Inter Exams: ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు మళ్లీ పరీక్షలు..
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్ ఫెయిలైన విద్యార్థులతో తిరిగి పరీక్షలు రాయించేలా సంబంధిత కళాశాలల ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్ ప్రాంతీయ తనిఖీ అధికారి కే.చంద్రశేఖర బాబు, జిల్లా వృత్తి విద్యా అధికారి బీ.ప్రభాకర రావు ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలోని అన్ని కళాశాలల యాజమాన్యాలకు తగిన సూచనలిచ్చారు.
2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో ఫెయిలైన విద్యార్థులు తిరిగి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో చేరి రెగ్యులర్ విద్యార్థిగా మారే అవకాశం ఇంటర్మీడియట్ బోర్డు కల్పించిందన్నారు. వచ్చే మార్చిలో జరిగే పరీక్షలకు హాజరయ్యేందుకు ఆయా విద్యార్థులకు అవకాశం కల్పించారన్నారు. గత రెండు విద్యా సంవత్సరాల్లో ఫెయిలైన విద్యార్థుల వివరాలను తీసుకుని వారిని, వారి తల్లిదండ్రులను నేరుగా సంప్రదించి పరీక్ష ఫీజులు చెల్లించేలా సంబంధిత కళాశాలల అధ్యాపకులు, ప్రిన్సిపాల్స్ కృషి చేయాలన్నారు.