Skip to main content

జనవరి 2020 ద్వైపాక్షిక సంబంధాలు

చైనాలో భారత గణతంత్ర వేడుకలు రద్దు
Current Affairs
చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోన్న నేపథ్యంలో చైనాలో భారత రాయబార కార్యాలయం 2020 భారత గణతంత్ర వేడుకల్ని రద్దు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమిగూడటం, సభలు, సమావేశాలపై చైనా ప్రభుత్వం నిషేధం విధించడంతో జనవరి 24న ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్త సంవత్సర వేడుకలకి దూరం
చైనాలో జనవరి 25న కొత్త సంవత్సరం ప్రవేశిస్తోంది. ఏటా వసంత రుతువుకి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతారు. కానీ, కరోనా వైరస్ కారణంగా ప్రజలెవరూ ఈ వేడుకల్ని జరుపుకోవడం లేదు. ప్రభుత్వం కూడా అధికారిక ఉత్సవాల్ని రద్దు చేసింది.
26కి చేరిన మృతుల సంఖ్య
చైనాలో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య జనవరి 24న నాటికి 26కి చేరుకుంది. తాజాగా మరో 880 మంది ఈ వైరస్‌తో న్యుమోనియా బారినపడ్డారు.
10 రోజుల్లో ఆస్పత్రి నిర్మాణం
కరోనా వైరస్ సోకిన వారికి చికిత్సచేసేందుకు ప్రత్యేకంగా వెయి్య పడకల ఆస్పత్రిని వుహాన్‌లో నిర్మిస్తున్నట్టు చైనా ప్రభుత్వం ప్రకటించింది. కేవలం 10 రోజుల్లో ప్రీ ఫాబ్రికేటెడ్ విధానంలో దీని నిర్మాణం పూర్తయ్యేలా నిరంతరాయంగా పనులు చేయిస్తున్నారు. దాదాపు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1,000 పడకలు కలిగిన ఆస్పత్రిని నిర్మించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020 భారత గణతంత్ర వేడుకలు రద్దు
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : చైనాలో భారత రాయబార కార్యాలయం
ఎక్కడ : చైనా
ఎందుకు : ప్రాణాంతక కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోన్న నేపథ్యంలో

భారత్, బ్రెజిల్ మధ్య 15 ఒప్పందాలు
ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి, వ్యూహాత్మక సంబంధాలను విసృ్తతం చేయడానికి భారత్, బ్రెజిల్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాయి. ఇందులో భాగంగా, రక్షణ, భద్రత, వాణిజ్యం, వ్యవసాయం, పౌరవిమానయానం, ఇంధన, ఆరోగ్యం, పరిశోధన రంగాల్లో మరింతగా సహకరించుకునేందుకు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పనిచేసేందుకు అంగీకరించాయి. ఈ మేరకు న్యూఢిల్లీలో జనవరి 25న జరిగిన కార్యక్రమంలో 15 ఒప్పందాలు చేసుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు జయిర్ బొల్సనారో సమక్షంలో రెండు దేశాల అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో బ్రెజిల్‌ను కీలకమైన భాగస్వామిగా వర్ణించారు. ఇప్పటికే బలంగా ఉన్న రెండు దేశాల సంబంధాలు తాజాగా కుదిరిన ఒప్పందాలతో మరింత దృఢమవుతాయని బొల్సనారో పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్, బ్రెజిల్ మధ్య 15 ఒప్పందాలు
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు జయిర్ బొల్సనారో
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వ్యహాత్మక బందాలను విసృ్తతం చేయడానికి

భారత్, పాక్ మధ్యవర్తిగా ఉంటాం : నేపాల్
భారత్, పాకిస్తాన్‌ల మధ్య విభేదాల పరిష్కారంలో మధ్యవర్తిగా వ్యవహరించేందుకు నేపాల్ ముందుకువచ్చింది. రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించడం ద్వారా సార్క్(దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సమాఖ్య)ను పునరుత్తేజం చేస్తామని తెలిపింది. శాంతియుత చర్చల ద్వారా ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అవుతుందని సార్క్ చైర్మన్‌గా ఉన్న నేపాల్ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్, పాకిస్తాన్‌ల మధ్యవర్తిగా ఉంటాం
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : నేపాల్
ఎందుకు : భారత్, పాకిస్తాన్‌ల మధ్య విభేదాల పరిష్కారానికి

ఈయూ పార్లమెంట్‌కి లోక్‌సభ స్పీకర్ లేఖ
భారత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా యూరోపియన్ యూనియన్(ఈయూ) తీర్మానించడంపై ఈయూ పార్లమెంట్ ప్రెసిడెంట్ డేవిడ్ మరియా సస్సోలీకి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జనవరి 27న లేఖ రాశారు. ‘పొరుగు దేశాల్లో మత వివక్షకు గురైన శరణార్థులకు పౌరసత్వం కల్పించేందుకు సీఏఏ చట్టం తెచ్చారు. ఈ చట్టం ప్రమాదకరమంటూ యూరోపియన్ పార్లమెంట్‌లో తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సభ్యులుగా తోటి శాసనసభలను, ప్రజాస్వామ్య దేశాల విధానాలను గౌరవించాలి. ఒక శాసన వ్యవస్థపై మరో శాసనవ్యవస్థ తీర్పు ఇవ్వడం సరైన విధానం కాదు’ అని లేఖలో పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈయూ పార్లమెంట్ ప్రెసిడెంట్ డేవిడ్ మరియా సస్సోలీకి లేఖ
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : భారత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
ఎందుకు : భారత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ఈయూ తీర్మానించిన నేపథ్యంలో

పౌరసత్వ చట్టంపై ఈయూలో ఓటింగ్ వాయిదా
మోదీ సర్కార్ తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా యూరోపియన్ పార్లమెంట్లో చర్చకు రంగం సిద్ధమైంది. యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు సీఏఏపై చర్చ కోరుతూ దాఖలు చేసిన ఐదు తీర్మానాలను కలిపి ఒకటిగా చేసి, బ్రసెల్స్‌లో జరుగుతున్న ప్లీనరీలో ప్రవేశపెట్టారు. ఈ అంశాన్ని జనవరి 29న సమావేశాల తుది ఎజెండాలో చేర్చారు. చర్చ అనంతరం జనవరి 30న జరగాల్సిన ఓటింగ్‌ను వాయిదా వేశారు. ఓటింగ్ మార్చి నెలలో జరిగే సమావేశాల్లో నిర్వహిస్తామని యూరోపియన్ పార్లమెంట్ ప్రకటించింది. సీఏఏపై చర్చను మాత్రం ఇప్పుడు కొనసాగించి, ఓటింగ్‌ను మార్చికి వాయిదా వేయాలన్న సభ్యుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామంది. భారత్ వ్యతిరేకత కారణంగానే ఓటింగ్ వాయిదా పడిందని, ఇది భారత ప్రభుత్వ దౌత్య విజయమని విశ్లేషకులు భావిస్తున్నారు. యూరోపియన్ పార్లమెంట్ తీరును భారత్ తీవ్రంగా గర్హించింది. ఒక రాజ్యాంగబద్ధసంస్థ చేసిన చట్టంపై మరో రాజ్యాంగబద్ధ సంస్థ తీర్పునివ్వడం సరికాదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడికి లేఖ రాశారు. సీఏఏ వివక్షాపూరితమని, ఆ చట్టంలోని వివాదాస్పద సవరణలను భారత్ వెనక్కు తీసుకోవాలని డిసెంబర్ నెలలో ఐరాస మానవహక్కుల విభాగం ‘యూఎన్‌హెచ్‌సీఆర్’ చేసిన వ్యాఖ్యను ఈయూ పార్లమెంట్ పరిగణనలోకి తీసుకుంది.
అమెరికాలో..
సీఏఏ, ఎన్నార్సీలు అమెరికా ప్రతినిధులసభలో మరోమారు చర్చనీయాంశంగా మారాయి. సీఏఏ, ఎన్నార్సీలు మతపరమైన హింసకు సాక్ష్యంగా నిలుస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు విచారణ సందర్భంగా సభకు వివరించారు. అంతర్జాతీయ మానవహక్కుల ఉపసంఘాలూ, గ్లోబల్ హెల్త్ ఉపసంఘాలూ, సివిల్ రైట్స్, సివిల్ లిబర్టీస్‌సబ్ కమిటీలూ, ఆఫ్రికా విదేశాంగ వ్యవహారాల కమిటీలు ఈ విచారణను చేపట్టాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పౌరసత్వ చట్టంపై ఈయూలో ఓటింగ్ వాయిదా
ఎప్పుడు: జనవరి 29, 2020
ఎక్కడ: లండన్
ఎందుకు: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా

భారత్, నేపాల్ మధ్య కొత్త చెక్‌పోస్ట్ ప్రారంభం
Current Affairs
భారత్-నేపాల్ సరిహద్దుల్లో భారత్ సాయంతో నేపాల్ నిర్మించిన ‘జోగ్‌బని-బిరాట్‌నగర్’ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ ప్రారంభమైంది. ఈ చెక్‌పోస్ట్‌ను వీడియో లింక్ ద్వారా జనవరి 21న ఇరుదేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, కేపీ శర్మ ఓలి సంయుక్తంగా ప్రారంభించారు. ద్వైపాక్షిక వాణిజ్య వృద్ధి, ఇరుదేశాల ప్రజల మధ్య ప్రత్యక్ష సంబంధాలు లక్ష్యంగా ఈ చెక్‌పోస్ట్‌ను రూపొందించారు. 260 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ చెక్‌పోస్ట్ నిర్మాణం కోసం భారత్ రూ. 140 కోట్ల ఆర్థిక సాయాన్ని నేపాల్‌కు అందించింది.
చెక్‌పోస్ట్ ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడుతూ.. స్నేహపూర్వక పొరుగు దేశాలతో సత్సంబంధాలకు భారత్ కట్టుబడి ఉందన్నారు. ఆ దేశాలతో వాణిజ్య, సాంస్కృతిక, విద్యావిషయక సంబంధాలు మెరుగుపడే దిశగా భారత్ చర్యలు తీసుకోవడం కొనసాగిస్తుందన్నారు. భారత ప్రధానికి నేపాల్ పీఎం కేపీ శర్మ ఓలి కృతజ్ఞతలు తెలిపారు. మోదీని నేపాల్‌లో పర్యటించాల్సిందిగా ఆహ్వానించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్-నేపాల్ సరిహద్దుల్లో ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : నరేంద్ర మోదీ, కేపీ శర్మ ఓలి
ఎక్కడ : జోగ్‌బని-బిరాట్‌నగర్
ఎందుకు : ద్వైపాక్షిక వాణిజ్య వృద్ధి, ఇరుదేశాల ప్రజల మధ్య ప్రత్యక్ష సంబంధాలు లక్ష్యంగా

ఖనిజ సంపదపై భారత్, బ్రెజిల్ సహకారం
ఖనిజ సంపదపై భారత్, బ్రెజిల్ పరస్పర సహకారానికి మార్గం సుగమం అయి్యంది. ఈ మేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం చేసుకోడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 22న ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ వ్యవహారాల కమిటీ ఈ మేరకు తన అంగీకారం తెలిపినట్లు మైన్స్ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

హిందుస్తాన్ ఫ్లోరోకార్బన్స్ మూసివేత
ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ ఫ్లోరోకార్బన్స్ లిమిటెడ్ మూసివేతకూ కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో 88 మంది విధులు నిర్వహిస్తున్నారు. 2013-14 నుంచీ ఈ సంస్థ నష్టాల్లో ఉంది.

జమ్మూకశ్మీర్‌లో15 దేశాల రాయబారులు
Current Affairs కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ సహా భారత్‌లోని 15 దేశాల రాయబారులు జనవరి 9న పర్యటించారు. బంగ్లాదేశ్, వియత్నాం, నార్వే, మాల్దీవ్‌‌స, దక్షిణ కొరియా, మొరాకొ, నైజీరియా తదితర దేశాల రాయబారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితిని క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కొందరు రాజకీయ నేతలు, సైన్యాధికారులు, పౌరసమాజ ప్రతినిధులతో వారు సమావేశమయ్యారు. వారికి లెఫ్ట్‌నెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ కశ్మీర్ పరిస్థితులను వివరించారు.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడం తెల్సిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లోని 15 దేశాల రాయబారులు పర్యటన
ఎప్పుడు : జనవరి 9
ఎక్కడ : జమ్మూకశ్మీర్
ఎందుకు : జమ్మూకశ్మీర్‌లో పరిస్థితిని క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించేందుకు

ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ సంభాషణ
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో సంభాషించారని భారత ప్రధానమంత్రి కార్యాలయం జనవరి 10న తెలిపింది. ఈ ఫోన్ కాల్‌లో పలు ద్వైపాక్షిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలు చర్చకు వచ్చినట్లు వెల్లడించింది. భారత్-ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడేలా చేసేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ చెప్పినట్లు పేర్కొంది. రక్షణ రంగం, పౌర అణుశక్తి, మెరైన్ భద్రత వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం పెంచుకునేందుకు వారు అంగీకరించినట్లు తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్‌తో ఫోన్‌లో సంభాషణ
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : ద్వైపాక్షిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు

సీఏఏపై వివరణ ఇచ్చాం : విదేశాంగ శాఖ
Current Affairs
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్‌షిప్ (ఎన్నార్సీ)లకు సంబంధించి ప్రపంచ దేశాలకు వివరణ ఇచ్చామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ జనవరి 2న తెలిపారు. సీఏఏ, ఎన్నార్సీ భారత అంతర్గత వ్యవహారమని వివరించామని పేర్కొన్నారు. వివిధ దేశాల్లోని భారతీయ రాయబారులు, ఇతర హై కమిషన్ అధికారులు ఆయా ప్రభుత్వాలకు, అక్కడి మీడియాకు సీఏఏ, ఎన్నార్సీలకు సంబంధించి అవగాహన కల్పించారని వివరించారు. విదేశీ మీడియా ప్రచారం చేస్తున్నట్లు.. ఎన్నార్సీ చట్టం వల్ల భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి ఎలాంటి భంగం కలగబోదని చెప్పామన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీఏఏ, ఎన్నార్సీలపై ప్రపంచ దేశాలకు వివరణ ఇచ్చాం
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : భారత విదేశాంగ శాఖ

ఆస్ట్రేలియా ప్రధాని భారత పర్యటన వాయిదా
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ భారత పర్యటన వాయిదా పడింది. ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు నేపథ్యంలో భారత్ పర్యటనను వాయిదా వేస్తున్నట్లు జనవరి 4న మారిసన్ ప్రకటించారు. రానున్న నెలల్లో ఇరు దేశాలకు కుదిరే మరో సమయంలో భేటీ జరుగుందని వెల్లడించారు. 2019, జనవరి 13న నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మారిసన్ భారత్‌కు రావాల్సి ఉంది. భారత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపాల్సి ఉంది. భారత్‌తో భేటీ అనంతరం ఆయన జపాన్ పర్యటనకు కూడా వెళ్లాల్సి ఉండగా, ఆ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు.
23 మంది మృతి
ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకూ 23 మంది పౌరులు మృతి చెందారు. దీని నుంచి పౌరులను కాపాడేందుకు ఆ దేశ ప్రభుత్వం 3 వేల మంది మిలిటరీ రిజర్వ్ బలగాలను రంగంలోకి దించింది. కార్చిచ్చు గురించి ప్రధాని మోదీ జనవరి 3న మారిసన్‌తో మాట్లాడారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆస్ట్రేలియా ప్రధాని భారత పర్యటన వాయిదా
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : స్కాట్ మారిసన్
ఎందుకు : ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు నేపథ్యంలో

వ్యూహాత్మక అంశాలపై ట్రంప్, మోదీ చర్చలు
అమెరికా-భారత్‌ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేయడంతో పాటు, ప్రాంతీయ భద్రతా వ్యవహారాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని మోదీ ఫోన్‌లో చర్చించారు. ఈ విషయాన్ని జనవరి 6న వైట్‌హౌజ్ వెల్లడించింది. భారత్‌తో ద్వైపాక్షిక అంశాలను బలోపేతం చేసేందుకు మరింత కృషి చేస్తానని ట్రంప్ చెప్పినట్లు పేర్కొంది.
ట్రంప్-మోదీల ఫోన్ కాల్‌పై ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) కూడా స్పందించింది. అమెరికా-భారత్ మైత్రి బలపడటమేగాక, ఇరుదేశాల ప్రయోజనాల దృష్ట్యా కలసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోదీ పేర్కొన్నారని తెలిపింది. వీరిరువురి ఫోన్ కాల్‌కు ముందు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో జనవరి 5న ఫోన్‌లో మాట్లాడారు.

శాంతికి భారత్ కృషి చేయాలి : ఇరాన్
ఇరాన్-అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ తీసుకునే ఎలాంటి శాంతి చర్యలనైనా ఇరాన్ స్వాగతిస్తుందని భారత్‌లో ఆ దేశ రాయబారి అలీ చెగెనీ పేర్కొన్నారు. ఇరాన్-అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగబోవని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. సులేమానీకి నివాళులర్పించేందుకు ఇరాన్ ఎంబసీలో జనవరి 9న ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో చెగెనీ ఈ మేరకు మాట్లాడారు.
ఇరాక్ వెళ్లకండి : భారత్
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరాక్ వెళ్లాలనుకునే పర్యాటకులకు భారత్ జనవరి 9న పర్యాటక సూచన జారీ చేసింది. ‘అంతగా అవసరం లేని ప్రయాణమైతే రద్దు చేసుకోండి’ అని ఇరాక్ వెళ్లే భారత ప్రయాణీకులకు భారత విదేశాంగ శాఖ సూచించింది. ఇరాక్‌లోని భారతీయులు సైతం జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలు అస్సలు చేయవద్దని సూచించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : శాంతికి భారత్ కృషి చేయాలి
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : భారత్‌లో ఇరాన్ రాయబారి అలీ చెగెనీ
ఎందుకు : ఇరాన్-అమెరికాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో
Published date : 27 Jan 2020 04:09PM

Photo Stories