Skip to main content

మార్చి 2018 ద్వైపాక్షిక సంబంధాలు

జర్మనీ అధ్యక్షుడితో మోదీ చర్చలు
Current Affairs ఐదు రోజుల భారత పర్యటనకు వచ్చిన జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్.. మార్చి 25న ఢిల్లీలోని సుందర్ నర్సరీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా... వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ఉన్న మార్గాలపై మోదీ, వాల్టర్‌లు చర్చించారు. అంతకుముందు వాల్టర్.. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలిశారు. అనంతరం... మార్చి 25న చెన్నైలోని మద్రాస్ ఐఐటీలో వాణిజ్య వేత్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఫ్రాంక్ వాల్టర్.. మార్చి 26న మహాబలిపురం ఆలయాన్ని సందర్శించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జర్మనీ అధ్యక్షుడి భారత పర్యటన
ఎప్పుడు : మార్చి 22 - 26
ఎవరు : ఫ్రాంక్ వాల్టర్

భగత్ సింగ్ డాక్యుమెంట్లను ప్రదర్శించిన పాకిస్తాన్
భారత స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్‌ను ఉరి తీసి 87 ఏళ్లు అవుతున్న సందర్భంగా పాక్ ప్రభుత్వం అతనికి సంబంధించిన డాక్యుమెంట్లను ప్రదర్శనకు ఉంచింది. మార్చి 26న లాహోర్‌లోని అనార్కలీ స్మారక కేంద్రం వద్దగల పంజాబ్ రాష్ట్ర ఆర్కైవ్‌‌స విభాగంలో వీటిని ప్రదర్శించారు. ఇందులో భగత్ సింగ్‌కు ఉరి శిక్ష విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వు కాపీ, ఆయన చదివిన పుస్తకాలు, జైల్లో ఉన్నప్పుడు వార్తాపత్రికల కోసం భగత్ సింగ్ పెట్టుకున్న దరఖాస్తులు, కుమారుడి ఉరిశిక్షను రద్దు చేయాలంటూ భగత్ సింగ్ తండ్రి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్, ఉరి శిక్షను అమలు చేసినట్లు లాహోర్ జైలు సూపరింటెండెంట్ సంతకంతో ఉన్న పత్రం, జైలు నుంచి భగత్‌సింగ్ తన తండ్రికి రాసిన లేఖలు, కళాశాలలో భగత్ సింగ్ అడ్మిషన్ పొందిన రికార్డులు వంటి వాటిని ప్రదర్శనకు ఉంచారు. భగత్ సింగ్‌ను మార్చి 23, 1931లో బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భగత్ సింగ్ డాక్యుమెంట్ల ప్రదర్శన
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : పాకిస్తాన్ ప్రభుత్వం
ఎక్కడ : లాహోర్‌లోని అనార్కలీ స్మారక కేంద్రం వద్ద
ఎందుకు : భగత్ సింగ్‌ను ఉరి తీసి 87 ఏళ్లు అవుతున్న సందర్భంగా

ఐరాసలో కశ్మీర్‌పై పాక్ వాదనను ఎండగట్టిన భారత్
కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ఐరాసలో పాక్ చేసిన ఆరోపణలను భారత్ సమర్థవంతంగా ఎండగట్టింది. ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్తాన్ ఒక ‘విఫల దేశం’అనీ, దాని నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన గత్యంతరం తమకు లేదని స్పష్టం చేసింది. కశ్మీర్‌లో భారత ప్రభుత్వం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందన్న పాక్ ఆరోపణలకు ఐరాసలో భారత సహాయ కార్యదర్శి మినీదేవి కుమమ్ స్పందించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే అసలైన మానవహక్కుల ఉల్లంఘన అని అన్నారు. కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన అంటూ పాఠాలు చెప్పే ముందు అక్కడ ఉగ్రవాదానికి ఊతమివ్వటం మానాలనీ.. ముంబై, పఠాన్‌కోట్, ఉదీ దాడులకు కారకులను గుర్తించి, శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్‌కు రక్షణ కల్పించిన పాక్‌లో హఫీజ్ సయీద్ వంటి ఎందరో ఉగ్రవాదులు స్వేచ్ఛగా సంచరిస్తున్నారని ఆమె అన్నారు. ఐరాసలో పాకిస్తాన్ శాశ్వత సహాయ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ మాట్లాడుతూ..భారత ప్రభుత్వం కశ్మీర్‌ను ఆక్రమించుకుని మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు.

భారత్-ఫ్రాన్స్ మధ్య 14 ఒప్పందాలు
Current Affairs భారత్-ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడే దిశగా ఇరు దేశాలు అడుగులు వేశాయి. అత్యంత కీలకమైన రక్షణ, భద్రత, అణు ఇంధనం, రహస్య సమాచార రక్షణతో పాటు మొత్తం 14 అంశాలపై భారత్-ఫ్రాన్స్ కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో సహకారాన్ని విసృ్తతం చేయాలని, ఉగ్రవాదం కట్టడికి ఉమ్మడి చర్యలను పెంచాలని నిర్ణయించాయి. ఈ మేరకు మార్చి 10న ఢిల్లీలో ప్రధానిమోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య ద్వైపాక్షిక చర్చల తర్వాత ఇరు దేశాల ఉన్నతాధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు.
ఒప్పందాల్లో సాయుధ దళాల పరస్పర సహకారం, రహస్య సమాచార రక్షణ, జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టు, రైల్వేలు, సౌరశక్తి, సముద్రతీర అవగాహన, మాదక ద్రవ్యాల నియంత్రణ మొదలైనవి ఉన్నాయి. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి జరిగిన వేల కోట్ల రూపాయల విలువైన ఒప్పందం వివరాలను భారత్ వెల్లడించలేదు. 2016లో భారత్-ఫ్రాన్స్ మధ్య 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ.58 వేల కోట్లు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్-ఫ్రాన్స్ మధ్య 14 ఒప్పందాలు
ఎప్పుడు : మార్చి 10
ఎక్కడ : న్యూఢి ల్లీలో
ఎవరు : ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యూయేల్ మాక్రాన్

జోర్డాన్ రాజు భారత పర్యటన
Current Affairs జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 బిన్ అల్ హుస్సేన్.. భారత పర్యటనలో భాగంగా మార్చి 1న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై విసృ్తత స్థాయి చర్చలు జరిపారు. అనంతరం.. రక్షణ, ఉగ్రవాద వ్యతిరేక పోరు సహా 12 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. వైద్యం, మెడిసిన్, రాక్ ఫాస్పేట్, ఎరువుల దీర్ఘకాలిక సరఫరా, కస్టమ్స్ అంశాలు ఈ ఒప్పందాల్లో ఉన్నాయి.
అంతకముందు ‘ఇస్లామిక్ సంస్కృతి: అవగాహన పెంపొందించుట, సంయమనం’ అంశంపై నిర్వహించిన సదస్సులో జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 బిన్ అల్ హుస్సేన్‌తో కలిసి మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదం, తీవ్రవాదంపై చర్యలు ఏ మతానికో వ్యతిరేకంగా చేస్తున్నవి కాదని, అమాయకులపై అకృత్యాలకు పాల్పడేలా యువతను రెచ్చగొడుతున్న ఆలోచనా విధానాన్ని తిప్పికొట్టేందుకేనని మోదీ పేర్కొన్నారు. ముస్లిం యువత ఒక చేతిలో ఖురాన్, మరో చేతిలో కంప్యూటర్ పట్టుకున్నప్పుడే పూర్తిస్థాయి సంక్షేమం, సమగ్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ - జోర్డాన్ మధ్య 12 ఒప్పందాలు
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ, జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 బిన్ అల్ హుస్సేన్
ఎందుకు : జోర్డాన్ రాజు భారత పర్యటనలో భాగంగా

వియత్నాం అధ్యక్షుడిభారత పర్యటన
వియత్నాం అధ్యక్షుడు త్రాన్ దాయి క్వాంగ్.. భారత్ పర్యటనలో భాగంగా మార్చి 3న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ భద్రత తదితర అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం.. మూడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. అణు ఇంధనం, వాణిజ్యం, వ్యవసాయం రంగాలతోపాటు ఆయిల్, గ్యాస్ నిక్షేపాల అన్వేషణలో సహకారం పెంచుకునేందుకు అంగీకరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ - వియత్నాం మధ్య 3 ఒప్పందాలు
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : ప్రధాని మోదీ, వియత్నాం అధ్యక్షుడు త్రాన్ దాయి క్వాంగ్
ఎక్కడ : న్యూఢిల్లీలో
Published date : 15 Mar 2018 12:51PM

Photo Stories