Sangeet Natak Akademi Awards: జాతీయ సంగీత, నాటక అకాడమీ అవార్డుల ప్రదానం
కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఈ అవార్డులు ఇవ్వలేదు. దీంతో 2019, 2020, 2021 సంవత్సరానికి కలిపి ఒకేసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 128 మంది కళాకారులకు అవార్డులు అందజేశారు. ఈ అవార్డుల్లో ఆరు తెలుగు రాష్ట్రాల్లో కళా, సంగీత సేవ చేస్తున్న వారికి దక్కాయి.
హరికథ కళాకారిణి ఉమామహేశ్వరి, కథక్ నృత్యకారులు రాఘవరాజ్ భట్, మంగళ భట్ (సంయుక్తంగా) 2019 సంవత్సరానికి గానూ ఈ అవార్డులు అందుకోగా, 2020 సంవత్సరానికి కర్నాటక సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, ప్రఖ్యాత గాయని ప్రేమ రామ్మూర్తి, కూచిపూడి నృత్య కళాకారులు పసుమర్తి విఠల్, పసుమర్తి భారతి దంపతులు (సంయుక్తంగా) అవార్డులు అందుకున్నారు. 2021 సంవత్సరానికి గానూ నాటక రంగాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తున్న వినాయక నాట్యమండలి (సురభి) నిర్వాహకులు ఆర్.వేణుగోపాల్ రావు సంగీత, నాటక అకాడమీ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. అవార్డులు అందుకున్న 128 మంది కళాకారుల్లో 50 మంది మహిళలే ఉన్నారు.