Skip to main content

‘పది’లమైన జీపీఏకు సులువైన మార్గాలు...!

రెండు తెలుగు రాష్ట్రాల్లో.. పదో తరగతి పబ్లిక్ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదలైంది. తెలంగాణలో మార్చి 16 నుంచి.. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 18 నుంచి పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి. దాంతో విద్యార్థులు తమ ప్రిపరేషన్‌కు పదును పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది! ముఖ్యంగా మెరుగైన గ్రేడ్ పాయింట్ల సాధనకు సాధ్యమైనంత ముందుగానే ప్రిపరేషన్ ప్రారంభించాలి. పదో తరగతిలో మంచి గ్రేడ్ వస్తే.. ఉజ్వల భవిష్యత్‌కు మార్గం సుగమం అవుతుంది. ఈ నేపథ్యంలో పదో తరగతిలో పదికి పది గ్రేడ్ పాయింట్లు సాధించేందుకు సబ్జెక్ట్ నిపుణుల ప్రిపరేషన్ గెడైన్స్...
పదో తరగతి విద్యార్థులు 10/10 గ్రేడ్ సాధించాలని కష్టపడి చదువుతున్నారు. పరీక్షల సమయం సమీపిస్తున్నకొద్దీ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సైతం వారిని ప్రోత్సహిస్తుంటారు. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో పదికి పది గ్రేడ్‌లు సాధిస్తున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు కష్టపడి చదివి పదికి పది గ్రేడ్ పాయింట్లు సొంతం చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటినుంచి అందుబాటులో ఉన్న ఈ మూడు నెలల సమయంలో పటిష్ట ప్రణాళికతో ఏరోజు పాఠ్యాంశాలు ఆరోజు శ్రద్ధగా చదివితే పదికి పది గ్రేడ్ పాయింట్లు పొందొచ్చని ఆయా సబ్జెక్ట్ నిపుణులు సూచిస్తున్నారు. పదోతరగతిలో పొందిన మార్కులు(గ్రేడ్ పాయింట్లు) భవిష్యత్‌లో ఉన్నత విద్య పరంగా, ఉపాధి అవకాశాల రీత్యా ఎంతగానో ఉపయోగపడతాయని.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలని చెబుతున్నారు.

తెలుగు :
తెలుగు.. మన మాతృభాష. అందుకే విద్యార్థులు దీన్ని తేలిగ్గా తీసుకుంటుంటారు. ఇందులో ఫెయిల్ అయ్యే విద్యార్థుల సంఖ్య తక్కువే. కానీ.. తెలుగులో మంచి మార్కులు సాధించాలంటే మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిందే! అందుకోసం పద్యభాగం, గద్యభాగంలోని అన్ని అంశాలను ఔపోసన పట్టాలి. పరీక్ష రోజు వరకూ వాటిని నిత్యం పునశ్చరణ చేసుకోవాలి. పాఠాన్ని కేవలం చదవడంతో సరిపెట్టకుండా..సారాంశాన్ని, ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ప్యాసేజ్ పేరిట ఉండే అపరిచిత గద్యం ఎంతో ముఖ్యమైనది. కాబట్టి సొంతంగా ఆలోచిస్తూ చదవాలి. ఉప వాచకానికి సంబంధించి ఇతివృత్తం, ప్రాముఖ్యత, పాత్రలు, వాటి ప్రాధాన్యత, వ్యక్తుల ప్రవర్తన శైలి తదితర అంశాల ద్వారా ఇచ్చే సందేశాన్ని తెలుసుకోవాలి. తెలుగు సబ్జెక్ట్‌లో వ్యాకరణం కూడా ముఖ్యమే. సంధులు, సమాసాలు, సంయుక్తార్థాలు, ఉత్పత్యార్థాలు, జాతీయాలు బాగా చదవాలి.

ఇంగ్లిష్ :
  • ఇంగ్లిష్.. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కొంత ఆందోళన చెందే సబ్జెక్ట్. కొద్దిగా కష్టపడితే.. ఇందులోనూ మంచి మార్కులు సాధించొచ్చు. ఇందుకోసం చేయాల్సిందల్లా.. ముందుగా ఇంగ్లిష్ పదజాలంపై అవగాహన పొందాలి. పాత ప్రశ్నపత్రాల సమాధానాలను పరిశీలించడం కూడా మేలు చేస్తుంది. పరీక్ష పరంగా విద్యార్థులు పేపర్-1, పేపర్-2 రెండింటిలోనూ.. రెండు విభాగాల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతిపాఠం చివర్లో ఉండే కాంప్రెహెన్సివ్ ప్రశ్నలపై దృష్టిసారించాలి.
  • ప్రతి పాఠానికి సంబంధించి సారాంశాన్ని గ్రహించి సొంతగా రాయడం అలవాటు చేసుకోవాలి. పొయెట్రీ ప్రశ్నల్లో మంచి మార్కులకు సదరు పద్యంలో ముఖ్య పదాలు, యాంటానిమ్స్, సినానిమ్స్‌పై దృష్టిసారించాలి.
  • పార్ట్స్ ఆఫ్ స్పీచ్, డెరైక్ట్, ఇన్‌డెరైక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, ఫ్రేజల్ వెర్బ్స్‌ను చదవడంతోపాటు ప్రాక్టీస్ కూడా చేస్తే మెరుగైన మార్కులు పొందొచ్చు.
  • పేపర్-2 విషయంలో రీడింగ్ కాంప్రెహెన్షన్ పెరిగే విధంగా ప్రిపరేషన్ సాగించాలి. UnKnown ప్యాసేజ్ కింద ఇచ్చే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే.. ఆ ప్యాసేజ్ సారాంశాన్ని గుర్తించే విధంగా చదవాలి. లెటర్ రైటింగ్‌కు సంబంధించి పంక్చుయేషన్స్, బాడీ ఆఫ్ ది లెటర్ వంటి అంశాలపై పట్టుసాధించాలి.

మ్యాథమెటిక్స్:
  • పదోతరగతి విద్యార్థులు కొంతమంది గణితం కష్టమైన సబ్జెక్టని భావిస్తుంటారు. కానీ, గణితంపై ఆసక్తి పెంచుకొని పట్టుసాధిస్తే.. పూర్తిస్థాయిలో మార్కులు సాధించేందుకు వీలుంటుంది.
  • గణితంలో పేపర్-1 నుంచి ఏడు చాప్టర్లు, పేపర్-2 నుంచి ఏడు చాప్టర్లలో ప్రతి చాప్టర్‌ను సమగ్రంగా అధ్యయనం చేయాలి. ఆయా చాప్టర్లకు సంబంధించిన సమస్యలను ప్రాక్టీస్ చేయాలి. సంఖ్యా వ్యవస్థ; బీజగణితం; నిరూపక రేఖాగణితం; రేఖా గణితం; క్షేత్రమితి; త్రికోణమితి; సంభావ్యత, సాంఖ్యకశాస్త్రంపై పట్టు సాధించడం ఎంతో మేలు చేస్తుంది.
  • విద్యార్థులు ప్రిపరేషన్ సమయంలోనే సమస్య సాధనతోపాటు కారణాల నిరూపణ, వ్యక్తీకరణ, ఒక సమస్యను ఇతర అంశాలతో అనుసంధానం చేయడం వంటి నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి.
  • ముఖ్య నిర్వచనాలు, సూత్రాలను నోట్స్ రూపంలో రాసుకుంటే రివిజన్‌కు ఉపయోగపడుతుంది. పాఠ్యపుస్తకంలో ప్రతి చాప్టర్ చివర ఇచ్చే సమస్యలను తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి.
  • గ్రాఫ్‌లు, నిర్మాణాత్మక సమస్యలకు సమాధానాలు కనుగొనేందుకు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి.
  • వాస్తవ సంఖ్యలు; సమితులు; బహుపదులు; రెండు చరరాశులలోని రేఖీయ సమీకరణాల జత అధ్యాయాల్లోని గ్రాఫ్ ఆధారిత సమస్యలు; సంభావ్యత; సాంఖ్యక శాస్త్రం; త్రికోణమితి; క్షేత్రమితిలోని ముఖ్య సమస్యలను సాధన చేస్తే తేలిగ్గానే 60 శాతం మార్కులు సొంతం చేసుకోవచ్చు.

ఫిజికల్ సైన్స్:
  • సామాన్యశాస్త్రం పేపర్-1(ఫిజికల్ సైన్స్)లో మంచి మార్కులు సాధించాలంటే.. అనువర్తిత ఆధారిత ప్రిపరేషన్ సాగించాలి. ఫిజిక్స్ నుంచి ఏడు, కెమిస్ట్రీ నుంచి ఏడు మొత్తం 14 చాప్టర్లు చదవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన అంశాలను నిజజీవిత సంఘటనలతో అన్వయించుకుంటూ ప్రిపరేషన్ సాగించడం ద్వారా ఎక్కువకాలం గుర్తుండిపోతుంది. ఈ విధానం ద్వారా విషయ పరిజ్ఞానం మరింతగా పెంపొందించుకోవచ్చు.
  • ప్రశ్నించడం-పరికల్పన చేయడం; ప్రయోగాలు-క్షేత్ర పర్యటనలు; సమాచార నైపుణ్యాలు- ప్రాజెక్ట్ పనులు; పటాలు-వాటి ద్వారా భావ ప్రసారం వంటి వాటిపైనా దృష్టిపెట్టాలి.
  • కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, విద్యుత్ ప్రవాహం, రసాయన బంధం, పరమాణు నిర్మాణం, కార్బన్ సమ్మేళనాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.
  • మూలకాల ధర్మాలు-వర్గీకరణ, రసాయన సమీకరణాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయడం వల్ల లఘు, అతి స్వల్ప, బహుళైచ్ఛిక ప్రశ్నలకు సులువుగా సమాధానాలివ్వొచ్చు.

జీవశాస్త్రం:
  • సామాన్య శాస్త్రంలో రెండో పేపర్.. జీవశాస్త్రం. ఇందులో మంచి మార్కులు పొందేందుకు అవగాహన, సొంత విశ్లేషణ నైపుణ్యాలు ముఖ్యం. ఇందుకోసం ఫ్లో చార్ట్‌లు, బ్లాక్ డయాగ్రమ్స్‌లను సొంతంగా రూపొందించుకోవాలి.
  • విశ్లేషణాత్మక, తులనాత్మక అధ్యయనానికి ప్రాధాన్యమివ్వాలి. ఒక అంశాన్ని నేర్చుకున్న తర్వాత దాన్ని వాస్తవ పరిస్థితులతో అన్వయించే నేర్పు సొంతం చేసుకోవాలి.
  • ప్రయోగాలకు సంబంధించి ప్రయోగం ఫలితంతోపాటు.. ప్రయోగ నిర్వహణ ప్రక్రియపై అవగాహన పొందడం ఎంతో మేలు చేస్తుంది. ఆయా అంశాలపై చాప్టర్‌లో పేర్కొన్న అభ్యాసాలకు సంబంధించి విశ్లేషణ, కారణాలు, పోలికలు, భేదాలు తెలుసుకుంటూ చదవాలి.
  • డయాగ్రమ్స్‌లో భాగాలను గుర్తించడమే కాకుండా.. వాటి ప్రాముఖ్యతను వివరించగలిగేలా ప్రాక్టీస్ చేయాలి.

సోషల్ స్టడీస్:
  • సీసీఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత సోషల్ స్టడీస్‌లో అడిగే ప్రశ్నల తీరులో మార్పు వచ్చింది. కాబట్టి విద్యార్థులు అందుకు అనుగుణంగా ప్రిపరేషన్ తీరు మార్చుకోవాలి.
  • సమకాలీన అంశాల విషయంలో ప్రతిస్పందన, ప్రశ్నించడం, ప్రశంస/అభినందనలపై సాధన చేయడం ఎంతో అవసరం. అవగాహనకు సంబంధించి ఒక నిర్దిష్ట అంశాన్ని చదివి, సొంత పరిజ్ఞానంతో రాసేలా నైపుణ్యం పెంచుకోవాలి.
  • జాగ్రఫీ, ఎకనామిక్స్‌లో.. భారతదేశం-భౌగోళిక స్వరూపం, శీతోష్ణస్థితి, భారతదేశ నీటి వనరులు, వలసలు, ఆహార భద్రత, ఉత్పత్తి-ఆదాయం తదితర పాఠ్యాంశాలకు ప్రాధాన్యమివ్వాలి.
  • హిస్టరీలో రెండు ప్రపంచ యుద్ధ కాలాల సమయంలో ప్రపంచం; సమకాలీన సామాజిక ఉద్యమాలపై దృష్టిపెట్టాలి. భారత జాతీయోద్యమ చరిత్రను ప్రత్యేకంగా చదవాలి.
  • సివిక్స్‌కు సంబంధించి రాజ్యాంగం మూల సూత్రాలు, రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలను ఏఏ దేశాల రాజ్యాంగల నుంచి అనుసరించారు అనే కోణాల్లో చదవాలి.
  • డయాగ్రమ్/రేఖాచిత్ర, పేరాగ్రాఫ్ ఆధారిత ప్రశ్నలను కూడా ప్రాక్టీస్ చేయాలి.

పిపరేషన్ టిప్స్...
  • సీసీఈ విధానంలో పరీక్షలు జరగనున్నందున అవగాహన, ప్రతిస్పందన, స్వీయ విశ్లేషణ నైపుణ్యాలు పెంచుకోవాలి.
  • ఇప్పటి నుంచే ప్రాక్టీస్ ఆధారిత ప్రిపరేషన్‌కు ప్రాధాన్యమివ్వాలి.
  • అనువర్తిత నైపుణ్యం పెంపొందించుకునేలా చదవాలి.
  • మ్యాథమెటిక్స్, సైన్స్‌ల్లో బేసిక్ కాన్సెప్ట్స్, థీరమ్స్‌ను అధ్యయనం చేయాలి.
  • ప్రతి అంశాన్ని సొంతంగా విశ్లేషించే నైపుణ్యం సొంతమయ్యేలా ప్రాక్టీస్ చేయాలి.
  • ప్రతి అంశంపై స్పష్టమైన అభిప్రాయం ఏర్పరచుకోవాలి. ఫలితంగా ప్రశంస/విమర్శలకు సంబంధించి ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు సులువుగా రాయొచ్చు.
  • డిసెంబర్ మూడో వారం నుంచే అధిక సమయం పునశ్చరణకు కేటాయించాలి. దీనికి అనుగుణంగా టైమ్‌టేబుల్ రూపొందించుకోవాలి.
  • జనవరి చివరి నాటికి ప్రిపరేషన్, రివిజన్‌ను పూర్తిచేసుకోవాలి.
  • ఫిబ్రవరి నుంచి మార్చి మొదటి వారం వరకు ప్రీ-ఫైనల్స్‌కు హాజరవ్వాలి.
  • తొలి పరీక్షకు వారం ముందు నుంచి పూర్తిగా ఆ పరీక్షకే సమయం కేటాయించాలి.

ఏపీపదో తరగతి పరీక్షలషెడ్యూల్ :

తేదీ

సబ్జెక్ట్

18-03-2019

ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1

19-03-2019

ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2

20-03-2019

సెకండ్ లాంగ్వేజ్

22-03-2019

ఇంగ్లిష్ పేపర్-1

23-03-2019

ఇంగ్లిష్ పేపర్-2

25-03-2019

మ్యాథమెటిక్స్ పేపర్-1

26-03-2019

మ్యాథమెటిక్స్ పేపర్-2

27-03-2019

జనరల్ సైన్స్ పేపర్-1

28-03-2019

జనరల్ సైన్స్ పేపర్-2

29-03-2019

సోషల్ స్టడీస్ పేపర్-1

30-03-2019

సోషల్ స్టడీస్ పేపర్-2


తెలంగాణ పదో తరగతి పరీక్షలషెడ్యూల్ :

తేదీ

సబ్జెక్ట్

16-03-2019

ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1

18-03-2019

ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2

19-03-2019

సెకండ్ లాంగ్వేజ్

20-03-2019

ఇంగ్లిష్ పేపర్-1

22-03-2019

ఇంగ్లిష్ పేపర్-2

23-03-2019

మ్యాథమెటిక్స్ పేపర్-1

25-03-2019

మ్యాథమెటిక్స్ పేపర్-2

26-03-2019

జనరల్ సైన్స్ పేపర్-1

27-03-2019

జనరల్ సైన్స్ పేపర్-2

28-03-2019

సోషల్ స్టడీస్ పేపర్-1

29-03-2019

సోషల్ స్టడీస్ పేపర్-2

Published date : 19 Dec 2018 04:32PM

Photo Stories