Skip to main content

జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 8న జాతినుద్దేశించి ప్రసంగించారు.
కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు, జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్‌లుగా విభజించి, రెండింటినీ కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం వంటి నిర్ణయాలకు దారితీసిన కారణాలను తన ప్రసంగం ద్వారా దేశ ప్రజలకు వివరించారు. భూతల స్వర్గమైన కశ్మీర్‌కు మళ్లీ పూర్వ వైభవం తీసుకువచ్చేలా కృషి చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
  • జమ్మూకశ్మీర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. శాంతియుత, సురక్షిత, సమృద్ధ కశ్మీర్ తమ లక్ష్యం.
  • స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. కళ, క్రీడ, సాంస్కృతిక రంగాల్లో వారి నైపుణ్యాలకు అంతర్జాతీయ ఖ్యాతి కల్పిస్తాం.
  • కశ్మీర్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ వల్ల రాష్ట్రానికి గానీ, రాష్ట్ర ప్రజలకు గానీ ఎలాంటి ప్రయోజనం కలగలేదు. ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని రాష్ట్రంలో విస్తరించేందుకు పాకిస్తాన్‌కు మాత్రం ఈ నిబంధనలు బాగా ఉపయోగపడ్డాయి.
  • కశ్మీర్‌లో గత 3 దశాబ్దాల్లోనే అమాయకులైన 42 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్‌లో కొత్త యుగం ప్రారంభమైంది. దీంతో జనసంఘ్ వ్యవస్థాపక నేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, మాజీ ప్రధాని వాజ్‌పేయి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ల స్వప్నం సాకారమైంది.
  • జమ్మూకశ్మీర్ భారత దేశ శిరస్సు, ఈ ప్రాంతాభివృద్ధి మనందరి బాధ్యత.
  • జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగించబోము. కొన్నాళ్ల తరువాత రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తాం.
  • కశ్మీరీల ఆశలు, ఆకాంక్షలు, స్వప్నాలను సాకారం చేసేందుకు అంతా కలసిరావాలి.
  • కశ్మీర్‌లో షూటింగ్‌లు చేయడమే కాకుండా, స్టూడియోలు, థియేటర్లు నిర్మించాలని బాలీవుడ్, తెలుగు, తమిళ, ఇతర సినీ పరిశ్రమల వారికి విజ్ఞప్తి చేస్తున్నా. తద్వారా స్థానికులకు ఉపాధి లభిస్తుంది.
  • లదాఖ్‌కే ప్రత్యేకమైన సేంద్రియ ఉత్పత్తులు, ఔషధ మొక్కలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించేలా చేస్తాం.
  • కశ్మీర్ సహా దేశవ్యాప్తంగా అన్ని చట్టాలు అమలవుతాయి. 1.5 కోట్ల రాష్ట్ర ప్రజలకు ఆ ప్రయోజనాలు అందుతాయి.
  • ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఉద్యోగులు, పోలీసులకు లభిస్తున్న సౌకర్యాలు జమ్మూకశ్మీర్‌లోని ఉద్యోగులకూ కూడా లభిస్తాయి.
  • ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థలను ఏర్పాటు చేస్తాం.
  • జమ్మూకశ్మీర్‌లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. కొత్త ప్రభుత్వం ఏర్పడాలి.ఇకపై ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయి. వంశ పాలనకు ఇక చరమగీతమే. మీ(స్థానికుల) నుంచే ప్రజా ప్రతినిధులు వస్తారు.
  • 1947 తరువాత పాక్ నుంచి ఇక్కడికి వలస వచ్చినవారు ఇన్నాళ్లూ ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. ఇకపై వారికి ఆ అవకాశం లభిస్తుంది.
  • క్రీడల్లో ఆసక్తి, అభినివేశం ఉన్న యువత కోసం శిక్షణ కేంద్రాల ఏర్పాటు, స్పోర్‌‌ట్స అకాడమీల ఏర్పాటు ఉంటుంది. స్థానిక యువత క్రీడానైపుణ్యాలు ఆదరణ పొందాలి.
  • చేతి కళలు, వృత్తి నైపుణ్యాల ఆధారంగా స్థానికులకు ఉపాధి అవకాశం లభిస్తుంది. ఇక్కడి కళాకృతులు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యేలా కృషి చేయాలి.
  • రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థ అద్భుతంగా ఉంది. పంచాయతీ సభ్యులు, ముఖ్యంగా మహిళలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. వారికి కేంద్రం నుంచి ఇకపై మరింత మద్దతు లభిస్తుంది. నిధులు అందుతాయి.
Published date : 09 Aug 2019 05:53PM

Photo Stories