ఎంఎస్‌ఎంఈల అభివృద్ధి సహకారానికి.. రాష్ట్ర పరిశ్రమల శాఖతో ఒప్పందంకుదుకొనున్న బ్యాంక్ ఏది?
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధికి సహకరించేందుకు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్(సిడ్బీ) ముందుకొచ్చింది.
ఈ మేరకు త్వరలోనే రాష్ట్ర పరిశ్రమల శాఖతో ఒప్పందం కుదుర్చుకోనుంది. జిల్లాలవారీగా, ఉత్పత్తుల వారీగా ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ల అభివృద్ధి, ఇప్పటికే ఉన్న యూనిట్ల వ్యాపార విస్తరణ అవకాశాలు వంటి సేవలను సిడ్బీ ఉచితంగా అందించనుంది. ఇందుకోసం రాష్ట్రంలో ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్(పీఎంయూ)ను ఏర్పాటు చేస్తుంది. ఈ పీఎంయూలో గ్రాంట్ థ్రోన్టన్ కన్సల్టెన్సీకి చెందిన ఇద్దరు ఉద్యోగులను నియమించడం ద్వారా ఎంఎస్‌ఎంఈలకు కావాల్సిన సేవలను అందిస్తుంది. దీంతో రాష్ట్రంలో తొలిసారిగా ఎంఎస్‌ఎంఈలకు ఉచితంగా కన్సల్టెన్సీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకుంటూ వ్యాపార విస్తరణ, ఎగుమతి అవకాశాలు వంటి సేవలను గ్రాంట్ థ్రోన్టన్ కన్సల్టెన్సీ ద్వారా సిడ్బీ అందిస్తుంది. అదేవిధంగా ఎంఎస్‌ఎంఈలకు రుణ మంజూరు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాల్లో సేవలను అందించనుంది. జిల్లాకు ఒక ఉత్పత్తి పేరిట పెద్ద ఎత్తున ఎంఎస్‌ఎంఈ రంగాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం తెలిసిందే. ఇప్పుడు సిడ్బీ సహకారంతో ఈ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మరింత ప్రచారం తీసుకురానున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేవిధంగా సిడ్బీతో కలసి కార్యాచరణ ప్రణాళికను తయారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Published date : 18 Feb 2021 05:27PM