Skip to main content

కుదింపు దిశగా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్

ఎన్‌సీఈఆర్‌టీ.. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్! జాతీయ స్థాయిలో.. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు..సీబీఎస్‌ఈ సిలబస్ రూపకల్పనలో ఎన్‌సీఈఆర్‌టీది కీలకపాత్ర. కరిక్యులం రూపకల్పన, బోధన విధానాల పరంగా.. ఎన్‌సీఈఆర్‌టీ ప్రమాణాల మేరకే సీబీఎస్‌ఈ నడుచుకుంటుంది.
ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ విద్యార్థులకు భారంగా ఉందని.. ముఖ్యంగా పది, పన్నెండు తరగతుల సిలబస్ అత్యంత కఠినంగా ఉందనే అభిప్రాయం చాలాకాలంగా ఉంది. దాంతో విద్యార్థులు పూర్తిగా పుస్తకాలకే పరిమితమవుతూ.. వ్యక్తిగత వికాసం, సామాజిక స్పృహకు దూరమవుతున్నారనే వాదన ఉంది. అందుకే కేంద్ర హెచ్‌ఆర్‌డీ శాఖ ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను తగ్గించడంపై కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో.. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌లో మార్పుల ప్రతిపాదనలపై విశ్లేషణ...

ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు అనుగుణంగా సీబీఎస్‌ఈ, రాష్ట్రాల బోర్డ్‌లు తమ సిలబస్‌ను రూపొందిస్తున్నాయి. ‘ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన సిలబస్ విస్తృతంగా ఉంది. ఆ సిలబస్‌ను పూర్తిచేసే క్రమంలో విద్యార్థులు పూర్తిగా పుస్తకాలకే పరిమితమవుతున్నారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి సైతం గురవుతున్నారు. ముఖ్యంగా వ్యక్తిత్వవికాసం, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కు దూరమై.. తదుపరి ఉన్నత విద్య కోర్సుల్లో విభిన్న నేపథ్యాల విద్యార్థులతో కలవలేక ఇబ్బందిపడుతున్నారు’ అన్నది నిపుణులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు! ఇలాంటి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న హెచ్‌ఆర్‌డీ శాఖ.. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది. హెచ్‌ఆర్‌డీ శాఖ జారీ చేసిన ఆదేశాలను పరిశీలిస్తే.. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ కుదింపు పరంగా ప్రస్తుత సిలబస్‌ను కనీసం 50శాతానికి తగ్గించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అన్నిటికీ రిఫరెన్స్.. ఎన్‌సీఈఆర్‌టీ :

వాస్తవానికి ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు ఉన్న ప్రామాణికతకు వేరే సిలబస్ సాటి రాదనే చెప్పొచ్చు. అందుకే సీబీఎస్‌ఈ, ఇతర బోర్డ్‌ల విద్యార్థులే కాకుండా.. సివిల్స్, ఎస్‌ఎస్‌సీ, ఐఈఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి అత్యున్నత పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కూడా తమ ప్రిపరేషన్‌ను ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలతోనే ప్రారంభిస్తారు. దీన్నిబట్టే.. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ ఎంత లోతుగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

అకడమిక్‌గా భారం :
విస్తృత స్థాయిలో, లోతైన అంశాలతో ఉన్న ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్.. అకడమిక్‌గా స్కూల్ విద్యార్థులపై భారంగా పరిణమిస్తోంది. ముఖ్యంగా పది, పన్నెండు తరగతుల స్థాయిలో సిలబస్‌ను ఆకళింపు చేసుకోవడానికి విద్యార్థులు పూర్తి సమయం పుస్తకాలకే కేటాయించాల్సి వస్తోంది. దాంతో వ్యక్తిత్వ వికాసం, సామాజిక అంశాల పట్ల అవగాహన, స్వీయ ఆలోచన సామర్థ్యం, మానసిక ఉల్లాసం వంటివి పెంపొందించుకునేందుకు సమయం ఉండటంలేదు. ఇది భవిష్యత్తులో ప్రతికూలంగా మారుతోంది. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌తో బోర్డ్ పరీక్షల్లో రాణించి.. ఆ తర్వాత జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ వంటి పరీక్షల ద్వారా ఐఐటీల్లో అడుగుపెట్టిన విద్యార్థులు.. అక్కడి భిన్న కొత్త వాతావరణంలో ఇమడలేక ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి సందర్భాల్లోనే విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, సామాజిక సృ్పహ ఎంతగానో తోడ్పడుతుంది.

సైన్స్ సబ్జెక్ట్‌లు భారంగా..
ప్రస్తుతం ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు అనుగుణంగా అమలవుతున్న సీబీఎస్‌ఈ కరిక్యులంను పరిగణనలోకి తీసుకుంటే.. సైన్స్ సబ్జెక్ట్‌లు భారంగా ఉన్నట్లు విద్యార్థులు భావిస్తున్నారు. దీంతో వీటిలో ఎలాగైనా రాణించాలని పుస్తకాలకే పరిమితమవుతున్నారు. ఫలితంగానే జాతీయ స్థాయిలో నిర్వహించే పలు ఎంట్రన్స్ టెస్ట్‌లలో సైన్స్ సబ్జెక్ట్‌ల పరంగా సీబీఎస్‌ఈ విద్యార్థులు ముందుంటున్నారనే వాదన ఉంది. తాజా ప్రతిపాదన ప్రకారం-అన్ని సబ్జెక్ట్‌ల మధ్య సమతుల్యత పాటించే అవకాశముందని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆల్‌రౌండ్ డెవలప్‌మెంట్ :
ప్రస్తుతం 8ఏళ్ల నుంచి 13ఏళ్ల విద్యార్థులు స్కూల్ బ్యాగు 5నుంచి 10 కిలోల మేర బరువు ఉంటోంది. ప్రతిరోజూ డజన్‌కు పైగా పాఠ్యపుస్తకాలను, నోట్‌పుస్తకాలను విద్యార్థులకు పాఠశాలకు మోసుకెళ్లాల్సిన పరిస్థితి. అందుకే ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను యాభై శాతానికి కుదించి విద్యార్థులపై పుస్తకాల భారం, బ్యాగుల మోత తగ్గించాలని హెచ్‌ఆర్‌డీ శాఖ భావిస్తోంది. అంతేకాకుండా కొత్త సిలబస్‌లో విద్యార్థుల ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్‌కు అవకాశం కల్పించే అంశాలు ఉండేలా చూడాలని భావిస్తోంది. సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి స్థాయిలో ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ కీలకం. అదేసమయంలో విద్యార్థులు వ్యక్తిగతంగా పదిహేడేళ్ల వయసులో ఉంటారు. వాస్తవానికి ఈ వయసులోనే విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, ఆలోచన సామర్థ్యాలు వికసించాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని సిలబస్ కుదింపుతోపాటు విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసానికి దోహదంచేసే స్పోర్ట్స్, యోగా, మెడిటేషన్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వంటివి కరిక్యులంలో పొందుపరిచేలా చూడాలని ఎన్‌సీఈఆర్‌టీకి హెచ్‌ఆర్‌డీ శాఖ ఆదేశించింది.

2019 నుంచి అమల్లోకి?
ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ తగ్గించడం, కొత్త పాఠ్యపుస్తకాల రూపకల్పన త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్‌సీఈఆర్‌టీ కొత్త సిలబస్‌ను 2019-20 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి నిపుణుల బృందాలను కమిటీలుగా నియమించి.. సిలబస్ కుదింపు ప్రక్రియ పరంగా వేగంగా చర్యలు తీసుకోవాలని ఎన్‌సీఈఆర్‌టీకి సూచించింది. ఒకవేళ 2019 విద్యా సంవత్సరానికి సాధ్యం కాకపోతే.. 2020-21 విద్యా సంవత్సరంలో మాత్రం ఎన్‌సీఈఆర్‌టీ కొత్త సిలబస్ అమల్లోకి రావడం ఖాయమని చెబుతున్నారు.

అభిప్రాయ సేకరణ :
ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను కుదించే క్రమంలో నిపుణులు, విద్యావేత్తలు, స్వచ్ఛందసంస్థల నుంచి అభిప్రాయ సేకరణకు హెచ్‌ఆర్‌డీ శాఖ శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి సలహాలు, సూచనలు అందించాలని.. హెచ్‌ఆర్‌డీ, ఎన్‌సీఈఆర్‌టీ వెబ్‌సైట్లలో ప్రకటన సైతం ఇచ్చింది. ఏప్రిల్ 6వ తేదీ వరకూ తమ సూచనలు,సలహాలు అందించాలని పేర్కొంది. ఇలా.. రెండు నెలలపాటు అభిప్రాయాలు స్వీకరించనుంది. ఆ తర్వాత ఆయా అభిప్రాయాలను సంబంధిత సబ్జెక్ట్‌లు-వాటి నిపుణుల బృందాలు పరిశీలించి.. వాస్తవ పరిస్థితులు -సలహాలను బేరీజు వేసి సిలబస్ కుదింపు పరంగా కసరత్తు ప్రారంభించనున్నారు.

రాష్ట్రాల బోర్డ్‌లపైనా ప్రభావం :
ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను కుదించడం కార్యరూపం దాల్చితే.. అది రాష్ట్రాల స్థాయిలోని బోర్డ్‌ల సిలబస్‌పైనా ప్రభావం చూపనుంది. ప్రస్తుతం ఏడు రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల బోర్డ్‌లు జాతీయస్థాయి పరీక్షలు, వాటికి ప్రామాణికంగా నిలుస్తున్న సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుగుణంగా మార్పులు చేశాయి. హెచ్‌ఆర్‌డీ శాఖ తాజా నిర్ణయంతో ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ కుదిస్తే.. దానికి అనుగుణంగా మళ్లీ రాష్ట్రాల బోర్డ్‌లు సిలబస్‌లో మార్పుల దిశగా అడుగులు వేయాల్సి ఉంటుంది.

విద్యార్థులకు ఉపశమనం..
హెచ్‌ఆర్‌డీ తాజా నిర్ణయం లక్షల మంది విద్యార్థులకు ఉపశమనం కలిగిస్తుందని చెప్పొచ్చు. హెచ్‌ఆర్‌డీ ఆలోచనకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేస్తే విద్యార్థుల్లో కచ్చితంగా ఆల్‌రౌండ్ డెవలప్‌మెంట్ కనిపిస్తుంది. వన్ నేషన్, వన్ ఎగ్జామ్ కోణంలో.. అన్ని కోర్సులకు ఒకే పరీక్ష నిర్వహించాలనే ఆలోచనల నేపథ్యంలో అన్ని ప్రాంతాలు, బోర్డ్‌ల మధ్య సమతుల్యత పాటించినట్లు అవుతుంది. - ప్రొఫెసర్.పి.సందీప్, మెంబర్, ఎన్‌సీఎఫ్
Published date : 13 Mar 2018 01:36PM

Photo Stories