Skip to main content

జూలై 2018 అవార్డ్స్

ఇద్దరు భారతీయులకు మెగసెసె అవార్డు
Current Affairs ఇద్దరు భారతీయలకు ఆసియన్ నోబెల్‌గా పేరుగాంచిన రామన్ మెగసెసె అవార్డు లభించింది. మానసిక వైద్యుడు భరత్ వాత్వానీ, ఇంజనీర్ సోనమ్ వాంగ్‌చుక్‌లు అవార్డుకు ఎంపికైనట్లు మెగసెసె ఫౌండేషన్ జూలై 26న తెలిపింది.
ముంబైకి చెందిన భరత్ వాత్వానీ వీధుల్లో తిరుగుతున్న మతిస్థిమితం లేనివారికి ఆహారం, ఆశ్రయం ఇవ్వడంతో పాటు ఉచిత చికిత్సను అందిస్తున్నారు. ఇందుకోసం వాత్వానీ దంపతులు 1988లో శ్రద్ధ రిహాబిలిటేషన్ ఫౌండేషన్‌ను స్థాపించారు.
జమ్మూకశ్మీర్‌కి చెందిన సోనమ్ వాంగ్‌చుక్ ఈశాన్య భారతం, లడఖ్ యువతకు సృజనాత్మక బోధనా పద్ధతులతో విద్యను అందిస్తూ వారి ఉన్నతికి తోడ్పడుతున్నారు. ఇందుకోసం స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లడఖ్ (సెక్మోల్) అనే సంస్థను ఏర్పాటు చేశారు. అలాగే 1994లో ఆపరేషన్ న్యూ హోప్ (ఓఎన్‌హెచ్)ను చేపట్టారు. జమ్మూకశ్మీర్‌లోని లేహ్ జిల్లా, అల్చీకి సమీపంలోగల ఉలేయ్‌టోప్కోలో 1966 సెప్టెంబర్ 1న జన్మించిన సోనమ్ 1988లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ‘త్రీ ఇడియట్స్’ సినిమాలో ఆమిర్ ఖాన్ పాత్రకు స్ఫూర్తిగా నిలిచారు.
వీరితో పాటు కంబోడియాకు చెందిన యూక్ ఛాంగ్, తూర్పు తైమూర్‌కు చెందిన మరియా డీ లౌర్డెస్, ఫిలిప్పీన్స్కు చెందిన హోవర్డ్ డీ, వియత్నాంకు చెందిన హోథి హోంగ్ యన్‌లు మెగసెసె అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డులను ఫిలిప్పీన్స్ రాజధాని నగరం మనీలాలో ఉన్న సాంస్కృతిక కేంద్రంలో ఆగస్టు 10న ప్రదానం చేయనున్నారు. అవార్డు విజేతలకు రూ.20.6 లక్షల నగదు బహుమతితోపాటు మెగసెసె ముఖాకృతి ఉన్న మెడల్‌ను ప్రదానం చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇద్దరు భారతీయులకు రామన్ మెగసెసె అవార్డు
ఎప్పుడు : జూలై 26
ఎవరు : భరత్ వాత్వానీ, సోనమ్ వాంగ్‌చుక్
ఎందుకు : సామాజిక సేవ చేసినందుకు

సైయంట్ ఫౌండర్‌కు హైసియా అవార్డు
సైయంట్ ఫౌండర్ బీవీఆర్ మోహన్‌రెడ్డికి హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రెసైస్ అసోసియేషన్ (హైసియా) నుంచి 2018 సంవత్సరానికిగాను లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. ఈ మేరకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్‌లో జూలై 27న అవార్డును ప్రదానం చేశారు. ఐటీ, ఐటీఈఎస్ పరిశ్రమ వృద్ధికి ఆయన చేసిన సేవలకుగాను ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైసియా అవార్డు-2018
ఎప్పుడు : జూలై 27
ఎవరు : బీవీఆర్ మోహన్‌రెడ్డి
ఎందుకు : ఐటీ, ఐటీఈఎస్ పరిశ్రమ వృద్ధికి కృషి చేసినందుకు

శాంతాదేవికి మాలతీచందూర్ పురస్కారం
ప్రముఖ రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవికి మాలతీ చందూర్ పురస్కారం - 2018 లభించింది. తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ జూలై 28న తెలిపారు. ఆగస్టు 25న హైదరాబాద్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అవార్డును ప్రదానం చేస్తారు.
తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన నవలా రచయిత్రికి, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి, చందూర్ కుటుంబం, స్నేహితులు సంయుక్తంగా ఏటా మాలతీ చందూర్ పురస్కారాన్ని అందచేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మాలతీ చందూర్ పురస్కారం-2018
ఎప్పుడు : జూలై 28
ఎవరు : పోల్కంపల్లి శాంతాదేవి
ఎందుకు : తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు

సాక్షి’ ఫొటోగ్రాఫర్లకు జాతీయస్థాయి అవార్డులు
ఇద్దరు ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లకు జాతీయస్థాయి డిజిటల్ ఫొటో కాంటెస్ట్- 2018 అవార్డులు లభించాయి. ఐదు అంశాల్లో జరిగిన ఈ పోటీలో ‘స్టోర్మ్ క్యాప్చర్’ విభాగంలో నడిపూరి కిశోర్ (విజయవాడ)కు బెస్ట్ ఇమేజ్ అవార్డు లభించగా ‘లాస్ట్ ఫ్యూనరల్’ విభాగంలో వి.రూబెన్ బెసాలియల్‌కు తృతీయ పురస్కారం దక్కింది.
వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఆలిండియా ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫీ కౌన్సిల్, ఢిల్లీ (ఐఐపీసీ), ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ (ఏపీఏ) లు జూలై 30న సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయస్థాయి డిజిటల్ ఫొటో కాంటెస్ట్- 2018 అవార్డులు
ఎప్పుడు : జూలై 30
ఎవరు : నడిపూరి కిశోర్, వి.రూబెన్ బెసాలియల్
ఎక్కడ : స్టోర్మ్ క్యాప్చర్, లాస్ట్ ఫ్యూనరల్ విభాగంలో

గోపాల్‌కృష్ణ గాంధీకి సద్భావన అవార్డు’
పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, మహాత్మాగాంధీ మనవడు గోపాల్‌కృష్ణ గాంధీ రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు కమిటీ సభ్య కార్యదర్శి మోతీలాల్ వోరా జూలై 31న తెలిపారు. అవార్డు కింద జ్ఞాపికతో పాటు రూ.10 లక్షల నగదు అందజేస్తారు. ఆగ స్టు 20న రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
జాతీయ సమగ్రత, మతసామరస్యం, శాంతి కోసం పాటుపడేవారికి ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డు-2018
ఎప్పుడు : జూలై 31
ఎవరు : గోపాల్‌కృష్ణ గాంధీ

ఐఫోలో ఐదుగురు భారతీయ విద్యార్థులకు స్వర్ణాలు
ది ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ (ఐఫో)లో పాల్గొన్న ఐదుగురు భారతీయ విద్యార్థులకు జూలై 30న స్వర్ణ పతకాలు లభించాయి. పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లో జూలై 30న జరిగిన 49వ ఐఫోలో కోట(రాజస్థాన్)కు చెందిన లే జైన్, పవన్ గోయల్, భాస్కర్ గుప్తా(ముంబై), నిషాంత్ అభాంగి (రాజ్‌కోట్), సిద్ధార్థ్ తివారీ(కోల్‌కతా) లు స్వర్ణాలను గెలుపొందారు. ఐఫోలో భారత్ ఒకేసారి ఐదు స్వర్ణ పతకాలను సాధించడం ఇదే మొదటిసారి. ఈ పోటీల్లో 85 దేశాల నుంచి 396 మంది పోటీ పడగా వీరిలో 42 మంది గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు.
ప్రఖ్యాత ఇంటర్నేషనల్ సైన్స్ ఒలింపియాడ్లలో ఒకటైన ఐఫో ను ఫిజిక్స్‌పై విద్యార్థుల్లో ఆసక్తి పెంచడం, అంతర్జాతీయ స్థాయిలో ఫిజిక్స్ ప్రాధాన్యం పెంచే లక్ష్యంతో ఏటా నిర్వహిస్తారు. థియరీ, ప్రాక్టికల్స్ విభాగాల్లో జరిగే ఈ పోటీలు 1967లో ప్రారంభం కాగా భారత్ 1998 నుంచి పాల్గొంటోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ది ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో భారత్‌కు ఐదు స్వర్ణాలు
ఎప్పుడు : జూలై 30
ఎవరు : లే జైన్, పవన్ గోయల్, భాస్కర్ గుప్తా, నిషాంత్ అభాంగి, సిద్ధార్థ్ తివారీ
ఎక్కడ : లిస్బన్, పోర్చుగల్

సుందరీకరణలో సికింద్రాబాద్ స్టేషన్‌కు అవార్డు
Current Affairs రైల్వేస్టేషన్ల సుందరీకరణలో సికింద్రాబాద్ స్టేషన్‌కు అవార్డు దక్కింది. రంగులతో స్థానిక కళలు ప్రతిబింబించేలా, గ్రాఫిక్ డిజైన్లతో సుందరీకరించిన స్టేషన్లకు కేంద్ర రైల్వేశాఖ జూలై 12న అవార్డులు ప్రకటించింది. గాంధీధామ్, కోటా స్టేషన్లతో కలిపి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో మహారాష్ట్రలోని బల్లార్ష- చంద్రాపూర్ స్టేషన్లకు మొదటి బహుమతి లభించగా తమిళనాడులోని మధురై స్టేషన్‌కు రెండో బహుమతి దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుందరీకరణలో సికింద్రాబాద్ స్టేషన్‌కు అవార్డు
ఎప్పుడు : జూలై 12
ఎవరు : రైల్వేశాఖ
ఎందుకు : గ్రాఫిక్ డిజైన్లతో రైల్వే స్టేషన్లను సుందరీకరించినందుకు

భారత సంతతికి బాలుడికి యూకే అవార్డు
భారత సంతతికి చెందిన ఎనిమిదేళ్ల ఈశ్వర్ శర్మకు ‘బ్రిటిష్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు దక్కింది. యూకేలో నిర్వహించిన యోగా చాంపియన్ పోటీల్లో అండర్ 11 విభాగంలో ఈ అవార్డు దక్కింది. అలాగే ఆర్టిస్టిక్ యోగాలో గోల్డ్‌మెడల్‌ను కూడా శర్మ దక్కించుకున్నాడు. కెంట్‌లోని సెయింట్ మైకెల్స్ ప్రిపరేటరీ స్కూల్లో శర్మ చదువుతున్నాడు. బర్మింగ్‌హామ్‌లో జూలై 15న జరిగిన ఆరో వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో ‘యంగ్ ఎచీవర్’ కేటగిరీలో ఈ అవార్డును ప్రదానం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
ఎప్పుడు : జూలై 15
ఎవరు : ఈశ్వర్ శర్మ
ఎక్కడ : యోగా చాంపియన్ పోటీల్లో

సెంబ్‌కార్ప్‌కు గోల్డెన్ పీకాక్ అవార్డ్
సెంబ్‌కార్ప్ ఎనర్జీ ఇండియా ను ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డు వరించింది. ఈ మేరకు ఢిల్లీలో జూలై 6న జరిగిన కార్యక్రమంలో భారత్‌లో ఫిన్లాండ్ రాయబారి నైనా వాస్కున్ కంపెనీ ప్రతినిధి పవన్ రావుకు అవార్డును అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోల్డెన్ పీకాక్ అవార్డు
ఎప్పుడు : జూలై 6
ఎవరు : సెంబ్‌కార్ప్ ఎనర్జీ ఇండియా
ఎక్కడ : ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ విభాగం

ద ఇంగ్లిష్ పేషంట్’కు గోల్డెన్ బుకర్ ప్రైజ్
శ్రీలంక మూలాలు కలిగిన కెనడా రచయిత, సాంస్కృతిక దిగ్గజం మైకేల్ ఆందాజీ రచన ‘ద ఇంగ్లిష్ పేషంట్’ గోల్డెన్ మ్యాన్ బుకర్ ప్రైజ్ గెలుచుకుంది. ఈ మేరకు గత యాభై ఏళ్లలో బుకర్ ప్రైజ్ సాధించిన పుస్తకాల్లో అత్యుత్తమమైందిగా ఎంపికైంది. 1992లో ‘ద ఇంగ్లిష్ పేషంట్’ నవల బేరీ ఉన్స్ వర్త్ రచన ‘సేక్రెడ్ హంగర్’తో కలిసి బుకర్ ప్రైజ్ గెల్చుకుంది. రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితుల నేపథ్యంలో ప్రేమ, సంఘర్షణకు సంబంధించిన కథను ఆందాజీ ఆ నవలలో రచించారు.
జూలై 9న లండన్‌లో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ చైర్మన్ హెలెనా కెన్నెడీ మాట్లాడుతూ ద ఇంగ్లిష్ పేషంట్ కవితాత్మక, తాత్విక అంశాలతో కూడిన సమగ్ర రచన అని అన్నారు. 2008లో బుకర్ ప్రైజ్ 40వ వార్షికోత్సవం సందర్భంగా ఓటింగ్ నిర్వహించగా ప్రజలు సల్మాన్ రష్దీ ‘మిడ్‌నైట్స్ చిల్డ్రన్’ను ఎంపిక చేశారు.
గతంలో మ్యాన్ బుకర్ ప్రైజ్ సాధించిన భారతీయ మూలాలు కలిగిన రచయితలు వీఎస్ నైపాల్ (ఇన్ ఎ ఫ్రీ స్టేట్-1971), సల్మాన్ రష్దీ (మిడ్‌నైట్స్ చిల్డ్రన్-1981), అరుంధతీరాయ్ (ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్‌‌స-1997), కిరణ్ దేశాయ్ (ద ఇన్‌హెరిటెన్స్ ఆఫ్ లాస్-2006), అరవింద్ అడిగ (ద వైట్ టైగర్-2008).
క్విక్ రివ్యూ:
ఏమిటి : ద ఇంగ్లిష్ పేషంట్ నవలకి గోల్డెన్ బుకర్ ప్రైజ్
ఎప్పుడు : జూలై 9
ఎవరు : మైకేల్ ఆందాజీ
ఎక్కడ : లండన్, బ్రిటన్

జీఆర్‌టీ జువెలర్స్‌కు రెండు అంతర్జాతీయ అవార్డులు
జీఆర్‌టీ జువెలర్స్‌కి ‘ఐకానిక్ బ్రాండ్ రైజింగ్ స్టార్’ అవార్డు, ‘ఇన్‌స్పిరేషనల్ లీడర్ 2018’ అవార్డులు లభించాయి. జెమ్స్ అండ్ జువెలరీ పరిశ్రమకు అందించిన విశేష సేవలకు గానూ సంస్థ చైర్మన్ జి.రాజేంద్రన్‌కి ‘ఇన్‌స్పిరేషనల్ లీడర్ 2018’ అవార్డును డబ్ల్యూసీఆర్‌సీ అందించింది. ఇటీవల లండన్‌లో జరిగిన యూకే-ఆసియా బిజినెస్ అవార్డ్స్ 2018 కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐకానిక్ బ్రాండ్ రైజింగ్ స్టార్, ఇన్‌స్పిరేషనల్ లీడర్ 2018 అవార్డులు
ఎవరు : జీఆర్‌టీ జువెలర్స్
ఎక్కడ : లండన్, బ్రిటన్
ఎందుకు : జువెలరీ పరిశ్రమకు అందించిన విశేష సేవలకు

ఇస్రో శాస్త్రవేత్త సురేష్‌కు పయనీర్ అవార్డు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బైరన నాగప్ప సురేష్ కు పయనీర్ అవార్డు లభించింది. ది ఇంటర్నేషనల్ కౌన్సిల్ అన్ సిస్టం (ఇన్ కోస్) అనే సంస్థ అమెరికాలో జూలై 10 ఈ అవార్డును ప్రదానం చేసింది.
శ్రీహరికోటలో జరిగే ప్రతి ప్రయోగానికి వెహికల్ సిద్ధం అయ్యాక మిషన్ రె డీనెస్ రివ్యూ (ఎంఆర్‌ఆర్) కమిటీకి చైర్మన్‌గా సురేష్ వ్యవహరిస్తుంటారు. ఇస్రోకు ఆయన చేసిన సేవలకు 2002లో పద్మశ్రీ, 2013 పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఇస్రో శాస్త్రవేత్తకు పయనీర్ అవార్డు
ఎప్పుడు : జూలై 10
ఎవరు : డాక్టర్ బైరన నాగప్ప సురేష్
ఎక్కడ : అమెరికా

సంగీత శర్మకు ఇండియా మేరిటైమ్ అవార్డు
Current Affairs
లైనర్ అండ్ ప్యాసెంజర్ సర్వీసెస్ డెరైక్టర్ సంగీత శర్మకు ఇండియా మేరిటైమ్ అవార్డు లభించింది. షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ రంగంలో అందించిన సేవలకు గాను ఉమెన్ ప్రొఫెషనల్ విభాగంలో ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఈ మేరకు ముంబైలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ అవార్డును ప్రదానం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియా మేరిటైమ్ అవార్డు 2018
ఎవరు : సంగీత శర్మ
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ రంగంలో అందించిన సేవలకుగాను

హంసలేఖ, అరుంధతీనాగ్‌లకు ఎన్టీఆర్ అవార్డు
కర్ణాటక తెలుగు అకాడమీ ఏటా సినీ కళాకారులకు అందజేసే డాక్టర్ ఎన్.టి.ఆర్.జాతీయ పురస్కారాలకు సంగీత దర్శకుడు డాక్టర్ హంసలేఖ, ప్రముఖ సినీ నటి అరుంధతీనాగ్ ఎంపికయ్యారు. ఈ మేరకు అకాడమీ అధ్యక్షుడు ఆర్.వి.హరీశ్ జూలై 3న తెలిపారు. జూలై 6న బెంగళూరులో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు.
తెలుగు భాషాభివృద్ధికి, సాహిత్య సాంస్కృతిక, లలిత కళలను ప్రోత్సహించేందుకు 1984లో కర్ణాటక తెలుగు అకాడమీ ఏర్పాటైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్.టి.ఆర్.జాతీయ పురస్కారాలు
ఎప్పుడు : జూలై 3
ఎవరు : హంసలేఖ, అరుంధతీనాగ్
ఎక్కడ : సినీరంగంలో
ఎందుకు : కర్ణాటక తెలుగు అకాడమీ ఏటా ఈ అవార్డులను అందజేస్తుంది.
Published date : 03 Aug 2018 05:29PM

Photo Stories