Skip to main content

జూన్ 2019 ద్వైపాక్షిక సంబంధాలు

భారత్‌తో కలిసి పనిచేస్తాం: పాంపియో
Current Affairs ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం భారత్‌తో కలిసి పని చేసేందుకు అమెరికా కట్టుబడి ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్పష్టం చేశారు. జూన్ 25 నుంచి రెండు రోజుల పాటు భారత్ పర్యటనకు రానున్న పాంపియో జూన్ 21న భారత్ విదేశాంగ మంత్రి జయశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ద్వైపాక్షిక భద్రత, ఆర్థిక భాగస్వామ్యాల గురించి ఇరువురు నేతలు చర్చించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌తో కలిసి పనిచేస్తాం
ఎప్పుడు : జూన్ 21
ఎవరు : అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో
ఎందుకు : ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం

ఎన్‌ఎస్‌జీలో భారత్‌కు సభ్యత్వ అంశం లేదు
కజకిస్థాన్ రాజధాని నూర్-సుల్తాన్(ఆస్థానా) జూన్ 20, 21 తేదీల్లో జరిగే అణు సరఫరాదారుల బృందం(ఎన్‌ఎస్‌జీ) సమావేశం అజెండాలో భారత్‌కు సభ్యత్వాన్ని ఇచ్చే అంశం లేదని చైనా స్పష్టం చేసింది. 2016 మేలో ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం కోసం భారత్ దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి చైనా అడ్డుపడుతోంది. ఎన్‌పీటీపై సంతకం చేసిన వారికే సభ్యత్వం ఇవ్వాలని వాదిస్తోంది. ఎన్‌పీటీపై భారత్, పాకిస్థాన్ సంతకాలు చేయలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌ఎస్‌జీ సమావేశం అజెండాలో భారత్‌కు సభ్యత్వాన్ని ఇచ్చే అంశం లేదు
ఎప్పుడు : జూన్ 21
ఎవరు : చైనా
ఎక్కడ : నూర్-సుల్తాన్, కజకిస్థాన్

నిట్ వరంగల్-తైవాన్ వర్సిటీల మధ్య ఎంఓయూ
నిట్ వరంగల్-తైవాన్ యూనివర్సిటీల మధ్య ఎంఓయూ కుదిరింది. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని నిట్‌లో జూన్ 22న నిర్వహించిన ఇండియా-తైవాన్ వైస్ చాన్స్‌లర్, ప్రెసిడెంట్, డెరైక్టర్ ఫోరమ్-2019 సదస్సు సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. బెటర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనలైజేషన్, క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ ఎంప్లాయిబిలిటీ అనే అంశంతో ఈ సదస్సు జరిగింది. ఎన్‌బీఏ చైర్మన్ ప్రొఫెసర్ కె.కె.అగర్వాల్ సదస్సును ప్రారంభించి మాట్లాడుతూ నిట్ వరంగల్-తైవాన్ మధ్య ఒప్పందంతో విద్యా కేంద్రంగా తెలంగాణ రాణిస్తుందని, వృత్తి నైపుణ్యత విద్యనందిస్తూ ఉద్యోగావకాశాలకు నాంది పలకాలని కోరారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నిట్ వరంగల్-తైవాన్ వర్సిటీల మధ్య ఎంఓయూ
ఎప్పుడు : జూన్ 22
ఎక్కడ : నిట్, కాజీపేట, వరంగల్ అర్బన్

అమెరికా మత నివేదికపై భారత్ ఆగ్రహం
అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా విడుదల చేసిన నివేదికపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతదేశంలోని ప్రజల రాజ్యాంగహక్కుల గురించి మాట్లాడే హక్కు ఓ విదేశీ ప్రభుత్వానికి లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. 2018లో అంతర్జాతీయ మతస్వేచ్ఛకు సంబంధించి అమెరికా ప్రభుత్వం జూన్ 21న నివేదిక విడుదల చేసింది. భారత్‌లో మైనారిటీలపై హిందూ అతివాద సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని ఆ నివేదికలో పేర్కొంది. గోమాంసాన్ని రవాణా చేయడం, గోవధ చేశారనే ఆరోపణలతో ముస్లింలపై దాడులు చేస్తున్నారని ఆరోపించింది. అమెరికా విదేశాంగ శాఖ తన నివేదికలో చెప్పిన అంశాలను భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ జూన్ 23న ఖండించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా మత నివేదికపై భారత్ ఆగ్రహం
ఎప్పుడు : జూన్ 23
ఎవరు : భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్
ఎందుకు : భారత్‌లో మైనారిటీలపై హిందూ అతివాద సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించడంతో

మోదీ, పుతిన్‌లతో జిన్‌పింగ్ భేటీ
జి-20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లతో చైనా అధినేత జిన్‌పింగ్ భేటీ కానున్నారు. జపాన్‌లోని ఒసాకాలో జూన్ 28, 29వ తేదీల్లో జి-20 దేశాల శిఖరాగ్ర సమావేశం జరగనుంది. దిగుమతులపై భారీగా పన్నులు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న ఏకపక్ష, రక్షణాత్మక విధానాలపై ఈ సందర్భంగా వీరు ప్రముఖంగా చర్చిస్తారని చైనా అధికారులు తెలిపారు. భారత్, రష్యాలతోపాటు బ్రిక్స్‌లోని ఇతర సభ్య దేశాలు బ్రెజిల్, దక్షిణాఫ్రికాలతోనూ జిన్‌పింగ్ చర్చలు జరుపుతారని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లతో భేటీ
ఎప్పుడు : జూన్ 28, 29వ తేదీల్లో
ఎవరు : చైనా అధినేత జిన్‌పింగ్
ఎక్కడ : ఒసాకా, జపాన్

మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగిస్తాం: ఆంటిగ్వా
పంజాబ్ నేషనల్ బ్యాంకుకి రూ.14వేలకోట్లు కుచ్చుటోపి పెట్టిన కేసులో పరారీలో ఉన్న నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగిస్తామని ఆంటిగ్వా ప్రభుత్వం ప్రకటించింది. అతని పౌరసత్వాన్ని రద్దు చేస్తామని, న్యాయపరమైన ప్రక్రియ ముగిశాక భారత్‌కు అప్పగిస్తామని ఆంటిగ్వా ప్రధాని గ్యాస్టన్ బ్రౌనే జూన్ 25న వెల్లడించారు. పీఎన్‌బీలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చాక చోక్సీ 2018, ఏడాది జనవరిలో పరారై ఆంటిగ్వాలో తలదాచుకుంటున్నాడు. అంతకు ముందే 2017 నవంబర్‌లో సిటిజెన్‌షిప్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రోగ్రామ్ (సీఐపీ) కింద ఆంటిగ్వా, బార్బడా జంట దీవుల పౌరసత్వాన్ని తీసుకున్నాడు. లక్ష అమెరికా డాలర్లను ఇన్‌వెస్ట్ చేసి ఆంటిగ్వా, బార్బడా పౌరసత్వాన్ని ఎవరైనా తీసుకోవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగిస్తాం
ఎప్పుడు : జూన్ 25
ఎవరు : ఆంటిగ్వా ప్రధాని గ్యాస్టన్ బ్రౌనే

ప్రధాని మోదీతో అమెరికా మంత్రి సమావేశం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమావేశమయ్యారు. న్యూఢిల్లీలో జూన్ 26న జరిగిన ఈ సమావేశంలో ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. అనంతరం భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్‌తో పాంపియో సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో, ఉగ్రవాద వ్యతిరేకపోరులో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని భారత్-అమెరికాలు నిర్ణయించాయి.
పాంపియోతో భేటీ సందర్భంగ జైశంకర్ స్పందిస్తూ.. ఇతర దేశాలతో వ్యవహరించే విషయంలో తమకు భారత ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు విషయంలో అమెరికా ఆందోళనలను కొట్టిపడేశారు. రష్యా నుంచి ఆయుధాలు, సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేసే దేశాలపై అమెరికా కాంగ్రెస్ కాట్సా చట్టం (కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్) తెచ్చింది. దీని కారణంగా భారత్‌పై కూడా ప్రభావం పడుతోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి సమావేశం
ఎప్పుడు : జూన్ 26
ఎవరు : మైక్ పాంపియో
ఎక్కడ : న్యూఢిల్లీ

జిన్‌పింగ్, పుతిన్‌లతో మోదీ భేటీ
Current Affairs కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జూన్ 13న ప్రారంభమైన షాంఘై సహకార సదస్సు(ఎస్‌సీవో)కు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ వేర్వేరుగా సమావేశమయ్యారు. జిన్‌పింగ్‌తో భేటీ సందర్భంగా భారత్-చైనాల మధ్య వేర్వేరు రంగాల్లో పరస్పర సహకారం పెంపొందించుకోవడంపై చర్చించామని మోదీ తెలిపారు. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న విషయాన్ని మోదీ జిన్‌పింగ్ దృష్టికి తీసుకొచ్చారు.
ఎస్‌సీవో సదస్సు నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ మోదీ సమావేశమయ్యారు. ఈ భేటీలో భాగంగా భారత్-రష్యాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను పటిష్టం చేసుకోవాలని మోదీ, పుతిన్ నిర్ణయించారు. బిష్కెక్‌లో ఎస్‌సీవో భేటీ జూన్ 13 నుంచి రెండ్రోజుల పాటు సాగనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో వేర్వేరుగా భేటీ
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బిష్కెక్, కిర్గిస్థాన్

ఫోర్బ్స్ జాబితాలో 57 భారత కంపెనీలు
ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ‘ప్రపంచంలోని అతిపెద్ద పబ్లిక్ కంపెనీలు-2000’ జాబితాలో మొత్తం 57 భారత కంపెనీలకు చోటు లభించింది. జూన్ 13న విడుదలైన ఈ జాబితాలో ఇండస్టియ్రల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా(ఐసీబీసీ) వరుసగా ఏడో ఏడాదీ అగ్రస్థానంలో నిలిచింది.
ఫోర్బ్స్ జాబితాలోని అంశాలు
  • చమురు రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అంతర్జాతీయంగా 11వ స్థానం లభించగా.. రాయల్ డచ్ షెల్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
  • భారత సంస్థల్లో తొలి ర్యాంకులో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయంగా 71వ స్థానంలో నిలిచింది.
  • వినియోగదారు ఆర్థిక రంగం( కన్సూమర్ ఫైనాన్స్)లో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ తొలి స్థానంలో ఉండగా.. హెచ్‌డీఎఫ్‌సీ ఏడో ర్యాంకులో నిలిచింది. మొత్తం జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీది 332వ స్థానం.
  • భారత్ నుంచి కేవలం రిలయ ఇండస్ట్రీస్ మాత్రమే టాప్-200 జాబితాలో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(209), ఓఎన్‌జీసీ(220), ఇండియన్ ఆయిల్(288), హెచ్‌డీఎఫ్‌సీ(332)లు కూడా మెరుగైన ర్యాంకులనే దక్కించుకున్నాయి.
  • మొత్తం జాబితాలో తొలి పది స్థానాల్లో ఐసీబీసీ, జేపీ మోర్గాన్, చైనా కన్‌స్టక్ష్రన్ బ్యాంక్, అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా, బ్యాంక్ ఆఫ్ అమెరికా, యాపిల్, పింగ్ యాన్ ఇన్సూరెన్స్ గ్రూప్, బ్యాంక్ ఆఫ్ చైనా, రాయల్ డచ్ షెల్, వెల్స్ ఫార్గోలు ఉన్నాయి.
  • టాప్-500 సంస్థల్లో భారత్‌కు చెందిన టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, కోల్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, బీపీసీఎల్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, విప్రో ఉన్నాయి.
  • 2,000 కంపెనీల తుది జాబితాలో 575 అమెరికా కంపెనీలు.. చైనా, హాంకాంగ్ (309), జపాన్ (223) కంపెనీలు ఉన్నాయి.

కిర్గిజ్‌తో పెట్టుబడుల ఒప్పందం
కిర్గిజిస్తాన్, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుకోవడానికి ఇరు దేశాలు అయిదేళ్ల మార్గదర్శ ప్రణాళికలను రూపొందించుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్‌లో జూన్ 14న జరిగిన భారత్- కిర్గిజ్ బిజినెస్ ఫోరం సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. అలాగే, ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం (డీటీఏఏ), ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందానికి తుది రూపు కూడా ఇచ్చినట్లు వెల్లడించారు.
మరోవైపు కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు సూరోన్‌బే జీన్‌బెకోవ్‌తో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ దేశానికి రూ.1400 కోట్లు (200 మిలియన్ డాలర్లు) రుణంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా రెండు దేశాలు 15 ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కిర్గిజిస్తాన్‌తో పెట్టుబడుల ఒప్పందం
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బిష్కెక్, కిర్గిజిస్తాన్

శ్రీలంక అధ్యక్షుడితో మోదీ చర్చలు
Current Affairs ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో చర్చలు జరిపారు. శ్రీలంక రాజధాని కొలంబోలో జూన్ 9న జరిగిన ఈ భేటీ సందర్భంగా ఇద్దరు నేతలు ద్వైపాక్షిక, ఉమ్మడి ప్రాధాన్య అంశాలపై చర్చించారు. ఉగ్రవాదంతో భారత్, శ్రీలంక ఉభయ దేశాలకూ ముప్పు ఏర్పడిందని మోదీ అన్నారు. దీనిని ఉమ్మడిగా ఎదుర్కోవలసి ఉందని పిలుపునిచ్చారు. భేటీ సందర్భంగా మోదీకి ధ్యానముద్రలో ఉన్న బుద్ధుని శిల్పం ప్రతిని సిరిసేన బహూకరించారు.
ఏప్రిల్ 21న ఈస్టర్ పర్వదినం సందర్భంగా చర్చిలపై ఉగ్రవాదుల దాడులు జరిగిన అనంతరం శ్రీలంకను సందర్శించిన తొలి విదేశీ నేత మోదీనే. పర్యటనలో భాగంగా ఉగ్రవాదుల దాడికి గురయిన సెయింట్ ఆంథోనీ చర్చిని సందర్శించిన మోదీ బాధితులకు నివాళులు అర్పించారు. ఏప్రిల్‌లో తౌహీద్ జమాత్ అనే ఉగ్ర సంస్థ జరిపిన దాడుల్లో వందలాది అమాయకులు మృతి చెందిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో చర్చలు
ఎప్పుడు : జూన్ 9
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : కొలంబో, శ్రీలంక

మాల్దీవుల పార్లమెంటులో మోదీ ప్రసంగం
మాల్దీవుల పార్లమెంటు పీపుల్స్ మజ్లిస్‌ను ఉద్దేశించి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ జూన్ 8న ప్రసంగించారు. పభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమే ప్రపంచానికి అతిపెద్ద ముప్పుగా మారిందని, దీనిపై పోరాటం సాగించేందుకు అందరూ ఏకం కావాలని ఈ సందర్భంగా మోదీ ప్రపంచనేతలకు పిలుపునిచ్చారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన మోదీ ‘పొరుగుకే మొదటి ప్రాధాన్యం’అన్న ప్రభుత్వ విధానంలో భాగంగా మొట్టమొదటి పర్యటన మాల్దీవులతో ప్రారంభించారు.
మోదీకి రూల్ ఆఫ్ నిషాన్...
మోదీ పర్యటన సందర్భంగా మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ సోలిహ్ ఆయనకు విదేశీ ప్రముఖులకిచ్చే అత్యున్నత పురస్కారం రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్‌తో గౌరవించారు. మోదీ భారత క్రికెట్ జట్టు సభ్యుల సంతకాలతో కూడిన క్రికెట్ బ్యాట్‌ను సోలిహ్‌కి బహూకరించారు. రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు క్రికెట్ దోహదపడుతుందని, మాల్దీవుల్లో క్రికెట్ అభివృద్ధికి సాయపడతామని మోదీ తెలిపారు.
మాల్దీవుల అధ్యక్షుడు సోలిహ్‌తో భేటీ అయిన మోదీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య ఫెర్రీ సేవలను ప్రారంభించడం వంటి పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. రెండు దేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కలిసికట్టుగా సమర్థంగా ఎదుర్కోవాలని ఇద్దరు నేతల ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మాల్దీవుల పార్లమెంటు పీపుల్స్ మజ్లిస్‌ను ఉద్దేశించి ప్రసంగం
ఎప్పుడు : జూన్ 8
ఎవరు : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ

విశాఖ చేరుకున్న అమెరికా నౌక
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాకు చెందిన యూఎస్ జాన్ పి ముర్తా (ఎల్‌పీడీ)-26) సాన్ ఆంటోనియా నౌక జూన్ 11న విశాఖపట్నంలోని తూర్పు నావికాదళానికి చేరుకుంది. అమెరికా నౌకలో వచ్చిన కెప్టెన్ కెవిన్ లానే ప్రతినిధి బృందం విఖలో నాలుగు రోజులు పర్యటించనుంది. వారు ఆయా రంగాల నిపుణులతో చర్చలు, క్రాస్ డెక్ సందర్శన, క్రీడా తదితర కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. భారత నేవీకి చెందిన ఐఎన్‌ఎస్ రన్‌విజయ్ నౌకతో కలసి ముర్తా విన్యాసాల్లో పాల్గొంటుందని ఈస్ట్రన్ నేవల్ కమాండ్ (ఈఎన్‌సీ) అధికారులు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విశాఖ చేరుకున్న అమెరికా నౌక
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : యూఎస్ జాన్ పి ముర్తా (ఎల్‌పీడీ)-26) సాన్ ఆంటోనియా నౌక
ఎందుకు : నాలుగు రోజుల పర్యటనలో భాగంగా

భారత్‌లో చైనా రాయబారిగా వీడాంగ్
భారత్‌లో తమ కొత్త రాయబారిగా సీనియర్ దౌత్యవేత్త సున్ వీడాంగ్‌ను చైనా ప్రభుత్వం నియమించింది. భారత్‌లో చైనా రాయబారిగా ఉన్న లో జుహుయీనిని విదేశాంగశాఖ సహాయమంత్రిగా నియమించింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ 2009-13 మధ్యకాలంలో చైనాలో భారత రాయబారిగా పనిచేసిన కాలంలో వీడాంగ్‌తో ఆయనకు మంచి అనుబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే చైనా విదేశాంగశాఖ పాలసీ-ప్రణాళికా విభాగంలో డెరైక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న వీడాంగ్‌ను భారత్‌లో తమ రాయబారిగా చైనా నియమించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లో చైనా రాయబారి నియామకం
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : సున్ వీడాంగ్

బిమ్స్‌టెక్ అధినేతలతో ప్రధాని మోదీ భేటీ
Current Affairs తన ప్రమాణస్వీకారానికి హాజరైన బిమ్స్‌టెక్(బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్, నేపాల్, భూటాన్) దేశాల అధినేతలతో ప్రధాని నరేంద్ర మోదీ మే 31న ఢిల్లీలో వేర్వేరుగా భేటీ అయ్యారు. తొలుత శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో సమావేశమైన మోదీ, ఉగ్రవాదం, తీవ్రవాదం ప్రపంచదేశాలకు పెనుసవాలుగా మారాయని అభిప్రాయపడ్డారు. దక్షిణాసియా భద్రత, శాంతి, సుస్థిరతల కోసం ఇరుదేశాలు కలసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు.
అనంతరం మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నౌత్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, భూటాన్ ప్రధాని లోతెయ్ శెరింగ్, బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హామీద్‌లతో వేర్వేరుగా సమావేశమైన మోదీ, అన్నిరంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని నిర్ణయించారు. 1997లో ఏర్పాటైన బిమ్స్‌టెక్‌లో భారత్ సహా ఏడు దేశాలు సభ్యులుగా ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బిమ్స్‌టెక్ అధినేతలతో భేటీ
ఎప్పుడు : మే 31
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఢిల్లీ

భారత్‌కు జీఎస్‌పీ హోదా రద్దు
భారత్‌కు కల్పించిన ప్రాధాన్య వాణిజ్య హోదా(జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్-జీఎస్‌పీ)ని అమెరికా రద్దు చేసింది. 2019, జూన్ 5వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దాంతో ఈ హోదా కింద భారత్‌కు అమెరికా నుంచి అందుతున్న సుమారు రూ.39 వేల కోట్ల(560 కోట్ల డాలర్లు) విలువైన వాణిజ్య రాయితీలు రద్దవుతాయి. తన మార్కెట్లలోకి అమెరికా ఉత్పత్తులకు సమానమైన అవకాశం కల్పిస్తామని భారత్ హామీ ఇవ్వదని నిర్ధారణకు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
వర్థమాన దేశాల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా అమెరికా చాలా ఏళ్ల నుంచి ఈ జీఎస్‌పీ హోదా విధానాన్ని అమలు పరుస్తోంది. ఈ హోదా పొందిన దేశాల నుంచి అమెరికా ఎలాంటి సుంకాలు విధించకుండా వేలాది ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. హోదా పొందాలంటే అమెరికా కంపెనీలు, పౌరులకు అనుకూలంగా వచ్చే మధ్యవర్తిత్వ తీర్పులను గౌరవించడం, అంతర్జాతీయ గుర్తింపు పొందిన కార్మిక హక్కులను గౌరవించడం,మేథో హక్కులను పరిరక్షించడం, అమెరికా కంపెనీలకు సమానమైన, సహేతుకమైన అవకాశం కల్పించడం వంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌కు జీఎస్‌పీ హోదా రద్దు
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : అమెరికా

విమానాల నిర్వహణపై బోయింగ్ ఒప్పందం
భారత్‌లో విమానాల నిర్వహణ వ్యవస్థను ఆధునీకరించేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)తో కలిసి పదేళ్ల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు బోయింగ్ తెలియజేసింది. ఈ రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు తాము సాంకేతిక సహకారం అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ కార్యాచరణ ప్రణాళిక 18 నెలల్లో సిద్ధం కావచ్చని, అమెరికా ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(యూఎస్‌టీడీఏ) నిధులతో దీన్ని చేపట్టనున్నామని సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఏఏఐ నేతృత్వంలో 125 విమానాశ్రయాలను కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏఏఐ చైర్మన్‌గా గురుప్రసాద్ మొహపాత్రా వ్యవహరిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లో విమానాల నిర్వహణ వ్యవస్థపై ఒప్పందం
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), బోయింగ్
Published date : 18 Jun 2019 04:03PM

Photo Stories