Daily Current Affairs in Telugu: 2022, జూన్ 13th కరెంట్ అఫైర్స్
India's first display fab to be established in Telangana : దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఏర్పాటు కానున్న డిస్‌ప్లే ఫ్యాబ్
- దేశ చరిత్రలో తొలిసారిగా ‘డిస్‌ప్లే ఫ్యాబ్’తయారీ రంగంలో రాష్ట్రానికి రూ. 24 వేల కోట్ల భారీ పెట్టుబడి లభించింది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రముఖ ఆభరణాల ఎగుమతి సంస్థ రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ తన అనుబంధ సంస్థ ఎలెస్ట్ ద్వారా తెలంగాణలో అడ్వాన్స్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లేల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోటీపడుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును సాధించింది.
- జూన్ 12(ఆదివారం) బెంగళూరులో మంత్రి కె. తారక రామారావుతో జరిగిన సమావేశంలో ఎలెస్ట్ కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాçహనా ఒప్పందం కుదిరింది. ఎలెస్ట్ తరఫున రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ చైర్మన్ రాజేష్ మెహతా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో 6వ తరం అమోలెడ్ డిస్‌ప్లే ఫ్యాబ్ ఉత్పత్తి కోసం రూ. 24 వేల కోట్లను సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది.
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌ల తయారీ కంపెనీలకు అవసరమైన అమోలెడ్ డిస్‌ప్లేలను ‘ఎలెస్ట్’తయారు చేసి సరఫరా చేయనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ విభాగం డైరెక్టర్ (ఎలక్ట్రానిక్స్) సుజయ్ కారంపురి, ఎలెస్ట్ సీఈఓ శ్యామ్ రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
- గ్లోబల్ టాలెంట్‌ను
ఆకర్షించే అవకాశం: రాజేశ్ మెహతా
- తెలంగాణలో తాము ఏర్పాటు చేయబోయే డిస్‌ప్లే ఫ్యాబ్ వల్ల అత్యుత్తమ గ్లోబల్ టాలెంట్‌ను ఆకర్షించే అవకాశం ఉందని రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ చైర్మన్ రాజేశ్ మెహతా తెలిపారు. అత్యాధునిక సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ ప్లాంట్‌లో 3,000 మంది శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. దీంతోపాటు డిస్‌ప్లే ఫ్యాబ్ భాగస్వాములు, అనుబంధ సంస్థలు, సరఫరాదారుల రూపంలో వేలాది ఉద్యోగాలు లభిస్తాయన్నారు. 6వ తరం అమోలెడ్ డిస్‌ప్లే తయారీ ద్వారా భారత్ నుంచి ఫ్యూచర్ టెక్నాలజీని తమ ఎలెస్ట్ కంపెనీ ప్రపంచానికి అందిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
తెలంగాణకు చరిత్రాత్మకమైన రోజు: మంత్రి కేటీఆర్
- రాష్ట్రానికి రూ. 24 వేల కోట్ల పెట్టుబడి వచ్చిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ పరిణామాన్ని తెలంగాణకు చరిత్రాత్మకమైన రోజుగా అభివర్ణించారు. దేశ హైటెక్ తయారీ రంగానికి వచ్చిన భారీ పెట్టుబడుల్లో ఇది కూడా ఒకటని పేర్కొన్నారు. డిస్‌ప్లే ఫ్యాబ్ రంగంలో రానున్న రూ. 24 వేల కోట్ల పెట్టుబడి ద్వారా తెలంగాణ రాష్ట్రం భారత్‌ను ప్రపంచ హైటెక్ పరికరాలను తయారు చేస్తున్న దేశాల సరసన నిలుపుతుందన్నారు. ఇప్పటివరకు జపాన్, కొరియా, తైవాన్‌లకు మాత్రమే సాధ్యమైనది ఇకపై తెలంగాణలో అవుతుందన్నారు.
- దేశ సెమీ కండక్టర్ మిషన్ ప్రకటన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోకి ఫ్యాబ్ రంగంలో పెట్టుబడులు తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నామని వివరించారు. ఈ పెట్టుబడి తర్వాత ఫ్యాబ్ రంగంలో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. డిస్‌ప్లే ఫ్యాబ్ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, ఐటీ ఎకోసిస్టం, అనుబంధ రంగాల్లో వృద్ధికి గణనీయమైన అవకాశాలు లభిస్తాయన్న విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్ , డిస్‌ప్లే ఫ్యాబ్ రంగంలో మరిన్ని పెట్టుబడుల కోసం పోటీ పడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవనుందన్నారు.
IAF plans to build around 100 advanced fighter jets in India: 100 అత్యాధునిక యుద్ధ విమానాలను దేశీయంగా తయారు చేసే దిశగా వాయుసేన
‘ఆత్మ నిర్భర్ భారత్’లో భాగంగా దాదాపు 100 అత్యాధునిక యుద్ధ విమానాలను దేశీయంగా తయారు చేసే దిశగా వాయుసేన భారీ ప్రణాళికల్ని సిద్ధం చేసింది. దీనికి సంబంధించి అంతర్జాతీయ విమాన తయారీ సంస్థలతో చర్చిస్తోంది. ఈ ప్రాజెక్టులో 70 శాతం భారత కరెన్సీనే వాడేలా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీని వల్ల మేకిన్ ఇండియా ప్రాజెక్టు మరింత బలోపేతం కానుందన్నాయి. ‘‘భారత్‌లో 96 యుద్ధ విమానాల తయారీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. 36 విమానాల తయారీకి మన కరెన్సీతో పాటు విదేశీ మారక ద్రవ్యమూ చెల్లిస్తాం. 60 విమానాల చెల్లింపులకు పూర్తిగా భారత్ కరెన్సీనే వాడతాం’’ అన్నాయి.
India achieved new milestones in 'gram swaraj- Modi : సర్పంచ్‌ల సేవలు సూపర్
- పంచాయతీలకు సాధికారత కల్పించి గ్రామస్వరాజ్యం సాధించడంలో ఎనిమిదేళ్లలో భారత్ కొత్త మైలురాళ్లను అధిగమించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్రం చేపడుతున్న సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ చేరేలా కృషి చెయ్యాలని సర్పంచులకు పిలుపునిచ్చారు. ఎన్డీఏ పాలనకు ఎనిమిదేళ్ల పూర్తయిన సందర్భంగా పంచాయతీ సర్పంచ్‌లకు మోదీ లేఖ రాశారు. ఈ ఎనిమిదేళ్లలో గ్రామస్థాయిలో వారందించిన సహకారాన్ని, చేసిన సేవల్ని కొనియాడారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
- మానవత్వం కోసం యోగా అనే థీమ్‌తో ఈ ఏడాది నిర్వహిస్తున్న యోగా డేని సర్పంచులు వారి వారి గ్రామాల్లో ఏదైనా పురాతన పర్యాటక కేంద్రాన్ని లేదంటే నదీ తీరంలో నిర్వహించాలని గ్రామంలో ప్రతీ ఒక్కరూ యోగా చేసేలా ప్రోత్సాహించాలని ప్రధాని ఆ లేఖలో పేర్కొన్నారు. యోగా డే రోజు తీసిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని ఇతరుల్లో స్ఫూర్తి నింపాలన్నారు.
- 75ఏళ్ల అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ నీటి సంరక్షణపై అత్యధిక దృష్టి పెట్టాలని. ప్రతీ నీటి బొట్టు విలువైనదని మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులందరికీ చేరేలా కృషి చేస్తే సదరు గ్రామంతో పాటు దేశం కూడా సుసంపన్నంగా మారుతుందని మోదీ పేర్కొన్నారు. దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయితీలన్నీ స్వయంసమృద్ధి సాధిస్తే దేశం పురోగతిలో ముందుంటుందని లేఖలో పేర్కొన్నారు.
Elizabeth II Becomes World's Second-Longest Reigning Monarch: ఎలిజబెత్–2 కొత్త రికార్డు
- బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 (96) జూన్ 12(ఆదివారం) కొత్త చరిత్ర సృష్టించారు. అత్యధిక కాలం పాలించిన వారి జాబితాలో థాయ్‌లాండ్ మాజీ పాలకుడు భూమిబల్ అతుల్యతేజ్‌ను వెనక్కు నెట్టి రెండో స్థానంలో నిలిచారు. భూమిబల్ 1927 నుంచి 2016 మధ్య 70 ఏళ్ల 126 రోజులు రాజుగా ఉన్నారు. ఆమె ఇంకో రెండేళ్లు పదవిలో కొనసాగితే ఫ్రాన్స్ లూయి–14ని కూడా దాటేసి తొలి స్థానంలో నిలుస్తారు. లూయి–14 1643 నుంచి 1715 దాకా 72 ఏళ్ల 110 రోజులు ఫ్రాన్స్‌ను పాలించారు. ఎలిజెబెత్–2 1953లో సింహాసనమెక్కారు. బ్రిటన్‌ను అత్యధిక కాలం పాలించిన క్వీన్ విక్టోరియా రికార్డును 2015 సెప్టెంబర్‌లో అధిగమించారు.
- ఆమె పాలనకు 70 ఏళ్లు నిండిన సందర్భంగా వారం రోజులుగా ఇంగ్లండ్‌లో ఘనంగా వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే. అనారోగ్యంతో వాటిలో పాల్గొనలేకపోయిన రాణి ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు వారిని ఉద్దేశించి ఆదివారం ఆమె లేఖ విడుదల చేశారు. ‘‘ఒక రాణి 70 ఏళ్లు పాలిస్తే సంబరాలు చేసుకోవాలంటూ నిజానికి రూలేమీ లేదు. అయినా మీరే చొరవ తీసుకొని ఇంత భారీగా వేడుకలు జరపడం నన్ను ఆనం దోద్వేగాలకు లోనుచేసింది’’ అని పేర్కొన్నారు.
Max Verstappen won the Azerbaijan Grand Prix: అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి విజేత వెర్‌స్టాపెన్
ఫార్ములావన్ సీజన్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్‌స్టాపెన్ ఈ ఏడాది ఐదో టైటిల్‌ను గెల్చుకున్నాడు. జూన్ 12(ఆదివారం) జరిగిన అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రిలో ఈ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ విజేతగా నిలిచాడు. 51 ల్యాప్‌ల రేసును వెర్‌స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 34 నిమిషాల 05.941 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఫెరారీ డ్రైవర్ లెక్‌లెర్క్ కారు ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో 21వ ల్యాప్‌లో వైదొలిగాడు.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్