Skip to main content

న్యాయవిద్యకు దారులెన్నో...!

మన దేశంలో న్యాయ నిపుణులకు అవకాశాలు పుష్కలం. ఇటీవల కాలంలో ‘లా’ కోర్సులు పూర్తిచేసిన వారికి జాబ్ మార్కెట్‌లో డిమాండ్ మరింతగా పెరుగుతోంది. ఇందుకు దేశంలో న్యాయ వివాదాలు పెరుగుతుండటం ప్రధాన కారణం. అంతేకాకుండా ప్రపంచీకరణ ప్రభావంతో కార్పొరేట్ రంగంలోనూ న్యాయ నిపుణుల అవసరం ఏర్పడుతోంది.
సొంతంగా ప్రాక్టీసింగ్ న్యాయవాదిగా ఎదిగే అవకాశం సైతం ఉండటంతో లా ప్రస్తుతం క్రేజీ కోర్సుగా మారింది. అందుకే ఇంజనీరింగ్, మెడికల్‌కు తీసిపోని విధంగా లా కోర్సులపై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఏటా లా ఎంట్రెన్స్ టెస్టులకు దరఖాస్తుల సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. క్రేజీ కోర్సుగా మారిన ‘లా’లో చేరడానికి ఉన్న మార్గాలు తెలుసుకుందాం...

న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించాలంటే.. సంబంధిత లా కోర్సులు చదవాలి. లాలో బ్యాచిలర్ స్థాయి నుంచి కోర్సులు ప్రారంభమవుతాయి. బ్యాచిలర్ స్థాయిలో అర్హతలను బట్టి రెండు రకాల కోర్సులు ఉన్నాయి. అవి.. ఇంటర్మీడియట్ అర్హతతో ఐదేళ్ల వ్యవధి గల ఎల్‌ఎల్‌బీ/బీఎల్ కోర్సు. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేశాక మూడేళ్ల వ్యవధి ఉండే ఎల్‌ఎల్‌బీ/బీఎల్ కోర్సు. ఎల్‌ఎల్‌బీ తర్వాత ఆసక్తి ఉంటే పోస్ట్‌గ్రాడ్యుయేషన్(ఎల్‌ఎల్‌ఎం) కూడా చేయవచ్చు. ఇందుకు సంబంధించి పలు రకాల స్పెషలైజేషన్లు.. సివిల్/క్రిమినల్ లా, కాన్‌స్టిట్యూషన్ లా, అడ్మినిస్ట్రేటివ్ లా, హ్యూమన్ రైట్స్ లా, ఫ్యామిలీ లా, ట్యాక్సేషన్, కార్పొరేట్ లా, బిజినెస్ లా, ఇంటర్నేషనల్ లా, లేబర్ లా, రియల్ ఎస్టేట్ లా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా/పేటెంట్ లా వంటివి అందుబాటులో ఉన్నాయి. లాలో పీజీ తర్వాత దేశ విదేశాల్లో పీహెచ్‌డీ చేసేందుకు కూడా అవకాశముంది.

ప్రవేశ పరీక్షలు..
దేశంలోని ప్రముఖ లా స్కూల్స్‌తోపాటు యూనివర్సిటీలు సైతం లా కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశం పొందాలంటే ఆయా లా స్కూల్స్/యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షలకు హాజరు కావాలి. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన లా ఎంట్రెన్స్ టెస్టులు... క్లాట్, లాసెట్, ఏఐఎల్‌ఈటీ, ఎల్‌శాట్...

అవకాశాలెన్నో...
  • గతంలో లా కోర్సులు పూర్తిచేస్తే... కోర్టుల్లో న్యాయవాద వృత్తి మాత్రమే కనిపించేది. ప్రస్తుతం ప్రపంచీకరణ నేపథ్యంలో లా గ్రాడ్యుయేట్లు కార్పొరేట్ కొలువులు సైతం అందుకునే అవకాశం లభిస్తోంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్, బ్యాంకులు, సాఫ్ట్‌వేర్ సంస్థల్లో.. లీగల్ అడ్వైజర్, డ్రాఫ్ట్ రైటర్‌గా అవకాశాలు లభిస్తున్నాయి.
  • న్యాయ విద్యార్థులు లాఫర్మ్స్‌లో ఆకర్షణీయమైన కెరీర్‌ను అందుకోవచ్చు. అమర్‌చంద్, మంగల్‌దాస్, ఏజెడ్‌బీ అండ్ పార్ట్నర్స్, జే సాగర్ అసోసియేట్స్, లుత్రా అండ్ లుత్రా, ఖైతన్ అండ్ కో వంటి టాప్ లా ఫర్మ్స్ చక్కటి వేతనంతో లా గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నాయి.
  • లా ఫర్మ్స్‌లో నిపుణులంతా ఒకచోట కలిసి వేర్వేరు కస్టమర్లకు న్యాయ సేవలను అందిస్తారు. వీటివల్ల ఆయా సంస్థల్లో పనిచేసే వారికి విభిన్నమైన కేసులపై పనిచేసే అవకాశం లభిస్తుంది. దీనివల్ల సబ్జెక్టు నాలెడ్జ్‌తోపాటు, అవకాశాలు కూడా పెరుగుతాయి.
  • ఇటీవల కాలంలో పేటెంట్ హక్కుల పర్యవేక్షణ సంస్థలు, కాపీరైట్ సంస్థలు, పబ్లిషింగ్ సంస్థలు, ఎన్‌జీఓలు కూడా లా గ్రాడ్యుయేట్లకు పెద్దపీట వేస్తున్నాయి. తమ కార్యకలాపాల చట్టపరమైన అంశాల పర్యవేక్షణకు వీరిని నియమించుకుంటున్నాయి.
  • లా గ్రాడ్యుయేట్లు పీజీ, పీహెచ్‌డీ కోర్సులు పూర్తిచేయడం ద్వారా అధ్యాపక వృత్తిలో చేరొచ్చు.
  • లా అభ్యర్థులకు ప్రభుత్వ రంగంలోనూ అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు. పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఏపీపీఓ, మేజిస్ట్రేట్స్, సబ్-మేజిస్ట్రేట్స్, జూనియర్ జడ్జి స్థాయిల్లో ఎంట్రీ లెవల్ అవకాశాలు లభిస్తాయి. పరిపాలన ట్రిబ్యునల్స్, లేబర్ కోర్టులు, అప్పిలేట్ అథారిటీల్లోనూ పలు హోదాల్లో అడుగుపెట్టొచ్చు. ఇందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షల్లో విజయం సాధించాలి. ఇలా ప్రభుత్వ సర్వీసులో అడుగుపెట్టిన వారు ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు.

ఏఐఎల్‌ఈటీ:
నేషనల్ లా యూనివర్సిటీ-న్యూఢిల్లీలో యూజీ, పీజీ కోర్సుల్లో చేరేందుకు ఏఐఎల్‌ఈటీ (ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్) వీలు కల్పిస్తుంది. ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఐదేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు-బీఏ ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్)లో ప్రవేశం పొందొచ్చు.
అర్హత:
50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్/తత్సమానం. ఏఐఎల్‌ఈటీకి దరఖాస్తు చేసేందుకు ఎలాంటి గరిష్ట వయోపరిమితిలేదు.
పరీక్షా విధానం:
ఏఐఎల్‌ఈటీ పరీక్ష మొత్తం ఐదు విభాగాల్లో ఆబ్జెక్టివ్ తరహాలో జరుగుతుంది. మొత్తం 150 ప్రశ్నలు.. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 150 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఇంగ్లిష్ 35 ప్రశ్నలు; జనరల్ నాలెడ్‌‌జ/కరెంట్ అఫైర్స్ 35 ప్రశ్నలు; బేసిక్ మ్యాథమెటిక్స్ 10 ప్రశ్నలు; లీగల్ ఆప్టిట్యూడ్ 35 ప్రశ్నలు; లాజికల్ రీజనింగ్ 35 ప్రశ్నలు. వీటికి 90 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది.
నోటిఫికేషన్ విడుదల: 2019 జనవరి మొదటి వారంలో విడుదలయ్యే అవకాశముంది.
పరీక్ష తేది: 2019, మే 5 పరీక్ష జరుగుతుంది.
వెబ్‌సైట్: https://nludelhi.ac.in

క్లాట్:
కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్) ర్యాంక్‌తో దేశవ్యాప్తంగా ఉన్న 20 ప్రతిష్టాత్మక నేషనల్ లా యూనివర్సిటీల్లో యూజీ, పీజీ కోర్సుల్లో చేరవచ్చు. వీటిలో హైదరాబాద్‌లోని నల్సార్, విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ఉన్నాయి. అలానే సుమారు 25 ప్రైవేటు న్యాయ కళాశాలల్లోనూ చేరే అవకాశం క్లాట్ ద్వారా లభిస్తుంది.
క్లాట్ 2019 :
2019-2020 సంవత్సరానికి క్లాట్ 2019ను నేషనల్ లా యూనివర్సిటీ ఒడిషా, కటక్ నిర్వహించనుంది. క్లాట్ 2019, మే 12న దేశవ్యాప్తంగా జరగనుంది. క్లాట్ పరీక్ష ఏటా ఒకసారి మాత్రమే జాతీయ స్థాయిలో జరుగుతుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది.
కోర్సులు..
బీఏ ఎల్‌ఎల్‌బీ/బీబీఏ ఎల్‌ఎల్‌బీ/బీకామ్ ఎల్‌ఎల్‌బీ/బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ.
అర్హత:
ఇంటర్మీడియట్/10+2 ఉత్తీర్ణత. జనరల్ కేటగిరీ అభ్యర్థులు అర్హత కోర్సులో కనీసం 45 శాతం మార్కులు పొందాలి. ఎస్టీ/ఎస్సీ అభ్యర్థులు 40శాతం సాధిస్తే సరిపోతుంది. అలాగే క్లాట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధనలేదు.
పరీక్ష విధానం :
క్లాట్ పరీక్ష ఆఫ్‌లైన్ విధానంలో మొత్తం 200 మార్కులకు జరుగుతుంది. ఐదు విభాగాల్లో క్లాట్‌ను నిర్వహిస్తారు. అవి.. ఇంగ్లిష్ (కాంప్రెహెన్షన్‌తో కలిపి-40 మార్కులు), జనరల్ నాలెడ్‌‌జ/కరెంట్ అఫైర్స్(50మార్కులు), ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్(20 మార్కులు), లీగల్ ఆప్టిట్యూడ్(50 మార్కులు), లాజికల్ రీజనింగ్ (40 మార్కులు). వీటికి 2 గంటల్లో సమాధానాలను గుర్తించాలి. నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది. తప్పు సమాధానం గుర్తిస్తే 0.25 మార్కుల కోత పడుతుంది. జాతీయ స్థాయి న్యాయ కళాశాలల్లో చేరేందుకు పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందు నుంచే సన్నద్ధమవ్వాలి.
ముఖ్య తేదీలు :
దరఖాస్తుల స్వీకరణ:
2019 జనవరి 1 నుంచి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: 2019, మార్చి 31.
పరీక్ష తేది: 2019, మే 12న (సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు).
ఫలితాలు: 2019 మే చివరి వారంలో.
కౌన్సెలింగ్: 2019 జూన్ మొదటి వారంలో.

లాసెట్ :
తెలంగాణ, ఏపీల్లోని రాష్ట్ర స్థాయి న్యాయ కళాశాలల్లో చేరడానికి వీలుకల్పించే పరీక్ష.. లాసెట్ (లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్). లాసెట్‌లో ర్యాంకు ద్వారా మూడేళ్ల బీఎల్/ఎల్‌ఎల్‌బీ కోర్సు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ/బీఎల్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. అదేవిధంగా ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన అభ్యర్థులు.. లా పీజీ కోర్సు ఎల్‌ఎల్‌ఎంలో చేరేందుకు పీజీ లాసెట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
అర్హతలు..
  • ఐదేళ్ల లా కోర్సుకు 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (10+2 విధానంలో)(ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 40 శాతం మార్కులు సరిపోతాయి).
  • మూడేళ్ల లా కోర్సుకు ఏదైనా డిగ్రీని (10+2+3 విధానం) 45 శాతం మార్కులతో పూర్తిచేయాలి.
పరీక్ష విధానం :
గంటన్నర వ్యవధిలో జరిగే పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ఒక్కోదానికి ఒక్కో మార్కు. మూడు విభాగాలుండే ప్రశ్నపత్రంలో పార్ట్-ఎలో జనరల్ నాలెడ్‌‌జ, మెంటల్ ఎబిలిటీపై 30 ప్రశ్నలు, పార్ట్-బిలో కరెంట్ అఫైర్స్‌పై 30 ప్రశ్నలు, పార్ట్-సిలో ఆప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా పై 60 ప్రశ్నలు అడుగుతారు.
 ఐదేళ్ల లా కోర్సుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ప్రశ్న పత్రం ఇంటర్మీడియెట్ స్థాయిలో ఉంటుంది. అలాగే మూడేళ్ల లా కోర్సుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం డిగ్రీ స్థాయిలో ఉంటుంది.
నోటిఫికేషన్ ఎప్పుడు: తెలుగు రాష్ట్రాల్లో లాసెట్ నోటిఫికేషన్ సాధారణంగా మార్చిలో విడుదలవుతుంది. పరీక్ష మేలో జరుగుతుంది.

ఎల్‌శాట్:
లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ఇండియా (ఎల్‌శాట్) స్కోర్ ఆధారంగా దేశంలోని దాదాపు 76కు పైగా లా స్కూల్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులో అడ్మిషన్ పొందొచ్చు. లా స్కూల్ అడ్మిషన్ కౌన్సెల్ ఈ పరీక్షను నిర్వహిస్తుంది.
అర్హత:
ఇంటర్మీడియెట్ /10+2లో ఉత్తీర్ణత. మార్కుల శాతం పరంగా ఒక్కో లా స్కూల్లో ఒక్కోరకమైన నిబంధన ఉంది. ఎల్‌శాట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి గరిష్టవయోపరిమితి నిబంధన లేదు.
పరీక్షా విధానం :
నాలుగు విభాగాల్లో ఆబ్జెక్టివ్ విధానంలో ఎల్‌శాట్ పరీక్ష జరుగుతుంది. అనలిటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్-1, లాజికల్ రీజనింగ్-2, రీడింగ్ కాంప్రెహెన్షన్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సెక్షన్ నుంచి సుమారు 24 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్‌కు 35 నిమిషాల సమయం కేటాయిస్తారు. సమయం 2 గంటల 20 నిమిషాలు.
వెబ్‌సైట్: www.pearsonvueindia.com

కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి...
లా గ్రాడ్యుయేట్లకు గతంలో రెండే ఆప్షన్లు.. ప్రాక్టీస్, బోధన ఉండేవి. నేడు లా చదివిన అభ్యర్థులకు అవకాశాలు అనేకం. గ్లోబలైజేషన్ ప్రభావం వల్ల మన దేశంలో విదేశీ కంపెనీలు, విదేశీ బ్యాంకులు, కార్పొరేట్ లా ఫర్మ్స్ కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఆయా సంస్థలకు న్యాయ అంశాల్లో సలహాలు ఇచ్చేందుకు లా గ్రాడ్యుయేట్ల సేవలు తప్పనిసరి. విద్యార్థులకు సబ్జెక్టుపై పట్టు ఉండి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ప్లేస్‌మెంట్స్‌లోనే ఎంపిక అవుతున్నారు. కోర్టు ప్రొసీజర్స్, టెక్నిక్ ఆఫ్ డ్రాఫ్టింగ్‌లో నైపుణ్యం పొందాక స్థిరపడొచ్చు. అందుకు ఐదేళ్ల సమయం పడుతుంది. కార్పొరేట్ కంపెనీల్లో అవకాశం లభిస్తే ప్రారంభంలోనే నెలకు రూ.30,000 నుంచి రూ.40,000 వరకు అందుతుంది. అనుభవం, నైపుణ్యం ఆధారంగా నెలకు రూ.50 వేల నుంచి రూ.80 వరకు వేతనాలు పొందొచ్చు. లా కోర్సుల్లో చేరే గ్రామీణ ప్రాంత విద్యార్థులు సబ్జెక్టుతో పాటు ఇంగ్లిష్ భాష మీద పట్టు పొందేందుకు కృషి చేయాలి.
- ప్రొఫెసర్ శ్రీపతి ద్వారకానాథ్, హెచ్‌వోడీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ లా,
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా, ఓయూ.
Published date : 08 Dec 2018 04:43PM

Photo Stories