Awards: డాక్టర్ సుందరాచారికి స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు
గుంటూరుమెడికల్: గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగాధిపతిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారికి స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు లభించింది. యూనివర్సిటీలు, కాలేజ్ టీచర్స్‌కు 2023 సంవత్సరానికి స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డులను హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ జె. శ్యామలరావు ఆదివారం ప్రకటించారు. యూనివర్సిటీ టీచర్స్‌లో 40 మందిని బెస్ట్ టీచర్స్‌గా ప్రకటించగా అందులో వైద్యరంగం నుంచి ఇరువురిని ప్రకటించారు. వారిలో తిరుపతి సిమ్స్‌కి చెందిన డాక్టర్ అపర్ణ, గుంటూరు వైద్య కళాశాలకు చెందిన డాక్టర్ సుందరాచారి ఉన్నారు.
గత నెలలో న్యూరాలజీ డిపార్టమెంట్‌లో రోగులకు చేస్తున్న వైద్య సేవలకుగాను స్వాతంత్య్ర వేడుకల్లో బెస్ట్ డాక్టర్ అవార్డును, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. న్యూరాలజీ వైద్య విభాగంలో రెండున్నర దశాబ్దాలుగా ఆయన చేస్తున్న సేవలకుగాను గతేడాది ఆగస్టులో అరుదైన గౌరవం దక్కింది. ఫెల్ ఆఫ్ ది అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీగా ఎన్నికయ్యారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి విభాగాధిపతిగా...
డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి 1981లో గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. న్యూరాలజీ పీజీ పూర్తిచేసిన పిదప చదువుకున్న మాతృసంస్థకు సేవచేయాలనే లక్ష్యంతో 2001లో జీజీహెచ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధుల్లో చేరారు. అసోసియేట్ ప్రొఫెసర్‌గా, ప్రొఫెసర్‌గా పదోన్నతులు పొంది నేడు విభాగాధిపతిగా విధులు నిర్వర్తిస్తున్నారు. విధుల్లో చేరిన నాటినుండి పీజీ వైద్య విద్యార్థుల బోధన మెరుగుపడేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. న్యూరాలజీలో ఒకేసారి నాలుగు పీజీ సీట్లు గుంటూరు జీజీహెచ్‌కు వచ్చేలా చేసి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.
పలుమార్లు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పీజీ పరీక్ష ఫలితాల్లో డాక్టర్ సుందరాచారి మార్గదర్శకత్వంలో పీజీ వైద్యులు తమ సత్తా చాటి ప్రథమస్థానాలు గెలుచుకున్నారు. ప్రార్ధించే పెదవులకన్నా సాయం చేసే చేతుల మిన్నా అనే సూక్తిని తూచా తప్పకుండా పాటిస్తూ మదర్‌థెరిస్సా స్ఫూర్తితో వైద్యరంగాన్ని అందులో డాక్టర్ వృత్తిని ఎంచుకుని ఎందరో పేద రోగులకు వైద్యసేవలను అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల కంటే ధీటుగా న్యూరాలజీ వైద్య విభాగాన్ని అభివృద్ధి చేసి కార్పొరేట్ వైద్యసేవలను పేదలకు ఉచితంగా అందిస్తున్నారు.
ఉమ్మడి ఏపీలో ఏ ప్రభుత్వ ఆస్పత్రుల్లో లేని విధంగా గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వార్డులో బ్రెయిన్ స్ట్రోక్ బాధితుల కోసం ప్రత్యేకంగా యూనిట్ ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు. నిద్ర సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి చెక్‌పెట్టే స్లీప్‌ల్యాబ్‌ను సైతం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు జీజీహెచ్‌లో ఏర్పాటు చేయించారు.
న్యూరాలజీ వైద్య విభాగంలో అందిస్తున్న నాణ్యమైన వైద్యసేవలకు గుర్తింపుగా 2018 జూన్‌లో రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆస్పత్రుల్లో లేని విధంగా న్యూరాలజీ వైద్య విభాగానికి ఐఎస్‌ఓ గుర్తింపు లభించింది. స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపికై న డాక్టర్ సుందరాచారికి గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీలి ఉమాజ్యోతి, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్, న్యూరాలజిస్టుల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ పమిడిముక్కల విజయ, పలువురు న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్లు అభినందనలు తెలిపారు.