్‌ సారథ్యం వహిస్తున్న అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్‌ఏ), వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌ (యూఎన్‌ఎఫ్‌సీసీసీ) మధ్య కీలకమైన అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) కుదిరింది. యూకేలోని గ్లాస్గోలో కాప్‌–26 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా నవంబర్‌ 12న ఈ అవగాహనా ఒప్పందంపై ఐఎస్‌ఏ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ అజయ్‌ మాథుర్, యూఎన్‌ఎఫ్‌సీసీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ సెక్రెటరీ ఓవైస్‌ సర్మాద్‌ సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా.. దీర్ఘకాలంలో కర్బన ఉద్గారాల తగ్గింపునకు ఈ రెండు సంస్థలు ఉమ్మడిగా వ్యూహాలు రూపొందించనున్నాయి.

సోలార్, క్లీన్‌ ఎనర్జీ వినియోగం ద్వారా...
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడానికి, నేషనల్‌ క్లైమేట్‌ యాక్షన్‌ ప్లాన్‌ అమలుకు ప్రపంచ దేశాలతో కలిసి పని చేస్తామని, తమవంతు సహకారం అందిస్తామని ఐఎస్‌ఏ హామీ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సోలార్, క్లీన్‌ ఎనర్జీ వినియోగానికి పెద్దపీట వేయడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్నదే లక్ష్యమని అజయ్‌ మాథుర్‌ చెప్పారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్‌ఏ), వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌(యూఎన్‌ఎఫ్‌సీసీసీ) మధ్య అవగాహనా ఒప్పందం
ఎప్పుడు : నవంబర్‌ 12
ఎవరు    : ఐఎస్‌ఏ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ అజయ్‌ మాథుర్, యూఎన్‌ఎఫ్‌సీసీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ సెక్రెటరీ ఓవైస్‌ సర్మాద్‌
ఎక్కడ    : గ్లాస్గో, స్కాట్‌లాండ్, యూకే 
ఎందుకు : దీర్ఘకాలంలో కర్బన ఉద్గారాల తగ్గింపునకు ఉమ్మడిగా వ్యూహాలు రూపొందించేందుకు..

 

Conference of the Parties: కాప్‌–26 శిఖరాగ్ర సదస్సుకు ఎవరు అధ్యక్షత వహించారు?

COP26

శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని యూకేలోని గ్లాస్గోలో జరిగిన భాగస్వామ్య పక్షాల (కాప్‌–26) శిఖరాగ్ర సదస్సు–2021 ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. వాతావరణ మార్పులు, వాటి దుష్ప్రభావాలు, వాటిని ఎదుర్కొనేందుకు అమలు చేయాల్సిన వ్యహాలపై చర్చించేందుకు జరిగిన ఈ సదస్సులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలపై ముసాయిదా తుది ప్రకటనను నిర్వాహకులు నవంబర్‌ 12న విడుదల చేశారు. అక్టోబర్‌ 31న ప్రారంభమై.. నవంబర్‌ 12 వరకు కొనసాగిన సదస్సుకు భారత సంతతి వ్యక్తి, బ్రిటన్‌ కేబినెట్‌ మంత్రి అలోక్‌ శర్మ అధ్యక్షత వహించారు. సదస్సులో ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 నుంచి 2 డిగ్రీల పరిమితం చేయాలన్న ప్రతిపాదనపై ప్రదానంగా చర్చించారు.

బైడెన్‌–జిన్‌పింగ్‌ భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధినేత జీ పిన్‌పింగ్‌ నవంబర్‌ 15న సమావేశం కానున్నారు. వర్చువల్‌ విధానం ద్వారా ఈ భేటీ జరగనుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి : అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ 12 వరకు కాప్‌ –26 సదస్సు(కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ 26వ సదస్సు–2021) నిర్వహణ
ఎప్పుడు : నవంబర్‌ 12 
ఎక్కడ : గ్లాస్గో, స్కాట్‌లాండ్, యునైటెడ్‌ కింగ్‌డమ్‌
ఎందుకు : వాతావరణ మార్పులు, వాటి దుష్ప్రభావాలు, వాటిని ఎదుర్కొనేందుకు అమలు చేయాల్సిన వ్యహాలపై చర్చించేందుకు... 

Norovirus: దేశంలోని ఏ రాష్ట్రంలో నోరోవైరస్‌ వెలుగులోకి వచ్చింది?

Norovirus

కోవిడ్‌–19 ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోకముందే దక్షిణ భారత రాష్ట్రం కేరళలో నోరోవైరస్‌ వెలుగులోకి వచ్చింది. వయనాడ్‌ జిల్లాలో నోరోవైరస్‌ కేసులు నిర్ధారణయ్యాయి. ఈ వైరస్‌ సోకిన వారు వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. అత్యంత తీవ్రంగా వ్యాప్తి చెందే ఈ వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని నవంబర్‌ 12న కేరళ ప్రభుత్వం హెచ్చరించింది. అత్యంత అరుదుగా వచ్చే నోరోవైరస్‌ ఇన్‌ఫెక్షన్‌తో వయనాడ్‌ జిల్లాలోని వెటర్నరీ కాలేజీ విద్యార్థుల్లో కనిపించింది. మొత్తం 13 మందికి ఈ వైరస్‌ సోకింది.

కోవాగ్జిన్‌ సామర్థ్యం 77.8 శాతం..
భారత్‌ బయోటెక్‌ సంస్థ తయారుచేసిన కోవాగ్జిన్‌ కోవిడ్‌ టీకా అత్యంత సమర్థంగా పని చేస్తోందని, పూర్తిగా సురక్షితమైనదని లాన్సెట్‌ జర్నల్‌ తాజా నివేదిక వెల్లడించింది. రెండు డోసులు తీసుకున్న వారిలో ఈ వ్యాక్సిన్‌ 77.8 శాతం సామర్థ్యంతో పని చేస్తోందని తెలిపింది. ఈ వ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగాలను లాన్సెట్‌ వైద్య నిపుణులు విశ్లేషించి నివేదిక రూపొందించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి ఇటీవల అనుమతులిచ్చింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : దేశంలోని ఏ రాష్ట్రంలో నోరోవైరస్‌ వెలుగులోకి వచ్చింది?
ఎప్పుడు : నవంబర్‌ 12
ఎవరు    : కేరళ
ఎక్కడ    : వయనాడ్‌ జిల్లా, కేరళ 


IVAC: ప్రపంచ న్యుమోనియా దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?

pneumonia

ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నప్పటికీ మరోవైపు పిల్లలకు డయేరియా, న్యుమోనియా టీకాలు ఇవ్వడంలో భారత్‌ గణనీయమైన ప్రగతి సాధించిందని జాన్స్‌ హాప్కిన్స్‌ బ్లూమ్‌బర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు చెందిన ఇంటర్నేషనల్‌ వ్యాక్సిన్‌ యాక్సెస్‌ సెంటర్‌(ఐవీఏసీ) ప్రశంసించింది. ఈ మేరకు ప్రపంచ న్యుమోనియా దినోత్సవం సందర్భంగా నవంబర్‌ 12న ఒక నివేదికను విడుదల చేసింది.

నవంబర్‌ 12న...
ప్రతియేటా నవంబర్‌ 12న ప్రపంచ న్యుమోనియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. సురక్షిత మంచినీరు అందుబాటులో లేకపోవడం, ఆరోగ్య సంరక్షణా కేంద్రాలు తక్కువ సంఖ్యలో ఉండడం, పౌష్టికాహార లోపాలు పెరిగిపోవడం, కాలుష్యం కాటేయడం వంటివి న్యుమోనియా పెరిగిపోవడానికి కారణాలు.

రోటావైరస్‌ టీకాను ఎందుకోసం ఉపయోగిస్తారు?
న్యుమోనియా నుంచి రక్షణ కల్పించే న్యుమోకాకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌(పీసీవీ) కవరేజీ 2019లో 15 శాతం కాగా, 2020లో 21 శాతానికి భారత్‌ చేరిందని ఐవీఏసీ వెల్లడించింది. ఇక డయేరియా నుంచి పిల్లలకు రక్షణ కల్పించే రోటావైరస్‌ టీకా కవరేజీ 2019లో 53 శాతం కాగా, 2020లో ఏకంగా 82 శాతానికి చేరుకుందని పేర్కొంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : డయేరియా, న్యుమోనియా టీకాలు ఇవ్వడంలో భారత్‌ గణనీయమైన ప్రగతి సాధించింది
ఎప్పుడు : నవంబర్‌ 12
ఎవరు    : జాన్స్‌ హాప్కిన్స్‌ బ్లూమ్‌బర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు చెందిన ఇంటర్నేషనల్‌ వ్యాక్సిన్‌ యాక్సెస్‌ సెంటర్‌(ఐవీఏసీ)
ఎందుకు : న్యుమోనియా అరికట్టేందుకు...

Security Threat: భారత్‌ భద్రతకు ఏ దేశం నుంచి ముప్పు ఉందని సీడీఎస్‌ చెప్పారు?

CDS Bipin Rawat

భారత్‌ భద్రతకు డ్రాగన్‌ దేశం చైనా నుంచి అతిపెద్ద ముప్పు పొంచి ఉందని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌ ఉద్ఘాటించారు. దేశ సరిహద్దుల రక్షణ కోసం 2020 ఏడాది తరలించిన వేలాది మంది సైనికులను, ఆయుధాలను ఇప్పుడే వెనక్కి తీసుకొచ్చే అవకాశం లేదని తెలిపారు. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ధీటుగా బదులు చెప్పేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని నవంబర్‌ 12న రావత్‌ స్పష్టం చేశారు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్‌ పాలన పునఃప్రారంభం కావడం భారత్‌ భద్రతకు ప్రమాదకరమైన పరిణామమేనని వివరించారు.

మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌..
మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌(పీసీ) ఏర్పాటు చేస్తామని భారత సైన్యం నవంబర్‌ 12న సుప్రీంకోర్టుకు తెలిపింది. అన్ని అర్హతలు ఉన్న తమకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేయాలంటూ 11 మంది మహిళా అధికారులు(షార్ట్‌ సర్వీస్‌ కమిషన్డ్‌ ఆఫీసర్లు) చేసుకున్న దరఖాస్తులను సైన్యం గతంలో తిరస్కరించింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శాశ్వత కమిషన్‌ ఏర్పాటుతో మహిళలకు సైతం సైన్యంలో అత్యున్నత హోదాతో పోస్టింగ్‌లు లభిస్తాయి.


CRS Report: ఢిల్లీ రీజినల్‌ సెక్యూరిటీ డైలాగ్‌ను ఎప్పుడు నిర్వహించారు?

CRS

అఫ్గానిస్తాన్‌ వ్యవహారాల్లో పొరుగు దేశం పాకిస్తాన్‌ చాలా ఏళ్లుగా చురుకైన పాత్ర పోషిస్తున్నట్లు అమెరికాలో కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌(సీఆర్‌ఎస్‌) తన నివేదికలో వెల్లడించింది. స్వతంత్ర విషయ నిపుణులు రూపొందించిన ఈ నివేదిక తాజాగా విడుదలైంది. అఫ్గాన్‌లో పాక్‌ విధ్వంసకర, అస్థిరతకు కారణమయ్యే పాత్ర పోషిస్తున్నట్లు ఈ నివేదిక తేల్చిచెప్పింది.

నివేదికలోని ముఖ్యాంశాలు..

  • తాలిబన్‌ ముష్కరులకు పాక్‌ పాలకుల అండదండలు బహిరంగ రహస్యమే.
  • పాకిస్తాన్, రష్యా, చైనా, ఖతార్‌ వంటి దేశాలు తాలిబన్‌ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించి, సంబంధాలు పెంచుకొనే అవకాశం ఉంది. అదే జరిగితే అఫ్గాన్‌పై అమెరికా పట్టు సడలిపోతుంది. 
  • అఫ్గాన్‌ను తాలిబన్లు మళ్లీ ఆక్రమించుకోవడాన్ని కొందరు పాక్‌ విజయంగా భావిస్తున్నారు. దీంత్లో అక్కడ పాక్‌ పెత్తనం పెరిగిపోతుంది. అఫ్గాన్‌పై భారత్‌  ప్రభావాన్ని తగ్గించాలన్న పాక్‌ యత్నాలు తీవ్రమవుతాయి.

ఢిల్లీ రీజినల్‌ సెక్యూరిటీ డైలాగ్‌ను ఎప్పుడు నిర్వహించారు?
అఫ్గానిస్తాన్‌లో భద్రతపై భారత్‌ నిర్వహించిన ‘ఢిల్లీ రీజినల్‌ సెక్యూరిటీ డైలాగ్‌’ను తాలిబన్‌ ప్రభుత్వం స్వాగతించింది. భారత్‌ ఆధ్వర్యంలో 2021, నవంబర్‌ 10న ఢిల్లీలో జరిగిన జాతీయ భద్రతా సలహాదారుల సదస్సులో మొత్తం 8 దేశాలు పాల్గొన్న విషయం తెలిసిందే. సదస్సు నేపథ్యంలో భారత్‌ చేసిన డిమాండ్లన్నిటినీ తాము నెరవేర్చామని తాలిబన్‌ ప్రభుత్వం తెలిపిందని టోలో వార్తా సంస్థ తెలిపింది.


Rajya Sabha: రాజ్యసభ 13వ సెక్రటరీ జనరల్‌గా నియమితులైన అధికారి?

PC Mody

రాజ్యసభ 13వ సెక్రటరీ జనరల్‌గా 1982 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి ప్రమోద్‌ చంద్ర మోదీ నియమితులయ్యారు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) మాజీ చైర్మన్‌ అయిన ప్రమోద్‌ చంద్ర మోదీ(పీసీ మోదీ), తెలుగు వ్యక్తి అయిన డాక్టర్‌ పరాశరం పట్టాభి కేశవ రామాచార్యుల స్థానంలో నవంబర్‌ 12న సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు. 2022, ఆగస్ట్‌ 10 వరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా మోదీ కొనసాగనున్నారు.

స్వల్ప కాలం పనిచేసిన వారిలో 2వ వ్యక్తి...
2021, సెప్టెంబర్‌ 1న రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన పీపీకే రామాచార్యులు 72 రోజుల పాటు మాత్రమే బాధ్యతలు నిర్వహించారు. దీంతో సెక్రటరీ జనరల్‌గా స్వల్ప కాలం పనిచేసిన వారిలో 2వ వ్యక్తిగా నిలిచారు. అంతకు ముందు 1997 జూలై 25న బాధ్యతలు చేపట్టిన ఎస్‌ఎస్‌ సహోని 1997 అక్టోబర్‌ 2 వరకు ఆ పదవిలో ఉన్నారు. తాజాగా పీపీకే రామాచార్యులును రాజ్యసభ సెక్రటేరియట్‌ సలహాదారుగా నియమించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : రాజ్యసభ 13వ సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన ఐఆర్‌ఎస్‌ అధికారి?
ఎప్పుడు : నవంబర్‌ 12
ఎవరు    : ప్రమోద్‌ చంద్ర మోదీ(పీసీ మోదీ)
ఎందుకు : ఇప్పటివరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన పీపీకే రామాచార్యులు రాజ్యసభ సెక్రటేరియట్‌ సలహాదారుగా నియమితులు కావడంతో..


Badminton: ఎవరి జీవిత విశేషాలతో షట్లర్స్‌ ఫ్లిక్‌ పుస్తకాన్ని రూపొందించారు?

Shuttler's Flick Book

ప్లేయర్‌గా, కోచ్‌గా పుల్లెల గోపీచంద్‌ కెరీర్‌లోని కొన్ని కీలక అంశాలు, విశేషాలతో రాసిన ‘షట్లర్స్‌ ఫ్లిక్‌: మేకింగ్‌ ఎవ్రీ మ్యాచ్‌ కౌంట్‌’ పుస్తకాన్ని నవంబర్‌ 12న హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌) ఆవిష్కరించారు. రచయిత్రి ప్రియా కుమార్‌ రచించిన ఈ పుస్తకాన్ని సైమన్‌ అండ్‌ షుస్టర్‌ పబ్లిషర్స్‌ ప్రచురించింది. ఇది పూర్తిగా తన ఆటోబయోగ్రఫీ కాదని గోపీచంద్‌ స్పష్టం చేశారు.

వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న చెస్‌ దిగ్గజం?
భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ వ్యాఖ్యాతగా కనిపించనున్నాడు. గతంలో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆనంద్‌ 2021, నవంబర్‌ 24 నుంచి యూఏఈలోని దుబాయ్‌లో జరిగే ప్రపంచ చెస్‌ చాంపియన్‌ షిప్‌ మ్యాచ్‌కు అధికారిక వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ కార్ల్‌సన్‌ (నార్వే), నెపోమ్‌నియాచి (రష్యా) ప్రపంచ టైటిల్‌ కోసం తలపడనున్నారు. గతంలో ఆన్‌లైన్‌ టోర్నీలకు ఆనంద్‌ వ్యాఖ్యాతగా పనిచేశాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : రచయిత్రి ప్రియా కుమార్‌ రచించిన ‘షట్లర్స్‌ ఫ్లిక్‌: మేకింగ్‌ ఎవ్రీ మ్యాచ్‌ కౌంట్‌’ పుస్తకం ఆవిష్కరణ
ఎప్పుడు : నవంబర్‌ 12
ఎవరు    : తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌)
ఎక్కడ    : హైదరాబాద్‌
ఎందుకు  : ప్లేయర్‌గా, కోచ్‌గా పుల్లెల గోపీచంద్‌ కెరీర్‌లోని కొన్ని కీలక అంశాలు, విశేషాలను తెలిపేందుకు...


FIFA World Cup 2022: ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌–కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?

Football Brazil

అరబ్‌ దేశం ఖతర్‌ వేదికగా 2022లో జరిగే ‘ఫిఫా’ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు ఐదు సార్లు చాంపియన్‌ బ్రెజిల్‌ అర్హత సాధించింది. ప్రపంచ కప్‌ క్వాలిఫయర్స్‌ దక్షిణ అమెరికా రీజియన్‌ టోర్నీలో భాగంగా నవంబర్‌ 12న బ్రెజిల్‌ని సావోపాలో నగరంలో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్‌ 1–0తో కొలంబియాపై విజయం సాధించింది. మరో ఆరు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ప్రపంచకప్‌కు అర్హత సాధించిన తొలి దక్షిణ అమెరికా జట్టుగా బ్రెజిల్‌ నిలిచింది.

2022 కామన్వెల్త్‌ గేమ్స్‌ను ఎక్కడ నిర్వహించనున్నారు?
ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగే 2022 బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో (సీడబ్ల్యూజీ) అరంగేట్రం చేయనున్న మహిళల క్రికెట్‌ ఆరంభ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు క్రికెట్‌ ఈవెంట్‌ జరుగుతుంది. మ్యాచ్‌లన్నీ టి20 ఫార్మాట్‌లో బర్మింగ్‌హామ్‌లో ఉన్న ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియం వేదికగా జరగనున్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : అరబ్‌ దేశం ఖతర్‌ వేదికగా 2022లో జరిగే ‘ఫిఫా’ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జట్టు
ఎప్పుడు : నవంబర్‌ 12
ఎవరు    : బ్రెజిల్‌
ఎక్కడ    : సావోపాలో, బ్రెజిల్‌
ఎందుకు : ప్రపంచ కప్‌ క్వాలిఫయర్స్‌ దక్షిణ అమెరికా రీజియన్‌ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్‌ 1–0తో కొలంబియాపై విజయం సాధించడంతో..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, న‌వంబ‌ర్ 12 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 13 Nov 2021 06:43PM

Photo Stories