Skip to main content

జూన్ 2019 అవార్డ్స్

ఏపీ పోలీసు శాఖకు విదేశాంగ శాఖ అవార్డు
Current Affairs ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖకు కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అవార్డు లభించింది. పాస్‌పోర్ట్ సేవా దివస్ 2019లో భాగంగా జూన్ 24న ఢిల్లీలో నిర్వహించిన పాస్‌పోర్ట్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో ఈ అవార్డును అందజేశారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జయశంకర్ నుంచి గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ ఆర్.జయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ తరఫున అవార్డును అందుకున్నారు. పాస్‌పోర్టుల జారీ అంశంలో త్వరితగతిన పోలీసు పరిశీలన ప్రక్రియను పూర్తిచేసినందుకు ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగానికి పురస్కారం లభించింది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే పోలీసు పరిశీలన ప్రక్రియను పూర్తి చేసిన ఏపీ నిఘా విభాగం 2018-19 సంవత్సరానికి దేశంలోనే అగ్రగామిగా నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2018-19 అవార్డు
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ
ఎందుకు : పాస్‌పోర్టుల జారీ అంశంలో త్వరితగతిన పోలీసు పరిశీలన ప్రక్రియను పూర్తిచేసినందుకు

వినూత్న మరుగుదొడ్లకు పురస్కారాలు
వినూత్నంగా మరుగుదొడ్డిని ఏర్పాటు చేసుకున్న నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెకు చెందిన కోడూరు గోవిందమ్మను స్వచ్ఛ మహోత్సవ్ పురస్కారం వరించింది. ఢిల్లీలో జూన్ 24న జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా గోవిందమ్మ తరఫున నెల్లూరు స్వచ్ఛ భారత్ మిషన్ కన్సల్టెంట్ వై.మహేష్ ఈ అవార్డు అందుకున్నారు. మరుగుదొడ్ల వినియోగం, ఆకర్షణీయమైన రీతిలో వాటి నిర్మాణం, పరిశుభ్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ పలు రాష్ట్రాలు, జిల్లాలు, సంస్థలు, వ్యక్తిగత విభాగంకు అవార్డులు ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వచ్ఛ మహోత్సవ్ పురస్కారం
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : కోడూరు గోవిందమ్మ
ఎక్కడ : జువ్వలదిన్నె, నెల్లూరు జిల్లా
ఎందుకు : ఆకర్షణీయమైన రీతిలో మరుగుదొడ్డిని నిర్మించుకున్నందుకు

తెలంగాణకు 5 స్వచ్ఛ్ మహోత్సవ్ పురస్కారాలు
తెలంగాణను వివిధ విభాగాల్లో 5 స్వచ్ఛ్ మహోత్సవ్ పురస్కారాలు వరించాయి. మరుగుదొడ్ల వినియోగం, ఆకర్షణీయమైన రీతిలో వాటి నిర్మాణం, పరిశుభ్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ పలు రాష్ట్రాలు, జిల్లాలు, సంస్థలు, వ్యక్తిగత విభాగంలో అవార్డులు ప్రకటించింది. జిల్లాల స్థాయిలో పెద్దపల్లి, వరంగల్, ప్రత్యేక వ్యక్తిగత విభాగంలో ఎర్రవల్లికి చెందిన మొండి భిక్షపతి, జగిత్యాల శాంతక్కపల్లికి చెందిన మొరపు రమకు అవార్డులు దక్కాయి. రాష్ట్రాల స్థాయిలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణకు అవార్డు దక్కింది. ఢిల్లీలో జూన్ 24న జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చేతుల మీదుగా పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ కుమారీ, పెద్దపల్లి కలెక్టర్ అవార్డులు అందుకున్నారు.

నిర్మలా సీతారామన్‌కు అరుదైన గౌరవం
యూకె-ఇండియా సంబంధాలను మెరుగుపర్చడంలో కీలకపాత్ర పోషించిన 100 మంది ప్రభావవంతులైన మహిళల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు చోటు దక్కింది. లండన్‌లో జూన్ 26న నిర్వహించిన ‘భారత దినోత్సవం’ సందర్భంగా యూకే హోంశాఖ కార్యదర్శి సాజిద్ జావిద్ పార్లమెంట్ హౌస్‌లో ఈ మేరకు జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో బ్రిటన్‌కు చెందిన సీనియర్ కేబినెట్ మంత్రి పెన్నీ మోర్డాంట్ చోటు దక్కించుకున్నారు.
నిర్మలా సీతారామన్ కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల్లో కీలక పాత్ర పోషించారు. భారతదేశంలో ఈ మంత్రిత్వ శాఖను నిర్వహించిన అత్యంత ప్రభావవంతమైన మహిళగా నిర్మల గుర్తింపు పొందారు.

షి జిన్‌పింగ్‌కు కిర్గిజ్ అత్యున్నత పురస్కారం
Current Affairs చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు కిర్గిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘మనాస్ ఆర్డర్ ఆఫ్ ద ఫస్ట్ డిగ్రీ’ లభించింది. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జూన్ 13న జరిగిన కార్యక్రమంలో జిన్‌పింగ్‌కు కిర్గిస్థాన్ అధ్యక్షుడు సూరోన్‌బే జీన్‌బెకోవ్ ఈ అవార్డు ప్రదానం చేశారు. కి ర్గిస్థాన్-చైనా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య అభివృద్ధికి జిన్‌పింగ్ అందించిన ప్రత్యేక సేవలను ఈ సందర్బంగా సూరోన్‌బే ప్రశంసించారు. జిన్‌పింగ్ మాట్లాడుతూ, చైనా ప్రజలకు, కిర్గిజ్ ప్రజలకు మధ్య వున్న ప్రగాఢ మైత్రిని ఈ అవార్డు ప్రతిబింబిస్తుందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కిర్గిస్థాన్ మనాస్ ఆర్డర్ ఆఫ్ ద ఫస్ట్ డిగ్రీ పురస్కారం
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్
ఎక్కడ : బిష్కెక్, కిర్గిస్థాన్

సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటన
కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార్-2019, యువ పురస్కార్-2019లను ప్రకటించింది. త్రిపుర రాజధాని అగర్తలలో జూన్ 14న అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ చంద్ర శేఖర కంబారా అధ్యక్షతన సమావేశమైన కమిటీ ఆంగ్లం, హిందీతో పాటు ప్రాంతీయ భాషలకు సంబంధించి 22 మంది రచయితలను బాల సాహిత్య పురస్కారాలకు, 23 మందిని యువ పురస్కారాలకు ఎంపిక చేసింది.
ఇద్దరు తెలుగు కవులకు...
కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించిన అవార్డులకు ఇద్దరు తెలుగు కవులు ఎంపికయ్యారు. తెలుగు భాషలో బాల సాహిత్య పురస్కార్-2019కు రచయిత బెలగం భీమేశ్వరరావు ఎంపికయ్యారు. ఆయన రచన ‘తాత మాట వరాల మూట’ చిన్న కథలు పుస్తకానికి గాను ఈ పురస్కారం దక్కింది. బాల సాహిత్యానికి విశేష సేవలు అందించే రచయితకే ఈ పురస్కారం అందజేస్తారు. 35 ఏళ్ల లోపు రచయితలకు ఇచ్చే సాహిత్య అకాడమీ యువ పురస్కార్-2019కు గడ్డం మోహన్‌రావు ఎంపికయ్యారు. ఆయన రచించిన ‘కొంగవాలు కత్తి’ నవల అవార్డుకు ఎంపికైంది. విజేతలకు తామ్ర పత్రంతో పాటు రూ.50 వేల నగదును ప్రదానం చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బాల సాహిత్య పురస్కార్-2019, యువ పురస్కార్-2019 ప్రకటన
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : కేంద్ర సాహిత్య అకాడమీ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ చంద్ర శేఖర కంబారా
ఎక్కడ : అగర్తల, త్రిపుర

కృష్ణారావుకు సాహిత్య అనువాద పురస్కారం
ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు ఎ.కృష్ణారావు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురసారం లభించింది. త్రిపుర రాజధాని అగర్తలాలో జూన్ 14న జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అకాడమీ చైర్మన్ చంద్రశేఖర్ కంబర్ చేతుల మీదుగా కృష్ణారావు అవార్డుతో పాటు రూ.50 వేల నగదు బహుమానాన్ని అందుకున్నారు. 2018 ఏడాదికి గానూ కృష్ణారావు అనువదించిన ‘గుప్పెడు సూర్యుడు మరికొన్ని కవితలు’ కవితాసంపుటికి కేంద్ర సాహిత్య అనువాద పురస్కారం వరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురసారం-2018
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : ఎ.కృష్ణారావు
ఎక్కడ : అగర్తల, త్రిపుర
ఎందుకు : గుప్పెడు సూర్యుడు మరికొన్ని కవితలు’ కవితాసంపుటి అనువాదానికి

అక్షయపాత్రకు గ్లోబల్ చాంపియన్ అవార్డు
బెంగళూరుకు చెందిన అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థకు బీబీసీ వరల్డ్ సర్వీస్ ‘గ్లోబల్ చాంపియన్’ అవార్డు లభించింది. ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌లో జూన్ 14న జరిగిన కార్యక్రమంలో బీబీసీ వరల్డ్ సర్వీస్ విభాగం ఈ అవార్డును అక్షయపాత్రకు ప్రదానం చేసింది. భారత్‌లోని వేలాది పాఠశాలల్లో పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజనాలు సమకూరుస్తున్నందుకు గాను అక్షయపాత్రకు ఈ అవార్డు దక్కింది. 20ఏళ్ల క్రితం ప్రారంభమైన అక్షయపాత్ర సంస్థ, నేడు దేశవ్యాప్తంగా పదిలక్షలమందికి పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనాలను అందిస్తుంది. ప్రసుత్తం అక్షయపాత్ర సీఈవోగా శ్రీధర్ వెంకట్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బీబీసీ వరల్డ్ సర్వీస్ ‘గ్లోబల్ చాంపియన్’ అవార్డు
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : అక్షయపాత్ర
ఎందుకు : పాఠశాలల్లో పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజనాలు సమకూరుస్తున్నందుకు గాను

భారత సంతతి వ్యక్తికి పాలస్తీనా అవార్డు
భారత సంతతికి చెందిన షేక్ మొహమ్మద్ మునీర్ అన్సారీకి పాలస్తీనా ఇచ్చే విదేశీ అత్యున్నత పురస్కారం ‘స్టార్ ఆఫ్ జెరూసలేం’ లభించింది. ఈ మేరకు జెరూసలేంలో జూన్ 14న జరిగిన కార్యక్రమంలో పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ ఈ అవార్డును అన్సారీకి ప్రదానం చేశారు. భారత్-పాలస్తీనా మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తున్నందుకు గానూ ఆయనుకు ఈ అవార్డు దక్కింది. జెరూసలేం నగరంలోని ‘భారత ధర్మశాల’కు అన్సారీ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాలస్తీనా విదేశీ అత్యున్నత పురస్కారం ‘స్టార్ ఆఫ్ జెరూసలేం’
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : షేక్ మొహమ్మద్ మునీర్ అన్సారీ
ఎందుకు : భారత్-పాలస్తీనా మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తున్నందుకు

హైదరాబాద్ శాస్త్రవేత్తకు ఎన్‌ఏఏఎస్ ఫెలోషిప్
హైదరాబాద్‌లోని భారత వరి పరిశోధనా సంస్థ (ఐఐఆర్‌ఆర్-రాజేంద్రనగర్) లో బయోటెక్నాలజీ విభాగం ప్రధాన శాస్త్రవేత్తగా ఉన్న డాక్టర్ ఆర్.ఎం. సుందరంకు జాతీయ వ్యవసాయశాస్త్ర అకాడమీ(ఎన్‌ఏఏఎస్)లో ఫెలోషిప్ లభించింది. ఈ మేరకు జూన్ 14న కేంద్ర వ్యవసాయశాఖ ప్రకటించింది. సాంబ మసూరి వరి వంగడాన్ని మరింత అభివృద్ధి చేసిన సుందరం దానిలోని ఎండు తెగులు నియంత్రణపై విస్తృత పరిశోధన జరిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ వ్యవసాయశాస్త్ర అకాడమీ(ఎన్‌ఏఏఎస్)లో ఫెలోషిప్
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : డాక్టర్ ఆర్.ఎం. సుందరం
ఎందుకు : వరిపై విస్తృత పరిశోధన జరిపినందుకు

భారత ఇంజనీర్‌కు కామన్వెల్త్ ఇన్నోవేషన్ అవార్డు
భారత్‌కి చెందిన ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ నితేశ్‌కుమార్ జాంగిర్‌కు కామన్వెల్త్ సెక్రెటరీ జనరల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టయినబుల్ డెవల్‌పమెంట్-2019 అవార్డు లభించింది. లండన్‌లో జూన్ 18న జరిగిన కార్యక్రమంలో బ్రిటన్ యువరాజు హ్యారీ చేతులమీదుగా నితేశ్ ఈ అవార్డును అందుకున్నారు. ‘కంటిన్యుయస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెషర్’(సీపీఏపీ) పరికరాన్ని ఆవిష్కరించినందుకుగాను నితేశ్‌కు ఈ అవార్డు దక్కింది. ఆస్పత్రుల్లో ఐసీయూ వసతి లేక.. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందితో ఏటా లక్షలాది మంది నవజాత శిశువులు పుట్టిన కొన్ని గంటల్లోనే కన్నుమూస్తున్నారు. ఈ మరణాలు తగ్గించేందుకు సీపీఏపీని ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కామన్వెల్త్ సెక్రెటరీ జనరల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టయినబుల్ డెవల్‌పమెంట్-2019 అవార్డు
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : భారత ఇంజనీర్ నితేశ్‌కుమార్ జాంగిర్
ఎందుకు : కంటిన్యుయస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెషర్ (సీపీఏపీ) పరికరాన్ని ఆవిష్కరించినందుకుగాను

న్యాక్‌కు అసోచామ్ పురస్కారం
Current Affairs హైదరాబాద్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్)కు అసోచామ్ పురస్కారం లభించింది. శిక్షణ ఇచ్చిన తర్వాత అభ్యర్థులకు ఉద్యోగాన్ని కల్పించే ఉత్తమ సంస్థగా గుర్తింపు పొందిన న్యాక్‌కు బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ప్లేస్ కేటగిరీలో ఈ అవార్డు దక్కింది. అసోచామ్ ఇండియా ఆధ్వర్యంలో జూన్ 7న రాంచీలో నిర్వహించిన స్కిల్లింగ్ ఇండియా అవార్డ్స్-2019లో న్యాక్‌కు ఈ అవార్డును అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అసోచామ్ బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ప్లేస్‌మెంట్ అవార్డు
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : హైదరాబాద్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్)

రామా చంద్రమౌళికి నాజినామన్ పురస్కారం
వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, కథానవలా రచయిత రామా చంద్రమౌళి నాజినామన్ సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. దీంతో ఈ ఎంపికై న మొదటి తెలుగు సాహిత్యవేత్తగా ఆయన నిలిచారు. లెబనాన్‌కు చెందిన నాజినామన్ ఫౌండేషన్ మూడు విభాగాల్లో అందించే ఈ పురస్కారానికి వివిధ దేశాల నుంచి మొత్తం 60 ఎంపికయ్యారు. వీరిలో నలుగురు భారతీయులు ఉన్నారు. నలుగురు భారతీయులలో మెరిట్ ప్రైజ్ విభాగంలో బెంగాల్ కవి దెబశిశ్ లహరి, క్రియేటివిటీ ప్రైజ్ విభాగంలో అశోక్ చక్రవర్తి టోలోనా, దేవశ్రీ తివారీ ఎంపికయ్యారు. ఇక హానర్ ప్రైజ్ విభాగంలో 61 రచనలు చేసిన కవి, రచయితగా రామా చంద్రమౌళిని జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నాజినామన్ సాహిత్య పురస్కారం
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : రామా చంద్రమౌళి
ఎక్కడ : హానర్ ప్రైజ్ విభాగంలో

గ్రెటా థన్‌బర్గ్‌కు మానవ హక్కుల పురస్కారం
స్వీడన్‌కు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌కు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మక మానవ హక్కుల పురస్కారం ‘అంబాసిడర్ ఆఫ్ కన్సైన్స్’ లభించింది. పర్యావరణానికి హాని కలిగించే వాతావరణ మార్పులను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలంటూ 2018 ఏడాది ఆగస్టులో స్వీడన్ పార్లమెంట్ ఎదుట 16 ఏళ్ల థన్‌బర్గ్ ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ క్లైమేట్ స్టర్యిక్ మూవ్‌మెంట్’ను ప్రారంభించింది. ప్రతి శుక్రవారం పర్యావరణ పరిరక్షణకు కృషి చేసేందుకు ప్రారంభించిన ఈ ఉద్యమం బ్రెజిల్, ఉగాండా తదితర దేశాలకు విస్తరించి కోట్లాది మంది యువతకు స్ఫూర్తినిచ్చింది.
మానవ హక్కుల కోసం పోరాడే వ్యక్తులను, బృందాలను గౌరవించాలన్న ఉద్దేశంతో 2002లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ పురస్కారాన్ని నెలకొల్పింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంబాసిడర్ ఆఫ్ కన్సైన్స్ పురస్కారం
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : గ్రెటా థన్‌బర్గ్
ఎందుకు : పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినందుకు

అమితవ్ ఘోష్‌కు జ్ఞానపీఠ్ ప్రదానం
ప్రముఖ రచయిత అమితవ్ ఘోష్‌కు 54వ జ్ఞానపీఠ్ అవార్డును ప్రదానం చేశారు. న్యూఢిల్లీలోని ఇండియా హేబిటాట్ సెంటర్‌లో జూన్12న జరిగిన కార్యక్రమంలో మాజీ దౌత్యవేత్త, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాల్ కృష్ణ గాంధీ చేతుల మీదుగా అమితవ్ జ్ఞానపీఠ్ అవార్డు-2018ను అందుకున్నారు. దీంతో ఈ అవార్డు అందుకున్న మొదటి ఆంగ్ల రచయిత ఆయన గుర్తింపు పొందారు. ఈ అవార్డు కింద రూ.11లక్షల నగదుతోపాటు ప్రశంసాపత్రం అందజేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 54వ జ్ఞానపీఠ్ అవార్డును ప్రదానం
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : అమితవ్ ఘోష్

ఏపీఎండీసీకి సీఎస్సార్ అవార్డు
Current Affairs ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కు జాతీయ స్థాయి సీఎస్సార్ అవార్డు- 2018 లభించింది. దక్షిణాది విభాగంలో సవాళ్లను ఎదుర్కొంటూ కూడా పారిశ్రామిక సామాజిక బాధ్యత (సీఎస్సార్) కార్యక్రమాలను నిర్వహించినందుకు ఏపీఎండీసీని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జూన్ 2న ప్రకటించింది. ఏటా ఈ శాఖ సీఎస్సార్ అవార్డులను ప్రకటించడం రివాజుగా వస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీఎస్సార్ అవార్డు- 2018
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)
ఎందుకు : పారిశ్రామిక సామాజిక బాధ్యత కార్యక్రమాలను నిర్వహించినందుకు

తెలంగాణ పోలీసులకు పతకాల ప్రకటన
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హోంశాఖ పలువురు పోలీసులకు జూన్ 1న పతకాలను ప్రకటించింది. ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీసు పతకం అవార్డులకు ముగ్గురు అధికారులు ఎంపికయ్యారు. విధి నిర్వహణలో అత్యంత ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు పొందిన వారిలో ఎం.రమణకుమార్ ఏఎస్పీ (ఏసీబీ), ఎం.గంగాధర్ ఇన్‌స్పెక్టర్, సైబరాబాద్, ఎం.శ్రీధర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్, ఐటీ, రాచకొండ ఉన్నారు.
అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ పరిధిలోని వివిధ విభాగాలు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఫైర్ సర్వీసెస్, ఎస్పీఎఫ్, ఏసీబీ విభాగాల్లో ఉత్తమ సేవలందించిన వారికి కూడా పోలీసు సేవా పతకాలను హోంశాఖ ప్రకటించింది. తెలంగాణ శౌర్యపతకానికి (10 మంది), మహోన్నత పతకం (14 మంది), ఉత్తమ సేవా పతకం (89 మంది), కఠిన సేవా పతకం (47 మంది), సేవా పతకానికి (461 మంది) వీరితోపాటు ఎస్‌పీఎఫ్ ఉత్తమ సేవాలో ముగ్గురు, సేవా పతకానికి 15 మంది ఎంపికయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ పోలీసులకు పతకాల ప్రకటన
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : తెలంగాణ హోంశాఖ

శ్రీసిటీకి ఇండియాస్ బ్రాండ్ అవార్డు
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో గల శ్రీసిటీకి ‘ఇండియాస్ మోస్ట్ అడ్మైరబుల్ బ్రాండ్-2019’ అవార్డు లభించింది. ఎన్‌డీటీవీ అనుబంధ సంస్థ అయిన ది బ్రాండ్ స్టోరీ ఈ అవార్డును శ్రీసిటీ మేనేజింగ్ డెరైక్టర్ రవీంద్ర సన్నారెడ్డికి అందజేసింది. శ్రీసిటీ అభివృద్ధిపై బ్రాండ్ స్టోరీ సంస్థ తీసిన ప్రత్యేక కథనాన్ని జూన్ 2న ఎన్‌డీటీవీ ప్రాఫిట్ టీవీలో ప్రసారం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియాస్ మోస్ట్ అడ్మైరబుల్ బ్రాండ్-2019 అవార్డు
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : శ్రీసిటీ
ఎక్కడ : శ్రీసిటీ, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్

దక్కన్ సొసైటీకి ఈక్వేటరి అవార్డు
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని డీడీఎస్(దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ)కి ఈక్వేటరి అవార్డు లభించింది. 2019 సంవత్సరానికిగాను 20 సంస్థలను ఈ అవార్డుకు ఎంపికచేయగా వాటిలో డీడీఎస్ సంస్థ ఉందని ఆ సంస్థ సంచాలకుడు పీవీ సతీష్ తెలిపారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునెటైడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం(యూఎన్‌డీపీ) ఏటా ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణవేత్తలు, పర్యావరణ పరిరక్షణకు కృషిచేసే సంస్థలను గుర్తించి ఈ అవార్డును ప్రకటిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూఎన్‌డీపీ ఈక్వేటరి అవార్డు-2019
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : జహీరాబాద్ డీడీఎస్(దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ)

సుందర్ పిచాయ్‌కి గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కి గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు-2019 లభించింది. అమెరికా భారత వాణిజ్య మండలి(యూఎస్‌ఐబీసీ) ప్రతి ఏటా ఇచ్చే ఈ అవార్డుకు పిచాయ్‌తోపాటు నాస్‌డాక్ అధ్యక్షుడు అడేనా ఫ్రైడ్‌మాన్ కూడా ఎంపికయ్యారు. జూన్ నెలలోనే జరగనున్న ‘ఇండియా ఐడియాస్’ సదస్సులో వారికి అవార్డును ప్రదానం చేయనున్నారు. ప్రపంచ సాంకేతిక రంగ అభివృద్ధికి ఇరు కంపెనీలు అందిస్తున్న సేవలకు గానూ వారిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు యూఎస్‌ఐబీసీ వెల్లడించింది. గూగుల్, నాస్‌డాక్ కంపెనీల సహకారంతో 2018లో అమెరికా-భారత్ మధ్య వస్తుసేవల ద్వైపాక్షిక వాణిజ్యంలో 150శాతం మేర వృద్ధి చెందినట్లు పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూఎస్‌ఐబీసీ గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు-2019
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : సుందర్ పిచాయ్, అడేనా ఫ్రైడ్‌మాన్
ఎందుకు : సాంకేతిక రంగ అభివృద్ధికి అందిస్తున్న సేవలకు గానూ
Published date : 18 Jun 2019 04:09PM

Photo Stories