Skip to main content

ప్రముఖ దర్శక-నిర్మాత విజయబాపినీడు కన్నుమూత

ప్రముఖ దర్శక-నిర్మాత, రచయిత విజయబాపినీడు (83) కన్నుమూశారు.
కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 12న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. 1936, సెప్టెంబర్ 22న ఏలూరు సమీపంలోని చాటపర్రులో లీలావతి, సీతారామస్వామి దంపతులకు విజయ బాపినీడు జన్మించారు. ఆయన అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. ఏలూరులోని సీఆర్‌ఆర్ కళాశాలలో బీఏ చదివిన ఆయన కొంతకాలం వైద్య ఆరోగ్య శాఖలో పనిచేశారు. రచనా వ్యాసంగం పట్ల ఆసక్తితో గుత్తా బాపినీడు పేరుతో డిటెక్టివ్ నవలలు రాసేవారు. ఆ తర్వాత భార్య విజయ పేరు కలిసి వచ్చేలా విజయ బాపినీడు పేరుతో రచనలు చేశారు. ‘బొమ్మరిల్లు, విజయ’ అనే మాస పత్రికలను కూడా ప్రారంభించారు.

ఇండియన్ ఫిల్మ్, నీలిమ పత్రికలకు ఎడిటర్‌గా వ్యవహరించిన బాపినీడు మొదటగా ‘జగత్ జెట్టీలు’ సినిమాకు కథను అందించారు. కొన్ని సినిమాలకు కథలను అందించిన ఆయన తర్వాత శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్‌ను నెలకొల్పి ‘రంభ-ఊర్వశి-మేనక, బొమ్మరిల్లు, ప్రేమపూజారి, విజయ, బొట్టు-కాటుక, రుద్రతాండవం’ వంటి సినిమాలు నిర్మించారు. ఇతర దర్శకుల దర్శకత్వంలో 12 సినిమాలు నిర్మించిన ఆయన.. చిరంజీవి హీరోగా 1983లో ‘మగ మహారాజు’ సినిమాతో దర్శకునిగా మారారు. ఆ తర్వాత ‘మహానగరంలో మాయగాడు, మగధీరుడు, ఖైదీ నెం.786, గ్యాంగ్‌లీడర్, బిగ్‌బాస్, కొడుకులు’ చిత్రాలను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. మొత్తం 22 సినిమాలకు దర్శకత్వం వహించారు. నిర్మాణత అనే పదాన్ని తొలిసారి ప్రయోగించింది ఆయ‌నే.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రముఖ దర్శక-నిర్మాత, రచయిత కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : విజయబాపినీడు (83)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా
Published date : 13 Feb 2019 04:52PM

Photo Stories