Skip to main content

నవంబర్ 2018 అవార్డ్స్

ఇక్రిశాట్ శాస్త్రవేత్తకు ఏఎస్‌ఏ ఫెలోషిప్
Current 
Affairs ఇక్రిశాట్ శాస్త్రవేత్త డాక్టర్ రాజీవ్ కె.వర్షణేకు అమెరికన్ సొసైటీ ఆఫ్ అగ్రానమీ (ఏఎస్‌ఏ) ఫెలోషిప్-2018 లభించింది. ఈ మేరకు నవంబర్ 22న ఏఎస్‌ఏ ప్రకటించింది. జెనెటిక్స్ గెయిన్స్ విభాగంలో సంచాలకుడిగా పనిచేస్తున్న రాజీవ్ పంటల అభివృద్ధిలో భాగంగా జీనోమిక్స్, మాలిక్యులార్ బ్రీడింగ్ అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు. 2018 సంవత్సరానికిగాను ప్రపంచవ్యాప్తంగా 14 మందికి ఏఎస్‌ఏ ఫెలోషిఫ్‌ను ప్రకటించగా అందులో ముగ్గురు మినహా మిగిలిన వారందరు అమెరికన్లే ఉన్నారు. భారత్ నుంచి ఈ జాబితాలో రాజీవ్ ఒక్కరికే చోటు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికన్ సొసైటీ ఆఫ్ అగ్రానమీ ఫెలోషిప్-2018
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : ఇక్రిశాట్ శాస్త్రవేత్త డాక్టర్ రాజీవ్ కె.వర్షణే

అంపశయ్య నవీన్‌కు లోక్‌నాయక్ పురస్కారం
తెలంగాణలోని వరంగల్‌కు చెందిన సాహితీవేత్త అంపశయ్య నవీన్‌కు లోక్‌నాయక్ ఫౌండేషన్ సాహితీ పురస్కారం-2019 లభించింది. ఈ మేరకు ఫౌండేషన్ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నవంబర్ 24న తెలిపారు. సాహిత్యంలో విశేష కృషిచేసినందుకుగాను నవీన్‌కు ఈ అవార్డు దక్కింది. నవీన్ ఇపివరకు 65 నవలలు, 35 కథా సంకలనాలు రచించాడు. అలాగే గుంటూరు జిల్లాలో బాలికావిద్యా రంగంలో కృషి చేస్తున్న ఎం.మంగాదేవికి, హైదరాబాద్‌లో వేగ్నేష ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకు ఉచిత విద్య అందిస్తున్న వంశీరామరాజుకు జీవన సాఫల్య పురస్కారంను ఫౌండేషన్ ప్రకటించింది. 2019, జనవరి 19న ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లోక్‌నాయక్ ఫౌండేషన్ సాహితీ పురస్కారం
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : సాహితీవేత్త అంపశయ్య నవీన్
ఎందుకు : సాహిత్యంలో విశేష కృషిచేసినందుకుగాను

రాజేంద్ర ప్రసాద్‌కు జీవితకాల సాఫల్య పురస్కారం
ప్రముఖ నటుడు డా. రాజేంద్ర ప్రసాద్‌కు ఢిల్లీ తెలుగు అకాడమీ జీవిత కాల సాఫల్య పురస్కారం లభించింది. ఈ మేరకు ఢిల్లీలో నవంబర్ 25న జరిగిన అకాడమీ 30వ వార్షిక సాంస్కృతిక కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు 42 ఏళ్లపాటు సేవలందించినందుకు గుర్తింపుగా ఆయనకు ఈ పురస్కారం దక్కింది. అలాగే ప్రముఖ హాస్యనటుడు ఆలీ ప్రతిభా భారతి పురస్కారాన్ని అందుకున్నారు. చిత్ర పరిశ్రమలో తన సుదీర్ఘ ప్రయాణానికి గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఢిల్లీ తెలుగు అకాడమీ జీవిత కాల సాఫల్య పురస్కారం
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : ప్రముఖ నటుడు డా. రాజేంద్ర ప్రసాద్
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : తెలుగు చిత్ర పరిశ్రమకు 42 ఏళ్లపాటు సేవలందించినందుకుగాను

అజీం ప్రేమ్‌జీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం
ప్రముఖ ఐటీ సంస్థ విప్రో అధిపతి అజీం ప్రేమ్‌జీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారమైన ‘షెవాలీర్ డె లా లెజియన్ డిఆనర్’ (నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్) లభించింది. ఈ మేరకు నవంబర్ 26 ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది. ఐటీ దిగ్గజంగా భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి, వితరణశీలిగా సమాజానికి చేస్తున్న సేవలకు గాను ప్రేమ్‌జీకి ఈ పురస్కారం దక్కింది. 2018, నవంబర్ 28-29 తారీఖుల్లో జరిగే బెంగళూరు టెక్ సదస్సులో పాల్గొంటున్న సందర్భంగా భారత్‌లో ఫ్రాన్స్ దౌత్యవేత్త అలెగ్జాండర్ జిగ్లర్ ఈ పురస్కారాన్ని ప్రేమ్‌జీకి ప్రదానం చేయనున్నారు. అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్, విశ్వవిద్యాలయం ద్వారా ప్రేమ్‌జీ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : షెవాలీర్ డె లా లెజియన్ డిఆనర్ పురస్కారం
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : విప్రో అధిపతి అజీం ప్రేమ్‌జీ
ఎందుకు : ఐటీ రంగానికి, వితరణశీలిగా సమాజానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా

జయశంకర్ విశ్వవిద్యాలయ వీసీకి జాతీయ పురస్కారం
Current Affairs ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి (వీసీ) ప్రవీణ్‌రావుకు ‘విద్యా నాయకత్వ పురస్కారం’ లభించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో నవంబర్ 16న జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో సంస్కరణలు తెచ్చినందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా ప్రవీణ్‌రావు మాట్లాడుతూ... భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ప్రకటించిన ర్యాంకుల్లో జయశంకర్ విశ్వవిద్యాలయానికి దేశంలోనే రెండో ర్యాంకు వచ్చిందని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విద్యా నాయకత్వ పురస్కారం
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్‌రావు

కార్టూనిస్ట్ నర్సింహకు జాతీయ పురస్కారం
నవ తెలంగాణ దినపత్రిక కార్టూన్ ఎడిటర్ పి.నర్సింహకు ‘నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం-2018’ పురస్కారం లభించింది. ఈ మేరకు నూఢిల్లీలో నవంబర్ 16న జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్(పీసీఐ) జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ ఈ పురస్కారాన్ని అందించారు. బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు రక్తసిక్తమైన నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల చిహ్నం జంట గడ్డి పూలు క్రమంగా మార్పునకు లోనై కత్తులుగా మారి కొట్లాడుతున్నాయంటూ నర్సింహ గీసిన కార్టూన్‌కు ఈ పురస్కారం లభించింది. నర్సింహ గతంలో ‘ఇండియా టుడే’లో 23 ఏళ్ల పాటు పనిచేశారు.
మరోవైపు రాజారామ్‌మోహన్ రాయ్ జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని ‘ది హిందూ’పత్రిక పూర్వ సంపాదకుడు ఎన్.రామ్ అందుకున్నారు. అలాగే గ్రామీణ జర్నలిజంలో మధ్యప్రదేశ్‌కు చెందిన రూబీ సర్కార్, మహారాష్ట్రకు చెందిన పరశురామ్ జోష్టే సంయుక్తంగా అందుకున్నారు. కేరళకు చెందిన వి.ఎస్.రాజేశ్ అభివృద్ధి వార్తల విభాగంలో, న్యూఢిల్లీకి చెందిన మిహిర్ సింగ్ ఫోటో ఫీచర్‌లో అవార్డులు అందుకున్నారు. జాతీయ పత్రికా దినోత్సం(నవంబర్ 17)ని పురస్కరించుకుని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ అవార్డులని ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం-2018 పురస్కారం
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : కార్టూనిస్ట్ పి.నర్సింహ

కేసీఆర్‌కు బిజినెస్ రిఫార్మర్ పురస్కారం
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ‘ఎకనమిక్ టైమ్స్-బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం లభించింది. ఈ మేరకు ముంబైలో నవంబర్ 17న జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అందజేసిన ఈ అవార్డును కేసీఆర్ తరపున ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... కొత్త పరిశ్రమలకు 15 రోజుల్లో సింగిల్ విండో విధానంలో అనుమతుల జారీ వంటి విప్లవాత్మకమైన సంస్కరణలను సీఎం ప్రవేశపెట్టారన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎకనమిక్ టైమ్స్-బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు

రామగుండం ఎన్టీపీసీకి గ్రీన్‌టెక్ అవార్డు
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్న రామగుండం ఎన్టీపీసీ సంస్థకు అత్యున్నత గ్రీన్‌టెక్ సేఫ్టీ ప్లాటినం అవార్డు-2018 లభించింది. అస్సాంలోని గౌహతిలో నవంబర్ 17న జరిగిన హెల్త్ అండ్ సేఫ్టీ సదస్సులో ఈ అవార్డును అందజేశారు. సేప్టీ విషయంలో రామగుండం ఎన్టీపీసీ చేపట్టిన చర్యలకు గాను ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్రీన్‌టెక్ సేఫ్టీ ప్లాటినం అవార్డు-2018
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : రామగుండం ఎన్టీపీసీ
ఎక్కడ : గౌహతి, అస్సాం
ఎందుకు : సేప్టీ విషయంలో ఉత్తమ చర్యలు చేపట్టినందుకు

డాక్టర్ గున్న రాజేందర్‌రెడ్డికి జాతీయ పురస్కారం
ఏపీ-తెలంగాణ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్‌రెడ్డికి క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ అవార్డు లభించింది. ఈ మేరకు జస్టిస్ వి.ఆర్.కృష్ణ అయ్యర్ 104వ జయంతిని పురస్కరించుకుని న్యూఢిల్లీలో నవంబర్ 20న క్యాపిటల్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ అవార్డును ప్రదానం చేశారు. గాంధేయ విధానాలతో గ్రామీణ ప్రజల అభ్యన్నతికి పాటుపడినందుకుగాను రాజేందర్‌రెడ్డికి ఈ అవార్డు దక్కింది. అలాగే కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్‌జోషి జీవిత సాఫల్య పురస్కారం, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ జిత్‌సేన్ జస్టిస్ కులదీప్‌సింగ్ అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ అవార్డు
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : డాక్టర్ గున్న రాజేందర్‌రెడ్డి
ఎందుకు : గాంధేయ విధానాలతో గ్రామీణ ప్రజల అభ్యన్నతికి పాటుపడినందుకు

ముళ్లపూడి నరేంద్రనాథ్‌కు ఏబీసీజెడ్ అవార్డు
ది ఆంధ్రా షుగర్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ ముళ్లపూడి నరేంద్రనాథ్‌కు ‘ఏబీసీజెడ్ మెరిట్-2019’ అవార్డు లభించింది. ఈ మేరకు బ్రెజిల్‌కు చెందిన జేబు కేటిల్ బ్రీడర్స్ అసోసియేషన్ నవంబర్ 21న ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి పశువుల అభివృద్ధికి చేసిన కృషికిగాను నరేంద్రనాథ్‌కు ఈ అవార్డు దక్కింది. బ్రెజిల్‌లోని ఉబెరాబలో 2019 మే 3న జరగనున్న 85వ జేబు-ఇంటర్నేషనల్ జేబు కేటిల్ ఎక్స్‌పోలో ఈ అవార్డుని అందజేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏబీసీజెడ్ మెరిట్-2019 అవార్డు
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : ముళ్లపూడి నరేంద్రనాథ్
ఎందుకు : అంతర్జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి పశువుల అభివృద్ధికి కృషి చేసినందుకు

జర్నలిస్టు స్వాతికి ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు
Current Affairs భారత్‌కి చెందిన పరిశోధనాత్మక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ స్వాతి చతుర్వేదికి లండన్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు ఫర్ కరేజ్-2018 లభించింది. ఈ మేరకు లండన్‌లో నవంబర్ 8న జరిగిన కార్యక్రమంలో రిపోర్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్(ఆర్‌డబ్ల్యూబీ) అనే సంస్థ ఈ అవార్డును ప్రదానం చేసింది. సామాజిక మాధ్యమాల్లో వేధింపుల్ని ధైర్యంగా ఎదుర్కొన్నందుకు ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఆన్‌లైన్‌లో భారతీయ జనతా పార్టీ ఐటీ విభాగాల విద్వేషపూరిత వేధింపులను ఆమె వెలుగులోకి తెచ్చారు. అలాగే ‘ఐ యామ్ ఏ ట్రోల్: ఇన్‌సైడ్ ది సీక్రెట్ వరల్డ్ ఆఫ్ ది బీజేపీ డిజిటల్ ఆర్మీ’ అనే పుస్తకాన్ని కూడా రచించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు ఫర్ కరేజ్-2018
ఎప్పుడు : నవంబర్ 9
ఎవరు : జర్నలిస్ట్ స్వాతి చతుర్వేది
ఎక్కడ : లండన్, ఇంగ్లండ్
ఎందుకు : సామాజిక మాధ్యమాల్లో వేధింపుల్ని ధైర్యంగా ఎదుర్కొన్నందుకు

కవయిత్రి జూపాక సుభద్రకు కాళోజీ అవార్డు
ప్రముఖ కవయిత్రి, మట్టిపూలు వ్యవస్థాపకులు జూపాక సుభద్రకు ప్రజాకవి కాళోజీ అవార్డు లభించింది. కాళోజీ వర్ధంతిని పురస్కరించుకుని హన్మకొండలో నవంబర్ 13న నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ అంపశయ్య నవీన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. సుభద్ర తనదైన శైలిలో, ఆత్మస్థైర్యంతో రచనలు చేస్తున్నారని కాళోజీ ఫౌండేషన్ సభ్యులు జీవన్‌కుమార్ ఈ సందర్భంగా చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రజాకవి కాళోజీ అవార్డు
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : జూపాక సుభద్ర

రామగుండం ఎన్టీపీసీకి స్వర్ణశక్తి అవార్డు

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ సంస్థకు మూడు స్వర్ణశక్తి అవార్డులు దక్కినట్లు ప్రాజెక్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఎన్టీపీసీ కార్పొరేట్ సెంటర్ న్యూఢిల్లీలో నవంబర్ 10న జరిగిన స్వర్ణశక్తి అవార్డుల ప్రదానోత్సవంలో రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టుకు 2016-17, 2017-18 పురస్కారాలు ప్రకటించారు. గ్రీన్‌ఫీల్డ్ -థర్మల్ అవార్డు, ఉత్తమ ఆపరేటింగ్ విధానంలో సోలార్ ప్లాంటు, ఉత్పాదకత (బొగ్గు)లో రన్నరప్ అవార్డులు ఇచ్చారు. స్వర్ణశక్తి అవార్డులను సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ దూబే, ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రవీంద్ర అందుకున్నారు. సీఎండీ గురుదీప్‌సింగ్ ఈ అవార్డులను అందజేశారు. మూడు స్వర్ణశక్తి అవార్డులు సాధించడం పట్ల ప్రాజెక్టు అధికారులు, ఉద్యోగులకు ఈడీ రవీంద్ర అభినందనలు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రామగుండం ఎన్టీపీసీ సంస్థకు మూడు స్వర్ణశక్తి అవార్డులు
ఎప్పుడు : నవంబర్ 10న
ఎందుకు : ఉత్తమ ఆపరేటింగ్ విధానంలో సోలార్ ప్లాంటు, ఉత్పాదకత(బొగ్గు)
ఎక్కడ : ఎన్టీపీసీ కార్పొరేట్ సెంటర్ (న్యూఢిల్లీ)

భారతీయ విద్యార్థులకు మార్కొనీ అవార్డు
Current Affairs భారత్‌కి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులకు అమెరికా ప్రతిష్టాత్మక మార్కొనీ సొసైటీ అవార్డు లభించింది. స్మార్ట్‌ఫోన్‌తో తీసిన ఫొటోలను విశ్లేషించడం ద్వారా పరిసర ప్రాంతాల్లోని గాలి నాణ్యతను అంచనా వేసే వినూత్న యాప్‌ను రూపొందించినందుకుగాను వీరికి ఈ అవార్డు దక్కింది. ఢిల్లీలోని భైరవి విద్యాపీఠ్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన తన్మయ్ శ్రీవాస్తవ, కనిష్క్ జీత్, ప్రేరణ ఖన్నాల విద్యార్థుల బృందం ఈ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను వాడటం చాలా తేలిక, ఉచితం అని మార్కొనీ సొసైటీ ఈ సందర్భంగా పేర్కొంది. విద్యార్థుల బృందం రూ.1.09 కోట్ల నగదు బహుమతి గెలుచుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారతీయ విద్యార్థులకు అమెరికా మార్కొనీ సొసైటీ అవార్డు
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : తన్మయ్ శ్రీవాస్తవ, కనిష్క్ జీత్, ప్రేరణ ఖన్నా
ఎందుకు : గాలి నాణ్యతను అంచనా వేసే వినూత్న యాప్‌ను రూపొందించినందుకు

ఎన్ రామ్‌కు రాజా రామ్‌మోహన్ రాయ్ అవార్డు
హిందూ గ్రూప్ ఛైర్మన్ ఎన్ రామ్‌కు ప్రతిష్ఠాత్మక రాజా రామ్‌మోహన్ రాయ్ అవార్డు లభించింది. ఈ మేరకు పాత్రికేయ రంగంలో విశేష సేవలు అందించినందుకుగాను రాయ్‌కు ఈ అవార్డు ఇస్తున్నట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) నవంబర్ 5న ప్రకటించింది. జాతీయ పత్రికా దినోత్సవం నవంబరు 16న ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
మరోవైపు గ్రామీణ పాత్రికేయ విభాగంలో రుబీ సర్కార్ (దేశ్‌బంధు పత్రిక), రాజేశ్ పరశురామ్ (పుఢారీ పత్రిక)లకు ‘ఎక్స్‌లెన్స్ ఇన్ జర్నలిజం’ అవార్డులను పీసీఐ ప్రకటించింది. అలాగే అభివృద్ధి పాత్రికేయ విభాగంలో వీఎస్ రాజేశ్ (కేరళ కౌముది), ఫోటో జర్నలిజంలో సుభాష్ పాల్ (రాష్టీయ్ర సహారా), మిహిర్ సింగ్ (పంజాబ్ కేసరి)లకు, వ్యంగ్య చిత్రాల విభాగంలో పి నరసింహా (నవ తెలంగాణ)కు కూడా అవార్డులను ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాజా రామ్‌మోహన్ రాయ్ అవార్డు
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : హిందూ గ్రూప్ ఛైర్మన్ ఎన్ రామ్
ఎందుకు : పాత్రికేయ రంగంలో విశేష సేవలు అందించినందుకు
Published date : 23 Nov 2018 04:48PM

Photo Stories