ఉద్యోగాల సాధనలో ఆకాశమే హద్దైన మ్యాథమెటిక్స్.. కోర్సులు అందించే టాప్ ఇన్‌స్టిట్యూట్స్ ఇవే..
కంప్యూటర్ నిపుణుడిగా మారాలన్నా.. ఎకనామిస్ట్‌గా రాణించాలన్నా.. గణాంక నిపుణుడు అవ్వాలన్నా.. మార్కెట్ రీసెర్చర్‌గా కెరీర్ సొంతం చేసుకోవాలన్నా.. బ్యాంకర్ అవ్వాలన్నా.. మ్యాథమెటిక్స్ నైపుణ్యాలు కీలకం! అలాంటి మ్యాథ్స్‌ను టాప్ ఇన్‌స్టిట్యూట్స్‌లో చదివితే.. ఇక అవకాశాలకు ఆకాశమే హద్దు అంటున్నారు నిపుణులు!! ఈ నేపథ్యంలో.. దేశంలో మ్యాథ్స్ కోర్సులను అందించడంలో మంచి పేరున్న ఇన్‌స్టిట్యూట్స్ గురించి తెలుసుకుందాం...
మ్యాథమెటిక్స్ డిగ్రీలు
దేశంలోని యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్స్ బీఏ/బీఎస్సీ/ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ వంటి కోర్సులను అందిస్తున్నాయి. మ్యాథమెటిక్స్‌లో ప్యూర్ మ్యాథమెటిక్స్, అప్లయిడ్ మ్యాథమెటిక్స్ అని రెండు రకాలు ఉంటాయి. కొన్ని సంస్థలు రెండింటిలో ఏదో ఒక కోర్సు అందిస్తుండగా.. మరికొన్ని సంస్థలు ప్యూర్ అండ్ అప్లయిడ్ మ్యాథమెటిక్స్ రెండింటినీ అందిస్తున్నాయి. వాస్తవానికి మ్యాథమెటిక్స్ అనేది బిజినెస్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఫైనాన్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, ఇంజనీరింగ్, సైన్స్ వంటి కోర్సులతో ముడిపడి ఉంటుంది. బీఎస్సీ మ్యాథ్స్ పూర్తయ్యాక పీజీ స్థాయిలో ఎమ్మెస్సీ మ్యాథ్స్‌లో చేరేందుకు ఆయా యూనివర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్స్ నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్‌లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది.
టాప్ మ్యాథ్స్ ఇన్‌స్టిట్యూట్స్..
మన దేశంలో స్టేట్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు ప్రపంచ ప్రసిద్ధి చెందిన మ్యాథమెటిక్స్ విద్యా సంస్థలు ఉన్నాయి. వీటిలో ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీలు, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (కోల్‌కతా/ బెంగళూరు), టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (ముంబై), చెన్నై మ్యాథమెటికల్ ఇన్‌స్టిట్యూట్ వంటి సంస్థలు అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్, డాక్టోరల్ కోర్సులను అందిస్తున్నాయి.
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్(ఐఎస్‌ఐ)..
కోల్‌కతాలో 1931లో ఏర్పాటైన ఐఎస్‌ఐకు ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, తేజ్‌పూర్, జార్ఖండ్‌లోని గిరిధిల్లో క్యాంపస్‌లు న్నాయి. ఈ ఇన్‌స్టిట్యూట్ మ్యాథమెటిక్స్‌కు సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ (బీమ్యాథ్(3 ఏళ్లు), మాస్టర్ ఆఫ్ మ్యాథమెటిక్స్(ఎంమ్యాథ్) కోర్సులను అందిస్తోంది. దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థ స్టాటిస్టిక్స్ కోర్సులకు పెట్టింది పేరు. అయితే ఇక్కడ అందించే బీమ్యాథ్, ఎంమ్యాథ్ కోర్సులకు కూడా మంచి గుర్తింప ఉంది. ‘ఐఎస్‌ఐ అడ్మిష¯ŒS టెస్ట్’లో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఈ ఇన్‌స్టిట్యూట్ మ్యాథమెటిక్స్‌లో పీహెచ్‌డీ కూడా అందిస్తోంది.
వివరాలకు వెబ్‌సైట్ : www.isical.ac.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)
బెంగళూరు కేంద్రంగా 1909లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) ఏర్పాటైంది. అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయి నుంచి పీహెచ్‌డీ వరకు ఇక్కడ పలు సైన్స్, మ్యాథమెటిక్స్ కోర్సులను అందిస్తున్నారు. ప్రధానంగా బీఎస్ మ్యాథ్(4ఏళ్లు), ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ(5ఏళ్లు) ఇక్కడ చేసేందుకు విద్యార్థులు ఇష్టపడతారు. మ్యాథమెటిక్స్ కోర్సులను అందించడంలో
ఈ సంస్థకు ఎంతో పేరుంది. కేవీపీవై, జేఈఈ– మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్, నీట్–యూజీ ఎంట్రన్స్ టెస్ట్‌ల్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఐఐఎస్సీ అందించే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ఇంటిగ్రేటెట్ పీహెచ్‌డీ కోర్సుల్లో జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ(ఐఐటీ– జేఏఎం) ద్వారా ప్రవేశం పొందవచ్చు.
వివరాలకు వెబ్‌సైట్ : www.iisc.ac.in
చెన్నై మ్యాథమెటికల్ ఇన్‌స్టిట్యూట్(సీఎంఐ)
ఈ సంస్థను 1989లో ఏర్పాటు చేశారు. 1996 నుంచి అటానమస్ విద్యా సంస్థగా పనిచేస్తూ.. పలు యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తోంది. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి ఇక్కడ మూడేళ్ల బీఎస్సీ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ కోర్సును, బీఎస్సీ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ కోర్సును, ఎంఎస్సీ మ్యాథ్స్, పీహెచ్‌డీ మ్యాథ్స్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తోంది. ఏటా సీఎంఐ ఎంట్రన్స్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వూ్య ఆధారంగా బ్యాచిలర్/ పోస్టు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం కల్పిస్తారు. పీహెచ్‌డీలో ప్రవేశాలకు జెస్ట్‌లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది.
వివరాలకు వెబ్‌సైట్ : www.cmi.ac.in
హరీష్ చంద్ర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (హెచ్‌ఆర్‌ఐ)
దేశంలో ప్రముఖ మ్యాథమెటిక్స్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ‘హరీష్ చంద్ర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ (అలహాబాద్)కు ఎంతో పేరుంది. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ కోర్సుల్లో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ–పీహెచ్‌డీ (ఐదేళ్లు), పీహెచ్‌డీ అందిస్తున్నారు. భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనుబంధ విభాగమైన ‘నేషనల్ బోర్డ్ ఫర్ హయ్యర్ మ్యాథమెటిక్స్’ (ఎన్బీహెచ్‌ఎం) నిర్వహించే పీహెచ్‌డీ స్కాలర్‌షిప్ స్క్రీనింగ్ ఎగ్జామ్‌లో కటాఫ్ కంటే ఎక్కువ మార్కులు సాధించినవారిని హెచ్‌ఆర్‌ఐ పీహెచ్‌డీ ఎంట్రన్స్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు. అలాగే జాతీయ స్థాయి యూజీసీ–సీఎస్‌ఐఆర్ ఫెలోషిప్ ఎగ్జామ్‌లో నిర్దిష్ట కటాఫ్ వరకు ర్యాంకు సాధించిన వారిని కూడా హెచ్‌ఆర్‌ఐ పీహెచ్‌డీ ఎంట్రన్స్‌కు అనుమతిస్తారు. తర్వాత పర్సనల్ ఇంటర్వూ ఆధారంగా అతి కొద్ది మందికి మాత్రమే ప్రవేశం లభిస్తుంది. వివరాలకు వెబ్‌సైట్ : www.hri.res.in
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్..
చెన్నై కేంద్రంగా 1962లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఇక్కడ మ్యాథమెటిక్స్ పీహెచ్‌డీ, ఎంఎస్సీ పీహెచ్‌డీ(ఇంటిగ్రేటెడ్) కోర్సులు చేసే అవకాశం ఉంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ హయ్యర్ మ్యాథమెటిక్స్(ఎన్బీహెచ్‌ఎం).. పీహెచ్‌డీ స్కాలర్‌షిప్ స్క్రీనింగ్ ఎగ్జామ్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా, అభ్యర్థులకు ఇంటర్వూ్యలు నిర్వహించి ఇందులో ప్రవేశం కల్పిస్తారు.
వివరాలకు వెబ్‌సైట్ : www.imsc.res.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)–కాన్పూర్‌లో నాలుగేళ్ల బీఎస్ మ్యాథ్స్ కోర్సు అందుబాటులో ఉంది. అలాగే బీఎస్–ఎంఎస్, ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్, పీహెచ్‌డీలను సైతం అందిస్తోంది. ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సాధించిన స్కోర్S ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. డ్యూయల్ డిగ్రీలో భాగంగా ఇంటిగ్రేటెడ్ పీజీ.. ‘బీఎస్–ఎంఎస్’ కోర్సు చేసేందుకు అవకాశం ఉంది. దీనికి జేఈఈ ర్యాంక్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(టీఐఎఫ్‌ఆర్)..
ముంబై కేంద్రంగా 1945లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. బెంగళూరు శాఖ(సెంటర్ ఫర్ అప్లికేబుల్ మ్యాథమెటిక్స్)లో మ్యాథమెటికల్ కోర్సు అందిస్తున్నారు. ఇందులో ఎంఎస్సీ/ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ–పీహెచ్‌డీ(ఐదేళ్లు) మ్యాథ్స్ కోర్సు అందుబాటులో ఉంది. బీఏ/బీఎస్సీ(మ్యాథ్స్)/బీటెక్/బీఈ పూర్తి చేసిన అభ్యర్థులు టీఐఎఫ్‌ఆర్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశం పొందవచ్చు.
వివరాలకు వెబ్‌సైట్ : www.iiserpune.ac.in
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఎన్ఐఎస్‌ఈఆర్)
భువనేశ్వర్‌లో ఉన్న ఈ సంస్థ.. మ్యాథమెటికల్ సైన్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్–ఎంఎస్ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ–పీహెచ్‌డీ, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తోంది. పలు సైన్స్ కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఫీజులతో మ్యాథమెటికల్ సైన్స్‌లో మంచి డిగ్రీ సంపాదించేందుకు ఈ సంస్థ సరైనదని చెప్పొచ్చు.
వివరాలకు వెబ్‌సైట్ : www.niser.ac.in/sms
హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో సైన్స్, మ్యాథమెటిక్స్ కోర్సులకు ఎంతో గుర్తింపు ఉంది. హెచ్‌సీయూలోని స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగంలో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, ఎంఎస్సీ అప్లయిడ్ మ్యాథమెటిక్స్, పీహెచ్‌డీ కోర్సులు అందిస్తోంది. ఏటా వర్సిటీ నిర్వహించే హెచ్‌సీయూ సెట్ ద్వారా ఆయా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ఇంటర్మీడియెట్‌లో 60 శాతం మార్కులు సాధించినవారు ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చు. కేవీపీవై, సైన్స్/మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో టాప్ ర్యాంక్ సాధించినవారికి ఎంట్రన్స్ టెస్ట్ నుంచి మినహాయింపు లభిస్తుంది.