Daily Current Affairs in Telugu: 2022, మే 02 కరెంట్ అఫైర్స్
Chief of the Army Staff: 29వ ఆర్మీ చీఫ్‌గా ఎవరు బాధ్యతలు చేపట్టారు?
దేశ 29వ ఆర్మీ చీఫ్(చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్)గా ఏప్రిల్ 30న న్యూఢిల్లీలో జనరల్ మనోజ్ పాండే(60) బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత చీఫ్ జనరల్ ఎంఎం నరవణే ఏప్రిల్ 30న రిటైర్ కావడంతో ఆయన స్థానంలో జనరల్ పాండే బాధ్యతలు స్వీకరించారు. దీంతో కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ విభాగం నుంచి ఈ అత్యున్నత పదవిని చేపట్టిన మొదటి వ్యక్తిగా మనోజ్ పాండే నిలిచారు. ఇప్పటి వరకు ఆర్మీ వైస్ చీఫ్‌గా ఆయన సేవలందించారు.
చైనా, పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతలు సహా దేశం భద్రతాపరమైన అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ జనరల్ పాండే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా పగ్గాలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన కీలకమైన చైనాతో సరిహద్దు ఉన్న ఈస్టర్న్ ఆర్మీ కమాండ్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఆర్మీ చీఫ్‌గాను, నావిక, వైమానిక దళాలతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా థియేటర్ కమాండ్స్‌ను అమలు చేయాల్సి ఉంటుంది.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన పాండే.. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ అనంతరం 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్‌లో చేరారు. సుదీర్ఘ కెరీర్‌లో పలు కీలక బాధ్యతలు చేపట్టిన ఆయనకు చైనా సరిహద్దులు, జమ్మూకశ్మీర్ సహా అన్ని రకాల ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఉంది. దేశంలో ఏకైక త్రివిధ దళాల కమాండ్ ఉన్న అండమాన్ నికోబార్ కమాండ్‌కు చీఫ్‌గా కూడా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశ 29వ ఆర్మీ చీఫ్(చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్)గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : ఏప్రిల్ 30
ఎవరు : జనరల్ మనోజ్ పాండే(60)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఇప్పటివరకు ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ ఎంఎం నరవణే ఏప్రిల్ 30న రిటైర్ కావడంతో..
Badminton: ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన భారతీయురాలు?
ఫిలిప్పీన్స్ రాజధాని నగరం మనీలా వేదికగా జరుగుతోన్న ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్–2022 మహిళల సింగిల్స్ విభాగంలో భారతీయ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు(పీవీ సింధు) కాంస్య పతకం గెలిచింది. ఏప్రిల్ 30న జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు 21–13, 19–21, 16–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో పోరాడి ఓడింది. ఫలితంగా కాంస్యం దక్కింది. సెమీఫైనల్లో ఓడిన సింధుకు 5,800 డాలర్ల (రూ. 4 లక్షల 43 వేలు) ప్రైజ్‌మనీ, 8,400 పాయింట్లు లభించాయి. ఈ మెగా ఈవెంట్‌లో 2014 ఏడాదిలోనూ సింధు కాంస్య దక్కించుకుంది.
ఆరూ కాంస్యాలే..
ఆసియా చాంపియన్‌షిప్ చరిత్రలో మహిళల సింగిల్స్‌లో భారత్‌కు లభించిన పతకాలు ఆరు. ఈ ఆరూ కాంస్యాలే కావడం గమనార్హం. మీనా షా (1956) ఒకసారి... సైనా నెహ్వాల్ (2010, 2016, 2018) మూడుసార్లు... సింధు (2014, 2022) రెండుసార్లు కాంస్యాలు నెగ్గారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్–2022 మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్యం గెలిచిన భారతీయ క్రీడాకారిణి?
ఎప్పుడు : ఏప్రిల్ 30
ఎవరు : పూసర్ల వెంకట సింధు(పీవీ సింధు)
ఎక్కడ : మనీలా, ఫిలిప్పీన్స్
ఎందుకు : మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు 21–13, 19–21, 16–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో పోరాడి ఓడిపోవడంతో..
Indian-Origin: సీఐఏ తొలి సీటీఓగా ఎవరు నియమితులయ్యారు?
అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తొలి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ)గా భారత సంతతికి చెందిన నంద్ మూల్‌చందానీ నియమితులయ్యారు. ఈ విషయాన్ని సీఐఏ డైరెక్టర్ విలియమ్ జె.బర్న్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఢిల్లీ స్కూల్‌లో చదువుకున్న చందానీ సమర్థుడైన ఐటీ నిపుణుడు. సిలికాన్ వ్యాలీలో 25 ఏళ్లపాటు పనిచేశారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌లోనూ సేవలందించారు. ఆయన పరిజ్ఞానం, సేవలు తమకు బాగా ఉపయోగపడతాయని బర్న్ అన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తొలి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ)గా నియామకం
ఎప్పుడు : మే 1
ఎవరు : భారత సంతతికి చెందిన నంద్ మూల్‌చందానీ
ఎందుకు : అమెరికా ప్రభుత్వం నిర్ణయం మేరకు..
NITI Aayog: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
నీతి ఆయోగ్ నూతన వైస్ చైర్మన్‌గా సుమన్ బేరీ మే 1న న్యూఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. పాలసీ ఎకనమిస్ట్, రీసెర్చ్ అడ్మినిస్ట్రేటర్‌గా అపార అనుభవమున్న ఆయన గతంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్‌లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించారు. ప్రధాని ఆర్థిక సలహా మండలి, స్టాటిస్టికల్ కమిషన్ సభ్యుడిగా, ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సాంకేతిక సలహా కమిటీ సభ్యునిగా చేశారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పదవికి రాజీవ్ కుమార్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. దీంతో కొత్త వైస్ చైర్మన్‌గా సుమన్ బెరీని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నీతి ఆయోగ్ నూతన వైస్ చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : మే 1
ఎవరు : సుమన్ బేరీ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఇప్పటివరకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా ఉన్న రాజీవ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో..
PM Modi's Europe Visit: ప్రస్తుతం జర్మనీ చాన్సలర్‌గా ఎవరు ఉన్నారు?
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022 ఏడాది తొలిసారి విదేశీ పర్యటనకు యూరప్ వెళుతున్నారు. మే 2వ నుంచి మూడు రోజులపాటు జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటిస్తారు. యూరప్ దేశాలతో సహకార స్ఫూర్తిని బలోపేతం చేయడానికి ఈ పర్యటన తోడ్పడుతుందని మోదీ పేర్కొన్నారు.
ప్రధాని పర్యటన విశేషాలు ఇలా..
మే 2న ప్రధాని మోదీ జర్మనీకి చేరుకుని చాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్‌తో సమావేశమవుతారు. 3, 4 తేదీల్లో డెన్మార్క్ పర్యటిస్తారు. ఆ దేశ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సన్‌తో చర్చలు జరుపుతారు. తిరుగు ప్రయాణంలో ఫ్రాన్స్ వెళ్లి అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్‌తో ముచ్చటిస్తారు. పర్యటనలో మోదీ మొత్తం 25 సమావేశాల్లో పాల్గొంటారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు ఇంధన భద్రత, రక్షణ, వాణిజ్య రంగం వంటి అంశాలపై మోదీ విస్తృతంగా చర్చించనున్నారు.
ఢిల్లీ విశ్వవిద్యాలయం శతజయంతి ఉత్సవాలు ప్రారంభం
విద్యను జ్ఞాన సముపార్జనకు, సమాజ జాగృతికి మూలబిందువుగా భావించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఇందుకోసం చిన్నారులకు విద్యాబోధన మాతృభాషలోనే ప్రారంభం కావాలన్నారు. మే1న ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయం శతజయంతి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.100 నాణేన్ని, స్టాంపును విడుదల చేశారు. ఇంగ్లిష్, హిందీతోపాటు తెలుగులో వర్సిటీ శత జయంత్యుత్సవాల బ్రోచర్‌ను ఆయన విడుదల చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మే 2వ నుంచి మూడు రోజులపాటు యూరప్ దేశాల్లో పర్యటన
ఎప్పుడు : మే 1
ఎవరు : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్
ఎందుకు : ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు ఇంధన భద్రత, రక్షణ, వాణిజ్య రంగం వంటి అంశాలపై చర్చించేందుకు..
Khelo India University Games 2022: ఖేలో ఇండియా గేమ్స్‌ను ఎక్కడ నిర్వహిస్తున్నారు?
కర్ణాటక రాష్ట్ర రాజధాని నగరం బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్–2022లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మహిళల టెన్నిస్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. మే 1న జరిగిన ఫైనల్లో భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సారథ్యంలోని ఓయూ జట్టు 2–0తో రాజస్తాన్ యూనివర్సిటీ జట్టును ఓడించింది. శ్రీవల్లి రష్మిక, సామ సాత్విక, అవిష్క గుప్తా, పావని పాథక్‌లు కూడా ఓయూ జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఏప్రిల్ 24న ప్రారంభమైన ఈ క్రీడలు మే 3వ తేదీన ముగియనున్నాయి.
భారత షూటింగ్ రైఫిల్ చీఫ్ కోచ్‌గా ఎవరు నియమితులయ్యారు?
పదేళ్ల క్రితం లండన్ ఒలింపిక్స్‌లో ప్లేయర్‌గా బరిలోకి దిగి... త్రుటిలో కాంస్య పతకం కోల్పోయిన భారత షూటర్ జాయ్‌దీప్ కర్మాకర్ ఇప్పుడు జాతీయ కోచ్‌గా అవతారం ఎత్తనున్నాడు. మూడేళ్ల కాలానికి 42 ఏళ్ల జాయ్‌దీప్‌ను భారత షూటింగ్ రైఫిల్ జట్టు చీఫ్ కోచ్‌గా నియమించారు. 2024 పారిస్ ఒలింపిక్స్ సన్నాహాలను ఇప్పటి నుంచే ప్రారంభిస్తామని జాయ్‌దీప్ తెలిపాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్–2022లో స్వర్ణ పతకం సాధించిన జట్టు
ఎప్పుడు : మే 1
ఎవరు : ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మహిళల టెన్నిస్ జట్టు
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : ఫైనల్లో భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సారథ్యంలోని ఓయూ జట్టు 2–0తో రాజస్తాన్ యూనివర్సిటీ జట్టును ఓడించడంతో..
FAO: ఛాంపియన్ అవార్డుకు భారత్ నుంచి నామినేట్ అయిన వ్యవస్థ?
విత్తనం నుంచి విక్రయాల దాకా రైతన్నలకు చేదోడువాదోడుగా నిలిచి గ్రామాల్లోనే సేవలన్నీ అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే) అంతర్జాతీయంగా అరుదైన గుర్తింపు దిశగా సాగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏవో).. అంతర్జాతీయ స్థాయిలో అందించే అత్యున్నత, ప్రతిష్టాత్మక ‘‘ఛాంపియన్’’ అవార్డుకు మన దేశం తరపున ఆర్బీకే వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది.
‘ఆహార భద్రత – 2030’ లక్ష్యం..
ప్రపంచవ్యాప్తంగా మానవాళి చురుకైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేలా ‘ఆహార భద్రత – 2030’ ద్వారా నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో ఎఫ్‌ఏవో కృషి చేస్తోంది. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి భాగస్వామ్య దేశాలకు వివిధ రూపాల్లో చేయూతనిస్తోంది. అంతర్జాతీయంగా అగ్రి ఫుడ్ వ్యవస్థలను మార్చడం లేదా మార్పు కోసం స్థిరమైన అభివృద్ధి అజెండాతో పనిచేసే సంస్థలు, ప్రభుత్వాలను ఏటా ఛాంపియన్ అవార్డుతో సత్కరిస్తుంది. ఈ అవార్డు కింద 50 వేల యూఎస్ డాలర్లను అందజేస్తారు.
ఛాంపియన్ అవార్డు – విశేషాలు..
- ప్రతిష్టాత్మక ఛాంపియన్ అవార్డు కోసం ఎఫ్‌ఎవో అంతర్జాతీయంగా నామినేషన్లను ఆహ్వానించింది.
- ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్లుగా గ్రామస్థాయిలో సేవలందిస్తున్న వైఎస్సార్ ఆర్బీకేలను రోల్ మోడల్‌గా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మన దేశం తరపున ఈ అవార్డు కోసం ఎఫ్‌ఏవోకు నామినేట్ చేసింది.
- అందరికీ సుస్థిర ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో అనుసరిస్తున్న వినూత్న విధానాలు, వ్యవస్థలు, వాటి ద్వారా వచ్చిన మార్పులు, ఉత్పత్తి, పోషకాహారం, పర్యావరణం, జీవన విధానాల్లో సాధించిన మెరుగైన ఫలితాలు లాంటి అంశాలను అవార్డుకు ప్రామాణికంగా తీసుకుంటారు.
- వివిధ దేశాల నుంచి అందిన నామినేషన్లను వివిధ దశల్లో వడపోస్తారు. చివరిగా అంశాల వారీగా అర్హత కలిగిన సంస్థలు, ప్రభుత్వాలను ఐరాస అత్యున్నత కౌన్సిల్ ఎంపిక చేస్తుంది.
- జూన్ 13 నుంచి 17వతేదీ వరకు ఐక్యరాజ్య సమితిలో జరిగే ఎఫ్‌ఏవో 169వ కౌన్సిల్ సమావేశంలో డైరెక్టర్ జనరల్ చేతుల మీదుగా ఎంపికైన సంస్థలు / ప్రభుత్వాలకు ఛాంపియన్ అవార్డును ప్రదానం చేస్తారు.
రైతు భరోసా కేంద్రాలను ఎప్పుడు ప్రారంభించారు?
2020, మే 30వ తేదీన రైతులకు శిక్షణా తరగతులు, విజ్ఞాన కేంద్రాలుగా వ్యవసాయ సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈ భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు నుంచి పంట అమ్మకం వరకు సూచనలు, సలహాలు అందిస్తాయి. పంటరుణాలు, ఇన్య్సూరెన్స్, గిట్టుబాటు ధరలు కల్పించేలా పనిచేస్తాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏవో).. అందించే ‘‘ఛాంపియన్’’ అవార్డుకు భారత్ తరపున ఆర్బీకే వ్యవస్థ సిఫారసు
ఎప్పుడు : మే 1
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు శిక్షణా తరగతులు, విజ్ఞాన కేంద్రాలుగా వ్యవసాయ సేవలు అందిస్తున్నందున..
Judicial Conference: సీఎంలు, చీఫ్ జస్టిస్‌ల సదస్సును ఎక్కడ నిర్వహించారు?
రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల ఉమ్మడి సదస్సును ఏప్రిల్ 30న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించారు. సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ... న్యాయస్థానాల్లో స్థానిక భాషలను ప్రోత్సహించడం చాలా ముఖ్యమన్నారు. చట్టాల గురించి సులభమైన భాషలో అర్థమయ్యేలా వివరించాలన్నారు. డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా న్యాయ వ్యవస్థలో సాంకేతికతకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. ‘‘2015లో ప్రభుత్వం 1,800 చట్టాలను అప్రస్తుతంగా గుర్తించింది. ఇప్పటికే 1,450 చట్టాలను రద్దు చేశాం’’ అని ప్రధాని పేర్కొన్నారు.
సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రసంగిస్తూ.. దేశంలో న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని, అందుకు మరిన్ని చర్యలు అవసరమని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని, ఖాళీలను త్వరగా భర్తీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సదస్సులో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ తరఫున సీఎం కేసీఆర్ బదులుగా న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హాజరయ్యారు. న్యాయస్థానాల్లో ఖాళీల భర్తీ, పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడం, ప్రజలకు న్యాయ సహాయం, న్యాయ సేవలు, ఈ–కోర్టుల ఏర్పాటు వంటి కీలక అంశాలపైనా సదస్సులో చర్చించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల ఉమ్మడి సదస్సు నిర్వహణ
ఎప్పుడు : మే 1
ఎవరు : కేంద్ర న్యాయ శాఖ
ఎక్కడ : విజ్ఞాన్ భవన్, న్యూఢిల్లీ
ఎందుకు : న్యాయస్థానాల్లో ఖాళీల భర్తీ, ప్రజలకు న్యాయ సహాయం, న్యాయ సేవలు, ఈ–కోర్టుల ఏర్పాటు వంటి కీలక అంశాలపై చర్చించేందుకు..చదవండి: Daily Current Affairs in Telugu >> 2022, ఏప్రిల్ 30 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్