నివర్ తుపానుకు పేరు పెట్టిన దేశం?
Sakshi Education
తీవ్ర తుపాను ‘నివర్’ పుదుచ్చేరికి సమీపంలో నవంబర్ 26న తీరం దాటింది.
తీరం దాటిన అనంతరం అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నివర్ తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కి.మీ వేగంతో గరిష్టంగా 145 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచాయి. తుపాను ప్రభావంతో పుదుచ్చేరి, తమిళనాడులోని పలు ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కుండపోత వర్షాలతో కొన్ని జిల్లాల్లో పరిస్థితి అతలాకుతలంగా మారింది. నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. జాతీయ విపత్తు సహాయ దళాలు, రాష్ట్రాల విపత్తు సహాయ దళాలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి.
నివర్ పేరును పెట్టిన దేశం...
- బంగాళాఖాతంలో 2020 ఏడాది ఏర్పడిన రెండో అతిపెద్ద తుపాను నివర్. 2020, మే నెలలో అంఫన్ తుపాను దక్షిణాదిలో బీభత్సం సృష్టించింది.
- ఇరాన్ సూచన మేరకు తాజా తుపాను పేరును ‘నివర్’గా నిర్ణయించారు. నివర్ అనే మాటను నివారణ అనే అర్థంలో వాడతారు.
- 2020లో ఉత్తర హిందూ మహా సముద్ర ప్రాంతంలో తుపాన్లకు పెట్టే పేర్ల జాబితాలో నివర్ మూడోది.
- 2020, నవంబర్ 22న సోమాలియాలో ఒక తుపాను తీరం దాటింది. దీనికి భారతదేశం సూచన మేరకు ‘గతి’ అని పేరు పెట్టారు. గతి అంటే కదలిక లేదా వేగం అని అర్థం.
Published date : 27 Nov 2020 06:11PM