Skip to main content

పీహెచ్‌డీ...`కాపీ-పేస్ట్` చేస్తే కఠిన చర్యలు...!

దేశంలో పరిశోధన ఔత్సాహిక అభ్యర్థులు..ఇకపై చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి!రీసెర్చ్ పరంగా ముందుకు సాగుతున్న స్కాలర్స్..థీసిస్ పరంగా సొంతంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత! కాపీ పేస్ట్ విధానాన్ని అవలంబిస్తే అనర్హత వేటుకు గురయ్యే ప్రమాదం! కారణం.. పీహెచ్‌డీ స్కాలర్స్ సమర్పించే థీసిస్, ఇతర అంశాల పరంగా..
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్తగా ప్రతిపాదించిన నిబంధనలే! యూజీసీ (ఉన్నతవిద్యా సంస్థల్లో విద్యాసమగ్రత, గ్రంథ చౌర్య నిబంధనలు)-2017పై విశ్లేషణ..
  • దేశంలో పీహెచ్‌డీ పరిశోధనల పరంగా ప్రమాణాలు పెంచాలని.. అవకతవకలకు అడ్డుకట్ట వేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. ఈ క్రమంలో.. యూజీసీ (ఉన్నతవిద్యా సంస్థల్లో విద్యాసమగ్రత, గ్రంథ చౌర్య నిబంధనలు)-2017 పేరుతో నిబంధనలను ప్రతిపాదించింది.
  • యూజీసీ ప్రతిపాదిత నిబంధనల ప్రధాన ఉద్దేశం.. ఉన్నత విద్యా సంస్థల్లో పరిశోధనల ప్రాధాన్యం పెంచడం! యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలు.. విద్యార్థుల్లో పీహెచ్‌డీ ఆవశ్యకత, అవకాశాలపై అవగాహన పెంపొందించేలా తమ క్యాంపస్‌ల పరిధిలో చర్యలు తీసుకోవాలి. అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు యాజమాన్యాలు చర్యలు చేపట్టాలి.

కఠిన నిబంధనలు :
కోర్ నుంచి నాన్‌కోర్ అంశాల వరకు రీసెర్చ్ స్కాలర్స్ సొంతగా పరిశోధనలు సాగించేలా యూజీసీ తాజా ప్రతిపాదనలు రూపొందించింది. అప్పటికే సదరు విభాగంలోని రీసెర్చ్ పబ్లికేషన్స్ నుంచి సమాచారాన్ని తీసుకోవడాన్ని నిరోధించేలా నిబంధలను రూపొందించింది. వీటిని అతిక్రమించిన వారిపై అనర్హత వేటు వేసేందుకు ఆస్కారముంది. సదరు పరిశోధన అంశానికి సంబంధించిన నమూనా, సారాంశం, స్వీయ విశ్లేషణ, పరిశీలన, ఫలితాలు, ముగింపు, సిఫార్సులను కోర్ వర్క్‌గా పేర్కొంది. పరిశోధనల పరంగా సమ్మిళతంగా ఉండే ఇతర అంశాలను నాన్ కోర్ ఏరియాస్‌గా నిర్దేశించింది.

మూడు స్థాయిల్లో నిబంధనలు :
రీసెర్చ్ పరంగా అభ్యర్థులు.. తాము ఎంపిక చేసుకున్న అంశానికి సంబంధించి అప్పటికే ఎవరైనా చేసిన పరిశోధన పత్రాలలోని సమాచారాన్ని పొందుపరిస్తే.. దానికి సంబంధించి మూడు స్థాయిలను నిర్దేశించి.. వాటికి అనుగుణంగా అనర్హత విధానాలు రూపొందించింది. వీటి ప్రకారం..
  • అభ్యర్థి అందించిన పరిశోధన పత్రంలోని సమాచారం ఇతరులు చేసిన పరిశోధన పత్రాలలోని సమాచారంతో పది శాతంలోపు పోలిక ఉంటే ఎలాంటి అనర్హత ఉండదు.
  • లెవెల్-1: 10 నుంచి 40 శాతం వరకు గత పరిశోధనల నుంచి చూసి రాసినట్లు తేలితే.. సదరు అభ్యర్థికి ఎలాంటి క్రెడిట్స్ లభించవు. ఆరు నెలలలోపు తిరిగి తాను సరికొత్తగా రూపొందించిన థీసిస్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
  • లెవెల్-2: అభ్యర్థులు అందించిన పరిశోధన పత్రాల్లోని సమాచారం.. అంతకుముందు పరిశోధన పత్రాల సమాచారానికి 40 శాతం నుంచి 60 శాతం పోలి ఉంటే.. అవి చెల్లుబాటు కావు. అభ్యర్థులు ఏడాది తర్వాత తిరిగి రివైజ్డ్ థీసిస్‌ను అందించాల్సి ఉంటుంది.
  • లెవెల్-3: గత పరిశోధన పత్రాలతో పోల్చినప్పుడు 60 శాతం కంటే ఎక్కువగా సమాచారాన్ని చూసి రాసినట్లు తేలితే సదరు పీహెచ్‌డీ ఎన్‌రోల్‌మెంట్ రద్దు చేస్తారు.

ఫ్యాకల్టీపైనా కఠిన చర్యలు...
యూజీసీ ప్రతిపాదిత నిబంధనల్లో మరో ముఖ్యమైన అంశం..
ఒక యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్యాకల్టీగా వ్యవహరిస్తూ.. రీసెర్చ్ చేస్తున్న అధ్యాపకులపైనా సమాచార చౌర్యం విషయంలో కఠిన నిబంధనలు ప్రతిపాదించడం. వీరికి సంబంధించి మూడు స్థాయిల్లో యూజీసీ కొత్త నిబంధనలు ప్రతిపాదించింది. అవి..
  1. ఒక రీసెర్చ్ ఫ్యాకల్టీ అందించిన థీసిస్.. అదే అంశానికి సంబంధించి గతంలో జరిగిన పరిశోధనల సమాచారంతో 10 శాతం నుంచి 40 శాతం మధ్య పోలిక ఉంటే.. ఆ థీసిస్‌ను వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏడాదిపాటు రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేసే అవకాశం ఉండదు.
  2. సమాచారంలో పోలిక 40 శాతం నుంచి 60 శాతం మధ్యలో ఉంటే థీసిస్‌ను వెనక్కి తీసుకోవడమే కాకుండా... రెండేళ్ల పాటు రీసెర్చ్ పబ్లికేషన్ నుంచి నిషేధం విధిస్తారు. అంతేకాకుండా సదరు ఫ్యాకల్టీ వేతనంలో ఒక వార్షిక ఇంక్రిమెంట్‌లో కోత విధించే అధికారం కూడా సంబంధిత వర్గాలకు ఉంటుంది. దీనికితోడు సదరు ఫ్యాకల్టీ రెండేళ్ల పాటు విద్యార్థులకు సూపర్‌వైజర్‌గా వ్యవహరించే అవకాశం కోల్పోతారు.
  3. ఫ్యాకల్టీ రీసెర్చ్ పబ్లికేషన్.. అదే అంశానికి సంబంధించిన ఇతర పబ్లికేషన్స్ సమాచారం మధ్య 60 శాతానికి పైగా పోలిక ఉంటే మూడేళ్లపాటు పేపర్స్ పబ్లికేషన్స్ నుంచి నిషేధంతోపాటు, రెండు వార్షిక ఇంక్రిమెంట్లలో కోత, మూడేళ్ల పాటు సూపర్‌వైజర్‌గా వ్యవహరించే అవకాశం కోల్పోతారు.

రెండు కమిటీల పర్యవేక్షణ :
యూనివర్సిటీల స్థాయిలో రీసెర్చ్ పరంగా కాపీ-పేస్ట్ విధానానికి అడ్డుకట్టవేసేలా పకడ్బందీగా యూనివర్సిటీలు పలు చర్యలు చేపట్టాలని యూజీసీ పేర్కొంది. అందుకోసం ప్రధానంగా రెండు కమిటీలు ప్లేజియారిజమ్ డిసిప్లినరీ అథారిటీ (పీడీఏ), అకడమిక్ మిస్-కండక్ట్ ప్యానెల్ (ఏఎంపీ)లను నియమించాలి. వీటి సిఫారసుల ఆధారంగా చర్యలు ఉంటాయి.

సాఫ్ట్‌వేర్ టూల్స్ అందుబాటు :
సమాచారంలో పోలికను గుర్తించే విషయంలో సంబంధిత యూనివర్సిటీలు సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను రూపొందించుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా రీసెర్చ్ స్కాలర్స్ కూడా ముందు జాగ్రత్త పడేలా ప్లేజియారిజమ్ డిటెక్షన్ టూల్స్‌ను వారికి అందుబాటులో ఉంచాలి.

భిన్నాభిప్రాయాలు...
ప్రతిపాదిత నిబంధనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యూనివర్సిటీలకు చెకింగ్ టూల్స్, నిర్దిష్ట సాఫ్ట్‌వేర్స్ అందుబాటులో లేవని.. అలాంటప్పుడు ఒక థీసిస్‌ను ఆ అంశానికి సంబంధించి ఇతర థీసిస్‌లతో పోల్చడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారమన్నది కొందరి వాదన. అలాగే ద్వితీయ శ్రేణి యూనివర్సిటీల్లో ఇప్పటికే థీసిస్‌ను హార్డ్‌కాపీ రూపంలో అందించే పరిస్థితి కొనసాగుతోంది. ప్రతి పేపర్‌నూ సాఫ్ట్‌కాపీగా అకడమిక్ రీపాజిటరీలో పొందుపర్చడం సాధ్యంకాదన్నది మరికొందరి అభిప్రాయం. యూనివర్సిటీల స్థాయిలో చెకింగ్ టూల్స్, సాఫ్ట్‌వేర్ సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల నాలుగైదేళ్లు కష్టపడి రీసెర్చ్ చేసి థీసిస్ సబ్మిషన్ పరంగా పోలికలు ఉన్నాయనే కారణంతో అనర్హతకు గురైతే తమ భవిష్యత్తు ఏంటనే ఆందోళన విద్యార్థుల్లో నెలకొంటుందని.. దాంతో విద్యార్థులు పీహెచ్‌డీపై దృష్టిసారించేందుకు జంకుతారనే అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది.

వాస్తవ ఆసక్తిని పెంచేలా..
యూజీసీ తాజాగా ప్రతిపాదించిన నిబంధనలను పరిశీలిస్తే.. పీహెచ్‌డీ ఔత్సాహిక అభ్యర్థుల్లో వాస్తవ ఆసక్తిని పెంచడం ప్రధాన ఉద్దేశంగా చెప్పొచ్చు. ఈ నిబంధనల వల్ల స్కాలర్స్ పూర్తిస్థాయిలో రీసెర్చ్‌పై దృష్టిసారించేందుకు అవకాశం ఉంటుంది. కొన్ని యూనివర్సిటీల్లో ఈ నిబంధనలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది.
- ప్రొఫెసర్ వి.ఉమామహేశ్వరరావు, రిజిస్ట్రార్, ఏయూ.
Published date : 02 Dec 2017 04:23PM

Photo Stories