Skip to main content

Daily Current Affairs in Telugu: జ‌న‌వ‌రి 7th, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu January 7th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

Glaciers Melting: భూ గోళానికి ముంచుకొస్తున్న ముప్పు!
భూ గోళానికి పెను ముప్పు అనుకున్న దానికంటే ముందుగానే ముంచుకొస్తుందా? హిమానీనదాలపై తాజా అధ్యయనం ఫలితాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఈ శతాబ్దాంతానికి భూమిపై ఉన్న ప్రతి ఐదు హిమానీ నదాల్లో నాలుగు, అంటే ఏకంగా 80 శాతం నామరూపాల్లేకుండా పోతాయని సదరు అధ్యయనం తేల్చింది! గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలు బాగా ఫలించినా 2100 కల్లా కనీసం 25 నుంచి 41 శాతం హిమానీ సంపద హరించుకుపోతుందని అంచనా వేసింది.
‘‘సగటు ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరిగే పక్షంలో మధ్య యూరప్, పశ్చిమ కెనడా, అమెరికాల్లోని చిన్నపాటి హిమానీ నదాలు తీవ్ర ప్రభావానికి లోనవుతాయి. 3 డిగ్రీలు పెరిగితే మొత్తానికే మటుమాయమవుతాయి’’ అని అధ్యయనానికి సారథ్యం వహించిన అమెరికాలోని కార్నెగీ మెలన్‌ వర్సిటీ సివిల్‌ అండ్ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డేవిడ్‌ రౌన్స్‌ చెప్పారు. ‘‘కర్బన ఉద్గారాలకు ఇప్పటికిప్పుడు పూర్తిగా అడ్డుకట్ట వేయగలిగినా పెద్దగా లాభముండదు. ఇప్పటిదాకా వెలువడ్డ ఉద్గారాలు తదితరాలు హిమానీ నదాలపై చూపే దుష్ప్ర‌భావాన్ని అడ్డుకోలేం. ఇది నిజంగా ఆందోళనకరమైన విషయం’’ అన్నారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (10-16 డిసెంబర్ 2022)

National Boxing Championship: జాతీయ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో హుసాముద్దీన్‌కు స్వర్ణం  
జాతీయ సీనియర్‌ పురుషుల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్‌ హుసాముద్దీన్‌ బంగారు పతకం సాధించాడు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన అతను సర్వీసెస్‌ స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ)కు ప్రాతినిధ్యం వహించాడు. 57 కేజీల ఫైనల్లో హుసాముద్దీన్‌ 4–1తో సచిన్‌ (రైల్వేస్‌)ను ఓడించాడు. హిస్సార్‌లో జ‌న‌వ‌రి 6న ముగిసిన ఈ పోటీల్లో సర్వీసెస్‌ జట్టు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకుంది. ఈ జట్టుకు చెందిన బాక్సర్లు మొత్తం 10 పతకాలు సాధించారు. ఇందులో ఆరు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలున్నాయి. భారత మేటి బాక్సర్‌ శివ థాపా (అస్సామ్‌) స్వర్ణం సాధించాడు. 63.5 కేజీల ఫైనల్లో అతను అంకిత్‌ నర్వాల్‌ (రైల్వేస్‌)పై గెలుపొందాడు. సర్వీసెస్‌ బాక్సర్లలో విశ్వామిత్ర చాంగ్తామ్‌ (51 కేజీలు), సచిన్‌ (51 కేజీలు), ఆకాశ్‌ (67 కేజీలు), సుమిత్‌ (75 కేజీలు), వాకోవర్‌తో నరేందర్‌ (ప్లస్‌ 92 కేజీలు) పసిడి పతకాలు గెలిచారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (10-16 డిసెంబర్ 2022)


Grandmaster: రిల్టన్‌ కప్‌లో విజేతగా నిలిచిన ప్రణేశ్‌
తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల ఎం.ప్రణేశ్‌ భారత 79వ చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందాడు. స్టాక్‌హోమ్‌లో జరిగిన రిల్టన్‌ కప్‌లో విజేతగా నిలిచిన ప్రణేశ్‌ టైటిల్‌ గెలుచుకోవడంతో పాటు గ్రాండ్‌మాస్టర్‌ హోదా కూడా సాధించాడు. ఈ టోర్నీకి ముందే అతను మూడు జీఎం నార్మ్‌లు పొందగా, ఇప్పుడు 2500 ఎలో రేటింగ్‌ పాయింట్లు (లైవ్‌) కూడా దాటాడు. ‘ఫిడే’ సర్క్యూట్‌లో తొలి టోర్నీ అయిన రిల్టన్‌ కప్‌లో ప్రణేశ్‌ 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 136 మంది ఆటగాళ్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్‌లో ఆడిన 9 గేమ్‌లలో అతను 8 గెలిచి ఒకటి ఓడాడు. తెలంగాణకు చెందిన రాజా రిత్విక్‌ 6 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ప్రముఖ చెస్‌ కోచ్‌ ఆర్‌బీ రమేశ్‌ వద్ద ప్రణేశ్‌ శిక్షణ పొందుతున్నాడు.  

Free Foodgrains: 81.35 కోట్ల మందికి ఉచితంగా ఆహారధాన్యాలు

Reserve Bank of India: ఇక రీ–కేవైసీ కోసం బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.. 
కేవైసీ విషయంలో బ్యాంక్‌ ఖాతాదారులకు ఊరట కలిగించేలా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయం తీసుకుంది. చెల్లుబాటు అయ్యే పత్రాలను ఖాతాదారులు ఇప్పటికే బ్యాంక్‌కు సమర్పించి తమ చిరునామాను మార్చుకోనట్లయితే.. నో యువర్‌ కస్టమర్‌ (కేవైసీ) వివరాలను అప్‌డేట్‌ చేయడానికి ఇకపై వారి బ్యాంక్‌ శాఖలను సందర్శించాల్సిన అవసరం లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కేవైసీ సమాచారంలో ఎటువంటి మార్పు లేకుంటే కస్టమర్లు నమోదిత ఈ–మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్, ఏటీఎంలు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా స్వీయ డిక్లరేషన్‌ను సమర్పించవచ్చు. కేవైసీ అప్‌డేషన్‌ కోసం కస్టమర్లు శాఖల సందర్శన కోసం బ్యాంకులు పట్టుబట్టరాదని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్న నేపథ్యంలో.. రిజర్వ్‌ బ్యాంక్ జ‌న‌వ‌రి 5న‌ దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది.
దీని ప్రకారం కేవైసీ సమాచారంలో ఎటువంటి మార్పు లేకుంటే.. తిరిగి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి వినియోగదారు నుండి సెల్ఫ్‌ డిక్లరేషన్‌ సరిపోతుంది. ఇందుకు తగు ఏర్పాట్లు చేయాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. చిరునామాలో మార్పు మాత్రమే ఉన్నట్లయితే వినియోగదార్లు ఈ–మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్, ఏటీఎంలు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా సవరించిన/నవీకరించిన చిరునామాను అందించవచ్చు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (10-16 డిసెంబర్ 2022)​​​​​​​

Amazon Layoffs: అమెజాన్‌ ఇండియాలో 1,000 ఉద్యోగాల కోత 
అంతర్జాతీయంగా సిబ్బందిని తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ భారత్‌లో సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీకి భారత్‌లో 1 లక్ష మంది ఉద్యోగులు ఉండగా సుమారు 1 శాతం సిబ్బందిపై ఉద్వాసనల ప్రభావం పడవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా 18,000 మందిని తొలగించాలని నిర్ణయం తీసుకోవడంతో భారత్‌లో 1,000 మంది సిబ్బందిపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా తమ అమెజాన్‌ స్టోర్స్, పీఎక్స్‌టీ (పీపుల్, ఎక్స్‌పీరియన్స్, టెక్నాలజీ) విభాగాల్లో ఎక్కువగా కోతలు ఉండనున్నాయని కంపెనీ ప్రతినిధి తెలిపారు. 2021 డిసెంబర్‌ 31 నాటికి అమెజాన్‌లో 16,08,000 మంది ఫుల్‌ టైమ్, పార్ట్‌ టైమ్‌ ఉద్యోగులు ఉన్నారు.  

Job Layoffs : 2 నెలల్లో 1.25 లక్షల ఉద్యోగాలు తొలగింపు.. భారతీయ టెకీలపైనే ఎక్కువ ప్రభావం..!

Economic Growth: ఈ ఏడాది వృద్ధి 7 శాతమే! 
భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7 శాతానికి పరిమితం అవుతుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) తొలి ముందస్తు అంచనాలు వెల్లడించాయి.2021–22 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (8.7 శాతం) ఇది 1.7 శాతం తక్కువ కావడం గమనార్హం. తయారీ, మైనింగ్‌ రంగాల పేలవ పనితీరు వృద్ధి రేటు అంచనా భారీ తగ్గుదలకు కారణమని తొలి అంచనాలు వెలువరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగంలో అసలు వృద్ధిలేకపోగా 1.6 శాతం క్షీణత నమోదవుతుందని ఎన్‌ఎస్‌ఓ అంచనా. 2021–22లో ఈ రంగం 9.9% వృద్ధిని నమోదుచేసింది. మొత్తం ఎకానమీలో పారిశ్రామిక రంగం వెయిటేజ్‌ దాదాపు 15 శాతంకాగా ఇందులో మెజారిటీ వాటా తయారీ రంగానికి కావడం గమనార్హం. ఇక మైనింగ్‌లో కూడా వృద్ధి రేటు 11.5 శాతం నుంచి 2.4%కి పడిపోతుందని అంచనాలు వెలువడ్డం గమనార్హం. కాగా, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 6.8% అంచనాలకన్నా కేంద్రం అంచనాలు 20 బేసిస్‌ పాయింట్లు అధికంగా ఉంది.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (10-16 డిసెంబర్ 2022)

ఎన్‌ఎస్‌ఓ ప్రకటనలో ముఖ్యాంశాలు ఇవీ.. 
☛ జీడీపీలో దాదాపు 15 శాతం వాటా కలిగిన వ్యవసాయ రంగంలో వృద్ధి 3.5 శాతంగా ఉండనుంది. 2021–22లో ఈ రేటు 3%.  
☛ ట్రేడ్, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్లు,, బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగానికి సంబంధించిన సర్వీసుల వృద్ధి రేటు 11.1 శాతం నుంచి 13.7 శాతానికి చేరనుంది.  
☛ ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్‌ సేవలలో వృద్ధి రేటు 4.2% నుంచి 6.4%కి పెరగనుంది. 
☛ అయితే నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 11.5%నుంచి 9.1 శాతానికి తగ్గనుంది.  
☛ పబ్లిక్‌ అడ్మినిస్టేషన్, రక్షణ, ఇతర సేవల వృద్ధి రేటు కూడా 12.6% నుంచి 7.9%కి పడనుంది.  
☛ స్థూల విలువ జోడింపు (గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌– జీవీఏ) ప్రాతిపదికన 2022–23లో  వృద్ధి రేటు 8.1% నుంచి 6.7%కి తగ్గనుంది. ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రాంతం, పరిశ్రమ లేదా రంగంలో ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవల విలువే జీవీఏ. ఇంకా చెప్పాలంటే జీడీపీలో ఒక నిర్దిష్ట రంగం ఉత్పత్తి తోడ్పాటును జీవీఏ ప్రతిబింబిస్తుంది. అన్ని రంగాల జీవీఏలను కలిపి, పన్నులు– సబ్సిడీలకు సంబంధించి అవసరమైన సర్దుబాటు చేస్తే ఆర్థిక వ్యవస్థ జీడీపీ విలువ వస్తుంది.  
ఎన్‌ఎస్‌ఓ అంచనా విలువల్లో. 
2011–12 స్థిర ధరల ప్రాతిపదికన (ద్రవ్యోల్బణం సర్దుబాటు చేస్తూ) వాస్తవ జీడీపీ విలువ 2021–22లో రూ.147.36 లక్షల కోట్లయితే, ఇది 2022–23లో రూ.157.60 లక్షల కోట్లకు పెరగనుందని ఎన్‌ఎస్‌ఓ తాజా అంచనా.  అంటే వృద్ధి రేటు 7 శాతం అన్నమాట.  

Cryptocurrency: క్రిప్టో కరెన్సీలు పెరిగిపోతే.. ఆర్థిక సంక్షోభమే!


2022–23పై  పలు సంస్థల అంచనాలు (శాతాల్లో) 

సంస్థ    అంచనా     
ఐఎంఎఫ్‌      6.8     
ప్రపంచ బ్యాంక్‌     6.9  
ఫిక్కీ     7.0     
సిటీగ్రూప్‌     6.7     
గోల్డ్‌మన్‌ శాక్స్‌     7.0     
ఆర్‌బీఐ      6.8     
ఏడీబీ     7.0     
ఎస్‌బీఐ     6.8     
మూడీస్‌     7.6  
 క్రిసిల్‌      7.3     
Published date : 07 Jan 2023 06:21PM

Photo Stories