Skip to main content

Daily Current Affairs in Telugu: జ‌న‌వ‌రి 18th, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu January 18th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

Artificial Pancreas: టైప్‌–2 మధుమేహులకు శుభవార్త‌.. ఒంట్లో చక్కెర మోతాదుని నియంత్రించే.. కృత్రిమ క్లోమం 
టైప్‌–2 మధుమేహులకు ఇది నిజంగా శుభవార్త‌. ప్రపంచవ్యాప్తంగా మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. భారత్‌లోనైతే 2019 నాటికి ఏకంగా 7.7 కోట్ల మంది దీని బారిన పడ్డారు. 2045 కల్లా వీరి సంఖ్య 13.4 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ఒంట్లో చక్కెర మోతాదులను ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచేందుకు దోహదపడే కృత్రిమ క్లోమాన్ని కేంబ్రిడ్జి వర్సిటీలోని వెల్‌కమ్‌–ఎంఆర్‌సీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెటబాలిక్‌ సైన్స్‌ పరిశోధకులు తాజాగా అభిృవృద్ధి చేశారు. దీన్నిప్పటికే విజయవంతంగా పరీక్షించి చూశారు. టైప్‌–2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి ఇది వరప్రసాదమేనని వారు చెబుతున్నారు. కామ్‌ఏపీఎస్‌ హెచ్‌ఎక్స్‌గా పిలిచే దీంట్లో గ్లూకోజ్‌ మానిటర్, ఇన్సులిన్‌ పంపు ఉంటాయి. ఇది యాప్‌ సాయంతో పని చేస్తుంది. 
చక్కెర స్థాయి సరైన విధంగా కొనసాగాలంటే ఎప్పుడు ఎంత ఇన్సులిన్‌ అవసరమో అంచనా వేసి చెబుతుంది. ‘‘ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇన్సులిన్‌ ఇంజక్షన్లు తదితరాలతో బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ను సరిగా మెయింటెయిన్‌ చేయడం టైప్‌ 2 డయాబెటిస్‌ రోగుల్లో చాలామందికి సమస్యగా మారింది. అలాంటి వారికి ఈ కృత్రిమ క్లోమం సురక్షితమైన, మెరుగైన ప్రత్యామ్నాయం. దీని టెక్నాలజీ చాలా సులువైనది. కనుక ఇంట్లో సురక్షితంగా వాడుకోవచ్చు’’ అని అధ్యయనానికి సారథ్యం వహించిన చార్లొటీ బౌటన్‌ తెలిపారు. దీని వివరాలు జర్నల్‌ నేచర్‌ మెడిసిన్‌లో పబ్లిషయ్యాయి.  మ‌రిన్ని వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

Heart Diseas: నడకతో గుండె పదిలం..!

Shehbaz Sharif: యుద్ధాలతో గుణపాఠాలు నేర్చుకున్నాం..  పాక్‌ ప్రధాని షహబాజ్‌
భారత్‌తో చర్చలకు సిద్ధమని ప్రకటన

భారత్‌తో మూడు యుద్ధాల అనంతరం గుణపాఠాలు నేర్చుకున్నామని పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అంగీకరించారు. ‘‘భారత్‌తో మూడు యుద్ధాలు చేశాం. సాధించిందేమీ లేదు. పైగా పేదరికం, వేదన, నిరుద్యోగం వచ్చి మీదపడ్డాయి. యుద్ధాలతో గుణపాఠాలు నేర్చుకున్నాం. ఇకమీదటైనా శాంతిమయ జీవనం కొనసాగిస్తాం. తరాలుగా కొనసాగుతున్న సమస్యలకు చెక్‌ పెడదాం. బాంబులు, మందుగుండు సామగ్రి కోసం అమూల్యమైన సహజ వనరులను దుర్వినియోగం చేయడం ఆపేద్దాం. దశాబ్దాలుగా ఘర్షణలకు, యుద్ధాలకు కారణమైన కశ్మీర్‌ వంటి కీలకాంశాలపై భారత్‌తో నిజాయతీతో చర్చలకు సిద్దం’’ అని అల్‌ అరేబియా ఛానెల్‌ ఇంటర్‌వ్యూలో అన్నారు. యూఏఈ మధ్యవర్తిత్వంలో చర్చలు జరిపితే బాగుంటుందన్నారు. ‘ప్రధాని మోదీజీకి నా సందేశం ఒక్కటే. పాకిస్తాన్, ఇండియా పొరుగుదేశాలుగా జీవించాల్సిందే. సంఘర్షణల మధ్య సమయాన్ని, సహజ వనరులను వృధా చేయడం దండగ. శాంతి సామరస్యాలతో పురోగమిద్దాం’ అన్నారు. 

Food Crisis: పాకిస్తాన్‌లో ఆహార సంక్షోభం.. మార్కెట్లలో తొక్కిసలాటలు

Dawood Ibrahim: రెండో పెళ్లి చేసుకున్న అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం  
అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఒక కేసు విచారణ సందర్భంగా ఎన్‌ఐఏ అధికారులకు అతని మేనల్లుడు అలీ షా పార్కర్‌ ఈ మేరకు వెల్లడించారు. ‘‘దావూద్‌కు నలుగురు సోదరులు, నలుగురు అక్కాచెల్లెళ్లు. మొదటి భార్య పేరు మెజబిన్‌. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లయింది. కుటుంబసభ్యులతో కలిసి దావూద్‌ కరాచీలో ఉంటున్నాడు. ఇటీవలే డిఫెన్స్‌ ఏరియాలోని రహీం ఫాకీకి మారాడు. మొదటి భార్యను ఆరు నెలల క్రితం దుబాయ్‌లో కలిశాం. ఆమె నా భార్యకు తరచూ వాట్సాప్‌ కాల్స్‌ చేస్తుంది. ఆమెకు విడాకులిచ్చానని అబద్ధం చెప్పి ఓ పాకిస్తానీ పఠాన్‌ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు’’ అని చెప్పాడు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)

Population: చైనాలో తగ్గిన జనాభా.. 1961 తర్వాత ఇదే తొలిసారి 
చైనాలో 2021 ఏడాది జనాభా లెక్కలతో పోలిస్తే 2022 ఏడాదిలో జనాభా 8,50,000 తగ్గిందని నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ తాజాగా వెల్లడించింది.  అక్క‌డ జనాభా సంఖ్య తగ్గుముఖం పట్టడం 1961 ఏడాది తర్వాత ఇదే తొలిసారి. 2022 ఏడాదిలో చైనా జనాభా 141.18 కోట్లు అని నేషనల్‌ బ్యూరో లెక్క తేల్చింది. జననాల వృద్ధిరేటు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే అంచనావేసిన దానికంటే ముందుగానే చైనాను దాటేసి భారత్‌ ప్రపంచంలోనే అత్యంత అధిక జనాభాగల దేశంగా అవతరించనుంది. 
చైనా ఆర్థిక వృద్ధి రేటు దాదాపు 3 శాతంగా నమోదైన ఈ తరుణంలో జనసంఖ్య సైతం వెనకడుగు వేస్తోంది. గత ఐదు దశాబ్దాల్లో చైనాలో ఇంతటి అత్యల్ప వృద్ధిరేటు నమోదవడం ఇది రెండోసారి. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక, జనాభా విభాగం 2022 అంచనాల ప్రకారం ఈ ఏడాదిలోనే చైనాను భారత్‌ జనసంఖ్యలో అధిగమించనుంది. 2050కల్లా భారత్‌ 166.8 కోట్ల మందితో కిటకిటలాడనుంది. 131.7 కోట్లతో చైనా రెండోస్థానానికి పడిపోనుంది. మ‌రిన్ని వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

Covid: దేశ జనాభాలో 64 శాతం మందికి క‌రోనా!

Laser Beam: మెరుపులనే దారి మళ్లించారు! 
మెరుపు వేగం గంటకు ఏకంగా 4.3 లక్షల కిలోమీటర్ల దాకా ఉంటుంది. మెరుపుల ఫలితంగా విను వీధిలో మన కంటికి కనిపించే కాంతులైతే నిజంగా కాంతి వేగంతోనే (సెకను 3 లక్షల కిలోమీటర్లు) దూసుకెళ్తాయి. అలాంటి మెరుపులను దారి మళ్లించగలిగితే? ఫ్రెంచి పరిశోధకులు తాజాగా అలాంటి ఘనతే సాధించారు. అతి శక్తిమంతమైన లేజర్‌ కిరణాల ద్వారా వాటి దారిని విజయవంతంగా మార్చగలిగారు. పిడుగుపాటు బారినుంచి రక్షించే వ్యవస్థల్లో ఇది విప్లవాత్మక మార్పులు తేగలదని భావిస్తున్నారు. మెరుపును అనుసరిస్తూ వచ్చి పడే పిడుగుల వల్ల భవనాలు, సమాచార వ్యవస్థ, విద్యుత్‌ ఉపకరణాలు, సరఫరా లైన్లు దెబ్బ తిని ఏటా వందలాది కోట్ల డాలర్ల మేరకు నష్టం వాటిల్లడమే గాక వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండటం తెలిసిందే. 
ఈ టెక్నాలజీని మరింతగా అభివృద్ధి చేయగలిగితే దీని సాయంతో విమానాశ్రయాలు, భారీ విద్యుత్కేంద్రాలు, ఉపగ్రహాల లాంచింగ్‌ ప్యాడ్ల వంటి భారీ నిర్మాణాలకు పిడుగుపాట్ల నుంచి పూర్తిస్థాయి రక్షణ క‌ల్పించవచ్చని చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోని ఎకోల్‌ పాలిటెక్నిక్స్ లేబొరేటరీ ఆఫ్‌ అప్లైడ్‌ ఆప్టిక్స్‌కు చెందిన పరిశోధకులు అత్యంత శక్తిమంతమైన లేజర్‌ పరికరాల సాయంతో ఈ ప్రయోగానికి పూనుకున్నారు.  మ‌రిన్ని వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

NASA: 50 వేల ఏళ్ల క్రితం కనిపించిన తోకచుక్క మళ్లీ..

Global Terrorist: అంతర్జాతీయ ఉగ్రవాదిగా మక్కీ
పాకిస్తాన్‌ కేంద్రంగా భారత్‌పైకి ఉగ్రమూకలను ఉసిగొల్పుతున్న లష్కరే తోయిబా ఉగ్రసంస్థ డెప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహ్మాన్‌ మక్కీ(68)ని గ్లోబల్‌ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలంటూ భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పచ్చజెండా ఊపింది. ఆయనను బ్లాక్‌లిస్ట్‌లో చేరుస్తున్నట్లు మండలి జ‌న‌వ‌రి 16న‌ ప్రకటించింది. దీంతో పాక్‌తో అంటకాగుతున్న మరో ఉగ్రమూక కీలక నేతను అంతర్జాతీయంగా ఆర్థిక కార్యకలాపాలు జరపకుండా నిరోధించడంలో ఐరాసలో భారత్‌ నెరిపిన దౌత్యం ఫలించింది. గ్లోబల్‌ టెర్రరిస్ట్‌గా ముద్రపడిన వ్యక్తుల ఆస్తుల స్వాధీనం, బ్యాంకింగ్, ఆర్థిక, ఆయుధాల కార్యకలాపాలకు అడ్డుకట్టపడుతుంది. ప్రస్తుతం లష్కరే తోయిబా రాజకీయ వ్యవహారాల విభాగం చీఫ్‌గా ఉన్న మక్కీ ఆ ఉగ్రసంస్థ చీఫ్‌ హఫీజ్‌ ముహమ్మద్‌ సయీద్‌కు అత్యంత సమీప బంధువు. మక్కీ గతంలో లష్కరే తోయిబాలో వివిధ విభాగాల్లో పనిచేశాడు. ఆ సంస్థకు అంతర్జాతీయంగా నిధులు సమకూర్చే పనిలో బిజీగా ఉండేవాడు.  మ‌రిన్ని వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)


Chopper Crash: హెలికాప్టర్‌ ప్రమాదంలో మంత్రితో సహా 16 మంది దుర్మరణం 
ఉక్రెయిన్ రాజ‌దాని కీవ్ నగరానికి వెలుపల ఉన్న బ్రోవరీ టౌన్‌లోని కిండర్‌గార్డెన్ సమీపంలో జ‌న‌వ‌రి 18న‌(బుధ‌వారం) హెలికాప్టర్‌ కూలిపోవడంతో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు, ఉక్రెయిన్‌ అంతర్గత మంత్రి డెనిస్ మొనాస్టైర్స్కీ తోసహా సుమారు 16 మంది మృతి చెందారని ఉక్రెయిన్‌ పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో అంతర్గత మంత్రిత్వశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఉన్నారని వెల్లడించారు. మరో 10 మంది పిల్లలు సహా 22 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  ఈశాన్య కీవ్‌కు 20 కిలోమీటర్ల దూరంలో బ్రోవరీ టౌన్ ఉంది. బ్రోవరీ పట్టణాన్ని తమ అధీనంలోకి తీసుకునేందుకు ఇటీవల రష్యా బలగాలు ప్రయత్నించగా, ఉక్రెయిన్ బలగాలు గట్టిగా ప్రతిఘటించాయి.

Nepal Plane Crash: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం 72 మంది దుర్మరణం!

Apollo Tyres: హెదరాబాద్‌లో డిజిటల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌
తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో డిజిటల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు అపోలో టైర్స్‌ లిమిటెడ్‌ ప్రకటించింది. లండన్‌ తరువాత ఇది తమ రెండవ డిజిటల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ అని తెలిపింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో, మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్, అపోలో టైర్స్‌ లిమిటెడ్‌ వైస్‌ చైర్మన్, ఎండీ నీరజ్‌ కన్వర్‌లు ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడంలో ఈ డిజిటల్‌ ఇన్నోవేషన్‌ కేంద్రం ప్రధాన పాత్ర పోషిస్తుంది. టీ హబ్, వీ హబ్, టీ వర్క్స్‌ వంటి ప్రపంచ స్థాయి ప్రమాణాలు గల సంస్థలతో వినూత్న ఆవిష్క రణలకు ఊతం ఇచ్చే అద్భుతమైన వ్యవస్థను తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు.  

World Economic Forum: హైదరాబాద్‌లో సీ4ఐఆర్‌ సెంటర్

Allox Advance Materials: తెలంగాణ‌లో మల్టీ గిగా వాట్‌ లిథియం క్యాథోడ్‌ మెటీరియల్‌ తయారీ కేంద్రం
బ్యాటరీల తయారీలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన అలాక్స్‌ అడ్వాన్స్‌ మెటీరియ ల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తెలంగాణలో రూ.750 కోట్ల పెట్టుబడితో మల్టీ గిగా వాట్‌ లిథియం క్యాథోడ్‌ మెటీరియల్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి కె.తారక రామారావు సమక్షంలో అలాక్స్‌ ప్రతినిధులు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ భారీ పరిశ్రమలో లిథియం ఐరన్‌ ఫాస్పేట్‌ బ్యాటరీలు తయారవుతాయి.
తొలుత రూ.210 కోట్ల పెట్టుబడి..
రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా తొలుత రూ.210 కోట్ల పెట్టుబడితో, మూడు గిగా వాట్ల సామర్థ్యంతో లిథియం ఐరన్‌ ఫాస్పేట్‌ బ్యాటరీలను ఉత్పత్తి చేయనున్నట్లు అలాక్స్‌ తెలిపింది. ఈ సామర్థ్యాన్ని భవిష్యత్తులో పది గిగా వాట్లకు పెంచనున్నట్లు స్పష్టం చేసింది. 2030 సంవత్సరం నాటికి మొత్తంగా రూ.750 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు వివరించింది. ప్రతిపాదిత తయారీ కేంద్రంతో సుమారు 600 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (సైన్స్ & టెక్నాలజీ) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)

Published date : 18 Jan 2023 06:19PM

Photo Stories