Skip to main content

మీ పిల్లల‌ను ఏ బోర్డు సిలబస్‌లో చేర్పిస్తే బెటర్..?

తెలుగు రాష్ట్రాల్లో ‌త్వరలో స్కూల్ అడ్మిషన్స్ సందడి మొదలవుతోంది. పిల్లలకు ప్రవేశాలు తల్లిదండ్రులకు పెద్ద పరీక్షగా మారుతున్నాయి. ఎందుకంటే... స్కూల్ చదువులు.. విద్యార్థుల ఉజ్వల భవితకు పునాది! ఇక్కడ నేర్చుకున్న పాఠాలే.. జీవితాంతం ముందుకు నడిపిస్తాయి. అందుకే బోర్డు, స్కూల్ ఎంపికలో తల్లిదండ్రులు ఆచితూచి అడుగేస్తున్నారు.
స్కూల్ చదువులకు అందుబాటులో ఉన్న బోర్డులు- స్టేట్ బోర్డ్, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐజీసీఎస్‌ఈ, ఐబీ!! ఏ బోర్డు సిలబస్‌లో ఏముంది.. ఏ బోర్డు సిలబస్‌లో చేరితే బెటర్?! నచ్చిన బోర్డుకు ప్రాధాన్యం ఇవ్వాలా... లేక మెచ్చిన స్కూల్ మంచిదా... సీబీఎస్‌ఈ సిలబస్‌కు ఎందుకంత క్రేజ్..! రాష్ట్ర సిలబస్‌తో లాభమేంటి? ఇలా తల్లిదండ్రులకు సవాలక్ష సందేహాలు..! ఆయా బోర్డుల సిలబస్ అంశాలేమిటి.. ఏ బోర్డుతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి.. సదరు బోర్డు సిలబస్‌ల సానుకూల, ప్రతికూల అంశాల గురించి తెలుసుకుంటే... పిల్లలను ఏ బోర్డులో చేర్పించాలనే దానిపై స్పష్టత వస్తుంది..

పాఠశాలల్లో అడ్మిషన్ల  ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతోంది. దాంతో తల్లిదండ్రుల్లో టెన్షన్ మొదలైంది. ఏదో ఒక స్కూల్‌కు, బోర్డు సిలబస్‌కు పరిమితం కాకుండా.. ఏ స్కూల్‌లో, ఏ బోర్డులో చేర్పిస్తే మంచిదో తల్లిదండ్రులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. తమకు తెలిసిన వారిని అడిగి తెలుసుకుంటున్నారు. ‘మా బాబును స్కూల్లో చేర్పించాలి.. ఎక్కడ చేర్పిస్తే మంచిది. సీబీఎస్‌ఈ బాగుంటుందా.. స్టేట్ బోర్డ్ మంచిదా.. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొంతమంది స్టేట్ బోర్డ్ బెటర్ అంటున్నారు.. మరికొంతమంది సీబీఎస్‌ఈ బెస్ట్ అంటున్నారు. ఇంకొంతమంది ఐజీసీఎస్‌ఈలో చేర్పిస్తే... భవిష్యత్‌లో విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్ తేలిగ్గా లభిస్తుంది అంటున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు’
- పిల్లల స్కూల్ అడ్మిషన్ల సందర్భంగా తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్న మాటలివి! ప్రస్తుతం పిల్లల భవిష్యత్తు గురించి స్కూల్ స్థాయి నుంచే తల్లిదండ్రులు ఆలోచిస్తున్న పరిస్థితుల్లో ‘బోర్డ్‌లు, సిలబస్’లకు ప్రాధాన్యం పెరిగింది. స్టేట్ బోర్డు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐజీసీఎస్‌ఈ, ఐబీ.. ఇలా రకరకాల బోర్డులు అందుబాటులో ఉండటంతో.. నిర్ణయం తీసుకోవడం తల్లిదండ్రులకు సవాలుగా మారింది. ఆయా బోర్డ్‌ల సిలబస్‌ను, బోధన విధానాల్ని పరిశీలిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందంటున్నారు నిపుణులు. బోర్డు ఏదైనా విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన అందించడం ముఖ్యమని పేర్కొంటున్నారు.

ఐజీసీఎస్‌ఈ :
ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్... ఐజీసీఎస్‌ఈ. స్కూల్ చదువుల నుంచే అంతర్జాతీయ స్థాయి సిలబస్‌పై అవగాహన పొందాలి, నైపుణ్యాలు సాధించాలనుకునే విద్యార్థులకు అనుకూలమైన విద్యా విధానంగా ఐజీసీఎస్‌ఈని పేర్కొనొచ్చు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఎగ్జామినేషన్ దీన్ని పర్యవేక్షిస్తోంది. కరిక్యులమ్ కూడా వినూత్నంగా ఉంటుంది. పూర్తిగా ప్రాక్టికల్ ఓరియెంటేషన్‌తో ఉండే ఈ సిలబస్‌ను అందించే పాఠశాల సంఖ్య మన దేశంలో చాలా తక్కువ. దేశం మొత్తంమీద ఈ పాఠశాలల సంఖ్య రెండు వందలలోపే. పదో తరగతి సిలబస్, మూల్యాంకన పరంగా చూస్తే.. మొత్తం 70 సబ్జెక్ట్‌లు ఉంటాయి. వీటిలోంచి విద్యార్థులు కనిష్టంగా 5, గరిష్టంగా 14 సబ్జెక్ట్‌లను ఎంచుకోవచ్చు. కోర్ కరిక్యులం అనే విధానం కూడా అమలవుతోంది. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్, సైన్స్‌లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్ట్‌లను కోర్ కరిక్యులంగా పేర్కొంటారు.
సానుకూలతలు..
  • భవిష్యత్తులో విదేశీ విద్య కోసం శాట్, ఏసీటీ వంటి పరీక్షలకు సంసిద్ధత లభించే అవకాశం.
  • ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకునే వీలు లభిస్తుంది.
ప్రతికూలతలు..
  • కోర్ సబ్జెక్ట్స్ కోణంలో మ్యాథమెటిక్స్, సైన్స్‌నే పేర్కొనడం.
  • ఫీజుల భారం అధికంగా ఉండటం.
  • పాఠశాలల సంఖ్య చాలా తక్కువ.
ఐబీ :
ఐబీ అంటే... ఇంటర్నేషనల్ బాక్యులరేట్! హైస్కూల్ స్థాయి నుంచే పూర్తిగా అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించే మరో విధానం.. ఇంటర్నేషనల్ బాక్యులరేట్. జెనీవా ప్రధాన కేంద్రంగా ఇంటర్నేషనల్ బాక్యులరేట్ ఆర్గనైజేషన్ అందిస్తున్న ఈ విధానాన్ని పలు దేశాలు అనుసరిస్తున్నాయి. మొత్తం మూడు స్థాయిల్లో ఐబీ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. అవి.. ఐబీ ప్రైమరీ ఇయర్స్ ప్రోగ్రామ్; ఐబీ మిడిల్ ఇయర్ ప్రోగ్రామ్; ఐబీ డిప్లొమా ప్రోగ్రామ్. వీటిలో హైస్కూల్ స్థాయి వారికి నిర్దేశించిన ప్రోగ్రామ్ ఐబీ మిడిల్ ఇయర్ ప్రోగ్రామ్ (11 నుంచి 16 సంవత్సరాల వయసున్న వారికి). ప్రాక్టికల్ అప్రోచ్, లెర్నింగ్ స్కిల్ వంటి ఇతర అంశాల్లోనూ నైపుణ్యం లభించే విధంగా మిడిల్ ఇయర్ ప్రోగ్రామ్ కరిక్యులంను రూపొందించారు. విద్యార్థులు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్; లాంగ్వేజ్ అక్విజిషన్; ఇండివిడ్యువల్స్ అండ్ సొసైటీ; సెన్సైస్; మ్యాథమెటిక్స్; ఆర్ట్స్; ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్; డిజైన్ సబ్జెక్ట్ గ్రూప్‌లను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ గ్రూప్‌లలో పేర్కొన్న సబ్జెక్ట్‌లలోంచి ఒక సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకునే అవకాశముంది. గరిష్టంగా ఆరు సబ్జెక్ట్‌లను ఎంచుకోవచ్చు. బోధన పరంగా పూర్తిగా ప్రాక్టికల్ దృక్పథంతో.. విద్యార్థుల్లోని క్రిటికల్ థింకింగ్ నాలెడ్జ్‌ను పెంపొందించేలా కరిక్యులంను రూపొందించారు. ఫలితంగా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో శాట్, ఏసీటీ వంటి పరీక్షల్లో రాణించే నైపుణ్యం లభిస్తుంది. మొత్తం అయిదేళ్ల మిడిల్ ఇయర్ ప్రోగ్రామ్ పూర్తి చేసుకుంటే.. మన దేశంలో పదో తరగతికి తత్సమాన అర్హతగా గుర్తింపు లభిస్తుంది.
సానుకూలతలు..
  • ఐజీసీఎస్‌ఈ మాదిరిగానే శాట్, ఏసీటీ వంటి పరీక్షలకు సంసిద్ధత.
  • ప్రాక్టికల్ నైపుణ్యాలకు పునాది.
  • క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలు.
ప్రతికూలతలు..
  • ఫీజులు అత్యంత భారం.
  • మన ఎంట్రన్స్ టెస్ట్‌ల సిలబస్‌లతో పోల్చితే అదనపు అంశాలు చదవాల్సి ఉంటుంది.
  • దేశంలో పదుల సంఖ్యలోనే పాఠశాలలు.
సీబీఎస్‌ఈ :
సీబీఎస్‌ఈ... సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఇంటరాక్టివ్ మెథడ్స్‌కు వేదికగా సీబీఎస్‌ఈ సిలబస్‌ను పేర్కొనొచ్చు. బోధన పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్‌కు ఆస్కారం ఎక్కువ. దాంతో భవిష్యత్తులో జేఈఈ, నీట్ వంటి పలు ఎంట్రన్స్ టెస్ట్‌లలో రాణించడానికి సీబీఎస్‌ఈ సిలబస్ దోహదపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జేఈఈ, నీట్ వంటి పరీక్షలకు సీబీఎస్‌ఈ సిలబస్‌నే పరిగణనలోకి తీసుకుంటుండటం గమనార్హం. సీబీఎస్‌ఈ సిలబస్‌లో చదివిన విద్యార్థులు సదరు పోటీ పరీక్షల్లో ముందంజలో నిలుస్తున్నారనే విషయం ఆయా పరీక్షల ఫలితాల ద్వారా అవగతమవుతోంది. అందుకే సీబీఎస్‌ఈ స్కూల్స్‌లో చేర్పించాలనే ఆసక్తి తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఇంటరాక్టివ్ టీచింగ్-లెర్నింగ్ మెథడ్స్ విషయంలో సీబీఎస్‌ఈ స్కూల్స్‌లోనూ మౌలిక సదుపాయాల కొరత సమస్యగా మారింది. కాబట్టి సీబీఎస్‌ఈ పాఠశాలను ఎంచుకునేటప్పుడు అక్కడి మౌలిక సదుపాయాలు,టీచర్ల విద్యార్హతలు, బోధన విధానాలు పరిగణనలోకి తీసుకోవాలన్నది నిపుణుల సలహా. సీబీఎస్‌ఈ బోర్డు విధానంలో పన్నెండో తరగతి వరకు బోధన ఉంటుంది. పదోతరగతి సిలబస్, మూల్యాంకన విధానాన్ని విశ్లేషిస్తే.. ఇంగ్లిష్(ఫస్ట్ లాంగ్వేజ్), సెకండ్ లాంగ్వేజ్(హిందీ), మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్.. ఇలా అయిదు సబ్జెక్ట్‌లలో బోధన, పరీక్షలు జరుగుతున్నాయి. ఇవే కాకుండా విద్యార్థులు తమ ఆసక్తి మేరకు అదనంగా ఆరో సబ్జెక్ట్‌గా మరో సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకునే అవకాశముంది. లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ లేదా కామర్స్, పెయింటింగ్, మ్యూజిక్, హోంసైన్స్, ఫౌండేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ తదితర సబ్జెక్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. విద్యా సంవత్సరం పూర్తయ్యాక ఇచ్చే గ్రేడ్‌లు మాత్రం అయిదు సబ్జెక్ట్‌లలో చూపిన ప్రతిభ ఆధారంగానే ఉంటాయి. విద్యార్థుల నైపుణ్యాన్ని అంచనావేసేందుకు ఫార్మేటివ్, సమ్మేటివ్ విధానంలో పరీక్షలు జరుగుతున్నాయి.
సానుకూలతలు..
  • జాతీయస్థాయిలో ఎంట్రన్స్ టెస్ట్‌లకు సంసిద్ధత.
  • యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌తో ప్రాక్టికల్ నైపుణ్యం.
  • భవిష్యత్తులో ఇతర పోటీ పరీక్షలకు కూడా బలమైన పునాది.
ప్రతికూలతలు..
  • సెన్సైస్‌కే ప్రాధాన్యం అనే అభిప్రాయం.
  • గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత.
  • పూర్తిగా జాతీయ ప్రాధాన్య అంశాలతో కరిక్యులం.
సీబీఎస్‌ఈ.. నో హోమ్‌వర్క్!
విద్యార్థులపై చదువుల భారం, ఒత్తిడి తగ్గించాలి... తరగతి గదిలో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌ను పెంచే ఉద్దేశంతో సీబీఎస్‌ఈ తాజాగా.. నో హోమ్ వర్క్ పేరుతో వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రైమరీ నుంచి పదో తరగతి వరకు విద్యార్థులపై హోమ్ వర్క్ ఒత్తిడిని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకు మార్గనిర్దేశాలు జారీ చేసింది. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ.. తరగతుల వారీగా ఏఏ సబ్జెక్టులకు హోమ్ వర్క్ ఇవ్వొచ్చో కూడా నిర్దేశించింది. విద్యార్థులపై బ్యాగుల భారం తగ్గించే విధంగానూ మార్గనిర్దేశాలు జారీ చేసింది. గరిష్టంగా అయిదు కిలోల బరువు మించకూడదని స్పష్టం చేసింది. ఇలా.. నో హోమ్ వర్క్ విధానం వల్ల విద్యార్థులు తరగతి గదిలోనే ఆయా సబ్జెక్ట్‌లను అధ్యయనం చేసే విధంగా టీచింగ్-లెర్నింగ్ విధానంలో మార్పులు కూడా జరగనున్నాయి.

తరగతుల వారీగా హోమ్‌వర్క్ ఇవ్వొచ్చని పేర్కొన్న సబ్జెక్ట్‌లు..

తరగతి

హోమ్ వర్క్ ఇవ్వగలిగే సబ్జెక్ట్‌లు

1, 2

లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్

3, 4, 5

మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సెన్సైస్ (ఈవీఎస్)


బ్యాగుల భారం తగ్గిందిలా...
ఎంహెచ్‌ఆర్‌డీ ఆదేశాల ప్రకారం- సీబీఎస్‌ఈ తరగతుల వారీగా పుస్తకాల బ్యాగు భారాన్ని కూడా తగ్గించింది. వివరాలు..

తరగతులు

బ్యాగు గరిష్ట భారం

1, 2

1.5 కిలోలు

3, 4, 5

2-3 కిలోలు

6, 7

4 కిలోలు

8, 9

4.5 కిలోలు

10

5 కిలోలు


ఎస్‌ఎస్‌సీ: స్టేట్ బోర్డ్
మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది స్టేట్ బోర్డ్ గురించే మొదట ఆలోచిస్తారు. స్టేట్ సిలబస్ విద్యార్థులు మ్యాథమెటిక్స్‌లో ముందుంటున్నారని.. ఫలితంగా జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ వంటి పరీక్షల్లో బాగా రాణిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పదో తరగతి (ఎస్‌ఎస్‌సీ) సిలబస్‌లో మార్పులు జరిగాయి. జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షల్లో రాణించేలా... సీబీఎస్‌ఈ సిలబస్‌కు సరితూగే విధంగా స్టేట్‌బోర్‌‌డ సిలబస్‌ను రూపొందించారు. నిరంతర మూల్యాంకన, సమ్మేటివ్, ఫార్మేటివ్ పేరుతో పరీక్షల నిర్వహణ ఫలితంగా స్టేట్ బోర్డులో కూడా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం పెరిగింది. సీసీఈ (కంటిన్యూస్, కాంప్రెహెన్సివ్ ఎవాల్యూషన్) విధానం అమలు పరంగా మౌలిక సదుపాయాల కొరత, మాధ్యమం వంటివి ప్రధాన ప్రతికూల అంశాలుగా పరిణమించాయి. స్టేట్‌బోర్డులో తెలుగు మీడియంతోపాటు ఇంగ్లిష్ మీడియంలోనూ బోధన అమలవుతోంది. ఇటీవల కాలంలో గ్రామాల్లో సైతం ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు ఏర్పాటుచేస్తున్నప్పటికీ.. విద్యార్థులకు బోధన పరంగా సరైన వనరులు అందుబాటులో ఉండట్లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తం ఆరు పేపర్లు సిలబస్‌గా ఉండే
ఎస్‌ఎస్‌సీ (పదోతరగతి)లో మూల్యాంకన పరంగా 20 శాతం మార్కులను ఇంటర్నల్ అసైన్‌మెంట్స్‌కు, 80 శాతం మార్కులను వార్షిక పరీక్షలకు నిర్దేశించారు. స్టేట్‌బోర్డ్ సిలబస్‌లో పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాక.. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ.. ఇలా వివిధ గ్రూప్‌ల్లో ఇంటర్మీడియెట్(ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం) చదువు ఉంటుంది.
సానుకూలతలు..
  • మాతృభాషలో చదవాలనుకునే వారికి అనుకూలం.
  • భవిష్యత్తులో ఇంటర్, డిగ్రీలను స్వరాష్ట్రంలోనే చదవాలనుకునే వారికి ఉపయుక్తం.
  • సిలబస్ పరంగా స్థానిక అంశాలకు ప్రాధాన్యం.
ప్రతికూలతలు..
  • సీసీఈ అమలు కోణంలో మౌలిక సదుపాయాల కొరత.
  • యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ సదుపాయాలు తక్కువ.
  • భవిష్యత్తులో జాతీయ స్థాయి పరీక్షల్లో రాణించాలంటే కష్టపడాలి.
ఐసీఎస్‌ఈ :
ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్.. ఐసీఎస్‌ఈ. కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ ఆధ్వర్యంలో ఐసీఎస్‌ఈ(ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్)ని నిర్వహిస్తున్నారు. ఇది కూడా పూర్తిగా ప్రాక్టికల్ ఓరియెంటేషన్‌తో బోధన విధానాలను అమలు చేస్తోంది. ఫలితంగా విద్యార్థులకు భవిష్యత్తులో అన్ని రంగాల్లోనూ రాణించే విధంగా అకడమిక్‌గా బలమైన పునాది పడుతుంది. సిలబస్, మూల్యాంకనలో వినూత్న విధానం అమలవుతోంది. బోధన ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. సిలబస్ అధికంగా ఉంటుందనే వాదన ఉంది. ల్యాబ్ వర్క్, ప్రాక్టికల్స్‌కు అధిక ప్రాధాన్యం లభిస్తోంది. మొత్తంగా ఐసీఎస్‌ఈ సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటే లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్, సైన్స్ వంటి కోర్ సబ్జెక్ట్‌లతోపాటు సోషల్ సెన్సైస్, హ్యుమానిటీ కోర్సెస్‌కు కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. పదో తరగతితో మొత్తం మూడు గ్రూపులుగా(గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3) సబ్జెక్ట్‌లను విభజించారు. మొత్తం మూడు గ్రూప్‌లు కలిపి కనిష్టంగా ఆరు, గరిష్టంగా ఏడు సబ్జెక్ట్‌లను ఎంచుకునే అవకాశముంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఐసీఎస్‌ఈ సిలబస్‌లో బోధన సాగిస్తున్న పాఠశాలలు గ్రూప్-2లో ఎంచుకో
వాల్సిన రెండు లేదా మూడు సబ్జెక్ట్‌ల కోణంలో మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్‌లనే బోధిస్తున్నారు.
అనుకూలతలు..
  • లాంగ్వేజెస్ నుంచి హ్యుమానిటీస్ వరకు అన్నిటా నైపుణ్యానికి అవకాశం.
  • అంతర్జాతీయ స్థాయి పరీక్షలకు పోటీ పడే విధంగా తొలి మెట్టు.
  • పదో తరగతి స్థాయిలోనే ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకునే అవకాశం.
ప్రతికూలతలు..
  • జాతీయ స్థాయి ఎంట్రన్స్‌లకు అదనంగా చదవాల్సిన పరిస్థితి.
  • పాఠశాలల సంఖ్య తక్కువగా ఉండటం.
  • ఆప్షనల్ సబ్జెక్ట్‌ల కోణంలో సైన్స్, మ్యాథమెటిక్స్‌నే బోధిస్తున్న పాఠశాలలు.
Published date : 13 Dec 2018 05:33PM

Photo Stories